సాహిత్యం సంక్షోభంలోఉన్నదని నేను చెప్పను.
కాని పరిస్థితి చాలా ఉక్కబోస్తుందని మాత్రం చెప్పగలను. సాహిత్యం తన ప్రయోజనం నెరవేర్చడం లేదని నేను అనను. కాని సమాజం తన ప్రయోజనాన్ని సాహిత్యంలో చూసే ప్రస్తుత పరిస్థితులున్నాయా అని మాత్రం నేను ప్రశ్నించగలను. సాహిత్యానికి ప్రజా దృక్పథం లేదని నేను చెప్పబోను. కాని ప్రజల దృక్పథం సాహిత్యంవైపు మళ్లుతుందా లేదా అన్న అనుమానాలు నాకున్నాయని నేను చెప్పగలను. ఇది సామాజిక ఉద్యమాల లోపమా అని నేను వ్యాఖ్యానించబోను. కాని ప్రజల దృష్టి సామాజిక ఉద్యమాల వైపు ఎందుకు మళ్లడం లేదని మాత్రం నేను అనుకోకుండా ఉండలేను.
ఒకానొక సమయంలో అర్థరాత్రి ఒక మహిళా పౌర హక్కుల కార్యకర్త ఇంట్లోంచి నిద్రలేచి, మొక్కవోని ఉత్సాహంతో నలుగురైదుగురం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బర్కత్ పుర, కోటీ వరకు నడుచుకుంటూ వెళ్లి దారి పొడుగునా బస్ స్టాప్ లపై, ఖాళీ గోడలపై పోస్టర్లు అంటిస్తూ, తెల్లవారు జామున ఏ ఇరానీ హోటల్ లోనో వగరు చాయ్ ను చప్పరిస్తూ జేబుల్లోంచి కవితల్ని తీసుకుని ఒకరికి మరొకరు వినిపించుకున్న రోజులున్నాయి. ఈ నలుగురైదుగురూ ఏ కులం వారనో, ఏ మతం వారనో ధ్యాస మాలో మాకు లేదు. మేము సమాజాన్ని ఏదో మార్పు చేయాలని శరీరమంతా జ్వలిస్త్తున్న ఆకాంక్షలతో నిండిన వారమే. అసలు కులం గురించి ఆలోచించడమే ఒక నీచమైన ప్రవర్తనగా భావించేవారం. కాని ఇవాళ కులాలు, మతాల ఆధారంగా మనుషులను గుర్తించడం, వారి వ్యవహార శైలిని అంచనా వేయడం ఎక్కువ అవుతోంది. ఇది సమాజంలో ఒక ప్రగతి శీల పరిణామమా, లేక తిరోగమనమా? అని ఆలోచిస్తున్నాను.
అవును సమాజం ఒక తిరోగమనంలో నడుస్తోంది. ఆనాడు కులం అనేది వాస్తవం కాదని నేను చెప్పబోను. కాని సామాజిక ఉద్యమాలు కులం పాత్రను చెరిపివేశాయి. ఇవాళ ఉత్తర ప్రదేశ్ లో ఒక మత వాద పార్టీని ఓడించడానికి రెండు కులాలు ఏకమై గట్టిగా ప్రయత్నించినా సఫలం కాకపోయాయి. అంటే మతవాదం ఇవాళ కులాన్ని అధిగమిస్తోందా? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పరిణామం కూడా శాశ్వతమని నేను చెప్పబోను. కాని సమాజం ఉత్థానం నుంచి పతనం వరకు ప్రయాణిస్తున్నదని మాత్రం నేను చెప్పగలను.
ఏమయ్యాయి.. మనం చదివిన పుస్తకాలు.. అందులో ఉన్న అద్భుతమైన వాక్యాలు.. ఒకానొక రోజు ఒక యువకుడు నేను రాసిన కవిత చదివి ఆఫీసుకు వచ్చి ‘నేను ఉద్యమాల్లో కి ప్రవేశించాలనుకుంటున్నాను సార్. నాకు గైడెన్స్ ఇవ్వండి.. అన్నాడు. ఉద్యమాల్లోకి వెళ్లడం తర్వాత ముందు చైతన్యం ఏర్పర్చుకో..’ అని నేను సలహా ఇచ్చి కొన్ని పుస్తకాలు ఇచ్చాను. ఆ పుస్తకాలు చదివాడో లేదో తెలియదు కాని ఆ తర్వాత నేను ఢిల్లీకి బదిలీ అయి కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు అతడికి నివాళిగా సభ జరుగుతోంది. నేను పుస్తకాలు ముట్టినప్పుడల్లా కాగితాలు అతడిని, అలాంటి వారిని గుర్తు చేసి గాలికి రెపరెపకొట్టుకుంటూ నా చేతి వ్రేళ్లను శిక్షిస్తుంటాయి.
సాహిత్యం, సామాజిక ఉద్యమాలు చైతన్యం కలిగించే స్థాయిని కోల్పోయాయి. ప్రజలు మఠాధిపతులు, పీఠాధిపతులు చెబుతున్న ప్రవచనాలకు అధికంగా ప్రభావితమవుతున్నారు. వారణాసిలో ఒక పడవ నడిపే వాడు మాట్లాడుతూ ‘మోదీ ఉన్నాడు కాబట్టి ఇవాళ పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చి మన అభినందన్ ను తిరిగి పంపింది.. ‘అన్నాడు. సామాన్యుల దుర్భర జీవితాలు, రైతుల కడగండ్లు, దళితుల ఆక్రోశం, యువకుల నిరుద్యోగం ఇవన్నీ మోదీ ప్రచారంలో ప్రధానమైన అంశాలు కావు. ఇందిరాగాంధీ లాగా ఆయన గరీబీ హటావో అని నినాదం కూడా ఇవ్వలేదు. అసలు వీటన్నిటి గురించి మొదటినుంచీ మాట్లాడుతున్న వామపక్షాలు తుడిచిపెట్టుకుపోయాయి. అడవులనుంచి పరస్పర హత్యలు, కాల్పుల గురించి, నగరాల నుంచి అరెస్టులు, నిరసన ప్రదర్శనలు, నివాళి సభల గురించే వార్తలు వస్తున్నాయి. రోడ్డు మీద వాహనాలు, జనం నిరంతరం నడుస్తూనే ఉన్నారు. అక్కడ ప్రమాదాలు, హత్యలు కూడా జరుగుతుంటాయి. కాని నెత్తుటి మరకలు క్షణాల్లో మాయమైపోతుంటాయి. రహదారి చైతన్యవంతంగా కనిపిస్తోంది. అది నిజమైన చైతన్యమా?
‘మనం మన సాహిత్యంలో అద్భుతమైన అంశాలను, కళాత్మక వారసత్వాన్ని గ్రహించాలి,. విమర్శనాత్మకంగా పరిశీలించి ప్రయోజనకరమైనవి స్వీకరించి, వాటిని ఉదాహరణలుగా ఉపయోగించాలి. అయితే వారసత్వాలేవీ వర్తమాన సృజనాత్మక కృషికి ప్రత్యామ్యాయం కావు.. ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లి పరిశీలించి, అనుభవించి, విశ్లేషించి, జీవితంలోని అన్ని కోణాలను తరచి చూసి రాసిందే సాహిత్యమని’ ఒక మార్కిస్టు మేధావి అన్నారు. ఇవాళ అసలు సాహిత్యం కన్నా గతమే ఉదాహరణగా ముందుకు వస్తున్నది. విగ్రహాలే ఆదర్సాలుగా మారుతున్నాయా? సాహిత్యంలో విగ్రహారాధన ప్రవేశించిందా?
భ్రమ, వాస్తవం గురించి మనం చర్చే మరిచిపోయినట్లు కనిపిస్తున్నాం. వాస్తవాల ఆదారంగా సాహిత్య సృజన ఆగిపోయినప్పుడు భ్రమే కళాత్మకంగా, సౌందర్యంగా ముందుకు వస్తుంది. ‘ప్రతీకలే వాటంతట అవి కవిత్వంలా చలామణి అవుతున్నాయి. వాస్తవం అసహ్యంగా ఉంటుంది, అందం అవాస్తవంగా ఉంటుంది.. ‘అన్నాడు క్రిస్టఫర్ కాడ్వెల్. ఇవాళ అసహ్య వాస్తవాలను విడిచి అందమైన ఆవాస్తవాలను కవిత్వంలా చలామణి చేస్తున్నారు.
‘శాస్తం ఉత్పాదక శక్తి అయితే కళ ఒక సరుకుగా మారుతుంది. ప్రస్తుత సమాజంలో కళాకారుడి స్వేచ్చ అంటే మార్కెట్ స్వేచ్చే’ అని కొన్ని దశాబ్దాల క్రితమే నిర్వచించుకున్నాం. ఇవాళ మార్కెట్ ను బద్దలు గొట్టగలిగిన శక్తి ఉద్యమాలకు లేదు. వర్గపోరాటమా? ఏ వర్గంతో ఏ వర్గం పోరాడుతోంది? ఉన్నవారితో లేని వారు ఘర్షిస్తున్నారా? ఇవాళ పోరాటాలు మనిషి మీద మనిషి చేయాల్సి వస్తోంది. వెనుకడుగే ముందడుగని భ్రమించే పరిస్థితిలో ఉన్నాం.
ఫాబ్లో నెరూడా మరణిస్తే అతడి అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి మరీ పాల్గొన్నారట. ఇవాళ ఒక రచయిత జైలు పాలైతే సమాజం గగ్గోలు పెట్టలేని దుస్థితికి చేరుకున్నాం. ప్రజాస్వామ్య వాదులంతా ఏకం కావాలని, వినతిపత్రాలపై సంతకాలు చేయాలని, ఫేస్ బుక్ లో సంఘీభావం ప్రకటించాలని ఆర్తనాదాలు వినిపిస్తుంటాయి.. ఏది ప్రజాస్వామ్యం? ఎక్కడున్నారు ప్రజాస్వామ్య వాదులు? ఏది ప్రజాస్వామ్యమో జనాన్ని ఇంతకాలం ఎవరైనా చైతన్యం చేయగలిగారా…? నిప్పుల్లో దూకిన వారంతా కాలిపోతున్నామని, రక్షించమని కోరుతుంటే, ఆ నిప్పుల్లో దూకేందుకు సంసిద్దం కాలేని ప్రజలు ఎలా స్పందిస్తారు.. మనం చేసే పనులకు ప్రజల ఆమోదం ఉన్నదా, లేదా ప్రజలను ఆమోదించే స్థాయికి తీసుకు రాగలిగామా.. అన్నది చర్చించడం అవసరమా కాదా.. మన కన్నీళ్లు, మన రక్తం వృధా కావడం అవసరమా? నిత్యం విషాద గీతికలు రాస్తూనే ఉండడమా?లేదా అమెరికాలో సుఖంగా స్థిరపడ్డ ఏ ఆఫ్రికన్ రచయిత పుస్తకాలను అనువాదాలు చేస్తూ విప్లవం వస్తోందని భ్రమిద్దామా? లేక లక్ష్యం కన్నా మనను మనం మార్కెట్ చేసుకోవడం ప్రధానమైందా?
‘నగరం నగరం అంతా కటకటాల్లో ఉన్నది.. ఆకాశం కటకటాల వెనుకే, పక్షులూ కటకటాల వెనుకే.’. అన్నది నేను రాసిన తొలి కవితల్లో ఒకటి. ఎలిజీలతోనే నా కవితా శిల్పం తీర్చిదిద్దాను. ఇప్పటికీ ఆ విషాదమే నా కవితల్లో తడై మెరుస్తుంది.. ఎంతకాలం.. ఆశావహ సంగీతం ఎన్నడు వినిపించగలం?
మనకు ఒక ఉన్నవ లక్ష్మీనారాయణ, ఒక కొకు, ఒక మహీధర, ఒక రావిశాస్త్రి, ఒక కాళీపట్నం, ఒక అల్లం రాజయ్య మొదలైన వారు ఉన్నారని గర్వపడాలి. వారు తమ తమ సమాజాల్లో వైరుద్యాల్ని చిత్రించారు. ఇవాళ సమాజం మరింత సంక్లిష్టమైంది. అంతర్జాతీయ ఆర్థిక శక్తులు ఒకవైపు, ఉవ్వెత్తున లేస్తున్న తిరోగమన శక్తులు మరోవైపు తమ మధ్య వైరుధ్యం లేనట్లుగా కలిసిపోతుంటే ప్రశ్నించే శక్తులు నిస్పృహగా మారాయి.
మనం ప్రశ్నించేందుకు ఒక ప్రజాస్వామ్య ప్రదేశాన్ని మనం ఎన్నుకోవాలి. ఎక్కడ ప్రశ్నించగలగాలో,అక్కడ ప్రశ్నించాలి. మనను మనం ఈ సంక్లిష్ట పరిస్థితులను అవగాహన చేసుకోగల చైతన్యాన్ని సంపాదించాలి. ఆ చైతన్యాన్ని ఇతరులకు పంచాలి. అఫ్సర్ ఆశించినట్లు ఒక సాహిల్ రావాలి.
మనను మనం రక్తసిక్తం చేసుకోవడం, లేదా చెట్టుపైకెక్కి ఉరితీసుకోవడం క్షణాల పని. పైగా ఇలా మూక ఆత్మహత్యలకు జనాన్ని ప్రేరేపించడం కూడా ఒక సిద్దాంతంగా మార్చడం సులభం. అటువంటప్పుడు ఎరుపుకంటే కాషాయమే అందంగా కనిపిస్తుంది.
*
Enni edurainaa erupe andam ee samaajaniki
నిరంతరం అనుకోండి ఇలాగే
ప్రస్తుత దేశ రాజకీయాన్ని బాగా విశ్లేషించారు మిత్రమా.
Dhanyavaadalu
మనస్సు ను కదిలించే వ్యాసం.
దేశం ఎప్పటికైనా ఒక ప్రజాస్వామ్య దేశంగా మారుతుందా?
ఇటీవల ఫేస్ బుక్ లో చర్చలు జరుపుతున్న వారంతా ఆలోచించాలి.
మీ ఆవేదనే మరిన్ని ఆలోచనలకు దారి తీయాలి
మనను మనం మార్కెట్ చేసుకోవడం ప్రధానమైందా?
అవును.
సాహిత్యకారులు, జర్నలిస్టులు, అస్తిత్వ నాయకులు, ధార్మిక వాదులు
, వామపక్ష మేధావులు, పార్టీ నాయకులు మొత్తం ఆలోచించగల సంఘటితపరచగల శక్తులన్నీ తమని తాము మార్కెట్ చేసుకోటంలో మునిగి ఉన్నారు.
మీరన్నట్టు ఇదే శాశ్వత మని నేనూ అనుకోటం లేదు. సామాన్యజనం మీదే ఈ అసామాన్య మూకల మీదకన్నా ఆశ.
సామాన్య జనాన్ని ప్రభావితం చేయగలిగిన స్థితే వామపక్షాలకు ఉంటే ఈ ఆవేదన ఎందుకు సార్, పరిస్థితి మారుతుందని ఆశిద్దాం.
I agree with krishnudu
బాగా రాశారు, సర్!👍.ఒక సాహిల్ తప్పకుండా రావాలి, నేటి పరిస్థితి లో..!సర్!
Thank you Padma garu
అవసరమైన ప్రశ్నలు. సరైన సమయమే. మీరే సమాధానాలు కనిపెట్టే పని మొదలు పెట్టండి.
Thank you Rama Naidu garu
ఒక విశాదం . ఒక సంతోషం.
మీ కవితలు, లేదా మీలాంటి ఇతరుల రచనలూ చదివి ప్రా ణాలను సహితం త్యాగం చేసిన ఆనాటి యువతలో కొంత భాగాన్ని గురించి తెలుసుకున్నందుకు, అలాం టి ప్రతిస్పందన ఈ నాటి యువతరంకి లేనందుకూ విచారం.
నేటి యువతరం కూడా మీ కవితలు, లేదు మీలాంటి ఇతరుల రచనలూ చదివి రచన రంగంలోనూ, భావజాల రంగంలోనూ కుదురుకున్నందుకూ, అనవసర త్యాగా లదారి పట్టనందుకూ సంతోషం. .
ఇంకా జరుగుతున్న అనవసర త్యాగాల గురించే నా బాధ విద్యాసాగర్ గా రూ. నా కవితలు చదివి ఎవరూ ప్రాణత్యాగం చేయలేదు. ముందు చైతన్యం అవసరమని నేను చెప్పినా వినకుండా ఇంకెవరి ప్రేరణతో నిప్పుల్లో దూకిన యువకుడి గురించే ప్రస్తావించాను.
ఈ 70 ఏళ్ల తెలుగు మాధ్యమ రంగంలో దిన, వార, పక్ష వంటి ముద్రణా మాధ్యమాలు, దృశ్య, శ్రవణ మాధ్యమాలలో ఎప్పుడైనా ఎడమ, ఎడమాతి ఎడమ, అభ్యుదయ, ప్రగతిశీల, సెక్యులర్, మానవవాద రచనలని, రచయితలని ప్రశ్నించిన సందర్భం ఒక్కటైనా చెప్పండి కృష్ణారావుగారూ. వాళ్లంతా సర్వజ్ఞులు, సత్యసంధులూనా? ప్రజాస్వామ్య స్ఫూర్తి నిజంగా ఈ తెలుగు మాధ్యమాలలో, మేధావులలో, ప్రశ్నించే గొంతుకలలో వున్నదా? హిందువులపై, సిక్కులపై జరిగిన వేలాది దారుణ మారణ కాండలలో ఒక్కదాని గురించైనా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ, ఖండించిన దాఖలాలు, ఒక్క పదం, వాక్యం, రచన, వ్యాసం, కార్టూన్, కవిత అయినా వున్నదా? ఈ ప్రజాస్వామ్య లేమితనానికి కారణమైన ఈ ప్రభుత్వం వెనుక వున్న భావజాలం అడిగిన, వాపోయిన, ఎత్తిచూపిన సమస్యలపై ఏనాడైనా సంభాషించాలని పైన నేను చెప్పిన సమూహం మొత్తం ఏనాడైనా ప్రయత్నించిందా? ప్రయత్నించకపోయినట్లయితే మీరు ఈ క్షణమైనా మొదలుపెట్టేటట్లయితే ఈ సమస్యకు కారణాన్ని తెలుసుకోడానికి (ఇప్పటికే మీరు దానిని కనిపెట్టి, అవగాహన చేసుకుని వుండకపోయినట్లయితేనే సుమా! మీకు తెలిసిపోయిందనుకుంటే సమస్య లేదు) నేను మీతో సంభాషించడానికి సిద్ధంగా వున్నాను.
చాలా సార్లు ప్రస్తావించాను. తీవ్రస్థాయి లో విమర్శించాను .వారి అసహనాన్ని కూడా ఎదుర్కొన్నాను. ఆరోగ్యకర చర్చకు ఎవరూ సిద్ధంగా లేరని వ్యక్తిగత దాడులు చేస్తారని గ్రహించి వాదించడం మానుకున్నాను
కృష్ణారావుగారూ, నా ఎఱుక మేరకు మీరొక్కరే నిజాయితీగా స్పందించారు. అభినందనలు. వ్యక్తిగత దాడులను మతోన్మాదులే గాక భావజాల ఉన్మాదులు కూడా చేస్తారని మీ అనుభవంతో నేను నిర్ధారించుకున్నాను. ఇన్నాళ్లూ నేను చెప్పింది ఎవరూ వినలేదు. మీరొక్కరే ఇంత అద్భుతంగా స్పిందించింది. నాకు నైతికస్థైర్యాన్నిచ్చారు, నెనరులు.