ఏకత్వంలో భిన్నత్వం

తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి – సారంగ తొలి కథలపోటీ విజేతలు

నా పేరు ఎఱ్ఱాప్రగడ రవి ప్రసాద్. నేను పుట్టింది, పెరిగింది ఆంధ్రప్రదేశ్ లోని తుని పట్టణం. నేను ఎలక్ట్రానిక్స్ మరియు మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బెంగళూరులో సాఫ్ట్ వేర్ రంగంలో మేనేజర్ గా స్థిర పడ్డాను. నా ప్రవృత్తిగా రచనను ఎంచుకుని నా భావాలను కథలు, కథానికలు, కవితల రూపంలో పంచుకుంటూ ఉంటాను. నాకు నచ్చిన రచయితలు  శ్రీ శ్రీ, ముళ్ళపూడి , యండమూరి వీరేంద్రనాథ్.

*

ఇంకా తెల్లవారకుండానే రోడ్లన్నీ వాహనాలతో, పోలీసులతో కిక్కిరిసి పోయాయి. ఊరంతా కోలాహలంగా ఉంది.

రోడ్డులన్నీ రికార్డింగ్ డాన్స్ వేసే స్టేజిలాగ   రంగురంగుల అధికార పార్టీ జెండాలతో అలంకరిస్తున్నారు. గంజాయి వనంలో తులసి మొక్క లాగ  అక్కడక్కడ జాతీయ జెండాలతో కూడా అలంకరించారు. రాజకీయ నాయకుల ఫొటోలతో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద హోర్డింగ్ లు భయంతో పాటు  ప్రమాద ఘంటికలు కూడా మోగిస్తున్నాయి. ఊరంతా రాజకీయ రంగు పులుముకుంది. ఆ రోడ్లునలకరించిన కొందరు సారాయి మత్తులో  అలౌకిక ఆనందంలో తేలుతూ, రోడ్డు మీద రక రకాల భంగిమల్లో నాట్యమాడుతున్నారు. 100 మీటర్ల రోడ్డు వేయడానికి 100 రోజులు పట్టే ఈ రోజుల్లో కేవలం 10, 12 గంటల్లోనే ఇదంతా జరిగింది అంటే ఆశ్చర్యం కలగక మానదు.

ఆ ఏర్పాట్లన్నీ చూస్తే ఇది ఒక సభకు జరిగే ఏర్పాట్లే అని ఇట్టే చెప్పేయచ్చు.

హైవే  నుంచి ఆ సభ జరిగే, ఆ ఊరి కాలేజ్ గ్రౌండ్స్ దాకా ఉన్న రోడ్లన్నీ శుభ్రం చేస్తూ, మిగతా రోడ్లన్నీ ఏదో పాపం చేసినట్టు అలాగే వదిలేస్తున్నారు. అవును! మన దేశంలో మనుషులకే కాదు రోడ్లకీ స్కూళ్ళకీ కూడా పాపపుణ్యాలు ఉంటాయి. వాటి వాటి కర్మలను బట్టీ వాటి తలరాతలు మారుతూ ఉంటాయి కాదు మారుస్తూ ఉంటాము.

ఆ సభ జరిగే ప్రాంతానికి కొంత దూరం లోనే నాగులు అనే కౌలు రైతు తన ఇంటి బయట ఒక చిన్న తోపుడు బండి పెట్టి టీ, టిఫన్ అమ్ముతూ ఉంటాడు. అక్కడే కూర్చుని తినడానికి వీలుగా నాలుగైదు నాపరాళ్ళు కూడా ఏర్పాటు చేసాడు.

రోజూ ఆ ఊరి మార్కెట్ లో కూరగాయలు  అమ్మడానికి వచ్చే రైతులు తప్పని సరిగా నాగులు బండి దగ్గర  టీ కానీ టిఫిన్ కానీ తీసుకోకుండా వెళ్ళరు.  ఆ ఊర్లో నాగులు టిఫిన్ బండికి అంత పేరు ఉంది.

నాగులు చాలా నిక్కచ్చి అయిన మనిషి, పైగా కష్ట జీవి. అనవసరంగా వచ్చే రూపాయి ఆశించాడు, తనకు రావాల్సిన రూపాయి వదులుకోడు. అతనితో పాటు ఆ ఇంటిలో అందరూ ఇలా ఎదో ఒక పని చేస్తూ ఉన్న దాంట్లో హాయిగానే జీవిస్తున్నారు. వ్యవసాయం తో పాటు వచ్చిన పంటతో ఇలా వ్యాపారాన్ని కూడా చేస్తున్నాడు.

అక్కడికొచ్చే రెగ్యులర్ కస్టమర్స్ చాలా మందే ఉన్నారు. అలాంటివాళ్లలో గోపాలం మాష్టారు కూడా ఒకరు.

మంచయినా చెడ్డయినా నాగులుకి ఆయనే పెద్ద దిక్కు.

గోపాలం మాష్టారు అక్కడికి వస్తూనే “ఏంటి నాగులు… ఈ హడావుడి అంతా ” అని అడిగారు.

“రేపు ఆగస్టు 15 కదండీ. అందుకే ఈ సారి జెండా వందనానికి మన ఎమ్మెల్యేని పిలిచారటండి. ఈ మధ్య ఆయనగోరు మినిస్టర్ కూడా అయ్యాడు కదండీ! అందుకే ఆళ్ళ కులపోళ్ళందరూ కలిసి జెండా వందనం ఆ తరవాత ఆయనకి  సన్మానం అన్నీ కలిసొచ్చేట్టుగా పెట్టరటండీ” అంటూ వేడి వేడి ఇడ్లీలు ఉన్న ప్లేటు మాష్టారు చేతిలో పెట్టాడు నాగులు.

“అంత వరకూ బాగానే ఉంది కానీ కుల సంఘం వాళ్లే ఎందుకు ఇదంతా చేస్తున్నారో అర్ధం కావడం లేదు” ఆశ్చర్యంగా అన్నారు మాష్టారు.

” పోయిన ఎలచ్చన్లో నెగ్గిన ఎమ్మెల్యే ,  ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళు, స్థలాలు, పింఛన్లు అన్నీ ఆళ్ళ కులపోళ్ళకే ఇచ్చుకున్నారట.

ఈ కులపోళ్ల వీధులకి కనీసం రోడ్లు, లైట్లు కూడా వేయించలేదట. అందుకే ఈ సారి ఈ కులపోళ్ల  ఎమ్మెల్యే నెగ్గడంతో, గొప్ప చూపించుకోవడానికి, ఆళ్ల పనులు చేయించుకోవడానికి  ఈ ఫంక్షన్ పెట్టారటండి. ఆళ్లు మాటాడుకుంటుంటే విన్నానండి.

ఏ కులపోళ్లు ఆ కులపోళ్ళనే ఏలితే ఇంక ఎలక్చ్చన్లు  ఎందుకు ? ఈ ప్రభుత్వం ఎందుకు ?

ఏటో దేశం ఏమైపోతుందో ” అంటూ నిట్టూర్చాడు నాగులు.

మళ్లి  ఎదో గుర్తు వచ్చినట్టు ” ఇందాక ఆళ్ల మనిషొకడు వచ్చాడు మాస్టారూ ! మా వార్డులో ఈ పార్టీకి ఓట్లు పడలేదటండీ.. నన్ను మా పేటోళ్లను తిట్టి పోయాడయ్యా. ఈ మీటింగ్ కి వెయ్యి రూపాయలు చందా ఇయ్యి! ఎప్పుడన్నా ఏ సాయం కావాలన్నా సేత్తాను అన్నాడయ్య!

“మరి నువ్వు ఏమన్నావు” అడిగారు మాష్టారు.

“ఈళ్ళకిత్తే ఆ కులపోళ్ళకి కోపం, ఆళ్ల కిత్తే ఈ కులపోళ్ళకి కోపం. మన కెందుకయ్యా ! అందుకే ఇవ్వలేనని చెప్పేసానయ్యా” తన పని తాను చేసుకుపోతూనే అన్నాడు నాగులు.

ఎవరో పక పకా నవ్వడం వినిపించడంతో అటుగా చూసి ” ఏం బాబూ నా మాటలు నవ్వొత్తున్నాయా” అని అడిగాడు ఆ అపరిచిత వ్య్తకిని  చూసి నాగులు.

చిన్న మాసిన గెడ్డంతో మంచి ముఖ వర్ఛస్సుతో  వెలిగి పోతున్న ఆ యువకుడిని చూసి “ఈ ఊరికి కొత్తా బాబూ ! మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు” అడిగారు మాష్టారు. అతను కూడా ఆ సభకు వచ్చిన ఆ కుల సంఘం వాడే అనే చిన్న అనుమానంతో.

దానికి ఆ యువకుడు  చేతిలో ఉన్న ప్లేటుని పక్కన పెడుతూ “నేను ఈ ఊరి వాడినే. కానీ మీరు మాట్లాడుకుంటున్న ఆ కులాలకి సంబదించిన వాడిని మాత్రం కాదు. ఈ ఎమ్మెల్యే మనిషిని అంతకన్నా కాదు. కంగారు పడకండి. నా పేరు విజయ్. నేనొక లాయర్ని. అప్పుడప్పుడు సెలవులకి ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను” అన్నాడు.

” అలాగా ! మంచిది బాబూ. మరి ఎందుకు నవ్వావు” ఉత్సుకతతో అడిగారు మాస్టారు

” అదా! నాగులు ఈ కులం గొడవలు నాకెందుకు, తటస్తం గా ఉంటాను అన్న మాటలు విని నవ్వొచ్చింది! అలా నాగులు అనుకుంటే సరిపోతుందా. చుట్టూ ఉన్నవాళ్లు కూడా అనుకోవాలి కదా! అంతెందుకు అతని కులం వాళ్ళే ఎమ్మెల్యే గా పోటీ చేస్తే వాడు ఎంత చెడ్డవాడయినా అతనికి తెలీకుండానే వాడికి ఓటు వేస్తాడు. మన దేశంలో సంఘసేవ కూడా కులం పేరుతో గాని మతం పేరుతోనూ జరుగుతుంది. అంతెందుకు 100 సంవత్సరాలు  పైగా బ్రిటిష్ వాళ్ళతో యునైటెడ్ ఇండియా కోసం స్వతంత్ర పోరాటం చేసి, మత ప్రాతిపదిక మీద వేరే దేశం కావాలంటే ఔదార్యం గా ఇవ్వడానికి ఒప్పుకుని, రెండు ముక్కలుగా స్వాత్రంతం తెచ్చుకున్న ఘనత మనది” అన్నాడు విజయ్.

అతని మాటల్లో లోతును గ్రహించి ఆశ్చర్యపోతూ “అంటే అందరూ అలాగే ఆలోచిస్తారంటావా? లౌకిక భావాలు కలిగి ఉండరంటావా” అడిగారు మాష్టారు.

“అలాగే ఆలోచిస్తారు అనటం లేదు. మిమ్మల్ని అలా ఆలోచించేలా చేస్తారు అంటున్నాను. పేస్ బుక్, వాట్సాప్. చివరికి ప్రశాంతంగా ఉండే ప్రార్థనా మందిరాలు, ఒకటేమిటి ఈ విషం అన్ని చోట్ల ఉచితంగాను విరివిగాను దొరుకుతోంది. మనమేమి ఇంద్రియాలను జయించిన ఋషులం కాదు కదా ! ఇతరుల ఆలోచనల మీద బతికే పరాన్న జీవులం. పీవీ సింధు మొదటిసారి టైటిల్ గెలవగానే గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ట్రెండ్ అయిన టాపిక్ “ఆమె కులం ఏంటి అని” . ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు అనగానే అతని పేరులో మొదటగా వెదికేది అతని మతం ఏంటి కులం ఏంటి అని ! అందుకే కులం మతం అనేవి మన ఉచ్వాస నిశ్వాసాలు. నిజానికి మనకు అవసరం లేక పోయినా మనమీద రుద్దుతున్న భావజాలాలు ” చెప్పాడు విజయ్.

ఇదేమి అర్ధం కాని నాగులు ఒక పక్క వింటూనే తన పని తను చేసుకు పోతున్నాడు.

దేశం మీద ఎంతో గౌరవం ఉన్న మాష్టారు “నువ్వు ఏవో రాడికల్ భావాలతో మాట్లాడుతున్నావు గాని నా దేశం ఇంకా అంత దిగజారలేదు. ఇన్ని కోట్ల మంది ఏకతాటిపై పోరాడి స్వతంత్రం సాధించాము. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనం అంతా ఐక్యంగా ఉంటాము అని తెలియడానికి ఇంతకన్నా ఉదాహరణలు కావాలా?” అన్నారు గర్వంగా.

విజయ్ మరలా బిగ్గరగా నవ్వుతూ ” మీరు అంటున్న ఆ స్వాతంత్ర ఉద్యమంలో  కూడా ఒక మత ప్రాతిపదిక మీద ఏర్పాటయిన  పార్టీ ని చేర్చుకుని, ఆ తర్వాత ఆ మతం ఆధారంగానే వాళ్లకి  వేరే దేశం కట్టబెట్టిన చరిత్ర మనది. స్వాతంత్రం అనే గొప్ప భావనతో పోరాడుతున్నప్పుడు, ఇలా మతం ఆధారంగా పుట్టిన పార్టీ ని ఉద్యమంలో చేర్చుకోము అని ఎందుకు అనలేదు ? అయినా స్వాతంత్రం కోసం 100 సంవత్సరాలకి పైగా పోరాడిన మనం, కలిసే ఉండాలి అని ఎందుకు పోరాడలేదు. ఎందుకంటే ఆ దేశం వాళ్ళు మనలని మతం అనే  అడ్డు  గోడ కడితే మనం దానికి తలొగ్గాము.

మన బలం Unity in diversity. మన బలహీనత “diversity in Unity”. కలిసి ఉండి కూడా కులం, మతం, భాష అనే ముళ్ల కంచెలు కట్టుకుని బతుకుతాము. అటువంటి  భావనలో మాత్రం ఐక్యత ఉంది.    ఎన్ని గ్రూపులుగా విడిపోవాలో అన్ని గ్రూపులుగా విడిపోయి ఆ గ్రూపుల్లో మాత్రమే ఐక్యంగా ఉన్నాం. అదే  “diversity in Unity” ఆవేశంగా అన్నాడు విజయ్.

చరిత్రలోని చీకటి నిజాలను వేరే కోణంలో ఆవిష్కరించిన ఆ యువకుని మాటలు విని భాదతో  “దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడగారు. కానీ   ఇప్పుడు అదే మనుషులు…. ”  వాక్యం పూర్తి చేయ కుండానే కళ్ళు మూసుకున్నారు.

“లేదు మాస్టారు అయన చెప్పిన context దేశాన్ని గురించి కాదు దేశభక్తి గురించి.

ఈ మట్టిని ప్రేమించలేము కాబట్టి ఈ మట్టి మీద ఉన్న మనుషులను ప్రేమించమన్న గొప్ప మనసుతో చెప్పారు గురజాడగారు.

కానీ నా దృష్టిలో “దేశమంటే మట్టేనోయి దేశమంటే మనుషులు కాదోయ్”. ఎందుకంటే, వాళ్ళే ఈ మట్టిమ్మీద కులం, మతం, ప్రాంతం అనే అడ్డు గోడలు కడుతున్నారు” అని విజయ్ అనగానే, అతని భుజం తట్టి బాధ నిండిన హృదయంతో అక్కడి నుచి వెళ్లిపోయారు మాస్టారు.

“బాబూ! మీరు బాగా చదువుకున్నోరులా ఉన్నారు. ఈ కులం, మతం పట్టింపులు ఎదో పదవులు ఆశించే ఆ కుల సంఘ పోళ్ళకే గాని, మావూరిలో సామాన్య పెజానీకం అవేం పట్టించుకోరు బాబూ. ఎవరి గోస ఆళ్ళదే ” ఉండబట్టలేక తన అభిప్రాయాన్ని చెప్పాడు నాగులు.

విజయ్ ఒక చిన్న నవ్వు నవ్వి, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

మన దేశ ప్రజలకి మతం అన్నా, కులమన్నా చాలా గౌరవం. అందుకే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడే  రక రకాల మతాలూ, కులాల వాళ్ళు కనిపిస్తారు.   మన శరీరంలో అది ఒక క్రోమోజోమ్ లాగ మారి పోయింది.

 కొంత సేపటికి ఒక కానిస్టేబుల్ తన బడ్డీ వైపుగా రావడం చూసి కంగారు పడ్డాడు నాగులు,

“ఈ బండి ఓనర్ ఎవరు” అంటూ వచ్చాడు కానిస్టేబుల్.

“నేనేనయ్య” అన్నాడు నాగులు.

“ఎస్సై  గారు, మా స్టాఫ్… ఆ బండి లో ఉన్నారు. ఆరు ప్లేట్లు ఇడ్లీ పంపించు” అన్నాడు కానిస్టేబుల్ కొంచెం అధికార దర్పంతో.

ప్లేటులో అరిటాకులు సర్దుతూ  “అలాగేనయ్యా” అన్నాడు నాగులు.

“నాగులు బండి దగ్గరికొచ్చి… దోస తినకుండా వెళ్తారా ! నాగులు  చేసే కారం దోస తింటే రోజూ ఇక్కడికే వస్తారు”

అన్నారు ఎవరో టిఫిన్ తింటూ.

“అవునా ! అయితే ఆరు ప్లేట్లు దోస కూడా పంపించు” అంటూ పోలీస్ జీప్ దగ్గరికి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్.

తన దగ్గర పనిచేసే కుర్రాడితో పోలీసులకి టిఫన్ పంపించాడు నాగులు.

కాసేపటికి మరలా కానిస్టేబుల్ వచ్చాడు.

“నిజంగా దోసలు చాలా బాగున్నాయి. నాలుగు దోసలు పార్సెల్ కట్టి ఇవ్వమన్నారు SI గారు” అన్నాడు కానిస్టేబుల్.

చాలా శుభ్రమైన అరిటాకులుతో పార్సెల్ కట్టి ఇచ్చాడు నాగులు.

పార్సెల్ తీసుకుని కానిస్టేబుల్ వెళ్లిపోతుంటే “అయ్యా అయ్యా మొత్తం రెండొందలు అయ్యిందయ్యా”

అంతే ఎదో వినకూడని మాట విన్నట్టు ఒక్క సారి చిర్రున చూసాడు కానిస్టేబుల్.

వెంటనే తేరుకుని నవ్వుతూ, “ఇది SI గారికోసం” అన్నాడు ఒత్తి పలుకుతూ.

“అయితే ఆయన్నే అడిగి ఇప్పించండయ్యా” అన్నాడు నాగులు కూడా కొంచెం సీరియస్ గానే.

అక్కడ జనం తననే చూస్తూ ఉండడంతో “సరే” అంటూ వెళ్ళిపోయాడు కానిస్టేబుల్.

అతని వెనకే, పనివాడిని పంపించాడు నాగులు డబ్బులు కోసం.

కాసేపటికి ఆ పిల్లాడికి డబ్బులు ఇచ్చి పంపించాడు SI.

మధ్యాహ్నం 12 గంటల వరకూ బడ్డీలోనే ఉండి తరువాత తన కొడుకు ఓబులేసు కి అప్పచెప్పి పని మీద బయటకు వెళ్ళాడు నాగులు.

సాయంకాలం ఇంటికి తిరిగొచ్చిన నాగులుకి ఏడుపుతో ఎదురొచ్చింది నాగులు భార్య.

“మన బండి ని ఓబులేశుని పోలీసోళ్ళు తీసుకెళిపోయారయ్యా” అంటూ ఏడుస్తూ చెప్పింది. అప్పటికే ఆ పేటలో జనం అంతా నాగులు ఇంటి దగ్గరే గుమికూడారు.

వెంటనే పోలీస్ స్టేషన్ కి బయలు దేరాడు నాగులు

పోలీస్ స్టేషన్ కి వెళ్లిన నాగులు సరాసరి SI రూమ్ కి వెళ్ళాడు.  ఎర్రబడిన కళ్ళతో వేడి నిట్టూర్పులు వదులుతూ “నమస్కారం అయ్యా! అన్నాడు నాగులు.

“ఎవరు నువ్వు? ఎవరు కావాలి” అని కనీసం ముఖం కూడా ఎత్తకుండానే, ఏవో ఫైల్స్ చూస్తూ అడిగాడు SI.

“అన్యాయంగా నా బండి అట్టు కొచ్చేసినారయ్యా!! అన్నాడు నాగులు రొప్పుతూ.

“అన్యాయమా నీ దగ్గర టిఫిన్ తిన్న వాళ్ళు వాంతులు, విరేచనాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు.

వాళ్లు కంప్లైంట్ చేస్తేనే నీ బండి సీజ్ చేశాము, నీ కొడుకుని అరెస్ట్ చేసాము.

రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాం. నీ తప్పు ఏమీ లేదని అని కోర్టు తీర్పు ఇస్తే నీ బండి నీకు తిరిగి ఇస్తాం. అంతవరకు నీ బండి ఇవ్వడం కుదరదు. ఇంతకీ ఓనర్, నువ్వా నీ కొడుకా?” అన్నాడు SI .

” అలా అనకండి అయ్యా! ఈ ఊర్లో ఎవరినైనా అడగండయ్యా . మా దగ్గర కల్తీ సరకుండదు. అయినా ఉదయం  మీరు కూడా తిన్నారు కదయ్యా” అన్నాడు నాగులు

“ఏమో! మేము తిని వెళ్ళాక ఏమి కల్తీ జరిగిందో ఏమో ఎవడు చూసాడు. అయినా రేపు కోర్టులో చెప్పుకో ఇవన్నీ” అన్నాడు విసుగ్గా SI.

అప్పటికే అక్కడకు చేరిన గోపాలం మాష్టారు అందుకుని “మీరు ఎదో పొరబడుతున్నారు. నాగులు చాలా మంచి వ్యక్తి . దయ చేసి ఓబులేశుని అతని బండిని విడిచి పెట్టండి. ఎవరో గిట్టని వాళ్ళు చేసిన కంప్లైంట్ తీసుకుని, ఇతన్ని ఇలా బాధ పెట్టడం చాలా అన్యాయం”  కోపంగా అన్నారు మాష్టారు.

అది వింటూనే SI చివాలున లేచి “అసలు  మీ కులపోళ్ళు అందరూ అంతేరా. జనాలు ఎలా చచ్చినా పర్లేదు, మీకు  మాత్రం డబ్బులు వచ్చేయాలి, అంతేనా! అన్నాడు విసుగ్గా SI నాగులుని చూసి.

ఆ కులం మాట వింటూనే నాగులు కి విషయం అంతా అర్ధం అయ్యింది.  ఎలక్షన్లో ఓట్లు వేయలేదని ఉదయం ఆ MLA మనుషులు అన్న మాటలు, ఆ మీటింగుకి డబ్బులు ఇవ్వలేదన్నందుకు,  తిన్న టిఫిను కి డబ్బులు అడిగినందుకూ  ఇలా కక్ష సాధింపు చేస్తున్నాడని  అర్ధం అయ్యింది నాగులుకి.

ఇక మాట్లాడి ఏమీ లాభం లేదనుకొని, అక్కడి నుండి బయటకు వచ్చేసారు నాగులు, మాష్టారు.

ఈ  కులం పేరుతో తిట్టిన విషయం ఆనోటా ఈ నోటా వాళ్ళ పేటంతా తెలిసింది. ఊర్లో గొడవలు మొదలయ్యాయి.

ఉదయం నాగులు బండి దగ్గర టిఫిన్ తిన్న విజయ్ కూడా అక్కడికి వచ్చాడు.

“నాగులూ   నువ్వు ఏమీ బాధపడకు నీకు నేను న్యాయం జరిగేలా చూస్తాను” అని ఊరడించబోయాడు.

కులం పేరుతో తిట్టిన SI  మాటలు,  నాగులుని నిలకడగా ఆలోచించనీయటం లేదు. పౌరుషంతో పళ్ళు కొరుకుతూ ” ఇది నాయంగా పెట్టిన కేసుకాదు.   ఆడు నా  కులం మీద కచ్ఛితో, నా మీద తప్పుడు కేసు బనాయించాడు” ఊగి పోతూ  అన్నాడు నాగులు.
కాసేపటికే గంగులు, నాగులుని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు.

“ఏటి నాగులూ ఇంత జరిగితే నాకు అసలు చెప్పలేదు. నాకు ఇప్పుడే విషయమంతా  తెలిసింది. నువ్వేటి బెంగ పడకు. మన కులం అంటే వీళ్ళకి  చులకన.  మన సత్తా ఏంటో చూపిద్దాం. కాసేపట్లో జగ్గయ్య మామ కూడా వత్తాడు” అన్నాడు వీరావేశంతో గంగులు.

జగ్గయ్య వాళ్ళ కుల పెద్ద.  రాజకీయంగా కూడా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి.

కాసేపటికే జగ్గయ్య 10, 15 మంది కుర్రాళ్ళుతో స్టేషన్ కి వచ్చాడు.

నాగులుకి అక్కడ ఉన్న వాళ్ళల్లో నలుగురు అయిదుగురు తప్ప మిగతా ఎవరూ తెలీదు. కానీ అంత మంది ఒక్కసారిగా తన కోసం స్టేషన్ కి రావడంతో, నాగులుకి కొండంత దైర్యం వచ్చింది.

జగ్గయ్య వస్తూనే, నాగులు బుజం మీద చేయి వేసి “పద SI తో నేను మాట్లాడతాను” అంటూ మందీ మార్బలంతో లోపలికి వెళ్ళాడు.

అంత మందిని చూస్తూనే SI కి ముచ్చెమటమలు పట్టాయి.

వెళ్తూనే జగ్గయ్య, SI  టేబుల్ కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. పోలీసులు అందరూ నిస్చేస్టులై వాళ్లనే చూస్తూ ఉండి పోయారు.

“ఏం SI గారు, మా వాడిని బెదిరించారట.  ఎదో కులం తక్కువొళ్ళు అని కారు కూతలు కూసారట. మా కులపోళ్ళతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావో ఏమో ! మీ వోడు MLA నే మా వాడు MP..” అని జగ్గయ్య ఇంకా ఎదో చెప్పబోతుంటే.

ఇంతలో SI ఫోన్ మోగింది. SI ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతలినుంచి   “ఏంటిది! జగ్గయ్య మనుషులతో గొడవలా? ఏమి ఊరులో ఉండాలని లేదా.. . రేపు అక్కడ మినిస్టర్ మీటింగ్ పెట్టుకొని ఈ గొడవలేంటి!  అప్పుడే  ఊరులో గొడవలు మొదలయ్యాయట. నీ పై ఆఫీసర్ గా చెపుతున్నాను. వెంటనే రిలీజ్ చేయి” SI ఎదో చెప్పబోతుంటే ఫోన్ కట్ అయ్యింది. SI మొహం పాలి పోయింది. అది చూస్తూనే అక్కడ వాళ్ళ మొహాలు ఆనందంతో వెలిగిపోయాయి. జగ్గయ్య మీసం మెలేసాడు.

“నన్ను క్షమించండి. పొరపాటు జరిగింది. ఇంకెప్పుడూ ఇలా జరగదు. ఏయ్ 202 అతన్ని రిలీజ్ చేయి. నాగులు బండిని  జాగ్రత్తగా ఇంటిదగ్గర వదిలి పెట్టి రా” అని చెప్పి, తల వంచుకుని నిలబడ్డాడు SI.

“మా కులపోళ్ల జోలికి మరలా వచ్చినట్టు తెలిసిందో ఊరు వల్లకాడు అయిపోద్ది. అర్దమయ్యిందా ” అని గద్దించాడు జగ్గయ్య.

అర్ధం అయినట్టు తలూపాడు SI.

జై జై కారాలు చేస్తూ అక్కడికి వచ్చిన జనం అందరూ స్టేషన్ వదిలి వెళ్లిపోయారు, నాగులుతో సహా .

గోపాలం మాష్టారు, విజయ్ మాత్రం స్టేషన్ బయట మౌనంగా కూర్చొండి పోయారు.

కాసేపు నిశ్శబ్దం తరువాత, విజయ్ ” ఈ రోజు ఈ గొడవలో SI  ఆ కులం ప్రస్తావన తేకపోతె, నాగులు కి ఇంత సపోర్ట్ వచ్చేది కాదు.  కోర్టు పరంగా ఈ కేసు నుంచి బయట పడాలంటే, నాగులుకి కొన్ని నెలలు పట్టేది.  ఈ కులం పిచ్చి నాకెందుకు అన్న నాగులే,  చివరకు ఆ ఉచ్చులో పడ్డాడు. ఇక ఆ ఉచ్చునుంచి బయటకు రాలేడు. ఇప్పుడు నాగులు, ఇదే సరైన మార్గం అనుకుంటున్నాడు. కానీ, తనకు తెలీకుండానే, తాను వేరొక వర్గానికి శత్రువుగా మారి పోయాడు.  ఒక్క నాగులు విషయంలోనే కాదు..  టెక్నాలజీ, అక్షరాస్యత, నాగరికత పెరుగుతున్నకొలదీ ఇలాంటి జాడ్యాలు కూడా మరింత పెరుగుతున్నాయి. ఇది నాగులు లాంటి వాళ్ళ తప్పు కాదు… అలా మారుస్తున్న మన వ్యవస్థ, దానిలో మనం రాసుకున్న శాసనాలు. ఎప్పుడైతే కులం పేరుతొ మన రాజ్యాంగ వ్యవస్థ తయారయ్యిందో, అప్పుడే మనము వంద సంవత్సరాలు వెనుకబడిపోయాము.

మన సమాజంలో పేరుకుపోయిన సాంఘిక అసమానలతలని, మన తెలివి తేటలు ఉపయోగించి రిజర్వేషన్స్ అనే సాధనంతో కొత్త అసమానలతని సృష్టించుకున్నాం. దాని పర్యవసానమే ఇది.

చెప్పాను కద మాష్టారు! మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ కాదు. డైవర్సిటీ ఇన్ యూనిటీ మాత్రమే” అని విజయ్ అనగానే ఇప్పటివరకూ ఈ కులపు వుచ్చుకి దూరంగా ఉన్న నాగులు లాంటి వాళ్ళు కూడా ఆ ఉచ్చులో పడిపోవడం చాలా భాద కలిగించింది మాస్టారికి .

ఎన్నో ప్రశ్నలు, మరెన్నో భావాలు మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే, భావితరానికి ప్రతినిధి అయిన విజయ్ లాంటి వాళ్ళు కూడా అదే ఆలోచనాధోరణిని ప్రదర్శించడం మరింత భాద కలిగించింది.

“సరే ఇన్ని అసమానలతలు గురించి, లోపాల గురుంచి అనర్గళంగా మాట్లాడావు సరే. కానీ నీలా చదువుకున్న యువతరమే దానికి ఒక మార్గం కనుగొనాలి కానీ, ఇలా పదే పదే మన వ్యవస్థ ను గురించి తిట్టిపోసి ఏంటి  ఉపయోగం?” ఉక్రోషం ఆపుకోలేక అడిగారు మాష్టారు

విజయ్ నవ్వుతూ ” ఉదయం నా గురుంచి మీకు పూర్తిగా చెప్పలేదు. నేను స్టాంఫోర్డ్ యూనివర్సిటీ లో పొలిటికల్ సైన్స్ చదువుకుని, ఇక్కడకు వచ్చి ఇండియాలో లా చదివాను. ఇటువంటి జాడ్యాలను రూపు మాపడం కోసం, వ్యవస్థలో సంస్కరణలు కోసం కేంద్రం  నియమించిన కమీషన్ లో నేనూ ఒక సభ్యుడిని. మార్పు అంత సులభం కాదని నాకు తెలుసు. అందుకే ఇండియన్ పాలిటిక్స్, ప్రజలమీద వాటి ప్రభావం గురుంచి సర్వే చేస్తూ కొత్త మార్పులను సూచిస్తున్నాము. ఎందుకంటే ఎటువంటి సంస్కరణల కైనా ముందు అడ్డుపడేది రాజకీయ నాయకులే. అందుకే వాళ్ళు అడ్డుపడలేని విధంగా ఒక సమాంతర వ్యవస్థను సిద్ధం చేస్తున్నాము. దీనిలో మేము ఎంతవరకూ సక్సెస్ అవ్వగలము అనేది ఇప్పుడే చెప్పలేము. కానీ ఖచ్చితంగా కొన్ని రోజుల్లో ఎన్నో కొన్ని మార్పులు వస్తాయని మాత్రం ప్రగాఢంగా చెప్పగలను” అని చెప్పగానే ఎంతో సంతోషం కలిగింది మాస్టారుకి.

కానీ, తనలో కడలి కెరటాలలా ఎగసి పడుతున్న ఎన్నో ప్రశ్నల్లో కనీసం ఒక దానికైనా అతని నుంచి సమాధానం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ” ఇప్పుడు నాగులులాంటి వాళ్లకు ఎదురైన ఈ  కష్టానికి నువ్వు చూపించే మార్గం ఏమిటో తెలుసుకోవాలని ఉంది” అడిగారు మాష్టారు.

ఇది చాలా సంకిష్టమైనది. ఎంతో విశ్లేషించాలి అయినా చెబుతాను. “నాగులు కి చట్ట వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఒక SI లాంటి వాడు అన్యాయంగా తనను కేసులో ఇరికించినప్పుడు, ఈ చట్ట వ్యవస్థని కూడా నిలదీయగలిగి, తనకు సత్వర న్యాయం ఇవ్వగలిగే ఒక స్వతంత్ర జవాబుదారీ వ్యవస్థ ఉన్నప్పుడు ఈ జగ్గయ్య లాంటి వాళ్ళ అవసరం నాగులుకి ఉండదు.

ఈ కోర్టులు కూడా ఇలాంటి అర్ధం పర్థం లేని కేసులతో కాలం వృధా చేసుకోవక్కరలేదు. అంటే న్యాయాన్ని సామాన్యుడు కూడా డబ్బులు వెచ్చించొ ఇలా అధికారాన్ని ఉపయోగించో సంపాదించే రోజులు పోవాలి”

ఆ మాట వింటూనే మాష్టారు ఆనందంతో తబ్బుబ్బి అవుతూ “బాబూ! నీలాంటి వాళ్ళ కోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. నీతో ఎంతో మాట్లాడాలి. ఎప్పటినుంచో నాకు తోచిన పరిష్కారాలని కూడా పుస్తకరూపంలో రాసి ఉంచాను. నాతొ రా!” అంటూ  విజయ్ చేయి పట్టి రోడ్డు మీద ఇద్దరూ నడిచి వెళుతుంటే, రెండు తరాల వారధి ఆ సూర్యాస్తమయం సాక్షిగా రోడ్డు మీద కదిలి వెళుతున్నట్టుగా ఉంది.

తొందరలోనే మన బలహీనత అయిన డైవర్సిటీ ఇన్ యూనిటీ మరలా యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే బలంగా మారుతుంది అనే ఆశతో సూర్యుడు కూడా పడమట కొండల్లో హాయిగా నిదురపోయాడు.

*

చిత్రం: సృజన్ రాజ్

ఎఱ్ఱాప్రగడ రవి ప్రసాద్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు