రామాయణ నీతికి సమాధి

భారతీయ సంస్కృతిని తత్వాన్ని ప్రతిబింబించే పరిశోధనలు విజ్ఞానం పట్ల హిందూవాదులకి ఆసక్తి లేదు.

ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి

నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి–శ్రీశ్రీ

నిజానికి దేశంలో హిందుత్వ విజృంభణ విప్లవాత్మకమైనది. కాంగ్రెస్ కమ్యూనిస్టుల ప్రభావం వల్ల నత్త నడక నడుస్తున్న ఆధునిక అభివృద్ధిని బుల్లెట్ ట్రైనులా పరిగెత్తించింది హిందుత్వ.

హిందుత్వ మారుమూల మూలుగుతున్న పాత వాసనల్ని ఫ్యూడలిజాన్ని చావు దెబ్బ కొట్టింది. నిజానికి భారతీయమైన రామాయణ నీతికి సమాధి కట్టింది హిందుత్వ.

కమ్యూనిస్టు కాంగ్రెస్సులు రామాయణ నీతిని కొనసాగిస్తూ వచ్చాయి .పెద్దల పట్ల విధేయత కమ్యూనిస్టు పార్టీలలో ప్రధానం. రామాయణ విష వృక్షం రాసిన రంగనాయకమ్మ ఈ విధేయతా భావాన్ని ప్రశ్నించారు. రామాయణ మహాకావ్యంలో తండ్రికి కొడుకు అన్నకి తమ్ములు పూర్తి అణిగి మణిగి ఉంటారు.

కమ్యూనిస్టు పార్టీల్లో ఒకే నాయకుడు మరణించేంతవరకు కొనసాగుతూ వస్తాడు. చైర్మన్ మావో, లెనిన్, స్టాలిన్, కాస్ట్రో వీరందరూ సాధారణంగా బతికి ఉన్నంతవరకు శక్తి ఉన్నంతవరకు నాయకులుగా ఉంటారు. యువకులకు స్థానం ఉండదు. భారతదేశంలో చిరకాలం సాగిన కాంగ్రెస్ పాలన కుటుంబపాలనే. నెహ్రూ ఇందిరలు జీవితాంతం పాలించారు. తర్వాత కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో కుటుంబ పాలనే.

రంగనాయకమ్మ ఆశయాన్ని హిందుత్వ నిజం చేసింది.కుటుంబ పరిపాలనను నిందావాచకంగా మార్చింది. ఏక నాయకత్వాన్ని తరిమి కొట్టింది. రామాయణ విధేయతా భావాన్ని దెబ్బ కొట్టింది. కుటుంబాన్ని స్దానభ్రంశం చేసి సన్యాసాన్నీ బ్రహ్మచర్యాన్నీ రాజ్యాధికారానికి పర్యాయపదంగా మార్చింది. చివరికి బౌద్ధ యుగంలో కూడా సన్యాసి రాజు కాలేదు. అశోకుడు సన్యాసి కాదు. రాజు ఎప్పుడూ కుటుంబీకుడే. మరి హిందూవాదులు సన్యాసాన్నీ బ్రహ్మచర్యాన్నీ పవర్ పాలిటిక్స్ లోకి ఎలా అనువదించారు? రామాయణ కుటుంబ నీతికి ఎలా గండి కొట్టారు?

హిందూవాదులు భారతీయ సనాతన ధర్మాన్ని సెక్యులరైజ్ చేశారు..పూర్తి ఆధునీకరించారు . సన్యాసాన్ని బ్రహ్మచర్యాన్ని ఆధునిక వ్యక్తి వాదానికి పర్యాయపదంగా మార్చారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఆధునికతలు ఎలాగూ ప్రాచీన కుటుంబ సంబంధాల్ని బలహీనపరుస్తున్నాయి. ఈసందర్భంలో కుటుంబం క్షీణదశకి స్వార్థానికి పర్యాయపదంగా మారిపోయింది. కనుక రాజ్యాన్ని సన్యాసీకరించారు హిందుత్వ వాదులు. నిజానికి సన్యాసీకరణ పేరుతో వ్యక్తిస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ క్రమంలో వ్యాపార సన్యాసులు ముందుకొచ్చారు.

ఒకప్పుడు పెద్దల మాటకి చాలా విలువ ఉండేది.. కానీ నేడు వయసు మీరినవారు కాలం చెల్లిన వారుగా భావించబడ్తున్నారు. యువతరం నుంచి పెద్దలే నేర్చుకోవాలన్న భావం పెరిగింది. దూసుకొస్తున్న అత్యాధునిక సాంకేతికతని పాతతరం అందుకోలేకపోతోంది. బీజేపీ ఈ అత్యాధునిక స్వభావం సంతరించుకొంది. పాతతరం నిర్దాక్షిణ్యంగా చరిత్రలోకి నెట్టివేయబడింది. వారిని ఒక నమస్కారంతో సాగనంపారు. కొత్తజిత్తులతో, ఎన్నికల ఈవెంట్ మేనేజిమెంటుతో , ఆధునిక ప్రచారార్భాటంతో , ఇంటర్నెట్ వినియోగంతో దుర్వినియోగంతో కొత్త తరం ముందుకు వచ్చింది. పాత రథ యాత్రలు మూల బడ్డాయి. గుజరాత్ మోడల్ హిందుత్వలు దంపతులుగా మారాయి.

అవినీతిని దునుమాడుతూనే ఎన్నికలలో కోట్లు వెదజల్లగలగడం, హిందూ మతపు శాంతి సహనాలని బోధిస్తూనే గుంపు దాడులని ప్రోత్సహించడం , గంగకి హారతులిస్తూనే పర్యావరణ వేత్తలైన సన్యాసులని మృత్యుముఖంలోకి నెట్టడం, దైవపూజలు చేస్తూనే కాశీలోని ప్రాచీన కట్టడాలని కూల్చేసి ఆధునికటూరిస్టు సెంటరుగా మార్చేయడం లాంటి వైరుధ్యాలని తనలో ఉంచుకొని కూడా పురోగమించగల యువతరం అవసరమైంది. వైరుధ్యాలని అధిగమించగల సులభమైన మార్గం చెంపదెబ్బ మాత్రమేనని హిందూవాదులకి బాగా తెలుసు. భయోత్పాతం వైరుధ్యాలని కనుమరుగు చేయగలదు

నిజానికి ఆధునికత అనేదే వైరుధ్యాలమయం. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఆధునికత బానిస వ్యవస్థ, జాతుల నిర్మూలనపై ఆధార పడింది. స్వేఛ్చ గురించి మాట్లాడే ఆధునికత ఎప్పటికంటే రాజ్యాన్ని సూక్ష్మంగా బలపరిచింది. కనుక ఆధునికతలో వైరుధ్యాలు అధికం . వాటిని బలమైన రాజ్యం మరుగు పరచగలదు. అలా మరుగుపరచడమే పరిష్కారంగా భాసిస్తుంది.

ఇంకా కాంగ్రెసులో కమ్యూనిస్టులలో మిగిలివున్న ఫ్యూడల్ విలువలని ఫ్యూడల్ నిరాడంబరతని హిందుత్వ బద్దలు చేసింది. అంటే రామాయణ నీతిని బద్దలు చేసింది. తద్వారా ఆధునిక రాజ్యంగా బలపడుతోంది . త్రిపురనే ఉదాహరణగా తీసుకోండి. త్రిపుర కమ్యూనిస్టు ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పుచ్చలపల్లి సుందరయ్యలా సరళమైన నిరాడంబర జీవితాన్ని గడిపారు. నిజానికి కమ్యూనిస్టులు గాంధేయ వాదులే. మావోకి గాంధీకి నిరాడంబరత్వంలో పోలికలు కనిపిస్తాయి. ఇద్దరూ గ్రామీణతనీ, గ్రామీణభాషనీ , పౌరాణికతనీ , నిరాడంబరత్వాన్నీ, స్వదేశీతత్వాన్నీ ఆరాధించారు. ఈ ఫ్యూడల్ విలువలని త్రిపురలో బద్దలు చేసింది హిందుత్వ . అక్కడ ఎన్నికలు కూడా నిరాడంబరంగా జరిగేవి కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోహిందూవాదులు డబ్బు ప్రమేయం పెంచేశారు . ఆధునిక ప్రచారార్భాటం పెంచారు . ప్రజలలో ధనస్వామ్యం పట్ల ధనంతో పాటు పెరిగే ఆధునిక టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంచారు. దాంతో వృద్ధ నిరాడంబర ముఖ్య మంత్రి నిష్క్రమించారు. విచిత్రం ఏమిటంటే కొత్త ముఖ్యమంత్రి పేరు విప్లవ్ దేవ్ . నిజంగానే త్రిపురలో విప్లవం వచ్చింది .డబ్బు తెచ్చిన విప్లవం.

నిజానికి కమ్యూనిజం , కాంగ్రెస్సు పాత ఫ్యూడల్ సంబంధాలని తెంచుకొని పెట్టుబడిదారీ వ్యవస్థలోకి ప్రవేశించడానికి వాహనంగా పనిచేసాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ భూసంస్కరణల ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భావానికి దోహదం చేసింది. తర్వాత తానే పెట్టుబడిదారిగా మారిపోయింది. స్టేట్ క్యాపిటలిజానికి ప్రతినిధిగా మారింది.

చైనాలో తగినంత నియంతృత్వ చరిత్ర ఉండడంవల్ల ఆధునిక అభివృద్ధికి ఆటంకం లేదు. ప్రజలు నోరెత్తరు . కానీ భారత దేశ పరిస్థితి వేరు . కమ్యూనిస్టులుకానీ కాంగ్రెస్ కానీ ఆధునిక అభివృద్ధికి అవసరమైన నియంతృత్వ ప్రభుత్వాన్ని స్థాపించలేకపోయారు . ఆలోటును పూరించటానికి ప్రయత్నిస్తోంది హిందుత్వ.

ఆధునిక పెట్టుబడి దారీ అభివృద్ధి జరగాలంటే ప్రజల హక్కుల్ని హరించాలి. ఆ హరించబడిన హక్కుల స్థానంలో కొన్ని ఆధునిక సౌకర్యాలనీ విలాసాలనీ పురికొల్పాలి. ఇంకా చెప్పాలంటే లగ్జరీలని అవసరాలుగా మార్చి రుణం ద్వారా ఎప్పుడూ భవిష్యత్తులో జీవించేవారిగా ప్రజలని మార్చాలి.

ఇటువంటి ఆధునికతని కాంగ్రెసు ప్రభుత్వమే బలపరుస్తూ వచ్చినప్పటికీ దాన్ని మరింత ముందుకు దూసుకు వెళ్లేలా చేయడానికి దృఢ సంకల్పంగల వ్యక్తి అవసరమయ్యాడు .

ఎలాంటి వ్యక్తి అంటే – వ్యాపార ప్రయోజనాలని తప్ప మరేదాన్ని లెక్కజేయని ఉక్కు మనిషి.అటువంటి వ్యక్తిని హిందుత్వ సృష్టించగలిగింది. ఎంతో కొంత పాత వాసనలని రామాయణ నీతిని తనలో నిలుపుకున్న కాంగ్రెస్ వెనుకబడిపోయింది.

పర్యావరణవేత్తయైన సన్యాసి స్వామి సానంద్ ప్రధాని మోడీకి రాసిన లేఖలో “ కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ తాను గంగ పర్యావరణానికి ముప్పు అని చెప్తే ప్రాజెక్టు ఆపేశారని, హిందూ ప్రధాని మోడీ అసలు గంగ పరిరక్షణ గురించి ఆలోచనే చేయడం లేదని అన్నారు. స్వామి సానంద్ నిరాహారదీక్ష చేస్తూ చనిపోయారు.

ప్రాచీన నగరమైన కాశీలో ఆశ్రమాలు శివలింగాలు గుడులని చాలావాటిని హిందూ ప్రభుత్వం కూల్చేసింది అనే వార్తలు వచ్చాయి . నగరాల ఆధునీకరణకు పాతని విధ్వంసం చేయక తప్పదు . కాంగ్రెసు కమ్యూనిస్టు ఫ్యూడల్ నీతి నుంచి అత్యాధునిక టెక్నాలజీ లోకి దారి తీస్తోంది హిందుత్వ. అందుకే పర్యావరణం సంస్కృతి లాంటివాటిని ధ్వంసం చేయక తప్పదు అని హిందూవాదులకి అందరి కంటే బాగా తెలుసు.

సాపేక్ష భద్రత జీవిస్తూ మార్పుకి దూరంగా బతుకుతున్న పశ్చిమ బెంగాల్ ని కూడా ఆధునిక వినిమయదారీ సంస్కృతిలోకి పూర్తిగా తీసుకువెళ్ళగలిగినది హిందుత్వ మాత్రమే. ఎందుకంటే సంస్కృతిని సంప్రదాయాలని మందుపాతర పెట్టి పేల్చివేయగల విప్లవాత్మక వ్యవస్థ హిందుత్వ. బ్రిటీషు వారు పూర్తి చేయగా మిగిలిన కర్తవ్యాన్ని హిందూవాదులు పరిపూర్తి చేయగలరు

హిందూవాదుల బలం ఏమిటంటే – హిందుత్వ నిజమైన సంస్కృతి విధ్వంసం. మరి హిందూవాదులు తమని సంస్కృతి పరిరక్షకులైన జాతీయవాదులుగా చెప్పుకుంటారు కదా?

అసలు జాతీయవాదమే సంస్కృతి విధ్వంసం. జాతీయవాదం యొక్క అత్యంత ప్రమాదకర రూపమే హిందుత్వ

జాతీయవాదం – పరిణామం

భారతజాతీయత అనేది వలసవాదుల అవసరాలనుంచి పుట్టింది. భూగోళాన్ని స్పష్టంగా కొలవటం జనాభాని లెక్కించటం, వర్గీకరించడం వంటి వలసవాద గణితం నుంచి భారత దేశం, భారత జాతి ఆవిర్భవించాయి. వలసవాదులే భారత దేశానికి ఒక మేప్ సృజించారు. అంత క్రితం భారత ఖండం విశ్వాసం , తీర్థ క్షేత్రాలు, నదులు వంటి వాటి ద్వారా భాషా మాధ్యమంలో నిలిచింది. కానీ దేశమంటే మనుషులు అని ఆ ప్రత్యేక మనుషులు నిర్ధారించుకున్న సరిహద్దులు అనే స్పష్టమైన భావన బ్రిటీషు వలస వాదం తర్వాతే పూర్తిగా సాధ్యమైంది. ఆవిధంగా నదులు, పుణ్యక్షేత్రాలు , దేవతలు, చెట్లు పుట్టలలో కూడా దాగిన పరమాత్మ వంటి విశ్వాసాలు చెల్లాచెదురై లౌకికీకరించబడిన రూపంలో ఇండియా ఆవిర్భవించింది

ఇప్పుడు ఇండియా స్పష్టంగా మనుషుల కోసమే, ఒక ప్రత్యేక భూఖండంలో నివసించే మనుషులు నివసించే ప్రాంతంగా స్థిరపడింది .అంటే లౌకికీకరించబడింది.ఐతే అక్కడ నివసించే ప్రజల అనాది విశ్వసాలని ఏంచేయాలి? వాటిని కూడా లౌకికీకరించక తప్పదు. పాశ్చాత్య దేశాలలో క్రిస్టియన్ థియాలజీ లౌకికీకరించబడింది.హెగెల్ తత్వంలో ఇది స్పష్టంగా కనపడుతుంది . హెగెల్ క్రైస్తవ పరిభాషనే తీసుకొని మానవ చరిత్రగా లౌకికీకరించాడు.దానిలో ఆధునిక పాశ్చాత్యానికి అగ్ర స్థానం ఇచ్చాడు.ప్రొటెస్టెంట్ క్రైస్తవం క్యాథలిక్ క్రైస్తవం లోని చర్చిని మతగురువులని దానిలో దాగిన బహుళ పేగన్ విశ్వసాలని తిరస్కరించి మానవుడినే కేంద్రంచేసి లౌకికీకరించింది. జాతి సంపద ఉత్పత్తి కోసం జాతీయీకరణ జాతి రాజ్యాల ఆవిర్భావం అవసరమైంది. దానిలో భాగంగా ప్రాచీన విశ్వసాలని లౌకికీకరించవలసి వచ్చింది.

ఎంతో బహుళత్వంతో కూడిన ఈ భారత ఖండంలో ఈ జాతీయీకరణ దాని కోసం విశ్వాసాల లౌకికీకరణ కష్టసాధ్యమైంది. ఎంతో వైవిధ్యంగల ప్రాంతాలు , భాషలు, సంస్కృతులు, గ్రంథాలు, విశ్వాసాలు ఈ కలగూరగంపనంతా ఒకే గంపలోకి ఎత్త వలసి వచ్చింది . చెట్టులో పుట్టలో కూడా దైవాన్ని చూసే జనాలని లౌకికీకరించాలంటే కష్ట సాధ్యం.

పాశ్చాత్యంలో క్రైస్తవ థియాలజీని లౌకికీకరించడం ద్వారా జాతీయ భావజాలం రూపొందింది.అంటే అక్కడ క్రైస్తవం ముసుగులోనే లౌకికీకరణ జరిగింది.

మరి మనం ఏ ముసుగు ధరించాలి ? ఏ ప్రాచీన విశ్వాసపు పునాది పై లౌకికీకరణ ఆధునీకరణ ప్రారంభించాలి? అలాంటి ఒక పునాది మనకి లేదు.సెక్యులరిస్టులు క్రైస్తవ విమర్శ ఆధారంగా భారత దేశాన్ని కులంఊబిలో కూరుకుపోయిన ఒక దున్నగా ఈసడించుకున్నారు .పాశ్చాత్యాన్ని ప్రమాణంగా భావించారు. కానీ సాధారణ ప్రజానీకానికి ఈ మధ్యతరగతి లౌకిక పరిభాష చేరువ కాలేదు.

దీనికి భిన్నంగా గాంధీ విభిన్న జాతుల సామరస్యాన్ని జాతీయతగా విర్వచించాడు. జాతీయతలో మూసతత్వం ఉంటుంది. పెద్ద ప్రజాసమూహాన్ని మొత్తంగా వొకే ఒక వర్గీకరణలోకి ఈడ్చుకు రావలసి ఉంటుంది. ఇది మానవ చరిత్రలోనే తీవ్ర హింసాత్మక ప్రక్రియ.దీనిని భారతీయ బహుళ సంస్కృతుల మధ్య సామరస్యం ద్వారా అహింసాత్మకంగా మార్చాలని గాంధీ ప్రయత్నించారు.

కానీ గాంధీ నిర్వచనం ఆధునిక ధనస్వామ్య అభివృద్ధికి ఆటంకం. ఆయన పారిశ్రామిక నాగరికతనే శంకించి గ్రామ స్వరాజ్యం లాంటి అనార్కిస్టు భావాల ద్వారా తన జాతీయతావాదాన్ని నిర్వచించారు.గాంధీని గురువుగా భావించిన నెహ్రూ కమ్యూనిస్టు దేశాలని కొంత వరకు అనుకరిస్తూ స్టేట్ క్యాపిటలిజానికి నాంది పలికారు. దీన్నే సెక్యులరిజం అన్నారు. నెహ్రు విధానం ఇందిరా గాంధీ సమయానికే సంక్షోభంలో పడింది ఆధునిక పారిశ్రామిక నాగరికతలో “సంక్షేమ” రాజ్యం వొక దశ.దాన్ని దాటడానికి కాంగ్రెస్సే ప్రయత్నించింది.గ్లోబలైజేషన్ కు నాంది పలికింది

ఈ ప్రపంచీకరణ యుగంలోనే హిందుత్వ బలపడింది. నిజానికి యిది గాంధేయ వాదాన్ని తిరస్కరిస్తూ వచ్చింది.ఇప్పుడు నెహ్రూ తరహా మోడర్నిజానికి కూడా సమాధి కట్టక తప్పదు.

హిందుత్వాన్నిమత పునరుద్ధరణ వాదంగా భావించేవాళ్లు పప్పులో కాలేసినట్టే .నిజానికి సంస్కృతి మతం అనేవాటిని హిందుత్వ లౌకికీకరించడం ద్వారా వాటి సారాన్ని చంపేసింది. గాంధీ తరహా సామరస్యత స్థిరత్వము కల జాతీయవాదాన్ని ధ్వంసం చేసి మార్పు తప్ప మరేదీ సత్యం కాదు అని ప్రకటించింది.

హిందుత్వ జాతీయ వాదం అందరిని వొకే జాతిగా నిర్వచిస్తుంది కానీ అందరిని మంత్రం వేసినట్టు సమానం చేయలేదు. కనుక దేశపు పరిధిలోనే ఇతరులని సృష్టించి వారిపై ద్వేషాన్నిపెంచుతూ వచ్చింది .తద్వారా జాతీయ స్రవంతిలో తగిన స్థానం సంపాదించలేని వారి క్రోధానికి లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ పద్దతి పాశ్చాత్యం నుంచి అరువుతెచ్చుకున్నదే.

ఆధునిక అభివృద్ధి పోటీతత్వంపై ఆధారపడుతుంది .అది కింది స్థాయి జనాలలో తీవ్ర హింసారూపాన్ని తీసుకుంటుంది .ఈ సంఘర్షణలని వాడుకొని హిందుత్వ ఎదగగలిగింది.ఇంకా చెప్పాలంటే పరస్పరం సంఘర్షించే శక్తులకు హైరార్కీలో యేదోవొక స్థానాన్ని కల్పించింది హిందుత్వ

ఇక్బాల్ చంద్ అనే తెలుగు కవి ముస్లింలని “ఆరో వర్ణం” అని అన్నాడు. సాంప్రదాయికంగా వస్తున్న ఐదు వర్ణాలకి హైరార్కీగా స్థానం కల్పించి ముస్లింలని అట్టడుక్కి నెట్టేసింది హిందుత్వ.తద్వారా నిమ్న వర్గాల భావోద్వేగాలకి ద్వేషాలకి స్థానం కల్పించింది.

జాతి విద్వేషం లేనిదే జాతీయత లేదు . జాతీయత లేనిదే ఆధునిక అభివృద్ధి అసాధ్యం . అయితే జాతీయతకు సాంస్కృతిక పునాది అవసరం. జాతీయత గతం నుంచి స్ఫూర్తి పొందుతుంది .ఆ గతాన్ని గత సంస్కృతిని తన అవసరాలకి అనుగుణంగా మలచుకుంటుంది .అందుకే సంస్కృతిని నిరాకరించే సెక్యులరిజం అభాసుపాలవుతుంది

జాతీయ సంస్కృతి

జాతీయత ఒక ఆధునిక మతం.మతసారాన్ని నిరాకరించే మతం. ధర్మసారాన్ని నిరాకరించే ధర్మం. లౌకికీకరించబడిన వారసత్వం .

మతానికి లాగానే జాతీయతకు సింబల్స్, ప్రవక్త , హేతుబద్ధం కాని ప్రశ్నించబడని విశ్వాసాలు అవసరం. అంతేకాదు ఆధునికతకు శిశువైన జాతీయత అభివృద్ధికి అనుగుణంగా నూతన భాష్యాలకి గురౌతూ పోతుంది.

నిజానికి జాతీయవాదం సంస్కృతులనీ సంప్రదాయాలని వాతాపి జీర్ణం చేస్తూ వాటి సారాన్ని మింగేసి జాతీయ సంస్కృతిలో భాగం చేస్తుంది . దేవదాసీల విలాసినీ నృత్యం భరత నాట్యంగా మారటం, భగవద్గీతకు మతగ్రంథం స్థాయి, యోగా మోక్ష మార్గాన్ని పక్కన పెట్టి ఆరోగ్య చిట్కాగా మారిపోవడం ఇవన్నీ జాతీయవాదానికి పరిపుష్టి చేకూర్చేవే. వలస వాద ఆలోచనల మీద ఆధారపడిన హిందూ జాతీయ వాదం సంస్కృతుల సారాన్ని చంపి లౌకికీరించి హిందూ జాతీయ సంస్కృతిలో భాగం చేస్తుంది .

జాతీయవాదం మార్పుని సామాజిక గమనాన్ని పట్టించుకున్నట్లు కనిపిస్తుంది కానీ నిజానికి ఘనీభవింపజేస్తుంది. ఆధునిక ఇంజనీరు మానవఅవసరాలకి అంతిమంగా వ్యాపార అవసరాలకి నదీ గమనాన్ని శాసించినట్టు జాతీయవాదం సమాజగమనాన్ని శాసిస్తుంది

జాతీయవాదం విగ్రహపూజను పెంచి పోషిస్తుంది. జాతీయ నాయకులని సృష్టించి మత సంస్కృతులతో సంబంధం లేకుండా అందరి నెత్తి మీద కూర్చోబెడుతుంది . సరిహద్దుల పట్ల విధేయతకు మత గౌరవాన్ని ఆపాదిస్తుంది. కొందరు సంస్కర్తలని నాయకులని సృష్టిస్తుంది .సామజిక గమనం కన్నా ప్రాసెస్ కన్నా విగ్రహ సృష్టికే ప్రాధాన్యం ఇస్తుంది జాతీయవాదం. కమ్యూనిస్టు దేశాల్లో స్టాలిన్ మావోల్లా ఇక్కడ గాంధీ నెహ్రూ అంబేడ్కర్ ని విగ్రహాలుగా మార్చింది.

అంటే అనేక బిందువుల సముదాయానికి నదికి కాక వొక బిందువుకి ప్రాతినిథ్య స్థాయిని కల్పిస్తుంది. చరిత్రగా ఘనీభవింప జేస్తుంది. ప్రాచీన కాలంలో వ్యక్తికి ఇంత ప్రాధాన్యం లేదు.బుద్ధుడు అంటే జ్ఞానానికి సింబల్. ఎవరైనా బుద్ధుడు కావచ్చు. శంకరాచార్యులు కావచ్చు. వారు అనంత కాలంలో బిందువులు మాత్రమే.అలాగే వారిని వ్యతిరేకించే సంప్రదాయాలు మనగలిగాయి .కానీ జాతీయత సర్వజన ఆమోదాన్ని షరతుగా విధిస్తుంది. వందేమాతరం అనిఅనని వాడు ఎవడైనా ద్రోహే. అది ఒక సమూహానికి సంబంధించినది కాదు . మొత్తం భారత దేశానికి సంబంధించినది.

వొక వైష్ణవుడు శివనామాన్ని ఉచ్ఛరించడాన్నే తప్పుగా భావించవచ్చు కానీ ఒక భారతీయుడు జాతీయ జెండాకి వందనం చేయక తప్పదు.

ఈ విధంగా సంస్కర్తలనీ నాయకులనీ రాజ్యం అందరి నెత్తి మీద రుద్దుతుంది. ప్రాచీన మతాల కంటే జాతీయత ఏకశిలా సదృశమైనది.

తెలుగునాట వీరేశలింగం పంతులుని ఒక సంస్కర్తగా ప్రతిష్టించారు. నిజానికి వీరేశలింగం గారి సంస్కరణలను ఎదురీది స్త్రీలు వివాహబంధానికి దూరంగా బతకడమే శ్రేయస్కరం అని ఎదురు తిరిగిన స్త్రీలు ఉన్నారు. అలాగే దేవదాసి వ్యవస్థ రద్దు ఒక సామాజిక వర్గం సాంసృతిక ఆర్ధిక హక్కులకి భంగకరం అని ఎదురు తిరిగిన బెంగుళూరు నాగరత్నమ్మ ఉన్నారు . సాహిత్యరంగంలో వీరేశలింగం లౌక్యాన్ని నిలదీసిన ఆదిభట్ల నారాయణ దాసు ఉన్నారు .అలాగే వైదిక సంస్కృతిని గౌరవిస్తూనే స్త్రీ పునర్వివాహాన్ని సమర్ధించిన బంకుపల్లి మల్లయ్య శాస్త్రి వంటి సంప్రదాయ సంస్కర్తలు ఉన్నారు.కానీ పాశ్చాత్య మార్గంలో నడిచిన కందుకూరిని సంస్కర్త హోదాలో విగ్రహంగా నిలిపారు

బహుముఖమైన పరిణామాన్ని ప్రాసెస్ ని అధః కరించి వొక వ్యక్తిని విగ్రహంగా నిలపడమే జాతీయతా వాదం . దానికి అనుగుణంగా పాఠ్యగ్రంథాలు చరిత్రా రచింపబడతాయి .

వ్యక్తులనే కాదు కొన్ని జాతులని ఇలాగే ఉన్నత స్థానంలో నిలిపి అనుసరించమని జాతీయవాదం నిర్దేశిస్తుంది. చైనాలో హాన్ జాతి, రష్యన్ రిపబ్లిక్ లో రష్యన్ జాతి, అమెరికాలో వైట్స్ , ఇండియాలో బ్రాహ్మణుడు జాతీయవాదానికి ఆదర్శమైన జాతులుగా నిలపబడ్డారు

జాతీయవాదం మాట్లాడే మతంలో మతసారం లేనట్లే ఆజాతిలో జాతి సంస్కృతి ఉండదు. జాతీయవాదం ఆదర్శంగా నిలిపే బ్రాహ్మణుడు ఆంగ్లవిద్యకి ఆధునికతకు సింబల్.అందువల్ల అతడు దళితులతో సహా చేరుకోవాల్సిన గమ్యం. అందుకే అందరూ పొగడటం లేదా తిట్టడం ద్వారా బ్రాహ్మణ నామ జపం చేస్తూ ఉంటారు .         బ్రాహ్మణుడైన సావర్కర్ దగ్గర నుంచి అంబెడ్కర్ వరకు వలసవాద సంస్కృతే ఆరాధ్యం. బ్రాహ్మణీకరణ ఆధునికీకరణే. ముస్లింని ఇతరుడు (అదర్) గా చూసే దృష్టి కూడా వలస చరిత్ర నుంచే వచ్చింది. అందువల్ల సాంస్కృటైజేషన్ అనేదేమి లేదు. జాతీయీకరణ మాత్రమే ఉంది. ఇండియనైజేషన్ మాత్రమే ఉంది . అది ఆధునికత వైపు ప్రయాణం. మొత్తంమీద దేశాభివృద్ధి , జీడీపీ లాంటి పేర్లతో పెట్టుబడిదారీ ధనస్వామ్య అభివృద్ధిని దేవతగా మారుస్తుంది జాతీయవాదం.గాంధీ ఈ ప్రమాదాన్ని గుర్తించి ఆధునిక అభివృద్ధి నమూనానే వ్యతిరేకించాడు . కానీ గాంధీ ప్రాసంగికత నశించింది

గాంధీ కంటే గాడ్సేకు సావర్కార్కు ప్రాసంగికత పెరిగింది . జనామోదం పెరిగింది.వారు ఇద్దరు గాంధీలా పాశ్చాత్య అభివృద్ధి నమూనాను వ్యతిరేకించలేదు .వలసవాదానికి సానుకూలురు . ముస్లింని ఇతరులుగా చూస్తూ వలస చరిత్రకు ప్రాణం పోశారు .

మనదేశం ఇప్పటికి నయా వలస మాత్రమే . ఇరాన్ తో చేసుకొమ్మన్నవెంటనే చమురు ఒప్పందాన్ని   రద్దుచేసుకోవాల్సి వచ్చింది . అమెరికా మిత్రులే మనకి మిత్రులు ఇజ్రాయిల్ లా. మనది మేక్ ఇన్ ఇండియానే కానీ మేడ్ ఇన్ ఇండియా కాదు.

కనుక వలసవాద వ్యతిరేకతను రాజకీయంగానే కాదు సాంస్కృతికంగా బలపరిచిన గాంధీ పట్ల ప్రజలలో పెద్ద ఆసక్తి లేదు. కమ్యూనిస్టులు , దళిత వాదులు, హిందూ వాదులు అందరు పాశ్చాత్య నాగరికతకు దాసులే కానీ హిందూ వాదులు ఆ నాగరికతకు సంస్కృతీ మతాల వాసనను తెచ్చి స్థానికీకరించగలరు .సారంలో అమెరికనిజం రూపంలో ఇండియాని నిలుపగలరు.

వేదాలలో అన్నిఉన్నాయి అనేది గొప్ప ఆధునిక నినాదం . ఈ నినాదం పాశ్చాత్య టెక్నాలజీ అంతా వేదాలలో ఉంది అనటం ద్వారా ప్రత్యామ్నాయాలను తిరస్కరిస్తుంది. అభివృద్ధి పేరుతో నగరీకరణ సాంకేతికరీకరణను పురిగొల్పడమే కాదు వాటికి వైదికతని ఆపాదిస్తోంది . హిందూవాదం అంటే కంజ్యుమరిజంలో కొట్టుకుపోతూ యిదే వేదం అని నినదించేవాడే హిందువు. ఆధునికత కొందర్ని బయటకి వమనం చేయనిదే అభివృద్ధి లేదు. కనుక ముస్లింని శత్రువుగా భావించడం కూడా హిందుత్వలో భాగం.

రంగు రుచి లేని సెక్యులర్ పరిభాష జనాన్ని ఆకర్షించకపోవడమే కాదు అభివృద్ధి దుందుడుకుతనానికి తోడ్పడటం మానివేసింది. అందువల్ల ఆధునిక ధనస్వామ్య అభివృద్ధికి హిందూ జాతీయవాదం తప్పని షరతుగా మారింది.

జ్ఞానాన్ని ఘనీభవింప చేసిన హిందూ జాతీయ వాదం

హిందూ జాతీయ వాదం ఆధునిక మార్కెట్ అవసరాలకి అనుగుణంగా జ్ఞానాన్ని నిర్వచిస్తుంది .భారత దేశం ఇప్పటికి పరాధీన దేశం అని దానికి అనుగుణంగానే సైన్సు పట్ల మన దృక్పథం ఉండాలి అని హిందూవాదులకు బాగా తెలుసు

నిజంగా భారతీయ సంస్కృతి పట్ల భారతీయ సైన్సు పట్ల హిందూవాదులకి ఆసక్తి ఉంటే తమదైన భారతీయ ముద్రతో ప్రసిద్ధికెక్కిన జగదీశ్ చంద్ర బోస్ మరియు శ్రీనివాస రామానుజన్ లని గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. సైన్సు మీద కాదు కేవలం టెక్నాలజీ పైనే హిందూవాదులకి ప్రేమ . వార్ టెక్నాలజీ అంటే మరీ మక్కువ . దానికి కారణం సైన్సు అంతా మార్కెట్టుకి పనికి వచ్చేది కాదు .టెక్నాలజీకి ప్రయోజనమే వినియోగమే ప్రధానం. అంటే మార్కెట్టే దైవం .ప్రాగ్మాటిస్టు కాని జ్ఞానం అనవసరం అని హిందూ వాదుల అభిప్రాయం.

శ్రీనివాస రామానుజన్ చెప్పుకోదగ్గ పాశ్చాత్య విద్య లేకుండానే గణితంలో కొత్త సమీకరణాలను కనుగొన్నారు. ముఖ్యంగా ఆయన పరిశోధించిన అనంతం గురించి గణితానికి భారతీయ ఉపనిషత్ తాత్వికతతోను పరమాత్మ తత్వంతోనూ సంబంధం ఉంది . 11వ శతాబ్దానికి చెందిన భాస్కరాచార్యుల వారి సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని పరిశీలిస్తే ఈసంగతి స్పష్టమౌతుంది. వైష్ణవ సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన రామానుజన్ పై సాంప్రదాయ నేపథ్యంపనిచేసింది

ఇంక జగదీశ్ చంద్ర బోస్ చెట్లలోనే కాదు శిలల్లోను లోహాల్లోనూ కూడా ప్రాణ స్పందన ఉంది అని నిరూపించడానికి ప్రయత్నించారు . తద్వారా విశ్వమంతా చైతన్య స్వరూపమేఅని భారతీయ సర్వా0తర్యామి తత్వాన్ని బలపరిచారు. ఇటువంటి శాస్త్రవేత్తల పరిశోధనని ముందుకు తీసుకువెళ్లి వైదిక ధర్మాన్ని ఉజ్జీవం చేస్తామని హిందూవాదులు అనరు. ఆ దిశగా ప్రయత్నించరు . పైగా మానవ కేంద్రక దృష్టిని అతిక్రమించి ప్రకృతిని కాపాడాలని పాటుపడే పర్యావరణ వేత్తలని గంగా పరిరక్షకులని మృత్యు ముఖంలోకి తరిమింది హిందూ ప్రభుత్వం. వేదాంత పేరుతో అడవులని గిరిజనుల జీవితాలని ధ్వంసం చేస్తున్న వేదాంత కంపెనీకి వెన్ను దన్నుగా నిలబడడమే వేదాంతంగా భావిస్తోంది హిందూ ప్రభుత్వం. నదీ పర్యావరణాన్ని ధ్వంసం చేసే శ్రీశ్రీ రవిశంకర్ స్వామి లాంటి వారిని గురువులుగా గౌరవిస్తోంది హిందుత్వ. గిరిజన హక్కులు అటవీ పరిరక్షణ కోసం మాట్లాడిన స్వామి అగ్నివేశ్ పై దాడి జరిగింది

అమెరికా అధ్యక్షుడు ట్రంపు కూడా పర్యావరణ విజ్ఞానాన్ని పరిహాసం చేశారు . పర్యావరణ ఒప్పందాలని చెత్తబుట్టలో వేశారు. హిందూ ప్రభుత్వం దానికి ప్రతిధ్వనే . బానిసకొక బానిస కదా?

అందువల్ల భారతీయ సంస్కృతిని తత్వాన్ని ప్రతిబింబించే పరిశోధనలు విజ్ఞానం పట్ల హిందూవాదులకి ఆసక్తి లేదు.

భారత దేశం పాశ్చాత్య అమెరికన్ దేశాలకి టెక్నో కూలీలను అందించే దేశం. కనుక ఈ టెక్నోక్రాట్స్ కి వేదాలలోనే టెక్నాలజీ అంతా ఉంది అన్న నమ్మకం కుహనా ఆత్మ విశ్వసాన్నిఇస్తుంది . ఇటువంటి కుహనా పరిజ్ఞానమే ప్రవాసభారతీయులు కూడా తాము హిందువులమని గర్వించటానికి ఆస్కారం ఇస్తుంది.

ఆత్మజ్ఞానాన్ని బోధించిన రమణ మహర్షి రామకృష్ణ పరమహంస వంటి వారి స్థానంలో ఫక్తు వ్యాపార లక్షణాలు గల సాధుసన్యాసులు రాజ్యం మొదలు పెట్టడం యాదృచ్చికం కాదు. అలాగే రాగద్వేషాలకు అతీతంగా ఉండే సన్యాసుల స్థానాన్ని విద్వేష ప్రసంగాలు చేసే స్వామీజీలు భర్తీ చేశారు. సాంప్రదాయ శంకర మఠాల పట్ల కూడా ఆసక్తి సన్నగిల్లింది.

మార్కెట్టు ప్రయోజనాలతో కూడిన ప్రాగ్మాటిస్టు ఆధ్యాత్మికతని హిందుత్వ ముందుకు తెచ్చింది . దానికి శూద్రులే గురువులు .వివేకానంద ఆశించినట్టు శూద్రులు అతిశూద్రులు రాజ్యాన్నే కాదు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఏలటం మొదలుపెట్టారు.ఆధ్యాత్మికతను వ్యాపార రాజకీయంతో ముడివేసారు.తద్వారా ఆధ్యాత్మికతని మతాన్ని సెక్యులరైజ్ చేశారు.నిజమైన అర్థంలో హిందుత్వ సెక్యులార్ ప్రాజెక్టు.

హిందుత్వ తీసుకువచ్చిన సెక్యులరిజం నుంచి భారతీయ తత్వాన్ని విశ్వసాలనీ విముక్తం చేయడమే ఫాసిజం నుంచి శ్రీరామ రక్ష .నిజానికి శ్రీరాముడు కూడా తీవ్రంగా సెక్యులరైజ్ చేయబడ్డాడు. సీతారాముడుగా కాదు పరమాత్ముడిగా కాదు యుద్ధ వీరుడిగా రాముడు ప్రోజెక్టు చేయబడ్డాడు. రాముడి కంటే ముందు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రాధాన్యం రావడం వెనుక బలంతో సరిహద్దులని కాపాడడం పేరుతో ప్రజలలో యుద్ధ ప్రియత్వాన్ని మేల్కొలిపి భయంతో ఐక్యంగా ఉంచటమే జాతీయతగా ప్రచారం జరుగుతోంది

కబీర్ రామ్ రహీం గాంధీ ఈశ్వర్ అల్లా తేరే నామ్ లని హిందుత్వ వాదులు తిరస్కరించారు. అంతే కాదు రాముడిని పరమాత్మ స్వరూపుడిగా భావించే ఆధ్యాత్మ రామాయణ తత్వాన్ని కూడా తిరస్కరించారు . రాముడిని యుద్ధ ప్రియ జాతీయ వాదానికి చిహ్నంగా మార్చారు .

ఇటువంటి హిందూ సెక్యులరిజం నుంచి విముక్తి చెందినప్పుడే మనం భారతీయ తత్త్వం వైపు ప్రయాణం చేయగలం

*

 

 

 

 

 

 

Avatar

రాణి శివశంకర్ శర్మ

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • అందుకే ఇప్పుడు చావకముందే తమ వారసుల్ని కుర్చీలెక్కిస్తున్నారు.

  • అలా చేస్తున్నవాళ్ళు ఎక్కువగా కాషాయ జండా వాళ్ళు కాదు కదా? గమనించారా?

 • వ్యాసం మంచి విశ్లేషణాత్మకమైనది.

  Every politician/ party has some negative impact on the country. Hence, the key question is, “దేశం ఏరకమైన పాలకుల చేతుల్లో ఉంటే తక్కువ ప్రమాధకరం?”

  ఎందుకంటే వివక్ష, దోపిడీ అనేవి నాగరికత యొక్క బైప్రోడక్టులు. Every Government has an obligation to “Carry forward” the civilization.

  పారిశ్రామికీకరణ, నాగరికతను మరింత ముందుకి తీసుకెళ్ళినట్టే ఈ బైప్రోడక్టులను కూడా మరింత హెచ్చుమొత్తంలో ఉత్పత్తి చేసింది.

  మానవాళి అవసరాలకు మిoచి వస్తు ఉత్పత్తి జరుగుతున్న కాలం, కృత్రిమ అవసరాలు, సృష్టించి, పరిశ్రమలిని అభివృద్ధి చేయటం అనేది పాలకుల అవసరం. ఎందుకటే వారు పాలకులు అవ్వాలంటే మళ్ళీ ఈ పారిశ్రామికవేత్తలే. Industrialistas need to be Extra-rich so that they can use this Extra money to fund politicians.

  అన్నిపార్టీలూ ఈవిషయంలో ఒకతానులో ముక్కలే.

  అంచేత, ఇక్కడ ఎవరు రామాయణ స్పూర్తితో పాలించారు, ఎవరు రామాయణ స్పూర్తిని మంటగలిపారు అనేది అప్రస్తుత అంశం.

  కాకపోతే గృహస్తుల స్తానంలో, బ్రహ్మచారులూ, సన్యాసులూ గద్దెనెక్కటం వల్ల ఏమినష్టాలో అర్ధం కాలేదు.

  నాకు తెలిసినంతవరకూ ప్రస్తుత కేంద్రప్రభుత్వంలో గాని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో గాని కొన్ని రకాల మసుషులు లేరు.

  వాళ్ళెవరంటే,
  విమానంలో ఎకానమీ క్లాసులో ప్రయాణినేవారిని కూడా ఆవులమందతో పోల్చేటంత ధనిక మనస్కులు. ఇంత ధనిక మనస్కుల దృష్టిలో రైల్వే జెనరల్ కంపార్టుమెంటులో నిలబడి ప్రయాణించే కూలీలు ఈమలూ దోమలూ కన్నా ఎక్కువ స్తానం సంపాదించగలరా. సదరు ధనిక మనస్కుడు, విదేశాలలో మనదేశానికి అధికార ప్రతినిధి ఐతే, ఎలాంటి ప్రజలిని దృష్టిలో పెట్టుకొని ఒప్పందాలు చేసుకొంటాడు? ఇదంతా రామాయణ స్పూర్తేనా?

  ఎన్నికల అఫిడవిట్టులో కోట్లరూపాయల ఆస్తి ప్రకటించిన యువముఖ్యమంత్రి, ఓడిపోయాకా, అధికార నివాసం మరో రెండేళ్ళు అడిగి, కుదరక ఖాళీ చెయ్యవలసి వస్తే, బాత్రూముల్లో షవర్లూ, కొళాయిలూ, వంటింట్ళో సింకులూ, నేలమీది చలువరాళ్ళూ ఊడబెరికి పట్టుకుపోయాడు. ఇతడి తండ్రే, మొగపిల్లలన్నాకా ఏదో చేస్తారు (ఏదో అంటే అత్యాచారం హత్య లాంటి చిలిపి నేరాలు) అంతమాత్రానికే ఉరితియ్యాలా అంటే, దేశంలో మేధావులంతా ఎక్కడలేని సంయమనం పాటించేసారు. Because as per the Judgement by these intelletuals, that leader is a Branded-Secularist.

  నాకు అర్ధం అయినంతవరకూ, ఈపభుత్వమేమీ సత్యసంధులతోటీ, త్యాగధనౌలతోటీ నిండిపోకపోయినా, పైరెండు ఉదాహరణల్లో చెప్పినంత బరితెగించిన నాయకులతో మాత్రం ఏర్పడింది కాదు.

  ఇక పదే పదే సెక్యులరిజం వాడతారా: పదేళ్ళు న్యాయపోరాటం చేసి, సుప్రీం కోర్టులో నెలకు 179 రూపాయల భరణం పొందిన 72 ఏళ్ళ ముస్లిం స్త్రీకి, ఆపాటి భరోసా కూడా లేకుండా, ఏకంగా పార్లమెంటు చట్టం చేయటం కన్నా మతతత్వ నిర్ణయం ఉంటుందా (ఆ చట్టం చేయటం వ్యతిరేకించి, నిరశనగా Minister ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ రాజీనామా చేసినా ఆ చట్టం ఆగలేదు). ఆపార్టినేనా ఇప్పుడు సెక్యులర్ అంటున్నది?

  • నేను ఈవ్యాసం లో విమర్శించింది సెక్యులరిజం విజృంభణ నే.
   కాంగ్రెస్ కమ్యూనిస్టులు లోమతం ఉంది.
   నిజానికి మతానికి ధర్మానికి సమాధి కడుతూ ,సెక్యులరిజాన్ని వ్యాపింపజేస్తోంది హిందుత్వ.
   మీరు ఈప్రధాన అంశాన్ని పట్టించుకోలేదు మూలా రవికుమార్ గారూ

   • నిజమే సార్. మీ ఉద్దేశ్యం ఏదైనా, చదవగానే ఏమనిపించిందినటే, పాత ప్రభుత్వాలతోపోలిస్తే, ఈప్రభుత్వం వల్ల ఎక్కువ కొంపలు కూలిటమో కాలటమో జరుగుతాయన్న భావం వ్యాసకర్త ఉద్దేశ్యంలో ఉన్నట్టనిపించింది.

    బహుశః, ఇదేవ్యాసకర్తనుండి అనేక అభిప్రాయాలు చదవటం వల్ల కూడా, నాకు అలా అనిపించి ఉండవచ్చు.

    కాంగ్రెస్ కమ్యూనిస్టులలో మతం ఉన్నట్టైతే, అది పక్తు హిందూవ్యతిరేకం, లేదా, హిందువులపట్ల నిర్లక్ష్యం, హిందూ ఓట్లలో మూడొ వంతు ఓట్లు పడ్డా, మైనారిటీ ఓట్లు అన్నీ మావేకనుక అధికారం మాదే అన్న ధీమా ప్రస్పుటంగా కనిపించింది.

    ప్రతీ ప్రభుత్వం వల్లా కొన్ని కొంపలు కూలుతాయి. కొన్ని అంటుకుంటాయి

    అవి భోపాల్ విషాద కారకుణ్ణి సకల మర్యాదలతో దేశం దాటించటం కావచ్చు, మహావృక్షం కూలినప్పుడు కొన్ని ప్రాణాలు పోవటం లెక్కలోనిది కాదనటం కావచ్చు,
    వేదాంత్త గ్రూపుకి ఆర్ధిక సలహాదారుగా చేసిన వ్యక్తే, హోం మంత్రి హోదాలో బస్తర్ అడవుల్లో కేంద్రబలగాలు పంపి
    గనులతవ్వకాలను రక్షించటం కావచ్చు.

    రోజూ రామనామం జపిస్తూ జీవితమంతా రామకోటి రాసుకొనేవారు కూడా, రామాయణం బోధించిన జీవన శైలి సాధ్యం కాదు అన్న నిర్ణయానికొచ్చిన ఈరోజుల్లో, మళ్ళీ రామాయణం కేంద్రంగా ఇంత రాజకీయ వ్యాసం అప్రస్తుతం. నేరుగా ఆర్ధిక విషయాలో, శాంతిభద్రతలో రాసి ఉండవలసింది.

    నాసమస్య ఏమిటంటే,
    ఏకొంపలు మునుగుతున్నాపుడు ఏమీజరగనట్టు ఊరుకోవాలో,
    ఏవి మునుగుతున్నప్పుడు, ఒకటి మునిగితే పదికొంపలు మునిగినంత యాగీ చెయ్యాలో అలోచించే సెక్యులరిస్టులతోటే నా సమస్య.

   • కమ్యూనిస్టులకు మతం లేదని ఎవరన్నారు?
    సుప్రీం కోర్టు మహిళలు వెళ్ళొచ్చు అని తీర్పు ఇచ్చీ ఇవ్వగానే, అందుకోసమే కాసుక్కూర్చున్నట్టుగా, వరదలనష్టం నుంచి బయటపడని రాష్ట్రంలో పరిపాలన అంతా పక్కన పెట్టి, నాస్తిక మహిళలిని పోలీసు యూనీఫారాలు తొడిగేసి మరీ గుళ్ళొకి పంపిన ముఖ్యమంత్రికి మతం లేకపోవటం ఏమిటి. ఎంత మతంపట్టింపు లేకపోతే బురఖా నుంచి బయటకు రాలేని మహిళలతోమానవహారాలు కట్టించి మరీ, శబరిమల విషయంలో హిందూ మహిళలకు సంఘీబావం తెలిపిస్తాడు. పురుషులు వెళ్ళకూడని గుడులు కూడా ఉన్నాయి మొర్రో అంటున్నా, ఇది మహిళా వివక్షే అని నమ్మింపజెయ్యటనికి కంకణం కట్టుకుంటాడు.
    కమ్యూనిస్టులు ముమ్మాటికీ మతవాదులే.

    కాంగ్రెస్ కు మతం పట్టింపు లేదని ఎవరన్నారు? జాతీయస్తాయిలో ఒక విధానం ప్రకటించి, కేరళా అయ్యప్పభక్తుల ఓట్లకోసం రాష్ట్ర నాయకత్వం ఇంకో వైఖరి ప్రకటిస్తే, తూచ్ భక్తుల మనోభవాలు ముఖ్యమే అనటం, ఇవన్నీ మతపట్టింపులు కాదూ?

 • మూలా రవికుమార్ గారూ
  మీరు మైనారిటీల సమర్ధన ని విమర్శిస్తున్నారు కానీ హిందుత్వ కి శిలా న్యాస్ చేసింది కాంగ్రెస్సే. మొరటు హిందువాదులని అనుకరిస్తూ కాంగ్రెస్ కి గల హిందూ ముఖానికి బురఖా ఎందుకు కప్పుతున్నారు?అప్పుడప్పుడైనా వారసత్వంగా వచ్చిన బహుళత్వాన్ని గౌరవించాలనే స్పృహ కాంగ్రెస్ కి ఉండేది.
  హిందుత్వ ఇప్పుడు మరీ బరితెగించి లాభసాటి మార్కెట్ సెక్యులరిజంలో మునిగింది.

  • నిజమే రవికుమార్ గారూ. రాణి గారు పురాణ వైదిక చాదస్తం చూపెట్టారని రామాయణం ప్రాశస్త్యం బొత్తిగా తీసేయ్యక్కర్లేదు. రాముడి ధర్మం, నామం ప్రభకోల్పోవచ్చు గాక ధనస్సు-బాణం ఇంకా ప్రశస్తం గానే వున్నాయి. వాటిని రాంబో (ram bow) స్టయిల్ లో వాడచ్చు. రాముడు భారత్ పక్కనున్న లంకని జయించి విభీషణుడి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించాడని, అలానే మోడీ పాకిస్థాన్ ని లొంగదీసి భారత్ అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ తేగల శక్తివంతుడని ప్రచారం చేసుకోవచ్చు గదా. రామదండు అన్నమాట మన జనానికి పులకలెత్తిస్తుంది గదా. ఇందిర పాకిస్తాన్ కి పాఠం చెప్పిన అపర కాళీ అన్న ఆర్ ఎస్ ఎస్ స్తోత్రం ఇక్కడా వర్తిస్తుంది. కాంగ్రెస్ దానిదోవన అది ఎటూ మరణిస్తుంది. అవినీతి, పక్షపాతం అంటూ తిట్టడం అనవసరం. అందరికంటే ఎక్కువ మంది నేరస్థ జనాల్ని గెలిపించిందన్న అనవసరమైన అపప్రధ బీజేపీ మీద ఇప్పటికే పడింది. కానీ నిజానికి గుజరాత్ అల్లర్లవిషయంలో మోడీ ఉపేక్ష, ప్రోత్సాహం బాబ్రీ కూల్చివేత సమయంలో పీవీ సార్ అనుసరించిందే. అంచాత రామాయణం, కాంగ్రెస్, మొత్తం మనగతమ్ లో ఉన్న నీతిని పక్కనబెట్టి అవినీతి మొత్తాన్ని మూటకట్టి ఉపయోగిస్తే 2024 కి బీజేపీ తప్ప మరో పార్టీ ఏదీ వునికిలోనే ఉండదు. ఏమంటారు? పాఠం ఏమంటే పనికిమాలిన మొత్తం గతంనించి భారత్ ఇనోవేటివ్ గా బయటపడాలి. దాంతో కొట్లాడ గూడదు.

 • మీరు హిందూ త్వాన్నే హైలైట్ చేసారు కానీ, దాని ముసుగు లోనున్న పెట్టుబడి దారి విధానాన్ని చేయలేదు. హిందుత్వ, జాతీయ వాద ంం, దేశభక్తి అది వేసుకున్న ముసుగు మాత్రమే. మీరు ఏ స్టైల్ లో రాసిన, ఆ ముసుగు తెరిచి చూపడం బాగుంది.

  • ఆదునికబపెట్టుబడిదారీ దారి విదానం వేసుకున్న కొత్త వేషం హిందుత్వ.

 • on రామాయణ నీతికీ సమాధి వ్యాసకర్త రాణీ శివ శంకర శర్మ ### చాలా చక్కగా చెప్పారు హిందూత్వ వాదులు భారత సమాజాన్ని మధ్యయుగాల నాటి అరాచక సంస్కృతిలోకి నడిపి స్తున్నాయనే పాపులర్ స్లోగన్ నమ్మే పాటక జనంలో నేనూ ఒకణ్ణి కానీ BJP ప్రవచిత ఆధునిక హిందూత్వ పెట్టుబడిదారీ దేశాల కనిష్ట సహోదరునిగా బ్రిటీష్ వలసవాదుల శేష కర్తవ్యాల పరిపూర్తే లక్ష్యంగా సాగుతున్నదన్న మీ వాదన ఎంతో నిజం అలాగే భారతీయ కంమ్యూనిజం గాంధేయవాదపు కణుపుని అధిగమించలేక సంస్కరణాభిలాషలో కూరుకు పోయిందన్నదీ అంతే చేదయిన నిజం. ఏ కమ్యూనిస్టయినా చక్కటి బట్టలు కట్టుకున్నా నేటి కనీస అవసరాల జాబితాలోకి చేరిన ఏ సౌకర్యాన్నయినా కలిగి వుండాలని కోరుకున్నా వర్గసంకరమై పోయాడనే భావన నేటికీ వుంది. మార్క్స్ మహాశయుడు “కమ్యూనిజం ఇట్ ఈజ్ నాట్ ఎ ధియరీ ఆఫ్ పావర్టీ , ఇట్ ఈజ్ ఎ ధియరీ ఆఫ్ ఎబౌన్డెన్స్ “అని అంటాడు. కమ్యూనిస్ట్ డీ క్లాసిఫై అవ్వాలంటాడు అంటే అతను కార్మికవర్గ ధృక్పధాన్ని కలిగి వుండాలని కానీ కార్మిక వేషధారణ చెయ్యాలనికాదు .కాపిటలిజం అనివార్యంగా తన మారకురాలైన కార్మిక వర్గాన్ని తనే సృష్టిస్తుంది,కమ్యూనిజం యొక్క పునరుజ్జీవానికీ క్యాపిటలిజం ఒక ముందస్తు షరుతు .ఏది ఏమైనప్పటికీ మనం ఏ రూపంలో ఎంత తీవ్రతతో పోరాడవససి వుందో మన శతృవే నిర్ణయిస్తాడు రానున్నది పోరాటాల యుగమని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీ విశ్లేషణ చాలా బాగుంది దానితో నేను ఏకీభవిస్తున్నాను. కొత్త సారాయిని పాత తిత్తులలో పోస్తే ఆతిత్తులు పిగిలి పోతాయి అలాగే ఇప్పుడున్న పాతతరం నాయకత్వం కొత్త ఉద్యమాలనూ,యువ నాయకత్వాలనూ భరించలేదు భవిష్యత్ ఉద్యమాలకు భవిష్యత్ తరాలు నాయకత్వం వహిస్తాయి. కాపిటలిజం అనే దోపిడీ పోనంత వరకూ కమ్యూనిజం తర తరాల యువతరాలనూ ఉత్తేజపరుస్తూనే వుంటుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు