యవ్వనం కాదూ కాటేసింది?

మనుషుల్లో ఆరోగ్యకర ఆలోచనలను కలిగించే పని సాహిత్యంతో పాటు సినెమా కూడా చేస్తుంది. నా వరకు, కనీసం, ఇది నిజం.

కప్పుడు కేవలం దూర్‌దర్శన్ చానెళ్ళు వచ్చేవి. తర్వాత ప్రైవేటు చానెళ్ళు మొదలయ్యాక దూర్‌దర్శన్ మీద జోకులు మొదలయ్యాయి. పాడి పంటలు, బధిరులకు వార్తలు, సంస్కృతంలో వార్తలు వగైరాల పేరుతో. కాని ఇప్పుడొస్తున్న ప్రోగ్రాములు ఎంత గొప్పగా వుంటున్నాయి? అప్పుడు “తమస్” లాంటివి తీశారు దూర్‌దర్శన్ కోసం. ఇప్పుడలాంటివి ఎందుకని రావు? దీనితో పాటే నేను NFDC గురించి కూడా మాట్లాడాలి. అదే లేనట్లైతే అన్నన్ని మంచి చిత్రాలు వెలుగు చూసేవా? దేశం మొత్తంలో అన్ని హాళ్ళల్లో ప్రదర్శించినా ప్రదర్శించకపోయినా దూర్‌దర్శన్ పుణ్యమాని దేశం మొత్తం చూసే వీలు కలిగింది కదా.

అలా వచ్చిన చాలా చిత్రాలలో వొకటి బాసు చటర్జీ తీసిన “కమలా కీ మౌత్” వొకటి. 1989 లో వచ్చింది ఇది. అప్పటికి నా వయసు పాతికేళ్ళు. దానికి ముందూ తర్వాతా వచ్చిన చిత్రాలలో కథలో స్త్రీ పాత్రకు పెళ్ళి కాకుండా కడుపు వస్తే అది పెద్ద నేరం, పాపం, సిగ్గుమాలినతనం వగైరా. సమాజం అలా చూసేది. మనుషులూ భయపడేవారు. అదే ఆ కుటుంబంలో మనుషులు. ఇతరులు పీక్కు తినడానికి రడీగా వుండేవారు. నీతి వ్యాఖ్యానాలు, తీర్పులు, అవమానించడాలు ఇలా ఎన్నో. నా వయసు వారికి ఇదంతా చెప్పనవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు కళ్ళారా చూసిన సమాజమే. ఇప్పటి తరానికి ఇది బహుశా అంతగా కొరుకుడు పడదు. కాస్త కష్టపడితే వూహించుకోవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ విధంగా పెళ్ళి కాకుండానే గర్భం దాల్చిన అమ్మాయి యేమైపోవాలి?

కమలా కీ మౌత్ లో మొదట్లోనే అలాంటి వొక అమ్మాయి, పేరు కమల, ఇంటి డాబా గోడ మీదనుంచి దూకి చనిపోతుంది. ఆ అమ్మాయి ఆత్మహత్యను, శవాన్ని చూసిన ఇరుగు పొరుగు ఇళ్ళల్లోని వ్యక్తులు తమ జీవితం గురించి మనసులో నెమరేసుకోవడం మిగతా కథ. నిర్మల తన యవ్వనంలో కాలాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇంటికి వొక మేష్టారు చదువు చెప్పడానికి వచ్చేవారు. అతని ప్రేమలో, వ్యామోహంలో, ఆకర్షణలో పడుతుందీ పిల్ల. అతను వారించి చూస్తాడు. ఈమె అర్థం చేసుకోదు. చివరికి అతను నిర్మల తల్లిని కలిసి విషయం చెప్పి తను తప్పుకుంటాడు. తనను నిరాకరించాడని బాధపడి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది నిర్మల. సమయానికి వైద్యం అందబట్టి ఆమె బతికి, సుధాకర్ అనే కుర్రాడితో ఆమె పెళ్ళి కూడా అవుతుంది. తను ఆ ప్రయత్నం చెయ్యడమే కాదు, ఇప్పుడు ఈ కమల ఆత్మహత్య చేసుకోవడం కూడా తప్పు అని మనసులో అనుకుంటుంది.

అదే సుధాకర్ కి ఇదివరలో అంజు అనే అమ్మాయితో సంబంధం వుండేది. ఆమె గర్భం దాల్చితే ఆమెను ఒప్పించి అబార్షన్ చేయిస్తాడు. తర్వాత అక్కడినుంచి పారిపోయి పక్క వూరిలో వుంటాడు. అక్కడ చమేలి అన్న మరో అమ్మాయితో మళ్ళీ అదే కథ. వూరిలోవారి కంట పడి దుమారం లేచాక పంచాయితీ తీర్పు చెబుతుంది. ఇప్పుడు చమేలిని ఎవరూ చేసుకోవడానికి ముందుకు రారు కాబట్టి సుధాకరే చేసుకోవాలి అని. అయిష్టంగా సిధ్ధం అయినా కూడా చమేలి మరో ప్రియుడు ఇచ్చిన వార్నింగు కు భయపడి అక్కడినుంచి పారిపోయి మరో వూరుకెళ్తాడు. అక్కడ ప్రకాశ్ అన్న మిత్రుడి భార్యతో రహస్య సంబంధం. బయటపడినప్పుడు ప్రకాశ్ దెబ్బలు తినడం. చివరికి ఇలా నిర్మలతో వివాహం.  సుధాకర్ కి ఆత్మహత్య చేసుకునే గతి పట్టలేదు. కమల కి పట్టింది. అక్కడే వుంది మెలిక.

సంవత్సరాలు దొర్లిపోయాయి. ఇన్ని పాత్రలూ జీవితంలో తప్పులు చేసినా, ఆత్మహత్య చేసుకోలేదు. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలూనూ. గుడి లోనో మరో చోటో ఒకరినొకరు చూసుకుంటారు కూడా. ఇప్పుడు జరిగింది యేమిటంటే కమల అన్న అమ్మాయి ఆత్మహత్య వారిలో వొక ఆత్మ పరిశీలనకు అవకాశమిచ్చింది. చూసేవాడికి కూడా వొక తేట దృష్టికోణం ఇస్తుంది. జీవితంలో దగా పడతాము, తప్పులు చేస్తాము; కాని ఆత్మ హత్య మాత్రం యెప్పటికీ సమర్థనీయం కాదు. అలాగే మనందరం చేసిన తప్పులే మరొకరు చేస్తే తప్పుపట్టే అర్హత కూడా మనకు లేదు.

ఈ సినెమా నా పాతికేళ్ళ వయసులో చూశాను. ఇప్పటికి ముప్పై యేళ్ళయ్యాయి. అయినా అందులో నటించిన పంకజ్ కపూర్, సుప్రియా పాఠక్ తదితరులు ఇంకా కళ్ళ ముందే మెదులుతున్నారు. కాస్త కష్ట పడి నెట్ లో వెతికి 1989 కి ముందూ తర్వాతా వచ్చిన కొన్ని చిత్రాల పేర్లు ఇక్కడ వ్రాయవచ్చు. కాని మీకు అర్థమైపోతుంది నేను యెలాంటి సినెమాలను మనసులో పెట్టుకుని ఇది వ్రాశానో.

అప్పట్లోనే “పూజకు పనికిరాని పువ్వు” (1986) అని సినెమా వచ్చింది. నాకు ఆ “పూజకు పనికిరాని పువ్వు” శీర్షికే అసహ్యంగా అనిపించి చూడలేదు. ఇంకో చిత్రం “శిక్ష” అనుకుంటా. శరత్ బాబు చేత భంగపడ్డ సుహాసిని అతని ఇంట్లోనే తిష్ట వేసి మౌన పొరాటం చేసి అతనికి శిక్ష వేస్తుంది. వాట్ ఇస్ దిస్ అమ్మా వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్ అనుకున్నా. మౌన పోరాటం అంటే గుర్తుకొచ్చింది అదే పేరుతో మరో చిత్రం వచ్చింది. అందులో కూడా ఇలాంటి ప్రతిఘటనే, కాకపోతే రోడ్డు మీద. అప్పట్లో ఇలాంటి సంఘటనలు నిజంగానే జరిగేయి. ప్రేమ పేరుతో మోసం చేసి కడుపు చేసినవాణ్ణి కట్టుకోవడంలో ఏం గౌరవం వుంది? ప్రియుడు పనికిమాలినోడని తెలిశాక మొగుడుగా మాత్రం ఎలా పనికొస్తాడు? నేను మరీ చిన్నవాడిగా వున్నప్పుడు బాగా హిట్ చిత్రం “నీడ లేని ఆడది” వచ్చింది. ప్రభ. నేను చూడలేదు. కథ ఊహించగలను. ఇలా ఎన్ని సినిమాల పేర్లు గుర్తు తెచ్చుకోవాలి? ఇది చదువుతున్న వారికి తాము చూసిన ఇలాంటి చిత్రాలే గుర్తుకొస్తాయి. ఇది తెలుగు సినెమాకే పరిమితం కాదండోయ్, హిందీ సినెమాల్లో కూడా ఇదే గోల.

దీనికి మూలం మన సమాజ నీతి. పాతివ్రత్యం అన్నది స్త్రీకే వర్తింపజేసి పురుషిడికి చెయ్యక పోవడం. లేకుంటే మగాళ్ళు కూడా కమల లాగా ఆత్మహత్యలు చేసుకోరూ?! రెండోది పాతివ్రత్యాన్ని పెళ్ళికి ముడిపెట్టడం. అంటే వివాహంలో పరస్పర faithfulness ఉండకూడదని అనడం లేదు. మనాగమిని నమ్మే వాళ్ళే కదా పెళ్ళి చేసుకునేది. పెళ్ళికి పూర్వం ప్రేమ కారణంగానో ఆ వయసులో ఒంట్లోని హార్మోన్ల ప్రభావం వల్ల అలాంటి పరిస్థితులు వచ్చి గర్భం వస్తే, లేదా ఆ విషయం బయట పడితే ఆడపిల్లకి పెళ్ళి కష్టం అన్న సమాజ నీతి యెన్నో ప్రాణాలను బలి తీసుకుంది కదా.

మనుషుల్లో ఆరోగ్యకర ఆలోచనలను కలిగించే పని సాహిత్యంతో పాటు సినెమా కూడా చేస్తుంది. నా వరకు, కనీసం, ఇది నిజం.

*

 

పరేశ్ దోశి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ ప్రొఫైల్ కి పెద్ద stalker ఐపోయానండి. ఎన్నెన్ని గొప్ప సినిమాలని, కథలని, పాటలని పరిచయం చేస్తున్నారో కదా!.( Nfdc సినిమాలని చాలానే చూసిన గుర్తు. తమన్ ఈ మధ్యే చూసాను. శిక్ష, ఇంకొన్ని చెత్త సినిమాలూ చూసాను. )

  • మీరు సినెమాల గురించి పాటల గురించి రాసేవి చదవటం మృష్టాన్న భోజనం చేయటం లాంటింది. ఎంత లోతైన విశ్లేషణలు ! ఎందుకిలా !!! అన్ని ప్రశ్నలు చెప్పలేని బాధ!! ధన్యవాదాలు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు