శ్రీ వైష్ణవులూ- రొయ్యల బుట్ట!

పల్లే,పట్నం,నగరం అంతటా ఒకటే రోగంతోటి వొయిద్యుడ్ని యెదుకుతన్నాది.

మనుషులు కలిసే అవకాశం దుర్లభమయిపోతంది. పల్లెటూళ్ళల్లా మునుపులాగ మనుషులు కలవటం లేదు. మునుపు రోజుల్ల నీలాటి రేవు కాడ ఆడోళ్ళూ: రచ్చబండ కాడ, ఆసరసాల కాడ మొగోళ్ళూ కలుసుకొని యెక్కడెక్కడి ఊసులో సెప్పుకొనీవోళ్ళు. మంచీ,సెడ్డా ముచ్చటించుకునీవోరు. నీలాటిరేవు ముచ్చట్లయితే…మొగోళ్ళ బాగోతాల తోటి బిందెలు నిండిపోయీవి. రచ్చబండ కాడా, ఆసరసాల కాడా…పెద్దమనుసుల ముసుగులు సిరిగిపోయీవి. ఇవిగాక…పొద్దుబోయింతరాత ఇంత అలబొద్దు గెంజి తాగి తేన్చి, వీధి అరుగుల మీదకి సేరితే వొవ్వో…పెపంచమ్మీది ఇడ్డూరాలన్నీ ఇనిపించీవి! రాత్రి నిద్రబోయే యేళ అవ్వల మంచాల చుట్టూ పేదరాసి పెద్దమ్మలు, బాలవొర్ది రాజులు , బాలనాగమ్మలు,మాయలపకీర్లు తిరుగాడుతుండేవోళు. ఊయల్ల లోన పిలగాయల సెవుల్లోన జోఅచ్చుతానందలూ,జోముకుందలూ పదం పాడీవోళు!

ఇపుడు యేటీ ఇనబడవు. కనబడవు.

నీలాటి రేవుల్ల ఇసకలారీల హారన్ల మోత ! రచ్చ బండలు అధికారపర్టీ అడ్డాలయి పోయినాయి. ఆసర సాలలొదిలీసి సరాబులు పట్నాల్లోని ఫర్నిచర్ దుకాణాల్లో పనోళ్లయిపోనారు. ఇళ్ళముందర అరుగులే లేవిపుడు. ఇళ్ళల్లోకి టీవీ బూతమొచ్చింది, యెవుడూ తలుపుతీయిడు. లోపల పురుగొకటి గుండె గదుల్లోన తిరగాడతన్నాది . పూలగుండెలో దారం దాగుందని తెలుసునా అని సినిమా కవి అపుడెపుడో అన్నాడుగానీ ఇపుడెవుళి గుండెల యేది దాగుందో యెవుడూ సెప్పలేడు! ఇపుడు అంతా మూసిన తలుపుల లోకం!    ఇపుడేటీ ఇనబడవు.కనబడవు.

ఇనబడీ,కనబడీవి యేటేనా ఉంతే అవి – అబద్దమో నిజిమో ముద్ర గుద్ది ఊరిమీదకి వొదిలేస్తన్న పేపరోళ్ళు గానీ, ఆరునిశాదులూ అడ్డమయిన సేనల్ల లోనా సూపించే టీవీవోళ్ళు గానీ సెప్పలేని ఇంతలూ,ఇశేసాలూ,వోర్తలూ,ఊక వొడ్డింపులూ!

పల్లే,పట్నం,నగరం అంతటా ఒకటే రోగంతోటి వొయిద్యుడ్ని యెదుకుతన్నాది. ఆడెవుడో అంతటికీ ఒకేసారి యెన్నికలు మందంతాడు. ఈడెవుడో పాత వొయిద్యుడి సరంజామాని సర్దుకొని వ్యవస్థని మారుస్తానంతాడు.శత్రువే శ్రేయోభిలాషిలాగా మాటాడతాకడు. అయిదేళ్ళ కొకసారి వొయిద్యగ్రంధమ్లోని మందులన్నీ వొల్లించుతాడు. యెవుడ్ని నమ్మాలో తెల్దు. యెవుడెలాగ నెగ్గుతండో తెల్దు. అంతా మాయలపకీర్ మాయ లాగుందని బుర్రా,పిర్రా గోక్కొని యేటిరా దేముడా ( దేముడా అని కాదు రాముడా అనమని తంతన్నారర్రా నాయిన్లారా) నీను ఇసారిస్తంతే…మా పెద రామదాసు నన్ను పట్టుకొని వొదల్డు. అసలకి నాకే తూరుపేదో,పడమరేదో తెల్దా…అంత అమాయకుడ్నా…అడ్డమయినోళ్ళ పార్టీ మీటింగులుకీ అన్ని పనులూ మానుకొని తిరిగే దద్దమ్మనా, సంతలన్నీ ఒకటే, సరుకులు అమ్ముకునీవే అని యెరగని యెర్రి మాళోకాన్నా …(యెర్రి మాలోకానివి కాబట్టే అందరూ నిన్ను వోడు కుంతన్నారని మా ఆవిడ అనీది) నన్ను పట్టుకొని కొశ్చిన్ మీద్ కొశ్చిన్ యేసి సంపినాడు జెబాబులు సెప్పమని! పెదరామదాసు కొశ్చిన్ లేటో అతగాని మాటల్లోనే సెప్తాను ఇనుకోమ్డి-

“యేనికిరా ఇన్ని పర్రాకులు పడినాం? యేనికిరా ఇంటింటికీ తిరిగినాం. ఇంటిలోని అందరి కాళ్ళూ పట్టుకున్నాం. నువ్వు అయిదడిగితే అయిదూ,,పదడిగితే పదీ – రూపాయిలూ, వొందలూ కావు వేలు ఇచ్చినాం. యేనికిరా? (వోటు కోసం అని సెప్పాలనుకొని సెప్పలేదు. బయ్యిం! అప్పుడు అతగానే సెప్పినాడు) వోటు కోసం. వోటెందుకురా? ( మళ్ళా అతగానే సెప్పీసినాడు) అధికారం కోసం . అధికారమెందుకురా…( అటూయిటూ సూసి,గొంతు తగ్గించి) నాలుక్కాసులు యెనకేయడానికిరా. ఇంతదాకా అందరూ సేసింది అదేరా.

యెనాగ బతకతాడో కొడుకు…యెద్దునాగ పెరిగీసినాడు గానీ బుర్ర పెరగలేదని ఆళ అమ్మ ఆడి గురించి ఇశారించీదా? (యెవుడి గురించి? యే అమ్మ అని నీను బుర్రా పిర్రా గోక్కోబోతండగా) ఆడ్రా…మొన్న యెలక్సన్ల ఆడు వోడిపోయి నీను గెలిసినాను కాదా? ఆడ్రా…! ఆడు ఇసక మీద కోట్లు గడించీసినాడ్రా! తండ్రి సంపాయించిన భూములేమేనా అమ్మేత్తాడేటో అని ఆలమ్మ బెంగ పడీదా. ఇపుడు వూరు భూములేటి అమరావొతి బూములూ మడిసీసినాడట.

మరి సూడనా…నువ్వు ఆడికి మించి యెంత మడుస్తావో అని మా ఆవిడ నీను గెలిసిన కానించి ఇంటిల ఒకటే పాట! ఆడే కాదురా…అందరూ ఇంతక మునుపటోళ్ళందరూ …యెలగెలగ సంపాదించాలో, యెక్కడెక్కడ సీమల పుట్ట లున్నాయో, ఆటిని యెలాగ ఆక్రమించాలో ఒక దోవ మాకు యేసీసి ఇచ్చినారు. మా పూర్వులు మార్గదర్శులు!

ఈడేట్రా?  మా లీడరు…ఇడ్డూరం పజ్జతులన్నీ పెడతండు. ఇసక ముట్టుకో గూడదట. బదిలీల జోక్యం వలదట. కలక్టర్లకి అధికార్లకి అందరికీ వార్నింగులిచ్చీసేడు. కాలు కదిపితే అక్కడ ఆడికి రికార్డయిపోతాదట…అతగానంతే…తరగని ఆస్తికి వోరసుడు. నీను యెలాగ సచ్చీది? ఇసక, అడివి, భూములు, రోడ్లు, భవంతులు, బదిలీలు,పోస్టింగులు, కళ్ళ ముందర వొవ్వో…సంపదల పుట్టలు కనబడతుంటే…యెవుడి వొశిము పుట్టల జోలికి యెళ్ళ్లకండా ఉండడం?సీమలు పెట్టిన పుట్టలు పాములుకి యెరవవునని సుమతి పద్యం రాయలేదురా?( అనడిగినాడు. బలవంతమయిన సర్పము చలిచీమల చేత…అని సెప్పొచ్చు… గాని సెప్పలేకపోనాను)

యే విద్యా రాకపోయినా నాలుక్కాసులు సంపాదించడానికి అనువయిన రంగమేదయినా ఉందంతే అది రాజకీయరంగమూ, సినిమారంగమూరా. అందలా ఇందలా నటన తెలియాలంతే. నటన అనీది…నీకు తెలుసు,నాకు తెలుసు. నీ ఆడదానికి తెలుసు,నా ఆడదానికి తెలుసు.  తెల్లారి లెగిసిన దగ్గిర నించి నటించి నటించి పండి పోయినాం కదరా  ( అన్నాడు. నాకు నటన తెల్దండీ బాబు, నటన తెలక మా ఆడదాని కాడ యెన్ని సార్లు దెబ్బతిన్నానో సెప్పలేనని సెప్ప బోనాను. కానీ ఇంతండా?)

ఓరి, మా నాయకుడూ నటిస్తండనే అనుకున్నాన్రా. కాదురా. నిజింగే ఆడు సెప్పిన మాట మీదే నిలబడతండురా. నవరత్నాలన్నాడు, అవే ఇచ్చీడానికి పూనుకున్నాడు. పూనుకోనీరా మంచిదే. గాని మా మూతులుకి బుట్టలు కట్టెస్తండురా. సేలు నూరుపులపుడు పశివిలుకి సూడు … సేని తినకుండా మూతులుకి బుట్టలు కడతాము అలాగ మామీద కాపలా పెట్టీసినాడురా. యేదీ ముట్టుకోగూడదట. ..అందరికీ వార్నింగులిచ్చీసేడు.

అయిదేళ్ళు కేవళం జీతభత్యాల మీద బతికితే…పెట్టిన కర్సో? యెలక్సన్ కర్సుతోటి మనూరి భూములు సగం కొనొచ్చు…వొద్దే అనంతే, మా ఆవిడ గెలిస్తే నియోజికవొర్గం భూములన్నీ కొనమా? నా అద్రుస్టుం బాగుండి నువ్వు మంత్రివయితే రాష్టం భూములన్నీ మనవే…అని దింపీసిందిరా. ఇపుడు సూస్స్తే ఇలాగ!

ఇలాగే అయితే …సెంటరోళ్ళ పార్టీల సేరిపోమంతాది. సెంటరోళ్ళ పార్టీ యెపుడికేనా మన రాష్ట్రమ్ లోన అధికారం లోకి వొస్తాదిరా? సెప్పురా? ( నానేటి సెప్తాను బావ్ ? ) రాదురా. ప్రత్యేక హోదా గానీ ఇస్తే యేమో…అప్పుడికీ…సెప్పలేమ్!

అదిరా…నా పరిస్తితి. సెప్పురా. యెలాగరా? యేనికిరా ఇంత కర్సెట్టినాం? యేనికిరా ఇన్ని పర్రాకులు పడినాం? యేటి సెయ్యిడిమ్ రా సెప్పురా “   అని   సంపీసాడు నన్ను. ఈలోపుని అతగాని ఆవిడ ఇంట్లోపల్నించి కేకేసింది…అప్పుడు నన్ను వొదిలేడు మా పెదరామదాసు యెమ్మెల్లే!                                                                                                యెంత కస్టిం వొచ్చిందిరా పెద రామదాసుకీ అని ఆలోసిస్తా నడస్తా వొస్తంతే మా రూల్సోడు యెదురైనాడు. ఆడ్ని ఆపి…ఇదిగీ కతంతా సెప్పి…పెదరామదాసుకి బదులు నీను బాధ పడిపోనాను. అందుకు రూల్సోడన్నాడూ – మీరే ఇనండి యేటన్నాడో‌-

“ఒరే నాయినా…అంత ఇసారం వొద్దురా. లీడర్లిపుడు సీమలు పెట్టిన పుట్టల జోలికి వెళ్ళక్కర్లేదురా. సీమలకీ ఇంత బెల్లం ముక్క యెయ్యొచ్చు. యేస్తండ్రు కూడా …అవే సంక్షేమ పధకాలు. ఈటన్నిటికీ మదుపు పెట్టే వోళ్ళు వేరేగా ఉన్నారు. సీమలకి బెల్లం, లీడర్లకి సంపాదనా, యెలక్సన్ కర్సూ ఇచ్చే వాళ్ళు…కార్పొరేట్ కంపినీ వోళు. పెదరామదాసూ, అతగాని నాయకుడూ, ఆ సెంటర్లోని లీడర్లూ అందరూ ప్రెజల గురిండే బతకతన్నట్టగ మాటాడతార్రా! అంద్రూ శ్రీవొయిష్ణవులే గానీ…ఉట్టి మీది సేపలు మాత్రం మాయయి పోతాయిరా!

భూములూ,అడివిలూ,దేశిమ్ లోని యెక్కడెక్కడ యేయే సంపదల పుట్టలున్నాయో అవన్నీ ఆ కంపినీలు తవ్వుకు పోతాయి. తవ్వుకుపోడానికి వొప్పుకోవాల ఈ శ్రీవొయిష్ణవులు. వొప్పుకుంతే పెదరామదాసుకీ యే లోటుండదు, ఆళ్ళ లీడరుకీ యే లోటుండదు.కార్పొరేటోళు యెవుళికి యెంత ఇవ్వాలో అంతా నరమానవుడికి కనబడకండా ఇస్తారు. అదింకా పెదరామదాసుకి తెల్దు, అందికే ఆందోళన పడతండు. ఆళ్ళ లీడరుకి తెలుసు గాబట్టి నిదానంగా ఉన్నాడు..” అని సెప్పేడు.

అదా…యెవ్వారం? వోరి…పెదరామదాసూ…!

అట్టాడ అప్పల్నాయుడు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇసక, అడివి, భూములు, రోడ్లు, భవంతులు, బదిలీలు,పోస్టింగులు, కళ్ళ ముందర వొవ్వో…సంపదల పుట్టలు కనబడతుంటే…యెవుడి వొశిము పుట్టల జోలికి యెళ్ళ్లకండా ఉండడం? అనే పీకులాట నుంచి బయటపడెసావు గా అట్టాడ అప్పల్నాయుడు బావూ … సీమలకి బెల్లం, లీడర్లకి సంపాదనా, యెలక్సన్ కర్సూ ఇచ్చే కార్పొరేట్ కంపినీ వోళు ఉన్నారని భరోసా ఇస్తూ.

    మూలుగుతూ మంచాన బడి బిళ్లలు మింగినా తగ్గని జ్వరం నీ కధలు సదువుతూ వొళ్లు సల్లబడే సరికి … యీ కొత్త వైద్యుడు బాపు ఎవులేటి అని మురిసిపోయింది ఇంట్లో దీపం.

    ( వాళ్లు : ” వొరిగిన అన్న కెన్నియ్యలో, ఎర్రని దండాలెన్నియ్యలో ”

    క్షతగాత్ర గానం : ” పెద్దోడా జీవితమంతా సేరడు నేల మిగుల్చుకోలేదు. ఆరు అడుగుల నేల – కొనగలవా నా కోసం? ఆ నేల మీద బుగ్గవ్వాల ! కొనగలవా ” తాతయ్య చివరి కోర్క

    షా : ” ఈ నది మాది, ఈ నదికింద బతుకులు మావి … ఎవుడ్రా …. దీన్ని మింగీవోడు ” తలపాగా తీసి పతాకంగా యెగురవేసి గద్దించిన వృద్ద రైతు.

    దెయ్యపు భరోసా : “ మీరిలాగే భూముల్నీ అడవుల్నీ, కొండల్నీ, సముద్రాన్నీ, నదుల్నీ రకరకాల కంపెనీలకు ధారబోసి , దేశాన్ని స్మశానం చేస్తారు. దయ్యాల నివాసం చేస్తారు. మే మంగీకరించం! ఈ దేశం .. ప్రజలది! ప్రజాపోరాటాగ్నుల్లో మీరూ, మీ కంపెనీలూ, మీ రాజ్యం దహించుకు పోతా” యని కేకలు.

    • Thanq Ramayya garu…
      saaranga matrame gaaka naa kadhalu konni kote chesinanduku kuda dhanyavadalu..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు