అంత మాత్రాన అంతా కోల్పోయినట్టేనా?!

 కవులు ‘వస్తువుల్ని స్వీకరించడం ఎలా?’ అనే సందిగ్ధతకు ఈ కవిత సమాధానం చెబుతుంది.

వయిత్రి నాంపల్లి సుజాత వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఇప్పటివరకు 2 వచన కవిత్వ సంపుటులు( మట్టి నా ఆలాపన – 2009, జొన్న కంకి- 2020) మరియు 2 నానీల సంపుటులు( నెమలీకలు- 2005, మట్టి నానీలు- 2014) వెలువరించారు. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగ బదిలీల ఈ నేపథ్యంలో తీసుకొచ్చిన వివాదాస్పద జీవో నెంబర్ 317 ,  దాని పర్యవసానాలను ఆధారంగా చేసుకుని రాసిన ,”మార్పుని కోరుకుందాం” కవిత గురించి మాట్లాడుకుంటున్న సందర్భమిది.
*
మార్పుని కోరుకుందాం..!!
————————————–
మిత్రమా..నచ్చింది
కోరుకోవడం తప్పుకాదు..
కోరుకున్నది దొరక్కపోతే 
నైరాశ్యం ఏల
దొరికిన దానినే ప్రేమిద్దాం..
ఉన్నపళంగా
గూటికి దూరమవ్వాలనడం
హఠాత్పరిణామమే..
అది ఊహించని శరాఘాతమే..!
అంత మాత్రాన అంతా కోల్పోయినట్టేనా
ఇంతలా చింతించడమా
ఉద్యోగం మన విద్యుక్తధర్మం కాదా..
అలాంటప్పుడు కొన్ని అనివార్యాలను 
ఆమోదించక తప్పదు.
అవ్వా బువ్వా.. ఏకకాలంలోనే 
అంటే అందరికీ కుదరకపోవచ్చు
ప్రాతిపదిక ఏదైనా పంచేది మన ప్రాంతంలోనే కదా
ఓ సారి సరిహద్దున వణుకుతున్న
సైనిక సోదరులను చూడు
అంతకన్నా మేలే కదా
అహోరాత్రులూ కష్టపడి ఇష్టంగా తెచ్చుకున్న
అఖిలభారత సర్వీసులూ ఉన్నాయి
దేశమంతా వాళ్లదే..
పోటీపడి సేవలందింస్తూ ఉంటారు
అంతకన్నా  మెరుగే కదా..
నా ఇల్లూ..నా వోళ్ళూ
నా జాగా..నా పల్లే నా పిల్లలూ
అందరికీ ఉంటాయి కలలు 
ఎక్కడి పరిసరాలనో మరెక్కడి వాల్లనో
నా వాళ్లే అన్నంతలా ప్రేమిస్తున్నారు
అదీ కదా ప్రేమాన్విత తత్వం
భిన్నత్వంలో ఏకత్వం.! 
కోట్ల మంది నిరుద్యోగులు రోడ్ల మీదే
చంద్రమండలం మీదైనా సరే 
నౌకరీ దొరికితే చాలు
హత్తుకునేందుకు సిద్ధంగానే ఉన్నారు
వాళ్ళూ మనలాంటి వాళ్లే.!
జిల్లాలకు
పేర్లు మాత్రమే మారినయ్..
భౌగోళిక దూరం  పెరిగిపోలేదు 
అయినా..
ఇప్పుడు ప్రపంచమే ఓ కుగ్రామం..
ఎన్ని రవాణా సౌకర్యాలూ
మరెంత సమాచార సాంకేతిక విప్లవం
మన అరచేతుల్లోనే
ఆ సౌలభ్యం తోనే 
మన పిల్లలని దేశ విదేశాల 
దాస్యానికి పంపడం లేదూ..
ఈ మాత్రానికే డీలా పడితే ఎలా..!
మీకేం..ఎన్నైనా చెప్పొచ్చు
కోరుకున్న జిల్లాలు దొరికుంటాయ్
అనుకుంటున్నారేమో..
మా కడగండ్లని  వింటే  మూర్ఛిల్లుతారు.
ఏళ్లకు యేల్లూ..
మున్నూటాయాభై రూకలతో
ఎలా వెళ్లదీసామనుకుంటారూ
ఎన్ని వేల మైళ్ళూ 
మా కాళ్ళ కింద అరిగిపోలేదూ.!?
మిత్రులారా..నీరుగారిపోకండి
ఆశావహ దృక్పథాన్ని పెంచుకుందాం..
మనకోసమే ఎదిరిచూస్తున్న 
ఆ పిల్లలనూ కొన్నాళ్ళు ప్రేమించి వద్దాం..
ఎప్పటికైనా..
చేరేది సొంతగూటికేగా..!
ఎందరికుంటుందీ సదవకాశం..! 
*
అతి సున్నిత మనస్కులైన ఉపాధ్యాయులు, ఉద్యోగుల హఠాన్మరణానికి, బలవన్మరణానికి బలవుతున్న పరంపరను చూస్తూ నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్న తరుణమిది. అన్నీ తెలిసినవారు, అందరికీ బోధించాల్సిన వారు ఉన్నఫలంగా కుప్పకూలి పోతున్నప్పుడు ఒకపక్క వేదన, మరోపక్క కాసింత భరోసాను ఇవ్వలేని ప్రభుత్వ నిర్లక్ష్యం; స్వీయ నియంత్రణ, నిర్ణయాధికారం కోల్పోతున్న వారి పట్ల ఏకకాలంలో కాసింత జాలి, కోపం కలుగకమానదు. భద్రమైన జీవితాల్ని  ఛిద్రం చేసుకుంటున్న తీరుకు కడుపు రగిలిపోతోంది. తిన్నదరగని  చావులని నిరుద్యోగ యువత పెడుతున్న శాపనార్థాలకి గుండె కలుక్కుమంటుంది. ప్రతి సమస్యకి ఓ పరిష్కార మార్గం ఉంటుంది. అలాగని అన్నింటికీ చావు మాత్రమే పరిష్కారం కాదు. ఇక్కడ సర్దుబాటు చేసుకోలేని, సంఘర్షణ తట్టుకోలేని బలహీనమైన గుండెల కథ ఇది. ఏదో జరగబోతుందనే ఊహల్లో, అంతా అయిపోయిందనే భ్రమల్లో ప్రాణాలు కోల్పోతున్న విగతజీవుల వ్యథ ఇది.
*
ముల్కీ నిబంధనలు, స్థానికత అంశం ఇప్పటిది కాదు. తెలంగాణ రాష్ట్ర సాకారానికి పనికి వచ్చిన ఆయువుపట్టు లాంటి విషయం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో స్థానికతను బేఖాతరు చేస్తూ సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగ బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల జరుగుతున్న రభస ఇది. మానసికంగా సంసిద్ధం కాకముందే రాత్రికి రాత్రి జారీ చేసిన జీవో ప్రకారం ముల్లె మూట సర్దుకుని పొమ్మనడం వల్ల జరుగుతున్న విపరీతం ఇది. పది జిల్లాలను 33 పోగులు పెట్టి ఏ జిల్లాకు అలాట్ చేస్తే అదే జిల్లాలో పదవీ విరమణ చేయాల్సిందేనని ఖరాఖండిగా, కటువుగా చెప్పడం వల్ల జరుగుతున్న దారుణం ఇది. కవయిత్రి “మార్పుని కోరుకుందాం” అని మానసికంగా సిద్ధపరిచే, భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. అప్పటికింకా ఏ ప్రాణం పోలేదనే చెప్పాలి. కొన్ని అపోహలు, విధి విధానం లేని అనాలోచిత నిర్ణయాలు ప్రాణాల్ని పణంగా పెడుతున్నాయి.
*
కవిత  బయటికి ప్రత్యక్షంగా చెబుతున్న విషయాల కంటే వాటి మాటున పరోక్షంగా, అంతర్గతంగా చెప్పని విషయాలు కూడా మనల్ని ప్రభావితం చేస్తాయి. ఈ కవితను సంపూర్ణంగా అవలోకిస్తే కొన్ని విషయాలు అవగతమవుతాయి. ఏదో ఒక సందర్భంలో సర్దుబాటు వీలుకానప్పుడు సంఘర్షణ మొదలవుతుంది. ఏదో ఒకటి తేల్చుకోవాల్సి వస్తుంది. ఏదో ఒక నిర్ణయానికి కట్టుబడాల్సి వస్తుంది. ఇష్టంగానో, అయిష్టంగానో కొన్నింటిని స్వీకరించాల్సి వస్తుంది. కనుక మనిషి యొక్క మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో, ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
రెండు అనుకూలమైన విషయాల్లో నుంచి ఒకదాన్ని తప్పక ఎంచుకునేటప్పుడు జరిగే ఉపగమ – ఉపగమ సంఘర్షణ(Approach- Avoidance Conflict); రెండు అననుకూలమైన లేదా ప్రతికూలమైన విషయాల్లోంచి ఒకదాన్ని  తప్పక ఎంచుకునేటప్పుడు జరిగే పరిహార – పరిహార సంఘర్షణ (Avoidance- Avoidance Conflict);  రెండు విషయాల్లో అనుకూలమైన దానికి తక్కువ పురోగతి/సానుకూల అంశాలు, ప్రతికూలమైన దానికి ఎక్కువ పురోగతి/సానుకూల అంశాలు ఉన్నప్పుడు ఏదో ఒకటి తప్పక ఎంపిక చేసుకునేటప్పుడు జరిగే ఉపగమ-పరిహార సంఘర్షణ(Approach- Avoidance Conflict); అనుకూల ప్రతికూల అంశాలు రెండూ కలిసి వున్న అనేక విషయాల్లో ఒక దాన్ని తప్పక ఎంపిక చేసుకునేటప్పుడు జరిగే బహుళ ఉపగమ- పరిహార సంఘర్షణ(Multi approach- Avoidance Conflict).   ఏ మనిషిలోనైనా ఈ నాలుగురకాల సంఘర్షణ ప్రధానంగా ఉంటుంది. వ్యక్తి అంతర్గత సంఘర్షణ(Inter personal conflict)తో పాటుగా ఇక్కడ సమూహ అంతర్గత సంఘర్షణ(Intergroup conflict) కూడా దాగి ఉంది. . కవితలోని ‘వస్తువు’ సమూహ అంతర్గత సంఘర్షణను సంతృప్తి పరిచే దిశగా కొనసాగలేకపోయింది. అందుకే ఈ పరిస్థితి కొంచెం జటిలమైనది. ఏ ఒక్కరినో సంతృప్తి పరిస్తే సమస్య సద్దుమణగదు.
*
ఇక్కడ రాజకీయ చతురత ముఖ్య భూమిక పోషించింది. అదే బలమైన సమూహాల్ని విడగొట్టి ఏకాంత ద్వీప సముదాయంగా మార్చడం. సమాజాన్ని కుల పరంగానూ, మత పరంగానూ విడగొట్టి విద్వేషాలను రెచ్చగొట్టడం లాంటిదే ఇది అని చెప్పొచ్చు. సమూహంలోని కొన్ని బలమైన శక్తులు వారి స్వప్రయోజనాల కోసం సమూహంలోని వ్యక్తుల్ని బలి పెట్టడం ఇక్కడ కూడా జరిగింది. కవి ఆశిస్తున్న మార్పును కోరుకుందాం అనేది  ఆహ్వానించదగినదే అయినప్పటికీ వ్యవస్థాగత పరంగా, విధానపరమైన నిర్ణయాల విషయంలో ఏకపక్ష ధోరణి, సంఘటితంగా పోరాటం చేయలేని నిస్సహాయ స్థితికి దిగజార్చిన శక్తుల పట్ల విముఖత ఎప్పటికీ ఉండాలి. దాన్ని తీవ్రంగా ప్రతిఘటించాల్సిందే! సీనియర్స్, జూనియర్స్ గా విడగొట్టడం, భార్యాభర్తల బదిలీల(spouse category) విషయాన్ని హైలెట్ చేయడం, స్థానికత అంశాన్ని మరుగు పరచడం ఇత్యాది అంశాలు సంఘటితంగా పోరాడాల్సిన వ్యక్తుల మధ్య చీలిక లు తీసుకొచ్చి’ రాజకీయం’ తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేసింది. నిరసనలు, ధర్నాలకు ఆస్కారం లేకుండా ప్రత్యేక జీవోలు జారీ చేసింది. ఒమిక్రాన్ బూచి ప్రదర్శిస్తూ భయపెట్టింది. ఉద్యోగ భద్రత కు ఎసరు పెడుతూ కేటాయించబడిన స్థానాలకు పరుగులు పెట్టించింది. ముందస్తు సెలవులు ప్రకటించి  ప్రక్రియను వేగవంతం చేసేలా ప్రభుత్వమే రాజకీయ ఎత్తుగడల్ని వేసింది. మార్పును కోరుకోవడానికి అందరూ సిద్ధమే కానీ ఆ సంసిద్ధతకు కావలసిన సమయం ఇవ్వకపోవడం, అందుకు తగిన విధంగా మానసికంగా ట్యూన్ చేయకపోవడం, అనవసర భయాలకు తగినవిధంగా ప్రతిస్పందించకపోవడం, కొందరంటున్నట్టు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లోని లోపాయికారితనం-  అంతిమంగా నిండు ప్రాణాల్ని బలితీసుకోవడం శోచనీయం.
*
 కవులు ‘వస్తువుల్ని స్వీకరించడం ఎలా?’ అనే సందిగ్ధతకు ఈ కవిత సమాధానం చెబుతుంది. అయితే ‘వస్తువు’కు కొన్ని పరిమితులు విధించబడుతున్నాయనేది సత్యదూరం కాదు. కవి స్వీకరించిన వస్తువును ఎలివేట్ చేసిన విధానంలో ఎక్కడా నెగిటివిటీ పొడ చూపలేదు. పాజిటివ్ థింకింగ్ ని ప్రోత్సహించింది. అందుకు కవి అభినందనీయులు.
*

బండారి రాజ్ కుమార్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు