మేనిఫెస్టో లాంటి కవిత్వం

విత్వం గురించి కవిత్వం రాయడం పట్ల కవులు ఆసక్తి చూపించడానికి కారణాలు ఏమైనా వుంటయా? తమ కవిత్వం గురించిన వ్యాఖ్యానం ఒక మేనిఫెస్టో లాంటిదని ముందే నిర్ణయించుకోవడం చూస్తాం. ఇలా వుంటుందని చెప్పడం వల్ల కవిని, కవిత్వాన్ని అంచనావేయడానికి పనికొస్తది. అయితే ఇలానే వుంటుందని చెప్పడం వల్ల ‘వస్తువు’ పరిధి ఏమైనా సంకుచితం అయ్యే అవకాశం వుంటదా? శైలీ శిల్పాల్లో వైవిధ్యత లోపిస్తదా? పలుకుబడుల భాష అన్ని వస్తువుల్ని కవిత్వీకరించడానికి సరిపోదా? ఈ తరం కవులు బడిపలుకుల భాషకు భిన్నంగా పలుకుబడుల భాషను మనసుకు ‘హత్తుకునే విధంగా రాయడం విశేషం. ‘అతివారపు హరిశంకర్ ‘ భవిష్యత్ పలుకుబడుల కవిత్వాన్ని  వాగ్ధానం చేస్తున్నట్టు గమనించవచ్చు.
*
పల్లె పద్యం
~
చెలకలన్నీ కలెదిరిగి
పరిగె ఏరుకొచ్చి
చేతివేళ్ల చర్మం వొల్సుకపోతే
రాలిన మక్క ఇత్తులే
నా అక్షరాలు
నాయిన వలసబోతే
అమ్మ నాట్లేయవోతే సాయింత్రం బడి యిడ్సినంక బోరింగ్  కాన్నుంచి
నీళ్లు మోసుకొచ్చిన
గులాబీ పాదాలే
నా యీ కవితా పాదాలు
కట్టెల పొయ్యి మీద
వంట జేస్తున్న అమ్మకు
కట్టెలు ఎగనూకుతూ
నే దోసిలి వట్టిన
అమ్మ నొస్టి మీద రాలుతున్న సెమట పలుకులే
నా సరళ అలంకార శిల్పం
ఎండాకాలం సెలవులల్లా
మట్టిల కంకరమాలు కల్పుతూ
ఎగశ్వాస దిగశ్వాస దీసుకుంటున్నపుడు
నా ఎనిమిదో తరగతి గుండె కొట్టిన డప్పె
నా కవితకు అంతర్ లయ
పదిలా మండలంలా
సెకండొచ్చినా
ఏ భువనగిరికో, నాందేడుకో
పారకాడుగా పంపుతూ
బస్టాండ్లో నాయిన కార్చీన కన్నీళ్లే
నా కవిత్వంకు తడి
పుట్టిన రోజని
ఫించన్ పైసల్తో
కొత్త బట్టలు కొనుక్కోమనే
నాయిన లాంటి ఆరివారమున్నా
చుట్టూరా జీవితాలే
నా కవితా వస్తువులు
సల్ల సలికాలంలా
వోకిట్ల పయ్యంతా తూట్లు వడ్డ దుప్పటిలో
కాళ్లు ముడ్సుక పడుకున్న
పసితనమే నా కవిత్వం
*
వస్తువు ను నిర్ధేశించుకోవడం కేవలం ఒక ప్రాథమిక ముద్రను బలంగా వేయడానికి మాత్రమేనని కవి ‘ఎరుకను కల్గి వుండడం ముఖ్యం. కాల గమనంలో నిర్దేశిత వస్తుచట్రం నుండి క్రమంగా బైటికి రాగలిగే శక్తి కూడా వుండాలి. ప్రాథమికంగా ఏదైతే బలమవుతుందో అది రాను రాను బలహీనతగా మారకుండా జాగ్రత్తపడాలి. బలహీనతగా మారిన కవుల కవిత్వపు ప్రభావాల నుండి, భావజాలాల నుండి దూరం జరగాలి. అత్యంత ప్రభావవంతంగా ఆకర్షిస్తున్న, ప్రేరణ నిస్తున్న కవిత్వం పట్ల అప్రమత్తంగా వుండాలి. ఆ అయస్కాంత క్షేత్ర పరిధి బయటనే అతిజాగ్రత్తగా సంచరించాలి. ఏ కాస్త పరిధిని దాటి లోపలికి ప్రవేశించినా చివరికి తమ ఉనికిని కోల్పోతరు. చెప్పుకోవడానికి తమదైన కవిత్వ వ్యక్తిత్వం, అస్తిత్వం కనిపించదు.
‘పల్లె పద్యం’ శీర్షిక ద్వారా స్వీయ కవిత్వ నిర్వచనం సమకూర్చిన తీరు వ్యక్తమైంది. ముందుతరం కవులలాగానే ‘నా అక్షరాలు.. ఫలానా ‘అని Coin చేయడం ఎత్తుగడగా చూడొచ్చు. అక్షరాల ద్వారా కవితా  పాదాలను, కవితా పాదాల్లో ఒదిగిన సరళ అలంకార శిల్ప స్వభావాన్ని, లయను తడిని, పలురకాల కవితా వస్తువుల్ని, కవిత్వగుణాన్ని చెప్పడం కవిత్వ సారాంశం. ఒక్కొక్కటీ ఒక్కో స్టేట్ మెంట్ లెక్క అనిపిస్తది. ఆయా స్టేట్ మెంట్స్ వ్యక్తమైన భాష కవిత్వమాధ్యమంగా పనికొస్తది. శీర్షికను వ్యక్తపర్చడానికి వాడిన ‘వస్త్వాంశాల’ అభివ్యక్తులు వైయక్తిక అనుభవాల్లోంచి స్వీకరించినట్లు గమనిస్తాం. మెటాపోయెట్రీ, అధికవిత్వం అని ముద్దుగా పిల్చుకునే కవిత్వం సాధారణంగా వర్ణనలకు పరిమిత మైనప్పటికీ ఆయా వర్ణనలు సామాజిక జీవితాన్ని ప్రతిబింబిస్తున్న తీరు సమాంతరంగా చిత్రించబడటాన్ని ఈ కవితలో చూడవచ్చు.
పోలికలతో పాటుగా ఒక సందర్భాన్ని, ఒక జీవిత శకలాన్ని పూర్వ రంగంగా, prefix గా చెప్పడం వల్ల కవి జీవితం ఆయా స్టాంజాల్లో ప్రతిఫలించడం పరిశీలించవచ్చు. ప్రతి స్టాంజా ఒక పొడవైన కవిత్వ వాక్యం. “రాలిన మక్క ఇత్తులే నా అక్షరాలు, గులాబీ పాదాలే  నా యీ కవితాపాదాలు, సెమట పలుకులే సరళ అలంకార శిల్పం, గుండె కొట్టిన డప్పె నా కవితకు అంతర్ లయ, నాయిన కార్చిన కన్నీళ్లే నా కవితకు తడి, ఆరివారమున్నా చుట్టూరా జీవితాలే నా కవిత్వ వస్తువులు, కాళ్లు ముడ్సుకపడుకున్న పసితనమే నా కవిత్వం’ అంటూ తన కవిత్వ మర్మాన్ని విప్పి చెప్పడం కనిపిస్తది. వాతావరణ చిత్రణ కవితకు ఆయువుపట్టు. దృశ్యశకలాల్ని ఊహించడానికి పాఠకులకు ఒక అవకాశం వుంది. జీవితం నుండి కవిత్వం పుడుతుందని నిరూపించినట్లుగా అనిపిస్తది. కవితా పాదాల్లోని ఉద్వేగంతో సమతాస్థితిని ఏర్పర్చే వెసులుబాటును కల్పించడం కవిత్వ నిర్మాణ వ్యూహంగా చెప్పవచ్చు. పలుకుబడుల కవికి శుభాకాంక్షలు.
*

బండారి రాజ్ కుమార్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగుంది అన్న విశ్లేషణ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు