ఉమామహేశ్వర్ యిస్తున్న భరోసా…

     కథకుడు జ. ఉమామహేశ్వర్ తన రెండో కథాసంపుటి “భరోసా” ను యిటీవలి వెలువరించాడు. కార్పొరేట్ రంగాన్ని వ్యవసాయ రంగంతో బేరీజు వేస్తూ నిస్సహాయతకు గురయ్యే రైతుకథ ‘నిశ్శబ్ద విప్లవం’ తో ప్రారంభమైన జ. ఉమామహేశ్వర్ కథా ప్రయాణం (పరాయోళ్లు కథా సంపుటి) నిలకడగా సాగుతున్నది. వైవిధ్యంగానూ ప్రదర్శితమవుతున్నది. అందుకు భరోసా కథాసంపుటి సాక్షిగా వున్నది.
    ఉమామహేశ్వర్ రాయలసీమ గ్రామీణ మధ్య తరగతి నేపథ్యంలో నుంచి వచ్చిన వాడు. అయితే చదువు, ఉద్యోగం యిచ్చే అనుభవాల రీత్యా కార్పొరేట్ రంగానికి చెందిన వాడుకూడా. రచయితలు తమ సృజనకు తమ గ్రామాన్ని, ప్రాంతాన్ని, తమ యింటినీ, వృత్తినీ వనరులుగా చూస్తారు. ఆలోచనాపరులుగా అందులోని విశేషాలనూ, ప్రత్యేకతను, ఘర్షణలనూ కథలుగా చెప్తారు. ఉమామహేశ్వర్ అందుకు మినహాయింపు కాదు. భరోసా కథాసంపుటి లో పదహైదు కథలున్నాయి. అందులో మానవసంబంధాలను చిత్రించినవీ, మానవ స్వభావాలను చిత్రించినవీ, ఒక సంస్కారవంతమైన మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘటనల్లోంచీ జాలువారే విలువలూ, కార్పొరేట్ కంపెనీల ఆవరణలో సృష్టింపబడే విలువలూ ఆవిష్కరింపబడ్డాయి.
      తెలుగు కథకులు ప్రధానంగా గ్రామీణ విశేషాలను వివరించేవాళ్లే. నగరాల్లో జీవిస్తున్నా నగరీకరణకు గురైవున్నా గ్రామీణ పలవరింతను ఆపుకోలేనివాళ్లే. పునాదులు గ్రామంలో వున్నందున ఉమామహేశ్వర్ కథల్లో గ్రామీణత ఒక విడదీయలేని దినుసు. అయినప్పటికీ  చేసే వృత్తి ప్రభావం వల్ల చాలా కథల్లో కార్పొరేట్ సంస్థల వ్యవహారాలు కూడా కథల్లోకి వచ్చాయి. అట్లా కార్పొరేట్ సంస్థల యితివృత్తాలను అక్కడ జరిగే మానవచర్యల్లోనుంచీ,  స్వభావాలను, జీవిత విలువలనూ కథనం చేస్తాడు. ఇలాంటి  కథలు రాసే అతి తక్కువ కథకులలో ఉమామహేశ్వర్ మేటిగా నిలుస్తాడు. ఈ రీత్యా యీయన కథలు చదవడం తెలుగు పాఠకులకు అరుదైన అనుభవం. అయితే యీ కార్పొరేట్ కథల్లో కూడా గ్రామీణ పాత్రధారులదే ప్రధాన భూమిక. గ్రామీణ స్వభావమూ కార్పొరేట్ నగర స్వభావమనే ద్వంద్వం మధ్యా ఘర్షణగానే కథలు నడుస్తాయి.
       భరోసా కథలో సాయిరాం అనే కార్పొరేట్ కంపెనీలోకి కొత్తగా వచ్చిన యువకుడు, శారద అనే తనపై అధికారిణికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి  యిస్తానని చెప్పి, యితర వొత్తిడుల వల్ల సకాలంలో స్పందించలేక పోతాడు. ఈ కాలపు యువకులంతా బాధ్యతగలవారు కారనీ పైపై మెరుగులతో మైమరపించే వాళ్లేననీ, సాయిరాం తండ్రి తరం వుద్యోగులు కథ ప్రారంభం నుంచి చర్చ చేస్తూ వుంటారు. ఆ నేపథ్యంలో శారదకు యెదురయ్యే అనుభవం కూడా వారి మాటలను నిరూపించేదిగా వుంటూ ఆమెను పనివొత్తడికి  గురిచేస్తుంది. కంపెనీకు వచ్చిన కష్టమర్లకు యేదో తిప్పలుబడీ దగ్గర మార్గాలు వెతికీ పనికానిచ్చేద్దాం అనుకుంటున్న శారదకు ,  చివరి నిమిషంలో సాయిరాం పనితనం తెలిసివస్తుంది. నేరుగా ఆఫీసులో లేకున్నా బయటినుంచే తన యితర పనులలోనుంచే చేయాల్సిన పని చేసి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందించీ, శారద అందరి ప్రశంశలూ పొందేలా చేస్తాడు. కోర్ (మౌళికత) మారనంత వరకూ పెరిఫెరీ (అంచులు) యెంతగా కొత్త పోకడలు తొక్కినా ఫరవాలేదనే తాత్వకతను రచయిత యీ కథలో నొక్కి చెబుతాడు. నేటితరం కూడా నమ్మదగిందేననీ కొన్ని వైఖరులు మారినా,  ప్రమాదకరంగా అగుపించినా,  వ్యవస్థలు వారి చేతుల్లో పదిలమేననీ రచయిత భరోసా యిస్తాడు. ఇదొక పాజిటివ్ దృక్కోణాన్ని  కల్గించే కథ.
      దళారీ పశ్చాత్తాపం, కథ ఉమామహేశ్వర్ ఊహాశాలీనతకు నిదర్శనం. ఈ తరహా వూహాత్మక కథనాలు గతంలో కూడా ‘వాటర్’ కథలో చేసే వున్నాడు. దళారీ పశ్చాత్తాపం, కథ కార్పొరేట్ స్వభావాన్ని, అది తన వుద్యోగులలో రంగరించే యెత్తల్నీజిత్తుల్నీ తద్వారా అములయ్యే మిడిమేళపు కార్యక్రమాలతో అది అందుకోవాలని చూసే లాభాలనూ వ్యంగ్యంగా చెప్పిన కథ. ఈ కథ గ్లోబల్ కు ప్రతిగా లోకల్ యెదిరింపునూ, కార్పొరేట్ ను నిలువరించే గ్రామీణతనూ చిత్రించిన కథగా కూడా చెప్పుకోవచ్చు. కథలో మధ్య తరగతి ప్రజలలో వున్న డొల్ల విలువల ఆధారంగా ఒక కార్పొరేట్ వుద్యోగి రూపొందించిన ఫామిలీ సర్టఫికేషన్, మొత్తం సమాజాన్ని మాయలో ముంచి లాభాలను ఆర్జించాలని చూస్తుంది. అయితే ఆ ప్రక్రియ,  ఒక వూరి రైతు, వుమ్మడికుటుంబపు పెద్ద తన ప్రాథమికమైన జ్ఞానంతో వేసిన ప్రశ్నతో అబాసుపాలవుతుంది. అందులోని డొల్లతనం బట్టబయలౌతుంది. కార్పొరేట్ సేవల వేలంవెర్రిని వెక్కిరించిన కథ యిది.
    నేను నా దేశమును… కథ టైటిల్  నిజానికి’ నేను నా దేశమును ప్రేమించుచున్నాను’అని వుండాలి. ఈ కథ జాతీయభావాన్ని చెప్పిన కథ. అంతర్జాతీయ కార్పోరేట్ భావజాలానికీ , స్థానీయ జాతీయవాదానికీ జరిగే ఘర్షణ యీ కథ. చదువుకునే రోజుల్లో నుంచి  వాసు, సత్యం మిత్రులు. శివాజీ లో వీరున్ని చూసే దేశభక్తి గలవారు. వాసు అంతర్జాతీయ కార్పోరేట్ కంపెనీ వుద్యోగిగా  మారి  భారత దేశంలోని ఒక డిఫెంన్స్ ల్యాబ్ వాడే నిషేధింపబడ్డ పరికరాన్ని కనుగొనడానికి వచ్చినప్పుడు, సదరు ల్యాబ్ లో పనిచేసే సత్యం ఆ అనుభవాన్ని యీ కథగా చెబుతాడు. కథకుడు జాతీయవాదిగా తనిఖీని నిర్వీర్యం చేయడమే కథ. శివాజీ ని ఔరంగజేబ్ చెరనుండీ పండ్లబుట్టలో దాచి తప్పించినట్లు కథకుడి దేశీయ కంపెనీ వాడే డిఫెంన్స్ పరికరాన్ని తనిఖీకి వచ్చిన వాసు తిరిగే వాహనంలోనే (ఈ వాహనం ఆ కంపెనీ ఎండీది. దీనికి జామర్లు వుండి డిటెక్షన్ పరికరాలు యిందులో పనిచేయవు) పెట్టి తనిఖీలో దొరకకుండా చేస్తారు. చివరకు ఆవచ్చిన వాసుకు నీలో దేశభక్తి నశించింది మాలో యింకా వుందని చెప్పి వుడుక్కునేలా  చేస్తాడు కథకుడు.
     పర్యావరణాన్ని కార్పొరేట్ రంగం యెంతగా ధ్వంసం చేస్తోందో చెప్పే కథలు కూడా యీ రచయిత రాసారు.’ మొదటి పిచ్చుక ” హరిత విప్లవం ‘ అలాంటి కథలు. పిచ్చుకల జాతికి సెల్ టవర్లు వదిలే తరంగదైర్ఘ్యాలు ప్రాణాంతకంగా మారిపోయిన కాలంలో, పిచ్చుకను పర్యావరణంలో భాగం చేసుకొని ప్రకృతి సమతౌల్యంగా వుండాలంటే పర్యావరణ విధ్వంసం ఆపాలనీ, అందులో భాగంగానే పిచ్చుకల వంటి అల్పప్రాణులను కాపాడుకోవాలనీ రచయిత భావిస్తాడు. అయితే మొదటి పిచ్చుక కథ ప్రయోగ కథ. పిచ్చుక తన కథను తను చెప్పుకునే కథ. పిచ్చుక( సెల్ టవర్ ఫ్రీక్వెన్సీ) విషపు గాలుల తాకి నశించిపోయే స్థితి నుంచి రోగనిరోధక శక్తిని పెంపొందించుకొని తద్వారా కొత్త శక్తితో బలమైన తరం పిచ్చుకగా మారి తన సంతానాన్ని పెంపొందించుకుంటుంది. సెల్ టవర్ల ఫ్రీక్వెన్సీ యేమీ ప్రభావం వేయని శరీరనిర్మాణాన్ని రూపొందించుకొనే తీరునే కథగా  మలిచాడు  రచయిత.
      కార్పొరేట్ సోషియల్ రెస్పాంసిబులిటీ అనేది కార్పొరేట్ సంస్థలు తమ చేస్తున్న విధ్వంసానికి పాపపరిహారంగా చేసే సామాజిక సేవలు. ఈ సేవలు కూడా చాలా వరకూ పైపైమెరుగులతో చేసేవే యెక్కువ. వీటిలో కూడా ప్రజలకు మేలుకలిగించే వాటికన్నా తమ ప్రయోజలను తీర్చే, రాజ్యాన్ని యిబ్బంది పెట్టని కార్యక్రమాలు మాత్రమే చేపడతారు. ఈ సంక్లిష్ట విషయాన్ని కార్పొరేట్ వాతావరణ సన్నివేశాలు సృష్టించుకొని ఉమామహేశ్వర్ కథగా మలిచాడు. ఇట్లా కార్పొరేట్ ప్రపంచంలోని పాజిటివ్ నెగిటివ్ కోణాలరెంటినీ తన కథల్లోకి తీసుకొచ్చాడు.
    సమాజ చలనాలు – మానవ సంబంధాలు, అనేది బహుముఖీనమైన విషయం. మొత్తం సమాజపు పోకడ, దాంట్లో పొడసూపుతున్న మంచీచెడూ రెండింటినీ బేరీజు వేసి చూపడం రచయిత లోని సమతౌల్యదృష్టికి తార్కాణం. ఉమామహేశ్వర్ యీ తరహా వస్తువును తన అన్ని కథల్లోనూ తడిమే ప్రయత్నం చేస్తాడు. అయితే కొన్ని కథలను ఆ విషయాన్ని ప్రధానంగా ప్రతిపాదించడానికే రాసాడు. ‘మనిషి దేవుడు’, ‘ధర్మామీటర్’, ‘వారసులు’, ‘ఎట్లా బతకబోతాడో’, కథలన్నీ మానవసంబంధాలను, మానవ ఆదర్శాలనూ, రోజువారీ జీవితంలో వాటి ప్రతిఫలనాలనూ చిత్రించడానికే రాసాడు. ‘మనిషి దేవుడు’ కథ ఒక సాధారణ సన్యాసిని మనుషులు అవసరాల కోసం యెలా దేవుడ్ని చేస్తారో చెబుతుంది. ఏ ఆడంబరాలూ యెరుగని నిస్వార్థపరుడికి సకల హంగులూ అమర్చి అతడు ఆచరించిన విలువల్ని భక్తులై తుంగలో తొక్కడం జరుగుతుంది. స్వభావ రీత్యా మనిషి యెంతటి అల్పుడో నిరూపిస్తుంది కథ. మనిషి లోని నెగిటివ్ కోణాన్ని కథగా  మలిచిన యీ రచయితే ‘ధర్మామీటర్’ కథలో సాధారణంగా మనుషులు బలహీనులవైపూ, బాధితులవైపూ నిలబడతారని చెప్పే పాజిటివ్ కథను కూడా రాసాడు. ‘ఎట్టా బతకబోతాడో’ కథ ఒక వ్యక్తిలోని  హేతుబద్ధ, ప్రగతిశీల వైఖరిని, సమాజమైనా, సమాజాన్ని ప్రాతినిధ్యం వహించే అతడి భార్య అయినా ఎంత విచిత్రంగా చూస్తారో చెప్పే కథ. ఆరోగ్యకరమైన ఆలోచనలు అలవడని వ్యవస్థ లోని జనం ఆరోగ్యకరమైన దృక్పథం వున్న వారిని “వూరంతా వొక దారైతే ఉలిపిరి కట్టైది వేరొక దారి” గా చూస్తుందని చెప్పిన కథ. లోకస్వభావం యెదురుగా హేతుబద్ధ వ్యక్తి స్వభావాన్ని నిలబెట్టిన కథ. ఈ కథ కు కొనసాగింపులా అన్పించే కథ ‘వారసులు’. పురోభివృద్ధి కరమైన ఆలోచనలతో, ప్రగతిశీల ఆచరణతో బతుకుతున్న మనిషి ఒక ఆక్సిడెంటై మరణిస్తే, అతని ఆస్తి కోసం కోర్టులకైనా యెక్కి కొట్లాడతాం అనే అతని కొడుకులు, తండ్రిని ఆక్సిడెంట్ చేసి చావుకు కారణమైన వారిపై మాత్రం కేసు పెట్టరు, పైగా వారితో రాజీపడతారు. ఒకరి వారసత్వం వుండేది అతడి ఆస్తిని పొందడంలోనా అతడి ఆశయాలను గౌరవించడం లోనా అనే ఎరుకను కల్గిస్తాడు కథకుడు. ఈ కథలన్నింటిలో వాస్తవలోక విలువలను, వాటి డొల్లతనాన్ని యెత్తిచూపుతూ విమర్శించడమూ వుంది, ప్రత్యామ్నాయ ఆచరణ యెలా వుంటుందో చూపడమూ వుంది.
       స్వభావ రీత్యా పిల్లల్లోని కల్ముషంలేనితనాన్ని చిత్రించిన కథలు యీ సంపుటిలో రెండున్నాయి. ‘గోకులన్న’, ‘వైట్ బోర్డు ‘ కథల్లో పిల్లల నిర్మలమైన ప్రవర్తన హృద్యంగా చిత్రింపబడివుంది. ఇళ్లు – పిల్లల పెంపకం అనే క్రియాత్మకత గురించి ఆలోచనాపరుడిగా ఉమామహేశ్వర్ చేసే ఆరోగ్యకరమైన ప్రతిపాదనలు యీ కథల్లో మనం గ్రహించవచ్చు. ఈ రెండు కథలనేగాదు యీ సంపుటిలోని భరోసా, వీడెట్టా బతకబోతాడో తదితర కథల్లో, ఇంట్లో స్నేహ  వాతావరణం వుండటం, కథలు చెప్పే తండ్రులూ తల్లులూ వుండటం, పిల్లల మనసెరిగి ప్రవర్తించే పెద్దలు కన్పించడం, పిల్లల యెదుగుదలలో యివన్నీ గణనీయమైన పాత్ర పోషిస్తాయనే ఎరుక రచయితకు కలదని చెప్పడానికి వుదాహరణలు. ఇదంతా పిల్లల ఆరోగ్యకరమైన యెదుగుదలకు సంబంధించిన  కోణం. దీనికి భిన్నమైన మఖం ‘క్విజ్ మాస్టర్’ కథ. పిల్లల్లో యెలాగైనా గెలవాలి అనే తత్వం పెరిగిపోతున్నదనీ, గెలవడమే ముఖ్యం అనే ధ్యాసలో విలువలతో గెలవాలనే సత్యం మరుగునపడిపోయిందనీ, అదే సామాజిక జీవితంలోనూ ప్రతిఫలిస్తున్నదనీ ‘క్విజ్ మాస్టర్’ కథ చెబుతుంది.
      మానవసంబంధాల చిత్రణలో భాగంగా వృద్ధాప్యాన్నీ, తల్లి – కొడుకు, తండ్రి – కొడుకు సంబంధాలను ఉమామహేశ్వర్ చాలా కథల్లో చిత్రించాడు. ప్రధాన యితివృత్తంతో  నిమిత్తం లేకుండానూ, ఒక్కోసారి అదే ప్రధాన యితివృత్తంగానూ యీ సంబంధాలలోని రాగధ్వేషాలనూ, ఎత్తుపల్లాలనూ మానవీయకోణం నుంచి చిత్రించడం యీ రచయిత కొత్త  శైలిగా అగుపిస్తుంది. దాన్ని చందమామ రావే అనే ప్రయోగాత్మక కథలో చూడవచ్చు.
       సంక్లిష్టమైన విషయాలను కథలుగా మలచడానికి ఉమామహేశ్వర్ సదా ప్రయత్నిస్తున్నాడు. సాధారణ కథకులు రాసే సాదాసీదా కథలు కాకుండా పైస్థాయి కథనాన్ని చేపడుతూవుంటాడు. ఎక్కువమందికి తెలియని రంగాల్లోనూ, సంఘటనల్లోనూ కథలు వూహిస్తాడు.  ఒక దృగ్విషయానికున్న రెండు విరుధ్ధ కోణాలను కథలుగా మలుస్తాడు. ఇదంతా ఉమామహేశ్వర్ బలానికి సంబంధించినది. ఇదే ఉమామహేశ్వర్ లో ఒక మితవాదకోణం కూడా వుంది. హిందూ జాతీయవాద ప్రతీకలను తన కథల్లో అవసరం వున్నా లేకున్నా వాడటం ఆ ప్రభావం వల్లే. భరోసా కథ అమరికలో యిమడని ఆవు(సత్యవాక్య పరిపాలన కోసం బిడ్డను వదలి పులికి ఆహారంగా వెళ్లే, పుణ్యకోటి) కథను కథ ఆఖర్లో కథనం చేసి యేం ప్రయోజనం సాధించాడో రచయితగా బేరీజు వేసుకోవాల్సిన అవసరం వుంది. నిజానికి భరోసా కథ శారద ఆఫీసు అనుభవంతోనే ముగిసింది. నేటి యువత వ్యవస్థ కు భరోసా పడగలరని పాఠకులకు అప్పటికే విదితమైవుంటుంది. ముగిసిపోయిన కథను తన మితవాద బలహీనత కారణంగా తిరిగి అనవసర కథనం చేసాడు రచయిత.
    దళారీ పశ్చాత్తాపం కథలో ఆధునిక కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యూహాలను యెదిరించడానికి ఉమామహేశ్వర్ భారతీయ సనాతన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పెద్దను ముందుకు తీసుకువస్తాడు. ఇప్పటికే ఆచరణ రూపంగా విఫలమై కనుమరుగైపోయిన ఉమ్మడికుటుంబ వ్యవస్థ పై యీ రచయితకు అంత నమ్మకమెందుకో అర్థం కాదు. లేదూ యీయనకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే కార్పొరేట్ వ్యవస్థలలోని దుర్మార్గబలం అర్థం కాలేదా ? ఇదే ఆధునికత తన మొదటి అడుగు లోనే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ను బధ్ధలు చేసేవుందికదా. అది గమనించకుండా తిరిగి ఓడిపోయిన యోధున్ని శతృవు ముందు నిలపడం అవగాహన రీత్యా లోపం.  ఆధునికతను ఆధునికతతోనే యెదుర్కోవాలనే కనీసపు ఎరుకను తనలోని మితవాదకోణం మింగేసిందనిపిస్తుంది.
      వారసులు కథ,  నిజమైన వారసత్వం ఆస్తులు పొందడం కాదు,గౌరవించడం మాత్రమే అనే లిమిటేషన్ కు గురైంది. నిజానికి ఆశయాలను కొనసాగించడం వారసత్వమనే సత్యాన్ని రచయిత సూచించలేకపోయాడు. కథలో జయరాం పిల్లలు ఆస్తులు పంచుకొని అమెరికా వెళ్లిపోతే, జయరాం అనుయాయి అయిన ఆజం జయరాం ను ఆక్సిడెంట్ కు గురిచేసిన వారిపై పోలీసుకేసు వేయడంతో, రచయిత వాచ్యంగా ఆస్తుల వారసులు వేరు, ఆశయాల వారసులు
 వేరు, అంటూ కథ ముగిస్తాడు గానీ, ఆ ఆజం అనే అనుయాయితో జయరాం చేపట్టాలనుకున్న ప్రజాహిత వాజ్యాలను కొనసాగించినట్టు చిత్రించి కథ ముగించి వుంటే బాగుండేది. నిజానికి ఆక్సిడెంట్ చేసింది యే  నేరభావన లేని యువకులు. వారి మీద కేసు నమోదు చేయడం జయరాం ఆశయాలను కొనసాగించినట్లైతే కాదు.
        ఇక జలపాఠాలు పేరుతో ఉమామహేశ్వర్ రాసిన కథ, రాయలసీమ రచయితగా ఉమామహేశ్వర్ రాయకుండా వుండాల్సిన కథ. కృష్ణా నది ఒక రోజు వున్నదున్నట్టుగా మాయమైపోతుంది. అంతర్థానమైన సరస్వతీ నది చెంతచేరి, తానెందుకు మాయమైందో వెల్లబోసుకుంటుంది.  మనుషులు నీటి పంపకాల నిమిత్తమై తగువులాడుతున్నారనీ, హింసకు పాలపడుతున్నారనీ, బతకడానికి తనను వుపయోగించుకోకుండా కీచులాటలకు గురిచేస్తున్నారని అందుకే వున్నదున్నట్టుగా మాయమైపోయానంటుంది.మనుషుల కీచులాటలకు కినుక వహించిన కృష్ణ కు, ఆ కీచులాటలకు కారణమెవరన్నది తెలియదా. ఎవరు తనను అన్యాయంగా యెక్కువగా దోచుకుంటూ యెవరికీ ద్రోహం చేస్తున్నారో తెలసీ మాయమైపోవాలనే నిర్ణయం తీసుకుందా. లేదా యివన్నీ రచయితకే తెలియవా. తరతరాలుగా అన్యాయం చేయించుకున్న తెలంగాణ, రాయలసీమల పట్ల వుండాల్సిన ప్రజాస్వామిక అవగాహన రీత్యా ఉమామహేశ్వర్ యీ కథను యింకో రూపంలో రాయాల్సివున్నింది. రాయలసీమ వుద్యమం పదునెక్కుతున్న సందర్భంలో కృష్ణానది సిధ్ధేశ్వరం వద్ద ఆగిపోయివుండాల్సింది. ఆరీత్యా తెలంగాణ, రాయలసీమలకు కృష్ణా నది కల్పనలోనన్నా న్యాయం చేసివుండవచ్చు. ఈ కథలో రచయితను పురికొల్పిన అంశం సరస్వతి నదీ,అంతర్థానమై వుంది అనే హిందూత్వ భావన. ఈ భావనను నది దిశను మార్చుకోవడమనే భావనగా కల్పన చేసుంటే పరాయోళ్లు లాంటి కథ రాసిన ఉమామహేశ్వర్ మరింత పదునుగా, మెరుపుగా నిలబడివుండేవాడు.
       రచయితలు తాము నడయాడే సమాజానికి సాంస్కృతిక ప్రతినిధులు. అదే వ్యక్తులు రచయితలుగా వుధ్భవించడానికి కూడా వారు యెదిగివచ్చిన సంస్కృతే కారణం. వ్యక్తి నిర్మాణంలో దోహదపడే సాంస్కృతిక అంశాలు తమను తాము పునర్ సృష్టి / నవపునర్ సృష్టిగా మారుతూ వుంటాయి. ఈ సాంస్కృతిక వలయంలో వ్యక్తి రచయితగా, రచయిత వ్యక్తిగా కలగలిసిన వుంటాడు. రచయిత ఒక సాంస్కృతిక కార్యకర్తగా సజీవమైన సాంస్కృతిక అంశాలనూ, సాంప్రదాయాలనూ ముందు తరాల వారికి అందించే వాహిక కూడా. ఉమామహేశ్వర్ లో కానీ మరేయితర రచయిత లో కానీ, ఆధునికత తాలూకూ పరికరాలు వారి వారి సృజనలో ప్రధాన పాత్ర పోషిస్తూనే, అంతర్లీనంగా సనాతన సాంస్కృతిక అంశాలు వేటినుండీ అయితే వారు రూపొందివుంటారో అవి కూడా సృజనకు పునాదులు ఏర్పరుస్తూ వుంటాయి. వ్యక్తిని నడిపించే పురాతన ప్రతీకలూ,  వ్యక్తి నడిచే ఆధునిక రాస్తా, రెండింటి సమన్వయమే, వాళ్ళు సృష్టించే అధ్భత సాహిత్యంగా నిలబడుతుంది. ఉమామహేశ్వర్ యీ సమన్వయాన్ని సాధించగలడని యిప్పటికే నిరూపితమైవుంది. ఇక ముందు కూడా మరింత జాగ్రత్తగా యిదే సమన్వయాన్ని సాధించి, సృజనకు కేంద్ర బిందువు అవుతాడని ఆశించవచ్చు. తెలుగు ఆధునిక సాహిత్యంలో ‘భరోసా’ గా నిలబడతాడని నమ్మవచ్చు.
*

వెంకట కృష్ణ

ఇంటర్మీడియట్ చదివే రోజులనుండి కవిత్వం రాస్తున్నా.నా తరం అందరిలాగే శ్రీశ్రీ ప్రభావం నామీదుంది.అయితే పుస్తకాలు చదివే అలవాటు వల్ల రా.వి.శాస్త్రి రుక్కులూ, రంగనాయకమ్మ బలిపీఠం హైస్కూల్ దినాలకే చదివున్నాను.యండమూరీ,చందూసోంబాబు,తదితర కమర్షియల్ సాహిత్యం కూడా ఇంటర్ రోజుల్లో విపరీతంగా చదివున్నా సీరియస్ తెలుగు సాహిత్యం తోనే నా ప్రయాణం కొనసాగింది.1994 నవంబర్ నెలలో మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రికలో అచ్చైంది . అప్పటిదాకా రాసుకున్న అచ్చు కాని కవిత్వాన్ని 2000 సంవత్సరం లో లో గొంతుక గా నా మొదటి కవితా సంపుటి.1994నుండీ 2000 దాకా నెమ్మదిగా రాసాను.2000 తర్వాత రెగ్యులర్ గా రాస్తున్నా.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు