బర్మా కేంపు లో బ్రూస్లీ 

రోజు నేను కప్పరాడ బడికి నడుచుకొని వెళ్తుందునా,నా ఎదురుగా రోడ్డవతల లావుగా గెడ్డం వున్న ఒక పెద్దాయన, ఒక బక్కోడు కొట్టు కుంటున్నారు.

వాళ్లకు వెనకాల కర్రలున్నాయి.  అందులో ఒక కర్ర తీసి బక్కోడు లావుపాటాయిన్ని కొడుతున్నాడు.చాలా సేపు కొట్టుకున్నారు గానీ  ఎవరూ ఓడిపోలేదు.

ఒకడు కింద పడిపోగా ఇంకోడు తిట్టుకుంటూ కర్రల వెనకగా మాయమయి పోయాడు.

*   *   *

శ్మశానం దాటి కొద్దిగా అప్పు ఎక్కి కాళ్ళు రోడ్డుమీద దేకిస్తున్నాను , హవ్వాయి చెప్పుల లోన నా బక్క కాళ్ళు ఎడ్డి ఎదవ లాగా చూసుకుంటూ నడుస్తున్నాను.

బక్కగా వొంటి మీద చొక్కా లేని ఆ ఇంటి అల్లుడు నన్ను దాటుకుంటూ అవతలకు వెళ్లి బాదం చెట్టు కింద పడిపోయాడు.

ఆడికి కుడివైపు డొక్కలో కత్తిగాటు, ఆ ఇంటి అత్త లబ లబ లాడుతూ అల్లుడిని లేపడానికి చెట్టు దగ్గరకి వస్తోంది.

అల్లుడు ఎవరితోనో గొడవ పడుతున్నాడు అవతలోడి చేతిలో కత్తి వుంది.

లెగిసిన అల్లుడు దెబ్బలాట కెళ్ళాడు, గుద్దు కున్నారు, కత్తి తిప్పారు, రక్తం కింద పడింది.

అత్త కూడా అల్లుడు తరపున దెబ్బలాడింది.

*  *  *

బెండి అప్పారావు పోస్టర్ మీద పేడ కొట్టినోడు ఎవడ్రా అని చంద్ర శేఖరు , చింపాంజీ గాడి మొకాన్న పేడ కొట్టినోడు ఎవడ్రా అని బదిరెడ్డోడు, ఎల్లాజీ, అవతారం అందరం తర్జన భర్జన పడ్డాక ఆ ఐటిఐ జంక్షన్ కాడ  భాను చందర్, సుమన్ నటించిన మెరుపుదాడి పోస్టర్ ( నేడే చూడండి పరమేశ్వరి థియేటర్ ) కనిపించింది .( ఒరే …భాను చందర్ , సుమన్ నిజమైన కరాటే ఫైటర్లు బే , ఆళ్ళ గురువు ఎవరో తెలుసా బ్రూస్లీ )

అప్పటికే కప్పరాడ బడిలో రోజుకో గొడవ, నేనేమో బాదిరెడ్డి శ్రీను గాడితో, అవతారంతో, ముసిలమ్మ మనవడితో, బ్రహ్మాజీతో ఇలా అందరితో ఫైటింగులు, ఏ ఫైటింగులో మనం గెలిచామో చెప్పడం కష్టం, ఆఖర్న ఎవడో ఒకడు వొచ్చి విడదీస్తాడు, మిగిలింది మనం బోరింగు కాడ మెడ చుట్టూ కడుక్కున్నాక తెలుస్తుంది, మనకు గోరు గాట్లు పడ్డాయో ఆడికి పడ్డాయో.

చుట్టూ రోజూ దెబ్బలాటల సీన్లు, స్కూల్ లో మన నాయకత్వమైన క్లాస్ లీడర్షిప్ ని అంగీకరించని నా కొడుకులే ఎక్కువ.

ఎలా ? ఎలా ? గుంట నా కొడుకులు మనకు జడిసే దెలా ?

వూరినించి బుల్లి మావయ్య అని మేము పిలుచుకునే పెద్ద మీసాల మావయ్య దిగాడు, తాటిరొట్టె, మినుములు, కొబ్బరికాయలతో పాటు, “ఎంటర్ ది డ్రాగన్” కేసెట్ తెచ్చాడు.

వీడియో లైబ్రరీ నుంచి టీవీ తెచ్చి, ఇంటి బయట పెట్టి ఆన్ చేసాడు, గుంట లందరం చూసాము, అందులో “బ్రూస్లీ ” బర్మా కేంపోడి  లాగే వున్నాడు, బక్కగా వున్నాడు, ఎగురు తున్నాడు, యెగిరి తంతున్నాడు, నాకు నచ్చేసాడు.

” నేను అర్జంటుగా బ్రూస్లీ అయిపోవాలని నిర్ణయించేసుకున్నాను ”

మనల్ని బ్రూస్లీ లా తయారు చేసేది ఎవరు ? ఆరా తీసాను, కేంపు కింద బాక్సింగ్ నేర్పుతున్నారు, కేంపు పైన కరాటే నేర్పిస్తున్నారు

అందుకు కావలసిన పరికరములు, ఒక లంగోటా, వైట్ డ్రెస్సు.

కబడ్డీ ఆడుతున్నానని అప్పటికే తెల్ల లంగోటాలు మా నాన్న కుట్టించాడు. ఇక కావాల్సింది వైట్ డ్రెస్సు, మంత్లీ ఫీజు.

ఆ ఆదివారం పొద్దుట విప్లవం పేపర్ చదువుతున్న మా నాన్నని ” నేను కరాటే నేర్చు కుంటాను నాన్నా ” అన్నాను.

అయన సీరియస్ గ పేపర్ లోంచి బయటకు చూసి ” ఏం ? వీధి రౌడీ అవుదామనుకుంటున్నావా ? ఏమవసరం లేదు ? ” అన్నాడు.

ఇంక ఆయన కుదరదు అన్నాడు అంటే అంతే , మనం ప్రత్యామ్నాయం అనే ఆల్టర్నేటివ్ చూసుకోవలసిందే.

” ఎలా ? ఎలా ? ముందు వైట్ బెల్ట్,తరువాత బ్రౌన్ బెల్ట్, గ్రీన్ బెల్ట్, ఎల్లో బెల్ట్, బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్ ఇలా ఎన్నో బెల్టులు సంపాదించి బ్రూస్ లీ కావాలి  ” ఎలా అని మధన పడుతున్న నన్ను ఆ సాయంత్రం కంచరపాలెం మెట్టు కాడ వున్న స్టేషనరీ షాపులో వున్న ఆ పుస్తకం ఆకర్షించింది  దాని పేరు

” ముప్పై రోజుల్లో కరాటే నేర్చుకోవడం ఎలా ?” రచయిత  మాస్టర్ సు. సువానంద , తమిళం నుంచి తెలుగులోకి అనువాదం చేసిన పుస్తకం, అందులో విపరీతంగా కరాటే ఫోటోలు.

పుస్తకం కొనాలంటే ముప్పై రూపాయలు, మన దగ్గర వున్న జిగ్గులు, బోకులు , అగ్గిపెట్టె కవర్లు, పేకముక్క కవర్లు అన్నీ అయినకాడికి అమ్మేయగ, సీతాఫలం డిబ్బీ బొక్క పెద్దది చేసి అందులో డబ్బులు, మా నాన్న ప్యాంటు జేబులో రెండు పావలాలు దొబ్బేయగా ఇంకా చిల్లర తగ్గింది.

అమ్మ సహకారంతో ఆ మిగతా చిల్లర తీసుకొని పుస్తకం తీసుకున్నాను, కేంపు కి మెట్టు నుంచి నడిచి వొస్తున్నానే గాని వొళ్ళంతా తెలీని శక్తి, పుస్తకంలో వున్న కరాటే అంతా నా వొంట్లోకి వెళ్లిపోయినట్లు ఒకటే ఫీలింగు.

అలా మాస్టర్ సు. సువానంద ను నా గురువుగా భావించి, కరాటే డ్రెస్సు లేకపొయినా ధ్యానం, మోచేతులతో ఎక్సరసైజు లు, రన్నింగులు,సగం పుస్తకం వరకు అగ్ని గుండాలు తొక్కే కాడ  ప్రాకుటీసు చేసాక.

కరాటే లో ” హూ.. హా ” మొదలైంది.

మార్షల్ ఆర్ట్స్ కేవలం ఆత్మ రక్షణ కొరకు మాత్రమే వాడాలి, దెబ్బలాటలకు కాదు అనే పుస్తక గురూజీ మాటకు  నాలో వున్న ఉత్సాహం నీరుగారి పోయింది, తెలీని ఒక ప్రశాంతత వొచ్చేసింది.

బర్మా కేంపు లో ఉన్నోళ్లంతా నా వాళ్లయినపుడు నాకు ఫైటింగులతో పనేమీ అని ప్రశ్నించుకొని.

ఆ శని వారం సాయంత్రం సు. సువానంద రాసిన పుస్తకం అటక పైకి, లంగోటా బాత్రూం వెనక్కి పడేసి, నోటుబుక్కు తీసుకొని ,కింద ఊర్వశీ జంక్షన్ కాడ ప్రజానాట్యమండలి మౌలాలి, భాషా నేర్పించే పాటలు నేర్చుకోవడానికి బయలుదేరాను.

నేను కేంపు నుంచి కిందకు  నడుస్తుంటే ” బర్మా కేంపు లో బ్రూస్లీ ” నడుస్తున్నట్లే వుంది, అని ఎవరూ అనలేదు, నేనే అనేసు కున్నాను.

పెద్దయ్యాక బ్రూస్లీ నాలాగే ఒక ఫిలాసఫర్ అని తెలుసుకున్నాను ( బ్రూస్లీ లాగ నేనా ?)

*

హరివెంకట రమణ

కొంతకాలం హైదరాబాద్ , విశాఖ లో చిన్న పత్రి క‌లలో ప‌నిచేసాను, త‌రువాత యానిమేష‌న్ రంగంలో చాలా కాలం ఉన్నాక మున‌సోబు ఫ్లుకువోకా ( జపనీస్ రైతు ) ప్రభా వంతో ఉన్న ఉద్యో గం వ‌దిలేసి స్వతంత్రంగా బ్రతకాలనే నిశ్చ‌యంతో ఫ్యాకల్టీ ,కన్సల్టెంట్ , మార్కెటింగ్ , ఎన్‌జీవో ఇలా ర‌క‌ర‌కాల వృత్తులు చేసేను , చేస్తున్నాను. కొన్ని డాక్యూమెంటరీలు, మరికొన్ని యానిమేషన్ చిత్రాలు తీసాను. చాల తక్కువ కథలు పత్రికలలో వొచ్చాయి , తెలుగు మ‌రియు సోష‌ల్ వర్క లో పీజీలు చేసేను. భార‌త ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక యువ‌జ‌న అవార్డు 2014 లో వచ్చింది. ప్రస్తుత నివాసం విశాఖ‌ప‌ట్నం.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సహజంగా అప్పుడు పిల్లలు ఎలా ఉండవారో అలాగే ఉన్నాయి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు