మేధా పాట్కర్ తో మీరా ప్రయాణం!

మేథా ఎలా అంటే తనే ఒక వ్యవస్థ. యాభై రకాల పనులు ఏకకాలం లో చేసేది.  ఆమెకు చెప్పలేనంత శక్తి సామర్ధ్యాలు వున్నాయి. చాలా ఓపిక ఎక్కువ.

నేను ‘లా’ పూర్తి చేసిన తర్వాత 2008లో మూడు నాలుగు నెలలపాటు స్వతంత్రంగా హైదరాబాద్ హైకోర్టు లోనే ప్రాక్టీస్ కూడా చేశాను. ప్రాక్టీసు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే హెచ్ఐవి పేషంట్లకు ఇవ్వాల్సిన ఎఆర్ టి మందుల పంపిణీలో జరుగుతున్న జాప్యం వల్ల గ్రామీణ పేదలు పడుతున్న ఇబ్బందుల గురించి ఒక పిల్ స్వతంత్రంగా వేసాను. మహబూబ్ నగర్ నుంచి అనుకుంట ఇద్దరు భార్యాభర్తలు హెచ్ఐవి వైద్యం కోసం ఉస్మానియా కు వస్తే, అక్కడ మందులు స్టాక్ లేవు అన్న కారణం చేత వైద్యానికి నిరాకరించబడ్డారు. అతని పరిస్థితి చాలా క్రిటికల్ గా వుంది. ఈ అంశం మీద నేను వేసిన పిల్ తో మందుల పంపిణీ వెంటనే జరగాలని హైకోర్ట్  అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ డిపార్టుమెంటు కు ఒక మంచి డైరెక్షన్ ఇచ్చింది. ఒక లాయర్ గా నాకు మంచి కాన్ఫిడెన్సు వచ్చిన సందర్భం అది.

ఆ సమయంలోనే హౌసింగ్ రైట్స్ కి సంబంధించి హైదరాబాద్ చాదర్ఘాట్ దగ్గర చాలా పెద్ద మీటింగ్ జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్టు భూసేకరణ బాధితులు, ఔటర్ రింగ్ రోడ్ బాధితులు, ఇంకా ఇతర ‘అభివృద్ధి’ పథకాల్లో నిర్వాసితులవుతున్న అనేకమంది వచ్చారు. ఈ సభలోనే నేను మేథాపాట్కర్ని మొదటిసారి చూశాను. ప్రజాఉద్యమాల్లొ క్రియాశీలకంగా ఉంటున్న ఆమె గురించి అప్పటికే విని వున్నాను. నర్మదా ఉద్యమం గురించి, నిర్వాసితుల సమస్యల గురించి, ప్రభుత్వాల విధానాలు, చట్టాలు-ఇలా అనేక విషయాలు ఆమె ఆ సభలో చెప్పింది. ఆమె అద్భుతమైన ఉపన్యాసకురాలు. సమయం దొరికినప్పుడు ఆ రెండు రోజులు ఆమెతో ఈ అంశాల మీద నాకున్న ప్రశ్నలను వేస్తూ, మాట్లాడుతూ వెళ్ళాను. ‘మీరు పాల్గొనే అన్ని సభలను ఎవరైనా డాక్యుమెంట్ చేస్తున్నారా’ అని అడిగాను. దానికి ఆమె ‘ఎవరూ పూర్తి కాలం లేరని, ఎవరన్నా అలా వాలంటీర్ గా వచ్చేవాళ్లు వుంటే చెప్పమని’ అడిగింది. ఆమె ఎలా అంటే,  ‘అందరూ తిన్నారా లేదా, మాట్లాడారా లేదా ఇవన్నీ చాలా కేరింగ్ గా పట్టించుకునే మనిషి.  ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడే నేను నా స్నేహితులు ఒకళ్లిద్దరిని అడిగి చూశాను కానీ ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు నాకే -మేథాపాట్కర్ చాలా కమిటెడ్ గా పనిచేస్తున్న వ్యక్తి. ఆమెతో కలిసి పనిచేస్తే నేను కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు, అవగాహన పెరుగుతుంది, నేనే ఎందుకు వెళ్లకూడదని అనిపించింది!

రెండోరోజే ఆమెతో ‘నాకు రావాలనుందని’ చెప్పాను. నా ఆలోచనను ఆమె వెంటనే అంగీకరించలేదు. “అచ్ఛా, ఆప్ ఏక్ మెహెనే కేలియే దేఖ్నా, హమారా కామ్ ఆప్కో పసంద్ హైతో  బాద్మే దేఖెంగే” అని చెప్పింది. నేను కూడా పూర్తి కాలం అనుకుని ముందు అక్కడికి వెళ్లలేదు. ఒక నెల చూద్దామనే వెళ్ళాను. కానీ, అలా ఇంకో నెల, ఇంకో నెల  అంటూ పొడిగించుకుంటూ వెళ్లిపోయాను. మేథా చాలా విస్తృతంగా ప్రయాణాలు చేస్తుంది. తనతో అలా ప్రయాణం చేయడం నాకు ఉత్సాహంగా వుండేది. నర్మదా వ్యాలీ లో సమయం గడపటంతో పాటు, దేశం నలుమూలల్లో జరిగే అనేక పోరాటాలను తనతో ప్రయాణించడం ద్వారా ప్రత్యక్షంగా చూశాను. నందిగ్రామ్, సింగూర్ వంటి ఎన్నో పోరాటాలతో ప్రత్యక్ష పరిచయం ఏర్పడింది మేథా వల్లనే. తను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లి ఆ ఉద్యమాలను డాక్యుమెంట్ చేశాను.

2008లో వెళ్లిన నేను 2016 వరకూ అక్కడే ఉండిపోయాను. దాదాపు తొమ్మిది సంవత్సరాలపైనే అక్కడ పూర్తి కాలం పనిచేశాను. మధ్యలో కేవలం రెండు మూడు సార్లు వచ్చి అమ్మని చూసి వెళ్ళాను. అమ్మ కూడా నా దగ్గరికి వచ్చి వెళ్ళింది. మేథా ఎలా అంటే తనే ఒక వ్యవస్థ. యాభై రకాల పనులు ఏకకాలం లో చేసేది.  ఆమెకు చెప్పలేనంత శక్తి సామర్ధ్యాలు వున్నాయి. చాలా ఓపిక ఎక్కువ. ఆమె పనిని చాలా నిబద్ధతతో, ప్రేమతో చేస్తుంది. ప్రజలకు అన్యాయం జరుగుతోంది, మనమేమన్నా చేయాలి అనే తపన తనలో ఎంతో ఎక్కువ. ఆమెలో వున్న ఆ అంశం తోనే నేను ఎక్కువ ప్రభావితం అయ్యాను. వాతావరణం ఎంత నిరాశాపూరితం గా వున్నా గానీ ఆమె దానిని చైతన్యవంతం గా మార్చేసేది. కొత్త కొత్త ఎత్తుగడలను ముందుకు తీసుకురావటంలో కూడా సృజనాత్మకంగా ఆలోచిస్తుంది. పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలి, ప్రభుత్వాలతో ఎలా చర్చించాలి, ఏ విధానం లో ఉద్యమాన్ని చేయాలి అనేదాంట్లో బాగా వినూత్నంగా వుండేది. వీటన్నిటితో నేను ఆమె నుంచి చాలా నేర్చుకున్నాను. అలానే, నా లోలోపలి ఆలోచనలకు ఒక మార్గం కనబడటం మొదలైంది. నర్మదా ఆందోళనతో పాటు NAPM (నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్)(ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక) లో నేను బాగా పనిచేయటం మొదలెట్టాను.

NAPM మొదటినుంచీ కూడా దేశవ్యాపితంగా ఒక టీం గానే పనిచేసేది. చాలామంది కార్యకర్తలు పనిచేసేవారు. ఇప్పుడు కూడా మేము ఒక టీమ్ గా దాదాపు పదిహేడుమందిమి జాతీయ సమన్వయ బాధ్యతలు తీసుకున్నాం. అలానే మేథా నర్మదా ఆందోళన్ కు కూడా సమయం ఎక్కువ కేటాయిస్తారు. ఆమెతో కలిసి ఇన్ని రకాల అంశాలతో కలిసి పనిచేయటం లో నేను అనేక అంశాలు నేర్చుకున్నాను. అంతకు ముందు నా ప్రపంచం చాలా చిన్నది. కొన్ని విషయాలకే పరిమితం. కానీ, ఇక్కడ నా పరిధి పెరిగింది. రైల్వే కార్మికుల పోరాటంలో చాలా విస్తృతంగా పాల్గొన్నాను. గూర్ఖాలాండ్ అంశం మీద రెండు సార్లు అక్కడికి వెళ్లాను. ఉప్పు కొటార్లలో పనిచేసే కార్మికుల సమస్యపై పనిచేసాను. నర్మదా వంటి పెద్ద స్థాయి ఉద్యమంలో పూర్తికాలం  పనిచేయటం అనేది ఒక సందర్భంలో ఎదురైంది. అప్పటివరకూ ఇలా అనేక అంశాలతో వున్న చిన్న చిన్న ఉద్యమాలతో కలిసి పనిచేస్తూ వచ్చాను.

నర్మదా లో ఆశిష్ అని ఒక మిత్రుడు వుండేవాడు. చాలా మంచి కార్యకర్త. మొదట్లో స్కూల్ లో చదువుకునేటప్పుడు అరెస్సెస్ తో పనిచేసాడంట! ఆ ప్రాంతంలో ఇలాంటి సంస్థలు తప్పించి ప్రత్యామ్నాయ రాజకీయాలకు వేదిక లేకపోవటం ఒక కారణం. నర్మదా బచావో ఆందోళన్ మొదలైన తర్వాత ఆరెస్సెస్ తో ముడిపడి వున్న అంశాలను అర్థం చేసుకుని హిందుత్వ రాజకీయాల మీద విమర్శనాత్మకం గా వుండటం మొదలుపెట్టాడు. నర్మదా ఉద్యమం స్థానికంగా వున్న యువతను హేతుబద్ధమైన ప్రజా ఉద్యమాలలోకి కూడగట్టగలిగింది. ఇది కేవలం జీవనోపాధులకు సంబంధించిన అంశం మాత్రమె కాదు. తమ సాంస్కృతిక జీవన విధానానికి సంబంధించిన విషయం కూడా. నర్మదా నదిని మధ్యప్రదేశ్ ప్రజలు  తమ జీవధారగా భావిస్తారు. జనజీవితం మొత్తం ఆ నది చుట్టూ పెనవేసుకుని వుంటుంది. అలాంటి నదిని, నది చుట్టూ వున్న  జీవావరణాన్ని అభివృద్ధి పేరుతో  ధ్వంసం చేయటం వెనుకవున్న రాజకీయాలను ఆశిష్ లాంటి యువకులు బాగా గ్రహించగలిగారు. తను అనుకోకుండా చిన్న వయసులోనే గుండెపోటుతో మే 20 న చనిపోయాడు. చాలా ఎక్కువగా సిగరెట్లు తాగేవాడు. అయితే ఆ కారణంతో చనిపోలేదు. వాళ్ళ అక్క భర్త చనిపోయాడని కబురు వస్తే చాలా దూరం నుంచి 7-8 గంటలు వేసవి ఎండలో బైక్ నడుపుకుని వచ్చాడు. అంత్యక్రియలు ముందుండి జరిపించాడు. అన్నీ పూర్తి చేసి ఇంటికి వచ్చి గుమ్మంలో కూర్చుంటుండగానే తీవ్రంగా గుండెపోటు రావటంతో అక్కడికక్కడే చనిపోయాడు. నర్మదా ఉద్యమంలో అతను చాలా ముఖ్యమైన వ్యక్తి.  ఈ ఉద్యమంలో వివిధ రకాలైన కార్యకర్తలు వుండేవారు. కానీ కొంతమందే మనుషుల మధ్య అనుసంధానంగా వుండేవారు. ఆశిష్ అలాంటి వ్యక్తి. తను అలా చనిపోవడం మాకు ఊహించని షాక్ లాగా అయింది.

ఆశిష్ చనిపోయిన మే నెలలో అప్పటినుంచి ప్రతి సంవత్సరం నాలుగైదు రోజుల పాటు ఒక యువ సమ్మేళనాన్ని జరుపుతున్నాం. ఇప్పటికి పదేళ్ళనుంచి జరుపుతూనే వున్నాం. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ ఉద్యమాల్లో పనిచేస్తున్న యువత వచ్చి తమ తమ అనుభవాలను పంచుకుంటారు. చాలా ఉత్సాహంగా వుంటాయి ఈ సమావేశాలు. ఆశిష్ వాళ్ల తల్లితండ్రులు కూడా ఉద్యమంలో చాలా సహాయంగా వుండేవారు. వాళ్ల నాన్న కూడా ఆ తర్వాత కొద్ది కాలానికి చనిపోయారు. అమ్మ విద్య, మా అందరితో ఇప్పటికీ ఎంతో ఆత్మీయంగా వుంటుంది. మా అందరిదీ ఒక విశాలమైన కుటుంబం గానే భావిస్తాము. రక్త సంబంధమే కుటుంబం కానక్కరలేదు!

క్లిప్టన్ అని ఒక లాయర్ వుండేవారు. కర్నాటక నుంచి వచ్చారు. తను కూడా ఆశిష్ లానే ఉద్యమంలో ముఖ్యమైన వ్యక్తి. ఆశిష్ చనిపోయిన తర్వాత జరిపిన యువ సమ్మేళనంలో కలిసి నాతో మాట్లాడారు. నన్ను పూర్తి కాలం ఇక్కడే పనిచేయటానికి వీలవుతుందా అని ఆయన అడిగారు. అప్పటివరకూ నేను మేథాతో కలిసి అన్నీ ప్రాంతాలకు వెళుతున్నాను. అలానే కొంత సమయం నర్మదాలో కూడా ఇస్తున్నాను. పూర్తి కాలం పనిచేయగలుగుతానా  అని చాలా ఆలోచించాను. పూర్తి కాలం చేస్తే నేను ఇంక బయటకు వెళ్ళటానికి వుండదు. ఆలోచించి చెబుతానని సమయం కావాలని అడిగాను. అయితే అప్పటికి నా ఉనికి మీరా దీదీ గా మారలేదు. ఆ ఆలోచనలు లోపల సుళ్లు తిరుగుతున్నాయి కానీ, వాటిని ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కావటం లేదు. మేథాతో ఎవరో ఒకరు వెళ్ళటం  అవసరమే కానీ, ఎవరూ లేకపోయినా కానీ తను పనిచేయగలిగే సమర్ధురాలు అని నాకు అప్పటికే అర్ధం అయింది. నాకు ఒక రకంగా నిర్ణయం తీసుకోవటం సవాలుగానే అనిపించింది . ఒక కార్యకర్త గా పూర్తి సమయం ఇవ్వటం ఉద్యమానికి అవసరం, అలానే నేను ఎక్కువ భాగం ఉద్యమంతో పనిచేయడం నా ఉనికికి కూడా ముఖ్యమే అని భావించాను. అదీకాక, ఇక్కడి ప్రజలతో ఒక అనుబంధం ఏర్పడింది. వాళ్ళతో చాలా కలిసిపోయాను. అదే నన్ను పూర్తికాలం సమయం ఇవ్వటానికి అంగీకరించేలా చేసింది.

ఉద్యమమంటే ఒకటే పని కాదు కదా! అన్ని రకాల పనులూ వుంటాయి. కోర్టులనుంచీ, ప్రభుత్వ ఆఫీసులు, పోలీసు స్టేషన్ల  చుట్టూ తిరగటం, మైదాన ప్రాంతాల్లో, గ్రామాల్లో సమావేశాలు, అడవుల్లో ఆదివాసీలతో సమావేశాలు, చర్చలు, ప్రచారోద్యమాలు ఇలా అనేక రకాలుగా పనిచేయాలి. అన్నిఅంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విషయాలలో ప్రజలు చాలా అనుభజ్ఞులు. అలానే గ్రామ కార్యకర్తలు కూడా. నేను వాళ్ల నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహిళల్ని. ఏ ఉద్యమానికైనా జీవధార మహిళలే. ఆదివాసీ, దళిత, మత్స్యకార, భూమిలేని మహిళలే నర్మదా ఉద్యమానికి పునాది. నాకు స్పూర్తిదాయకమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.

నర్మదా బచావో ఆందోళన్ నేపధ్యం చాలా ఆసక్తికరం గా వుంటుంది. 80వ దశాబ్దం మధ్య నుంచీ ఈ ఉద్యమం మొదలైంది. అప్పటినుండి ఎన్నోరకాల పోరాటాలు, ఆందోళనా పద్ధతులు ముందుకు వచ్చ్హాయి. భారీ డ్యాముల వల్ల జరిగే విధ్వంసాన్ని ఈ ఉద్యమం చర్చకు తీసుకు వచ్చింది. పునరావాసం లో తలెత్తే ఎన్నో సమస్యలను, అధికారుల , రాజకీయ నాయకుల అవినీతిని స్పష్టం గా వెలికి తీయగలిగింది. ఇది కేవలం కొద్ది జనాభాకు సంబంధించిన వ్యవహారం మాత్రం కాదు. నర్మదా లోయ అభివృద్ధి పేరుతో మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తలపెట్టిన డ్యాముల వల్ల కోట్లాదిమంది మంది  ప్రజలు నిర్వాసితులవుతారు. నర్మదా లోయ పురావస్తు ప్రాధాన్యత, పురాతన మానవ నాగరికత దెబ్బతింటుంది. ఎన్నో ఆదివాసీ సమూహాలు చెల్లాచెదురవుతాయి. నది మీద ఆధారపడ్డ మత్స్యకార సమూహాలు జీవనాధారం కోల్పోతాయి. ఆహారభద్రతనిచ్చే వ్యవసాయ భూములు, పర్వత శ్రేణులు, సహజవనరులు అన్నీ ధ్వంసం  అయిపోతాయి. ఇది చాలా విషాదకరం.

నర్మదా నది చాలా పెద్దది. దాదాపు 1312 కిలోమీటర్ల పైన దూరం ప్రవహిస్తూ వుంటుంది. ఈ నదిలో ఎక్కువభాగం మధ్యప్రదేశ్ లో వుంటుంది. తర్వాత మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వుంటుంది. ఇది తమ జీవాడోరి(జీవధార)గా మధ్యప్రదేశ్ ప్రజలు భావిస్తారు. నర్మదా నది వారి సంస్కృతిలో భాగం, వారి జీవనాధారం. నది మనుగడే వారి మనుగడ. నది చుట్టూ వారి జీవితాలు పెనవేసుకుని వుంటాయి. మూడు రాష్ట్రాల్లోని 20 జిల్లాల్లో ఈ నది ప్రవహిస్తుంది. నదీ పరీవాహక ప్రాంతం చాలా ఎక్కువ. అభివృద్ధి పేరు మీద ఇక్కడ ఈ నది మీద 3000 చిన్న డ్యాములు, మధ్యతరహా డ్యాములు 135, పెద్దవి 35 కట్టాలనేది నర్మదా వ్యాలీ డెవలప్మెంట్ ప్రాజక్ట్ లక్ష్యం. వీటి లో చిన్న తరహా డ్యాముల నిర్మాణం 1970లలోనే ప్రారంభమయింది. అయితే ప్రజల వ్యతిరేకతతో మధ్య, పెద్ద డ్యాములను కట్టలేకపోయారు. కట్టిన వాటి రిజర్వాయర్లను కూడా నీటితో నింపలేకపోయారు. అనుప్పూర్ జిల్లాలో జబల్పూర్ దగ్గర మొదలయ్యే నదీ ప్రాంతాన్ని అమర్ కంటక్ అంటారు. అక్కడి నుంచి మొదలయ్యే డ్యాములు బర్గి, తవ, ఓంకారేశ్వర్, ఇందిరాసాగర్, వేద, మాన్, జోబట్, సర్దార్ సరోవర్ ఇలా వుంటాయి.  ఎక్కువ భాగం ఆదివాసీ ప్రాంతాల్లో వున్నాయి. సర్దార్ సరోవర్ డ్యామ్ అన్నిటికంటే పెద్దది. ఈ ప్రాజక్ట్ లో గుజరాత్ లో వుండే డ్యామ్ ఇదొక్కటే. కానీ దీని కింద మునిగిపోయే భూమి ఎక్కువ భాగం మధ్య ప్రదేశ్ లో 192 గ్రామాలు, ఒక పెద్ద పట్టణం ధర్మపురి, మహారాష్ట్ర లో 33 గ్రామాలు, గుజరాత్ లో 20 గ్రామాలు వుంటాయి.

నిజానికి 90వ  దశాబ్దంలోనే పైన చెప్పిన అన్నీ ప్రాంతాలు మునిగిపోవాల్సింది. కానీ, ఇప్పటికీ అంటే ఈ 2019 లో కూడా ఇంకా మనుగడలో వున్నాయంటే కారణం కేవలం ప్రజల నిరంతర పోరాటం వల్లనే సాధ్యమైంది. మూడు దశాబ్దాల వైవిధ్యభరితమైన పోరాటం. ప్రాణాలకు తెగించి నిలబడిన ప్రజలు. మరోవైపు, న్యాయస్థానాల్లో ఎడతెగకుండా న్యాయం కోసం చేసిన పోరాటాలు, ప్రభుత్వ విధానాల డొల్లతనాన్ని ఎత్తిచూపించే పరిశోధనలు, ఇతర ప్రాంతాల నుంచీ వచ్చిన సంఘీభావం, వీటన్నిటివల్లా సాధ్యమైంది. వొత్తిడి అన్నివైపులా నుంచీ పెట్టగలిగినా గానీ కొన్ని గ్రామాలు మునిగిపోయాయి. ఇది ఉద్యమ ప్రారంభ సంవత్సరాలలో. డ్యామ్ ఎత్తును క్రమక్రమంగా పెంచుతూ పోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. గుజరాత్, మహారాష్ట్ర లలో అన్నీ ఆదివాసీ గ్రామాలే మునిగిపోయాయి. మధ్యప్రదేశ్లో కూడా అంతే. డ్యామ్ ఎత్తు పెంచుతూ పోయినప్పుడల్లా మరికొన్ని గ్రామాలు మునిగిపోతూ వచ్చాయి. గ్రామాలు మునిగినప్పుడల్లా ఆదివాసీ ప్రజల ఆవాసాలు, వ్యవసాయం కొండల పైకి జరుగుతూ వుంటుంది. ఇవన్నీ వింధ్యా సాత్పూరా పర్వత శ్రేణిలో వుంటాయి. అత్యంత విలువైన పర్యావరణ ప్రాంతం. ఆదివాసీల జీవితం చాలా కఠీనమైన శారీరిక శ్రమతో కూడుకుని వుంటుంది. ప్రాథమిక అవసరాల కోసం , పనుల కోసం ఎంతో దూరం నడిచి వెళ్ళాల్సి వుంటుంది. కొండలు ఎక్కీ దిగాలి. అంత్యోదయ, ఉపాధి హామీ పని, అంగన్వాడీ సెంటర్ల ఏర్పాటు కోసం కూడా ఎన్నో పోరాటాలు చేయాల్సి వుంటుంది. వీటి అమలులో ప్రభుత్వాల అలక్ష్యం చాలా ఎక్కువ. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వ్యవసాయం చేస్తూనే వుంటారు. అదేవారి జీవనాధారం.

సర్దార్ సరోవర్  ప్రాజక్ట్ మొత్తం కట్టాలనుకున్న ఎత్తు 138.68మీటర్లు. 2006వరకూ 121.92 మీటర్లు పెంచారు. ఈ ఎత్తే అసలు చాలా పెద్దది. మనం వూహించలేము దాని విస్తీర్ణాన్ని! నిజానికి ఇక్కడ జరుగుతున్న రాజకీయమేమిటంటే, ఇది ఎంతసేపటికీ పునరావాసానికి సంబంధించిన విషయంగానే బయటకు వస్తుంది గానీ, ఇందులో ఇమిడి వున్న అనేక అంశాలను బయటకు రానీయదు. నర్మదా ఆందోళన్ అనేక ప్రాథమికమైన అంశాలను లేవనెత్తింది. అసలు ఇంత భారీ ప్రాజక్టులు అవసరమని ఎవరు నిర్ణయిస్తారు? ఎత్తుని నిర్ణయించేది ఎవరు? వస్తాయని చెబుతున్న నీళ్లు ఎవరికి పంచాలని అనేదాంట్లో నిర్ణయం ఎవరిది? ఇవి ఎవరికి అవసరం? ఇందులో ఇమిడి వున్న ఆర్ధిక అంశాలేమిటి? నిర్మాణ వ్యయానికి ప్రతిరూపంగా వచ్చే లాభం ఏమిటి? ఇలా ఎన్నో ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఇంకా వాటిని సంధిస్తూనే వుంది. అడవులను నిర్మూలించే ప్రాజెక్టులతో వచ్చే పర్యావరణ ముప్పులను, భూకంపాల ప్రమాదాలను అనేక పరిశోధనల ద్వారా బయటకు తీసుకురాగలిగింది.

2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ వచ్చాడు. దాదాపు 13 సంవత్సరాలపాటు అక్కడ అధికారంలో వున్నాడు. ఈ పదమూడు సంవత్సరాలు కూడా రిజర్వాయర్ లో వున్న నీళ్లని కూడా పూర్తిగా వాడలేదు. కాలువల నెట్వర్క్ ని అభివృద్ధి చేయలేదు. కాలువల్లో  చిన్న కాలువలు, మధ్యస్థంగా వుండేవి, చివర్లో వుండాల్సిన పిల్ల కాలువలు ఇలా ఇంత పెద్ద వ్యవస్థని పట్టించుకోకుండా కేవలం పెద్ద డ్యాములు , పెద్ద కాలువలు కట్టేసి మిగతావాటిని వదిలేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్మాణాల కోసం అంటూ కోట్లాది రూపాయలు తీసుకుంటూ కెనాల్ నెట్వర్క్ ని నిర్లక్ష్యం చేశారు. చాలా పెద్ద అవినీతి కథ ఇది. 2015 వరకూ కూడా ఇది 30-35% కంటే ఎక్కువ పూర్తి కాలేదు. దీనివల్ల వున్న నీళ్లనే రైతులకు సక్రమంగా అందించలేకపోయారు. కానీ, దానిని ఒప్పుకోకుండా, డ్యామ్ నిర్మాణానికి ఉద్యమం అడ్డుపడుతోందని, అందుకే గుజరాత్ లోని రైతులకు నీళ్లు అందించలేకపోతున్నామని దుష్ప్రచారం చేయటం. ఉద్యమం లో వున్న ప్రజలు అభివృద్ధికి వ్యతిరేకులు అని ప్రచారం చేయటం. నిజానికి వున్న నీళ్ళనే ఎలా వాడుకోవాలన్న ప్రణాళికే వాళ్ల దగ్గర లేదు. అది కూడా ఉద్యమమే చెబుతూ వచ్చింది. వీటన్నిటి గురించి ఎన్నో క్షేత్రస్థాయి పరిశోధనలు, సర్వేలు చేసాం. కనీసం వున్న నీళ్లతో కరెంటు ని కూడా ఉత్పత్తి చేయలేకపోయారు. డ్యామ్ ఎత్తు పెంచటం అనే ఎజెండా తప్ప వాళ్ల దగ్గర ఇంకో ఆలోచనే లేదు. అయితే అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కావటంతో ఇంకేమీ చేయలేకపోయాడు. అయితే గత దశాబ్ద కాలం నుంచీ ప్రజలు కూడా ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని బాగా గ్రహించగలుగుతున్నారు. ప్రభుత్వ ప్రచారంతో మధ్యప్రదేశ్ ప్రజల వాళ్ళ తమకు నీళ్లు రాలేదని అనుకుంటున్నా గుజరాత్ రైతులు కూడా అసలు జరుగుతున్న మోసాన్ని గ్రహించారు. అక్కడ వుండే చాలా మంది యాక్టివిస్టులు కూడా నర్మదా అంశంలో ముందు మేథా పట్ల కొంత వ్యతిరేకతతో వుండేవారు. ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని చాలా వరకు మార్చుకున్నారు. ‘నర్మదా కి లడాయి’ అని ఇన్ని సంవత్సరాల పోరాటం మీద, ప్రభుత్వ వంచన ఎలా జరుగుతుందో మేథా చాలా అద్భుతమైన పాట కూడా రాసారు.

2006 నుంచీ 2014 వరకూ డ్యామ్ ఎత్తు పెంచలేకపోయారు. 2014లో మోదీ ప్రధానిగా వచ్చాడు. సత్రా కా కత్రా అని అంటారు మా వాళ్లు! అంటే పదిహేడు రోజుల్లో వచ్చిన ప్రమాదం. వచ్చిన 17 రోజుల్లోనే డ్యామ్ ఎత్తు పెంచాలనే నిర్ణయం తీసేసుకుంది ఈ బిజెపి కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమంటే, వాళ్లు డ్యామ్ నిర్మాణాన్ని పెంచడమయితే చేయగలిగారు కానీ 2014 నుంచీ ఇప్పటివరకూ కూడా ఆ గేట్లను కిందికి దించలేకపోయారు. ఈ మొత్తం డ్యామ్ చరిత్రంతా కూడా చట్టవిరుద్ధమైన వ్యవహారాలతోనే వుంటుంది. ఫుల్ ఆఫ్ ఇల్లీగాలిటీస్. ముందు అసలు ఎవర్నయితే పెద్ద సంఖ్యలో నిర్వాసితులని గుర్తించారో వాళ్ళని అకస్మాత్తుగా అధికారికంగా నిర్వాసితుల లెక్క లోనుంచి తీసేశారు. బాక్ వాటర్స్ లెక్కనంతటినీ తారుమారు చేసేశారు. ఎంత పెద్ద అవినీతి చోటుచేసుకుందో చెప్పలేం! నష్టపరిహారం ఇవ్వడంలో అవినీతి, పునరావాసం అమలు చేయడంలో అవినీతి పెద్ద స్థాయిలో జరిగాయి. మొత్తం ఈ క్రమంలో నిర్ణయం జరిగే విధానమే అవినీతితో కూడుకుంది.  వీళ్లు ఒక్కో వ్యవస్థని ఎలా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారంటే, సెంట్రల్ వాటర్ కమిషన్ , మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇలా ముఖ్యమైనవన్నీ ఈ అవినీతి చట్రంలో భాగమై పోయి నిర్ణయాలను మార్చేశారు. ఇవన్నీ కూడా మనకి కనువిప్పు కలిగించే ఉదాహరణలు. వీళ్లంతా కలిసి ప్రజల జీవితాలను పేపర్ల మీదే తారుమారుచేసేశారు. ఒకపక్క అలా నిర్వాసితుల సంఖ్యను తగ్గించేయటానికి చూశారు. ఇంకోపక్క డ్యామ్ ఎత్తు పెంచటానికి నిర్ణయం పేపర్ల మీదే జరిగిపోయింది. అయితే, ప్రజల వైపు నుంచీ పట్టుదలగా వున్న ఉద్యమం వల్ల ఇప్పటికీ కూడా ఆ గేట్లను కిందికి దించడం అనేది సాధ్యమే కాలేదు.

మరొక బాధాకరమైన విషయమేమంటే, అక్రమంగా అనేక ఇసుక తవ్వకాలు జరిగిపోతున్నాయి. దీనితో నదీ పరీవాహక ప్రాంతమంతా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. నగరీకరణ పెరిగే కొద్దీ ఇసుక అక్రమ తవ్వకాలు పెరుగుతాయి. ఉద్యమంలో కూడా ఇలా కొత్తగా వచ్చే అనేక అంశాలను పరిగణన లోకి తీసుకుంటూనే వాటి మీద కూడా పోరాటరూపాలు ఏర్పర్చుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఈ తవ్వకాలను అడ్డుకున్నందుకు  మా కార్యకర్తల మీద ఇసుక మాఫియా దాడి కూడా చేశారు. మా ఆఫీసు ని ధ్వంసం చేశారు. ఇసుక తవ్వకాలను, వాటిని చేరవేసే లారీలను అడ్డుకోవటం ఇలా వీటన్నిటితో మా సమయం దానికి చాలా కేటాయించాల్సి వచ్చింది. ఈ పని ఎంత సీరియస్ గా చేసామంటే, సర్దార్ సరోవర్ ప్రాంతంలో ఇసుక తవ్వకాలను కొంతమేరకు ఆపగలిగాము. ఒకరోజులో 200 పైన తరలించే ఇసుక లారీల సంఖ్య మా పోరాటం వల్ల 40-50 వరకూ కుదించబడ్డాయి. ఇదంతా కూడా మాకు చాలా పెద్ద సవాలుగా నిలిచింది. మేము వాటిని తగ్గించడానికి ప్రయత్నించడం, మళ్లీ కొన్ని రోజుల తర్వాత లారీల సంఖ్య పెరగటం, మేము ఆందోళనకు దిగటం అంతా ఒక క్రమంలో జరుగుతూ వుండేవి. ఈ ఇసుక తవ్వకాలతో నదే  ఇప్పుడు ఎంతో దయనీయమైన         పరిస్థితిలోకి నెట్టబడింది.

గ్రామాలు మునిగిపోవటం అనేది ఒకప్పుడు చాలా పెద్ద సమస్య. జనాల్ని భయపెట్టి ముంపుకు గురిచేయాలంటే నిర్మాణాలు జరగాలి.  పైనున్న డ్యామ్ లకు నీళ్ళు వదిలి  అప్పుడు ఈ గేట్లు కిందికి దించాలి. ఇదంతా ఇప్పుడు ఎందుకు జరగటం లేదంటే ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత. 2006-2014 వరకూ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వుండేది. వాళ్లేమి అంతా గొప్పవాళ్లు కాదు, వాళ్ల పాలనలోనే ఈ అవినీతి కొద్ది స్థాయిలో మొదలైంది. అయితే, యూపీఏ సమయంలో ప్రమాదం మరీ మెడ మీద కత్తిలాగా లేదు. అంతే కాకుండా, యుపీయే సమయం లో పునరావాసం గురించి చాలా పెద్దఎత్తున చర్చ జరిగింది. ఇది ముఖ్యమైన అంశం. ఆ తర్వాత వచ్చిన బిజెపి పాలన అవినీతిని వ్యవస్థీకృతం చేసి వికృతరూపంలోకి మార్చింది. అధికారం లోకి రావటం రావటమే నిర్మాణాన్ని మొదలెట్టేశారు.

అన్ని డ్యామ్ ప్రదేశాలలో మొదట జరిగేది ఆర్ధిక పరమైన స్కాములే. అన్ని ప్రదేశాల నుంచీ ఒకటే రకమైన ఫిర్యాదులు వచ్చేవి. వీటన్నిటి నుంచి మేము నేర్చుకున్నదేమిటంటే, ప్రతి గ్రామంలో కింది స్థాయి వరకూ పనిచేయాల్సిందే, ప్రతిఒక్కరికీ సమాచారం అందాల్సిందే. మా ఉనికి కనీసం 150 నుంచీ 175 గ్రామాల్లో చురుకుగా వుండేది. మిగతా గ్రామాలు కూడా కలిసి వస్తూ వుండేవి. వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ కొద్దిపాటి మానవ, ఆర్ధిక వనరులతోనే ఉద్యమాన్ని నడిపేవాళ్లం. ఏదీ కూడా ngo పని కాదు. మేథా చాలా సమయం దీనికోసమే పెట్టేవారు.

పునరావాసం కోసం వెయ్యి కోట్లు విడుదల అయితే ప్రజల వరకూ చేరింది చాలా తక్కువ. అవినీతి మయం. కాంట్రాక్టర్ లను పెంచటానికి ఉపయోగపడ్డాయి. అవసరమైన చోట కాలువలు తవ్వలేదు, అనవసరమైన చోట తవ్వారు. కాంట్రాక్టర్ల లాభం కోసం వేలాది ఎకరాల సారవంతమైన పంటభూములను నాశనం చేసారు. పోరాటం వల్లనే దీనిమీద జస్టిస్ ఝా కమిషన్ ఏర్పాటయింది. వేలాది మంది రైతులు ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంతో ప్రత్యక్షంగా వాంగ్మూలాలు ఇచ్చారు. ఈ అవినీతిని వెలికితీయడానికి అనేక విధాలుగా పోరాటం చేయాల్సి వచ్చింది.

మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, 2000 , 2005 సంవత్సరాలలో రెండు ముఖ్యమైన తీర్పులు సుప్రీమ్ కోర్ట్ ఇచ్చింది. భారీ డ్యాములు కట్టే ప్రణాళిక ముందుగానే, అక్కడ ప్రభావితమయ్యే ప్రజలకు, అలానే పర్యావరణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పనిసరిగా చూపించాలని స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని ఆధారం చేసుకుని మరెన్నో పోరాటాలను ముందుకి తీసుకెళ్లగలిగాం. బడవాని అనే ప్రాంతంలో జాగృతి ఆదివాసి సంఘటన్ అని సంఘం వుండేది. వారితో కలిసి ఆరోగ్యం, జీవనోపాధులు వంటి అనేక అంశాల మీద నర్మదా బచావో ఆందోళనగా కలిసి పనిచేసేవాళ్ళం. కలిసి వచ్చే స్థానిక సంఘాలతో పనిచేయడమనేది ముఖ్యంగా వుండేది. బ్రిటిష్ కాలం నాటి నిర్భంధపూరిత భూసేకరణ చట్టంలో మార్పులు జరిగి 2013 భూసేకరణ, పునరావాస హక్కు చట్టం వచ్చిందంటే దానికి కారణం నర్మదా బచావో లాంటి అనేక ఉద్యమాల వల్లనే సాధ్యమయిందని గుర్తుంచుకోవాలి.

ఇక్కడ నిరక్షరాశ్యత చాలా ఎక్కువ. కొద్దిపాటి చదువుకున్నవాళ్లు కూడా హింది రాసేటప్పుడు ఎన్నో తప్పులతో రాసేవాళ్ళు. పాఠశాలల పరిస్థితి దయనీయం. ఆదివాసీ ప్రాంతాలయితే అసలు చెప్పనవసరం లేదు. మేము కేవలం భూనిర్వాసితుల సమస్యనే కాకుండా ఈ అంశాల మీద కూడా చాలా పనిచేశాము. ఆదివాసీ ప్రాంతాలలో గ్రామాలు చాలా విసిరేసినట్లు వుంటాయి. టీచర్లు అంత దూరం వెళ్లరు. సౌకర్యాలు వుండవు. అన్నిరకాల సమస్యలు వుండేవి. అంగన్వాడీ, స్కూలు ఇలా అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి స్పష్టంగా కనిపిస్తూ వుండేది. ఇక వైద్య సౌకర్యాలు అంతంతమాత్రం. ఇలా ప్రజల నిత్య జీవితంలో వుండే అన్ని సమస్యల మీదా పనిని సమన్వయం చేస్తూ వుండేవాళ్లం.ఇలాంటి నేపథ్యంలో పునరావాసం అనేది చాలా పెద్ద సమస్య. నర్మదా ఆందోళన్ లో ప్రారంభ సమయాల్లో భూమికి భూమి అనే నినాదం వుండేది. ముంపులో ఎంత భూమి కోల్పోతే అంత భూమి ఇవ్వాలనేది  ఆ డిమాండ్. అలా కొంతమందికి భూమికి భూమి వచ్చింది. ఇదేమంత సులభం కాలేదు. చాలా గొడవలు అయ్యాయి. అప్పుడు ఉద్యమం చాలా బలంగా ఉధృతంగా వుండేది. మొదట్లో డ్యామ్ ని 121 మీటర్ల ఎత్తు వరకూ అలా తొందర తొందరగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ క్రమం లో కొంతమందికి భూమి ఇచ్చారు. దాదాపు పధ్నాలుగున్నర వేల మంది  భూమిని పొందగలిగారు. ఇది కేవలం ఉద్యమం ఉండటం వల్ల మాత్రమే సాధ్యమయింది.  ఇది చాలా ముఖ్యమైనది. కాలువల తవ్వకాలో భూములు కోల్పోయినవాల్లకు కూడా భూములు ఇప్పించగాలిగాము. దీనిలో భూమిలేని కూలీలు, మత్స్యకారులు ఇలా అనేకమంది ఉన్నారు. భూమికి భూమి, ఇల్లు కట్టించడం అన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యమైన అంశాలు. నిజానికి ఇవన్నీ అమలు చేస్తామని ప్రభుత్వం పేపర్లలో చెప్పినప్పటికీ వాటిని వాస్తవంగా అమలులోకి తీసుకు రావటం అనేది అనేక సవాళ్ల తో కూడుకున్నది. వీటికోసం కేటాయించిన నిధులను సకాలంలో విడుదల అయ్యేలా చూడటం, అవినీతి జరగకుండా అప్రమత్తంగా వుండటం వంటి ఎన్నో సవాళ్లు ఉద్యమం ముందు వుండేవి. అయినాగానీ, రాజకీయ, అధికార వర్గాల నుంచీ అవినీతి వ్యవస్థీకృతంగా వుండేది. మేము చేసిందేమిటంటే, వీటిని అరికట్టేలా ప్రజలే అప్రమత్తంగా పర్యవేక్షించేలా చేయడం. మొత్తం గ్రామీణ ప్రజలే, ఈ పర్యవేక్షణ బాధ్యతలు  తీసుకున్నారు.

ఇదంతా మొదటి విడత ఉద్యమంలో జరిగిన అంశాలు. రెండో విడతలో 2006 నుంచీ పునరావాసం గురించి అప్పటివరకూ వున్న చట్టాల బలాన్ని నీరుగార్చటానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఇక్కడ కొంతమంది గ్రామీణ కార్యకర్తల గురించి గుర్తు చేసుకోవాలి. చాలామంది ఉన్నారు కానీ, కొంతమంది గురించి ప్రస్తావిస్తాను. సీతారాం బాబా ఎనభై ఏళ్ల వృద్ధుడు. ఎంత పెద్ద మీటింగ్ అవనీ, ఎంతమంది మహామహులైన అధికార్లు , నాయకులూ ఉండనీ, ప్రభుత్వాలు రాజకీయనాయకులు చేస్తున్న మోసాన్ని కథలు కథలుగా హాస్యపూర్వకంగా చెప్పేవాడు. మన్సారం భయ్యా ప్రజల్ని ఎంత బాగా సమీకరించేవాడంటే, అతని మీద జనాలకు అంత గురి. కమిలి దీదీ, రతన్ భాయి, సుద్దాస్ భయ్యా, మత్స్యకార సమూహం నుంచీ షానా దీది  ఇలా వీరందరూ ఇంకా అనేకమంది ఈ మొత్తం పోరాటాల విస్తృత రాజకీయాలను అర్థంచేసుకుంటూ వాటిని స్థానిక అంశాలతో సమన్వయం చేస్తూ ప్రజలతో నిరంతరం కలిసి పనిచేస్తూ వుండేవారు. వీరందరిలో కూడా ఆ స్ఫూర్తి, చైతన్యం బాగా ఎక్కువ. ఆ తర్వాతి కాలంలో నన్ను మీరా దీది గా గుర్తించి, నన్ను అర్థం చేసుకుని నా భావాలకు సామాజిక ఆమోదాన్ని తెలిపి, భరోసాగా నిలబడిన వాళ్ళలో ఈ గ్రామీణ, మత్స్యకార, ఆదివాసీ అక్కచెల్లెళ్ళు చాలా ముఖ్య పాత్రను తీసుకున్నారు.

(తర్వాత భాగంలో మీరా సంఘమిత్ర గా నా ప్రయాణం)

 

 

సజయ. కె

10 comments

Leave a Reply to ఆశాలత Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Very inspiring story. Meera always gives hope and confidence to all social activists. Thanks Sanaya gaaru for bringing up activists untold stories…

    • మీరా గురించి తెలుసుకోవడం చాలా గొప్పగా అనిపించింది.. ప్రజల కోసం ఇంత స్వచ్ఛంగా పని చేసేవాళ్లు లేకపోతే వ్యవస్థల నామరూపాలు మారిపోయేవి.. నర్మదా నది లాగే మీరా గమనం కూడా ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. మీరాను పరిజయం చేసిన సజయ గారికి థ్యాంక్యూ.. ఏకధాటిగా చదివించేలా రాశారు.. చదువుతున్నంతసేపూ నేరుగా చెప్తున్నట్టే అనిపించింది..

  • మనిషి చరిత్ర ఉద్యమ చరిత్ర విడదీయలేనంతగా కలగలిసి పోయింది. నిజం ఈరోజున మీరా అంటేనే ఉద్యమం అయిపొయింది, ఇంత నిబద్దతతో ప్రజల కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న మీరాకు, మీరా జీవితాన్ని, ఉద్యమాన్ని అక్షరీకరిస్తున్న సంజయకు ఆత్మీయ ఉద్యమాభివందనాలు

  • మనిషి చరిత్ర ఉద్యమ చరిత్ర విడదీయలేనంతగా కలగలిసి పోయింది. నిజం ఈరోజున మీరా అంటేనే ఉద్యమం అయిపొయింది, ఇంత నిబద్దతతో ప్రజల కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న మీరాకు, మీరా జీవితాన్ని, ఉద్యమాన్ని అక్షరీకరిస్తున్న సంజయకు ఆత్మీయ ఉద్యమాభివందనాలు

  • చాలా వివరాలతో నర్మ్ద పోరాట వివరాలను తెలిపారు .

  • చాలా వివరంగా తెలియచేశారు. All your articles are very inspiring.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు