ఆత్మగౌరవ జెండా ఎప్పుడూ
అవనతం కాదు
ఆ పోరాటం ఎన్నటికీ చేతులు పట్టుకొని
ఏడుపు రాగం అందుకోదు
జాతి తల దించేలా ఆధిపత్యం కాళ్ళు మొక్కదు
ఆత్మగౌరవ జెండా తలెత్తుకు ఎగురుతుంది
దాని కింద అభాగ్యులు అశాంతులు గరీబులు
అంటబడనివారు కొత్త అస్పృష్యులూ
కూడి ఉంటారు
గద్దె మీద మను మృగాన్ని దువ్వుతున్న నాయకుడా!
కింద తలలూపుతున్న మంద
నీ జాతి అడుక్కు తొక్కబడినా
దేశం నిండా కషాయ విద్వేషం చిమ్ముతున్నా
అంబేడ్కర్ సూర్యుడు
నీలాంటోళ్లు కాపాడుకుంటారనే నమ్మకంతో
రాత్రింబవళ్ళు ఆరోగ్యాన్ని పణంగా పెట్టి
రాసిన దస్తూర్ ను మరచి
కాళ్ళ బేరానికి సాగిల పడతావా!
నీ తప్పటడుగు
ఆత్మగౌరవ పోరాట చరిత్రలో
ఒక మాయని మచ్చ
కమల ఛత్ర ఛాయ కింద
తల దాచుకోవడానికి సిద్ధమవడం అవకాశవాదమే!
సాటి బహుజనులను
బలిపెట్టడానికి కూడా సిద్ధమవడమే!
క మలం ఎత్తుకున్న కడ జాతివాడా!
ఎన్ని తలలు దండలకై ఒంగినా
నువ్వు వెన్నెముకపై నిలబడతావను కున్నాను
ఏకంగా మను పిశాచికే లొంగుతావనుకోలేదు
ఇక నువ్వు ఎవరినీ ప్రశ్నించడానికి లేదు
బహుజనం వేలెత్తి చూపే మొఖానివి
నిన్ను పంచములుగా చూసే పార్టీకి మద్దతిచ్చి
వర్గీకరణ తెచ్చుకుంటానంటావు సరే,
రాజ్యాంగం స్థానంలో
మనుస్మృతికి అనుమతిచ్చాక
అప్పుడు వర్గీకరణ ఏం చేసుకుంటావు?
మనుధర్మం ఆ పార్టీ అసలైన ఆత్మ
నీ జాతిని పతనం చేసిన ధర్మానికి అది పతాక
ఆకలితోనైనా చస్తాంగానీ అధర్మాన్ని అంగీకరించం అన్న
మహోన్నత జాతిని
మనువు పాదాల కాడ పెట్టే తెగింపెలా వచ్చింది నీకు?
కాషాయ జెండాతో నీలి జెండా
కలిపే హక్కు నీకెవరిచ్చారు???
రేపు మత రాజ్యమే గనక వస్తే
నీ స్థానం ఎక్కడో మర్చిపోతే
నిన్ను బహుజనం ఎలా క్షమిస్తుంది?
*
చిత్రం: సృజన్ రాజ్
ఈ కవిత ప్రచురించినందుకు సారంగ హ్యాట్సాఫ్