వైకోమ్ మహమ్మద్ బషీర్ కథ “గోడలు”

నిజానికి ఆ ఆలోచనలు నా ఒక్కడివే కాదు . జైల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాగే ఆలోచిస్తారు . నా సహచరుల భావాల ప్రతిధ్వనులే నా ఆలోచలు.  మా ఒంటరి రాత్రులు, మా  ఏకాకి భావనలు , మాలో మెదిలే శృంగారపుటూహలు …వీటిని గురించి ఇంకా లోతుగా ఆలోచించి హృదయాన్ని గాయపరుచుకోక పోవటమే మంచిది .   

“గోడలు “ అనే చిన్న ప్రేమ కథను మీరెప్పుడైనా విన్నారా ? బహుశా నేనింతవరకూ ఆ కథ చెప్పలేదనుకుంటా. నిజం చెప్పాలంటే ఆ కథకు “ఒక స్త్రీ పరిమళం “అనో , “అతివ సుగంధం “ అనో పేరు పెట్టాలని అనిపించింది .కాలం ,కర్మ వంటి విషయాలను గురించి చాలా సార్లు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కదా!

ఆ కాలమనే అద్భుత ప్రవాహానికి ఆవలి గట్టున ఆనాటి సంఘటనా _ ఇవతలి గట్టున నేనూ! నా ఒంటరి హృదయం పలికే విషాద గీతమే ఈ కథ .

*.             *                     *

నా చుట్టూ ఆవరించుకున్న రాతి గోడలు ఎత్తుగా ఆకాశాన్ని అంటుతున్నాయి .ఆ సెంట్రల్ జైలు ఆవరణలో

ఎన్నో భవనాలూ _వాటిలో ఎందరో మనుషులూ . ఖైదీలందరూ లాకప్ గదుల్లో ఉన్నారు .అంతటా అలముకున్న నిశ్శబ్దం .ఈ తెల్లవారుజామున కొందరిని ఉరి తియ్యాబోతున్నారు . శిక్షా కాలం ముగిసిన మరికొందరు రేపు స్వేచ్ఛా ప్రపంచం లోకి అడుగు పెట్టబోతున్నారు .

అందుకే వాతావరణమంతా నిశ్శబ్దంగా ఉంది .

మేమిద్దరం నడుస్తూ ఉరికంబం దగ్గర్లోకి వచ్చాం .సన్నటి కాలిబాట . మా చుట్టూ ఎత్తైన గోడలు . వార్డర్ ముందు నడుస్తున్నాడు .నాకు జైలు దుస్తులు తొడగటమూ , నన్నొక నంబరుగా మార్చెయ్యటమూ జరిగి కాస్సేపే అయింది .నా తలమీద నల్ల చారలున్న తెల్ల టోపీ ,తెల్ల చొక్కా ,తెల్లటి నిక్కరూ , పరుచుకునేందుకు ఒక రగ్గూ , కప్పుకోటానికి దుప్పటీ ; తినటానికీ , తాగటానికీ ,మిగతా అవసరాలకూ కొన్ని బొచ్చెలూ _ప్రతి వస్తువు మీద నంబరూ !ఇదంతా నాకు కొత్తేమీ కాదు .జైలుకు రావడమూ ,ఒక నంబరుగా రూపాంతరం చెందటమూ నా జీవితంలో చాలాసార్లు జరిగిందే.

చాలాకాలం క్రితం సంఖ్యా శాస్త్రాన్ని గురించి చదివిన ఒక పుస్తకం గుర్తొచ్చింది . నా కొత్త నంబరుకేసి చూసుకున్నా.

అంకెలన్నీ కూడితే – తొమ్మిది . బావుంది .ఆ శాస్త్రంలో ఈ తొమ్మిది ప్రాధాన్యం ఏమిటో ? ఏం జరగబోతోంది ఈ జైలు జీవితంలో ?ఆలోచనల వేగానికి నడక మందగించింది .

“ కొంచెం తొందరగా నడవలేవంటయ్యా ?” గద్దించాడు వార్డర్ .నవ్వొచ్చింది .నవ్వే అవకాశాన్ని నేనెప్పుడూ ఒదులుకోను . మనిషికి దేవుడిచ్చిన వరం కదా నవ్వంటే!

“ఎక్కడికి పోవాల అంత తొందరగా …భూమండలాన్ని దాటేసి పోతావా ఏం ?” అన్నాను .

వార్డర్ మాట్లాడ లేదు .ముందుకు నడుస్తూనే ఉన్నాడు .

“ నన్ను లాకప్ లో పడేసాక ముఖ్యమైన పనేదన్నా ఉందా ?” అన్నాను మళ్లీ నేనే .

నామీద మోపిన నేరం కాస్త పెద్దదే . రిజర్వు పోలీసులు

నా కుడి చేతిని మధ్య వేలి దగ్గర నుంచి భుజం దాకా నజ్జు నజ్జుగా చితగ్గొట్టారు .  మా అమ్మానాన్నలకు , అన్నదమ్ములకూ , అక్క చెల్లెళ్ల కూ పోలీసులేమీ చెప్పనే లేదు . మేజిస్ట్రేట్ ద్వారా తెలిసింది వాళ్లకు -ఆయనకు పోలీసులంటే పడదు .  నన్ను అరెస్టు చేసేందుకు మా ఇల్లంతా సోదా చేశారు . అప్పుడు నేనక్కడ లేను . తర్వాత పట్టుకున్నారు. అయితే ఎవ్వరూ నా ఒంటిమీద చెయ్యి వెయ్యలేదు . యాభై , అరవై మైళ్ల దూరానున్న పట్నంలోని పెద్ద పోలీసు స్టేషన్లో పడేశారు . పద్నాలుగు నెలలు గడిచినా కేసు హియరింగ్ కు రానేలేదు .ఒక పోలీసు ఇన్స్పెక్టర్  ఇచ్చిన సలహా ప్రకారం నిరాహార దీక్ష

మొదలెట్టా . చివరికి ఎట్లాగయితేనేం ,కేసు కోర్టుకు వచ్చి నాకు జైలు శిక్ష పడింది.

లాకప్ లో ఉన్నాన్నాళ్లూ వందలాది మంది కానిస్టేబుళ్లు , ఇన్స్పెక్టర్ లూ నన్ను ప్రేమగా వాళ్ళ ఇంట్లో మనిషిలా చూసుకున్నారు . చాలామంది నా శిష్య పరమాణువులై

పోయారు . నన్నొక హెడ్ కానిస్టేబుల్ను చూసినట్టుగా చూసుకున్నారు . నేను లాకప్ లోంచే వాళ్ళ గురించి కథలు రాశాను . ఓ ఇన్స్పెక్టర్ నాకు పేపర్లూ , పెన్సిళ్లు సరఫరా చేశాడు . ఇవాళ వాళ్ళందరికీ వీడ్కోలు పలికి బయటకొచ్చా . భుజాలకు తుపాకులు తగిలించుకున్న ఇద్దరు పోలీసులు నాకు బేడీలేసి  , ఈ సెంట్రల్ జైలుకు

తరలించుకొ చ్చారు .

వచ్చేముందు పోలీసులు నాకు రెండు బీడీ కట్టలూ ,అగ్గి

పెట్టెలూ , ఓ కొత్త బ్లేడూ ఇచ్చారు . వార్డరు వాటినన్నిటినీ

లాక్కుని , “ జైల్లో ఇదంతా కుదరదోయ్ “ అంటూ హెచ్చరికలు జారీ చేశాడు . తన నెత్తి మీదున్న టోపీని తీసి ,దాంట్లో ఈ వస్తువులన్నీ పడేసి , ఓ గుడ్డ ముక్కను

అడ్డంగా పెట్టాడు . తర్వాత టోపీని నెత్తిమీద పెట్టేసుకున్నాడు . సరే పోనీ ,దున్నపోతు వెధవ !

నాకు బ్లేడు ఎందుకో మీకు అర్థం కాలేదనుకుంటా . దాంతో ఒక్కో అగ్గిపుల్లను నిలువుగా నాలుగేసి భాగాలుగా చీల్చ వచ్చు . ఆరేసి భాగాలుగా చీల్చిన మహా కళాకారులను కూడా నా కళ్ళతో చూశా ! జైల్లో అగ్గిపుల్లలు దొరకటం కష్టం . డబ్బులుంటే కష్టమేమీ కాదనుకోండి . డబ్బులెటూ

ఉండవు కాబట్టి చిన్న బ్లేడు ముక్క ఉంటే గట్టెక్క వచ్చు . నేను సొంతంగా తయారు చేసుకునే “ చక్కీ “ బాగా ఉపయోగ పడుతుంది . దాన్ని ఎలా తయారు చేయాలంటే _ ప్రభుత్వం వారిచ్చిన కంబళి లోంచి కాసిని దారాల్ని బయటికి లాగాలి ముందుగా . ఒక్కోటి అరచెయ్యి

పొడవున ఉండాలి.  ఓ  పక్కన రెండంగుళాలు వదిలేసి , అన్నిటినీ కలిపి కట్టాలి . ఆ తలకాయ భాగానికి నిప్పు అంటించాలి . బాగా చేయితిరిగిన కళాకారులైతే మడతలు పెట్టిన తోలు ముక్కలో ఈ అంటించిన చక్కీని చుట్టి పెడతారు. నాబోటి బీదవాళ్లేమో మందపాటి పనస ఆకులో చుట్టుకుంటారు .

ఓ చిన్న ఇనపముక్కగాని దొరికిందంటే చాలు . దాన్ని సిమెంటు నేల మీదనో , రాతి మీదనో రుద్ది నిప్పు పుట్టిస్తా. దీంతో చక్కీ చివర్లను అంటిస్తే సరి! కానీ ఇప్పుడు

ఇనప ముక్కను ఎక్కడ సంపాదించాలి ? నిజం చెప్పాలంటే  జైల్లో దొరకనిదంటూ ఏమీ ఉండదు . బీడీలు , అగ్గిపెట్టెలు , గంజాయి ,సారా ,బెల్లం _ డబ్బులుండాలంతే!

ఒక్క బ్లేడుముక్క దొరికితే , ఇక ఇనుము గురించి బెంగ లేదు.

దాన్ని ఒక చెక్క ముక్కలో గుచ్చి పెట్టుకోవచ్చు . ఇప్పుడు ఈ సంపదలన్నీ వార్డరు గాడి టోపీలోకి పోయాయి.

“ పోలీసులు చెడ్డోళ్లేం కాదు !” అన్నాను మాట కలుపుతూ .

నా మాటలు అతని చెవిన పడ్డాయో లేదో కానీ మాటా పలుకూ లేకుండా అలా నడుస్తూనే ఉన్నాడు . లాభం ఉంటుందంటే అతను ఏ వస్తువునైనా అమ్ముతాడు . అలా సంపాదించిన లాభాలు అతని పిల్లలకూ ,వాళ్ళ పిల్లలకూ కూడా సరిపోతాయి . కావాలంటే వాళ్లకు చంద్రుణ్ణి , చుక్కలనూ కూడా కొనిపెట్టేంత సంపాదించే ఉంటాడు .

“మీకెందరు పిల్లలు ?” అడిగాను .

“ఆరుగురు .ఐదుగురు ఆడపిల్లలు ,ఒక కొడుకు “ అన్నాడు .

పాపం ఐదుగురు కూతుళ్లట .

“పిల్లలూ ,వాళ్ళ తల్లీ క్షేమంగానే ఉన్నారు కదా !”

“ఉన్నారున్నారు “ అన్నాడు అసహనంగా . “నడువ్ తొందరగా “ .

అతడి నడకలో వేగం ఎందుకు పెరిగిందో నాకు తెలుసు .

“మీరుగనక చచ్చిపోతే వాళ్ళ గతి ఏమవుతుందంతారు?”

“దేవుడే దిక్కు “.

“ఏమో ,నాకు అనుమానమే !”

“ ఎందుకని ?”

“దివ్య దృష్టి ! ఒకప్పుడు యోగిని నేను .భారత దేశంలో నేను తిరగని పుణ్య క్షేత్రాలు ,మునగని నదులూ లేవు . కొండలూ , లోయలూ , అడవులూ , ఎడారులూ ,సముద్ర తీరాలూ , పాడుబడ్డ గుళ్ళూ …”

“ఐతే ఏమంటావ్ ?”

“దేవుడు ఊరికే వదలడు !”

“నేనేం తప్ప చెయ్యలేదే !”

“ఈ రోజు పట్టపగలే దొంగతనం చేస్తివి కదా ,దాని సంగతి?”

అతను ఆశ్చర్య పడుతూ “ఏం దొంగతనం ?” , అన్నాడు .

“ఏదో ఒకనాడు నువ్వు చచ్చిపోకా , దేవుడి ముందు విచారణకు నిలబడకా తప్పదు .అప్పుడు దేవుడు నిన్ను, ‘ఓరి దౌర్భాగ్యపు జైలు వార్డరూ ,ఆ దిక్కులేని బషీర్ దగ్గర కాజేసిన  అగ్గిపెట్టెలూ ,బీడీ కట్టలూ , బ్లేడూ ఎక్కడ ?’ అని అడుగుతాడు !”

వార్డరు మౌనంగా నిలబడి పోయాడు .

“పద పద ,నన్ను లాకప్ లో వేసేసి నువ్వెక్కడికో పోవాల

కదా !” అన్నాను .అతడు కదల్లేదు .తర్వాత చిన్నగా నవ్వుతూ టోపీ లోంచి నా ఆస్తుల్ని తీసి నాకిచ్చేశాడు .

“మంచోడి వయ్యా !”,అన్నాను .”గాంధీజీ సత్యాగ్రహం చేస్తున్నాడని పొద్దున ఇన్స్పెక్టర్ చెప్పాడు .ఆ సంగతి మళ్ళా ఏమన్నా తెలిసిందా ?”

“నిమ్మరసం తాగి లేచేశాళ్లే “, చెప్పాడు వార్డర్ .

మంచిదే .మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జిందాబాద్ ! ప్రజలందరూ జిందాబాద్ !

ఎన్నో ఇనప తలుపులను దాటుకుంటూ నడుస్తూనే ఉన్నాం .గోడలు ! గోడలు !

“ఈ జైల్లో రాజకీయ ఖైదీలు ఎంతమందున్నారు ?”

“పదిహేడు మంది .నిన్ను కూడా వేస్తున్నాంగా ,ఇప్పుడు పద్దెనిమిది .”

ఐతే మనమొక ప్రత్యేక స్థలంలో ప్రవేశిస్తున్నామన్న మాట ! ప్రభుత్వం వీణ్ణి బాగానే గుర్తించింది . శభాష్ !

*                  *.                  *

మేమట్లా నడుస్తూ ఉండగా నా ముక్కుకు ఏదో సుగంధం సోకింది .అది ప్రపంచం లోనే అతి మత్తైన  పరిమళం ! స్త్రీ పరిమళం !

ఒళ్లు ఝల్లుమంది . నా ఒంట్లోని అణువణువూ మేల్కొన్నది . ముక్కు పుటాలు విశాలమయ్యాయి . గాఢంగా ఆఘ్రాణిస్తూ ఆ పరిమళాన్ని నా లోలోపలికి ఒంపేసుకున్నా.

ఎక్కడుందామె ? చుట్టూ చూశా. ఎవ్వరూ లేరక్కడ !

మళ్ళీ ముందుకు నడుస్తూ ఉండగా ప్రపంచం లోని అతి సుందరమైన శబ్దం నా చెవులను తాకింది .అది ఒక స్త్రీ నవ్వు !

ఈ నవ్వూ , ఆ పరిమళ మూ ఒకచోటి నించేనా ? లేక ఒకదాని మత్తులో మరోదాన్ని ఊహించుకున్నానా?

ఆ అద్భుతమైన జీవి _స్త్రీని గురించి నేనసలు మరిచే పోయా !

ఇది వాస్తవమే !నేను విన్న నవ్వూ నాకు సోకిన పరిమళమూ నిజమైనవే ! ఇది సబ్బు పరిమళం కాదు.

నూనెల సుగంధం కాదు . పౌడరూ , చెమటా కలిసిన వాసన లాంటిది కూడా కాదు .ఈ అద్భుతమైన పరిమళం స్త్రీ నించి మాత్రమే వీచేది.

ఆ పరిమళాన్ని మళ్లీ ఆఘ్రాణించాలనే ప్రయత్నంలో నా ముక్కు పుటాలు ఇంకా ఇంకా పెద్దవవుతున్నాయి _ అతి గాఢమైన కోరికతో బద్దలవుతాయేమో అన్నంతగా . మగువా , నువ్వెక్కడ ?

“ఆడవాళ్ళ నవ్వు వినబడుతోందే , ఎక్కడ్నుంచి ?”  అడిగాను .

“ఇంకా పెళ్లి కాలేదా ? “ అన్నాడు వార్డర్ ఎకసెక్కెంగా .

“లేదులేగానీ ,అదిగిందానికి జవాబు చెప్పవేమయ్యా ?”

“నీకెందుకీ సంగతులన్నీ ?”

“భయానకమైన ఈ సెంట్రల్ జైల్లో ,ఈ ఉరికంబం పక్కన ఓ ఆడపిల్ల నవ్వు నా చెవిన పడిందయ్యా ! అది ఎక్కడినించని అడిగే అర్హత రావాలంటే నేను వెంటనే పెళ్లి చేసుకోవాలంటావా ?”

వార్డర్ నవ్వాడు. “ఆడవాళ్ళ జైల్లో నించి . నువ్వు ఉండబోయేది దాని పక్కనే . రెండిటి మధ్య ఓ గోడే అడ్డం”.

నాకు పడిన శిక్ష _ రెండేళ్ల కఠిన కారాగారమూ ,వెయ్యి రూపాయల జరిమానా .ఆ డబ్బు కట్టలేక పోతే ఇంకో ఆర్నెల్లు జైల్లోనే . ఆడవాళ్ళ జైలుకూ ,నాకూ మధ్యన ఓ గోడ మాత్రమే అడ్డం !

ఒకే ఒక గోడ …అక్కడ ఆడవాళ్ళ జైలు …అద్భుతం !

అలా నడుస్తూనే నాకిచ్చిన రగ్గునూ , దుప్పటినీ గట్టిగా గుండెలకు హత్తుకున్నా . ఇనప ఊచల గేటు తీసి నాలుగు వైపులా గోడలతో ఉన్న ఆవరణ లోకి అడుగు పెట్టాం .చాలా చెట్లున్నాయక్కడ .చాలా వరకూ పనస చెట్లు .తూర్పు వైపు దూరంగా చాలా ఇళ్లున్నాయి. వాటికి రెండు వైపులా పెద్ద గోడలు .ఆ కుడివైపు గోడ దాటితే విశాలమైన స్వేచ్ఛా ప్రపంచం. ఎడమ గోడకు అవతల ఆడ ఖైదీలుండే జైలు !

చుట్టూ చిన్న ప్రహరీలతో ఉన్న ఆ గదులన్నీలాకప్ లు.

అక్కడుండే లాకప్ వార్డరు మాకు ఎదురొచ్చాడు . ఇంతసేపూ నా వెంట ఉన్న వార్డరుకు చేతులు జోడించి నమస్కరించాను . ఆయనా ప్రతి నమస్కారం చేసి వెళ్ళి పోయాడు . మంచివాడు . దేవుడు ఆయన్ని చల్లగా చూడాలి !

కొత్త వార్డర్ లాకప్ గదికున్న ఇనప తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకు వెళ్ళాడు .చాలా ఇరుగ్గా ఉంది . గది వెలుపల కాస్త దూరంగా మరుగు దొడ్డి .తలుపు పక్కన ఓ కుళాయి ఉంది . అక్కడికెళ్లి కాళ్ళూ , చేతులూ , మొహమూ కడుక్కున్నా .కడుపు నిండా నీళ్లు తాగాక ,గిన్నెలోకి కూడా నింపుకున్నాను .  భగవన్నామ స్మరణ చేసుకుంటూ జైలు గదిలోకి కుడికాలు మోపాను .

గోడలు ,గోడలు ! నన్ను చుట్టు ముట్టేస్తూ ఎన్నెన్నో గోడలు ! ఇనప ఊచల గేటు మూసి తాళం వేశాడు వార్డర్.  “ప్రియమైన సర్కారు వారి ఈ కొత్త అతిథికి ఇంతదాకా తిండీ తిప్పలూ లేవు “,అన్నాను .

“ఇవాల్టి కోటా నీకు రాదుగదా ! రేపట్నించీ పెడతాం !”

“ఐతే నన్ను పంపెయ్యండి . రేపటి కోటా లోకి మళ్ళీ వస్తాన్లే !”

“ఏం కేసు ?” , అడిగాడు వార్డర్ .

“పుస్తకాలు రాయటం . రాజద్రోహం “.

అతడు భయంతో కొయ్యబారి పోయి ,”రాజద్రోహమే ! శ్రీ పద్మనాభా ! రక్షించవయ్యా!” , అంటూ కేక పెట్టాడు .

అచ్చమైన దేశభక్తుడు !

లాకప్ తలుపుకున్న ఊచల్లోంచి కళ్లు పేలిపోయేంత వెలుతురు బయటి నుంచి పడుతోంది .లోకమనే పెద్ద జైల్లో ఈ చిన్న జైలూ ,అందులో ఒంటరిగా నేనూ ! ఈ  అనంతలో నేనొక్కడినే !

రఘు పరుచుకున్నాను . బొచ్చెలన్నీ సర్ది పెట్టుకున్నా.

లాకప్ లోపలంతా కళ్లు చెదిరేట్టుగా వెలిగిపోతోంది .  ఇవాల్టి  కోటాలో కూడా నేనుండను . అంటే కడుపులో కాళ్లు పెట్టుకుని పడుకోవటమే అన్నమాట .తిండి సంపాదించే పద్ధటేమితటో నాకు బాగా తెలుసు .ఐనప

ఊచల్ని పట్టి ఊపుతూ , వార్డర్ని కేకలు పెట్టి పిలుస్తూ రభస చేస్తే సరి ! సూపరిండెంటూ , జైలరూ అందరూ పరిగెత్తుకొస్తారు . తిండి దొరుకుతుంది .

కానీ ఇలా చెయ్యకూడదని నిర్ణయించుకున్నా . దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాను . తుపాకీ మడమలతో నా ఛాతీలో కుమ్మి కిందపడేసి వీధుల్లో బరబరా ఈడ్చుకు పోయారు . ఎన్నోసార్లు జైల్లో పడిన వాణ్ణి .కానీ ఈసారి _ ఇప్పుడు నాకీ జైలు శిక్ష పడ్డది నేను రాసిన సాహిత్యం వల్లా …రాజకీయాల వల్లా కూడా !ఆ విషయాన్ని తలచుకుంటే నాకు గర్వంగానే ఉంది .

మరిన్ని మంచినీళ్ళు తాగాను .ఆపైన ,అగ్గిపుల్లను రెండుగా చీల్చకుండానే దర్జాగా మొత్తం పుల్లతో బీడీ ముట్టించా . నాలుగు దమ్ములు లాగాక ఆర్పి పక్కన పెట్టుకున్నా . మరీ పేరాశకు పోకూడదు కదా !

అలా కూర్చుని జాగ్రత్తగా వింటున్నా.ఆ అమ్మాయి నవ్వు మళ్లీ వినబడనే లేదు . ఇందాకటి స్త్రీ పరిమళం కూడా లేదు . నేనిప్పుడు ఆడవాళ్ళ జైలు పక్కనే ఉన్నాను . ఓ మగువా , నువ్వెక్కడ ?

అతి పురాతనమైన స్త్రీ పరిమళం _అది నా ఊహకైనా అందుతుందా ? సుదూర కాల తీరాన …యుగాలకు ఆవల ,మనువు పుట్టక పూర్వం …ఆదామునై ఈడెన్ తోటలో సంచరిస్తున్నప్పుడు ఈవ్ నుండి వీచే ఆ మార్మిక పరిమళాన్ని ఆస్వాదించాను ! ఆ సుగంధం నా స్మృతుల్లో అలా నిలిచిపోయి … ఓ మరీచికలా …దప్పికతో ఎడారిలో తిరుగాడుతున్న పాంధుడికి మంచినీటి కొలనులా ఎదురై … అంతలోనే మాయమైంది ! కానీ మేలుకొన్న నా ఆత్మా ,వెడల్పైన నా ముక్కు పుటాలూ , బద్దలవటానికి సిద్ధంగా ఉన్న నా హృదయం … ఓహ్ ! ఎంత అద్భుతమైనది ఈ స్త్రీ !

ఆ మధురమైన సవ్వడేదీ ? ఎక్కడ …ఎక్కడ నన్ను పిచ్చెత్తించిన ఆ పరిమళం ?

ఇనప ఊచల్లోంచి బయటికి చూశా . దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్లను నా కళ్ళు భరించలేక పోతున్నాయ్ . లోకమంతా అందకారపు ముసుగు కప్పుకుంది .ఆ చీకట్లో ఎక్కడేముందో స్పష్టంగా కనబడటం లేదు . ఒక విషయం నాకిప్పుడు అర్థమవుతోంది _  ఈ చీకటిని నేనెన్నడూ చూసి ఎరగను . ఓ పురాతన , గాఢ ,అద్భుత తిమిరమా ! అనంతాకాశంలో మిలమిల్లాడే ఓ తారలారా ! చందమామను మింగేసిన ఓ అద్భుత రాత్రీ !ఇన్నాళ్లూ నిన్ను నేనెందుకు చూడలేదు ?

కానీ ,ఇది నిజం కాదు . నేను గతం లోనే దీన్ని చూశాను . కాకపోతే ,శ్రద్ధగా గమనించ లేదంతే ! యామిని …రాత్రి అనే స్త్రీ ! చాలా కాలం నాటి ఒక మధురమైన రాత్రి గుర్తొచ్చింది .అదో చిన్న పల్లె .చుట్టూ దిగంతాల దాకా పరుచుకున్న వేలాది మైళ్ల ఇసుక ఎడారి .ఇవాల్టిలాగే తొలి వేకువ వేళన నేనా ఎడారిలో ఉన్నాను . మైలు దూరం పైగా నడవాలి . చుట్టూ తెల్లని  పట్టు వస్త్రం పరిచినట్టుగా అనంతమైన ఇసుక మైదానం. విశాల విశ్వం మధ్యన ఒంటరిగా నేను . సరిగ్గా నా నడినెత్తిన , చెయ్యి చాపితే అందుతుందేమో అన్నంత సన్నిహితంగా ధగధగలాడే నిండు చందమామ . శుభ్రమైన నీలాకాశంలో పూర్ణచంద్రుడూ , తారలూ , కోటానుకోట్లు …లెక్కకు అందనన్ని తారలు మెరిసి పోతున్నాయి . పరిపూర్ణమైన వృత్తాకారంలో చంద్రుడు . గాఢమైన నిశ్శబ్దం అలముకున్న విశ్వంలో  పరిభ్రమించే గ్రహాల సంగీతం … వీటన్నిటినీ తనలో లీనం చేసుకుంటోంది .

నేను ఆహ్లాదాశ్చర్యాలతో నిశ్చేష్టుడినై నిలిచి పోయాను. నా ఆహ్లాదం ,విభ్రాంతి , కరిగి కన్నీళ్ళయి జాలువారాయి . గొంతెత్తి విలపించాను . ఆ ఉద్విగ్నతను ఇక భరించ లేక వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ వెనక్కి తిరిగి మానుష ప్రపంచంలోకి పరిగెత్తాను .

ఓ సృష్టికర్తా ! నన్ను రక్షించు ! దీన్ని భరించే శక్తి నా హృదయానికి లేదు . ఈ  ఇంద్రజాలానికి ,నీ అద్భుత తేజానికి …నా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి .దీన్ని తట్టుకోలేని అల్పుడిని ! నన్ను కాపాడు !

             *

మర్నాడు పొద్దున జైలు వార్డర్ తలుపు తాళం తీసి , నన్ను లేపటానికి కటకటాలను ఊపి చప్పుడు చేస్తూ ఉంటే మెలకువ వచ్చింది .

లోకమా ! నీకు సలామ్ l

లేచి కూర్చుని బీడీ ముట్టించాను . నింపాదిగా కాలకృత్యాలు మొదలెట్టా. వేప పుల్లతో పళ్ళు తోముకున్నా. చాలా ఏళ్ళ కిందట హిమాలయ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇలాగే వేప పుల్లతో పళ్ళు తోముకునే వాడిని . పంపు కింద నిలబడి హాయిగా తీరుబాటుగా స్నానం చేశా . జైలు బట్టలు తొడుక్కుని ,అన్నం గిన్నెను శుభ్రంగా కడుక్కుని ,మా నాయకులను కలవటానికి బయల్దేరా .ఇక్కడ ఎవరికి వాళ్ళు మహా నాయకులే !

వాళ్ళను కలిసి వచ్చేసరికి  పెద్ద పాత్రలో అంబలి వచ్చింది . గిన్నెలో పెట్టించుకుని , పచ్చడి నంజుకుంటూ తినేశా . ముందు జావలాంటిదంతా  తాగేసి ,మిగిలిన మెతుకుల్లో పచ్చడి కలుపుకుని తిన్నా . చేతులూ ,నోరూ , కంచమూ కడుక్కుని మంచి నీళ్ళు తాగేశా . హాయిగా ఉందిప్పుడు .

ఇదంతా అయ్యాక  ఓ అగ్గిపుల్లను తీసుకుని నిలువునా రెండుగా చీల్చి ,ఒక దానితో బీడీ వెలిగించి మత్తుగా నడుం వాల్చా . కాసేపయ్యాక లేచి కాస్త టేయాకూ ,  చక్కెరా దొరుకుతాయేమో చూట్టానికి జైల్లో ఓ చుట్టు తిరుగుదామని బయల్దేరా .ఎంత జైల్లో ఉన్నా,బ్లాక్ టీ తాగకుండా ఉండలేను .

మా నాయకులెవరి దగ్గరా తేయాకు గానీ చక్కెర గానీ లేవు . ఒకాయన దగ్గర రహస్యంగా దాచుకున్న ‘ ఇనో సాల్ట్ ‘ సీసా మాత్రం కనబడింది .అది లేనిదే ఆయనకు రోజు గడవదు .మరొకాయన కార్ల్ మార్క్స్ ‘ దాస్ కాపిటల్ ‘ దాచుకున్నాడు . అదీ ఆయనకు అత్యవసర వస్తువే . ఇంకొకాయన దగ్గర పేక ముక్కలున్నాయి .

బ్రిడ్జి ఆట నేర్పిస్తాను కూర్చోమని నా వెంటబడ్డాడు .

అందరినీ తప్పించుకుని వెనక్కి తిరిగా .

         *

ఒక నెల గడిచింది . నా జీవితం రాజాలా ఉందని చెప్పాలి.

నేనుండే గూట్లో ఓ మూల రెండు ఇటుకలున్నాయి . వాటి పక్కన కట్టెల మోపు . టీ కాచుకోటానికి ఒక చిన్న గిన్నె . చిన్న దిండ్ల సైజులో ఉన్న రెండు కాగితం సంచుల్లో తేయాకు , చక్కెర  నా చాప కింద అణిగి మణిగి కూచున్నాయి .పుష్కలంగా బీడీలు , రాసుకునేందుకు కాయితాలూ , పెన్సిళ్లూ! మామిడి చెట్లకు అంటు కట్టటానికని జైలు సూపరిటెండెంట్ గారు ప్రత్యేకంగా ఇచ్చిన పెద్ద కత్తి కూడా ఉంది .తోట పనిలో నాకు చాలా నైపుణ్యం ఉందని ఆయన నమ్మకం . నా సెల్ ముందర నలుచదరపు స్థలం లో నాటిన గులాబీ మొక్కలు పూల సుగంధాలను విరజిమ్ముతున్నాయి .

పొద్దున అంబలితో మొదలైన నా భోజనం ,మధ్యాహ్నానికి చేపల వేపుడు ,గుడ్లూ , లివర్ ,మంచి రుచికరమైన చట్నీల దాకా చేరుతుంది .

ఇక్కడ ఒక ఖైదీ ఉన్నాడు .ఏదో ప్రమాదకరమైన  నేరం చేసి ఉంటాడు కాబోలు .బహుశా ఎవర్నో ఖూనీ చేసి ఉండొచ్చు . ఐనా సరే ,అతడిని ఉరి తియ్యరు .  జీవితాంతమూ జైల్లో పెట్టి చక్కగా పోషిస్తారు .ఆ మనిషి పుష్టిగా ,తెల్లగా , నిండైన ముఖంతో ,చిరు నవ్వులు చిందే కళ్ళతో హాయిగా ఉంటాడు .

పొద్దున్నే చాలాసేపు వ్యాయామం చేస్తాను . సరిగ్గా చెప్పాలంటే దృఢంగా వస్తాదులా ఉంటాను . నా గులాబీ తోట పక్కగా పెద్ద పనస చెట్టొకటి ఉంది . దాని కింది వైపు కొమ్మ నా తొడ లావున ఉంది . వ్యాయామం చేసేటప్పుడు అది బాగా ఉపయోగ పడుతోంది . వ్యాయామం ముగించి స్నానం చేశా . నవ్వే కళ్ళతో ఉండే ఆ ఖైదీ వచ్చిమూత పెట్టిన గిన్నెతో అంబలీ , పచ్చడీ ఇచ్చి వెళ్ళాడు . అది అన్నంలా చిక్కగా ఉంది . “ వెళ్ళి ఆస్పత్రిలో ఆర్డర్లీని కలువ్ ,టీ ఇచ్చే ఏర్పాటు చేస్తాడు “ అని చెప్పాడు మెల్లిగా .

వెళ్ళాను . నల్లగా ,సన్నగా ఉన్నాడతడు . దర్జాగా పెంచిన మీసాలు .పళ్ళు తెల్లగా జిగేల్మంటున్నాయి . అతని చిరునవ్వు అందంగా ఉంది . కాస్సేపట్లో తను నాకు  మంచి స్నేహితుడయ్యాడు . అతడు చదువుకున్న వాడు కావటం వల్ల, ప్రవర్తన బాగున్నదన్న నమ్మకం కలగడం వల్ల ఆస్పత్రిలో ఆర్డర్లీగా వేశారు .ఇద్దరు మనుషులకు విషం పెట్టి చంపాడన్న ఆరోపణతో అతణ్ణి జైల్లో పెట్టారట .

నాకిక తేయాకు , చక్కెర , గుడ్లు , రొట్టె ,పాలు ,బీడీల్లాంటి వారికి దిగుల్లేదు .

తిరిగి వెళ్తూ ఉండగా హాస్పిటల్ వెనక వైపున విరగబూసిన గులాబీ మొక్కలు కనబడ్డాయి . కొన్నిటిని జాగ్రత్తగా పీకి తెచ్చి నా సెల్ ముందు నాటాను . నా తోట చూసి మిగతా గదుల్లో వాళ్ళు తమకూ కావాలన్నారు . వాళ్లుండే చోట కూడా పూల తోటలు నాటాను .

మా ఖైదీ నాయకులందరికీ బయటి ప్రపంచంతో సంబంధాలు నడుస్తూనే ఉంటాయి . వార్డర్లకు కాస్తంత ముట్ట జెపితే లోపలికీ బైటికీ ఉత్తరాలు చేరవేస్తారు .రాత్రి వేళల్లో ప్రహరీ గోడ మీదుగా రకరకాల పాకెట్లు లొపలికి వచ్చి పడుతూ ఉంటాయి . ఖైదీలు పొద్దున్నే వాటిని

ఏరుకుని తెచ్చుకుంటారు . అరటి కాయ చిప్స్ _ఉప్పు చల్లినవీ ,చక్కెర పాకంలో వేసినవీ  బెల్లం కలిపినవీ ;  నిమ్మకాయ ఊరగాయ ,ఇంకా బోలెడన్ని తినుబండారాలు ఈ పాకెట్లలో ఉంటాయి . ఒక్కోసారి నేను

కూడా చిన్న చిన్న పాకెట్లూ , డబ్బాలూ తెచ్చుకుంటాను.

ఒక ఖైదీ లీడరు నాకు కాస్త నిమ్మ ఊరగాయ పెట్టాడు . ఎంత కమ్మగా ఉందో ! ఆయన ముఖాన్ని వర్ణిస్తూ నేనొక కావ్యాన్ని రాసినా ఆయన రుణం తీర్చుకో లేను .

అప్పుడప్పుడూ ఆడవాళ్ళ జైలుకేసి అలా చూస్తూ ఉంటాను . ఆ రోజు విన్పించిన నవ్వును మరీ మరీ గుర్తు చేసుకుంటాను . ఒక్కోసారి  పనస చెట్టు మీదికి ఎక్కుతుంటాను . సాధారణంగా నేనీ పని చేసేది మధ్యాహ్నం భోజనం అయ్యాక . మా నాయకులందరూ ఆ సమయంలో కాస్త కునుకు తీస్తుంటారు . నేను చిటారు కొమ్మల మీదికెక్కి బయట కనబడే స్వేచ్చా లోకాన్ని చూస్తూ ఉంటాను .

“స్వేచ్చా లోకం !”ఎక్కడుందా లోకం ?ఈ   భూగోళ మే  పెద్ద జైలు . ఎత్తయిన గోడలకు ఆవల …అల్లంత దూరాన …రోడ్డు మీద స్త్రీలూ , పురుషులూ నడిచి పోతూ ఉంటారు. ఈ జైలు గురించి వాళ్ళకేమీ పట్టదు . ఒక్కసారి తలలు తిప్పి మాకేసి చూడండి కామ్రేడ్స్ !

అలా వెళుతున్నస్త్రీలను చూస్తూ , “ఓసారిలా చూడండి ! మీ స్త్రీత్వపు వెలుగులతో నా కళ్ళకు కొత్త జీవాన్ని ప్రసాదించండి “, అనుకుంటూ ఉండేవాణ్ణి నాలో నేను .

నిజానికి ఆ ఆలోచనలు నా ఒక్కడివే కాదు . జైల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాగే ఆలోచిస్తారు . నా సహచరుల భావాల ప్రతిధ్వనులే నా ఆలోచలు.  మా ఒంటరి రాత్రులు, మా  ఏకాకి భావనలు , మాలో మెదిలే శృంగారపుటూహలు …వీటిని గురించి ఇంకా లోతుగా ఆలోచించి హృదయాన్ని గాయపరుచుకోక పోవటమే మంచిది .

ఇలా ఎంతోసేపు నా భావనా లోకంలో విహరించాక చెట్టు దిగి నా గులాబీ తోటలోకి చేరుతాను . నా చుట్టూ పూల పరిమళాలు . అద్భుత సౌందర్య , సుగంధాల కలబోత . ఐనా ఏదో శూన్యం .ఎవరూ లేరన్న వెలితి . ఎందుకలా !

ఇక చాలు ,ఆపేయాలి ! ఈ రకం ఆలోచనలు మహా ప్రమాదకరం .అవన్నీ పోయి పోయి ‘ స్త్రీ ‘ మీద కేంద్రీకృతమవుతాయి .

నడవటం మొదలెట్టాను . అక్కడ ఎన్నో గోడలు . ఎన్నెన్నో తలుపులు . ప్రతిచోటా వార్డర్లున్నారు . వాళ్లకు తెలీకుండా జైల్లో ఏ చిన్న పనీ చెయ్యటం కుదరదు . కాపలాదారులు ఎత్తయిన గోపురాలలాంటి గూళ్ళ మీది నుంచి చుట్టూ డేగ కళ్ళతో గమనిస్తూ ఉంటారు .

ఆ గోపురాల చుట్టూ పచార్లు చేస్తున్నాను . ఉన్నట్టుండి ఒక దృశ్యం కంటబడి పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వొచ్చింది .

బలే తమాషాగా ఉంది ! పిచ్చి పట్టిన ఏనుగును కట్టేసినట్టు ఉన్నారక్కడ .

కాదు …కాదు … మనిషే ! నల్లటి టోపీ పెట్టుకున్నాడు . తెల్లగా ,పొడుగ్గా ,బలంగా ఉన్నాడు .మెరుస్తున్న కళ్ళు !

అతను బలంగా గింజుకుంటూ ముందుకు అడుగు వెయ్యటానికి ప్రయత్నిస్తున్నాడు .కానీ ,అంతే బలంగా అతని తలను ఎవరో వెనక్కి లాగినట్టు అవుతోంది . ఓ పెద్ద గొలుసుతో అతని పాదాలనుండి మెడదాకా బంధించి వేశారు . అతడేదో పెద్ద నేరం _ జైలు గోడల్ని పగలగొట్టటం లాంటిది చేసి ఉంటాడనిపించింది .

అతడి దగ్గరగా వెళ్ళి ముఖం చూడగానే ఉలిక్కిపడ్డా . అతను  నా చిన్నప్పటి క్లాస్ మేట్ . మా ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి . ఒకరినొకరం గుర్తుపట్టి నవ్వుకున్నాం.

జ్ఞాపకాలను కలబోసుకున్నాం .

“ఎవర్నన్నా చంపేసొచ్చావా ?” ,అడిగాను .

“నేను నీకు తెలిసిన వాడిననే సంగతి నలుగురూ చూస్తారని ఇబ్బందిగా లేదూ నీకు ?” ,ఎదురు ప్రశ్నించాడు .

“తెలిసిన వాడివా ? నేను నీ స్నేహితుణ్ణిరా  వెధవా !” , అతన్ని కౌగలించుకుని చెంపమీద ముద్దు పెట్టుకున్నా .

అతనికి దొంగతనం నేరం మీద ఒకటిన్నరేళ్లు శిక్ష పడిందట . జైల్లో బీడీలు ,చక్కెర ,ఎందు చేపల వ్యాపారం మొదలెట్టాడట . కొద్ది రోజుల్లోనే అతని ప్రతిష్ట జైలంతా పాకి పోయింది . ఆర్నెల్ల తర్వాత జరిగిన ఒక సంఘటన అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది . వార్డర్లలో ఒకడు చాలా దుర్మార్గమైన పనికి పాల్పడ్డాడు . గతంలో అలాంటి పని ఎవరూ చెయ్యలేదు . అందుకే అతన్ని ‘ దుర్మార్గపు వార్డర్  ‘ అని పిలుచుకుందాం _

జైల్లో జరిగే ప్రతి వ్యాపారం లోనూ వార్డర్లకు వాటా ఉంటుంది . రాళ్లుకొట్టటం లాంటి పనులకు ఖైదీలను జైలు నుంచి బయటకు తీసుకు వెళ్తుంటారు . అలాంటి చోట్ల పేదవాళ్ళ గుడిసెలుంటాయి . అలాంటి చోట్లనే ఈ వ్యాపారాలు పెద్దఎత్తున జరిగేది . మా క్లాస్ మేట్ పెద్ద వ్యాపారవేత్తగా మారాడు . బయటి నుంచి రకరకాల వస్తువులు జైల్లోకి ప్రవేశిం చేది ఖైదీల లంగోటీల ద్వారానే!

గేటు దగ్గర అందరినీ పరీక్షిస్తారు . టోపీ ,చొక్కా , ధోవతీ , తువ్వాలూ …అన్నిటినీ క్షుణ్ణంగా పరీక్ష చేస్తారు . వాటిలో ఏమీ దొరకదు . ఐతే , లంగోటీ అనేది మనిషి శరీరంలో ఒక భాగం లాంటిది కాబట్టి దాన్ని మాత్రం విప్పి చూడరు .

ఎవరూ చేయని ఆ పని ఈ దుర్మార్గపు వార్డర్ చేశాడు . నోటితో చెప్పుకోలేని పని చేశాడు . దాంతో నా క్లాస్ మేట్ ఆ వార్డర్ నెత్తిన రెండు పిడిగుద్దులు గుద్దాడు . విషయం అందరికీ తెలిసిపోయింది . ఆడవాళ్ళ జైల్లోకి కూడా వార్త పాకిపోయింది . అంతటా కలకలం రేగింది . నా మిత్రుడిని కట్టేసి కొట్టారు . అతడి శిక్ష మరో మూడేళ్ళు పొడిగించారు.

కొన్నాళ్ళకు అతని ఒంటిమీద గాయాలు మానాయి . మళ్ళీ రాళ్లు కొట్టటానికి  పోతానని అడిగాడు . కానీ ఆ దుర్మార్గపు వార్డరు ఎంతమాత్రమూ వీల్లేదనేశాడు .

నా మిత్రుడికి ఒళ్లుమండి వార్డరు గొంతుమీద రెండూ , పొత్తి కడుపులో ఒకటీ గుద్దులు గుద్దాడు . అందుకు ప్రతిఫలంగా అతన్ని ఇరవై నాలుగు కొరడా దెబ్బలు కొట్టారట . తను  ఏమాత్రం తొణకకుండా భరించాడు . అప్పటినుంచి ఖైదీలందరికీ వార్డర్ మీద పట్టారానంత కోపంగా ఉంది . అందరి కళ్ళలోనూ కసి కనబడుతోంది .

వాళ్ళలో ఎవరో ఒకరు తనను చంపి పారేసినా  దిక్కు లేదని అతనికి అర్థమై పోయింది . తనకేదో అత్యవసరమైన పనిబడిందనీ ఈ ఉద్యోగంలో కొనసాగటం కుదరటం లేదనీ సాకు చెప్పి రాజీనామా చేశాడు.”  ‘ ఐకమత్యమే మహాబలం ‘  అనే నానుడిని ఖైదీలందరూ నిజం చేశారన్నమాట . నా మిత్రుడిని రాళ్లు కొట్టటానికి పంపకపోయినా జైల్లో అతని వ్యాపారం నిర్విఘ్నంగా సాగి పోతోంది .

         *

ఇలా నా జైలు జీవితం చీకూ చింతా లేకుండా సాగిపోతోంది . నా అవసరాలన్నీ ఏ లోటూ లేకుండా తీరుతున్నాయి .

అసిస్టెంట్ జైలర్ అప్పుడప్పుడూ నా లాకప్ గదికి వస్తుంటాడు . అతడు సరదాగా ,హుషారుగా ఉండే యువకుడు . ఖాకీ ప్యాంటూ , షర్టూ తొడుక్కుని హాట్ పెట్టుకుంటాడు . అతడు నా లాకప్ కు వచ్చేది తనిఖీ కోసం కాదు – పిచ్చాపాటీ కబుర్ల కోసం . ఆయన దగ్గర ఒక ఆల్సేషియన్ కుక్క ఉంది . దాని పేరు జోకర్ .దానికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి ,ఏ తిండి పెట్టాలీ లాంటి విషయాలను మేమిద్దరం చర్చించుకునే వాళ్ళం .నా మాటలంటే అతడికి మహా ఇష్టం . నేనాయనకు బ్లాక్ టీ పెట్టి ఇస్తుంటా .

నా దగ్గర టీ పొడి ,చక్కెర దొరుకుతాయని అందరికీ తెలుసు . ఒక్కోసారి వేకువజామున ఐదు గంటలకు ఉరికంబాన్నెక్కబోయే ఖైదీలు రాత్రిపూట కాస్తంత టీ తాగాలని కోరుకుంటారు . అలాంటి వాళ్లకోసం వార్డరు నన్ను టీ అడుగుతుంటాడు. నేను కాస్త బ్లాక్ టీ తో బాటు రెండు బీడీలు కూడా పంపిస్తుంటా . ధైర్యంగా ఉండమని  కబురు కూడా పంపుతుంటాను . చావును ఎదుర్కోటానికి

రెండే రెండు మార్గాలు _ఏడుస్తూనో , నవ్వుతూనో …చావాల్సిందే . అదేదో నవ్వునే ఎంచుకోవచ్చు కదా ,అని నా అభిప్రాయం !

అలాంటి రోజుల్లో నేను నిద్ర పోకుండా మేలుకుని కూచుంటా . ఐదు గంటలకు ఉరితీత అయిపోయాక పడుకుంటాను . ఒక్కోసారి నాకు నిద్ర పట్టేసినా మా లీడర్లు వచ్చి లేపుతారు . మృత్యువు పిలుపు నాకెప్పుడూ వినబడుతూనే ఉంటుందని వాళ్లకు తెలీదు .

మా జైలు ఆవరణంతా  కలిసి ఓ చిన్న పట్టణం లాగా వుంటుంది .  మాటలూ ,చర్చలూ , వాదోపవాదాలూ , నవ్వులూ మారుమోగుతూ ఉంటాయిక్కడ .

ఒక్కోసారి జైలరుతోబాటు జైలు సూపరింటెండెంట్ కూడా వస్తాడు . కాసేపు మా లీడర్లతో కబుర్లు చెప్పి నా తోటలోకి వస్తారు . నాకు మొక్కలంటే ప్రాణమని వాళ్లక్కూడా తెలుసు . మొక్కల పెంపకం గురించి , ఎరువుల మంచి చెడుల గురించీ మాట్లాడుకుంటాం .

సూపరింటెడెంట్ ఇంట్లో ఆరు కుండీల్లో గులాబీ మొక్కలు పెంచుతున్నాట్ట . అవన్నీ నేను ఇచ్చినవే . నా మిత్రులలో కొందరికి నేనిలా అతడితో స్నేహం చెయ్యటం నచ్చదు . నన్ను రకరకాల ప్రశ్నలేసి చంపుతారు . వాడి మేహర్బానీ లేకుండా నువ్విక్కడ బటకలేవా ఏం ? నీ క్లాస్ మేట్ ను ఇరవై నాలుగు కొరడా దెబ్బలు కొట్టించింది వీడేనని గుర్తులేదా ? అనేవాళ్ళు .

ఇక్కడి మనుషుల మధ్యన రకరకాల ముఠాలుంటాయి.  ఏదో ఒక గ్రూపుతో జత కట్టకుండా స్వతంత్రంగా ,అందరితో స్నేహంగా బతకటం కుదిరే పనికాదు.

       *

నేను సాధారణంగా నా గూడు వదిలి బయటకు రాను.

వచ్చిన కాసేపూ తోటలో తిరుగుతూ మొక్కలతో ,చెట్లతో కబుర్లున్నీ  చెబుతూ తిరుగుతుంటాను . ఓ రోజు అలాగే పచార్లు చేస్తుండగా జైలరొచ్చి ,రాజకీయ ఖైదీలందరినీ విడుదల చెయ్యబోతున్నారనే శుభవార్త చెప్పాడు . అందరిలోనూ ఆనందం ఉరకలెత్తింది . అందరూ వెంటనే క్షవరం చేయించుకున్నారు . నేను కూడా నా బట్టతలపై మిగిలిన నాలుగు పోచలనూ కత్తిరించుకున్నాను . మీసాలు మాత్రం తియ్యలేదు . మీసాలుంటేనే  బావుంటానన్న భ్రమ నాకో ఆనందాన్నిస్తుంది . జైలంతా నవ్వులూ , కేరింతలతో వెల్లి విరుస్తోంది . మా జైలర్ ఖైదీలందరి బట్టలూ తెప్పించి ఇచ్చాడు . వాటిని శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసుకున్నాం . పేపర్లలో చుట్టి సిధ్ధంగా పెట్టుకున్నాం .

నా దొంగ మిత్రులకూ , ఖూనీకోరు మిత్రులకూ వీడ్కోలు చెప్పాను . వాళ్ళందరి కథల్ని రాస్తాననీ ,ఆ పుస్తకాలు పంపుతాననీ వాగ్దానాలు చేశా . విడుదలయ్యే రోజు కోసం  ఆత్రంగా ,అసహనంగా ఎదురు చూస్తున్నాం .

ఆఖరికి విడుదల ఆర్డరు రానే వచ్చింది . మాలో ఒక్కరికి తప్ప   అందరికీ ఆర్డర్లు వచ్చాయి . ఆ ఒక్క అభాగ్యుడిని నేనే . బహుశా ఏదో పొరబాటు జరిగి ఉంటుందని కనుక్కునేందుకు పరిగెత్తాడు జైలరు . పై అధికారులకు ఫోన్లు చేశాడు  .

జరిగింది పొరబాటేమీ కాదట . నన్నిప్పుడే విడుదల చేయబోవటం లేదని జవాబు వచ్చింది . అంటే అధికారులు ఆశించిన పరిణతి నాలో ఇంకా రాలేదని అర్థమన్న మాట  . సరే ,మంచిదే !

మా లీడర్లంతా వెళ్ళిపోయారు _బోలెడంత ఆస్తిని నాకు మిగిల్చి ! ఇనో సాల్ట్ డబ్బా ,కార్ల్ మార్క్స్ పుస్తకాలూ , రెండు పెట్టెల పేక ముక్కలూ , ఓ సీసాడు నిమ్మకాయ ఊరగాయ ,డబ్బా నిండా చిప్సూ , చక్కెర అప్పాల పాకెట్టూ ,బోల్డంత పొగాకూ ; ఆకులు ,వక్కలు , సున్నం _ వీటన్నిటికీ ఇప్పుడు నేనే యజమానిని .

మా లీడర్లంతా హాయిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు . ఎడారి లాంటి జైల్లో నేనొక్కడినే మిగిలా . ఒంటరితనం ఎప్పుడూ బాధాకరమే . మందనంతటినే మేతకు తోలి ఒకే ఒక్క ముసలి మేకను మిగిల్చినట్టుగా చేశారు నన్ను . ఆ ఒంటరి మేకకు ఏం జరగబోతోంది ? బహుశా దాని మెడమీద వేటు పడబోతోందేమో ! ఏదో ముప్పు ముంచుకు రాబోతోందని కీడు శంకిస్తోంది మనసు . ఇప్పుడిక్కడ మాటలూ ,నవ్వులూ ఏమీ లేవు . నా గుండెనెవరో మెలిపెడుతున్నట్టుగా ఉంది .

కార్ల్ మార్క్స్ ,దాస్ కాపిటల్ ను జైలరుకిచ్చేశా . చక్కెరప్పాలను ఆస్పత్రికి పంపి ,అందరికీ పంచి పెట్టమన్నా . నా క్లాస్ మేట్ కు ప్రత్యేక బహుమతిగా పేక ముక్కల్ని పంపించా . ఆకులూ వక్కలూ తలోకాసిని పంచుకోమన్నా. అరటికాయ చిప్స్ లో సగం ఇచ్చేశా . ఇక నా గదిలో నిమ్మకాయ పచ్చడి , ఇనో సాల్ట్ మాత్రం మిగిలాయి . రెండు రోజుల తరువాత ఇనో సాల్ట్ డబ్బాను కూడా జైలు గోడమీది నించి విసిరి పారేశా .

        *

బొత్తిగా మనశ్శాంతి లేదు . ఏం జరగబోతోంది నాకు ? మృత్యువును చిరునవ్వుతో ఎదుర్కోమంటూ ఎదుటి

వాళ్లకు సలహాలివ్వటం సులువే ! ఇప్పుడు తెలుస్తోంది , అలా చిరునవ్వులు నవ్వటం ఎంత కష్టమైన పనో ! భగవంతుడా ! ఒక్కసారి నవ్వుదామన్నా నవ్వు రావటం లేదే ! నేనిప్పడు ఓ అనామకుడినీ , నిస్సహాయుడినీ అయిపోయా . ఏం చెయ్యను దేవుడా ! రక్షించు !

పోనీ , పారిపోతేనో ?  జైల్లో నుంచి పారి పోదామనే నిర్ణయించు కున్నాను . నాకూ ,బయటి ప్రపంచానికీ మధ్యన రెండే గోడలు . ఒక గోడ దాటేందుకు కన్నం తవ్వుకున్నానంటే  రెండో దానిమీంచి బయటికి దూకెయ్య వచ్చు .రాత్రిపూట వార్డరు కునికిపాట్లు పడేటప్పుడు గమనించి పారిపోవాలి . బాగా వర్షం పడుతూవుంటే పని మరింత సులభమౌతుంది .

చిన్న చిన్న వివరాలతో సహా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను . నా లాకప్ గది గోడలు అంత మందమైనవేమీ కాదు . వాటిని తవ్వటానికి పనికొచ్చే ఒక వస్తువుంది నా దగ్గర . అర్థరాత్రి సమయం చూసి బయటపడాలి . అక్కడున్న గోడ బాగా పాతది . దాని రాళ్లు వదులుగానే ఉంటాయి కాబట్టి పగలగొట్టడం అంత కష్టమేమీ కాదు.

నాకిప్పుడు ఓ పదో పన్నెండో మేకులు కావాలి . వాటిని గోడకు కొట్టాలి . ఓ కంకర రాయికి బట్ట చుట్టి కొడితే చప్పుడు వినబడదు . ఆ మేకుల్ని పట్టుకుని గోడమీదికి ఎక్కెయ్యాలి . నా దగ్గరున్న కంబళినీ , లుంగీనీ , దుప్పటినీ ,తువ్వాలునూ కలిపి కట్టి పొడుగ్గా దారంలా తయారు చెయ్యొచ్చు . దాన్ని ఓ చివరన మేకుకు కట్టి మిగతా భాగాన్ని గోడ అవతలికి జార్చాలి . మెల్లిగా అవతలికి దిగి పారిపోవాలి _ఇదీ నా ప్లాన్ .

అంతా బాగానే ఉంది కానీ మేకులేవీ ? ఓ మూలన తుప్పు పట్టిన ఇనప బక్కెట్లు పడివుండటం నా కంటబడింది . వాటి కొక్కేలు గట్టిగానే ఉన్నాయి . వాటిని తిన్నగా సాగగొట్టి ,చివర్లకు పదును పెడితే మేకులు తయారై పోయాయి . మొత్తం ముప్పై మేకులు . వాటిని జాగ్రత్తగా దాచాను . ఓ మాంచి గాలివాన కురిసే రాత్రి కావాలిప్పుడు. ఆ రోజు కోసమే నా ఎదురుచూపు .

ఆరోజు ఉదయాన్నే నా ఖూనీకోరు మిత్రులు కొందరు వార్డరును వెంటబెట్టుకుని వచ్చారు . ఆడవాళ్ళ జైలు దగ్గర కూరగాయల తోట పెంచాలని వాళ్ళ ప్రయత్నం . నన్ను కూడా తీసుకుపోదామని వచ్చారు .

నాకిప్పుడు ఏ పని లోనూ ఉత్సాహం లేదు . నా జీవితం లోంచి వెలుగూ , వేడీ అదృశ్యమై పోయాయి . పొండయ్యా! ఎవడిక్కావాలి మీ కూరగాయలు ? నాక్కావలసింది ఉరుములతో ,మెరుపులతో దద్దరిల్లిపోయే గాలివాన . నన్నిక విసిగించకండి _అనుకున్నా నా మనసులో .

కానీ వాళ్ళు వదిలిపెట్టలేదు . ఇట్లా ప్రపంచానికి దూరంగా ముక్కు మూసుకుని కూర్చో టానికి నువ్వేమన్నా మునీశ్వరుడివా ? అంటూ గొడవ పెట్టారు .

ఇక తప్పించుకునే మార్గం లేక వాళ్ళతో వెళ్ళాను . అందరం కలసి మొక్కలు నాటాం . ఇంతలో ఓ మిత్రుడు నాకో గమ్మత్తు చూపించాడు . ఎర్రటి జైలు గోడకు కింది భాగాన అప్పడం లాంటి పెద్ద రంధ్రం ఉంది .దానికి సిమెంటు పూసి అతుకు పెట్టారు . అనేక క్షణాలూ ,  గంటలూ ,రోజులూ మోహంతో వేగిపోయిన మగ ఖైదీల శ్రమ ఫలితమే ఆ రంధ్రం . సంవత్సరాల తరబడి అది అలా ఉండేదట .

ఆ కంత , ఆడవాళ్ళ జైలుకూ మగవాళ్ళ జైలుకూ నడుమ ఓ కిటికీ . దానిగుండా ఒకరి మొహాలొకరికి కనబడతాయి.

చప్పుళ్ళు వినబడతాయి ,వాసనలు వ్యాపిస్తాయి . బావుంది ! స్త్రీల సుగంధాలు ఆ రంధ్రం గుండా మగవాళ్ళ జైలు లోకి పరిమళిస్తాయి . అద్భుతం !!

ఈ సంగతంతా వినగానే మీరు నీతీ , నిజాయితీ గురించి ఉపన్యసించటానికి సిద్ధపడుతున్నారనుకుంటా ! కానీ , మాకక్కర్లేదు ! మీరు అత్యున్నతమైన ఆత్మలూ ,అద్భుతమైన సుగుణాలూ కలబోసిన మహాత్ములు ! మేం మామూలు అల్ప మానవులం . లోభ ,మోహ , మద , మాత్సర్యాలతో నిండిన హేనులం , బలహీనులం .

స్త్రీ పురుషుల మధ్యన ఆకర్షణ అనేది భగవంతుడిచ్చిన వరం ,తెలుసా ? ఈ ఆకర్షణను మర్చిపోకండి . మీ దయామృత దృక్కుల్ని కాస్త మామీద ప్రసరింప చెయ్యండి.

ఇట్లా ఆడ ,మగ ఖైదీలు ఒకరినొకరు చూసుకునేందుకు ఈ రంధ్రాన్ని వాడుకునే వారు . ఐతే మా దుర్మార్గపు  వార్డర్ కు ఈ రంధ్రాన్ని పెట్టుబడిగా పెట్టి గొప్ప వ్యాపారం చెయ్యవచ్చన్న ఆలోచన తట్టింది . అంతే ! ఇందులోంచి చూడాలనుకునే వాళ్ళు తనకు పన్ను కట్టాలని నిబంధన పెట్టాడు . ఒక్కొక్కరూ ఒక అణా డబ్బులు చెల్లించాలి . ఇక్కడున్న ఖైదీల్లో ఉన్నవారూ ,లేని వారూ కూడా ఉన్నారు . కానీ శృంగార వాంఛలు మాత్రం అందరికీ సమానమే కదా ! మరి డబ్బులు కట్టలేని పేదవాళ్ళు నిర్దాక్షిణ్యంగా కోరికలను చంపుకోవాల్సిందేనా ?

“ఇదుగో వార్డరూ , నువ్వు చేస్తున్నది మంచిపని కాదు “, అని నా క్లాస్ మేట్ ఓ సారి హెచ్చరించాడట .

“మంచిది కాదంటావా ? సరే , పెడతానుండు తూట్లు “ , అన్నాడట వార్డరు . ఇందుకే నా క్లాస్ మేట్ నాలుగున్నరేళ్లుగా దెబ్బలు తింటున్నది ! తర్వాత వార్డరు ఆ రంధ్రాన్ని మూసేయించాడు . నేను తలవంచి ఆ సిమెంట్ పూత దగ్గర ఆఘ్రాణించాను _ అక్కడింకా ఏ కాస్తయినా స్త్రీల పరిమళం మిగిలి ఉంటుందేమోనని !

              *

మా కూరగాయల తోట చక్కగా పెరుగుతోంది . నేనుండే లాకప్ దగ్గరంతా శూన్యం నిండి పోయింది . నేనూ , ఓ నిద్రమొహం వార్డరూ తప్ప అక్కడ ఇంకెవరూ లేరు .

రోజూ ఉదయాన్నే ఇద్దరో , ముగ్గురో ఖైదీలు కూరగాయల మొక్కలకు నీళ్ళు పెడతారు . నేను వార్డరుతోబాటుగా అక్కడ పచార్లు చేస్తాను . అలా వెళ్తుంటే ఓ పురాతన , శిథిల నగరపు రహదారులగుండా నడుస్తున్నట్టుగా ఉంటుంది . అంతా నిశ్శబ్దంగా ,దిగులుగా ఉంటుంది . ఒక్కోసారి నేను నడక ఆపేసి నిలుచుండి పోతాను . ఈ నిశ్శబ్దం మరింతగా చిక్కబడుతోందా  , అనిపించి ఈల వేస్తాను . చెట్లనూ ,మొక్కలనూ పలకరిస్తాను . అక్కడ బోలెడన్ని ఉడతలుంటాయి . ఒకదాన్ని పట్టుకుని శిక్షణ  ఇచ్చి పెంచుకుందామనిపిస్తుంది . దాన్ని చెట్టు పైదాకా ఎక్కనిచ్చి ,కిందికి దూకటం నేర్పాలని ప్రయత్నిస్తాను .

ఒక రోజు నేనిలాగే ఆడవాళ్ళ జైలు గోడ పక్కగా ఈల వేసుకుంటూ నడుస్తున్నా . ఇంతలో ఓ మధుర ధ్వని నా చెవులకు సోకింది . అంత అద్భుతమైన సవ్వడి లోకంలో మరొకటుండదు . గోడకు అవతలి వైపు నుండి వచ్చిన ఆ మధుర నాదం “ఎవరక్కడ ఈల వేసేది ? “ అన్న ప్రశ్నగా మారింది .

పరిమళభరితమైన ఓ తేజస్సు నన్ను చుట్టు ముట్టినట్టు అయింది . అద్భుతం! నా రోమాలు నిక్కబొడుచకున్నయ్. చుట్టూ చూశాను . ధైర్యం కూడగట్టుకుని “నేను !” ,అన్నాను .

నాలో సన్నని వణుకు . అక్కడున్నది ,స్త్రీ !

మేమిద్దరం గోడకు చెరో వైపు ఉండటంతో గట్టిగానే మాట్లాడాల్సి వస్తోంది .

“నీ పేరేమిటి ?” అడిగిందామె .

నా పేరుతోబాటు చదువూ ,ఉద్యోగం ,ప్రమాదకరమైన నా రచనలూ అన్ని సంగతులూ చెప్పాను . ఆమె కూడా తన గురించీ ,జీవితంలో ఏ పొరబాట్లు తనను ఈ స్థితికి చేర్చాయన్న విషయాలను గురించీ చెప్పింది .

ఆమె పేరు చాలా చక్కనిది _  నారాయణి .

వయసు కూడా చక్కనిదే _ ఇరవై రెండు .

ఆమె కొంచెం చదువుకున్నదే . చదవడమూ,రాయడమూ

వచ్చు . పద్నాలుగేళ్ల కఠిన శిక్ష పడిందట .ఇక్కడికొచ్చి ఏడాదే అయింది . సంవత్సర కాలంగా ఆమెకు ఏ ఆనందమూ లేదు .

“మనిద్దరం దాదాపు ఒకేసారి జైలుకొచ్చినట్టున్నాం నారాయణీ !” అన్నాను .

“ఔనా ?”

“నాకో గులాబీ మొక్క ఇవ్వవూ ?”అంది మళ్లీ తనే .

కాస్త ఆశ్చర్యం వేసింది . “ ఇక్కడ గులాబీ మొక్కలున్నాయని నీకెలా తెలుసు ?”

“ఇది జైలండీ ! అందరికీ అన్నీ సంగతులూ తెలిసిపోతాయి . రహస్యాలేముంటాయిక్కడ ? “

ఈవిడెలా మాట్లాడుతోందో చూడండి ! ఇక్కడ రహస్యాల్లేవట ! మరి ఆడవాళ్ళ జైలు గురించి , అక్కడుండే ఆడాళ్ళ గురించీ నాకసలు ఏమన్నా తెలుసా ?

“గులాబీ మొక్క ఇవ్వవా ?” మళ్లీ అడిగింది నారాయణి .

“నారాయణీ !” అన్నాను నా శక్తినంతా కూడగట్టుకుని ,  హృదయాన్ని పెకలించుకొని మరీ పిలిచాను  .

“ఈ లోకంలోని గులాబీ మొక్కలన్నీ తెచ్చి నీకిచ్చేస్తా !”

ఆమె గలగలా నవ్వింది . వెయ్యి బంగారు మువ్వలు గలగల్లాడినట్టు ఉంది ఆమె నవ్వు . ఆ సవ్వడికి నా హృదయం కోట్లాది ముక్కలుగా చెదిరి పోయింది .

“ఒక్కిటివ్వు చాలు .ఒకే ఒక్కటి . ఏం ? ఇస్తావా ?”

వినండి ఎలా మాట్లాడుతోందో ! ఒక్క గులాబీ మొక్క ఇస్తావా ,అని అడుగుతోంది . ఏం చెయ్యాలి ఈ  నారాయణిని ?గట్టిగా కౌగలించుకుని ఊపిరి తిరక్కుండా

ముద్దుల్లో ముంచెత్తాలి !

“నారాయణీ ! ఇప్పుడే తెచ్చిస్తానుండు !”

“సరే !”

నా తోటలోకి పరిగెత్తా . నా పరుగు చూసి ఉడతలన్నీ బెదిరిపోయి చెట్ల మేదికి పారిపోయాయి .

“  ఏమొచ్చిందే మీకు ? ఎందుకలా ఎగబడి పాకుతున్నారు చెట్ల మీదికి ?దిగి రండి !” అంటూ వాటిని కోప్పడ్డాను .

గులాబీ మొక్కల దగ్గరికి నడిచాను . ప్రతి కొమ్మా విరగబూసి సూర్యకాంతిలో జలకాలాడుతూ చిరునవ్వులు చిందిస్తోంది . బాగా గుబురుగా ,పూలతో నిండుగా ఉన్న మొక్కను పెళ్లగించి వేళ్ళ చుట్టూ మట్టితోసహా తీసి , జాగ్రత్తగా పట్టుకున్నా .చిన్న గోనెసంచి ముక్కను దాని వేళ్ళ చుట్టూ చుట్టుకుని గోడ దగ్గరకు పరిగెట్టాను .

“నారాయణీ !”

జవాబు లేదు . వెళ్ళిపోయిందో ఏమో !

“నారాయణీ !”అని మళ్లీ పిలిచాను .

అటునుంచి నవ్వు ! తర్వాత , “ఏమిటి ?” అంటూ ప్రశ్న .

“పిలవగానే పలకవేం ?”

“ఇక్కడే ఉన్నా  !”

“మరి పలకవేం? “

“దాక్కున్నాలే ,సరదాకు ! *

“దొంగ పిల్లా !”

ఆమె మళ్లీ నవ్వుతూ , “ గులాబీ మొక్క తెచ్చావా ?” అని అడిగింది .నేను జవాబివ్వలేదు .అలా నిలబడి చేతిలోని మొక్క మీది ప్రతి పువ్వునూ ,మొగ్గనూ , కొమ్మనూ గాఢంగా ముద్దులు పెట్టుకున్నా .

నేను జవాబివ్వక పోవటంతో నా పేరు  పెట్టి పిలిచింది నారాయణి .

ఐనా పలకలేదు నేను . ముద్దులు పెట్టడం లో మునిగి పోయా _ముల్లు ముల్లునీ ,రెమ్మ రెమ్మనీ .కంగారుగా మళ్లీ పిలిచిందామె . అప్పుడు పలికాన్నేను .

ఆమె నిట్టూర్చి , “ అబ్బా ! ఇంత ప్రేమగా దేవుణ్ణి పిలిచి ఉండినా …”

“ ఉందా ప్రేమ ?”

ఆమె తడబడింది . “ఇంత ప్రేమగా దేవుణ్ణి పిలిచి ఉండినా … అన్నానంతే !”

“అదే …ఇంత ప్రేమగా దేవుణ్ణి పిలిస్తే …?”

“ఆయన ప్రత్యక్షం అయ్యేవాడు “ .

“ఔనా ? కానీ నారాయణీ ,దేవుడు ఎప్పుడూ ఎవ్వరికీ కనబడ లేదు కదా ! ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నాడు . ఈ విశ్వాంతరాళంలో ,ఈ నవ్య కాంతిలో ,దాని జీవ శక్తిలో …! నేనిక్కడే ఉన్నా కదా  , నారాయణీ !”

“మరీ పలకవేం ?”

“ముద్దెట్టుకుంటున్నా …”

“గోడనా ?”

“ కాదు .”

“మరీ ? “

“ఈ మొక్కకున్న ప్రతి గులాబీని , కొమ్మనూ , ఆకునూ …”

“అయ్యో ! నాకు ఏడుపొస్తోంది “ ,అందామె .

“నారాయణీ !”

“ఏమిటి ?”

“ఈ గోనె ముక్కను తీసెయ్యకుండా అలాగే గోతి తవ్వి నాటు _ దేవుణ్ణి తలుచుకుని వేళ్ళ చుట్టూ మట్టి పోసి నీళ్ళు పొయ్యి “ .

“అలాగే “

“ఇదుగో తీసుకో !” అంటూ మొక్కను గోడ మీదుగా అవతలికి విసిరేశా .

“పట్టుకున్నావా ?”

“అయ్యో ,దేవుడా !” ,చిన్నగా కేక పెట్టింది నారాయణి . ఆమె గొంతులో ఏవో రాజ్యాలను జయించిన ఆనందం .

“ కొమ్మలన్నిటినీ కలిపి కట్టు .”

“కట్టేశాలే !పూలన్నీ కోసేస్తున్నా ఇప్పుడు . వాటిని వేరేచోట పెట్టుకుంటా .”

“ జడలోనా?”

“ కాదు “ .

“మరి?”

“నా గుండెలో ! జాకెట్ లోపల పెట్టేసుకుంటా “.

ఆ పూలమీద నా ముద్దులున్నాయ్ ! నా కాళ్లలో శక్తి లేనట్టుగా గోడకు చేరబడి దాన్ని ఆప్యాయంగా తడిమాను.

“నేనిక పోయి మొక్క నాటి నీళ్ళు పోయాలి . నువ్వెప్పుడూ ఈ గోడమీద ఓ కన్నేసి ఉంచు . నేనీ గోడ దగ్గరికి వచ్చేందుకు వీలైనప్పుడల్లా  గోడ మీద ఒక ఎండు కర్ర పుల్లను పెడతా .దాన్ని చూడగానే వచ్చేస్తుంటావుగా!”

“తప్పకుండా “ .

ఆమె వెక్కిళ్లు పెట్టి ఏడుస్తున్న చప్పుడు .

“అయ్యో ,దేవుడా !”

“ఎందుకు నారాయణీ ?”

“ఏడుపొస్తోంది “

“అదే …ఎందుకు ?”

“ఏమో , నాకూ తెలీదు .”

“వెళ్ళు .ముందు ఆ మొక్కను నాటేసిరా ,పో !”

“కర్రపుల్లను విసురుతా ! గుర్తుందికదూ !”

“ దానికోసమే ఎదురు చూస్తుంటా “.

“చూడగానే వచ్చేస్తావుగా ?”

“తప్పకుండా !”

           *

లాకప్ లోకి వెళ్ళా . అంతా చీదరగా ,చెత్తగా ఉంది . శుభ్రంగా ఉడ్చాను . నా చాపా ,పక్కచుట్టా దులుపుకుని యుగాలైంది . అన్నీ సర్దుకున్నాక  ఆ గోడ మీదుగా కనబడే ఆకాశం లోకి చూస్తూ కూర్చున్నా . అప్పుడే నారాయణి సంకేతం కోసం ఎదురు చూడటం మొదలై పోయింది . ఆమె చెప్పిన కర్రపుల్ల ఏమీ లేదక్కడ . ఒకవేళ తను నన్ను మర్చి పోయిందేమో ! రోజు రోజుకు నాలో నిరాశ పెరిగిపోయింది . ప్రపంచం శూన్యంగా కనబడుతోంది . ఆకాశం వైపుగా పైకి లేచే కర్రపుల్ల !

ఎంత అద్భుతమైన దృశ్యమది !

ఇక ఆగలేక గోడ దగ్గరికి పరిగెత్తా . నా అడుగుల చప్పుడుకు ఉడతలు బెదిరి చెట్లమీదికి పాకి పోయాయి .

“నారాయణీ !”

అవతలి వైపు నిశ్శబ్దం . మళ్ళీ పిలిచాను . చివరికి ఆమె మాట్లాడింది .

“ఏమిటిది ? ఏం కావాలి ? “ అంది కోపంగా .

“అరె !”

“కర్రలు గోడమీద పెట్టీ పెట్టీ నా చెయ్యి పడిపోతోంది .”

“ ఇలా ఇవ్వు నేను బాగుచేస్తా నీ చేతిని !”

“ఇదుగో గోడమీద పెడుతున్నా . బాగుచెయ్యి !”

“ఇదుగో ,చేస్తున్నా ! ముద్దు కూడా పెడుతున్నా “.

“ఈ గోడను నా గుండెలకు హత్తుకుని …ముద్దులిస్తున్నా నీకు .”

“మీ జైల్లో ఆడవాళ్ళు ఎంతమందున్నారు నారాయణీ ?”

ఆమె నవ్వుతూ ,”నేనొక్కదాన్నే !”అంది .

“ఏయ్ అబధ్ధాలకోరూ ! నిజం చెప్పు !”

“ఎనబయ్యేడు మంది .”

“అందగత్తెలెందరు ? అనాకారులెందరు ?”

“ఒక అందగత్తె ,ఎనబయ్యారుగురు అనాకారులు .”

నేను ఓడిపోయా . “మీ జైల్లో గులాబీ మొక్కలున్నాయా?”

“లేవు” .

“రేప్పొద్దున నీకు ఓ సంచిలో వేయించిన సజ్జల పొడి ఇస్తా. బెల్లం కలుపుకుని తిను .సరేనా ?” అంది మళ్లీ తనే.

“అలాగే “

“ఒద్దొద్దులే ,అవతల పారెయ్ “

“నేను దేన్నీ వృధాగా పారెయ్యను .”

“నీ మొహం ఎలా ఉంటుందో చెప్తావా కాస్త ?”

“కోలగా ,తెల్లగా ఉంటుంది . జుట్టు కత్తిరించి ఉంటుంది . కాస్త బట్టతల .”అన్నాను .

“కళ్లో ?”

“చిన్నవే ,ఏనుగు కళ్ళలాగా !”

“నావి పెద్దవి . నీ ఛాతీ ?”

“విశాలమైంది .”

“నాదీ నిండుగా , పుష్టిగానే ఉంటుంది . నీ నడుము ?”

“సన్నగా ఉంటుంది .”

“నా నడుం ఎలా ఉంటుందో చెప్పనా ? ఒద్దొద్దులే , చెప్పను !”

“పెద్ద బాన లాగా ఉంటుందేమో !”

“ఏయ్ ,నిన్ను గిల్లి ,చీల్చి చంపేస్తా !” అరిచిందామె .

“నారాయణీ !”

“ఏం ?”

“నువ్వే రంగులో ఉంటావో చెప్పవా ?”

“తెల్లగా .”

“నారాయణీ !”

“చెప్పు !”

“స్త్రీ పరిమళం నన్ను అలుముకుంది .”

“అది నాదేనా ?”

“ఏమో తెలీదు . “

మగ శరీరాల వాసన వేరేగా ఉంటుందా ?”

“నాకు తెలీదు . నీ దేహ సుగంధం మాత్రం తెలుస్తోంది .”

ముక్కు పుటాల్ని వెడల్పు చేసి గాఢంగా ఆఘ్రాణించాను . నా శ్వాస చప్పుడు ఆమెకు విన్పించిందా ?

“ఏం ? తెలిసిందా నా పరిమళం ?” అడిగింది నారాయణి .

“లేదు .”

“నీ వాసన  నాకూ అంటడం లేదు . దరిద్రపు గోడ .”

“నారాయణీ ,ఈ గోడకు ఒక రంధ్రం ఉంటే మూసేశారు తెలుసా ?”

“చూశా . సిమెంటుతో మూసేశారు . నేను ఇక్కడికొచ్చే నాటికే దాన్ని మూసేశారు .”

“అక్కడి నుంచి నీ పరిమళం వస్తుందేమోనని చూశా.”

“వార్డరును ఎవరో కొట్టారన్న కోపంతో మూయించాట్ట . ఆ ఖైదీని కట్టేసి కొట్టారు . అతన్ని కొట్టిన దెబ్బలు ఆడవాళ్ళ జైల్లోకి కూడా వినబడ్డాయి .”

ఔను .అతన్ని కట్టేసి ముప్పయ్యారు దెబ్బలు కొట్టారు .”

“దారుణం .”

“ఆ దెబ్బలు తిన్న మనిషిది మా ఊరే తెలుసా ? నా క్లాస్ మేట్ వాడు .”

“నిజంగానా ?”

“నిజం “

“కాసేపయ్యాక గోడ మీదుగా నిండుగా ఉన్న తెల్ల సంచీ వచ్చింది . దాన్లో సజ్జాల పిండి ,వేయించిన ఉప్పు మిరప కాయలూ ఉన్నాయ్ . నా దగ్గరున్న నిమ్మకాయ పచ్చడి,

అరటికాయ చిప్సు గోడదాటి వెళ్లాయి .

“ఈ చిప్స్ అందరికీ పెట్టనా ?”అడిగింది నారాయణి .

“తప్పకుండా . మనిద్దరి పేరిట అందరికీ పంచిపెట్టు.”

“నన్ను ప్రేమిస్తావా…నన్నొక్కదాన్నే ?”

“ అనుమానం ఎందుకు ?”

“ఎందుకా …?” , నారాయణి  గొంతులో ఏదో బాధ . “నాకన్నా అందమైన వాళ్లు ఎందరో ఉన్నారు .నేనేం పెద్ద అందగత్తెను కాదు .”

“నేనూ పెద్ద అందగాడినేం కాదులే !”

“నిన్ను చూడాలనుంది “ ,అన్నది నారాయణి .

“నాకూ ఉంది నిన్ను చూడాలని .”

“ అయ్యో , దేవుడా ! రాత్రంతా ఎంత ఏడ్చానో !”

              *

నేను కోరుకున్న వర్షపు రాత్రి రానే వచ్చింది . ఉరుములు, మెరుపులు , కటిక చీకటీ …బీభత్సంగా ఉంది .

నా ఇనుప ఊచల పంజరంలో కూచుని చూస్తూ ఉన్నా . గాజు కడ్డీల్లా ఉన్నాయి వర్షపు ధారలు . స్ఫటికాల్లా మెరుస్తున్న ఆ ధారలు భూమికి భగవంతుడి దీవెనల్లా కురుస్తున్నాయి . కురవవే వానా ! తుపాను గాలుల్ని వీచనీ ! కానీ దయచేసి ఏ చెట్టునీ కూల్చకు . మేఘాల్లారా, కాస్త మెల్లగా ఉరమండి .

మీ ఫెళ ఫెళార్భాటాలకు  పాపం ఆడపిల్లలు జడుసుకుంటారు !

పొద్దున్నే వార్డరొచ్చి లైట్లు ఆర్పి ,నా లాకప్ గది తాళం తీశాడు . బయటికి అడుగుపెట్టాను . ప్రపంచమంతా శుభ్రంగా కడిగినట్టుంది .

నా బుర్రలో చటుక్కున ఒక ఆలోచన మెదిలింది _ జైల్లోంచి పారిపోవాలని అనుకోవటం సరైంది కాదని !

అసలు బయటికి వెళ్లి నేను చెయ్యాల్సిందేముందని?

స్వేచ్ఛా ప్రపంచమని మనం అనుకుంటున్నది నిజానికి ఓ పెద్ద జైలు మాత్రమే !

ఆరోజు తర్వాత ఎన్నో వర్షపు రాత్రులు వచ్చి వెళ్లాయి . నేను ఎంతో జాగ్రత్తగా దాచుకున్న మేకులు గురించి నాకసలు గుర్తే రాలేదు . జైలు నుంచి పారిపోవడం అధర్మం అనే ఆలోచన నా బుర్రలో స్థిరపడి పోయింది .

ఈ జైలు గోడలకు రక్తమాంసాలు లేవన్నది నిజమే . కానీ వాటికి హృదయం ఉందేమో అన్పిస్తుంది నాకు . అవి ఎన్నెన్నో దృశ్యాలను చూడగలవు . ఎన్నెన్నో ధ్వనులను వినగలవు .

ఒక రోజు నేను గోడ దగ్గరికి వెళ్ళేసరికి దానిమీద ఓ పెద్ద ఉడత కూర్చుని ఉంది . “దిగు ,కిందికి !వెధవా ! సిగ్గులేదూ ?”అని తిట్టాను .

“ఎవర్ని అంతలా తిడుతున్నావ్ ? “ అంది నారాయణి అవతలి నుంచి .

“ఉడతని . మన మాటలు విందామని గోడెక్కి కూచుంది వెధవ ! “

“విననీ !”అంది నారాయణి .

“నవ్వుతుంది నన్ను చూసి . దాన్నీ,  దాని నేస్తాలనూ భయపెట్టి తరుముతుంటాగా ! అందుకు !”

చిన్న గులకరాయి తీసుకుని విసిరాను . ఉడత పారిపోయింది .

“అబ్బా ! నువ్వేసిన రాయి నా గుండెలకు తగిలి నొప్పెట్టింది .  “ అన్నది నారాయణి బాధపడుతున్న గొంతుతో .

“దెబ్బ బాగా తగిలిందా ?”

“ మనిద్దరం కలుసుకునే మార్గం లేదా ఇక ?”

ఏమో మరి .నాకేమీ కనబడడం లేదు .”

“రాత్రి నిన్ను తలుచుకుని ఎంత ఏడ్చానో !”

ఆ రాత్రి ఆమెను తలుచుకుని నేనూ తియ్యటి కలలు కన్నాను .

       *

రోజులు అలా గడుస్తున్నాయి .

“ఆస్పత్రి దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నా !” అన్నది ఒకరోజు నారాయణి .

“నువ్వు కూడా రాగలవా ఆ సమయానికి ? కనీసం దూరం నుంచయినా చూసుకో వచ్చు .”అని కూడా అడిగింది .

“ నిన్ను చూడగానే పరిగెత్తుకొచ్చి కావిలించుకొని ముద్దు  పెట్టుకుంటా _ నీ ముఖం మీదా , మెడ మీదా , ఛాతీ మీదా ,బొడ్డు …”

“అసలు ఎలా గుర్తు పడతావ్ నన్ను ?”

“ముఖం చూసి .”

“ నా కుడి బగ్గ మీద నల్లటి పుట్టుమచ్చ ఉంది . గుర్తు పెట్టుకుంటావా ?”

“నల్ల పుట్టుమచ్చ ! దాన్ని కూడా ముద్దెట్టుకుంటా !”

“తప్పకుండా వచ్చేయ్ ! నన్ను నిరాశ పరచవుగా ?  అన్నట్టు , నాతోబాటు ఇంకొందరు ఆడవాళ్ళు కూడా వస్తారు . “

“నేనుమాత్రం ఒంటరిగానే వస్తా . తలమీద టోపీ పెట్టుకోకుండా వస్తా . కొంచెం బట్టతల ఉంటుంది . ఓ ఎర్రగులాబీ కూడా పట్టుకొస్తా .సరేనా ?”

“ఎదురుచూస్తూ ఉంటా.”

“ఆస్పత్రిలో ఆర్డర్లీ నాకు మంచి మిత్రుడే “

“నాకు తెలుసులే !”

“ఎలా ?”

“లేకపోతే నీకు గుడ్లూ ,లివరూ , రొట్టెలూ ఎలా అందుతాయి మరి ?”

“ఔనూ , నేను చచ్చిపోయాక నన్నెప్పుడైనా తలుచుకుంటావా ?” అన్నదామె .

“గులాబీ మొక్కలు ఇంకా కావాలా ? బోలెడున్నాయి మా దగ్గర “ ,అంటూ మాట మార్చాను .

“ఒద్దులే , నువ్విచ్చిన వాటితోనే మంచి తోట తయారవుతోంది . ముందీ సంగతి చెప్పు _ నేను చచ్చిపోయాక నన్ను గుర్తు పెట్టుకుంటావా ,లేదా ?”

“నా ప్రియమైన నారాయణీ ! చావనేది మన చేతుల్లో లేదు . ఎవరు ,ఎప్పుడు ,ఎందుకు పోతారనేది  దైవ నిర్ణయం . నీకన్నా ముందు నేనే పోతానేమో ఎవరు చూడొచ్చారు ? “

“లేదు ,లేదు .నేనే ముందు పోతా ! ఇంతకూ నన్ను గుర్తు పెట్టుకుంటావా ? “

“తప్పకుండా “.

“ఎలా ? అయ్యో దేవుడా ! నువ్వు నన్ను చూడనన్నా లేదు ,ముట్టుకోలేదు .ఎలా గుర్తుంచుకుంటావ్ నన్ను ?”

“లోకంలో ప్రతిచోటా నీ రూపమే కనబడుతుంది నారాయణీ !”

“లోకమంతటిలోనా ? ఎందుకు ఊరికే బుకాయిస్తావ్ ?” అన్నదామె దిగులు నిండిన గొంతుతో .

నేను బుకాయించటం లేదు . ఈశ్వరా ! ఎలా చెప్పను !

మా మధ్యన గోడలు ,గోడలు ! అలా చూస్తూ నిశ్చలంగా నిలబడి పోయా . అవతల కూడా మౌనం .

కాసేపయ్యాక  ,నారాయణి అన్నది , “ నా గుండె బరువంతా తీరేట్టుగా ఏడవాలనిపిస్తోంది “.

“ఇప్పుడు మాత్రం ఒద్దు . అన్నీ తలుచుకుని రాత్రికి ఏడుద్దువుగానీ !”

కాసేపు మాటల్లేవు . తర్వాత ,”మనం కలుసుకునేది ఎప్పుడయిందీ రేపు చెప్తాలే !” అంది .

భారమైన గుండెలతో ఇద్దరం వీడ్కోలు చెప్పుకున్నాం .

            *

తెల్లవారింది . వార్డర్ వచ్చి లైట్లు ఆర్పి ,తలుపులు తీశాడు . బయటికి అడుగు పెట్టా . పళ్లు తోముకోవటం ,

వ్యాయామం , స్నానం , అన్నీ చకచకా ముగించుకున్నా. కాస్త తిండి కూడా తినేసి బీడీ అంటించా . జైలరొచ్చాడు  నాతో కబుర్లు చెప్పడానికి . సరిగ్గా అప్పుడే గోడమీదుగా కనబడే నీలాకాశం లోంచి ఓ ఎండుకర్ర ముందుకొచ్చింది .

నాకు చెమటలు పట్టాయి . ఊపిరాట్టం లేదు . ఏం చెయ్యాలి ప్పుడు ? కాసేపటికి జైలర్  వెళ్ళిపోయాడు .

నేను ఒక్క పరుగులో గోడ దగ్గరికి చేరా .

“నారాయణీ !”

“ఏమిటి ?”

“ఎప్పుడు ?”

“ఇవాళ  సోమవారం కదా! గురువారం పొద్దున పదకొండు గంటలకు  ఆస్పత్రికి వచ్చేస్తా . కుడిబుగ్గపై పుట్టుమచ్చ . మర్చిపోవుగా !”

“మర్చిపోను ! నా చేతిలో ఎర్రగులాబీ  ఉంటుంది . నువ్వూ గుర్తు పెట్టుకో !”

“అలాగే “

             *

సోమ , మంగళ ,బుధ …రోజులు గడిచాయి . ఆరోజు నేను అన్నం తిని నడుం వాల్చా . కాసేపటికి లేచి స్నానం చేశా. ఆలోచిస్తూ కూచుని ఉండగా జైలరొచ్చాడు . చిరునవ్వుతో తోటలో తిరిగి చాలా పూలు కోశాడు . నా లాకప్ లోపలికొచ్చి ,నా పడక మీద కూర్చుని , “ నీకూ కొన్ని పూలు కావాలా ?” అన్నాడు .

నాకు నవ్వొచ్చింది . “ తోటనూ నేనే ,పువ్వునూ నేనే !” అన్నాను సరదాగా .

“పండువి కాదూ ?”

“పండుని కూడా !”

ఇంతలో గోడమీంచి ఎండు కర్ర !

“నువ్వు మామూలు దుస్తుల్లో ఎలా ఉంటావో నేనెప్పుడూ చూడలేదయ్యా !” అన్నాడు జైలర్ .

“అంటే కుర్తా ,లుంగీల్లోనా ?”

జైలర్ వెళ్ళి నా ఇస్త్రీ బట్టల పాకెట్ విప్పుతున్నాడు .

“ ఓసారి వేసుకో ! ఎలా ఉంటావో చూద్దాం !”

“ఒద్దొద్దు , మాసి పోతాయ్ !”అన్నాను కంగారుగా .

“పోతే ఏం ! ఉతుక్కోవచ్చుగా ?”

“సరే !” ,అని అవి తొడుక్కున్నా  .

“చాలా  బావున్నావ్!”అన్నాడాయన సంతోషంగా .

తర్వాత నాకేసి చూస్తూ , “తమరిక వెళ్లిపోవచ్చండీ , బషీర్ గారూ ! తమరు విడుదలయ్యారు !”అన్నాడు నాటకీయంగా ఇంగ్లిష్ లో .

నిశ్చేష్టుడినై పోయా .కళ్ళు బైర్లు కమ్మాయి .చెవుల్లో ఘోష .

“ఎందుకు విడుదల కావటం ? ఎవరికి కావాలి ఈ స్వేచ్ఛ?”,అన్నాను .

జైలరు నవ్వాడు . “నువ్వీ క్షణం నుంచి స్వేచ్ఛా జీవివయ్యా ! ఇక స్వేచ్ఛా లోకంలో విహరించవచ్చు.”

ఎక్కడుంది స్వేచ్ఛ ? చిన్న జైల్లోంచి పెద్ద జైల్లోకి వెళ్ళటం తప్ప !

“నీకు రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపో ,నీ వస్తువులు ఏమన్నా ఉంటే చూసుకో !”అంటూ అతడు నా చాప దులిపి చుట్టేస్తున్నాడు . దానికింద జీవిత ఖైదీల గురించి నేను రాసిన ‘ప్రేమలేఖ ‘ అనే కథ దొరికింది . మడతపెట్టి నా జేబులో పెట్టేసి లాకప్ లోనించి బయటికి పంపాడు .

దిక్కుతోచనట్టుగా కాసేపు గులాబీ మొక్కల మధ్యన నిలబడ్డా .నిద్రలో నడుస్తున్న వాడిలా ఓ గులాబీని కోసి ముద్దు పెట్టుకున్నా . గోడ మీద కర్ర అలాగే ఉంది . ఇంకా పైపైకి లేస్తూ ఉంది ,నా కంట పడాలని ! దేవుడా …!

జైలరు నా గదికి తాళం వేసేశాడు .

నారాయణీ ! నీకిక వీడ్కోలు !

దారి ఖర్చులకు డబ్బులు తీసుకుని ,జైలు గేటు దాటాను. ద్వారాలు పెద్ద చప్పుడు చేస్తూ నా వెనకనే మూసుకున్నాయి . నా చేతిలోని ఎర్ర గులాబీని తదేకంగా చూస్తూ ఒంటరిగా ,నిస్సహాయంగా ఎంతోసేపు అలా నిలబడి పోయా .

అందరికీ ఆ దేవుడొక్కడే దిక్కు !

*

[బషీర్ కథలు _ హైదరాబాద్ బుక్ ట్రస్ట్]

కాత్యాయని ఎస్.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు