ఈ కవిత్వమొక దృశ్యకావ్యం..!

విత్వానికి కల్పనల రంగులద్ది, సృజనాత్మకతో, బాధలో, కన్నీళ్ళో రాయడం ఈ తరం కవులకు కొత్తేం కాదు. సంక్లిష్టతల్ని సందిగ్థతల్ని లోతైన దృష్టితో గొప్ప కవిత్వంగా నిర్మించడం చూస్తుంటాం. కొడవటిగంటి కుటుంబరావు గారన్నట్టు జీవితంలో ఉండే కష్టనష్టాల్ని కొంతసేపైనా మరచిపోయేటట్టు చేయగలదే సాహిత్యం. తెలుగు సాహిత్యం అలా చేయగలుగుతుందా! చేసిందనే కవులున్నారు..ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదనేవాళ్ళూ ఉన్నారు. అలాగని తెలుగు కవిత్వాన్ని తక్కువ అంచనా వేస్తున్నట్లు కాదు.
నిరంతరం కవిత్వాన్ని చదువుతున్న క్రమంలో భాగంగా ఇటీవల బాగా ఆకర్షించి ఆలోచింపజేసిన కవిత్వం ఇరానియన్‌ కవి అబ్బాస్‌ కియారొస్తమి కవితలు. ప్రేమలేఖ ప్రచురణ వారు ఆయన కవితల్ని సెలెక్టెడ్‌ పోయమ్స్‌ అని తెచ్చారు. ఈ కవిత్వం చదివాక ఈ కవి కవితలేవి కూడా నాన్‌ సెలెక్టెడ్‌ పోయమ్స్‌ ఉండే అవకాశమే లేదనిపించింది. ఎందుకలా చెప్పాల్సి వస్తుందంటే అబ్బాస్‌ రాసిన ప్రతీ కవితా వాక్యం దృశ్యమై మనకళ్ళముందు  వాస్తవజీవితాన్ని పచ్చగా పరుస్తుంది. అబ్బాస్‌ కియారొస్తమి లఘుచిత్రాల నిర్మాణంలో ఫోటోగ్రఫీలలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వ్యక్తి. ఆధునిక లఘునాటికల్లో ఆయా పాత్రలకు ప్రాణంపోసి దృశీకరిస్తారు. అతడి ఫోటోగ్రఫీ నైపుణ్యం దృశ్యీకరణ సజీవంగా ఉంటుంది. అతడి కవిత్వమూ అంతే..
నాఖననం
కలగన్నాను
రాలుటాకుల కింద
మొలకెత్తుతుంది నా దేహం.
ఎలా కలగన్నాడిలా. ఎలా కలగంటాడిలా..! తన మానసిక స్థితి ఏంటి..? ఇతడి జీవితం ఎన్ని పార్శ్వాలుగా   ప్రయాణం కట్టింది. సత్యాన్ని మాత్రమే అన్వేషించడం, వాస్తవాన్ని మాత్రమే జీర్ణం చేసుకోవడం ఈయనకు మాత్రమే సాధ్యమనిపించింది. అబ్బాస్‌ రాసిన ఏ కవితా వాక్యం చదివినా కంటి రెటీనాపై వొక రేఖాచిత్రం రూపుదిద్దుకుంటుంది. అబ్బాస్‌ కియారొస్తమి నాలుగు దశాబ్దాల కెరీర్‌లో వాస్తవికత, కల్పనల ను ప్రయోగాలు చేయడంలో పేరొందిన ఇరానియన్‌ చిత్రనిర్మాత.టెహ్రన్‌ విశ్వవిద్యాలయంలో పెయింటింగ్‌ మరియు గ్రాఫిక్‌ కళలను అభ్యసించారు.పోస్టర్‌ల రూపకల్పన, పిల్లల పుస్తకాలను కళాత్మక దృశ్యకావ్యాలుగా తీర్చిదిద్దడంలో దిట్ట. ప్రకటనలు అలాగే చలనచిత్ర క్రెడిట్‌ సన్నివేశాలకు దర్శకత్వం వహించడం వంటివి చేశారు. గొప్ప సృజనాత్మక నైపుణ్యంగల వ్యక్తి అబ్బాస్‌. ఇరాన్‌ టెలివిజన్‌ రంగంలో దాదాపు 150 ప్రకటనలు ఎంతో కళాత్మకంగా నిర్మంచిన అబ్మాస్‌ అంతే కళాత్మకంగా, సృజనాత్మకంగా కవిత్వాన్ని అంతే గొప్పగా రాశారు.
పగలు తెల్లన
రాత్రి నల్లన
నడిమంతా
బూడిదలాంటి వేదన..
సహజంగా చెబుతున్నట్టే వున్నా చాలా తాత్వికతతో కూడిన జీవనచిత్రం కనబడుతుంది
అబ్బాస్‌ రాసిన కవితల్ని కరీం ఎమామీ, అహ్మద్‌ కరీమీ హక్కర్‌, మైఖేల్‌ బేర్డ్‌ ఆంగ్లీకరించారు. వీటిని అనంతు చింతలపల్లి తెలుగులోకి అనువదించారు. అబ్బాస్‌ కవిత్వాన్ని ఇలా పరిచయం చేసి గొప్పపనే చేశారు. అబ్బాస్‌ అన్నట్లు.. పోయింది దొరికింది, దొరికింది పోయింది అని..ఇలా అబ్బాస్‌ కవిత్వం మనకు దొరకడం  యాదృచ్చికమైతే కాదు.
దిష్టిబొమ్మ నీడన
అలసిన రైతు
నిద్రపోయాడు..
-అని అంటూనే..
దిష్టిబొమ్మ ముఖం నుంచి
చెమట చుక్క రాలిపడి
అలసిన రైతుకు నిద్రచెడింది.
జీవంలేని దిష్టబొమ్మ నీడన అలసిపోయి రైతు నిద్రించడం, అదే జీవంలేని దిష్టబొమ్మ ముఖం నుంచి చెమటచుక్కలు రాలిపడటం వల్ల అలసి సొలసి నిద్రిస్తున్న రైతుకు నిద్రాభంగం అవ్వడం.. ఈ కవితకు అక్షరాల ఊపిరిలూది ప్రాణం పోస్తాడీ కవి. ఈ కవిత చదువుతుంటే ఏదేను వనములో ఆదాము అవ్వలను నిర్మించినట్లనిపించింది. అక్కడ మట్టిబొమ్మకు ఊపిరి ఊది ప్రాణం పోస్తే..ఇక్కడ అబ్బాస్‌ తన కవితకు ప్రాణం పోశాడు. కవితా వస్తువులో శిల్పంలో కవితాఎత్తుగడలలో గాఢతగా వొక కవితా వాక్యంలో వొకే వొక కవితావాక్యంలో చెప్పడం అబ్బాస్‌కే సాధ్యం.గాఢతగా అంతర్లీనార్థంగా..తాత్వికంగా కవిత్వం రాస్తాడీకవి.
చెబితే మీరు నమ్మరు
నేను ఫోటో తీస్తుంటే
ఓ చెట్టు సిగ్గుమొగ్గయ్యింది
కెంపుగా…
మానవుడు అనేక ప్రకృతి ప్రేరణలకు లోనవుతుంటాడని, దాన్ని కవిత్వకరించే క్రమంలో ప్రేరణలతో సంతృప్తి చెందుతాడని కొకు గారంటారు.చాలా సహజంగా చెబుతున్నట్లే ఉన్నా గాఢతగా కవిత్వం పురుడుబోసుకుంటుంది.
కవిత్వం మనిషిని చైతన్యవంతునిగా తీర్చిదిద్ధి సమాజాన్ని పది తరాలు ప్రగతి పథం వైపు నడిపిస్తుంది. ఆలోచింపజేసేలా అతి సామాన్యమైన పదాలతో  కవిత్వం రాయడం ఈయనకు తెలిసినంతగా మరెవరికి తెలీదనిపిస్తుంది.
కవులుండాల్సింది పాలకుల పక్షాన కాదు..ప్రజల పక్షాన నిల్చుని ప్రజాగొంతుకైతేనే ప్రజాస్వామ్యం ఫడరవిల్లుతుంది. కాని ఇవాళ కవులు రెండుగా చీలిపోయారు. పాలకవర్గకవులు, ప్రజా కవులు. ప్రజాకవులెప్పటికీ  ప్రతిపక్షపాత్రపోషిస్తూనే ఉంటారు. రాజ్యాన్ని ప్రశ్నించలేరు. రాజ్యం వేస్తున్న సన్మాన, సత్కార,పురస్కారాలనబడే బిస్కట్లకు అర్రులు చాస్తుంటారు. రాజ్యం చేసే ఏ దుర్నీతిని ప్రశ్నించలేరు. ఈ కవి ఎంత సున్నితంగా  ఒక్కమాటలోనే ఎలా చెబుతాడో చూడండి.
అతను
అధికారం చేపట్టగానే
కరుణ
ఆవిరైంది.
అబ్బాస్‌ కవిత్వం ఎవరు చదివినా ఆ చదివే  పాఠకుడిలో లేదా ఆ వ్యక్తిలో సాంఘిక, సామాజిక భావాల్ని పెంచుతుంది. ప్రజాస్వామ్యానికి, సామ్యవాదానికి అండగా నిలుస్తుంది. పౌరులను నాగరికులుగా చేసి వారిలో పౌరసత్వ అవగాహన, క్రమశిక్షణ, శాసన పరత్వాన్ని, దేశభక్తిని, దేశీయతను పెంచుతుంది. మానవ విలువలకు సమతా భావాలకు దోహదం చేస్తుంది. భావ వ్యక్తి స్థాయిని పెంచుతుంది. వినయానికి, వికాసానికి, దోహదం చేస్తుంది. ప్రతిభావంతుల్ని మరింత ప్రతిభావంతులుగా, వినయవంతులుగా వికాసవంతులుగా చేస్తుంది. ఇవన్నీ అలా ఉంచితే మనసును చిటికెన వ్రేలు పట్టుకుని అల్లంత దూరాన నున్న కవిత్వసంధ్రం తీరాన వాక్యాల అలల్ని తాకుతూ శిల్పరేణువులతో విన్యాసం చేస్తుంది.
అబ్బాస్‌ కియారొస్తమీ రాసిన ప్రతీ కవితా వాక్యం మనసును పరవశింపజేస్తుంది. ఆలోచింపజేస్తుంది. కవిత్వమంటే ఆకలి మంటలొక్కటే కాదు..ఆవేదనా తరంగాలే కాదు..రంగురంగుల సీతాకోక చిలుకలొక్కటే కాదు..పచ్చటిపైళ్ళు పారే నదులు, ఎగసిపడే జలాపాతాలే కాదు..రివ్వున ఎగురుతున్న తుమ్మెదలే కాదు..కవిత్వమంటే నువ్వూ నేనూలే కాదు….ఇలా ఈ చరాచరజగత్తులోనున్న ప్రతీది కవిత్వమే..ప్రతీ దాన్ని కవిత్వం చేశాడీ కవి. ఆయన రాసిన కొన్ని కవితా వాక్యాలు చూద్దాం.
ఏడ్చేందుకూ చోటు లేనపుడుమటుకు
నాకు ఏడుపు ముంచుకొస్తుందిబొగ్గుగని కూలింది
తెల్ల సీతాకోకా రాలింది
వందల్లో..సమాధి తవ్వడం మధ్యలో ఆపేసాడు కాటికాపరి
తిండి తిందామనిఒక రహస్యం వొదిగుంది
నీకూ నాకూ జాబిలికీ మధ్యన.ఈ వేదనకు అంతు ఉండాలే
లేదా నాకయినా!

నేనొక చరిత్ర పుస్తకం చదువుతున్నాను
భూమి కంపించింది పేజీ తిప్పుడులలో..

గత కొంతకాలంగా
నేను అడ్డదిడ్డంగా నవ్వుతున్నాను
కొలతలు వేసుకోకుండా ప్రేమిస్తున్నాను
లెక్కలేసుకోకుండా బతికేస్తున్నాను.

అబ్బాస్‌ కియారొస్తమి కవిత్వం చదువుతుంటే వొక దృశ్యం కనబడుతుంది. ఒక జీవితం కనబడుతుంది. రంగురంగుల సీతాకోకచిలుకల్లాంటి బతుకులు కనబడ్తాయి.అతడు ఎంత గొప్ప దర్శకుడో అంత గొప్ప ఫోటో గ్రాఫర్‌. అందుకే..అకిరా కురొసావా అనే జపాన్‌ సుప్రసిద్ద దర్శకుడు ఆయననుద్దేశించిలా అంటాడు.

‘‘నేను అమితంగా ఇష్టపడే సినిమా దర్శకుడు సత్యజిత్‌ రే ఈ లోకాన్ని వదిలి వెళ్ళినపుడు నేను బాగా కలత చెందాను, కాని అబ్బాస్‌ కియారొస్తమి సినిమాలు చూశాక, సత్యజిత్‌ రే లేని వెలితిని పూడ్చగలిగే మరో దర్శకుడిని మనకిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపాను.’’ అంటాడు. సినిమా చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన, ముఖ్యమైన సినీ దర్శకుల్లో ఒకరుగా పేరొందిన దర్శకులు అకిరా కురొసావా.  రూమీ, సాదీ, హాఫిజ్‌, ఖయ్యూంలాంటి మహాకవులు నడియాడిన నేల కవన వారసత్వం అబ్బాస్‌ కియారొస్తమిది అంటూ ప్రేమలేఖ  ప్రచురణకర్తలంటారు. వొక్క మాటలో వొక్క ఫ్రేమ్ లో జీవితాన్ని కవిత్వంగా చెప్పడం అరుదు.. ఒక కవికి ఇంతకంటే ఏంకావాలి.
*

కెంగార మోహన్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు