ఆ ఒకే ఒక్క ఆశాదీపం!!

ఇంకో మూడు నెలల్లో “సారంగ” పత్రిక పదేళ్ళు పూర్తి చేసుకోబోతోంది. ఒక పత్రిక నిర్వహణ- అదీ కేవలం సాహిత్యం మాత్రమే కేంద్రంగా వున్న పత్రిక ఒక దశాబ్దికి చేరుకోవడం విశేషమే! ఈ పదేళ్ళ ప్రయాణం గురించి వేరే మాట్లాడుకుందాం.

ఇంగ్లీషు కాలెండర్ ప్రకారం ఇవాళ   కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరంలోకి  అడుగు పెట్టే  ముందర, ఒక్క క్షణం ఆగి వెనక్కి  తిరిగి చూసుకోవాల్సిన సందర్భం ఇది!

అది గడిచిన ఏడు కావచ్చు. కొన్నేళ్ళు కావచ్చు. పునరాలోకనం అవసరం జీవితానికి, సాహిత్యానికి కూడా.

అయితే, సాహిత్యంలో ఈ ఏడాది వచ్చిన మార్పులు, చేర్పుల గురించి  కాదు ఈ నాలుగు మాటలు! 2022 లో సారంగ సాధించిన విజయాలు, వైఫ్యల్యాల చిట్టా అంత కన్నా కాదు. విశాల సాహిత్య దృశ్యంలో “సారంగ”  చేసినది, చేసేది ఏదైనా చిన్ని బిందువు మాత్రమే. చాలా చేయాలనుకొని, కొన్నిటితో మాత్రమే తృప్తిపడడం జీవన నైజం. అవేమీ ఇక్కడ ఏకరువు పెట్టడం లేదు.  ఈ కొత్త సంవత్సరం సందర్భంగా – సాహిత్య ప్రపంచం లో అందరినీ ఏదో ఒక స్థాయిలో తొలుస్తున్న ఓ చిన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కునే ప్రయత్నం ఇది.

సాహిత్య ప్రయోజనం ఏమిటి? ఎందుకు రాస్తున్నాం? ఎవరి కోసం రాస్తున్నాం? ఎప్పటి నుంచో నలుగుతున్న అతి మామూలు ప్రశ్నే ఇది. ఈ ప్రశ్నకి ఒకే ఒక్క సమాధానం అసాధ్యమే అని తెలుసు. ఎందుకంటే, సమాధానం  వ్యక్తికొక విధంగా దక్కుతుంది. రచయితలు ఒక విధంగా, పాఠకులు ఇంకో విధంగా, పబ్లిషర్లు మరో విధంగా సమాధాన పరచుకుంటారు. మధ్యలో సాహిత్యాన్ని ఉద్యమంగా/వ్యాపారంగా/కీర్తి సోపానాలుగా  భావించే సమూహాలు ఇంకో వ్యాఖ్యని మన ముందు పెడతాయి.

సాహిత్యం అనగానే ఎవరి సాహిత్యం?అనే అనుబంధ ప్రశ్న ముందుకొస్తోంది. రచయితా ? చదువరా? ఇద్దరిలో ఎవరు గొప్ప? ఎవరిది చివరి మాట? చివరి తీర్పు?అన్నది ఇంకో అనుబంధ ప్రశ్న. ఇవాళ్టి మార్కెట్/మీడియా మాయాజాలం లో పాఠక  వర్గం  ఓ బలమైన శక్తి గా రూపు దిద్దుకుందన్నది నిజం . “ నా సమయం, నా డబ్బు, నా అభిరుచి” అని చదువరి, రచనలను శాసించే స్థితి కి ఎదిగిన స్థితి ఇవాళ్టి నిజం.

ఇవాళ ఎక్కువ శాతం రచయితలు, చదువరి అభిరుచి ఎలా ఉంటోందో గమనించుకొని, ఆ దిశలో రచనలు చేసే స్థాయి కి వెళ్లడం వల్ల సాహిత్య స్థాయి తగ్గిందన్నది నా అభిప్రాయం. క్రాస్ రోడ్స్ లో నిలబడి, రచయిత ఎలాగైనా సరే పుస్తకాలు అమ్ముకోవటం  -మార్కెట్ వ్యూహం మాత్రమే కానీ అది సాహిత్య స్థాయి ని పెంచదు.

సాహిత్య లోకంలో గత కొన్ని సంవత్సరాలు గా, మరీ ముఖ్యం గా ఇటీవలి నాలుగైదేళ్ల ల్లో తరచూ వినిపిస్తున్నవి: మంచి సాహిత్య చర్చలు కాదు. ఏ రచన ఎందుకు బాగుంది? ఎందుకు బాగోలేదు అన్న లోతైన విమర్శ కాదు. మరి సాహిత్యం గురించి ఏం మాట్లాడుకుంటున్నాము? ఏం వింటున్నాము ? అంటే… కొన్ని సమూహాల రచయితల మీద పరస్పర నిందారోపణలు,  వాద వివాదాలు, అవార్డుల రాజకీయాలు, లక్షలతో అంచనా కట్టే  సాహిత్య పోటీలు, పుస్తకాల అమ్మకాలు, డబ్బులివ్వని పబ్లిషర్స్, సాహిత్యానికి చోటు లేని ప్రింట్ పత్రికలు, కంచి గరుడ సేవ చేస్తున్నామంటున్న ఆన్ లైన్ పత్రికలు.

ఇన్నింటి మధ్య : వాట్స్ యాప్ గ్రూపులు, ఫేస్ బుక్ పోస్టుల నుంచి నేరుగా పుస్తకాల ప్రచురణ దాకా ఎక్కడ చూస్తే అక్కడ సాహిత్యం ఏరులై పారుతోంది. అందులో మంచి లేదా చదివించే రచన కోసం చూస్తుంటే, “ చెత్త లో ఉత్తమ చెత్త” అంటూ కొన్ని రచనలకు ప్రోత్సాహాన్ని ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది మనమే.

నిజమే, క్షరం కానిది అక్షరం.

దాన్ని మనం డబ్బుతోనో, అవార్డులతోనో, అమ్మకాలతోనో, కీర్తి తోనో, గుర్తింపుతోనో కొలిచే విఫల యత్నం చేస్తున్నాం. రచన సక్సెస్ ని – మార్కెట్ కొలమానాలతో కొలిచి అసంతృప్తి చెందుతున్నాము. రాయటానికి ముందే రచనకు ఒక ఎజెండా సిద్ధమవుతోంది. పోటీల డెడ్ లైన్స్ తో రచయితల కాలెండర్లు నిండిపోతున్నాయి. బుక్ ఫెయిర్ ల కోసం పుస్తక ప్రచురణలు, అవార్డుల కోసం ఆరాటాలు. రచనలో నాణ్యతా, కొత్తదనం  కంటే సమీకరణాల మీద, వాటి రాజకీయాల మీదా ఎక్కువ శ్రద్ధ – ఇదంతా బహిరంగ సత్యం . నేటి ఈ సాహితీ దృశ్యంలో   తిలా పాపం తలా పిడికెడు. ఎవరి స్వప్రయోజనాలు వారికి పరమావధిగా మారుతున్న సన్నివేశంలో సాహిత్యం  ఆ ప్రయోజనాలకు  ముడిసరుకు మాత్రమే అవుతోందేమో ఆలోచించుకోవాలి.

వీటన్నింటి మధ్య సాహిత్యం ప్రయోజనం ఏమిటి? ఎందుకు రాస్తున్నాం? ఎవరి కోసం రాస్తున్నాం? ఎవరు చదువుతున్నారు ? అని ప్రశ్నించుకున్నప్పుడు – ఎవరి ఎజెండాలకు తగిన  సమాధానాలు  వాళ్లకున్నాయి. రాయటానికి రచయితలకు భిన్న కారణాలు ఉన్నట్లే, ఒకొక్కరూ ఒక్కో లక్ష్యం తో చదువుతారు. కొందరికి సాహిత్యం ఓ ఓదార్పు, మరి కొందరికీ వాస్తవికత నుంచి దాక్కునే మరో ప్రపంచపు దారి.

నాకు దొరికిన సమాధానం:

ఒక రచన రాసినప్పుడు, చదివినప్పుడు రచయిత, చదువరి ఒకే ఒక బిందువు వద్ద కలుస్తారు. ఆ రచన తాలూకూ అనుభూతి, అనుభవంతో ఓ కొత్త లోకపు తలుపు తెరుచుకుంటుంది. ఓ మంచి రచన చేశాక రచయిత కు కలిగే సంతృప్తి, అది చదివాక చదువరి కి కలిగే అనుభూతి – ఇవి చాలా అరుదుగా జరుగుతాయి కానీ తప్పక జరుగుతాయి. ప్రతి రచన ఆ స్థాయి లోకి వెళ్లలేకపోవచ్చు. అది సాధించటం కోసం సిన్సియర్ రచయితలు సాధన చేస్తారు. నిజమైన పాఠకులు దాని కోసం అన్వేషిస్తారు.

అలాంటి రచనలను చేయటం రచయితల లక్ష్యం కావాలి. వాటి కోసం చదువరులు అన్వేషించగలగాలి.  సాహిత్యం ఎవరో ఒకరి కోసం కాదు. అది అందరిదీ. దానికి ప్రత్యేక గుర్తింపు, అవార్డులు, బహుమతులు, అమ్మకాలు, నగదు ఇవన్నీ దాని చుట్టూ ఉండే వలలు. పరుగుపందెంలో చిక్కుకు పోయి అక్కడే ఉంటామా? లేక ఆ వలల్ని, వలయాల్నీ  దాటుకొని నిజమైన సాహిత్యాన్ని అందుకుంటామా, లేదా? అనేది ఎవరికి వారు తేల్చుకోవాలి.  మంచి సాహిత్యం కోసం రచయిత, చదువరి, పబ్లిషర్  – ముగ్గురూ కలిసి కృషి చేయాలి. ఏ ఒక్కరి ప్రయత్న లోపం జరిగినా, అక్కడ సాహిత్యం శూన్యమైపోతుంది.

ఇన్నీటి మధ్యా ఒకే ఒక్క ఆశాకిరణం ఏమిటంటే: ఈ పదేళ్ళలో “సారంగ”లో గాని, ఇతర పత్రికలలో గాని అచ్చయిన రచనల్ని గమనించినప్పుడు మన కళ్ల ముందే ఒక కొత్త తరం తరంగవేగంతో దూసుకువస్తోంది. ఈ డిసెంబర్ చివరలో వెలువడిన అనేక కథా/ కవిత్వ సంకలనాలు- మరీ ముఖ్యంగా కథా సంపుటాలు- దీనికి సాక్ష్యం. ఈ కొత్త తరం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో వున్నాయి. కొత్త జీవన నేపథ్యాల నుంచి వీళ్ళల్లో చాలా మంది రాస్తున్నారు. ఇంతవరకూ మనకి అపరిచితంగా మిగిలిపోయిన అనేక బతుకు పుస్తకాలు మన ముందు తెరుచుకుంటున్నాయి. అది ప్రాంతం కావచ్చు, సామాజిక వర్గాలు కావచ్చు, ప్రవాస జీవితం కావచ్చు. పల్లె, పట్నం, మెట్రో ఏదైనా కావచ్చు. ఇవన్నీ మనకి కొత్త దృష్టిని నేర్పుతున్నాయి.  ఈ కొత్త తరం సాహిత్యం లో వేళ్లూనుకొని నిలదొక్కుకోవటానికి ఓ మంచి సాహిత్య వాతావరణం ఉండాలి. రచయితలు మామూలు పాఠకుల కంటే ఎక్కువ చదవాలి. మాట్లాడాలి. నేర్చుకోవాలి. ఇతర రచయితల రచనల గురించి మాట్లాడటం ఓ మంచి లక్షణం. అది అలవాటు చేసుకోవాలి.  రచనల పట్ల పాఠకులకు ఓ గౌరవం కలిగే విధంగా సాహిత్య వాతావరణం ఉండేలా చూసుకోవటం మనందరి బాధ్యత.

అలాంటి  కృషి వైపు మనం అడుగు వెయ్యాలి. ఏడాది తిరిగేసరికి కొన్ని మంచి పుస్తకాలు వచ్చాయనీ, వాటిని గురించి మాట్లాడుకున్నామనీ ఒక సంతృప్తి మిగలాలి.

ఈ  కొత్త సంవత్సరం అందుకు పునాది అవుతుందని ఆశ, ఆకాంక్ష!

*

చిత్రం: చరణ్ పరిమి 

 

కల్పనా రెంటాల

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిష్పాక్షికంగా రాసిన విశ్లేషణ.. నవతరాన్ని విమర్శకులు గమనిస్తున్నారా అని అనుమానం

  • చాలా మంచి వ్యాసం. “ఇవాళ ఎక్కువ శాతం రచయితలు, చదువరి అభిరుచి ఎలా ఉంటోందో గమనించుకొని, ఆ దిశలో రచనలు చేసే స్థాయి కి వెళ్లడం వల్ల సాహిత్య స్థాయి తగ్గిందన్నది నా అభిప్రాయం. క్రాస్ రోడ్స్ లో నిలబడి, రచయిత ఎలాగైనా సరే పుస్తకాలు అమ్ముకోవటం -మార్కెట్ వ్యూహం మాత్రమే కానీ అది సాహిత్య స్థాయి ని పెంచదు.” మీ అభిప్రాయం సరి అయినదే.

    ఇవ్వాల్టి తెలుగు సాహిత్య కారులందరూ తప్పక చావవలసిన వ్యాసం .

  • మేలుకొలుపు లాంటి వ్యాసం..
    బాగా చెప్పారు మేడం

  • చాలా చక్కని విశ్లేషణ ఇందులో చర్చించిన ప్రతిదీ నగ్న సత్యం నేను నా జీవితం లో అరవై ఏళ్ళు ఇతరుల రచనలు చదవడం లో గడిపాను.ఆ తరువాత అచ్చులో ఒక కథ చూసుకోవాలి రాయడం మొదలుపెట్టాను. పోటీ ప్రపంచంలో గెలిచాను .పోటీ కి రాయడానికి కారణం నిర్దుష్టమైన సమయంలో రచన పూర్తి చెయ్యగలనని.పుస్తకాలు వేసాను కానీ అమ్మబడలేదన్న బాధ లేదు నాలో చెలరేగిన భావాలను కాగితం మీద పెట్టాలన్న తపన మూడేళ్ళ నించి మంచం మీద నుంచి కదలలేక పోయినా మానలేక పోతున్నాను ఇప్పటికీ ఇంగ్లీష్,హిందీ,తెలుగు భాషల పుస్తకాలు చదువుతాను.

  • “సాహిత్య ప్రయోజనం ఏమిటి? ఎందుకు రాస్తున్నాం? ఎవరి కోసం రాస్తున్నాం? ఎప్పటి నుంచో నలుగుతున్న అతి మామూలు ప్రశ్నే ఇది. ఈ ప్రశ్నకి ఒకే ఒక్క సమాధానం అసాధ్యమే అని తెలుసు. ఎందుకంటే, సమాధానం వ్యక్తికొక విధంగా దక్కుతుంది.”…. ఇది అక్షర సత్యం.. నా లాంటి వాళ్ళు రాయ గలిగి ఉండి కూడా గత ముప్పై ఏళ్లగా రాయలేకపోవడానికి ఇదే ప్రధాన కారణం.. ఆత్మ శోధన..(ముఖ్యంగా నేను.). ఒక సారి ప్రచురణ లోకి వచ్చాక అది పాఠక లోకంలోకి ఎప్పుడు వెళ్లిందని కాదు కానీ… మారుతున్న కాలానికి తగట్టు రచయిత అభిప్రాయం లేదా రచన లేకపోతే తాజా కలంతో సవరించే అవకాశం ఉండదు.. సాహిత్యంపై అనేక ప్రభావాలు పొడ సూపుతున్న ఈ రోజుల్లో రాయకుండా ఉండడమే మేలు అనే అభిప్రాయం ద్యోతకమవుతుంది..పాపులర్ రచయితలు సైతం అప్పుడు అలా రాయకుండా ఉండాల్సింది అని అంగీకరిస్తున్న పరిస్థితి ఇది.. అనేక ఒదుడోడుకుల మధ్య ఒక పత్రికను లాభాపెక్షా (sorry..typing error)లేకుండా పదేళ్లు తీసుకురావడం గొప్ప విషయం.. సారంగ నిర్వాహకవర్గానికి అభినందనలు.. ఈరోజు ఇంకా గత కాలపు సాహిత్య విలువలు ఏవైనా మిగిలియంటే అది సారంగలోనే..అనేక బాలారిష్టాలను ఆధిగమించి అందుబాటులోని సాంకేతిక పరిజ్ఞానంతో విలువైన సమయాన్ని వెచ్చించి పత్రికను తెస్తున్నందుకు మరోమారు అభినందనలు.. పదకొండో ఏటా అడుగిడుతున్న సారంగకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.. 🌹

  • బాగుంది. ఈ లోచూపు కల్పనా రెంటాల వరకు పరిమితం కాకుండా రచయితలందరిలోకీ పరివ్యాప్తం కావాలని ఆకాంక్ష.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు