సీమ నవలల్లో ఫ్రాయిడ్ జాడలు

సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం భారతీయ సాహిత్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఫ్రాయిడ్ సిద్ధాంతాలకు శాస్త్రీయత లేదని వాదించిన వాళ్లూ ఉన్నారు. అయితే తెలుగు సాహిత్యంలో మానవ అంతరంగాన్ని ఆలోచనా విధానాన్ని, అచేతన మనస్తత్వాన్ని విశ్లేషించడం అనేకోణంలో అనేక రచనలు వచ్చాయి. అచేతనంలో తాత్కాలికంగా మరుగునపడ్డ ఆలోచనలు, అనుభూతులు, మనోచిత్రాలు శాశ్వతంగా వెళ్లిపోవని అవి అప్పుడప్పుడు ప్రభావితం చూపుతుంటాయని ఫ్రాయిడ్ సిద్దాంతం చెబుతుంది.
ఈ క్రమంలోనే 1940 దర్శకంలో మనోవైజ్ఞానిక కోణంతో కూడిన గొప్ప నవలలు పురుడుబోసుకున్నాయి. వాటిలో త్రిపురనేని గోపిచంద్ రాసిన అసమర్దుని జీవయాత్ర, బుచ్చిబాబు రాసిన చివరకు మిగిలేది, రావిశాస్త్రి రాసిన అల్పజీవి. ఈ నవలలు ఒకే ఒక్క పాత్రను కేంద్ర బిందువుగా చేసుకొని మానసిక సంఘర్షణను నమోదు చేయగలిగాయి. అసమర్థుని జీవయాత్రలో సీతారామరావు మృత్యువుతో పోరాడి, మృత్యువుచేతిలో ఓడిపోయే క్రమంలో రచయిత అనుభవించిన మనోవైకల్యం సామాన్యమైనది కాదు. చివరకు మిగిలేదిలో దయానిధి పాత్ర కూడా అటువంటిదే. ఇలా పై నవలలన్నింటిలోనూ ఈ తరహా మనోవిశ్లేషణలు కనబడతాయి.
రాయలసీమ నుండి అటువంటి ప్రయత్నాలు చేయలేదనడానికి లేదు. ముందుగా కనబడేది కర్నూలు నుండి రాసిన కాశీభట్ల వేణుగోపాల్. స్వప్నం మళ్లీ ఇంకో స్వప్నంలోకి ప్రయాణించడం ప్రతీ మనిషికీ అనుభవముంటుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ కలలు కనడం అనేది కలలు కనేవారి అపస్మారక కోరికలను ప్రతిబింబించే కోరిక నెరవేర్చుకోవడం అని రచయిత నమ్మాడు. ఒక కలలోని మానిఫెస్ట్ కంటెంట్, లేదా అక్షర కథ లేదా కల యొక్క సంఘటనలు, కల యొక్క రహస్యవిషయాల్ని, లేదా కల యొక్క ప్రతీక, లేదా దాచిన అర్థాన్ని ముసుగు చేస్తుందంటారు.
ఉదాహరణకు, ఒక వ్యక్తి వారు ఎగురుతున్నట్లు కలలుగన్నట్లయితే, వాస్తవానికి వారు అణచివేతగా భావించే పరిస్థితి నుండి స్వేచ్ఛ కోసం ఆరాటపడుతున్నారని అర్థం. ఇలా ఫ్రాయిడ్ రహస్యమైన విషయాన్ని మానిఫెస్ట్ కంటెంట్గా చెప్తాడు. స్థూలంగా చెప్పాలంటే కోరికలను కలల ద్వారా నెరవేర్చుకోవడం. కాశీభట్ల రాసిన అనాదీ అనంతం ఆ కోవలో వచ్చిన కావ్యమే. కాశీభట్ల వేణుగోపాల్ రాసిన నేనూ చీకటి అనే నవల కూడా మనోవిశ్లేషణకు అద్దం పడుతుంది. వాస్తవానికి కాశీభట్ల కథలూ, కవిత్వమూ, నవలలూ ఏదిరాసినా ఆ వస్తువులో, ఆ పాత్రల్లో, మనోవిశ్లేషణ అంతర్లీనంగా ప్రవహిస్తూనే వుంటుంది.
ప్రముఖ నవలా రచయిత వడ్డెర చండీదాస్ అనుక్షణికం నవల కూడా మనోవిశ్లేషణ తాత్వికత ఆధారంగా రాసిందే. ఉద్యోగరీత్యా రాయలసీమలోని తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ఆచార్యులుగా పనిచేసి పదవివిరమణ చేశారు. మనోవిశ్లేషణ స్పృశించడమే కాకుండా తాత్వికతను కూడా పాత్రల్లో దృశ్యాలుగా చూపిస్తారు. అయితే తను రాసిన తొలినవల హిమజ్వాలలో మాత్రం పాత్రల చిత్రణలో మనుషుల ప్రవర్తన, వెనుక ఉండే మానసిక కోణాలను, భావోద్వేగాలను రచయిత లోతుగా చర్చించారు. అనంతపురం జిల్లాకు చెందిన స్వామి రాసిన రెండు కలల దేశంలో కూడా మనోవిశ్లేషణను పరిచయం చేశారు. మానవ ప్రవర్తనను కొంతమేరకు అంచనా వేయడం వల్ల ఈ రచన కూడా సీమ నుండి వచ్చిన మనోవిశ్లేషణ రచనగా పేర్కొనవచ్చు.
ఇక తిరుపతి నుండి వచ్చిన రాసాని రాసిన స్వప్నదీవి 2022లో వచ్చింది. ఈ నవల స్కిజోఫ్రీనియా అనే మానసిక రోగానికి సంబంధించినది. పై నవలలన్నీ మనోవిశ్లేషణలో భాగంగా ప్రవర్తన, రక్షకతంత్రాలు పరిచయం చేస్తే, ఈ స్వప్నజీవి నవల మాత్రం మానసికవ్యాధిగ్రస్తుని జీవితాన్ని పరిచయం చేసింది. ఇది తెలుగు సాహిత్యంలో వచ్చిన అరుదైన నవల.
మనిషి అంతరంగాన్ని శోధిస్తూనే స్కిజోఫ్రీనియా దశలన్నింటినీ రచయిత ఒకపాత్రలో ఇమిడ్చే ప్రయత్నంలో సఫలమయ్యారు. తను సృష్టించిన పాత్రలో ప్రత్యక్షంగా లేని వ్యక్తులతో మాట్లాడటం, ఎవరో మాట్లాడుతున్నట్లు భ్రమపడి భావోద్రేకాలను ప్రదర్శించి, బ్రాంతికి లోనవ్వడం వాస్తవాలకు భిన్నంగా అపోహలను పెంచుకొని ప్రవర్తించే తీరును రచయిత రాసాని చెప్పగలిగారు. తదనంతరం రాయలసీమ నుండి మనోవైజ్ఞానిక రచనలు ఇప్పటివరకు రాలేదని చెప్పవచ్చు.
*

కెంగార మోహన్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు