రచయిత చేసే రియల్ యస్టేట్ వ్యాపారం

చిన్న కథల్లో, ఈ స్థల వినియోగం అనేది కేవలం అలంకరణ కోసమో, కథని దృశ్యమానం చెయ్యడానికో మాత్రమే వాడకూడదు. అది కథా వస్తువులో ఒక భాగంగా ఉండాలి.

>> భేటీ

మీటింగ్ జరగబోయే గదిలోకి రవి అడుగుపెట్టాడు. అది ఒక కాన్ఫరెన్స్ హాల్. మధ్యలో ఒక పొడవైన టేబుల్, దాని చుట్టూ వరుసగా కుర్చీలు ఉన్నాయి. ఒకవైపు కిటికీలు, మరోవైపు గోడకు వైట్‌బోర్డ్ ఉన్నాయి. లైట్లు వెలుగుతున్నాయి, గది అంతా చాలా పద్ధతిగా, శుభ్రంగా ఉంది.

శర్మ అప్పటికే అక్కడ ఒక కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆయన ఫార్మల్ డ్రెస్‌లో ప్రొఫెషనల్‌గా కనిపిస్తున్నాడు. రవి ఆయనను పలకరించి కూర్చున్నాడు. కొద్ది నిమిషాల తర్వాత నేహ కూడా వచ్చింది. ఆమె నీట్‌గా తయారై ఉంది, కానీ కొంచెం కంగారుగా కనిపిస్తోంది.

ముగ్గురూ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఒకవైపు రవి, మరోవైపు శర్మ, ఆయన పక్కన నేహ. ముంబై ట్రాఫిక్ గురించి, రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్న తరువాత ప్రపోజల్ మీద చర్చ మొదలుపెట్టారు. రవి తన ఆలోచనలను స్పష్టంగా వివరించాడు. శర్మ చాలా జాగ్రత్తగా వింటూ, మధ్యమధ్యలో తల ఊపుతున్నాడు. అవసరమైనప్పుడు నేహ కూడా కొన్ని పాయింట్లు జోడించింది.

వారి సంభాషణ తప్ప గదిలో మరే శబ్దమూ లేదు. వాతావరణం చాలా సీరియస్‌గా ఉంది. కిటికీల గుండా సూర్యరశ్మి లోపలికి వస్తూ గదిని కాంతివంతంగా మార్చింది. అంతా చాలా మామూలుగానే సాగుతోంది.

సమావేశం జరుగుతున్న తీరు గమనిస్తున్న రవికి మంచే జరగబోతోందన్న నమ్మకం కలిగింది. తన ప్రెజెంటేషన్ బలంగా ఉందని, అంతా సవ్యంగా జరుగుతుందని అతనికి అనిపించింది. నేహ మాత్రం కొంత ఆందోళనగా ఉన్నా, నిబ్బరంగా ఉండటానికి ప్రయత్నించింది. శర్మ, ఇలాంటి ఎన్నో మీటింగ్‌లు చూసిన అనుభవజ్ఞుడు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉన్నాడు.

వాళ్ల చర్చ కొంతసేపు కొనసాగింది. రవి తన పాయింట్లు చెప్పగా, నేహ అతడిని సమర్థించింది, శర్మ కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ చర్చ అంతా చాలా ప్రొఫెషనల్‌గా, కేవలం విషయం మీదనే సాగింది. కొంతసేపటి తర్వాత మీటింగ్ ముగిసింది.

మీటింగ్ జరిగిన తీరు గమనించిన రవి సంతృప్తి చెందాడు. నేహ కూడా ఊపిరి పీల్చుకుంది. త్వరలోనే తన నిర్ణయాన్ని తెలియజేస్తానని శర్మ చెప్పారు. వాళ్లంతా లేచి, ఒకరినొకరు మర్యాదపూర్వకంగా హ్యాండ్ షేక్ చేసుకుని గది నుండి బయటకు నడిచారు. <<

పైన ఇచ్చిన కథ చదివారు కదా? కథ మొదలవగానే పాఠకులకి పాత్రల పరిచయం ఎలా జరిగిందో గమనించండి. ఇక్కడే కాదు, చాలా కథలలో వేషధారణతోనే పాత్రల మొదటి పరిచయం పాఠకులకి కలుగుతుంది. పాత్రలు వేసుకున్న బట్టలు, వాళ్ల చేతిలో ఉండే బ్యాగ్, కళ్లకు పెట్టుకున్న కళ్లద్దాలు ఇవన్నీ కలిపి పాత్రల రూపం ప్రేక్షకులు చూసేలా చేస్తాయి. ముఖ్యంగా కథల్లో వీటి ప్రాధాన్యత మరీ ఎక్కువ. ఎందుకంటే నవల లాంటి ప్రక్రియల్లో ఉన్నట్లు కథలలో సుదీర్ఘమైన వివరణలు ఇచ్చేందుకు చోటు ఉండదు. పాత్రలు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఏం పట్టుకున్నారు, ఎలా నిలబడ్డారు, సన్నివేశం సాగుతున్న కొద్దీ వారి రూపంలో ఎటువంటి మార్పులు వచ్చాయి అనే అంశాలు— వారి వ్యక్తిత్వాన్ని, మానసిక స్థితిని, ఆఖరికి కథలోని నిగూఢ అర్థాలను కూడా వెల్లడిస్తాయి. అయితే, చాలామంది కొత్త రచయితలు ఈ వివరాలను కేవలం ‘లేబుల్స్’ (Labels) లాగా వాడుతుంటారే తప్ప, కథ చెప్పేందుకు ఉపకరించే పరికరాలుగా ఉపయోగించరు.

మనం పైన చదివిన “భేటీ” కథనే ఉదాహరణగా తీసుకోండి. అందులో శర్మ “ఫార్మల్ దుస్తులు ధరించి, ప్రొఫెషనల్‌గా ఉన్నాడు” అని వర్ణించారు. నేహ “నీట్‌గా తయారై, కంగారుగా ఉంది” అని చెప్పారు. రవి రూపం గురించి అసలు ప్రస్తావనే లేదు. ఈ వాక్యాలు కేవలం సమాచారాన్ని ఇస్తున్నాయి తప్ప, అందులో జీవం లేదు. ఆ దుస్తుల్లో మనకు శర్మ అధికారం కనిపించదు, నేహ కంగారు ఆమె భౌతిక స్థితిలో ప్రతిబింబించదు. మీరు గమనిస్తే ఈ మూడు పాత్రలు ఒకే రకమైన బట్టలు వేసుకోని ఉంటారు. వాటికి ఒకే మూస వర్ణనని  రచయిత జోడించారు. ఫలితంగా ఈ మూడు పాత్రలు దృశ్యపరంగా ఒకరితో ఒకరు కలిసిపోయినట్లే ఉంటారు. అందువల్ల ఈ పాత్రలు పాఠకులపైన ఎటువంటి ప్రత్యేక ముద్ర వేయలేకపోయాయి.

దీన్ని ఎలా సరిచెయ్యచ్చు? సాధారణమైన, మూస వర్ణనల స్థానంలో పాత్ర స్వభావాన్ని వెల్లడించే ప్రత్యేక వివరాలను చెప్పచ్చు. ఉదాహరణకి “ఫార్మల్ దుస్తులు” అనే బదులు, శర్మ తన టై మరీ బిగుతుగా కట్టుకున్నాడని చెప్పచ్చు — అది అతనిలోని ఉన్న నియంత్రించే స్వభావాన్నో, నిక్కచ్చిగా వ్యవహరించే తీరునో సూచించవచ్చు సూచిస్తుంది. నేహ వేసుకున్న బ్లేజర్ కొసలు నలిగిపోయి ఉన్నాయని చూపిస్తే, ఆమె టెన్షన్‌లో బ్లేజర్ చివర్లను నలిపిందని చెప్పచ్చు. దాంతో ఆమెలో ఏదో అంతర్గత ఆందోళన ఉందని అర్థమవుతుంది. రవి సూట్ వేసుకున్నా, మీటింగ్‌లోకి రాగానే కోట్ తీసి, చొక్కా చేతులు పైకి మడతపెట్టాడని చెప్తే, అది అతని ఆత్మవిశ్వాసాన్ని, పని పట్ల అతనికున్న ఆసక్తిని వెల్లడిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మార్పులు పాత్రల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తూ, వారు మాట్లాడకముందే వారి వ్యక్తిత్వాలను పాఠకులకు పరిచయం చేస్తాయి.

అలాగే, సన్నివేశం సాగుతున్న కొద్దీ రూపంలో కూడా మార్పు రావాలి. ఉత్కంఠ పెరిగే కొద్దీ బట్టలు నలగడం, కంఫర్ట్ లేదా గొడవను సూచించడానికి జాకెట్ తీసి పక్కన పెట్టడం, లేదా ఆందోళన పెరిగే కొద్దీ పాత్ర పదే పదే తన కాలర్‌ను సరిచేసుకోవడం వంటివి చూపించచ్చు. ఇవి పాత్రలు ఒకేలా ఉండకుండా వైవిధ్యంగా కనిపిస్తాయి. వారిలో వస్తున్న భావోద్వేగ మార్పులను కూడా పాఠకులు గ్రహించేలా చేస్తాయి.

ఇందులో ‘వైవిధ్యం’ (Contrast) కూడా అంతే ముఖ్యం. ఒక సాధారణ మీటింగ్‌కు ఎవరైనా అతిగా సిద్ధమై వస్తే వారిలోని అభద్రతా భావం తెలుస్తుంది. అలాగే, ఒక తీవ్రమైన భావోద్వేగ సంఘర్షణలో పాత్ర ఫార్మల్ దుస్తుల్లో ఉండటం అనేది కథకు ఒక లోతును ఇస్తుంది. బయటకు నీట్‌గా కనిపిస్తూ లోపల సతమతమవ్వడం అనేది ఉత్కంఠను పెంచుతుంది.

చివరిగా, వేషధారణ, రూపం అనేవి సంభాషణలతో సమానమైన పని చేయాలి. పాత్రల రూపాన్ని చూసి—ఎవరి దగ్గర అధికారం ఉంది? ఎవరు అభద్రతతో ఉన్నారు? ఎవరు ధీమాగా ఉన్నారు అనేది పాఠకుడు పసిగట్టగలగాలి. ఈ వేషధారణ పాత్ర గురించి ఏం చెబుతోంది? సన్నివేశం సాగుతున్న కొద్దీ ఇందులో ఏం మార్పు వస్తోంది? ఇది పాత్ర అంతరంగాన్ని ప్రతిబింబిస్తోందా లేదా దానికి విరుద్ధంగా ఉందా? మీరు రాసేటప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకండి. అవి చాలా సాధారణంగా, సామాన్యంగా ఉంటే, ఆ వర్ణన కథకు ఉపయోగపడటం లేదని అర్థం చేసుకోవాలి.

కథా రియల్ యస్టేట్

ప్రతి కథ ఒక స్థలంలో జరుగుతుంది. ఆ విషయం మనం గతంలో మాట్లాడుకున్నాం. ఆ స్థలాన్ని ఒక రియల్ యస్టేట్ వ్యాపారిలా చూడండి. ఇప్పుడు పైన ఇచ్చిన కథలోకి మళ్లీ చూడండి. కథ ఎక్కడ జరుగుతోందో తెలుస్తోంది కానీ ఆ స్థలాన్ని పాత్రలు కానీ, రచయిత కానీ ఎక్కడా వాడలేదు. అది వృధా అయిన స్థలం. రియల్ ఎస్టేట్ వ్యాపారి అది ఎప్పటికీ ఒప్పుకోడు.

నేను పైన చెప్పినట్లు, పాత్రల వేషధారణ, రూపం పాఠకుడిని పాత్రలకు పరిచయం చేస్తే, ‘కంపోజిషన్’ మరియు ‘స్పేషియల్ అరేంజ్మెంట్’ ఆ సన్నివేశానికి ఒక కొరియోగ్రఫీ చేస్తాయి. ఒక మాట కూడా మాట్లాడకుండానే—ఎవరు ఆధిపత్యం చలాయిస్తున్నారు, ఎవరు వెనక్కి తగ్గుతున్నారు, వాళ్ల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది ఈ అమరికలే నిర్ణయిస్తాయి. ప్రతి చిన్న వివరానికి ఒక అర్థం ఉండాల్సిన చిన్న కథల్లో, ఈ స్థల వినియోగం అనేది కేవలం అలంకరణ కోసమో, కథని దృశ్యమానం చెయ్యడానికో మాత్రమే వాడకూడదు. అది కథా వస్తువులో ఒక భాగంగా ఉండాలి.

“భేటీ” కథలో, పాత్రలు ఎక్కడ కూర్చున్నారనే వివరం చాలా అస్పష్టంగా ఉంది. రవి “ఒక వైపు”, శర్మ “మరో వైపు”, అతనికి “దగ్గరలో” నేహ కూర్చున్నారు. వాళ్లు ఎక్కడెక్కడ కూర్చున్నారని మాత్రమే కథ చెబుతోంది తప్ప, వారి స్థానాలు ఆ చర్చను ఎలా ప్రభావితం చేస్తున్నాయో చెప్పడం లేదు. ఎవరు ఎవరికి ఎదురుగా ఉన్నారు? ఆ టేబుల్‌పై ఎవరి నియంత్రణ ఉంది? నేహ దగ్గరగా ఉండటం అనేది మద్దతును సూచిస్తోందా లేదా ఆమె ఒంటరితనాన్ని సూచిస్తోందా? ఇవేవీ మనకు తెలియదు. దీనివల్ల పాత్రలు ఆ ప్రదేశంలో ఉన్న పాత్రల్లా కనిపిస్తారు తప్ప నిజమైన మనుషుల్లా కనపడరు. మీరు గమనించండి – చర్చలకు లేదా దూరానికి ఒక శక్తివంతమైన ప్రతీకగా మారాల్సిన ఆ ‘టేబుల్’ కూడా ఎటువంటి ప్రాధాన్యత లేని వస్తువులా మిగిలిపోయింది.

దీనిని మరింత ప్రభావవంతమైన రాసే పద్ధతి ఏమిటంటే — పాత్రల ఎక్కడ ఉన్నాయి, ఆ స్థలంలో ఏ భాగంలో ఎవరు ఉన్నారో చెప్తూ, ఆ స్థలంలో ఉన్న వస్తువులని వివరించడం. రవి నేరుగా శర్మకు ఎదురుగా కూర్చున్నాడని, వారిద్దరి మధ్య ఉన్న ఆ పొడవైన టేబుల్ ఒక ‘యుద్ధభూమి’లా ఉందని రాస్తే ఎలా ఉంటుంది? నేహ కాస్త పక్కకు కూర్చుంది అనే బదులు “ఫైరింగ్ రెంజ్‌లోకి వచ్చేందుకు భయపడుతున్న సైనికుడిలా దూరంగా కూర్చుంది” అని రాస్తే నేహ గురించి ఏం అర్థమౌతుంది? లోపలికి వస్తూనే శర్మ అన్నింటికన్నా పెద్ద చైర్‌ని గట్టిగా లాగి అందులో కూర్చున్నాడు అనగానే అక్కడ ఎవరికి అధికారాలు ఉన్నాయో తెలుస్తోంది కదా?

పాత్రల మధ్య దూరం, కూర్చునే తీరు కూడా ఆ పాత్రల మానసిక స్థితిని వెల్లడిస్తాయి. ఒక పాత్ర కుర్చీలో వెనక్కి వాలి, చేతులు చాపి కూర్చుంటే అది ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. అదే కుర్చీ అంచున కూర్చుంటే అది అసహనాన్ని, భయాన్ని తెలుపుతుంది. ఎత్తులో ఉండే తేడాలు కూడా ముఖ్యం: రవి, నేహ కూర్చుని ఉండగా మిస్టర్ శర్మ నిలబడి ఉంటే, అది తక్షణమే ఆయన అధికారాన్ని చాటుతుంది. చివరికి కుర్చీని కొంచెం దగ్గరకు జరపడం లేదా స్వల్పంగా పక్కకు తిరగడం వంటి చిన్న కదలికలు కూడా మాటలు లేకుండానే ఉత్కంఠను నాటకీయంగా ప్రదర్శించగలవు.

ఆ ప్రదేశంలో ఉన్న వస్తువులను కూడా విస్మరించకూడదు. టేబుల్ ఒక అడ్డంకిలా, తలుపు ఒక సంకోచానికి చిహ్నంగా, కిటికీ అక్కడి నుండి తప్పించుకోవాలనే కోరికకు ప్రతీకగా వాడచ్చు. నేహ పదే పదే కిటికీ వైపు చూస్తుంటే, ఆమె భయం కేవలం ఒక పదంగా కాకుండా ఒక భౌతిక చర్యగా మారుతుంది. రవి తన కాగితాలను టేబుల్ మధ్యలో ఖచ్చితంగా పెడితే, ఆ ఉమ్మడి ప్రదేశంపై అతను తన పట్టును చాటుకుంటున్నట్లు వ్యక్తం అవుతుంది.

ముఖ్యమైన విషయం ఏమిటంటే “గాలిలో తేలే పాత్రలను” (Floating charactersకి స్వేచ్చానువాదం) సృష్టించకూడదు. ప్రతి పాత్రకు ఆ పరిసరాలతో మరియు ఇతర పాత్రలతో ఒక సంబంధం ఉండాలి. కథ రాసేటప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు ఇవి – ఆ పాత్రలు ఎక్కడ ఉన్నాయి? వాళ్లని ఒకరి నుంచి మరొకరితో ఏం వేరు చేస్తోంది? కేంద్ర స్థానం ఎవరి అదుపులో ఉంది? ఈ అమరిక ఖచ్చితంగా ఉన్నప్పుడు, పాఠకులు ఏ క్షణంలోనైనా ఆ సన్నివేశాన్ని ఒక చిత్రంగా ఊహించుకోగలుగుతారు. అప్పుడు ఆ చిత్రమే సగం కథ చెబుతుంది. మిగిలిన సగం కథను మాత్రమే మీరు వాక్యాల సాయంతో చెప్పాల్సి ఉంటుంది.

చిన్న కథల్లో కంపోజిషన్ అంటే క్లుప్తత. ఒక పేరాగ్రాఫ్ వివరణ కంటే—కుర్చీని వెనక్కి నెట్టడం లేదా టేబుల్ చివరి అంచున ఒక పాత్ర ఒంటరిగా కూర్చోవడం వంటి ఒక చిన్న వివరమే ఎక్కువ కథను చెబుతుంది. స్థానం ‘అధికారం’ అవుతుంది, దూరం ‘భావోద్వేగం’ అవుతుంది, కదలిక ‘సంఘర్షణ’ అవుతుంది.

వెలుతురు, వాతావరణం

వేషధారణ పాత్రను వెల్లడిస్తే, అమరిక బంధాలను వెల్లడిస్తుంది; అలాగే వెలుతురు, వాతావరణం ఆ సన్నివేశం యొక్క భావోద్వేగ స్వరాన్ని (Emotional tone) వెల్లడిస్తాయి. ఇవి పాఠకుల అవగాహనకు రహస్యంగా రంగులు అద్దే కుంచెలు. క్లుప్తత అత్యవసరమైన చిన్న కథల్లో, వాతావరణం కేవలం ఉండటం కోసం కాకుండా, ఒక భావాన్ని వ్యక్తపరిచేలా ఉండాలి.

“భేటీ” కథలో, వెలుతురు వర్ణన చాలా తటస్థంగా ఉంది: “లైట్లు వెలుగుతున్నాయి,” “సూర్యరశ్మి లోపలికి వస్తోంది,” “గది ప్రకాశవంతంగా ఉంది.” ఇక వాతావరణం గురించైతే ఒకే ఒక మాటలో తేల్చేశారు: “వాతావరణం సీరియస్‌గా ఉంది.” ఈ వాక్యాలు భౌతికంగా అక్కడ ఏముందో చెబుతున్నాయి తప్ప, ఆ క్షణంలోని గంభీరతను మనకు అనుభూతి చెందేలా చేయడం లేదు. పరిసరాలు ఆ నాటకంలో పాలుపంచుకోవడం లేదు; అవి కేవలం అక్కడ ఉన్నాయి, అంతే.

ఈ కథలో వెలుతురు ద్వారా మూడ్‌ను, ఉత్కంఠను సృష్టించి ఉండచ్చు. సూర్యరశ్మి ఒక కోణంలో లోపలికి వస్తూ, శర్మ బూట్ల మెరుపుపై పడుతూ ఆయన అధికారాన్ని మరింతగా చాటుతున్నట్లు చెప్పి ఉండచ్చు. లేదా నేహ నీడలో కూర్చుని ఉండటం వల్ల ఆమె ఆందోళన మరింత పెరిగినట్లు చెప్పచ్చు. వెలుతురు నేరుగా రవి ముఖం మీద పడటం ద్వారా అతని ఆత్మవిశ్వాసాన్ని నొక్కి చెప్పవచ్చు, అది అతడిని గదిలో ప్రధాన ఆకర్షణగా మారుస్తుంది. వెలుతురు మొత్తం ఒకటే అయినా అది అన్ని పాత్రలతో తటస్థంగా ఉండాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వాడితే అది ప్రాముఖ్యతను, వైవిధ్యాన్ని చూపే ఒక పరికరంగా మారుతుంది.

“వాతావరణం సీరియస్‌గా ఉంది” అని చెప్పే బదులు, ఇంద్రియ సంకేతాల ద్వారా దాన్ని చూపండి: వైట్‌బోర్డ్ మార్కర్ ఇంక్ వాసనతో గాలి భారంగా ఉండటం, ఏసీ నుండి వచ్చే చల్లదనం, గోడ గడియారం చేసే ‘టిక్ టిక్’ శబ్దం తప్ప మరేమీ వినిపించని నిశ్శబ్దం. ఇవి ఆ మీటింగ్‌లో ఉన్న ఉత్కంఠను ప్రతిబింబించే ఒక సజీవ వాతావరణాన్ని సృష్టిస్తాయి.

వెలుతురును ఒక ‘ఫోకస్ టూల్’గా కూడా ఉపయోగించవచ్చు. ఏది వెలుగులో ఉంది, ఏది చీకటిలో దాగి ఉంది? రవి పేపర్లపై పడుతున్న సూర్యరశ్మి అతని స్పష్టతను సూచిస్తే, నేహ ముఖం సగం నీడలో ఉండటం ఆమెలోని అనిశ్చితిని సూచిస్తుంది. కిటికీ బయట ఉన్న ప్రకాశవంతమైన వెలుతురుకు, లోపల ఉన్న ఇరుకైన కాన్ఫరెన్స్ హాల్‌కు మధ్య ఉన్న వ్యత్యాసం—స్వేచ్ఛకు, బందీగా ఉన్న స్థితికి, లేదా ఆశావహ దృక్పథానికి, ఒత్తిడికి మధ్య ఉన్న తేడాను సూచించవచ్చు.

ఇలాంటిదేదీ చెయ్యకుండా తటస్థంగా ఉండటమే ఇక్కడ అతిపెద్ద ప్రమాదం.

“అది ఒక మామూలు గది” లేదా “వాతావరణం బాగుంది” అని రాయడం వల్ల గొప్ప అవకాశాన్ని వదులుకున్నట్లవుతుంది. చిన్న కథల్లో, వాతావరణం అనేది భావోద్వేగాన్ని ప్రతిబింబించాలి. కొన్నిసార్లు కథలో ఉన్న భావోద్వేహానికి పూర్తి వ్యతిరేకమైన వాతావరణతో contrast కూడా తీసుకురావచ్చు. ఈ రెండూ కాకుండా తటస్థంగా ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.

ఇలా వెలుతురు వాతావరణం అనేవి కేవలం నేపథ్యంగా కాకుండా భావోద్వేగాలను పెంచే సాధనాలుగా వాడాలి. పాత్రలు ఏం అనుభవిస్తున్నాయో నేరుగా చెప్పకుండానే పాఠకుడు గ్రహించేలా ఇవి చేస్తాయి. ఒక సన్నివేశం రాసే ముందు ఆ సన్నివేసంలో వెలుతురు ఎలా ఉంది? పరిసరాలు దేన్ని సూచిస్తున్నాయి? ఏది కనిపిస్తోంది? ఏం కనపడటంలేదు? లాంటివి ఆలోచించుకుని, అవసరం మేరకు వాటిని కథలో చొప్పించడం ద్వారా ఇది సాధించవచ్చు.

(మళ్లీ కలిసినప్పుడు సంభాషణలు)

అరిపిరాల సత్యప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.