అనుకోని అవకాశం  

వంగూరి జీవిత కాలమ్-72

1975 ఏప్రిల్ నెలాఖరులో సరదాగా దోశలు తిందాం అని రైస్ యూనివర్సిటీ విద్యార్ధులతో ఆ రోజుల్లో హ్యూస్టన్ లో -ఆ మాటకొస్తే మొత్తం టెక్సస్ రాష్ట్రం లోనే ఉన్న ఏకైక ఇండియన్ రెస్టారెంట్ “మహారాజా” కి వెళ్ళడం, అక్కడ నాకు కాకినాడలో సీనియర్ అయిన మిత్రుడు అనిల్ కుమార్ ని కలవడం ఒక ప్రధాన ఘట్టం. అతనికి అప్పటికి కొన్ని నెలల క్రితమే మద్రాసులో చిన్నప్పటి సహ బాలసినీ నటి, వెంపటి చిన సత్యం గారి కూచిపూడి శిష్యురాళ్ళలలో ప్రముఖురాలు, ప్రముఖ జానపద గాయని, దేవులపల్లి వారి పెద్ద మేనగోడలు అయిన అనసూయా దేవి గారి పెద్దమ్మాయి రత్నపాప తో పెళ్ళి అయింది కానీ పాప ఇంకా అమెరికా రాలేదు. మా పున:పరిచయం అయిన వారం పది రోజులకే నన్ను అనిల్ కుమార్ దువ్వూరి సూరి కి పరిచయం చేశాడు.

ఈ దువ్వూరి సూరి గురించి నాకు కుంటుంబ పరంగా ఇండియాలోనే తెలుసు కానీ ఎప్పుడూ అక్కడ కలవ లేదు. నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూరి నాన్న గారు దువ్వూరి నరస రాజు గారు ఎడ్వోకేట్ జనరల్ గా పనిచేసిన గొప్ప లాయర్. మా సూరీడు బాబయ్య గారికి (రాజమండ్రి) కి స్నేహితులు. కాకినాడలో జనరల్ హాస్పిటల్ వెనకాల పెద్ద బిల్డింగ్ లో ఉండే వారు దువ్వూరి వారు మా చిన్నప్పుడు. సంజీవ రెడ్డి గారి  బస్సులు జాతీయీకరణ చేసినప్పుడు, అది చెల్లదని ప్రభుత్వం మీద పడిన “కర్నూల్ బస్సు జాతీయీకరణ కేస్”  లో నరస రాజు గారు ప్రభుత్వం తరఫున వాదించి ఓడిపోగానే రాజీనామా చేశారు. ఆ నాటి నైతిక విలువలు అవి…సూరి మద్రాసులో కేసరి హఒ స్కూల్ లో మా బావ గారి తాముడు అచ్యుత రామ్ సహాధ్యాయి.

మా చిన్నప్పుడు రేడియో అన్నయ్య, అక్కయ్య్య ‘బాలానందం” కార్యక్రమాలలలో అనిల్ కుమారు, సూరి, కందా మోహన్ బాబు విరివిగా పాల్గొనే వారు. ఆ సూరి ఇప్పుడు హ్యూస్టన్ లో  ఫ్లూర్ డేనియల్ అనే పెద్ద ఇంజనీరింగ్ కంపెనీలో ప్రొసెస్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. అతని కంపేనీలో ఉద్యోగాలు లేవు కానీ అతను నన్ను “అశోక్ కుమార్” కి పరిచయం చేస్తాను “అని ఒక శనివారం నన్ను తన పసుపచ్చ బీటిల్ కారులో అశోక్ ఎపార్ట్ మెంట్ కి తీసుకెళ్ళాడు సూరి. తీరా చూస్తే ఈ అశోక్ కుమార్ ఎవరో కాదు. నేను ఆంధ్రా యూనివర్శిటీ లో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదివినప్పుడు అతను నాకు ఒక ఏడాది సీనియర్. ఇద్దరం ఐదో నెంబర్ బ్లాక్ లో ఉండేవాళ్ళం. అతను గుంటూర్ ల్ కాన్వెంట్ లో చదువుకుని ఇంగ్లీష్ ధారాళంగా…ఆక్స్ ఫర్డ్, కేమ్బ్రిడ్జ్ వాళ్ళ ఏక్సెంట్ తో మాట్లాడేవాడు. అతనౌ ఎమ్. డబ్యు. కెల్లాగ్ అనే ఇంజనీరింగ్ కంపెనీలో పని చేసే వాడు. “నీ రెస్యూమ్ ఇయ్యి, ప్రయత్నం చేద్దాం” అని అప్పుడే టెన్నిస్ నుంచి వచ్చి అశోక్ కుమారు. అలా సూరి, అనిల్ కలిసి నన్ను ఊళ్లో ఉన్న గుంటూరు సీతాపతి రావు అని మరొక తెలుగు అతనికి కూడా పరిచయం చేశారు. ఇందతా నయీమ్ ఇంట్లో చేరిన రెండు వారాలలోనే…కానీ ఎక్కడా ఏ విధమైన ఆశా లేదు. అప్పుడే నాకు తెలిసింది అనిల్ కూడా రైస్ యూనివర్శిటీ లోనే ఎలెక్ట్రానిక్స్ డిపార్ట్ మెంట్ లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు అని తెలిసింది.

చైనా రెస్టారెంట్ లో చిప్పలు కడగడడం, కూరలు తరగగడం ఉద్యోగం రెండు వారాలు వెలగబెట్టాక మరో ఉద్యోగం కోసం నేను రోజూ పొద్దున్న బస్సులో నయీమ్ ఇంటి నించి డౌన్ టౌన్ వెళ్ళి, అక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పెద్ద బిల్డింగ్ లో ఉన్న పది, పాతిక అంతస్తులూ నా రెసూమె పట్టుకుని ఏదో ఒక ఉద్యోగం కోసం తిరిగేవాడిని. అలా చేసిన ఒక చిన్న ఉద్యోగం ఒక పెద్ద భవనం వాళ్ళ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ లో మూడో అసిస్టెంట్ పని. అంటే…ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన నీలం యూనిఫారం వేసుకుని, గుమ్మం దగ్గర తుపాకీ తో కాపలా ఉన్న పెద్ద ఆఫీసర్ కి పక్కన సహాయంగా నుంచోడం, అప్పుడప్పుడు నాలుగైదు అంతస్తులు చుట్టు తిరిగి రావడం ..అంతే. ఈ ఉద్యోగం కూడా పది, పదిహేను రోజుల కంటే ఎక్కువ నిలబడ లేదు.

ఏప్రిల్ నెల దాటి పోయి, మే నెలకి నేను హ్యూస్టన్ లో అడుగుపెట్టి నెల దాటింది. వేసవి కాలం మొదలయింది. అప్పటికి రైస్ విద్యార్ధులు పది మందీ, తెలుగు వాళ్ళ లో అనిల్ కుమారూ, అతను పరిచయం చేసిన దువ్వూరి సూరీ, ఒక సారి కలిసిన అశోక్ కుమార్, గుంటూరు సీతాపతి రావు- ఇవే నా పరిచయాలు. ఒక రోజు దువ్వూరి సూరి కి ఫోన్ చెయ్యగానే “మొన్ననే అనిల్ భార్య రత్నపాప ఇండియా నుంచి వచ్చింది. తనకి రెసెప్షన్ పార్టీ అతని తమిళ స్నేహితులు ఈ శనివారం ఏర్పాటు చేశారు. నువ్వు అక్కడికి వస్తే చాలా మందిని కలవ్వొచ్చును.” అని చెప్పి ఆ శనివారం తన ఫోక్స్ వేగన్ బీటిల్ కారులో నన్ను తీసుకెళ్ళాడు. ఆ పార్టీ ఇచ్చిన వాళ్ళు శేష్ బాలా & ప్రభ దంపతులు. ప్రభ,  రత్నపాప మద్రాస్ లో ఒకే కాలేజీ లో చదువుకున్నారు. అమెరికాలో పార్టీ అనగానే అప్పుడే దిగిమతి అయిన నాకు విషయాలు తెలియక టై కట్టుకుని టింగు రంగా అని తయారు అయి వెళ్ళాను. “అవన్నీ అక్కర లేదు రా” అని సూరి కాస్త నవ్విన గుర్తు.

ఆ పార్టీ ఒక విధంగా నా జీవితాన్ని మార్చింది అని చెప్పాలి. సుమారు పాతిక మంది ఉన్న ఆ పార్టీలో ఒక్క అనిల్, సూరి తప్ప ఇంకెవ్వరూ తెలీదు. “మీ కాకినాడ వాడే” అంటూ నన్ను పాపకి అనిల్ పరిచయం చేశాడు. అప్పటికే పాప ప్రపంచప్రఖ్యాతి చెందిన కూచిపూడి నర్తకి. దేవులపల్లి గారి మనుమ రాలు. “సీత-అనసూయ” లలో అనసూయ గారి పెద్దమ్మాయి….ఇన్ని లక్షణాలతో, కొత్త పెళ్ళి కూతురిలా కళకళ లాడుతున్న రత్నపాప తో అదే నా మొదటి ప్రత్యక్ష పరిచయం. పార్టీ లో అందరూ ఏదో వైన్, లేదా బీర్ పట్టుకుని, హాయిగా, ఘాట్టిగా జోక్స్ వేసుకుంటూ ఎంతో ఆనందిస్తున్న వారిలో ఇలా టై కట్టుకుని బిగుసుకుని భయం భయంగా కూచున్నవాడిని నేను ఒక్కడినే. కాస్సేపు చూసి, ఇలా లాభం లేదు అని నేను ఆ వెధవ నెక్ టై తీసి పారేసి, జేబులో కుక్కేసుకున్నాను. ఈ లోగా ఒకాయన నన్ను చూసి….దగ్గరకి వచ్చి “నువ్వు ఇక్కడున్నావేమిటీ? అన్నాడు. అతణ్ణి చూసి నేనూ అంతకంటే ఆశ్చర్యపోయాను. అతనెవరో కాదు.

కాకినాడలో మా తాత గారి సహాద్యాయులైన పెద్ద ప్లీడర్ గారి మనవడే.  ఇతని పేరూ అదే. చిన్నప్పటి నుంచీ కుటుంబాలు సన్నిహితంగా ఉండేవే. అతను అమెరికాలో హ్యూస్టన్ లో ఇలా కనపడతాడు అని అస్సలు అనుకో లేదు. అప్పుడు అతను నాతో అన్న వేళాకోళం మాటలు ఇప్పటికీ నాకు చెవిలో వినపడుతూనే ఉంటాయి.” నిన్ను ఎవడు రానిచ్చాడు అమెరికా?” ఇండియాలో ఉన్నప్పుడే కాకుండా ఇన్నేళ్ళ తర్వాత అమెరికాలో కూడా నా కాలిగోటికి సరిపోని అతను జీవితంలో అదృష్ట జాతకుడు. అప్పుడే అతని భార్య ని కూడా పరిచయం చేశాడు. నిజానికి అతను సూరి కి దగ్గర బంధువే కానీ అప్పటి దాకా నాకు ఎందుకు చెప్పలేదూ అంటే “వాడు ఉత్తి యూస్ లెస్ ఫెలో” అన్నాడు సూరి. ఆ యూస్ లెస్ ఫెలో, అతని భార్యా మాకు ఇప్పటికీ నాకు ఎంతో ఆప్త మిత్రులుగానే చెలామణీ అవుతున్నారు. “నిస్సంతోషి, జుగుప్సావంతుడు, ఈర్ష్యాళువు…” వగైరా లకి అతను నిలువెత్తు నిదర్శనం.

అలా అందరిలో నేను ఒక మూల భయం, భయంగా కూచుని ఉంటే ఒకాయన మెల్లగా నా పక్కనే వచ్చి కూచుని మాటలు కలిపి “ఎవరు నువ్వు? ఇది వరకూ ఎప్పుడూ చూడ లేదే” అన్నాడు. అప్పుడు నేను నా కథ అంతా చెప్పగానే “ఓ నువ్వు ఐఐటీ, బాంబే పి.హెచ్.డి,,,అందులోనూ ఫ్ల్యూయిడ్ మెకానిక్స్” అని ఆశ్చర్య పోయి “మై నేమ్ ఈజ్ రామన్. నేను మద్రాస్ ఐఐటి లో అదే సబ్జెక్ట్ లో డాక్టరేట్ చేసి, ఇక్కడ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో పోస్ట్ డాక్టరల్ వర్క్ కోసం వచ్చి రెండేళ్ళు అయింది. ఇప్పుడుఅది పూర్తి చేసి నిన్ననే రిజైన్ చేసి ఎల్లుండి ఇండియా వెళ్ళిపోతున్నాను. నా పోస్ట్ డాక్టరల్ పొజిషన్ ఇంకా ఖాళీగానే ఉంది. నువ్వు ట్రై చేస్తే నీకు ఈజీ గా వస్తుంది” అన్నాడు. అంత వరకూ నేను అనేక రకాల ఉద్యోగాలకి అప్లై చేస్తూ వచ్చాను కానీ అసలు ఈ పోస్ట్ డాక్టరల్ ఫెలో అనే దాని మీదకి నా దృష్టి వెళ్లనే లేదు. రామన్ చెప్పిన సంగతి వినగానే నా బుర్ర్ర గిర్రున తిరిగిపోయింది. వెంటనే రామన్ గారి దగ్గర ఆ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ ప్రొఫెసర్ గారి పేరు, ఫోన్ నెంబరూ తీసుకుని జేబులో పట్టుకున్నాను.

ఇక ఆ మర్నాడు తెల్లారిన దగ్గర నుండీ ఆ ఫోన్ నెంబర్ కి ఎన్ని సార్లు ట్రై చేసినా అస్సలు ఆన్సర్ లేదు. ఇలా లాభం లేదు అని రెండు బస్సులు మారి నయీమ్ ఇంటి నుంచి యూనివర్శిటీ అఫ్ హ్యూస్టన్ కి వెళ్ళి, వెతుక్కుంటూ, వెతుక్కుంటూ మొత్తానికి మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్టెమెంట్ కి వెళ్ళాను. దాని పేరు “కల్లెన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్”. ఆ భవనం లోకి వెళ్ళి అక్కడ ఫలానా ప్రొఫెసర్ గారు ఎక్కడ ఉంటారు అని అడగగానే కింద అంతస్తులోనే ఒక చోటు చూపించారు. పైన “టర్బ్యులెన్స్ లేబొరేటరీ & విండ్ టన్నెల్” అనే బోర్డ్ కనపడింది. నాకు కావలసినది అదే…అక్కడ  అడిగి ఎక్కడో రెండో అంతస్తులో ఉన్న ఆ ప్రొఫెసర్ గారి ఆఫీస్ గది కి వెళ్ళాను. పైన “ప్రొ. ఫాజ్లీ హుస్సైన్” అనే బోర్డ్ కనపడగానే “హమ్మయ్య” అనేసుకుని లోపలకి అడుగుపెట్టాను.

అప్పుడే 30వ పడిలో పడిన నేను ఆ తర్వాత వారం పది రోజులూ అనుభవించినంత అవమానం నా జీవితంలో ఎప్పుడూ అనుభవించ లేదు. ఆ వివరాలు..త్వరలోనే….

*

వంగూరి చిట్టెన్ రాజు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆగస్ట్ భాగం ఇంకా వేయలేదా, రాజు గారు? లేక నాకు కనబడటం లేదా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు