“స్టాఫ్ హాస్టల్ రాజు” గా ప్రమోషన్ కథా, కమామీషూ

నేనూ, మూర్తీ, రావూ హాస్టల్ 1 లో రెండేళ్ళ పాటు పక్క పక్క గదుల్లోనే ఉండే వాళ్ళం. రోజూ పొద్దున్నే నేను వాళ్ళిద్దరినీ ‘నవ్వించడంతో’ మా దినచర్య ప్రారంభం అయేది. అంటే నిద్ర లేవగానే ఏదో జోకులు వేసి కాదు. అసలు విషయం ఏమిటంటే వాళ్ళిద్దరూ పొద్దున్నే ఆరు గంటల లోపే లేచి దండీలు, బస్కీలు తియ్యడానికి జింఖానా కి వెళ్ళే వారు. మొదట్లో నేను కూడా పెద్ద పోటు గాడిలా వెళ్ళాను కానీ ఆ యవ్వారం మనకి పడ లేదు. ఎందుకంటే రాత్రి రెండు గంటల దాకా పని చెయ్యమంటే చేస్తాను కానీ అంత తెల్లవార గట్ల లేవడం అంటే నాకు అప్పుడూ, ఇప్పుడూ చాలా చికాకు అయిన పని. పైగా మా జింఖానా లో వ్యాయామానికి ఇప్పటి లాగా ట్రెడ్ మిల్లు, కదలకుండా ఉండే సైకిళ్ళు లాంటి యంత్రాలు లేనే లేవు. ఉన్నవల్లా ఒకటే ఒక పేరలల్ బార్, వెయిట్ లిఫ్టింగ్ సరంజామా..అంతే. నా శరీరానికీ, శారీరిక వ్యాయామానికీ చుక్కెదురు. అంచేత కొన్నాళ్ళు మూర్తీ, రావులతో జింఖానా కి వెళ్ళినా, ఆ తరవాత ప్రతీ రోజూ వాళ్ళు పొద్దున్నే నా తలుపు కొట్టడం నేను దుప్పటీ లోంచే “రేపోస్తాను, గురూ, యు కేరీఆన్ యార్” అనీ గుర్రు పెట్టి పడుకోవడం, వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ వెళ్ళిపోవడం జరిగేది. వీడు ఎలాగా రాడు లే అని ఒక వేళ ఎప్పుడైనా వాళ్ళు నా తలుపు కొట్టకుండా వెళ్ళిపోతే “రాస్కెల్స్, ఇవాళ లేప లేదేం. నేనూ వచ్చే వాడిని కదా” అనగానే మళ్ళీ నవ్వుకునే వారు. ఆ విధంగా వాళ్ళిద్దరినీ రోజూ పొద్దున్నే నవ్వించే వాడిని!

ఇక మా ఫ్లూయిడ్ పవర్ డిపార్ట్ మెంట్ లో మా ప్రొఫెసర్ సుబీర్ కార్ కాక రఘునాథన్ అనే కన్నడం ఆయన, రెడ్డి అనే తెలుగాయన రీడర్లు గా ఉండే వారు. వాళ్ళిద్దరూ అక్కడే లెక్చరర్ గా చేస్తూ డాక్టరేట్ చేసిన వారే. వీళ్ళలో రఘునాథన్ సాత్వీకంగా ఉండే వాడు కానీ ఆ రెడ్డి గారు అచ్చు ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలలో లెక్చరర్ల లాగా ధుమ ధుమ లాడుతూ చిరాకుగా ఉంటూ, విద్యార్ధులు అంటే చాలా చులకనగా ఉండే వాడు. తెలుగు వాడు అని తెలుసుకానీ ఆయన తెలుగు మాట్లాడడం నేను ఎప్పుడూ విన లేదు. అప్పుడప్పుడు మేము నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకి వచ్చే వాడు కానీ పలకరించే వాడు కాదు. పైగా మా సుబీర్ కార్ గారు అంటే అస్సలు పడేది కాదు కానీ బయట పడే వాడు కాదు. వాళ్ళిద్దరూ మాకు కష్టమైన సబ్జెక్ట్ లు ఇష్టం గా చెప్పిన వాళ్ళే. అయితే నేను రిసెర్చ్ స్కాలర్ గా చేరగానే నా స్థాయి కొంచెం పెరిగినా ఆయన చిన్న చూపు తగ్గ లేదు.

ఒక సారి నేను మా లాబెరేటరీ లో నా పి.హెచ్ డి కి సంబంధించిన ఒక పరికరం చెయ్యడానికి మా ప్రధాన మెకానిక్ మహడేశ్వర్ నీ, మరొక జూనియర్ మెకానిక్ ఖాప్నే అనే అతని తోటీ సంప్రదించి, ఒక డిజైన్ రూపొందించి, మా గురువు గారి అనుమతితో ఆ పరికరం తాయారు చెయ్యడం మొదలు పెట్టాం. ఇలాంటివి మొదలు పెట్టాక పూర్తి చెయ్యాలి కానీ, మధ్యలో ఆపేసి మరో పది రోజుల తరవాత కొనసాగించ కూడదు. సరిగ్గా ఆ పని మధ్యలో ఉండగా ఒక రోజు ఈ రెడ్డి గారు నేను లేని సమయంలో ఆ ఇద్దరు మెకానిక్స్ చేతా నా పని మానిపించేసి, తనకి కావలసిన చిన్న పని మరొకటి పురమాయించాడు. ఆయన రీడర్ కనక వాళ్ళు పాపం ఆయన చెప్పినట్టు నా పని మానక తప్ప లేదు. అది తెలియగానే నేను హుటాహుటిన అక్కడికి వెళ్లి, రెడ్డి గారికి విషయం చెప్పి ముందు నా పని అయ్యాక మీ పని మొదలు పెట్టమని సవినయంగానే అడిగాను. కానీ ఆయన రెచ్చి పోయి “ఆఫ్టరాల్. నువ్వు ఒక రిసెర్చ్ ఫెలో వి. నేను రీడర్ ని. నీ పని కి ఇంకా నాలుగేళ్ళు ఉంది. ఇవాళే నీది చేస్తే ఎల్లుండి నీకు పి.హెచ్ డి వస్తుందా?” అని నలుగురి ముందూ దురుసుగా మాట్లాడాడు. నేను సమాధానం చెప్పబోతుంటే నన్ను “షట్ అప్” అన్నాడు. అప్పటికే నషాళం అంటుతున్న నేను “యూ షట్ అప్” అనేశాను. అంతే…లాబ్ లో ఉన్న పది మందీ ఒక స్టూడెంట్ ఒక రీడర్..అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కంటే కాస్త అటో ఇటో స్థాయి వ్యక్తిని గారిని అంత మాట అనడం ఏమిటి అని బిత్తర పోయారు. ఆయన అవాక్కయి, మొహం ఎర్ర బడిపోయి, గబ గబా వెళ్లి మా ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్లి నన్ను డిబార్ చేసి, ఐఐటి నించి గెంటెయ్య వలసిందే అని పట్టుపట్టాడు. కానీ ఆయన నన్ను పిలిచి అసలు జరిగిన సంగతి అంతా నా నోటమ్మట కూడా విని, మా మెకానిక్స్ తో కూడా మాట్లాడి “తప్పు ఎవరిదైనా నువ్వు అలా ఇస్కో అంటే ఇస్కో అనకూడదు. ఎంతయినా ఆయన పెద్ద వాడు కదా” అనగానే నేను ఆయన సమక్షంలోనే రెడ్డి గారికి క్షమాపణ చెప్పుకున్నాను. ఆ రెడ్డి గారు చిన్న నవ్వు నవ్వగా చూడడం అదే మొదటి సారి. ఆఖరి సారి. నిజానికి మా ప్రొఫెసర్ గారే కనక రెడ్డి గారి మాట విని నన్ను ఇంటికి పంపించేసి ఉంటే నా జీవితం ఎలా ఉండేదో? ఆ తరవాత కొన్నేళ్ళకి రెడ్డి గారు ఇంగ్లండ్ వెళ్ళి, అక్కడ నుంచి అమెరికా వచ్చి, ఇక్కడే ఒక పంపుల తయారీ కంపెనీ పెట్టారు అనీ విన్నాను కానీ వివరాలు తెలియవు. ఇక రఘునాథన్ గారు ఆ రోజల్లో కేంపస్ లో ఉన్న ముగ్గురు, నలుగురు ఆడ పిల్లలలో సుమన్ అనే కన్నడం అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంగ్లండ్ వెళ్ళిపోయారు. ఆయనకి ఎయిర్ పోర్ట్ లో వీడ్కోలు ఇస్తున్న ఫోటో ఇక్కడ జతపరిచాను. ఇందులో రెడ్డి గారు కూడా ఉన్నారు.

ఈ సుమన్ అన్న అమ్మాయికి స్నేహితురాలు అయిన ఉషా చిందర్కర్ అనే మరొక అమ్మాయి మా డిపార్ట్ మెంట్ లోనే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉండేది. కొంచెం బొద్దుగా అంత అందగత్తె కాని ఆ మరాఠీ అమ్మాయి కష్టజీవి, మంచి మనిషి. రోజూ బొంబాయి దాదర్ నుంచి వస్తూ అంచెలంచెలుగా డిగ్రీ, మాస్టర్స్, డాక్టరేట్ అక్కడే చేసి లెక్చరర్ గా చేరి, అసోసియేట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయింది. ఈ ప్రయాణం లో పౌళే అనే అందగాడిని పెళ్లి చేసుకుని అందమైన పిల్లలకి తల్లి అయింది. నేనంటే ఎంతో అభిమానంగా ఉండేది. నేను అమెరికా నుంచి ఎప్పుడు బొంబాయి వెళ్ళినా మా డిపార్ట్ మెంట్ లో కానీ, ఇంటికి పిలిచి కానీ ఎంతో గౌరవం చేసేది. ఆమెని చూసి పదిహేనేళ్ళ పైగానే అయింది.

ఇక నేను రిసెర్చ్ స్కాలర్ గా ఉన్నా కానీ నా దృష్టి ఎప్పుడూ ఎప్పుడు నేను కూడా మూర్తి లాగా లెక్చరర్ అవుదామా అనే ఉండేది. ఒక రోజు మా లైబ్రరీ దగ్గర నోటీస్ బోర్డ్ లో మా మెకానికల్ ఇంజనీరింగ్ లోనే ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్స్ అనే సబ్జెక్ట్ లో అసోసియేట్ లెక్చరర్ ఉద్యోగానికి దరఖాస్తులు కోరుతూ ఒక ప్రకటన చూడగానే నా బుర్ర పాదరసంలా పని చేసింది. వెంటనే మా గురువు గారి దగ్గరకి వెళ్లి “మన ఫ్లూయిడ్ పవర్ బ్రాంచ్ లో ఖాళీలు లేవు అన్నావు కదా. మరి ఈ ఉద్యోగానికి నేను క్వాలిఫై అవుతాను కదా. మీరు రికమెండ్ చేసి నాకు ఆ అసోసియేట్ లెక్చరర్ ఉద్యోగం ఇప్పిస్తే నా డాక్టరేట్ మీ దగ్గరే కంటిన్యూ చేసుకోవచ్చును కదా” అని అడిగాను. దానికి ఆయన బుర్ర గోక్కుని “ఒక బ్రాంచ్ లో లెక్చరర్ గా ఉంటూ మరొక బ్రాంచ్ లో పి.హెచ్ డి ఎలాగా?” అని ‘సరే, కనుక్కుంటాలే, ముందు అప్లికేషన్ పడేయ్” అన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ ఇన్స్ ట్రుమెంటేషన్ & కంట్రోల్స్ అనే సబ్జెక్ట్ కి అప్పుడు వేరే బ్రాంచ్ లేదు సరి కదా చాలా బ్రాంచ్ లకి అది కామన్ సబ్జెక్ట్. ఒకే ఒక అసోసియేట్ లెక్చరర్ కి ఆ పాఠాలు చెప్పే బాధ్యతలు అప్పగించి, డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గా నామకహా ప్రొఫెసర్ సుఖాత్మే అనే ఆయనకి అధికారికంగా రిపోర్ట్ చెయ్యాలి చేసేలా ఆ పోస్ట్ కల్పించారు. ఈ సుఖాత్మే గారు బోస్టన్ M I T లో డాక్టరేట్ చేసి ఇక్కడ ఇంటర్నల్ కంబస్చన్ ఇంజన్స్ బ్రాంచ్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరారు. చాలా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయనకీ ఈ కొత్త పోస్ట్ సవతి తల్లి పిల్ల లాటిదే. అంచేత మా ప్రొఫెసర్ గారు ఆయనతో నా గురించి మాట్లాడగానే అభ్యంతరం చెప్ప లేదు. ఇక తరువాత జరగ వలసినదల్లా మా IIT డైరక్టర్ అయిన కేల్కర్ గారూ, మరొక ఐదారుగురూ ఉన్న ఇంటర్ వ్యూ కమిటీ వారు వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించి, ఇంటర్ వ్యూ చేసి అభ్యర్ధిని ఎన్నుకోవడమే. నేను ముందు ఇదేదో ఫార్మాలిటీ అనుకున్నాను కానీ తీరా ఇంటర్ వ్యూ కి వెళ్ళాక ఆ ఒకే ఒక్క పదవికి దేశం మొత్తం నుంచి పదిహేను మంది అభ్యర్ధులు ఉన్నారు తెలిసి నీరసం వచ్చేసింది. పైగా వాళ్లందరూ టై కట్టుకుని సూటూ, బూటూ వేసుకుని మరీ వచ్చారు. కమిటీలో మా గురువు గారూ, సుఖాత్మే గారూ ఉన్నా, నేను స్థానిక అభ్యర్ధినే అయినా నా నీరసం తగ్గ లేదు. మొత్తానికి మా అందరి ఇంటర్వ్యూలు అవడానికి మూడు గంటలు పట్టింది. ఆఖర్న మా డైరెక్టర్ కేల్కర్ గారు బయటకి వచ్చి, అందరికీ కృతజ్ఞతలు చెప్పి నేను ఎంపిక అయినట్టు ప్రకటించారు. ఆ తరువాత తెలిసిన కారణం ఆ ఉద్యోగానికి వచ్చిన వారిలో నేను ఒక్కడినే ఐఐటి వాడిని. మిగిలిన వాళ్ళు అందరూ దేశం లో బరోడా, ఇందోర్ లాంటి ఇతర కాలేజీలలో చదువుకున్న వాళ్ళుట. అంచేత మన ఐఐటి వాడికే మనం ఉద్యోగం ఇవ్వక పోతే ఎలాగా అని నన్ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారుట!

వెను వెంటనే నేను స్టూడెంట్ హాస్టల్ 1 నుంచి స్టాఫ్ హాస్టల్ కి మారిపోయి, తర్వాత ఐదేళ్ళు ‘స్టాఫ్ హాస్టల్ రాజు” గా స్థిరపడిపోయాను…

ఆ ఎప్పాయింట్ ఉత్తరం ఇప్పుడు నాకు దొరక లేదు కానీ, దాని కోసం వెతుకుతూ ఉంటే మూడేళ్ళ తరువాత నన్ను లెక్చరర్ గా ప్రమోట్ చేస్తున్న ఉత్తరం, ఆ ప్రమోషన్ కోసం నేను పది పేజీల “Self-Assessment” తో పెట్టుకున్న దరఖాస్తు కనపడ్డాయి. దానిలో వివరాల ప్రకారం నేను అసోసియేట్ లెక్చరర్ గా అక్టోబర్ 10, 1969 నాడు నెలకి అక్షరాలా 475 రూపాయల జీతంతో చేరినట్టు ఉంది. అంతే కాదు అప్పటి నుంచీ నేను 1973 దాకా బి.టెక్ మూడవ సంవత్సరం విద్యార్ధులకి Theory of Machines (Aeronautics), Fluid Mechanics (Electrical Eng.), Measurements (Mech.), Instrumentation & Process Control (Mech.), M. Tech విద్యార్ధులకి Instrumentation, Hydro-Aero Dynamics (Mech.) సబ్జెక్ట్ లూ, ఆయా లేబొరేటరీ క్లాసులలో పాఠాలు బోధించినట్టు ఉంది. ఆ అనుభవాన్నీ, విద్యార్ధులు నాకు ఇచ్చిన “రేటింగ్” లనీ, ఇంకా ఇతర అంశాలనీ పరిగణన లోకి తీసుకుని నన్ను మే 18 1973 నుంచి అక్షరాలా నెలకి 560 రూపాయల జీతంతో లెక్చరర్ గా ప్రమోషన్ ఇచ్చి గౌరవించారు ఐఐటి, బొంబాయి డైరెక్టర్ గారు. అంటే ఆ నాటి లెక్కలో నెలకి ఏకంగా సుమారు 75 డాలర్లు అయితే ఈ నాటి లెక్కలో ..అవును..నెలకి ఏకంగా 8 డాలర్లు అప్పటి నా నెల జీతం! ఆ ఎప్పాయింట్ మెంట్ ఉత్తరం ఇక్కడ జతపరుస్తున్నాను. ఇప్పుడు ఆ సబ్జెక్త్స్ లో అక్షరం ముక్క కూడా నాకు జ్ఞాపకం లేదు!

‘స్టాఫ్ హాస్టల్ రాజు’ గా నా అనుభవాలు, నా ఘనకార్యాల గురించి త్వరలోనే…

*

 

 

వంగూరి చిట్టెన్ రాజు

వంగూరి చిట్టెన్ రాజు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • >> ఇప్పుడు ఆ సబ్జెక్త్స్ లో అక్షరం ముక్క కూడా నాకు జ్ఞాపకం లేదు!

  ఈ కథలో ఇదీ అసలు సిసలు పంచ్!

 • సిట్టెన్ రాజుగోరండి!

  మా నొస్ట్న రాసిలేకపోబట్టే గందా తవరుగోరు ఏదీ Aeronautics, Instrumentation & Process Control, Hydro-Aero Dynamics సబ్జెక్ట్ ల నాలెడ్జి యెట్టుకుని అబ్దుల్ కలాం సాబ్ తో కలిసి దేశ్శేవ జెయ్యకుండా అట్టా వొఘాయత్యంగా ఆ అప్రాత్య దేశానికి ఎలబారిబొయ్యారు.

  ఇప్పటికైనా మనోళ్లకి, మన ఇస్రో వాళ్లకి, కుంచెం ఉచిత సలాలు గట్రా ఇస్తుండండి మరి ( Chandraayan – 2 Lunar Exploration Mission Project వగైరాల మీద ).

  అట్నే, అప్పడాల కర్ర యే యాంగిల్లో, ఎంత వెలాసిటీ తో లాంచ్ చేస్తే మొగుళ్ల శిరోమండలం మీద సేఫ్ గా లాండ్ అవుతుందో వెన్నతో బెట్టిన విద్యగా తెలిసిన మన మహిళామండలి వారి ప్రావీణ్యాలను దేశ్శేవకు ఉపయోగపడే విధంగా దారిమళ్లించి మాలాంటోళ్లను రచ్చించగలరు.

  • భలే వారే,

   సొంత ఫేక్టరీ పెట్టుకుని నేను ఇంజనీరింగ్ మానేసి, ఇంజనీర్లని పెట్టుకుని మేనేజ్మెంట్ లోకి వెళ్ళి పోయాను

   . ఇప్పుడు ఇస్రో వారికి సలహా ఇస్తే గోవిందా, గోవింద…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు