జీవనానుభవ కవితాసారం ‘వృద్ధోపనిషత్’

వృద్ధులకు భరోసానిచ్చే అక్షరోపనిషత్ ఈ ‘వృద్ధోపనిషత్’.

ధునిక తెలుగు కవిత్వంలో విలక్షణమైన, విశిష్టమైన కవి డా. ఎన్. గోపి. మానవ సంబంధాలను ఉత్తమోత్తమ కవితలుగా మలచటంలో సిద్ధహస్తుడు. జీవితచిత్రాన్ని సజీవంగా ప్రతిఫలింపజేసే సహజకవి. నిరంతర చలనశీల కవి. ఐదు దశాబ్దాలుగా కవితాసేద్యం చేస్తూ అక్షరలక్షలను పండిస్తున్నారు. వారి సరికొత్త కవితాసంపుటి ‘వృద్ధోపనిషత్’.

డా. ఎన్. గోపి ఈ కవితాసంపుటి భూమికలో “వృద్ధాప్యం చాలా విలువైనదని, అది జీవన సారాంశ దశ” అని అంటారు. అలాగే “వృద్ధుడంటే జ్ఞానవృద్ధికి తోడ్పడుతూ మార్గదర్శనం చేసేవాడని” అంటారు. వృద్ధాప్యం యొక్క చింతనను చిత్రిస్తూనే, యువతరం వృద్ధులను కొంతైనా అర్థం చేసుకోవాలనే గాఢ ఆకాంక్షతో ఈ సంపుటిని లోకానికి అందించారు. ఆ పనిలో కృతకృత్యులయ్యారనే చెప్పొచ్చు. 30 సం. లోపు యువకుడికి ఈ పుస్తకాన్ని కానుక చేసినప్పుడు, చదివిన ఆ సోదరుడు ‘నిత్యం మననం చేసుకోవాల్సిన మానవీయ పుస్తకాల్లో ఇదొక్కటి’ అన్న ప్రతిస్పందన ఈ సంపుటికి లభించిన గొప్ప కితాబుల్లో ఒకటిగా పరిగణించొచ్చు. ఈ సంపుటికి ఆదివాక్యం “వృద్ధుడంటే ముసలివాడు కాడు వృద్ధి పొందినవాడని”. ఇది కూడా కవి చెప్పినట్లే విశ్వజనీన భావం. ఈ మధ్యనే విడుదలైన ఒక ఆంగ్ల చలనచిత్రం ముగింపులో తాత పాత్ర తన మనవడితో ఇదే భావాన్ని పలుకుతాడు. ఎక్కడి అమెరికాలోని ఆంగ్ల చిత్రం, ఎక్కడి హైదరాబాద్‌లోని కవి వాక్యం. ఆ వృద్ధి వయసులోనే కాదు సమస్త జీవనపార్శ్వాల్లో అన్న విషయాన్ని విశ్వాసంగా, వృద్ధులకు ఆత్మవిశ్వాసం కలిగించేలా నాందీవాక్యాలు పలికాడు కవి ఈ సంపుటిలో.

పాశ్చాత్య సంస్కృతి రాజ్యమేలుతున్న దేశాలలో వృద్ధులకి, వారి సంతానానికి అనుబంధ బాంధవ్యాలు తూర్పు దేశాలతో పోలిస్తే తక్కువే అని చెప్పొచ్చు. అక్కడి వృద్ధులు ఉంటే ఒంటరిగానో లేక వృద్ధాశ్రమాల్లోనో ఉంటారు. అది దాదాపుగా వారి జీవనసంస్కృతిలో భాగమైపోయింది. అయినా ఆదరణ, ఆసరా ఆశించని వృద్ధ మానవుడు ఏ దేశంలోనైనా ఉండడని చెప్పలేము. ఒకప్పుడు సమాజంలో ఉమ్మడి కుటుంబాలు విలసిల్లుతున్న రోజుల్లో వృద్ధుల జీవనవిధానం చాలా బాగుండేది. భారత్ లాంటి దేశంలో కూడా వివిధ సామాజిక, ఆర్థిక కారణాల వల్ల ఉమ్మడి కుటుంబాలు మృగ్యమయ్యాయి. ఒంటరితనానికి లోనయ్యే వృద్ధులకు చేయూత అవసరమయ్యింది. అలాంటి అక్షర చేయూతనిచ్చే కవితా ఊతమే ఈ ‘వృద్ధోపనిషత్’. కవి మొదటి కవితలోనే పఠితలందరికి సూచనలు చేశాడు. ఆ సూచనాలోచనాలతోనే ఈ సంపుటిని చదివించేలా చేశాడు. సంపుటి ప్రారంభంలో వృద్ధుల ప్రాభవాన్ని చెబుతూ ముగింపులో ఆ వృద్ధులను తలుచుకుంటూ, గౌరవిస్తూ, ఆదరిద్దామని సూచన చేశాడు.

ఇక సంపుటి శీర్షిక ‘వృద్ధోపనిషత్‌’కి తగ్గట్టుగానే ఉపనిషత్ వాక్యాల్లాంటి ఎన్నో ఉపదేశాలను అన్యాపదేశంగా మనమిందులో చూడొచ్చు. వృద్ధుడంటే “అనుభవాల దారంతో/త్రికాలాలకు వేసిన ముడిలాంటివాడు/కాలానికి తలొగ్గని/సూక్తిముక్తావళి లాంటివాడు” అన్నప్పుడు వృద్ధులపట్ల కృతజ్ఞతాభావం పాఠకుడి మనసులో కలగకమానదు. ఒక కన్నీటిచుక్క యేరులై, నదులై, సముద్రమై పొంగిపొర్లటమే ఒంటరితనమని గంభీరమైన, బాధాతప్తమైన నిర్వచనాన్నిస్తూనే ఆ ఒంటరితనం వృద్ధాప్యానికి పూచే పిచ్చిపువ్వని అంటాడు కవి. “తాగడానికి నీళ్ళడిగిన వృద్ధుడి చెంబు ఆఖరికి అతని కన్నీళ్ళతోనే నిండిదంటూ” కవి వృద్ధులని పట్టించుకోని సమాజాన్ని ఏకరువు పెట్టిన వైనం హృదయాన్ని కలిచివేస్తుంది. “వృద్ధులకు ఎంతసేపూ జ్ఞాపకాలే, వినడానికి శ్రోతలుండరు. వారి మాటలకు రావాల్సిన జవాబులు రావు, వారి మాటల్లో కొన్ని చెల్లని నాణాలవుతాయి” ఇలా ఒక్కొక్క పంక్తిని ఆర్ద్రంగా పాఠకుడి గుండెకు ముడేస్తాడు కవి. వృద్ధుల వేదనాభరితమైన అవస్థను చెప్పడంతోనే ఆగిపోకుండా, వృద్ధాప్యంతో పేచీపడకుండ దాన్ని స్నేహంగా ఆహ్వానించమని జీవన తాత్వికతని, జీవిత సత్యాన్నీ బోధిస్తాడు.

వృద్ధాప్యపు అవస్థను, వృద్ధాప్యాన్ని స్వాగతించాల్సిన తీరుని కవిత్వం చేయడంతో ఆగిపోలేదు కవి. అవసరమైనప్పుడు ఆ వృద్ధులను ఆదరించి అక్కున చేర్చుకోవాల్సిన యువతరం, ఆ పని చేయనప్పుడు వారి మీద పెన్నెర్ర చేయగలడు. పదునైన మాటల్ని గుండెలో గుచ్చగలడు.

“నిన్ను కనడం

యాక్సిడెంటే కావచ్చు

తార్కికంగా

నీ ప్రమేయం అసలే లేకపోవచ్చు

ఏ జీవక్షణాల్లో

నిన్ను కడుపులో వేసుకుందో

ఇప్పుడనుభవిస్తున్నది

కాని

రేపటి అపరాధభావం

నిన్ను మెలిపెడుతుంటే మాత్రం

ఓదార్చడానికి ఆమె ఉండదు”

వయసు పెరిగేకొద్ది వ్యక్తిలో పరిణతి, హుందాతనం పెరుగుతుంది. అంతేకాదు అనుభవాల, జ్ఞాపకాలను మైలురాళ్ళుగా నాటి తరువాతి తరానికి దిక్సూచిగా చేస్తారు. ఈ విషయాలన్నీ తెలిసిన కవి కాబట్టే వృద్ధాప్యాన్ని అందంగా “శేషజీవితం కాదది, అశేష అనుభూతుల నిధి” అంటాడు. “గమ్యం కాదది, విలువైన మజిలీ” అంటాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క కవితకి ఎంతో వ్యాఖ్యానం చేస్తూ వెళ్ళొచ్చు. ఒక దగ్గర కవి అంటాడు మా ఇంట్లో/ ఏ భరిణ మూత తీసినా/గుప్పుమనే అనుభూతుల క్షణికలు”. అదే విధంగా ఈ సంపుటిలో ఏ కవిత ముట్టుకున్నా జీవితసారపు తడి చేతికందుతుంది.

కేవలం వృద్ధాప్యాన్నే వస్తువుగా తీసుకున్న సంపుటిగా అనిపించినా సందర్భం వచ్చినప్పుడల్లా కౌమార, యవ్వన, వృద్ధాప్యాలను వివిధ ఉపమానాలతో కవిత్వీకరిస్తూ ఏ దశకాదశ గొప్పదే అన్నట్లు చూపెడుతూ…వృద్ధాప్యాన్ని స్వాగతించాల్సిన తీరును, ఆవశ్యకతను, అనుభవించాల్సిన, ఆనందించాల్సిన రీతిని చెప్పటం ఈ సంపుటి ప్రత్యేకత. అందుకే వృద్ధాప్యంలో అలసట కనిపించినా తేజస్సు తగ్గకుండా కొత్త వంతెనలు నిర్మిస్తూ మనుష్యుల్ని కలపాలి అంటాడు కవి.

కవిత్వాన్నే ఒక వస్తువుగా స్వీకరిస్తూ విరివిగా కవితలు రాసే డా. ఎన్. గోపి ఈ సంపుటిలోనూ ఆ కవితాసంప్రదాయాన్ని వదల్లేదు. పైగా వృద్ధాప్యాన్ని జీవనసాఫల్యదశగా అభివర్ణిస్తూ తన కవిత్వాన్ని కీర్తిమంతం చేశారు. శాశ్వతత్వం చేశారు. వారి కవిత్వప్రయాణంలో మైలురాయిగా నిలిచిపోయే కవిత్వ సంపుటి ‘వృద్ధోపనిషత్’. జీవనగమనంలో యువతకో దారి కాగడా ఈ ‘వృద్ధోపనిషత్’. వృద్ధులకు భరోసానిచ్చే అక్షరోపనిషత్ ఈ ‘వృద్ధోపనిషత్’.

*

 

రాపోలు సీతారామరాజు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు