మధ్యాహ్నపు వెన్నెల సెగలు చీకటి పొగలు..

ఒక జంట ప్రేమించుకోవడం ప్రేమే. విడిపోవడం కూడా ప్రేమేనా! ఈ కాన్సెప్టుని ఎవరైనా ఎలా వివరించగలరు. మనిషి ప్రేమతో తనని తాను సత్కరించుకుంటాడు.

తాపం కోపం పశ్చాత్తాపం గతాను గతాల భాష్పవిలాపం.. ఒక మిథ్యాకాలం మోహపు సెగలు కక్కే ఎండలో.. రెండు బండల మధ్య దూర్చిన తల.. ముందుకు పోలేక వెనక్కి రాలేకా, అసలు అవతల దారుందో లేదో తెలియక.. ఒక తీపి అనుభవానికి చేదుకలల మీద మెరిసే ఒక ఎండాకాలపు మధ్యాహ్న ముహూర్తం కోసం అన్వేషణ.. ఒకానొక ఎండాకాలం మధ్యాహ్నం నిశ్శబ్దంలో దేనికోసం ఏడ్చాడో ఏమి మూటగట్టాడో. ఏ ఆకులు రాలే కాలం చూస్తూ రంగుల లోయలోకి ఏమి విసిరాడో.

ఈ మల్లికార్జున్‌తో ఇదే గొడవ. మొదటి పేజీ చదివారో ఇగ అంతే. చివరిదాకా లాక్కుపోతాడు. ఒక్కోచోట నిదానంగా. ఒక్కో చోట పిల్లగాలిలా హాయిగా. వస్తాదులా ఒక్కోసారి పట్టు బిగిస్తాడు. ఒక్కోసారి వదులు చేస్తాడు. ఒక్కోసారి ఉపకథలతోనో పీడకలలతోనూ మనుషుల లోతుల్లోని గజిబిజి గీతల్లోకి తీసుకెళ్తాడు. అక్కడి అధివాస్తవిక దృశ్యాలతో గాయాల లోతు చెప్తాడు. మధ్యాహ్న దాహాల అంతులేనితనాన్ని విలపిస్తాడు. లోపలి బొమ్మలతో బయటి బొమ్మల్ని ఆడిస్తాడు గమ్మత్తుగా.

సీనులూ సంభాషణలూ ఒక దానితో ఒకటి పోటీ పడతాయి. ట్విస్టులు ఇస్తాడు. కానీ అవి మన సినిమాల్లో మాదిరి, అత్యంత అతి నాటకీయంగా ఉండవు. అంత అతిచేసి పాఠకుణ్ణి ఆకట్టుకోవాల్సిన ఖర్మ నాకు లేదనుకుంటాడు. గర్ల్‌ఫ్రెండ్సూ బాయ్‌ఫ్రెండ్సూ రిలేషన్‌షిప్పులూ బ్రేకప్పులూ, బీచ్‌లు, బెడ్ రూమ్‌లు, కాఫీ ఆవిర్లతో కలిసి తిరిగే ఉన్మత్త భావోద్వేగాలు.. జ్ఞాపకాలు.. ఇలా చాలా చాలానే ఎలిమెంట్స్ ఉన్నాయి. కమర్షియల్‌గా ఎంతయినా కుమ్మేసుకోవచ్చు. అర్జున్ రెడ్డినీ, గర్ల్ ఫ్రెండునీ మించిపోవచ్చు. వాళ్లకి మనోవాల్మీకాల్లోకి వెళ్లే దమ్మెక్కడిది? ఇతడు సాహసి.

మనో ప్రపంచం లోతుల్లో పరావర్తనాల్లోకి తొంగిచూసే మల్లికార్జున్ తనదైన సొంత ముద్రకి నిబద్ధుడు. అతగాడి టచ్చే వేరు. ఒక్క స్పర్శలోనే మాటలకందని ఆర్తిని ఒంపగలడు. ఒక్క గెశ్చర్లో ఒంటరితనపు వేదనను స్ఫురింపజేయగలడు. ఒంటరితనపు బీభత్సాన్నీ ప్రేమార్తినీ ఒకే దెబ్బకి రెండు పిట్టల్లా పడగొట్టగలడు. మల్లికార్జున్ కలల్నీ మనుషుల్నీ విడదీసి చూడలేడు..

ఈ కలగాపులగంలోనే మనిషిలోపలి విలయాన్ని సూచించగలడు. ‘ఒక ఎండాకాలపు మధ్యాహ్నం’లో పాఠకుడిని ఆకట్టుకునే సామగ్రి అంతా ఉంది. కాకపోతే  కేవలం ఆకట్టుకోడానికి కాదు. బొమ్మల లోపలి బొమ్మలు చూపించడానికి. ఒక దృశ్యం ఒక్క గాయాన్ని చెప్పదు. అనేక గాయాల మూట విప్పుతుంది. (అవి తాను చేసినవీ తనకు తాను చేసుకున్నవీ కూడా కావచ్చు). ఆ మూటలోనే ప్రేమలుంటాయి. పుస్తకాలుంటాయి. కాఫీ ఆవిర్లని మించిన కోరికల సెగలుంటాయి. కథలో ట్విస్టులు జస్ట్ అలా రోడ్ కర్వ్‌లా వయ్యారి నడుం ఒంపులా  సహజంగా జీవితానికి దగ్గరగా ఉంటాయి. Steamy scenes చదివితే వృద్ధులక్కూడా అయ్యో ఇంకోసారి యవ్వనం రాదా అనిపిస్తుంది. సీన్లు ఎగశ్వాసలతో  సెగలు కక్కినా కూడా సహజంగానే ఉంటుంది. చిలిపితనం సీరియస్సై ఇందులోని మనుషులు కళ్లనీళ్లు పెట్టుకుంటారు. ఇట్టే మర్చిపోయి నవ్వుకుంటారు. మరువలేక చావాలనుకుంటారు. చావలేక ఏడుస్తారు. ఏడవలేక నవ్వుతారు.

ఒక్కమనిషిలోనే వారికే అనేక ముఖాల అపరిచితులుంటారు. మనుషుల మనోభావాలు ప్రకృతి అందాలతో కలిసి ఉంటాయి. చాలా మామూలు సంభాషణల్లోనే మనుషుల మధ్య సంబంధాలు ముందుకీ వెనక్కీ జరుగుతూ ఉంటాయి. కథని తమతో పాటు ముందుకు తీసుకెళ్తాయి. కేవలం మనుషుల్ని బొమ్మకట్టడంతో ఊరుకోడు. వారి మనుసుల్లోని బొమ్మలాట ఇతగాడి నవల్లో అసలు కథ. పీడకలలు అనేక కథలు చెప్తాయి. ఉపకథలు అసలు కథలో మనుషుల మనోభావాలతో మిళితమైపోతాయి.

 

ఒక కొత్త వస్తువు తీసుకున్నాడు. కొత్త శైలి క్రియేట్ చేసుకున్నాడు. తనను తాను బ్రేక్ చేసుకున్నాడు. కాగితం పడవల్లో ఊరేగినోడు, నగరంలో వాన అందాలను సైతం మనుషుల రూపాల్లోకి తెచ్చినోడు మామూలోడు కాదు.. పాప్ కార్న్ ఒళ్లోపోసుకుంటాడు. ఒలకబోసి ఎత్తుకుంటాడు. కాగితం పడవలు కథల్లో మల్లికార్జున్ మోడర్న్ రిలేషన్షిప్స్‌ని రకరకాల కోణాల్లో ఎక్స్ ప్లోర్ చేశాడు. ‘ఒక ఎండాకాలపు మధ్యాహ్నం’ నవల బహుశా ఆ అన్వేషణకి కొనసాగింపు, లేదా next level. అమృతం ప్రేమ.. బ్రేకప్ ప్రేమ.. మృత్యువు కూడా ప్రేమే.. మరి విషం ఏమిటయ్యా అంటే తినబోతూ రుచి అడగలేమంటాడు, తిన్నాకా రుచి చెప్పలేమంటాడు. జ్ఞాపకం ఏమిటయ్యా అంటే అది పళ్ల మధ్య చిక్కుకున్న దారం పోగు. దాన్ని లాగే కొద్దీ ద్రౌపది చీరలాగా అలా వస్తూనే ఉంటుంది టన్నుల కొద్దీ. లాగుతూ లాగుతూ స్పృహ తప్పి పడిపోయాకగానీ తెలియదు అదేమిటో.

కాలం మారింది. తరాలు మారాయి. కొత్త తరాల ముందు చాలా చాలా కొత్త ఆప్షన్స్ వచ్చాయి. గ్లోబల్ లెవెల్లో ఒక స్కిల్డ్ వర్కింగ్ క్లాస్ పుట్టుకొచ్చింది. అది భూస్వామ్య, స్త్రీ పురుష అసమాన సంబంధాల్లో ప్రజాస్వామికమైన మార్పులు కోరుకుంటోంది. దీనిలో జెండర్ అధిపత్యం సమస్య ఒకటి. పాతవాసనలూ కొత్త అవకాశాలూ సంఘర్షించి రిలేషన్షిప్స్‌ని సఫొకేట్ చేస్తున్నాయి. ఓ పక్క ఆప్షన్లు రిలేషన్షిప్స్‌ని వేరే స్థాయికి  తీసుకెళ్తున్నాయి. ఇటు లోకల్ అటు గ్లోబల్ సంస్కృతులు చెరో పక్కా లాగుతున్నాయి. ఇదంతా వ్యక్తుల వల్లనే అనేది న్యాయంగానే కనిపిస్తుంది. కానీ అదొక్కటే కారణమా?

మల్లికార్జున్ ఇలాంటి అనవసర చర్చల జోలికి పోడు. ఈ చర్చంతా పాఠకుడి ఊహకే వదిలేస్తాడు. ఒక జంట ప్రేమించుకోవడం ప్రేమే. విడిపోవడం కూడా ప్రేమేనా! ఈ కాన్సెప్టుని ఎవరైనా ఎలా వివరించగలరు. మనిషి ప్రేమతో తనని తాను సత్కరించుకుంటాడు. ప్రేమతోనే తనను తాను శిక్షించుకుంటాడు. ఒక ఎండాకాలపు మధ్యాహ్నంలో  ఏకాకులున్నారు.. సలసలకాగే ప్రేమికులున్నారు. స్నేహితులున్నారు, స్త్రీ పురుషులున్నారు. వాళ్ల మధ్య శారీరక మానసిక సంబంధాలున్నాయి. కుటుంబ సంబంధాలున్నాయి.  ప్రేమకీ స్వేచ్ఛకీ మధ్య ఘర్షణలున్నాయి. ప్రేమకీ అహాలకీ మధ్య ఘర్షణలున్నాయి. జీవిత కాలానికి సరిపడా పశ్చాత్తాపాలున్నాయి. వేధించే జ్ఞాపకాలున్నాయి. వాటిలో ఆశల బీజాలున్నాయి. వీటన్నిటిలో రెండు కుక్కలు (బుజ్జి, మిలీ) కూడా మనుషులతో సమంగా ఉన్నాయి. అవి ఏడుపు మర్చిపోయిన వాడిని కూడా భోరున ఏడ్చేలా ప్రేమిస్తాయి. వాటికి కూడా మనుషులకు మాదిరే మంచి కలలూ, పీడకలలూ వస్తాయని చెప్పాడు.

కథానాయకుడు మళ్లీ మళ్లీ ఆ ఉత్తరాన్ని చదువుకుంటున్నంత కాలమూ ఈ నవలకి ముగింపు లేదు.. అది ఎన్నెన్నో ఏళ్ల నాటిది. ఇంకెంత కాలం కొనసాగుతుందో తెలీదు! ఒక ఎండాకాలపు మధ్యాహ్నం ముగింపు మూసుకోదు, తెరుచుకుంటుంది. ఆ ఉత్తరం పట్టుకుని ఎన్ని దేశాలైనా తిరగవచ్చు. ఎందరు మనుషుల్నైనా(ఆడా మగా కూడా) కలుసుకోవచ్చు. May be sequels లో టైమ్ ట్రావెల్ చెసెయ్యచ్చుకూడా.. అంటే నవలకి అర్థం పరమార్ధం ఏమిటనేది  తాను చెప్పకుండా పాఠకుడికే ఓపెన్‌గా వదిలేశాడు మల్లికార్జున్.

ఒక ఎండాకాలపు మధ్యాహ్నం (నవల)

రచయిత: వి.మల్లికార్జున్

వెల: రూ.200‌

ప్రచురణ: ప్రేమలు పుస్తకాలు

ప్రతులకు: ఫోన్ – 81062 28999

 

వసీరా నుంచి వి. మల్లికార్జున్‌కి మూడు ప్రశ్నలు –

 

ఈ నవల రాయడం నేను తీసుకున్న పెద్ద ఛాలెంజ్!

  1. కథలంటే ఎలా ఇష్టం కలిగింది? కథలు రాయడం వెనుక కథేంటి?

నాకు చిన్నప్పట్నుంచీ కథలు చెప్పడమంటే చాలా ఇష్టం. మా అమ్మ బడికెళ్ళి ఏమీ చదువుకోకున్నా కథలు చెప్పడంలో ఆమె తనకు మాత్రమే ప్రత్యేకమైన ఒక శైలిని అలవాటు చేసుకుందనిపిస్తుంది. నేను అమ్మను చూసే కథలు చెప్పాలనుకున్నానేమో. అలాగే టీనేజీలో ఉన్నప్పటినుంచే చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు నన్ను ఇటువైపు తీసుకొచ్చాయనుకుంటాను. నా మొదటి కథ అచ్చయి పదేళ్ళు దాటింది. ఇప్పటికీ ఏదైనా రాసినప్పుడంతా చదువుకొని మురిసిపోతుంటా. ఒక కథ రాయడానికి మించిన సంతోషమేదీ నాకిక్కడ దొరకదనుకుంటాను.

  1. నల్గొండ నేపథ్యం నుంచి మోడరన్ అర్బన్ కథకి ఎలా ట్రాన్స్‌ఫామ్ అయ్యారు? కాగితం పడవలకి ప్రేరణ ఏమిటి?

కొన్నేళ్ళుగా హైదరాబాద్‌లో ఉండబట్టి ఇక్కడ ఎవరితోనైనా మాట్లాడేటప్పటి భాషకు, ఇంటికెళ్ళి అమ్మతోనూ చుట్టుపక్కలవాళ్ళతోనూ మాట్లాడేటప్పటి భాషకు చాలా తేడా ఉండటం నాకే తెలుస్తుంటుంది. అత్యంత సహజంగా జరిగే ప్రక్రియేమో ఇది. నేను ఆ ప్రపంచాన్నీ ఈ ప్రపంచాన్నీ నా కథల్లోకి తీసుకురావడం కూడా అలాగే జరిగిందనుకుంటాను. నేను మా ఊరినెంత ఇష్టపడతానో ఈ హైదరాబాద్ నగరాన్నీ అంతే ఇష్టపడతాను. అంత ఇష్టంగా రెండు జీవితాల్నీ నాలో నింపేసుకోవడం వల్ల ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ సులువుగా జరిగిందేమో. నేనైతే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఏ ప్రయాస లేకుండా దూకేస్తూ కథలు రాయగలననుకుంటాను. ఆ రాయాలనుకున్న కథ ఇబ్బంది పెట్టడమే గానీ, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎప్పుడూ ఇబ్బంది కాలేదు.

౩. ఒక ఎండాకాలపు మధ్యాహ్నం నవలని కన్సీవ్ చెయ్యడానికి మూడేళ్ళు పట్టింది అన్నారు కదా. ఎలా నిర్వహించగలిగారు, ఎటువంటి నొప్పులు పడ్డారు నేపథ్యం వివరించగలరా?

పైనే చెప్పినట్టు ఏదైనా రాసిన తర్వాత కలిగే సంతృప్తి నిజంగా హాయిగా ఉంటుంది. కానీ రాస్తున్నప్పుడు ఎంత క్షోభ పడతానంటే, ఒక్కోసారి ఇదంతా అవసరమా అని కూడా అనుకుంటాను. ఆ వెంటనే రాయడానికి కాకపోతే ఇంకెందుకు అని కూడా అనుకుంటాను. ఒకటేదైనా రాసి పబ్లిష్ అయిన తర్వాత చనిపోయినా చాలు అనేంత ప్రేమ కలుగుతుంది ఆ రాసినదాని పట్ల.

ఒక ఎండాకాలపు మధ్యాహ్నం నవల రాయడం నేను తీసుకున్న పెద్ద ఛాలెంజ్. రెండే ప్రధానపాత్రలైనా వాళ్ళిద్దరి కథ, వారి జీవితాల్లోని అనిశ్చితి, వారి ఆలోచనల్లోని కాంప్లెక్సిటీని అర్థం చేసుకొని నేనీ కథని ఇప్పుడున్నట్టుగా రాయడానికి ఇన్నేళ్ళు పట్టింది. ఇన్నేళ్ళూ రాసానా అంటే, కాదు, ఊరికనే కూర్చొని దీని గురించి ఆలోచిస్తూ ఉన్నా. అలా ఆలోచిస్తూనే ఏమీ చెయ్యకుండా ఉన్న రోజుల్ని తల్చుకున్నప్పుడు, ఏమో నేనిది రాయలేక ఫెయిల్యూర్‌గానే మిగిలిపోతానేమోనని కూడా అనుకున్నా.

*

వసీరా

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు