గుర్తుండిపోయే యాత్ర

నిజామాబాద్ లో పుట్టి పెరిగి, కాకినాడలో మెడిసిన్ పూర్తి చేసి, మూడు దశాబ్దాల క్రితం యూకే లో స్థిరపడిన డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరికి యాత్రలు చేయడం జీవితంలో ఒక విడదీయరాని భాగం. గడిచిన పాతికేళ్లలో సగటున ఏడాదికి ఐదు దేశాల చొప్పున చుట్టి వచ్చిన ఆయన ట్రావెల్ రికార్డే ఇందుకు సాక్ష్యం. సాధారణంగా, ఈ తరహా యాత్రికులు ఒకసారి చూసిన దేశాన్ని మరోమారు చూడడాన్ని ఇష్టపడరు. ఆ సమయాన్ని, వనరుల్ని మరో కొత్త దేశం చూసేందుకు వినియోగించవచ్చు అన్నది వీరి ఆలోచనగా ఉంటుంది. మినహాయింపులు అత్యంత అరుదు. డాక్టర్ శేషగిరికి సంబంధించినంత వరకు ఈ విషయంలో మినహాయింపు పొందిన దేశం మొరాకో. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సార్లు ఆ చిన్న దేశాన్ని ఆమూలాగ్రం చుట్టి వచ్చారు. మొత్తం కలిపి ముప్ఫయి రోజులకి పైగా గడిపి వచ్చారు. ఆ యాత్రానుభవాలకి అక్షర రూపమే ‘ఊహలకందని మొరాకో’.

మిగిలిన ప్రపంచం దృష్టిలో ఆఫ్రికా అంటే ఒక చీకటి ఖండం. అభివృద్ధికి ఆమడ దూరంలో, నిత్యం కరువులతో కునారిల్లుతూ ఉండే ఖండం. ఆ ఖండానికి ఓ చివర, రెండు సముద్రాలూ ఓ ఎడారీ సరిహద్దులుగా ఉన్న దేశం మొరాకో. ఇస్లాం అధికారిక మతం కావడంతో అరబ్ దేశాలని పోలిన సంస్కృతి కలిగిన దేశం. రాచరిక వ్యవస్థ, పార్లమెంటు కలిసి ప్రజల్ని పాలిస్తాయి, బ్రిటన్ లో లాగా. ఇతర మతస్థుల్ని మసీదుల్లో ప్రవేశించనివ్వక పోవడం లాంటి మతపరమైన కఠిన నియమాలు పాటిస్తున్నప్పటికీ, యాత్రికుల పట్ల, అందునా విదేశీ యాత్రికుల పట్ల సానుకూల దృక్పథం ఉన్న దేశం మొరాకో. అతి ప్రాచీన నిర్మాణాలని చూసేందుకు, అత్యాధునిక ట్రైన్లలో ప్రయాణం చేసి వెళ్లే అవకాశం ఉన్న దేశమది.

‘కారు అద్దంలో నుంచి ప్రదేశాలని మాత్రమే చూడగలం, ప్రపంచాన్ని చూడాలంటే కాలినడతో మాత్రం సాధ్యం’ అంటారు యాత్రా ప్రేమికులు. డాక్టర్ శేషగిరి మొరాకోలో చేసిన మూడు యాత్రల్లోనూ మొదటి రెండింటిలో ప్రదేశాలని మాత్రమే చూడగలిగారు. ఎందుకంటే అవి కుటుంబంతో కలిసి చేసిన యాత్రలు. మొత్తం పన్నెండు అధ్యాయాల ‘ఊహలకందని మొరాకో’ పుస్తకంలో ఈ రెండు యాత్రల కోసం కేటాయించినవి కేవలం మూడే అధ్యాయాలు! అయితే, ఒక సుదీర్ఘ యాత్ర చేయాలని సంకల్పించుకోడానికి దోహదం చేసినవి మాత్రం ఈ మొదటి రెండు యాత్రలే. ప్రతి కదలికనీ ముందుగానే నిర్ణయించుకుని, ఎక్కడా ఎలాంటి అసౌకర్యానికీ తావు లేని విధంగా ఏర్పాట్లు చేసుకుని జరిపిన ఈ రెండు యాత్రల్లోనూ మొరాకోని కారు అద్దాలనుంచి మాత్రమే చూడగలిగారు. అయితేనేం, మొరాకో ఈ యాత్రికుడిని తనతో ప్రేమలో పడేలా చేసుకుంది.

తొలి రెండు యాత్రల్లో అగాదీర్, స్వీరా, టెరూడెంట్, ఆట్లస్ పర్వత శ్రేణి, ఇమ్లిల్, బెన్ హద్దూ, మరాకేష్ లని సౌకర్యవంతంగా చూసిన శేషగిరి, మూడో యాత్రకి ఎజెండాలో ట్రెక్కింగ్, సహారా నడక, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా స్థానిక బస్సులు, రైళ్లలో మొరాకోని చుట్టి రావడాన్ని చేర్చుకున్నారు. ఉత్తరాఫ్రికా అంతటికీ ఎత్తైన మౌంట్ తుబ్ కల్ ని అధిరోహించడం వీటిలో మొదటిది. ఇది బృంద కార్యక్రమం. విదేశాల నుంచి వచ్చిన మిత్రులతో కలిసి, గైడ్ బృందం సారధ్యంలో చేసిన ఈ పర్వతారోహణని కళ్ళకి కట్టినట్టుగా వర్ణించారు శేషగిరి. అల్లసాని వారు వర్ణించిన జవరాలి చిత్తంలా ( క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్ ) క్షణక్షణానికీ మారిపోయే వాతావరణం – ఉన్నట్టుండి ఎండ, అంతలోనే మంచు, మరికాసేపట్లో తుపాను – ఏమంత అనువుగా అనిపించని మార్గం, అరకొర సౌకర్యాల మధ్య సాగిన యాత్ర అది.

ట్రెక్కింగ్ అనంతరం చేసిన సహారా యాత్ర కూడా బృంద కార్యక్రమమే. ఎడారిలో నడక ఊహించుకున్నంత సరసంగా అస్సలు ఉండదని చెబుతుంది ‘సహారా సైతక సీమలో’ అధ్యాయం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడూ కళ్ళలోనూ, ఎపుడూ బూట్లలోనూ పడే ఇసుక, అరకొర సౌకర్యాలు, ఎప్పుడెలా మారుతుందో తెలియని ప్రకృతి.. వీటి మధ్య యాత్ర చేసి, ఆనందాన్ని పొందేవాళ్ళు కదా నిజమైన యాత్రా ప్రేమికులు. సహారా యాత్ర తర్వాతే డాక్టర్ శేషగిరి లోని యాత్రికుడు పూర్తిస్థాయిలో రెక్క విప్పుకున్నాడు. ఒక చిన్న బ్యాక్ ప్యాక్, స్వస్థలానికి రిటర్న్ టికెట్ మినహా ఇతరత్రా ఎలాంటి బ్యాగేజీ లేకుండా, కేవలం రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలని మాత్రమే ఉపయోగించుకుని మొరాకోని చుట్టి వచ్చారు. మొరాకో సాంస్కృతిక రాజధాని ఫెజ్, మౌలె ఇద్రిస్, మెక్నెస్, షెఫ్ సాన్,  టెటువాన్, టాంజీర్, కాసాబ్లాంకా మీదుగా మరాకేష్ కి తిరిగి వచ్చి విమానం ఎక్కారు. ఈ మొత్తం ‘అన్ ప్లాన్డ్ ట్రిప్’ లో ముందుగా అనుకున్న స్థలాలని తగ్గించకపోగా, కొత్త వాటిని తన జాబితాలో చేర్చుకుని పూర్తి చేశారు.

వసతి అద్దెకి ఇచ్చిన వారి మొదలు, క్యాబ్ డ్రైవర్లు, టూరిస్టు గైడ్లు, సహ ప్రయాణికులు.. ఇలా అందరితోనూ మాట కలిపి, స్నేహం చేయడం, మతం, రాజకీయం లాంటి సున్నితమైన విషయాల జోలికి వెళ్లకుండా ఇతరత్రా విషయాలపై చర్చలు చేయడం శేషగిరి అభిరుచులు. ఈ అభిరుచులు ఆయన యాత్రకు మెరుగులు దిద్దాయి. చూడాల్సిన ప్రదేశాల జాబితాకు సవరింపులు చేశాయి. రుచికరమైన భోజన పదార్ధాలని పరిచయం చేశాయి. చూసిన అందమైన ప్రదేశాల చరిత్రల వెనుక ఉన్న చీకటి కోణాలని విప్పి చూపాయి. పర్వతారోహణ సమయంలో గైడుగా వ్యవహరించిన వ్యక్తి, యాత్ర చివరి రోజున శేషగిరి విమానం ఎక్కబోతుంటే, తన పనులన్నీ మానుకుని వచ్చి ‘సెండాఫ్’ ఇవ్వడం ఒక్కటి చాలు, ఈ యాత్రికుడు నిర్వహించే స్నేహ సంబంధాలు ఎంతటి గాఢతతో ఉంటాయో చెప్పడానికి.

యాత్రల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉన్నవారికైనా పరిచయముండే పేరు ఇబ్న్ బటూటా. ప్రపంచాన్ని చుట్టిన తొలి యాత్రికుడిగా, మార్కోపోలోను మించి ప్రయాణాలు చేసిన వాడిగా పేరు పొందిన ఇబ్న్ బటూటా స్వస్థలం టాంజీర్. ఆయన సమాధి కూడా అక్కడే ఉంది. ఆ సమాధిని దర్శించిన క్షణంలో డాక్టర్ శేషగిరి పొందిన భావోద్వేగం వర్ణనాతీరం. “ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉంది. కాస్త పక్కనే ఓ పెద్దావిడ నేలమీద కూర్చుని ఉంది” అంటూ పాఠకులని కూడా అక్కడికి తీసుకువెళ్లారు. ఆ అపురూప క్షణాలని తన మిత్రుడు ప్రముఖ పాద యాత్రికుడు డాక్టర్ ఆదినారాయణ (‘భ్రమణ కాంక్ష’, ‘భూ భ్రమణ కాంక్ష’, ‘తెలుగు వారి ప్రయాణాలు’ తదితర పుస్తకాల రచయిత, సంపాదకుడు) తో పంచుకోవాలి అనిపించింది. ఫోను కలిపి తన ఉద్వేగాన్ని పంచుకోవడం మొదలు పెట్టారు. “ఫోను సంభాషణ సమయంలో నేను చూపించిన ఉత్సాహం, పొందిన ఉత్తేజం చూసి ఆ పెద్దావిడ విస్తుపోయింది..” అంటూ మొదలు పెట్టి రాసిన వాక్యాలు, తమకి దగ్గరలో ఉన్న యాత్రా స్థలాలని గురించి పాఠకులు ఒక్కసారి ఆలోచించుకునేలా చేస్తాయి.

యాత్రికుడు పఠనాసక్తి ఉన్నవాడైతే, అతనికి ప్రపంచం మరి కాస్త కొత్తగా కనిపిస్తుందని కొందరు యాత్రికులు ఇప్పటికే రుజువు చేశారు. డాక్టర్ శేషగిరి కూడా చక్కని పాఠకుడే. అంతకు మించి క్లాసిక్ సినిమాలకి అభిమాని. అరడజను చొప్పున పుస్తకాలూ, సినిమాలూ రిఫర్ చేశారు ఈ యాత్రా కథనాల్లో. అన్నట్టు ఇది అచ్చతెలుగు పుస్తకం కాదు, అనువాదం. జన్మతః తెలుగు వారే అయినా, ఎక్కువ జీవితం యూకేలో గడపడం, ఒక వైద్య సంస్థ డైరెక్టర్ గా అనుదిన వ్యవహారాలు అన్నింటికీ ఇంగ్లిష్ నే వాడుతూ ఉండడం వల్ల, మొరాకో యాత్రా కథనాల్ని కూడా ఆంగ్లంలోనే రాశారు. స్వతహాగా యాత్రికుడు, రచయితా అయిన దాసరి అమరేంద్ర తెనిగించారు. ఈ అనువాదం దాదాపు సహజంగా, అత్యంత సరళంగా సాగింది. రాతివేటు దూరం (స్టోన్ పెల్టింగ్ డిస్టెన్స్), చెంప పిన్ను మలుపు (హెయిర్ పిన్ బెండ్), థ్రిల్లింత (థ్రిల్) లాంటి పద ప్రయోగాలు చేశారు. ఈ అనువాదం చేసే క్రమంలో అమరేంద్ర లోని రచయితపై, యాత్రికుడిది పైచేయి అయిందనిపించింది. చదివిన ప్రతి ఒక్కరిలోనూ మొరాకో వెళ్లి రావాలనే కోరిక కలిగించే పుస్తకమిది.

పుస్తకం పేరు: ఊహలకందని మొరాకో

ఆంగ్ల మూలం: డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరి

అనువాదం: దాసరి అమరేంద్ర

ప్రచురణ: ఆలంబన ప్రచురణలు, హైదరాబాద్

పేజీలు: 226, వెల: రూ. 200, $20, £15.

 

కె.ఎన్. మురళీ శంకర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు