మా టీఎమ్మెస్ సార్!

(నా స్వంత పరిచయంతోనూ మరి కొందరు వ్రాసిన వ్యాసాల ఆధారంగానూ సాహితీ ప్రియుల ప్రయోజనార్థం ఈ వ్యాసం)

కిక్కిరిసి పోయిన శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ ఆడిటోరియం. 1992 అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఇంజినీరింగ్ విద్యార్థులు, పీ జీ విద్యార్థులు కలిసి ఆర్గనైజ్ చేసిన సభ అది. విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు, వర్కర్లు, ఆఫీసు స్టాఫు వచ్చి కూర్చుని ఉన్నారు. ఆ సభకు ఇద్దరు వక్తలు. మొదటి వక్త ను స్టేజి మీదకు ఆహ్వానించగానే పోడియం వద్దకు చేరి, డైరీ విప్పి మైకు వద్ద పెట్టి, ఒక సిగరెట్టు తీసి వెలిగించాడు. ఆడిటోరియం లో ఇసుక వేస్తే రాలనంత జనం. ఆ మధ్యలో అంత పెద్ద సభ ఎప్పుడూ జరగలేదు. అందరూ వక్త ఇవ్వ బోయే ఉపన్యాసం గురించి ఉత్సుకతతో వేచి చూస్తున్నారు. అక్కడి ప్రగతి శీల వాదులు సాహితీ ప్రియులైన విద్యార్థులు ఆయన పేరు వినడమే తప్ప చూడ్డం అదే మొదలు. ఒక్క సారి సిగరెట్టు పొగ వదిలి మొదలు పెట్టాడు ‘ కాల క్రమంలో కొంత మంది చరిత్ర చెత్త బుట్టలో విసిరి వేయ బడ్తారు. అందులో మొట్ట మొదటి వాడు గాంధీ ‘ పది నిమిషాలు ఆడిటోరియం లో చప్పట్లు విజిల్స్ విద్యార్థుల ఉత్సాహ రేకలు ఆగిపోలేదు. ప్రగతి శీల వాదిగా చెప్పుకునే అప్పటి ఇంగ్లీష్ ప్రొఫెసర్ (తర్వాత వైస్ చాన్స్లర్ అయ్యారు ) నిశ్శబ్దంగా నిష్క్రమించారు సభ నుండి. మొహ మాటం లేకుండా, నిక్కచ్చిగా , నిర్ద్వంద్వంగా ఖచ్చితమైన విషయ అవగాహనతో ప్రతి కోణాన్ని స్పౄషిస్తూ ఉపన్యసించ గలిగే, వ్రాయ గలిగే గట్టి మనిషి త్రిపురనేని మధు సూదన రావు. మరుసటి రోజు తెలుగు డిపార్ట్మెంట్ తమ విద్యార్థుల కోసం యూనివర్సిటీలో ఏర్పరచిన interactive session లో అదే సిగరెట్టు పొగలో ఇలా అన్నాడు ‘ మీరు సాహిత్యాన్ని పుస్తకాల్లో చదువుతారు. అడవుల్లో సాహిత్యాన్ని ప్రజల్లో చదువుతారు ‘ అని.

సాహిత్యం లో రెండు గుంపులు ప్రధానంగా కనిపిస్తాయి. ఒక గుంపు ఛందస్సు, మాత్రలు, అవధానము, నీరు, ఆకాశం , భిక్షగాడు … లాంటి శిల్పం, వస్తువులతో మాత్రమే నిరంతరమూ తపించే గుంపు; ఇంకోటి ప్రజల భాష, సమాజిక సంస్కౄతి, సామాజిక పరిణామాలు, సాహిత్య మూలాలు….. లాంటి విషయాలతో నిత్యమూ మునిగి తేలుతూ సాహిత్యాన్ని ఆ సమాజిక అవసరాన్ని బట్టి ఆవిష్కరించాలి అని కోరుకునే గుంపు. ఈ పరిస్థితి కేవలం తెలుగు సాహిత్యానికే కాదు ప్రపంచం మొత్తం మీద కూడ ఇదే కనిపిస్తుంది. ఇదే గుంపులో సాహితీ విమర్శ లో మార్క్సిస్టు దృక్పథం తన పనిముట్టుగా పెట్టుఇకుని తెలుగు సాహితీ హౄదయాల్లో ప్రగతి శీల వాదుల మనసుల్లో తన ఆటో గ్రాఫ్ ఇచ్చి ఈ లోకం నుండిసెలవు తీసుకున్న వ్యక్తి త్రిపురనేని మధుసూదన రావు. విద్యార్థులు మరియు పరిచయస్తులు టీ ఎమ్మెస్ సార్ అంటే స్నేహితులు సన్నిహితులు మధు అని పిలుచుకుంటారు.

టీ ఏమ్మెస్ సార్ తిరుపతి ఆర్ట్స్ కాలేజీ లో తెలుగు లెక్చరర్’ గా పని చేసే వాళ్ళు. ఆయన వౄత్తి రీత్యా డిగ్రీ కాలేజీ లెక్చరర్. కాని ఆయన విశ్వాసం రీత్యా ఆయన ప్రవర్తన రీత్యా ఆయనో మార్క్సిస్టు సాహితీ విమర్శకారుడు. 1970 లలో దుమికిన నగ్జలబరీ పోరాటాల ప్రభావం భారత దేశ సాహిత్యం పై మేధావులపై గొప్ప ప్రభావాన్ని చూపింది. సాహితీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కొన్ని ప్రశ్నలు వేసుకోవాల్సిన రోజులవి. విశాఖ విద్యార్థులు శ్రీ శ్రీ సన్మాన సభలో ‘మేధావులారా ! మీరెటు వేపు ?’ అని ప్రశ్నించి కల కలం సౄష్టించిన రోజులవి. ఆ కాలంలోనే టీ ఎమ్మెస్ సార్ 1970 లో విరసం లో చేరారు. 1974 లో విరసం కార్య దర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కార్య వర్గ సభ్యుడుగా కొన్ని సంవత్సరాలు కొనసాగారు. వ్యక్తి గత కారణాల దౄష్ట్యా 1990 లో విరసంలో క్రియాశీలంగ లేరు. 2004 లో తిరిగి విరసం లో చేరారు. ( అప్పటికి ఆయనకు ఆయన మరణించే దశలో ఉన్నట్టు సంశయం ఉండింది).

టీ ఎమ్మెస్ సార్ సాహిత్యాన్ని కేవలం నాలుగు గోడల మధ్య compartmentalise చేసి చూల్లేదు. రాజకీయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం , సాంఘిక శాస్త్రాలలో భాగంగానే ఆయన తన విద్యార్థులకు లెక్చర్లు ఇచ్చే వారు. శ్రీనాథుని సాహిత్యంలో శౄంగారం తో మొదలు పెట్టి అసలు శౄంగారం అప్పట్లో సాహిత్యంలో ఎందుకు ఒక ముఖ్యమైన వస్తువు కావల్సి వచ్చింది, అయా కాలంలో సాహిత్య స్థితి గతులు , సాహిత్య ప్రయోజనాలు విడ మరిచి చెప్పే వారు. అందుకే రోటీన్’ లెక్చర్లలో పడి నిద్ర పోతున్న విద్యార్థులకు ఆయన లెక్చర్ భలే ఉపశమనం. ఆయన పాఠాలు వినడానికి వేరే క్లాస్ ఎగర కొట్టి పక్క క్లాస్ విద్యార్థులు, తోటి లెక్చరర్లు వచ్చి తరగతి గది లో కూర్చునే వారు. ఆయన ఉపన్యాసంలో ఓ భీకరుడు. పాఠం చెప్పడానికి పుస్తకాన్ని పక్కన బెట్టి విషయాన్ని పరీక్షల కోసమే కాక ప్రపంచాన్ని చుట్టి చూపించి వదిలేసే వాడు. ఇందుకు ఆయన ప్రతి రోజూ రాత్రి 2 గంటల వరకూ అధ్యయనం కొన సాగించే వారు. విపరీతమైన అధ్యయనం చేస్తూ సిగరెట్టు పొగలో ఆరోగ్యాన్ని క్షీణింప జేసుకున్నారు. ఆయన రాసిన ‘సాహిత్యంలో వస్తు శిల్పాలూ ప్రాచీన సమాజం నుండి ఇప్పటి వరకు సాహిత్యం ఎటువంటి రూపాంతరం చెందింది మరియు ఎటువంటి ప్రయోజనాలు నెరవేర్చింది అన్న విషయాలపై విస్తౄతంగా చర్చించారు. ‘ భౌతిక ఉత్పత్తుల్లో సామాజిక మానవులు సాధించిన సౄజనాత్మక శక్తే సాహిత్య కళా రంగాల్లోని సౄజనాత్మక శక్తికి మూలం. ఉత్పత్తిలో బాగా వెనక బడి ఉన్న సమాజాల్లో భాషా, చైతన్యం, కళా రూపాలూ వెనక బడే ఉంటాయి. సౄజనాత్మక శక్తి భౌతిక మూలమే గాని ఆవశ్యకతా నియతుల్ని అధిగమించే సూత్రీకరణలకీ విశ్లేషణకీ అందని విషయం కాదు. సౄజన కేవలం వ్యక్తి నిష్టం కాదు. వ్యక్తుల సంబంధం నుంచి వికసించేది ‘ లాంటి వాక్యాలు మొదటగా సాహిత్యంలో వ్యక్తి గత రొమాంటిక్ వాదాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. ఈ పుస్తకంలో సాహిత్య చరిత్రలో ఆధ్యాత్మిక వాదం, సార్వత్రిక వాదం, సార్వ కాలిక వాదం మొదలైన trends గురించి కూడా విశ్లేషిస్తారు.

జాతీయోద్యమ కవిత్వాన్ని విశ్లేషిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకుంటాయి. ‘ భావ కవిత్వం కవుల కవిత్వమే కానీ సామాన్య కవిత్వం కాదు. భావ కవిత్వం ప్రాణమైన ‘ రొమాంటి సిజం ‘ ఆర్థిక పునాది వేరు. ఇలా చెప్తూ సీ నారాయణ రెడ్డి రాసిన ‘ ఆధునిక కవిత్వము – సంప్రదాయములు – ప్రయోగములు ‘ గురించి చెప్తూ రాయప్రోలు సుబ్బా రావును ఆధునిక కవిత్వంలో యుగ కర్తగా అభివర్ణించడాన్ని తప్పుబడ్తూ రాయప్రోలు ను సాంప్రదాయక వాది అనే అభిప్రాయన్ని వెలిబుచ్చారు. ‘ భావ కవుల మీద జాతీయోద్యమం ప్రభావం ఉంది కానీ జాతీయోద్యమ కవిత్వం మీద భావ కవిత్వం ప్రభావం లేదు ‘ అని ఆయన విశ్లేషిస్తారు. ఇక్కడ కేవలం ఆయన తనను ఒక సాహితీ విమర్శ కారునిగా మాత్రమే చూసుకోలేదు. ఒక విశ్వ మానవ కళాకారునిగా, విమర్శకునిగా అనుకున్నారు. ఏ సాహితీ వేత్తకైనా సమాజంలో చెరగని ముద్రలు వేయాలంటే ఉండాల్సిన లక్షణం అదే.

1981 లో తిరుపతి కుట్ర కేసులో ఆయనను అరెస్టు చేసినప్పుడు చిత్తూరు సెషన్స్ కోర్టులో తన ప్రకటన ‘అప్పకవీయం’ లోని పద్యంతో మొదలు పెడ్తారు. ‘ఉపమ గలిగిన శయ్యల నొప్పి యున్న సంఘ్రి భవుని కావ్యంబు గ్రహ్యంబు గాదు పాయ సంబైన సంస్కార పక్వ మైన గాకజుష్టంబు హవ్వంబు గాని యట్లూ అని చదివి సాహిత్యంలో భూస్వామ్య సంస్కౄతి ఎలా ఉందని జడ్జీకి విశదీకరిస్తూ సాహిత్యం ఎలా కుట్ర కాదో రచయితలు ఎలా కుట్ర దారులు కాదో వివరిస్తాడు. తన ప్రకటనలో సంస్కౄత భాష గురించి, దాని పతనం గురించి, తెలుగు సాహిత్యం గురించి, విరసం ఆవిర్భావం గురించి , పార్లమెంటు రాజకీయాల గురించీ చెప్పుకుంటూ తన సిధ్ధాంతాన్ని వినిపిస్తాడు. టీ ఎమ్మెస్ సార్ సాహిత్యం గురించి మాట్లాడుతుంటే ఒక సారి చరిత్ర కారునిగా, ఒక సారి తాత్విక వేత్తగా, ఒక సారి రాజకీయ వాదిగా అగుపిస్తారు. సాహిత్యానికి ఈయనిచ్చే విస్తౄత నిర్వచనం వేరు.

ఈయన విరసం కార్యదర్శిగా , శ్రీ శ్రీ అధ్యక్షుడిగా కొనసాగిన రోజులున్నాయి. ఐతే ఎమర్జెన్సీ కాలంలో శ్రీ శ్రీ ఇందిరా ప్రభుత్వాన్ని తెలివి తక్కువగా అర్థం చేసుకుని డొంక తిరుగుడు వాదన మొదలు పెడ్తే ఎంతో నచ్చ జెప్ప జూసారు.

సర్ ఇంట్లో అధ్యయనానికి ప్రత్యేకంగా ఒక గది ఉండేది వరండా పక్కన. గది మొత్తం పుస్తకాలు. ఆపైన శ్రీ శ్రీ ఫొటో. పక్కనే మార్క్స్ , అంబేద్కర్ ఫొటోలు ఉండేవి. శ్రీ శ్రీ గురించి ఓ రోజు పిచ్చా పాటి కబుర్లు చెప్తూ ఇలా అన్నారు ‘ నేను శ్రీ శ్రీ లేకపోతే తెలుగు సాహిత్యం ఏమయ్యేదో ఎలా ఉండేదో ఊహించలేనయ్యా ‘ అని. ఓ సారి ఎస్వీ యూనివర్సిటీలో శ్రీ శ్రీ ని అహ్వానించి అక్కడి సాహితీ ప్రియులు కొంత మంది ఒక సభను నిర్వహించ తలబెట్టారు. యూనివర్సిటీ ఆడిటోరియం మొత్తం విద్యార్థులతో కిక్కిరిసి ఉంటే చావు కబురు నిర్వాహకులకు చల్లగా అందింది ‘ శ్రీ శ్రీ రావటం లేదని ‘. విద్యార్థులు ఎలా గొడవ పెడ్తారో ఊహించ లేక పోయారు. వెంటనే టీ ఎమ్మెస్ సార్ ను ప్రాధేయ పడ్డారు. ఎలా ఐనా ఈ పరిస్థితిని ఆయనే సంబాళించాలని. సరే అంటూ స్టేజి మీదకెళ్లాడు. స్టేజీ మధ్యలో కుర్చీ వేసుకుని సిగరెట్టు వెలిగించి మైకులో ఇలా అన్నాడు ‘ మీలో ఎవరైనా ఏదైనా ప్రశ్న వేయండి. సమాధానం చెప్తాను ‘ అని. తాపీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఒకరు రాజకీయాల గురించి, ఒకరు అమెరికా సామ్రాజ్య విధానం గురించి, ఒకరు విద్యా విధానం గురించి, మరొకరు ప్రబంధ కావ్యాల గురించి, ఇంకొకరు ఉపనిషత్తుల గురించి ఇలా అడగడం మొదలు పెట్టారు. ఆయన తాపీగా సిగరెట్టు మీద సిగరెట్టు వెలిగిస్తూ ఆయన తనదైన కౄష్ణా జిల్లా యాసలో ప్రతి ఒక్కరికీ సమాధానం ఇవ్వడం నిర్వాహకుల మొహాలను అశ్చర్యంతో తెల్ల బరిచింది. ఒక కొంటె విద్యార్థి ‘ సర్ ప్రపంచంలో అన్నిటికంటే తియ్యనైనదేంటి ? ‘ అంటే సిగరెట్టు ఆర్పుతూ ‘ సృష్టిలో తియ్యనైనదేమీ లేదూ అంతా తీసేసిందే కూర్చొ ! ‘ అంటే ప్రతి ఒక్కరు పగల బడి నవ్వడం జరిగింది. ఆయన వ్యంగ్యము హాస్యము చాలా తీవ్రంగా ఉంటాయి.

1996 లో ఎం.బి.ఏ చదుతున్నప్పుడు మిత్రులతో కలిసి ఆయన ఇంటికి ఓ సాయంకాలం వెళ్ళడం జరిగింది. ఆయనకు విద్యార్థులతో యువకులతో సంభాషించడం భలే మక్కువ. అప్పుడు ‘ సర్ సినా రే గురించి మీ అభిప్రాయం ఏంటి సర్ ‘ అని అడిగితే అయన ఇలా అన్నాడు ‘ సి నా రే ఓ సాహితీ వేశ్య అయ్యా ! ‘. అందరం గొల్లున నవ్వాము. డబ్బు కోసం సాహిత్యాన్ని ఎంత వరకు తీసుకు పోతాడు అని ఒక్క ముక్కలో ఆయన అర్థం చేయించే ఈ విధానమే ఆయన ఉపన్యాసం ఎక్కడున్నా విద్యార్థులు మిస్ కాకుండా చేసేది. ఆయన దౄష్టిలో ‘ విప్లవానికి ఒక సిద్ధాంతం ఉండదు. విప్లవ కవిత్వానికి మరొక సిద్ధాంతం ఉండదు ‘ ఆ సిధ్ధాంతం అవగాహనలో భాగంగా భావ వాద, భౌతిక వాదాల్ని ఇలా నిర్వచించారు. ‘ ఆలోచనల నుంచీ, ఇంద్రియ జ్ణ్జానాల నుంచీ వస్తువుల్ని పరిశీలించే దౄక్పథం భావ వాదం. వస్తువుల నుంచీ ఆలోచనల్నీ, ఇంద్రియ జ్ణ్జానాల్నీ పరిశీలించే దౄక్పథం భౌతిక వాదం ‘. టీ ఎమ్మెస్ సార్ ఒక సాహితీ కారుడు వర్ణించినట్టు… ‘అతనిది యుద్ధ వ్యాకరణము ఫిరంగి భాషా ఆయనకున్న విషయం పట్ల అవగాహన, గ్రిప్ ఆయనతో traditional perspective లో ఉంచలేదు. ‘ గతి తార్కిక సాహిత్య భౌతిక వాదం ‘ అన్న సిధ్ధాంతాన్ని లేవనెత్తి సాహితీ ప్రపంచంలో చర్చ సౄష్టించారు. ఆ ప్రతిపాదన చర్చల్లో కొత్త కోణాన్ని సౄష్టించింది. దీని గురించి శ్రీ శ్రీ ఇలా అన్నారు ‘ ఇందులో ఆక్షేపించ వలసిందేమీ లేదు. పైగా ఈ వాదం ఒక నూతన సిధ్ధాంతం కాదు. మధు సూదన రావు గారు చేస్తున్నదంతా మార్క్సిస్టు గతి తార్కిక భౌతిక వాదాన్ని మన సాహిత్యానికి అన్వయించే ప్రయత్నం మాత్రమే ‘ . అది సరి ఐనదే కావచ్చు. ఐతే ఎలా అన్వయించడం అన్నది ఒక ప్రక్రియగా చేసి చూయించడం కేవలం ఆయనకు విషయం పట్ల ఉన్న  అవగాహన ద్వారానే సాధ్యమయింది. ఈ విషయ అవగాహన వల్ల ఆయన కొంత ట్రిక్స్ ప్లే చేయడం , తమాషాలు చేయడం లాంటి పనులు చేసేవాడు.

ఓ సారి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో 1995 లో ‘ చలం శత జయంతి కమిటీ ‘ వాళ్ళు ఓ సారి వక్తగా పిలిచారు. హైదరాబాదు లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఈ విషయం నాకు తెలిసి నేను కూడా అటెండ్ అయ్యాను. సభలో అప్పటికే ఆయన లెక్చర్ మొదలయ్యింది. అప్పటికే చాలా ఉపన్యాసం ముగిసినట్టుంది. ఆడియన్స్ చాలా గంభీరంగా ఉన్నారు. చూస్తే సీన్ అర్థం అయ్యింది ఏదో పీకి పాకేసారు అని. కాసేపు తర్వాత ఇలా అన్నాడు ‘ ఈ రోజు మనం చలం గురించి ఏం నేర్చుకోవాలి ‘ . కాసేపు వ్యవధి ఇచ్చి ప్రేక్షకులను పరికించి చూసి ‘ వంద ఏళ్ల తర్వాత నేర్చుకోవల్సింది చలం దగ్గర ఏమీ లేదు ‘ అని కృష్ణ యాసలో తన దైన శైలిలో ఒక్క షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చేసి తాపీగా స్త్రీ విముక్తి సాహిత్యం గురించి ఒక 15 నిమిషాలు చెప్పి ఇక ముగించారు. ఆ తర్వాత తిరుపతి యూనివర్సిటీకి వచ్చాక ఆ రోజు సాయంత్రమే ఆయన ఇంటికెళ్ళాను . ఆయన ఇంటి గడప వద్ద ఆయన స్టడీ రూం ఉంటుంది. అందులోనే ఆయన ఎప్పుడూ కనిపించేవారు. కాలేజీ వదిలితే ఇంట్లో కాళ్ళు చేతులు కడుక్కుని కూర్చోవడం అక్కడనే ఇక. మాటల్లో అడిగేసాను ‘ ఏంటి సర్ అలా అనేసారు . చలం దగ్గర నుండి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని అంత గబుక్కున అనేసారే ‘ అంటే ఆయన ఓ మోస్తారుగా నవ్వి ‘ ఏమీ లేదయ్యా ఆ ముందు వరసలో ఫెమినిస్టు రచయిత్రులు కూర్చుని ఉన్నారు. అందుకే అలా అన్నాను ‘ అంటే విషయం పై ఎంత పట్టు లేపోతే ఆ ఆత్మ స్థైర్యం సాధ్యం కాదు. నిజానికి ఆయన అలా చెప్పడం లో ఉద్దేశ్యం నాకు తెలుసు. చలం అంటే ఆయనకు ఖచ్చితంగా తక్కువ చూపు కాదు. ఐతే అప్పట్లో నడిచే ఫెమినిస్టు సిధ్ధాంతానికి కొన్ని ‘ ఝలక్కులు ‘ ఇవ్వడానికి చలం నుండి ఇంక చాలా ముందు కెళ్ళి విప్లవ సిధ్ధాంత క్రమంలో స్త్రీ విముక్తి గురించి అవగాహన చేసుకోవాలి అని చెప్పడం ఆయన ఉద్దేశ్యం. ఆయనకు సబ్జెక్ట్ మీద అవగాహన పట్టు అమోఘం. అందుకే ఆయన అవసరం అనుకున్నప్పుడు అహంకారాన్ని ప్రదర్శించడానికి వెనుకాడేవాడు కాదు. ఆయన ఏదన్నా చర్చనీయాంశాన్ని ఇలానే రేకెత్తించి చర్చకు కాలు దువ్వే వాడు.

ఇలా చర్చలకు కాలు దువ్వే ఆయన వ్యవహారం వల్ల అప్పట్లో నడిచే దళిత వాదం నోట్లో బాగా నలిగాడు. రామ చంద్రయ్య, లక్షీ నారాయణ, సత్య మూర్తి తదితరులు ఆయన ఆంధ్ర జ్యోతి లో రాస్తున్న ‘ తిరోగమన విశ్వనాథ సాహిత్యం ‘ అన్న వ్యాసాన్ని అల పీకి ఇలా పీకి ఆయన్ను చివరికి అగ్ర కుల మార్క్సిస్టుగా ముద్ర వేసి ఎన్నో అభాండాలు వేసారు. ఇపుడూ ఫేస్ బుక్కు ఉంది కాని..అప్పట్లో లేనప్పుడు దొంగ పేర్లతో ఒకరే వ్యాస ప్రతి వ్యాసాలు రాసి ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూసారు. అందుకు ప్రతిగా ఆయన మొత్తం మనువాదం , మార్క్సిజం గురించి ఒక పెద్ద వ్యాసం రాసి ఇంజినీరింగ్ చదివే రోజుల్లో అనంతపూరుకు పంపితే మా కాలేజీలో చర్చ చేయమని మాకూ ఒక కాపీ అందింది. ఆ వ్యాసం ఎప్పుడూ చేతిలో పట్టుకుని తిరిగి అనంత పూరులో ప్రతి ఆదివారం అజాద్ , శేషయ్య, శశికళ, రాప్తాడు గోపాల క్రిష్ణ, నాగేశ్వరాచారి లాంటి సాహితీ ప్రియులతో జరిగే చర్చ కోసం వేచి చూసి 4 మైళ్ళు సైకిల్ వేసుకుని వచ్చి మరీ అటెండ్ అయ్యేవాన్ని. అప్పటికి సార్ను చూడలేదు. ఆ వ్యాసం మొత్తం చర్చించి కొన్ని modification చేసి ఆయన అనుమతి తీసుకుని ‘ మార్క్సిజం వర్ధిల్లాలి – మనుధర్మం నశించాలీ’ అని పుస్తకం తీసుకు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిన విషయం. అందుకోసం అందరి చుట్టూ తిరిగి చందాలు సేకరించి పాకెట్ మనీ కొంచెం ఖర్చు పెట్టి ఆ పుస్తక ప్రచురణకు తోడ్పడ్డం ఒక్కో సారి తలచుకుంటే ఆ మేధావి గురించి గుండెంతా అనందం నిండుకు పోతుంది. తిరుపతిలో ఎం.బి.ఏ చేరాకా విద్యార్థులను పోగేసుకుని ఆయన ఇంటికెళ్ళి ఫిలాసఫీ క్లాసులు చెప్పించుకునే వాన్ని. ఎంతో ఓపిగ్గా తత్వ శాస్త్రం ఎలా పుట్టింది దగ్గర నుండి , ఆది మానవ సమాజం దగ్గర నుండి ఓపిగ్గా చేప్పుకొచ్చే వాడు. భగత్ సింగ్ వర్ధంతి సభకు వక్త గా పిలిస్తే విదార్థులకందరికీ తన ఉపన్యాసం లో తత్వ శాస్త్రము కుల తత్వము గురించి చెప్పారు. సాహిత్యాన్ని, తత్వ శాస్త్రాన్ని, రాజకీయాన్ని, చరిత్రను కలగలిపి సేవించిన మహోపాధ్యాయుడు. అభిజ్ణ్జాన శాకుంతలం గురించి విమర్శిస్తూ ఆయన దుష్యంతుడిని మచ్చలేని రాజుగా చూపించడానికి రాజు రక్తం తప్పు చేయదని చెప్పడానికి కాళిదాసు భారత మూల కథలో లేని ఉంగరాన్ని సౄష్టించాడని , శకుంతలను తిరస్కరించడానికి ఉంగరం పారేసుకోవడం కారణమైనట్టు రాజు దుర్బుద్ధి కాదు అన్నట్టు చేసిన ప్రయత్నం అని విశ్లేషించే వారు . ఆపై ఇలాంటి సాహిత్యాన్ని గొప్ప విలువలు గల సాహిత్యాంశంగా పరిగణించడం సరి కాదని ఎవరి ప్రయోజనాల కోసం సాహిత్య సౄజన జరుగుతుందో గమనించమని వివరించే వారు. అలాగే సాహిత్య చరిత్రను తిరగ రాయాలని ఆయన కోరిక. సార్ ను ‘ తిరుపతి మావో’ అని పిలిచే వాళ్ళు. అది ఆయనకు సిద్ధాంతం పై ఉండే పట్టుకు సూచన

ఆయన చివరి రోజుల్లో చేరా గారు వాళ్ళింట్లో కలిసి నప్పుడు ఆయన కొడుకు గురించి ‘ ఏం చేస్తున్నాడు ‘ అని అడిగారు. ‘ ఏం చేయట్లేదు ‘ అన్న సమాధానానికి చేరా పరుషంగా ‘ మన నిర్వాకమేనా ? ‘ అంటే ఏమీ మాట్లాడకుండా మిన్నకుండి పోయారు. సర్ కుటుంబాన్ని చాలా నెగ్లెక్ట్ చేసారు. ఆయన వృధ్ధికి వారి తోడ్పాటు ఎంతో ఉంది. ఆయన ఈ సాహిత్యానికి ఒక విమర్శకుడిగా చేసిన కృషి లో వారి భాగమూ ఉంది. ప్రజల గురించి, వారికి సరి ఐన సాహిత్యాన్ని అందివ్వాలని కలలు గంటూ తన జీవితాన్ని సాహితీ విమర్శకు, విస్తౄత అధ్యయనానికి అంకితం చేసి కనుమరుగయ్యారు ఆయన.

సాహిత్యం గుట్ట ఎక్కి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నప్పుడు కిటికీ పక్కన అశోక  కొమ్మ మీద కూర్చున్న గువ్వ ఆయన పాటే పాడుతున్నట్టు ఉంటుంది. పాట ఆగిపోయినా అది మారు మోగుతుంది ….ముఖ్యంగా అది మన జీవితాలను స్పృశించినప్పుడు ….

టీ ఎమ్మెస్ సార్ కొన్ని రచనలు: 1. సాహిత్యంలో వస్తు శిల్పాలు 2. గతి తార్కిక భౌతిక మానవతా వాదం 3. మార్క్సిజం – సాహిత్య విమర్శ 4. కవిత్వం – చైతన్యం 5. విశ్వనాథ తిరోగమన సాహిత్యం 6. మనుధర్మం నశించాలి – మార్క్సిజం వర్ధిల్లాలి

PS : ఆయన ‘ మార్క్సిజం వర్ధిల్లాలి – మనుధర్మం నశించాలి ‘ లో చేసిన వాదనతో నాకు part concurrence ఉంది నాకు ఇప్పుడున్న దృక్పథం లో. స్టూడెంట్ గా నాకున్న పరిమిత ఙానం తో పరిశీలించాను పుస్తకాన్ని అప్పుడు. అయితే ఆయన మీద అప్పటి దళిత మేధావులు చేసిన విమర్శ కూడా గొప్పగా చెప్పుకోదగ్గ విమర్శ కాదు. అలాగే అప్పట్లో ఆయన మీద ఆకాశ రామన్న పేర్లతో ఒకరిద్దరు వ్యక్తులు పేర్లు మార్చుకుని మార్చుకుని రాసి ఆయన మీద సముచిత యుద్ధం చేయలేకపోయారు. TMS sir తన అభిప్రాయాల్ను calculate చేసుకోకుండా ప్రకటించడం ఆయనకున్న నిజాయితీకి ఓపెన్ నెస్ కు నిదర్శనం అని భావిస్తున్నా. నాది అల్ప సంతోషం లా అనిపించవచ్చు కాని..కాని ఆ టైం లో అదే గొప్ప !

Avatar

విక్టర్ విజయ్ కుమార్

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • అలా చాలా జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లారు.కన్న జ్ఞాపకాలు కొన్ని…విన్న వి కొన్ని… చాలా కదిలించింది …

 • సంప్రదాయ చట్రంలో మునిగిపోయిన తెలుగు సాహిత్య విమర్శకు కొత్తచూపు నిచ్చి … ప్రజాస్వామిక, ప్రగతిశీల, విప్లవ దృక్పథాలను అద్ది మార్క్సిస్టు సాహిత్య విమర్శను ప్రాదేశికం చేసిన త్రిపురనేని మధుసూదనరావు సాహిత్య సర్వస్వం ప్రతుల కోసం

  సంపాదకులు: సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌ వి. చెంచయ్య
  ప్రతులకు : 9989189250

  http://prasthanam.com/node/1345

 • ప్రజలకు సరియైన సాహిత్యాన్ని అందివ్వాలని కలలుగంటూ తన జీవితాన్ని సాహితీ విమర్శకు, విస్తౄత అధ్యయనానికి అంకితం చేసిన ‘తిరుపతి మావో’ త్రిపురనేని మధుసూదన రావు గారిని , వివరంగా విశ్లేష్ణాత్మకంగా ఆవిష్కరించిన విక్టర్ విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు.

  అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ కథా రచయిత, విమర్శకుడు సింగమనేని నారాయణ . . . . విలక్షణ కథా రచయిత త్రిపురను తెలుగు పాఠక లోకానికి పరిచయం చేసిన విశాఖ డా. అత్తలూరి నరసింహరావు గార్లు కూడా టీఎమ్మెస్ సార్ గారి శిష్యులు అంట కదండి విక్టర్ విజయ్ కుమార్ గారూ. ( మీరు మా అనంటపూర్ లో సదూకున్నారని పరాయోళ్ల కధల జి. ఉమామహేశ్వర్ మాకు సెపుతుంటాడు )

  “ టీఎమ్మెస్ సార్ తిరుపతి ఇంట్లో తన కుర్చీకి ఎదురుగా గోడ మీద మావో, టేబుల్‌పైన గద్దర్‌ ఇరువైపులా శ్రీశ్రీ, చెరబండ రాజు ఫోటోలు పెట్టుకున్నారు “ అని సాకం నాగరాజు గారు చెప్పిన ముచ్చట ఇక్కడ తలుచుకుంటున్నా

  • ఆయన శిష్యులు కోకొల్లలండి. అందరూ సాహెటే పరంగా గాని…otherwise also…వేరు వేరు పొజిషన్స్ లో మంచిగున్నారు.

   అవునండి నేను అనంతపూర్ ఇంజినీరింగ్ కాలేజ్ లో చదుకున్నాను. స్కూలింగ్ కూడా అనంతపూరే..కోడిగేనహల్లి. పుట్టింది మాత్రమే కర్నూలు దగ్గర…

 • “ దివంగత త్రిపురనేని మధుసూదనరావు మంచి మనిషి. భౌతికవాది. గొప్ప వక్త. స్నేహశీలి. సరళ స్వభావులు. నిరాడంబరులు. విప్లవకవి. ప్రఖ్యాత విమర్శకులు. పుస్తక నేస్తం. అన్నింటికి మించి ఒక అరుదైన తెలుగు అధ్యాపకులు. సన్మానాలు, పొగడ్తలు వారికి గిట్టవు. నిరాడంబరులు. ఎంత దూరమైనా నడిచే వెళ్ళేవారు. “ ~ – డాక్టర్‌ డి. ప్రేమావతి

 • త్రిపురనేని మధుసూదన రావు ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి గారి మనుమడు .

  ʹమార్క్సిస్టు మహోపాధ్యాయుడు మధుసూదనరావు అని శ్రీశ్రీ ఊరకే అనలేదు.

  సాహిత్యం కుట్ర కాదు.. రచయితలు కుట్రదారులు కాదు అనే సుప్రశిద్ధ వ్యాసంలో సంస్కృత అనువాద సాహిత్యంలోని నీచ విలువలను చెబుతూ అసలు సిసలైన సాహిత్యం జానపద, దేశీ సాహిత్యమని ప్రతిపాదిస్తారు.

  అధ్యాపకులకు మీ సందేశం ఏమిటి అని సాకం నాగరాజ అడిగితే ʹʹజీవితాన్ని ప్రేమించండి. విద్యార్థులను ప్రేమించండి. జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వర్తమానం చేసుకోండి. రేపటి మీద ఆశ పెంచుకోండి. నీ కోసం బ్రతకడం కంటే ఇతరుల కోసం బతకడం గొప్ప అని తెలుసుకోండిʹʹ అన్నారు.

 • టీఎమ్మెస్ నాకు బాగా తెలుసు. స్మోకర్ కాదనుకుంటా, కిళ్లీలు తెనేవాడు.

  ~ చందోలు చంద్రశేఖర్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు