మే నెల ఎండ తీవ్రంగా ఉంది. రోడ్డు మీద వెళ్తుంటే ఎండమావులు కనిపించేంత వేడి. విశాఖపట్నం. సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్. నాలుగో ఫ్లోర్‌లో ఒక వన్ బి హెచ్ కే ఫ్లాట్. దానిలో బెడ్ మీద పడుకుని, కాలు మీద కాలు వేసుకుని రూఫ్ వైపు చూస్తూ ఉన్నాడు ఒక 65 ఏళ్ల వృద్ధుడు. కిటికీలు తెరిచే వున్నాయి. ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరుగుతోంది. అయినా వైజాగ్ సముద్ర గాలిలోని హ్యూమిడిటీ వల్ల అతనికి చెమటలు పడుతున్నాయి.
అలా తిరుగుతువున్న ఫ్యాన్ అతన్ని గతంలోకి తీసుకెళ్లింది. దాదాపు 40 ఏళ్ల క్రితం ఎంత అందంగా వుండేవాడు అతను. ప్రేమించడానికి అన్నీ అర్హతలు వున్నాయి అందుకే ప్రేమించాడు, ఆ అమ్మాయి కూడా అంతకంటే ఎక్కువే తిరిగి ప్రేమించింది. కానీ పెళ్లి చేసుకునే అర్హతలు లేవు అప్పటికి. అందుకే దొరికిన వుద్యోగంలో చేరిపోయాడు, కానీ అదొక్కటే అర్హత కాదని ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఇక చేసేదేం లేక ఆ అమ్మాయిని గుడిలో పెళ్లి చేసుకుని స్టీల్ సిటీ దగ్గరలో కాపురం పెట్టాడు.అతనిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఒక చిన్న ఉద్యోగం. సాధారణ కింద స్థాయి మేనేజర్. జీతం చాలీ చాలనంతగా ఉండేది. అయినా వాళ్లు ఎప్పుడూ సంతోషంగానే ఉండేవారు. ఆ సంతోషానికి ప్రేమకు గుర్తుగా రెండేళ్లకి వాళ్లకు కొడుకు పుట్టాడు. అతన్ని ఎంతో గారాబంగా చూసుకునేవారు. ముఖ్యంగా అతని భార్య కొడుకుని కంటికి రెప్పలా చూసుకునేది. అన్నీ తానే అయ్యి పెంచింది మూడేళ్లు.
కాలం గడుస్తూవుంది, కుటుంబ బాధ్యతలు పెరిగాయి. డబ్బు అవసరం కూడా ఎక్కువైంది. ఆమె కూడా ఉద్యోగానికి వెళ్తాను అన్నది. కొంచెం ఆలోచించాడు. పరిస్థితులు వద్దనే ఆస్కారం ఇవ్వలేదు. సరే అనలేదు కానీ వద్దు అని కూడా చెప్పలేకపోయాడు. ఆమె చదివిన గ్రాడ్యుయేషన్ దేనికన్నా వుపయోగపడుతుందేమో అని వుద్యోగ వేటలో పడింది. తాను చదివిన చదువుకి సంబంధంలేని ఒక చిన్న ప్రైవేట్ సంస్థలో రిసెప్షనిస్ట్‌గా చేరింది. ఆమె ఉద్యోగం షిఫ్టుల వారీగా ఉండేది. ఒక రోజు ఉదయం షిఫ్ట్ అయితే ఇంకో రోజు సాయంత్రం షిఫ్ట్.
*
పిల్లాడిని ఒక డే కేర్ సెంటర్‌లో చేర్పించారు. రోజుకి 4 గంటలే అక్కడ. మిగతా టైమ్ అంతా ఇంట్లోనే. తల్లి వుండేటప్పుడు జాగ్రత్తగా చూసుకునేది, వేళకు తిండి పెట్టేది. మంచి మాటలెన్నో చెప్పేది. సెంటర్ లో ఏమన్నా కొత్తవిషయాలు నేర్పించారా అని అడిగేది. పిల్లాడికి తల్లి అంటే విపరీతమైన అభిమానం. కానీ షిఫ్ట్స్ లో పని వుండటం వల్ల కొన్ని సార్లు చాలా బాధగా అనిపించేది, తండ్రి వున్నా సరే పేపర్ చదువుకోవడమో, సోఫా లో పడుకుని గుర్రుపెట్టడం చేసేవాడు. తనని పట్టించుకున్నది చాలా తక్కువ.
*
రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెకి జీతం పెరగసాగింది. కానీ అతనికి మాత్రం జీతం అంతంత మాత్రంగానే ఉండేది. పని మాత్రం పెరిగేది. అక్కడి నుంచే అతనిలో ఒక తెలియని ఉక్రోషం మొదలైంది. తను ఇన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నా, మొన్న మొన్నే ఉద్యోగంలో చేరిన తన భార్యకి ఎక్కువ జీతం రావడం అతను జీర్ణించుకోలేకపోయాడు. ఆ ఉక్రోషం ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యపై ప్రత్యక్షంగా ప్రదర్శించేవాడు కాదు.
ఒకసారి ఆమె నైట్ షిఫ్ట్ లో వుంది. అప్పటికి మొబైలు ఫోన్లు అంతగా వాడుకలో లేవు.బయట ఎస్టిడి బూతు నుంచి ఆమె పనిచేసే ఆఫీసు కి ఫోన్ చేశాడు. అవతలనుంచి ఆమె మంచి ఇంగ్లీషు లో “ఎవరు కావాలి ఏ పని మీద చేశారు” అని అడిగింది. ఆ మాటల్లో ఎంతో కాన్ఫిడెన్స్ కనిపించింది. రెండు, మూడు సార్లు అలానే అడిగి ఇక ఎవరు మాట్లాడకపోయే సరికి “స్టుపిడ్” అంటూ ఫోన్ పెట్టేసింది. ఫోన్ టక్కున పెట్టేశాడు. ఆ రోజు తన పని తీరు మీద బాస్ అరిచిన అరుపులు ఇంకా బిగ్గరగా వినిపించాయి, మళ్ళీ.
అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళాడు, ఏదో చేతిలో పట్టుకుని ఎదురుగా వస్తున్న కొడుకుని చూశాడు ఆ పిల్లాడి కళ్ళలో ఏదో సాధించాననే ఆనందం. దగ్గరకి తీసుకొచ్చి చూపించాడు ఎంతో గర్వంగా, తనకొచ్చిన 99 పర్సెంటేజ్ ని. మెచ్చుకోకుండా “ఇంక ఆ ఒక్క మార్కు ఎందుకు తగ్గింది ?” అని అడిగాడు. పిల్లాడి ముఖంలో కాంతి కరిగిపోయింది. ఆ స్థానంలో ఏదో తప్పు చేశాననే భావన ప్రవేశించింది.
అదే తల్లి అయితే తనకి ముద్దు ఇచ్చి చేతిలో రెండు సున్నుండలు పెట్టేది అనుకున్నాడు. అలా చాలా ప్రోగ్రెస్ కార్డులు వచ్చాయి కానీ తండ్రి నుంచి ఒక్క మెచ్చుకోలు కూడా రాలేదు. తల్లికి చూపించాలనే సమయానికి షిఫ్ట్లో వుండేది, తండ్రి అడిగి మరీ తెప్పించుకుని చూసేవాడు రిపోర్ట్ కార్డ్స్. ఎంతో ఉత్సాహంగా ఉండే ఆ పిల్లాడు రోజురోజుకి ముభావంగా మారిపోయాడు. తల్లితో కూడా మాట్లాడడం తగ్గించాడు. గమనించింది కానీ పెరుగుతున్న పిల్లాడు కదా అని సర్దిచెప్పుకుంది. అంతే కాక ఆమెకి భర్తపైన చాలా నమ్మకం, పిల్లడిని తనకంటే బాగా చూసుకుంటారని. కొత్త స్కూల్‌కి వెళ్తే సర్దుకుంటాడేమో అనుకుంది.
అతను స్కూల్లో చేరాడు. అన్ని క్లాసుల్లోనూ మంచి మార్కులతో పాస్ అవుతుండేవాడు. కానీ అతనికి స్నేహితులు ఎవరూ లేరు.ఎన్నో బర్తడే పార్టీలకు పిలిచినా వెళ్ళేవాడు కాదు. ఆటలంటే అతనికి చెస్, సుడోకు లాంటివే.రెండు మూడు సార్లు క్రికెట్ ఆడటానికి వెళ్లినా క్యాచులు వదిలేసాడని అందరూ అనుకుంటారు అని తర్వాత నుంచి ఇక వెళ్ళలేదు ఈరోజు వరకు.
ఇక అతని తండ్రి స్టీల్ ప్లాంట్‌లో కూడా సరిగ్గా పని చేసేవాడు కాదు. పెర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అన్నీ పూర్‌గా ఉండేవి. అందువల్ల రావాల్సిన ప్రమోషన్ కూడా రాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ మరింత పెరిగింది.
ఆ కోపం మొత్తం పిల్లాడిపైనే పడేది, కానీ భార్యకు మాత్రం తెలిసేది కాదు. తెలియకుండా జాగ్రత్త పడేవాడు. అది పాసివ్ అగ్రసివ్ గా వుండేది.ఒక్క మార్కు తక్కువ వచ్చినా, స్కూల్ నుంచి ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా ఆ పిల్లాడి పరిస్థితి వర్ణనాతీతం. కొట్టేవాడు కాదు. తిట్టేవాడు కాదు. కానీ అతని మాటలు చాలా లోతుగా తగిలేవి. ఆ పిల్లాడి ఆత్మవిశ్వాసానికి గండి కొట్టేవి. పాఠశాల వార్షిక వేడుకల్లో ఎప్పుడూ ఆడియన్స్ లోనే ఉండేవాడు. కేవలం గోల్డ్ మెడల్ తీసుకోడానికే స్టేజి మీదకు వెళ్లేవాడు అది కూడా తల దించుకునే.
ఆ పిల్లాడు ఎప్పుడూ కూడా తనకు తాను సరిపోతాను అనుకోలేదు. ఇంకా తన తండ్రి ఆశలకు అనుగుణంగా ఇంకా ఏదో సాధించాలనే ప్రయత్నంలోనే పెరిగాడు.
సంవత్సరాలు గడిచాయి.
అతను ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. అక్కడ కూడా అన్ని డిపార్ట్మెంట్స్‌లో మొదటగా నిలిచాడు. తర్వాత అమెరికాలో ఉద్యోగం కూడా సంపాదించాడు. గ్రూప్ డిస్కషన్ లో సరిగా పెరఫామ్ చేయకపోయినా అతనికున్న టెక్నికల్ స్కిల్స్ కి ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చింది ఆ మల్టీ నేషనల్ కంపనీ కి. తన సక్సెస్‌కి తండ్రి సంతోషపడతాడనుకుని మొదటిగా అతనికే చెప్పాడు. తల్లికి మంచి చీర తీసుకున్నాడు.
ఉద్యోగం లో చేరినప్పటినుంచి చాలా క్రమశిక్షణతో పనిచేస్తూ కష్టపడుతూ అతనికో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఒకసారి అతను రాసిన కోడ్ లో ఏదో చిన్న మిస్టేక్ వుండడం వల్ల టీం మేనేజర్ పిలిచి మందలించాడు. దాని వల్ల అతను చాలా క్రుంగిపోయాడు. ఇలా రెండు మూడు సార్లు అయ్యింది. చాలా డిప్రెషన్ లో కి వెళ్ళిపోయాడు మాట్లాడడం మానేశాడు అందరితో. అంతలో అతను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఇంట్లో మాట్లాడడానికి రమ్మంది. కానీ ఏదో భయం, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి, ఇంట్లో వాళ్ళకి నచ్చుతాడో లేదో అని. ఆ అమ్మాయి పెళ్లి ఇంకో అతనితో జరిగిపోయింది రెండు నెలల తర్వాత. కానీ అతన్ని కాలేజీ రోజులనుంచి అభిమానించే అమ్మాయి ఒకరోజు దగ్గరకి వచ్చి తన ప్రేమను తెలియజేసింది.
అలాంటి సమయంలో ఆసరా అందించిన తననే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అప్పటికి ఇంక రిజెక్షన్ ని స్వీకరించే స్థితిలో లేకపోవడం వల్ల, తనని కోరుకున్న వ్యక్తినే అలా చేసుకుని అమెరికా లో స్థిరపడ్డాడు. అతను ఎప్పుడూ ఆత్మావలోకనం చేసుకోలేదు, తన శక్తి యుక్తుల్ని, బలహీనతల్ని బేరీజు వేసుకోలేదు. ఎప్పుడూ తాను సరిపోడేమో అన్న భావననుంచి బయటకి రాలేకపోయేవాడు.
ఏదన్నా పెద్ద కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు లాస్ట్ రో లో కూర్చోడం, డిస్కషన్స్ జరిగేటప్పుడు తన పాయింట్ ని అందరిముందు చెప్పలేకపోవడం, బాస్ ల దగ్గర భయంగా ఉండడం ఇలా అన్నీ కూడా తనకి పొటెన్షియల్ ఉన్నా సరే గొప్ప అవకాశాలను అందుకోలేకపోయాడు. తమ కంపెనీ యూరప్ వెంచర్ కి వైస్ ప్రెసిడెంట్ గా వచ్చిన అవకాశాన్ని కూడా, చాలా ఇంపార్టెంట్ అయిన ప్రెసెంటేషన్ సమయంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా నీళ్లు నమలడం వల్ల కోల్పోయాడు. ఆరోజు అందరూ తనవైపు జాలిగా చూసిన చూపులు ఇంకా కళ్ళముందే కదులుతున్నాయి.
అయితే మొన్న తన తండ్రితో ఫోన్ మాట్లాడినప్పుడు ఇవన్నీ ఎంతో బాధ పడుతూ అతనికి చెప్పాడు. చెప్పేది విని ఓదార్చే తల్లి లేదనే తండ్రికి చెప్పాడు. ఓదార్పు కోసం ఎదురు చూసాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కొడుకు ఇలా బాధపడడం తండ్రిగా అతనికి గుండెల్లో ముళ్లులా గుచ్చుకుంది. అమెరికాలో ఉద్యోగం వచ్చిందని ఎంతో గొప్పగా ఊరందిరితో చెప్పాను అని నోరుతెరిచి చెప్పలేదు. అందరికంటే తెలివైనవాడని స్నేహితుల ముందు ఛాతీ విరుచుకుని నిలబడి వుండేవాడిని అని కూడా చెబుదాం అనుకున్నాడు. కానీ ఫోన్ లో కేవలం నిశ్శబ్దమే… అది చిన్నప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ చూసినతర్వాత అతని నిట్టూర్పు కంటే పదునుగా అనిపించింది అతని కొడుక్కి. అటువైపున భారంగా ఫోన్ పెట్టిన చప్పుడు వినిపించింది తండ్రికి.
*
ఫ్యాన్ గాలి కూడా వేడిగా వుంది. గదిలో మూలగా ఉన్న మనీ ప్లాంట్ వాడిపోయి వేలాడిపోయింది.
ఫోన్ మోగింది.
కాలర్ ఐడి యుఎస్ నుంచి అని చూపిస్తోంది.
ఆ వృద్ధుడు అలా ఇంకా పైకప్పుకేసి చూస్తూనే ఉన్నాడు. మంచం మీద నుంచి మాత్రం దిగలేదు.
*








Good 👍
Nice stories Manas!
Very nice
Manas keep continue …
Seethapathi-Vizag
ఎంత ప్రతిభ వున్నా చిన్న ప్రశంస లభించనిచోట నెలకొనే ఆత్మనూన్యతాభావాన్ని చక్కగా చిత్రీకరించారు. బాగుంది అండీ! అభినందనలు💐.