ఏడు తోకల ఎలుక

పిల్లల కోసం కథలు వ్రాసేవారు, కవితలు అల్లేవారు ప్రతి దాన్ని వొకటి కంటే ఎక్కువ పొరల్లో కూర్చుతున్నారు కదా అనిపించింది.

అందరిలానే నేను కూడా చిన్నప్పుడు నర్సరీ రైంస్ నేర్చుకున్నాను. అయితే ఇంగ్లీషుతో పాటు గుజరాతీ లో కూడా నేర్చుకున్నాను. వాటిలో ఒకదాని గురించి మా అక్కతో సంభాషిస్తే ఇదేదో వ్రాయాల్సిన విషయం లాగానే వుందనిపించి గుర్తుపెట్టుకున్నాను.

ఏమీ అర్థం కాని రోజుల్లో ట్వింకల్ ట్వింకల్ లిటల్ స్టార్ అభినయం చేస్తూ మరీ పాడాను. (ఇప్పుడింత సీరియస్ మొహం పెట్టుకుని వుండే నేను చిన్నప్పుడు వో గుజరాతీ డాన్స్ డ్రామా కూడా చేశానంటే ఎవరూ నమ్మరు.) సరే అది ఈ మధ్య విన్నప్పుడు Like a diamond in the sky దగ్గర బలే వ్రాశింది కదా అనుకున్నాను. అయితే ఈ అందాన్ని చూడటానికి పరిపక్వత వచ్చిన చూపు కావాలి. చిన్న పిల్లలకు చాలా పదాలు పరిచయం చెయ్యడానికి ఎన్నుకున్న వొక మార్గం రైంస్ అనబడే పద్యాలు. ఏదన్నా సంగీతబద్ధంగా వుంటే పిల్లలకు త్వరగా ఆకర్షిస్తుంది. అలాగే గుర్తుండిపోతుంది. ఏకకాలంలో పదాలు, వాటి ఉచ్చారణ, వీలైనంతవరకు ఆ పదాల అర్థాలూ తెలుస్తాయి వారికి. అయితే పిల్లల కోసమే వ్రాసినప్పటికీ ఆయా కవులు ఎంత అందంగా వ్రాశారంటే ఆ పిల్లలే పెద్దయ్యాక అవి చిదివితే వో కొత్త వెలుగులో చూసి కొత్తగా ఆనందిస్తారు. ఇలాంటివే లండన్ బ్రిజ్ ఇస్ ఫాలింగ్ డౌన్, బా బా బ్లాక్ షీప్ వగైరా. వన్ టూ బకల్ మై షూ (ఇది గుజరాతీలో ఏకడే ఏక అని వున్నది) అన్నది అంకెలను పరిచయం చేస్తుంది.

తెలుగులో రైంస్ నేను చదవుకోలేదు గాని పిల్లల నోటెంట విన్నాను. చిట్టి చిలకమ్మ, చుక్ చుక్ రైలు, ఒప్పులకుప్ప వయ్యారి భామ, చేతి వెన్న ముద్ద వగైరా. ఇవి బాలుడిగా విన్నవి, పిల్లలు ఆడుకుంటుంటే చూసినవీ. కాని ఇప్పుడు మళ్ళీ చదవలేదు, వినలేదు. వీటి గురించి నేను యెక్కువ వ్రాయనవసరం లేదు, ఎందుకంటే అందరికీ ముంజేతి కంకణం చూపడం ఎందుకు?

గుజరాతీలో కొన్ని రైంస్ నేర్చుకున్నాము అప్పుడు. మా బడిలో మూడు నాలుగేళ్ళు వొక సబ్జెక్ట్ గుజరాతీ వుండేది, నాలాంటి వారికోసం. వ్రాయడం నేర్చుకోవడానికి ముందు పలకడం కదా నేర్చుకునేది. అలా మా జీవితాల్లో ప్రవేశించాయి రైంస్. వాటిలో కొన్నిటిని స్పర్శిస్తాను ఈ వేళ.

వొక రైం ఏనుగు గురించి. ఏనుగును వర్ణిస్తూ తోక, తొండెము, పొట్టి, పొడుగు, లావు వగైరా పదాలను పరైచయం చేస్తుంది. అభినయంతో పాటు నేర్పిస్తారు కాబట్టి.

యేనుగన్న మాలావు

ఆకారం దున్నపోతు

ముందు పెద్ద తొండెము వేలాడు

వెనుక పొట్టి తోక వేలాడు

ఏనుగు దున్నపోతు కంటే ఆకారంలో పెద్దది కదా. కానీ భారీకాయులని ఇక్కడ పోల్చినట్టే అక్కడా దున్నపోతు తోనే పోలుస్తారు. కాబట్టి ఆ phrase కూడా పరిచయం అవుతుంది.

తాతయ్య మువ్వల చేతికర్రను తీసుకున్నాను

దాన్నే నా గుర్రం అనుకున్నాను

నన్ను ఎక్కించుకుని ఆ గుర్రం జోరున పోతూ వుంది

నేలంతా కంపిస్తూ వుంది

ప్రతి మువ్వా ఘల్లుఘల్లు మంటుంది

డెక్కల చప్పుడు చేస్తూ నా గుర్రం పరుగెడుతుంది

వేగంగా దౌడు తీస్తూ మేము

దారిలో కోట గోడ వచ్చిందేమో అడ్డము

ఆ గోడను దాటి నా గుర్రం తీసింది దౌడు….

ఇది వొక పిల్లవాడు తాతయ్య చేతికర్ర తీసుకుని దాన్ని కాళ్ళ మధ్య పెట్టుకుని, దాన్నే గుర్రంగా ఊహిస్తూ ఆడుకుంటాడు. గుమ్మమో, మరొకటో అడ్డం వస్తే దాన్నే కోటగోడగా ఊహించి లంఘించి తీస్తాడు దౌడు. ఇలా పిల్లల కల్పనా శక్తి కూడా పదునెక్కుతుంది.

నా ఇంట వో పిల్లి పిల్ల వచ్చింది

రంగూ రూపుల్లో అది మోహనంగా ఉంటుంది

నెమ్మదిగా అడుగులేస్తూ నడుస్తుంది

చీకట్లో సైతం చూస్తుంది

పాలు తాగుతుంది, పెరుగు తింటుంది

నెయ్యైతే చప చపా నాకేస్తుంది

దాని వొంటిమీద వో చార వుంది

ఇప్పుడు మా ఇంటి పెద్దపులినే అది.

ఇందులో పిల్లి లక్షణాలు, నేర్పు, తిండి అలవాట్లు అవీ పరిచయం అవుతాయి. పాలు, పెరుగు, నెయ్యి ల దగ్గర బాణీ మారి నాటకీయంగా వుంటుంది. ఆ చివరి వాక్యం చూడండి బాల్య కవిత కంటే ప్రౌఢ పద్యంలో పోలికలా లేదూ.

ఇప్పుడు వొక కథాత్మక పాట. అంటే కొంత గద్యం కథలా చెప్పాలి. మధ్య మధ్యలో పాటలాగా పిల్లలు పాడుతారు.

ఒక ఎలుకకు చిట్టెలుక పుడుతుంది. అయితే దానికి అందరిలా కాకుండా ఏడు తోకలుంటాయి. ఆ ఎలుక తన బిడ్డను చాలా జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తుంది. పెద్దయ్యాక ఇక దాన్ని వో మంచి బడిలో వేస్తుంది. ముస్తాబై ఎలుక బడికెళ్తే పిల్లలు చూసి పగలబడి నవ్వుతారు.

ఎలుక ఏడు తోకల ఎలుకరో

ఎలుక ఏడు తోకల ఎలుకరో

అని దాన్ని ఆట పట్టిస్తారు. ఏడ్చుకుంటూ ఆ ఎలుక ఇంటికెళ్తుంది. బిడ్డను ఏడుస్తూ చూసి ఏమైందని అడుగుతుంది తల్లి. ఎలుక తనకు జరిగిన అవమానం చెబుతుంది. అలా కాదు నాన్నా నీకు అందరిలా వొక్క తోక కాకుండా ఏడు తోకలున్నాయి. అలాంటి ఎలుకవి నువ్వు మాత్రమే. వాళ్ళ మాటలు పట్టించుకుంటారా ఎక్కడైనా, అంటుంది. కాని ఎలుక ఏడుపు మానదు. సరే ఏం చెయ్యాలో చెప్పు అంటుంది తల్లి. నాకేం తెలీదు, రేపు నేను బడికెళ్తే ఏడు తోకల ఎలుక అని వెక్కిరించకుండా ఏదైనా చెయ్యి అంటుంది ఎలుక. తల్లి ఎలుకను మంగలి షాపుకు తీసుకెళ్ళి వో తోక కత్తిరించమంటుంది.

మర్నాడు కూడా అదే కథ. ఈ సారి ఆ పిల్లల పాటలో ఏడు పోయి ఆరు వచ్చి చేరుతుంది అంతే. మిగతాదంతా సేం టు సేం. అలా ఏడు తోకలూ కత్తిరించబడతాయి.

చివరికి ఏ తోకా లేని ఆ ఎలుక బడికి వెళ్తుంది, ఇప్పుడిక నన్ను ఎవరూ వెక్కిరించడానికి ఆస్కారమే లేదనుకుంటూ. అయినా పిల్లలు నవ్వుతూ పాడతారు

ఎలుక తోక లేని ఎలుకరో

ఎలుక తోక లేని ఎలుకరో

ఎలుక మళ్ళీ ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వెళ్తుంది. నువ్వేమైనా చెయ్యి నా తోక నాకు కావాలి. ఇప్పుడందరూ నన్ను తోక లేని బోడి అంటున్నారు. తల్లికి ఏమీ పాలు పోలేదు. కాసేపాగి అంటుంది, ఏదీ నిన్న నేను కోసిన నీ తోక ఆ మూలన వుండాలి పోయి తీసుకురా. ఎలుక దాన్ని తీసుకువస్తే, తల్లి దాన్ని తిరిగి ఎలుకకు కుట్టేస్తుంది. ఇక నువ్వు రేపట్నుంచి బడికి వెళ్ళు. ఎవరు ఏమన్నా లక్ష్య పెట్టకు. నీ చదువు మీద మాత్రమే శ్రధ్ధ పెట్టు. అర్థమైందా?!

మర్నాడు ఎలుక బడికి వెళ్తుంది. పిల్లలు మళ్ళీ అల్లరి చేస్తారు. కానీ ఈ సారి ఎలుక స్పందించదు. తన పనేదో చూసుకుంటుంది అంతే. కొన్నాళ్ళు అలా ఏడిపించి ఏడిపించి, ఎలాంటి స్పందనా లేకపోవడంతో విసుగొచ్చి వాళ్ళే ఏడిపించడం మానేస్తారు. ఎలుక మాత్రం చదువు మీదే శ్రధ్ధ పెట్టడం మూలాన క్లాస్ ఫస్ట్ వస్తుంది. ఇదండీ ఏడు తోకల ఎలుక కథ.

(పాటలో ఏడు, ఆరు, అయిదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి, బోడి అని అన్నిసార్లూ ఆ పాటలాంటి వెక్కిరింత వుంటుంది. నేను దాటేశాను.)

ఈ చివరి రైం గురించే మా అక్కతో మాట్లాడాను. వో రోజు కూచుని బాల్యం, చదువు గురించి నెమరువేతలో ఇది గుర్తుకొస్తే అన్నాను, ఈ రైం లో లోతైన అర్థం వుంది కదా అని. అంతా విని, నిజమే కాని ఈ రైం ను కూర్చింది అందుకు కాదు. ఆ వయసులో అవన్నీ పిల్లలకి అర్థం కావు. వాళ్ళకు అంకెలు నేర్పడానికి గమ్మత్తైన కథ అల్లారు అంది. నిజమే కావొచ్చు. కాని పిల్లల కోసం కథలు వ్రాసేవారు, కవితలు అల్లేవారు ప్రతి దాన్ని వొకటి కంటే ఎక్కువ పొరల్లో కూర్చుతున్నారు కదా అనిపించింది.

ఏవో నాకు తోచిన నాలుగు మాటలు పంచుకోవాలని వ్రాశాను. కవితల అనువాదం కన్నా ఈ రైంస్ అనువాదమే నాకు సవాల్ గా నిరూపణ అయ్యింది. మీకు కూడా అర్థం అవుతుంది. ఏదైనా తెలుగు రైం ని ఇంగ్లీషులోకి అనువాదం ప్రయత్నించండి. ప్రస్తుతం ఆ రైంస్ లోని నడక గురించి కాకుండా రైంస్ వ్రాయడం వెనక కవుల దృష్టిని చూడండి.

ఇలాగే తెలుగు లో కూడా వుంటాయి. మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుని మీ అనుభవాలు పంచుకోండేం.

*

 

 

పరేశ్ దోశి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • English rhymes,తెలుగులోకి,అలాగేతెలుగులోవి, ఇంగ్లీష్ లోకి.,మేముసరదా గా రాసి, పిల్లలు తో,చేపించేవలం.. class రూమ్ లో.మీరు రాసిన ఏడు తోకలు ఎలుక కథ first. వినడం. పరేశ్ జీ!.బాగుంది.. రేపు try చేస్తా.. ఈ కధ, చెప్పడం,

  • భ‌లే భ‌లే.. రాసినారు ఏడు తోక‌ల ఎల‌క మింద‌. స‌మాజం ఇట్ల‌నే ఉంటాది అన‌టానికి ఇదో మంచి ఉదాహ‌ర‌ణ‌. ఎక్కిరిచ్చేవాళ్లు మ‌నం ఎట్లున్నా ఎక్కిరిచ్చారు. ఏయి ప‌ట్టించుకోకూడ‌దు. ప్ర‌స్తుతం పిల్ల‌ల‌కు ఇలాంటి విష‌యాలు చెప్పాల్సిన అవ‌సరం ఉండాది.
    ధ‌న్య‌వాదాలు స‌ర్‌.

    • Thank you Rajavali.
      మనం ఏం చేసినా చేయకపోయినా లోకం అంటూనే ఉంటుంది. అదే మనం ఖాతరు చెయ్యకపోతే ఉరుకుంటుంది. ప్రాథమికంగా పిల్లలకు అంకెలు అలవాటు చెయ్యడానికి ఈ కథ అల్లినా, పెద్దయ్యాక కూడా నచ్చడానికి కారణం ఆ ఎరుక.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు