చివరి క్షణం దాకా పోరాటమే!

అరుణ కృషికి తగిన గుర్తింపు వొచ్చినట్టు అనిపించదు. ఎల్లి, నీలి నవలలను స్త్రీవాద సాహిత్యం చూసీ చూడనట్టు వ్యవహరించింది. దళిత సాహిత్యకారులు కొంతమేరకు ఆనవలల మీద చర్చించినా అది అంతంత మాత్రమే!

సౌదాఅరుణలకు రెండు మూడు సార్లు ఫోన్ చేసినప్పుడు ‘ఉప్పులూరు వచ్చాం, రా ! అని పిలిచారిద్దరూ ఆప్యాయంగా. వాళ్ళ వూరు కదా! వెళ్ళాలి అనుకుని కూడా వెళ్ళలేకపోయాను. చివరికి అరుణ పిలవకుండానే ఆవూరు వెళ్ళాల్సి వచ్చ్సింది. యెప్పుడూ నవ్వుతూ పలకరించే అరుణ అచేతనంగా పడుకుని వుంది. ఆమె అడిగిందని బౌద్ధ పంచశీల జెండా కప్పారు మిత్రులు, ‘మాఅమ్మాయి మీద కమ్యూనిస్టు జెండా కప్పాల్సిందే’ అంటుంది ఆమె తల్లి రాధమ్మ కన్నీరు తుడుచుకుంటూనే…

వుమ్మడి కమ్యూనిస్టు పార్టీ కాలంలో యెర్ర జెండాని దేవుడు మాదిరి కొలిచే కుటుంబంలో కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర ఉప్పులూరులో కుందేటి రాధమ్మ, వెంకటేశ్వర రావులకు పుట్టిన అరుణ తను మమేకమై రాసిన రాతలవల్ల ‘ఎల్లి అరుణ’ గానే గుర్తింపు పొందింది. నిజానికి అది తనకి యిష్టమైన గుర్తింపే!

అందరిలానే నాకు కూడా యెవరు అరుణ, యెవరు సౌదా అనేది చెప్పడం కష్టం. వాళ్ళిద్దరూ వొకరే అనిపిస్తుంది. సౌదా గారి పరిచయం గుర్తులేదు కానీ అరుణ 1999 జవవరిలో అనుకుంటా… శివసాగర్ సహచరి ‘పార్వతి’ గారు చనిపోయినప్పుడు హైదరాబాద్ రాంనగర్ లో కలిసాం. కాత్యాయని పరిచయం చేస్తే చిన్నప్పటినుంచి యెరిగిన తోబుట్టువులా చనువుగా మాట్లాడింది అరుణ. నాక్కూడా కొత్త వ్యక్తితో మాట్లాడినట్టు అనిపించలేదు. అప్పటికి మాయిద్దరికీ ఒకరి అక్షరాలు ఒకరికి తెలుసు. అందుకేనేమో ఆ అయినతనం. నాలాగే సన్నగా, నల్లగా, మ్యాచింగ్ బ్లోజ్ లేకుండా నేతచీరలో సరళంగా వుంది. మొహాన బొట్టు తప్ప యేఅలంకరణ లేదు, వదులుగా జడ వేసుకుంది, వొత్తు జుట్టు అరుణది, తను చాలా అందంగా అనిపించింది. అచ్చం ‘ఎల్లి’ రచయితలానే వుంది అరుణ.. ఎల్లి అరుణ. అరుణ నడుముకి పెద్ద సర్జరీ స్కార్ వుంది, తన తమ్ముడికి కిడ్నీ మంచినీళ్ళ ప్రాయంగా యిచ్చేసిందంట. తన రాతలానే బతికే వొట్టి చేతల మనిషి అరుణని ప్రేమించకుండా వుండడం యెవరికి మాత్రం  సాధ్యమౌతుంది? తక్కువ సమయంలోనే మామధ్య ఆత్మీయత యేర్పడింది. తనని చూస్తే ఆత్మబంధువుని చూసినట్టు, మాట్లాడితే  కొండెక్కినట్టు వుండేది. కలిసింది తక్కువ సార్లే గానీ ఆ అనుబంధం గాడమైంది. సౌదా గారు కూడా అంతే, కళ్ళనిండా ఆత్మీయత చూపిస్తారు. అరుణ అంత ఎక్స్ ప్రెసివ్ కాదుగానీ  తనదైన శైలిలో ఆమె ఒక అపురూపమైన మనిషి.

అరుణ ‘ఎల్లి’, ‘నీలి’ నవలలు అవి వచ్చిన కాలానికి గొప్ప సంచలనం. యెరుకలవారి బతుకులో కరుకుదనం, స్త్రీ పురుష సంబంధాలు, అక్కడా వుండే పితృస్వామిక లక్షణాలు, వారి భాష అన్నీ పూసగుచ్చినట్టు వాస్తవిక దృష్టితో రాసింది అరుణ. ఆభాష యెలా అబ్బింది అంటే వూరిలో దగ్గరగా చూడ్డం వలన అని చెప్పేది. ఆమె ఎల్లి రాసేనాటికి ఆదివాసీ, సంచార, అర్ధ సంచార జాతులపై పెద్దగా సృజనాత్మక రచనలు లేవు. చదువుతుంటే పందుల దొడ్డి వాసన మనకు తెలియకుండానే మన ముక్కుపుటాలను తాకుతుంది. అది వాసన కాదు, రచయిత సాధించిన విజయమే! వారి భాషను, నుడికారాలను ఆజాతిలో పుట్టినవారు తప్ప యితరులకు కష్టం. సాహసి అరుణ ఆపని చేసి తెలుగు సాహిత్యానికి ఒకపెద్ద సవాల్ విసిరిందనే చెప్పాలి.

ఎల్లి నవల తర్వాతే దళిత స్త్రీల సాహిత్యం ముందుకొచ్చింది. అణగారిన కులాలు, ఆదివాసీ తెగలలో స్త్రీలపై పితృస్వామిక అణచివేత వుండదు అని చెప్పే వారికి ఎల్లి, నీలి నవలలు కొరుకుడు పడవు. సమాజపు అట్టడుగు పొరల్లో వుండే ఆస్త్రీల పట్ల యితరులతోపాటు తమ జాతుల పురుషులు కూడా యెంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారు అనేది అలతి అలతి పదాలతో పూల దండలవంటి కధలు, కవిత్వం అల్లే ‘సున్నిత మనస్కులైన’ విశ్రాంతి వర్గాల సాహిత్యకారుల వూహకు అందదు.

‘రెండు నదులు’, ‘ఎల్లి’, ‘నీలి’ సీక్వెల్ నవలల తర్వాత అరుణ సౌదాలు కలిసి దళిత సాహిత్యంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఒకే ‘సౌదాఅరుణ’ గా ‘ఝాల్కారీ బాయి కోరీ’ సంక్షిప్త చరిత్ర, ‘బర్బరీకుడు’, ‘మహాత్మా జ్యోతీరావు ఫూలే’. ‘అంబేడ్కర్ వర్ణ నిర్మూలన’ వంటి నాటకాలపై దృష్టి పెట్టి చచ్చిపోయిన నాటక రంగానికి వూపిరి పోయడమే కాదు, దళిత రాజకీయాలను, అంబేడ్కర్ కుల నిర్మూలనను నాటకాల ద్వారా బలంగా ప్రచారం చేశారు. వారే రాసి, దర్శకత్వం వహించి తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు యేర్పాటు చేశారు. యిది శ్రమతో కూడిన గొప్ప ప్రయోగం, అనితర సాధ్యం. సౌదాఅరుణలు తమ నాటకాలతో దళిత సాహిత్యంలో యేర్పడిన మొనాటనీని బద్దలు కొట్టినట్టు అయ్యింది.

అరుణ ఒక మార్క్సిస్టుగా మొదలై అంబేడ్కర్ వాదిగా మిగిలింది. అన్ని రకాల వుద్యమ సిద్ధాంతాలను, సాహిత్యాలను లోతుగా అధ్యయనం చేసింది. కొంతకాలం విరసంలో పనిచేసింది. సాధారణంగా ఒక వుద్యమ సంస్థలో పనిచేసే సహచరులు, లేదా భార్యాభర్తల్లో మగవాళ్ళు తమ సంస్థతో విభేదించి బైటికి వెళ్తే స్త్రీ కూడా మారు పలక్కుండా పురుషుడి వెనకే నడుస్తుంది, ఆమెకి అతనితో భిన్నాభిప్రాయం వున్నా అదేంటో బైటికి వచ్చే పరిస్థితి లేదు, అక్కడా కుటుంబ నీతే వర్ధిల్లుతుంది. అయితే సౌదాఅరుణ తమ వ్యక్తిత్వాలను కుటుంబ చట్రంలో బందీ చేసి బలిచేసుకోలేదు. ఆయన విరసంతో విభేదించి బైటికొచ్చ్సినా, ఆమె అక్కడే వుంది. అరుణ ఎల్లి నవల మొదట విరసం ప్రచురణ గానే వచ్చింది. తర్వాత కొన్నాళ్ళకు ఆమె విరసం నుంచి బైటకొచ్చి ఫూలే అంబేడ్కర్ వాదంతో పనిచేశారు. ‘న్యూ సిలబస్’ ప్రచురణల సంస్థ ‘దస్య’ నాటక అకాడెమీ వారి సంతానం. తమ వ్యక్తిత్వాలు నిలుపుకుంటూనే సౌదాఅరుణ ఒకే మెదడుతో, మనసుతో పనిచెయ్యడం అబ్బుర పరుస్తుంది. అరుణ తన దేహంపై బుద్ధిస్ట్ పంచశీల జెండా గుడ్డ కప్పమని అడిగిందని చెప్పి సౌదాగారు పిల్లాడిలా యేడుస్తూ చెప్పిన దృశ్యం వెంటాడుతుంది.

అయితే అరుణ కృషికి తగిన గుర్తింపు వొచ్చినట్టు అనిపించదు. ఎల్లి, నీలి నవలలను స్త్రీవాద సాహిత్యం చూసీ చూడనట్టు వ్యవహరించింది. దళిత సాహిత్యకారులు కొంతమేరకు ఆనవలల మీద చర్చించినా అది అంతంత మాత్రమే! అయితే ఆధునిక కాలంలో దళిత స్త్రీవాద స్ఫ్రుహతో సాహిత్యం యింకా రాకముందే వచ్చిన ఎల్లి నవల దళిత స్త్రీ సాహిత్యానికి గొప్ప స్ఫూర్తిని యిచ్చిందనడంలో సందేహం లేదు. మార్క్సిస్టు అరుణ, అంబేడ్కరైట్ అరుణ కలగన్నది అసమానతలు, వివక్ష, హింసలేని సమాజాన్నే!  బుద్ధ వందనం, లాల్ సలాంలతో ఆమె అంతిమ యాత్ర ప్రారంభమైంది. తనకంటూ స్థిరమైన అభిప్రాయాలు, ప్రతి అంశం పట్ల స్పష్టత ఆమె స్వంతం. సమాజం గొప్పవి అని భావించే విలువలన్నిటినీ ధిక్కరించి స్వేచ్చాయుతమైన అంతరాలులేని సమాజాన్ని  కలగని దాన్ని సాకారం చెయ్యడానికి చివరి వరకూ పనిచేసిన అరుణ జీవితం, వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం. ఆమె ప్రారంభించిన పనిని ముందు తీసుకెళ్ళడమే ‘ఎల్లి అరుణ’కి మనం యిచ్చే ప్రేమపూర్వక నివాళి.

*

 

చల్లపల్లి స్వరూప రాణి

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎల్లి అరుణ గారి పరిచయం బావుంది

  • ‘సమాజం గొప్పవి అని భావించే విలువలన్నిటినీ ధిక్కరించి స్వేచ్చాయుతమైన అంతరాలులేని సమాజాన్ని కలగని దాన్ని సాకారం చెయ్యడానికి చివరి వరకూ పనిచేసిన అరుణ జీవితం, వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం. ఆమె ప్రారంభించిన పనిని ముందు తీసుకెళ్ళడమే ‘ఎల్లి అరుణ’కి మనం యిచ్చే ప్రేమపూర్వక నివాళి.’
    మీతో నూరు శాతం ఏకీభవిస్తున్నాను స్వరూపా!

  • అరుణ గారి మీద మంచి నివాళి. మీరన్నట్టే వారి సాహిత్య కృషి కి తగిన గుర్తింపు రాలేదు.

  • అరుణ గారి గురించి మంచి వ్యాసం రాసారు మేడం… ఎవరు గుర్తించిన గుర్తించకపోయిన, చరిత్రలో అరణ గారి స్థానం నిలిచిపోయింది.

  • మిత్రుల జ్ఞ్యాపకాల్లో మాత్రమే నిలిచిపోవడం కొందరి విషయంలో సరైంది కాదేమో. అరుణ మీద మీరు ఇంకా కొందరు రాసిన నివాళి వ్యాసాలు చూస్తే, అరుణ మరణం తర్వాత మనలాంటివాళ్ళం ఆమె కృషిని కొనసాగించాల్సే ఉందనిపించింది. 1980 లో మొదలైన ఫెమినిస్ట్ ఉద్యమం అర్బన్ ఫెమినిజంగా మిగిలిపోయింది. గ్రామీణ బలహీన వర్గాల జీవన్మ్రణ సమస్యలు దళిత ఉద్యమం బలపడ్డాకే సాహిత్యంలో చోటు చేసుకుంది.
    ఎల్లి, నీలి నవలలను ఒకే సంపుటిగా తిరిగి తేవాలి. సాహిత్యంలో ఆమె లేవనెత్తిన జీవితాలపైన ఆమె సాహితీ కృషిని నలుగురితో పంచుకోవాలి. మీ సారధ్యంలో ఈపని జరగాలి. అది అరుణకు నివాళిగా మనం సాహిత్యంలో చేయగలిగిన పని. దీనికి పర్స్పెక్టివ్స్ తరఫున చేయగలిగిన నావంతు బాధ్యత తప్పక చేస్తాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు