సముద్రమా! నిజం చెప్పు!

చెదిరిపోతున్న కలల మధ్య
ఆవిరైపోతున్న చెమట చుక్కల ఆశలు
ముక్కలౌతున్న మనసులో
ఎడతెగని ఙ్ఞాపకాల జడి
నడిచి వచ్చిన అడుగులు సంధిస్తున్న
జవాబు లేని వేల వేల ప్రశ్నలు
కుండెడు తేనెలో
వాడొక నీటి చుక్కలా రాలిపడ్డాడు
ఎగిసిపడుతున్న దుఃఖం
ఎవరికోసమని చెప్పాలి
చేసిన త్యాగాలు నిలదీసి ప్రశ్నిస్తున్నప్పుడు
ఎవరినని నిందితులుగా చూపాలి
పారిన నెత్తురు పరిహాసానికి గురవుతున్న వేళ
ఏ చీకటి రాత్రులను దోషిగా చూపాలి
పూలు వికసించని ఉద్యానవనాల ముందు
చినుకులు కురువని మెఘాల ముందు
చిగురు తొడగని వనాల ముందు
సముద్రమా!ఏ ఆశలతో నిలబడమంటావు
నువ్విచ్చిన ఙ్ఞానంతోనే కదా మేమంతా
ఇంత కాలం కలలు వీడని జీవితాన్ని అనుభవించింది
నువ్విచ్చిన కళ్ళ వెలుగులు
చీకటిని చీల్చక ముందే కనుమరుగవుతుంటే
నీ కవితా చరణాల దారుల వెంట నడిచిన మేమంతా
ఇప్పుడు తీరం చేరని అలలమయ్యాము
వసంతాల కోసం ఎదురుచూస్తూ
శిశిరాలలో చిక్కుకున్న
పూల మొక్కలమయ్యాము
రగరగా ఉదయించిన సూర్యుడు
మధ్యాహ్నం భగభగ మండి
పడమటి కొండల్లో విషాదంగా
విశ్రమించడాన్ని చూస్తూ
ఏ ధైర్యంతో ఎదురు గాలులకు ఎదురొడ్డి
నిటారుగా నిలబడమంటావు
పాలలా విరిగి పోతున్న
కలల శిథిలాలపై నిలబడి
ఏ భవిష్యత్ స్వప్నాలను స్వాగతించమంటావు ?
నా సముద్రమా! నిజం చెప్పు
నువ్వు కూడా ఇప్పుడు
పగిలిన గుండెను గుప్పిట పట్టుకొని
ప్రవాసంలో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నావు కదూ
వృధా వృధా
మాట వృధా
పాట వృధా
కలలు వృధా
కవిత వృధా
చెమట చుక్కల విముక్తి కోసం
ఎప్పుడో ఎక్కడో
ఏదో ఒక ఉషోదయం
మళ్ళీ పురుడు పోసుకోకుండా ఉంటుందా
అన్న ఆశతో ఎదురు చూడడం తప్ప
పట్టుతప్పిన జీవితాలకు
ఇప్పుడు ఏ ఉపశమనం  ఉంటుంది!?
*

వెంకట్ నాగిళ్ళ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు