ఆత్మీయ ఆలింగనాలు ఇక జ్ఞాపకాలేగా…

నేనెప్పుడూ ఊహించలేదు
నాకా ఆలోచనే రాలేదు
ఎవరికి మాత్రం వస్తుంది
ఇలాంటి రోజులు వస్తాయని

మూసేసిన షట్టర్లు,
బాధలు తవ్వి కుప్పగా పోస్తాయని
నిశ్శబ్దం నగర వీధుల్లో
లాఠీ పట్టుకుని కాపలా కాస్తుందని

చంకన బిడ్డ,
నెత్తిన మూట పట్టుకుని
నగ్న పాదాలు నిప్పుల బాట పై
బారులు కడతాయని

గంట గంటకు
గాల్లో కలుస్తున్న ప్రాణాలు
లెక్కపెట్టడమే ఇప్పుడు వార్త
కరోన ఉంటేనే వైద్యం
కడసారి చూపులకు నోచుకోని చావులెన్నో

ముద్ద అన్నం కోసం
అమెరికన్లు సైతం
కార్లల్లో క్యూ కట్టే దృశ్యం
ఎవరం మాత్రం కల కనగలం

చిరునవ్వు, చేతి స్పర్శ
మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లలో
కరిగిపోతుంటే..
ఆత్మీయ ఆలింగనాలు ఇక జ్ఞాపకాలేగా…

*

 

ఆ చివరి అంచు

గోడలు లేని ఆ గుడిసె
లోపలంతా ఉక్కగా ఉంది
గాలికి గాలాడక
ఉక్కిరి బిక్కిరి అవుతోంది
రెక్కలు తెగిన పక్షులు
బిలబిలా కొట్టుకుంటున్నాయి

ఏమున్నాయని సర్దుకోవడానికి
ఓ చంకన బిడ్డ
మరో చేతిలో సద్దిమూట
నెత్తిన సూర్యుణ్ని మోసుకుంటూ
వాళ్లంతా తెలియని దారుల్లో
అనంతంగా సాగి పోతూనే ఉన్నారు

తాజ్ మహల్ రాళ్ళెత్తిన
కూలీలెవరో
ఎవరికి ఎరుక ?
ముక్కలైన జీవితాన్ని
భుజాన వేసుకుని
వందలు, వేలుగా తరలిపోతున్న
ఈ బడుగు జీవి ఎవరికి లెక్క

అదిగో …ఆ చివరి అంచున
అమ్మ ఉంది, ఊరుంది
గుక్కపట్టి ఏడ్చే బిడ్డకు
ఎండిన చనుబాలు ఇవ్వకపోతుందా
చిరిగిన తన కొంగు అంచు
నెత్తిన కప్పక పోతుందా

పదండి
కలిసి కన్నీళ్లు తవ్వుకుందాం
దార్లోనే ప్రాణాలు పోతే
జ్ఞాపకాలు సమాధి చేద్దాం…

*

రెహానా

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రెహనా గారు కవిత బాగుందండి ! ‘దార్లోనే ప్రాణాలు పోతె జ్ఙాపకాల్ని సమాధి చెద్దాం’ గుండెల్ని పిండేసినట్లయ్యింది !!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు