హంస బేసర

‘‘మహా అయితే పదైదొందలు వొస్తాయంట.’’

‘‘మిగిలిందంతా వాడి యెదాన గొట్టుకుంటాడంటనా?’’

‘‘నువు జెప్పింది ఆరు గ్రాముల నాలుగు గురిగింజలే గదా. చేదారం తోపుడూ అన్నీపోంగా మూడు గ్రాముల లెక్కకే యిస్తానన్నాడు’’

‘‘యింతకీ తెచ్చినారా? లేదా?’’

‘‘యింకేంటికి తెచ్చేది. యింకో అయిదొందలు పుట్టే దారి దొరికితే.. యీటిని పెట్టేది చిటికెలో పనే గదా అని సక్కంగా జేబీలో యేస్కోని వొచ్చినా’’

అప్పుడు జూసినా అమ్మని. చెవులు రెండూ తెల్లంగా వుండాయి.. ‘బోసిగా వుండాయి’ అనాలేమో! సన్నని బొక్కల్ని తేటగా జూపిస్తాండాయి.

ఆనాక అమ్మ మాటాళ్లేదు. పప్పులుసు తినడం పూర్తయిన నాయిన కంచంలో రొవ్వంత అన్నమేసి చారు పోసింది. నేనింకా ఆడదాక రాలా. నా కంచంలో రెండు వొడియాలు యేసింది. కడాన నాయిన అన్న మాటలకి నాక్కొంచిం నవ్వొచ్చింది. అమ్మ చూడగూడదనుకున్నా. చూసే వుంటాది. పిచికంత వుంటాదిగానీ డేగకళ్లు! ‘‘పులుసింకా యేస్కుంటావా రా’’ అని, నేను తల అడ్డంగా వూసగానే గిన్ని తీస్కబొయి లోపల పెట్టేసింది. అంటే యీ పూటకి ఆమె తినదన్నమాట. అలక. డబ్బులు తేలేదని. ఆ ముక్క మాటల్తో జెప్తే మా యమ్మ ఎందుకవతాది?

సద్దు జెయ్యకుండా తినడం ముగించి, కంచం కడిగేసి వచ్చి ప్రింటింగు మిషనుండే రూములో నేను సాపేసుకుని పడుకున్నాను. పక్క రూములో ప్రెస్సు కేసుల మజ్జెలో మడత మంచమేస్కోని నాయిన, పక్కన కింద సాపేసుకోని అమ్మా పడుకున్నారు. వోరగా యేసిన తలుపుల సందులోంచి జీరో వోల్టు బల్బు యెలుతురు నేనుండే గదిలోకీ గీతమాదిరిగా పడతావుంది. చానా సేపు గడిచిపోయింది. ఫస్టుషో సినిమాకు పోయినోళ్లు గూడా.. కతని జెప్పుకుంటూ యీదిలో పోతండారు. ఆళ్ల మాటలు గూడా అయిపోయినాక.. నాకు కునుకు పడతావుండేటప్పుడు.. అమ్మ మాట యినొచ్చింది.

‘‘బేసర గూడా  యిస్తా.. రేపు రెండువేలూ తేండి. రూపాయైనా తగ్గొద్దు.’’

‘‘యేది ఆ హంస బేసరా..’’ నాయిన గొంతులో ఆశ్చర్యం.

‘ఎన్ని బేసర్లుండాయని?’ ఆ ప్రశ్న అమ్మ నోట్లో రాలేదు. నా బుర్రలోనే పుట్టింది. ‘హంస బేసర గూడా పెట్టేయబోతాదా?’ నన్ను నేనే అడుక్కున్నాను.

అంత పంతంగా వంటి మీద వుండే ఉరువులు రెండూ కుదవపెట్టేసి డబ్బులు తేవాలని అమ్మ పడుతున్న ఆరాటానికి కారణం నేనే. నా నెత్తిమీద పెట్టడానికి అప్పుటికప్పుడు కావాల్సిన డబ్బు నాలుగువేలు. అంతకి దోవ లేదు గాబట్టి.. కొంచిం పుట్టిస్తే, మిగిలినదానికి కొంచిం టైము చిక్కతాదేమోనని అమ్మ ఆశె. హంస బేసరని గూడా కలిపి చదువుకు అంపిస్తే తప్ప పుట్టవేమో ఆ రెండువేలు!

* * *

హంసబేసర! అమ్మ నాకు తెలిసినప్పటినుంచీ ఆ ముక్కుమీదనే ఉంది. పైసా కంటె కొంచిం చిన్నదిగా ఉంటాది. కానీ అమ్మ ముక్కుకి పెద్దదే. తెల్లరాళ్ల హంసకి ఎర్రరాళ్ల రెక్కలు. అది లేకుండా అమ్మ మొహాన్ని నేను చూసెరగను. అమ్మకి అప్పుడప్పుడూ కోపమొస్తాది. ఎవురిమీదనైనా కడుపు రగిలినప్పుడు పుట్టే దుఃఖం ముక్కులోనే కనిపిస్తాది గదా, గులాబీ రంగులో ఉండే అమ్మ ముక్కు ఎర్రగా అయిపోతాది. అలాంటప్పుడు ఆమెని పక్కకి మళ్లించాలంటే నేనంటాను.. ‘నీ ముక్కు ముక్కెర ఒకేమాదిరి ఉండాయి మా.. హంసరెక్కల మాదిర్తోనే ముక్కు కొన గూడా’ అని! గడియ మటుకే ఉండే కోపాన్ని వదిలేసి, ముక్కు చీదుకుని, అమ్మ నవ్వేస్తాది.

బేసర లేకుండా కనిపించే ఆడోళ్లు చాలా తక్కవు. గతిలేనోళ్లు గూడా ముక్కుమింద బంగారం చుక్క బెట్టినట్టుగా సన్న ముక్కుపుల్లల్తో ఉంటారు. ఒంటిమీంద బంగారం ఎంతోకొంత ఉండాలనుకునేవాళ్లకి ముక్కెరకంటె ఇంకోటి కనిపించదు. ఎందుకంటే పుస్తెల్లో కాసుకంటె తక్కువ బరువుకే వొస్తాది. రెండు గురిగింజల మట్టానికి కూడా ముక్కుపుల్ల దొరకతాది. కానీ అమ్మ హంస బేసర మరీ అంత చిన్నది కాదు. మూడుగ్రాములుండేది. ఇయ్యాళ అమ్మ ‘నే అనుకున్నది జరిగే తీరాల’ అని తెగిస్తా ఉండాదంటే.. ఆ బరువే దైర్యం.

అందరు ఆడోళ్ల ముక్కుల్లో అలాంటిది కనిపించదు. నేను ఎప్పుడైనా అమ్మతో ‘నీ బేసర బలే వుండాది మా’ అంటుండే వోణ్ని. ‘పుట్టిన కాణ్నించీ నీకు నా బేసర మీదే కన్నురా’ అనేది. పసిబిడ్డగా ఉండేటప్పుడు నన్ను ముద్దుపెట్టమని అడిగితే.. ఒక ముద్దు బుగ్గ మీద పెట్టేసి, రెండో ముద్దు– తెల్ల ఎర్ర రాళ్లతో నిగనిగలాడే బేసరమీద పెట్టేవోణ్నంట. ఆ ముచ్చట్లన్నీ జెప్పేది.. హంస బేసర కత ఎత్తినప్పుడెల్లా!

శుక్రోరం పూట జూడాల ఆ బేసర వైబోగం. గులాబీరేకుల్లాగా ఉండే అమ్మ ఆ రోజుకి పసుపుముద్దయిపోతాది. చీకట్తో నిద్దర్లెయ్యగానే, మొహం నిండా పసుపు రాసుకోని తలకు పోస్కుంటాది. వాకిట్లో పేడ కళ్లాపి జల్లి, ఆ రోజు కొంచెం పెద్ద ముగ్గులే పెడతాది. గుళ్లో అమ్మ మాదిర్తోనే ఉంటాదా రోజు. కాపోతే ఆయమ్మకి శుక్రోరంపూట బంగారు చీర గడతారు మా వూళ్లో. అమ్మకి అదొక్కటే తక్కవ.

పచ్చటి మొహాన నుదట్న గుమ్మడి గింజంత ఎర్రటిబొట్టు. ముక్కుమీద మెరస్తాండే ఎర్రరాళ్ల హంస బేసర. చారు కోసమో, పచ్చడి కోసమో ఆరోజు యింటికొచ్చినోళ్లంతా ‘నీ బేసర బలే వుండాది కా’ అనేటోళ్లు, తొలీతగా చూస్తన్నట్టు! ప్రతి శుక్రోరమూ సందేళయినాక కుమ్మరోళ్ల తులశమ్మ వచ్చి దిష్టిదీసేసి ఏ కూరో నారో పెట్టించుకోని పోతావుండేది.

అలాంటి హంస బేసర లేని అమ్మ ముక్కుని ఆ మరసటి దినం జూడాల్సొచ్చింది. రాత్రి యింటికొచ్చిన నాకు అమ్మ ముక్కు గూడా, నిన్నటి రేతిరి జూసిన చెవుల మాదిరిగానే కనిపించింది. ఈ గాచారం నా గురించే పట్టిందని చెప్పాను గదా, ఎందుకంటే ఆ మరుదినమే నేను లాకాలేజీలో చేరబోవాల!

* * *

ఆరునెలల ముందరే నా డిగ్రీ అయింది. నా ఫ్రెండ్సంతా ఇంకా ఎంప్లాయిమెంటు ఎక్స్చేంజీ చుట్టూ తిరగతా వుండగానే.. నాకో ప్రెవేటు కంపెనీలో ఉజ్జోగం కూడా వొచ్చింది. గవర్నమెంటుజ్జోగం లాంటి ప్రెవేటు కంపెనీ. నాలుగేళ్లు పొయినాకైనా నిమ్మళమైన జీతమొస్తాదని గేరంటీ! ఎగిరి గంతేసి చేరిపొయినాను. ఏ రోజు కారోజు యెతుకులాడే బతుకులో, ఎసుట్లోకి వొచ్చేలాగా ఎంతోకొంత జీతం.. ఉజ్జోగం దొరకడం బెమ్మాండం అనిపించింది నాకు.

నా మాదిరిగానే మా అమ్మకు గూడా అనిపించాలని రూల్లేదు గదా. ‘మనకి డబ్బుకి గతిలేదు గాబట్టి.. నీ చదువు యీడ ఆగిపోగూడదు. నువ్వింకా చదవాల’ అని అమ్మ పట్టుదల. ‘ఈ దేశంలో కలెక్టరుగిరీ యెలగబెట్టాలన్నా డిగ్రీ సరిపోతాది.. యింకా సదివేదెందుకు? ఉజ్జోగం కుదురుగా జేసుకుంటే సాలు’ అనేది నా యితండం. ఈ కంపెనీవోళ్ల ట్రెయినింగులో హైద్రాబాదులో వుండిన ఆర్నెల్లలో, కుదురుగా కూసోలేక లాసెట్టు రాయడం ఇప్పుడు పేనం మీదికొచ్చింది. ఆ లాసెట్టులో నాకు ర్యాంకొచ్చింది. యూనివర్సిటీ లెవిల్లో ఆరో ర్యాంకు. నువ్వొస్తే సాలు బాబూ సీటిస్తాం అని ప్రెవేటు కాలేజీ నుంచి లెటరొచ్చింది, కాపోతే ఏడాదికి నాలుగువేలు ఫీజు. వొచ్చిందాన్ని వొదులుకోగూడదు.. చదివేతీరాల అంటాది అమ్మ. వొచ్చింది గదాని మురిసిపోడానికి యిదేమీ లాటరీగాదు.. మన చేతిచమురే వొదల్తాది, వొద్దని అంటాను నేను. మా ఇద్దరికీ మధ్య చాలా రోజులే నడిచింది గొడవ. అమ్మ వూరుకోలా. అలవాటుగా అప్పు పుట్టించాలనే చూసింది. వందా రెండొందల అప్పులు ఎప్పుడుబడితే అప్పుడు పుడతాయి. నాలుగువేలు కావాలంటే.. యేంజూసి ఇయ్యబోతారు ఎవురైనా? ‘కొడుకు ఉజ్జోగముండాది గదా తీర్చేస్తాం’ అని ఒకరిద్దరికి చెప్పింది గానీ.. ‘ఉజ్జోగముండగా మళ్లీ చదువేంటికమ్మా దండగ్గదా..’ అని మెత్తగా తిరక్కొట్టి పంపారంతా. అమ్మకి రోషం పెరిగింది.

‘‘యెట్టోకట్ట.. రెండువేలయినా సమాళించి యిస్తా. తీసకబొయ్యి సగం ఫీజు కట్టు. ఆరు నెలలాగి మిగతా కడతా అని జెప్పు. చేర్చుకుంటే చేరు. లేకపోతే వొచ్చేయ్..’’ అనింది నాతో. మాట తోసెయ్యలేక, యేణ్నించి తేబోతాది లే అనే దైర్నంతో ‘అట్నేలే’ అని ఒప్పుకున్నా. తామరపూల డిజైను కమ్మలకీ, హంస బేసర కీ యిట్టాంటి మూర్తం మనసులో బెట్టుకునే ఆ మాట అనిందని నాకు అయిడియా రానేలేదప్పుడు. ‘నా కొడుకు డిగ్రీతో చదువు మానెయ్యలే’ దని చెప్పుకోవాలనే పంతంకోసమే పుట్టిస్తాంది.. యీ రెండు వేలు!

* * *

రెండు వేలు- అప్పుటికి నా నెలజీతం అది! నెలాఖర్రోజున నోట్లు కవర్లో పెట్టి ఇచ్చేస్తారు. ఓ ఏడాదిపాటూ ఎనిమిదొందల్లెక్కన చేశాక, రెణ్నెల్ల కిందటే ట్రెయినీ అని చెప్పి ఆడదాకా పెంచారు. ఇంకో పదినెలలాగితే మూడు వేలవుతుంది. అంటే ఏంటన్నమాట. రోజుకు వంద. అయిదారేళ్ల ముందు ఢిల్లీగాడి నాయినకి నెలకి మూడువేలొచ్చేది జీతం. అప్పుట్లో వోడి నోట్లో ఆ మాట యిని.. నానా విధాలుగా ఆశ్చర్యపోయాన్నేను. ‘రోజుకి వంద రూపాయిలంటే.. యేమిరా జేస్తాడు మీ నాయిన అంత దుడ్లొచ్చేదానికి..’ అని వాడిని యెన్నితూర్లు అడిగానో లెక్కేలేదు. చెప్పానుగదా.. ఇంకో పదినెల్లాగితే నాగ్గూడా వొస్తంది. వొచ్చినప్పటి సంగతి గానీ.. యిప్పుడొచ్చే రెండువేల సంగతేంది. నెలాఖర్రోజున రేతిరి వొచ్చేటప్పుడు తెస్తాను. నెల పొడిచే మరురోజున నాయుడుతాత దగ్గరికెళ్లాలి. ఎనిమిదొందలు ఆయనకి వడ్డీ కట్టాలి. ఆణ్నించి నేరుగా బేంకీకి పొయ్యి ఇంకో తొమ్మిదొందలు లోనుకి కట్టాలి. మిగిలిన మూడొందలు యింటి కర్చులకని అమ్మ కాణ్నే వుంటాయి. నాకు పెద్దగా డబ్బుల్తో పనుండేది గాదు. ఆఫీసుకు బోతే రెండుసార్లు ఫ్రీగా టీ బోస్తారు. కొంచెం పెద్దజీతాలొచ్చే సీనియర్లతో మధ్యలో యింకోసారి కేంటీనుకి బోవాల్సొస్తే.. టీ డబ్బులు వాళ్లిచ్చేస్తారు. వాళ్లోసారి యిస్తే.. యింకోపారి నేనియ్యాలనేంత బిగుమానం లేదు నాకు. గతిలేనోడికి బిగుమానం యేటికి?

నా జీతంలో మిగిలే మూడొందలతో యిల్లు గడవదు గానీ.. మిగిలిన మట్టానికి నాయిన సంపాదన తోడయ్యేది. కాపోతే నాకొచ్చినట్టుగా పలానా తేదీనాటికి పలానా లెక్కన డబ్బులొస్తాయనే గేరంటీ లేదు. నెలపొడుక్కీ కొంచిం కొంచింగా వొస్తావుంటాయి. వొచ్చినప్పుడు తీర్చుకునే చేబదుళ్లతో నెట్టుకుంటూ సాగుతున్న సంసారం మాది.

యిట్టాంటప్పుడు. ఒక్కపాలిగా రెండువేల రూపాయిలు ఖర్చు పెట్టేంతగా పేనం మీదికి ఏమొచ్చిందని? మాయమ్మ ‘పెట్టే తీరా’లంటాది. నేను ‘యెందుకు దండ’గంటాను. మా నాయిన యేలు పెట్టడు. ఆయన పేరు వెంకటక్రిష్ణ అని ఉండేదంట. యింటిదైవం కోసం పేరు మార్చుకున్నాడు. అందురూ ‘కిట్టయ్యా..’ అని పిలిచేవోళ్లంట! ఆ పేరు మాయమైపోయింది.. తీరుమటుకు మిగిలిపోయింది. నోరు మెదపలేదు. ‘మీరేం డిసైడు జేసుకుంటే అది రైటు’ అన్నట్టుండిపోతాడు. చాలా విషయాల్లో.

ఈ రచ్చ నెల్రోజులుగా నడస్తానే వుంది యింట్లో!

నేను- వొద్దని. అమ్మ- అట్టా కావాల్సిందేననీ.

యెట్టాగో ఒక ఉజ్జోగం వొచ్చింది కదా. అయిదారేళ్లాగితే అయిదారువేలు గేరంటీ. అప్పుడింక ఏ అప్పూ వుండదు. ఎందుకూ కొరగాని దానికి వేలకువేలు తగలేయడం అవసరమా? అని నేను. యింకో వుజ్జోగం వొస్తాదనీ.. నువ్వు సంపాదించే లిబ్బి యెసుట్లోనుంచి దొంతికుండల నిండుకూ వొస్తాదనీ గాదు. యేదేమైనా చేసే తీరాల.. అని అమ్మ! అమ్మే నెగ్గింది. ఆమె వొంటిమీద వుండేటివి కుదవంగటికి బొయినాయి. నేను లా కాలేజీలో జేరినాను.

* * *

మూడేళ్లూ గడిసినాయి. నా ఉజ్జోగం పర్మినెంటు అయింది. జీతం కూడా పెరిగింది. ఒకటి రెండు అప్పులు కూడా తీరినాయి. అప్పుటిదాకా మార్వాడీ కొట్టులో చదువుకుంటుండిన హంస మళ్లీ కేళీవిలాసంగా ఎగురుకుంటా వొచ్చింది. అమ్మ ముక్కు మీద వాలింది. చెవితమ్మెల్లో మళ్లీ తెల్లతామరలు పూసినాయి.

ఉజ్జోగం ఉండాది గాబట్టి.. లాయరు చదువు అవసరం లేదని నేను వద్దనుకున్న మాట నిజమే. కానీ చేరినాక మాత్రం చదవకుండా వుండలేకపొయినాను. అట్టాగని కాలేజీ రోజూ పొయి ఉద్దరించిందేమీ లేదు. ‘నేను ఉజ్జోగం జేస్తండాను.. దినామ్మూ కాలేజీకి రమ్మంటే నాకు అయ్యేదిలే’ చేరక ముందే జెప్పినాను. ‘నువ్వు ఫీజు గడితే చాలు దేవరా.. రావాలని మేము గూడా అడగము. పరీక్షలు గూడా నీకు యిస్టమైతేనే రాయి’ అన్నట్టుగా వోళ్లు ఒప్పుకున్నారు. పుస్తకాలు కొన్నాను గాబట్టి ఇంట్లోనే చదువుకోని నాకు అర్దమైనంత వరకు రాసినాను. వోళ్లకి అర్దమైనంత వరకు మార్కులేసినారు. మొత్తానికి రెండు సమ్మత్సరాలూ తొలి యిడతలోనే పాసైపోయి, మూడో సమ్మత్సరం పరీక్షలు గూడా బాగానే రాసినాను.

ఓ రోజు పొద్దున్నే వాకిట్లో మెట్ల మీద గూసోని నాయినా నేనూ పేపరు చదవతా వుంటే అమ్మ కాఫీ తెచ్చిచ్చింది. జిల్లా పేపరు తీస్కోని టీవీ కార్యక్రమాల పేజీ చూస్తా గూచుంది అమ్మ. ఉన్నపళంగా ‘రేయ్.. నీ లా రిజల్సొచ్చినాయి రా’ అంది. నాకు హాల్ టికెటు నెంబరు గూడా గుర్తులేదు. ఆ కాయితాన్ని అమ్మే బద్రంగా దాసిపెట్టుండాది. తెచ్చి పేపర్లో యెతికింది. ‘ఫస్టు క్లాసురా’ అనింది మురిసిపోయి ముద్దులు పెట్టుకుంటా. నాయిన గూడా మురిసిపొయినాడు.. ‘బానే పాసైనావు రా. కాలేజీకి పోకపొయినా గూడా’ అని!

లా పాసుగావడం వలన కొత్తగా నాకొచ్చిన మురిసిపాటు గానీ, మిడిసిపాటు గానీ ఏదీ లేదు. ఎందుకంటే.. లాయరు పనిజేసినా నా ఉజ్జోగానికి మించి రాబోయేది లేదు. అది పాసుగావడం వలన.. నా ఉజ్జోగంలో రూపాయి జీతం పెరగబోయేది లేదు. నామట్టుకు.. డిగ్రీ తరవాత యింకో డిగ్రీ- అంతే! నా పాటికి నేను ఆఫీసుకు బొయినా.

కానీ ఆఫీసు నుంచి తిరిగొచ్చేపాటికి అమ్మ సంతోషం యింట్లో యింకా గుబాళిస్తానే వుంది. రవ్వకేసరి చేసి, మైసూరుపాకు ముక్కల్లాగా రెడీగా కోసి ఉంచింది. నాకో ముక్క తినిపించింది. మేం అందరం తిన్నాక.. చుట్టుపక్కల వుండేటోళ్లకి గూడా తలా రెండేసి ముక్కలిచ్చింది.

నాకు మాత్తరం కొంచిం కినుకగానే వుండాది. డిగ్రీ పాసయినప్పుడు, ఉజ్జోగం వచ్చినప్పుడు గూడా అమ్మ ఈ మాదిర్తో పండగ జేసుకోలా. ఎందుకూ కొరగాని లా చదివితే మటుకు అదేదో యింతగా మురిసిపోతావుండాది. నా మనసులో ఉండే మాటని నేనేం దాసుకోలా. ఆ రేతిరి అన్నాలు అయిన తర్వాత అమ్మనే అడిగినా..

‘‘ఇంత పండగ జేసుకునే యిచిత్తరం యేం కనిపించింది మా. బతకడానికి తిండిపెట్టే డిగ్రీ ఆల్రెడీ చదివేసినా. ఏదో చిన్నదో పెద్దదో జీతమొస్తానే వుండాది. ఇయ్యేమీ నీకు కుశాలగా అనిపించలేదు గానీ.. ఇయ్యాల లా పాసైతే అంత ఆనందం యేంటికి?’’ అని!

ఓ నిమిషం గమ్మునుండి తర్వాత అంది. ‘‘ఒరేయ్  నువ్వు బాగ చదువుకునే బిడ్డవి. మన ఇంట్లో జరుగుబాటుకి గతి లేదు కాబట్టి.. నీ చదువు మాన్పించి.. పనిలోకి బెట్టేసినామనే మనేద నాకు మిగలగూడదు..’’

అప్పటికి నా నోరు మూయించడానికే చెప్పిందని మాట తీరుతో అర్థమవుతోంది. సమాధానం ఇచ్చేశానని ఆమె అనుకున్నది గానీ.. నా ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఆ మాటకు నేను కన్విన్స్ కానేలేదు. కానీ ఆమె స్వరం విన్నాక ఆ రాత్రి వేళ రెట్టించాలని కూడా అనిపించలేదు. నిశ్శబ్దాన్ని సృష్టించడమే.. వేరొకరి భావోద్వేగాల ప్రవాహానికి మనం వేయగలిగిన ఆనకట్ట- చాలా సార్లు!

***

ఆరోజంటే వదిలేశాను గానీ.. ఆ తర్వాత కొన్నాళ్లకు.. వాతావరణం ఉత్సాహభరితంగా ఉన్నప్పుడు మళ్లీ అడిగాను అమ్మని. నన్ను తొలిచేస్తున్న సందేహం గురించి. ఈసారి కాస్త నింపాదిగానే చెప్పింది.

‘‘వొరేయ్.. మనిషి జనమెత్తినాక చచ్చేదాకా నేర్చుకుంటానే ఉండాల. కానీ నీకు అప్పటికి ఏమైంది? ఏదో డిగ్రీ చదివినాం. ఉజ్జోగమొచ్చేసింది.. బతుకంతా గడిచిపోతాది- అనే ఫీలింగొచ్చేసింది. అట్టాంటి ఆలోచనే మనల్ని నాశినం జేసేస్తాది. బలవంతంగానైనా నువ్వు ఏదో ఒకటి చదవతానే ఉండేమాదిర్తో, నేర్చుకుంటానే ఉండేమాదిర్తో చెయ్యాలనుకున్నా. ఇంతలో నీకు లా సీటొచ్చింది. గతిలేదు కాబట్టి ఉరువులు కుదవకి అంపి ఫీజు డబ్బులు సమాళించినా. హంసబేసర దేముండాది.. నిన్నయితే మనిషిగానే కాపాడుకున్నా గదా..!’’

నిరంతరం నేర్చుకుంటూ ఉండడమేనా, అమ్మ నిర్దేశంలో, మనిషికి జీవలక్షణం!

నా బుర్రలో ముద్ర పడిపోయింది.. నేర్చుకోవడం ముఖ్యంగానీ.. కాలేజీలు సర్టిఫికెట్లూ అవసరం లేకుండా వంద నేర్చుకోవచ్చు కదా.. అనే తృష్ణ, జిజ్ఞాస!

ఇప్పుడు అమ్మలేదు. హంసబేసర గూడా లేదు. నాయిన పొయినాక ఆమె వదిలేసుకున్న చానా వాటిలో బొట్టు లాగే బేసర కూడా ఉంది. మిగిలిన వాటిల్తో పాటూ దాన్ని చెడగొట్టి ఇంకేంటివో చేయించుకుంది.

బుర్రలో పడిన ముద్ర మాత్రం నన్ను కాపాడుతూనే వొచ్చింది. ఏదీ వొదిలిపెట్టేవోణ్ని కాదు. నా వృత్తిలోనే నాకు సంబంధం లేని వంద పనులు నేర్చుకున్నా. ఇయ్యాల ఎప్పుడు ఏ పని దొరికితే అది జేసుకుంటా.. నిమ్మళంగా పొట్టపోసుకుంటున్నామంటే.. ఆయేళ హంసబేసర నేర్పిన పాఠమే గదా! కార్పెంటరు, ఎలక్ట్రీషియను, ప్లంబరు పనులు, చిన్ని చిన్ని మెకానిక్కు పనులూ అన్నీ నేర్చుకుంటూనే ఉన్నా. ఈ యూట్యూబు ఒకటి దొరికింది మా పేణాలకి. డెబ్బయ్యేళ్ల వయసులో అమ్మకి మలై కోఫ్తా, ఆలూ మేతీ కాజూ మసాలా వంటి స్టార్ రెస్టారెంట్ మెనూ ఐటమ్స్ ను నేర్పడానికి, నాకు అవసరాన్ని బట్టి అన్ని చిల్లర పనులూ నేర్పడానికీ! యీ నడుమే.. చెప్పు తెగిపోతే కుట్టుకోడానికి పనిముట్లు, దారాలూ తెప్పించా ఆమెజాన్నుంచి.

కడశ్వాస దాకా అమ్మ బతికే వునింది.

నేనూ చచ్చేదాకా బతికే వుండాలని కోరిక, ఆమెలాగా! అందుకే యివన్నీ నేర్వడం.

***

‘హంసబేసర ని అలాగే ఉంచేయాల్సింది.. ఎవరైనా యేసుకుంటారు గదా’ అంటుండేవాణ్ని ఎప్పుడైనా.. అమ్మ కడపటి దాకా.

‘ఓల్డు ఫేషనులేరా? ఇప్పుటోళ్లెవురూ యేసుకోరు’ అంటుండేది.

ఫేషను సంగతి తరవాత.. కొన్ని కొందరికే అందగిస్తాయి. ఉరువులు  మటుకే కాదు- మాటలు కూడా!

పలికిన మాటనే.. బతికిన బతుకు రూపంగా మలుచుకునే వాళ్లకి!

*

మునిసురేష్ పిళ్లె

సురేష్ పిళ్లె స్వతహాగా జర్నలిస్టు. శ్రీకాళహస్తిలో పుట్టి, పెరిగి హైదరాబాదులో స్థిరపడ్డారు. కథలు, కవితలు, రాజకీయ వ్యంగ్య రచనలు, సీరియల్ నవలలు రాశారు. కార్టూన్లు గీస్తారు. వృత్తి ప్రవృత్తి ఒకటే కావడం అదృష్టం. జర్నలిజంలో పీజీ, బీఎల్ చేశారు.
Facebook :: https://www.facebook.com/kamspillai

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.