1
ఉక్కపోతల ఋతువు
తెల్లారకుండానే
కళ్ళు మిరుమిట్లు కొలిపే
తెల్లని ఎండ
105 డిగ్రీల జ్వరంతో
ఒళ్ళు కాలిపోతున్న నేలతల్లి
కిటికీకి అతికించిన పత్రచిత్రంలా
అల్లాడని ఆకులు
మాంత్రికుడు శాపం ఇచ్చినట్లు
బిగుసుకుపోయిన వృక్షాలు
రెక్క విప్పడానికి బద్ధకించే
పులుగు బాలలు
బియ్యపు గింజ
నోట్లో పెట్టుకున్న చీమ ముందుకు కదలదు
నీడ కోసం వెతుక్కుంటూ
పెళ్లి నడకలు నడిచే పిల్లి
నిత్యం రద్దీ రహదారులు
హారన్ల మోతలు
వాహనాల రణగొణ ధ్వనులు లేక
నిశ్శబ్ద వాటిక
పట్టపగలే అర్ధరాత్రిలా
కటికమౌనం
కాలువ నీళ్లలో పదేపదే
ఒళ్ళు తడుపుకుంటున్న కుక్క
ఎండ దేవుడు విధించిన కర్ఫ్యూకు
బయటకు రావటానికి భయపడుతున్న సగటు జీవులు
ఎవరికైనా ఎండాకాలం
రెండు నెలలే మాకు మాత్రం
ఎప్పుడు వేధించే
ఉక్కబోత ఋతువే
2
పొగడపూలు
కోయిల రంగు కనురెప్పల తెరలు జరిపి
చూపుల దారాలతో
కళ్ళను కిటికీకి కట్టేసి రికామీగా కుర్చీలో కూర్చొని
వానను చూస్తుంటే ఒకానొక మార్మిక జగత్తులో
రెక్కలు విప్పిన ఆనందం రాత్రి దీపాల వెలుగులో
నింగి నుంచి నేలకు వేలాడే
వెండి జలతారు ధారల
వాన చినుకుల నిచ్చెన
ఎన్నెన్ని విప్పారిన జ్ఞాపకాల ఫించాలు చిన్నప్పుడు ఏమీ తెలియని
అమాయకపు బంగారు రుతువులో
అమ్మ చూడకుండా
వానా వానా వల్లప్పంటూ వానలోనే జలకాలాటలు
కొన్ని కాళరాత్రులు
ఇంట్లోకే వలస వచ్చిన ఆకాశం
పెంకుటింటి పై కప్పులో పూరించని ఖాళీలు
నేల తడవకుండా
ఇల్లంతా పరచిన గిన్నెల్లో టపటపా పడుతున్న
వాన చినుకుల మద్దెల చప్పుళ్ళు
ఇల్లు వీధి ఒక రూపక సమాసం
వానకురవని పొడిచోట పిల్లలమంతా
జరిగి జరిగి ఒకరిపై ఒకరు ఒరిగి ఒరిగి
అమ్మ ఒడిలో తలదాచుకున్న రాత్రులు పెద్దయ్యాక
నింగిలో మబ్బుల్ని చూసినప్పుడల్లా
మనస్సు పుస్తకంలో మెరిసిన
‘ధూమజ్యోతి స్సలిల మరుతాం ‘
శ్లోకం అనుకోకుండా బడికి సెలవు ప్రకటించినపుడు
వానదేవుడు
సంతోషం వర్షంలో తడిసిన హృదయం
చూరు కింద ప్రవాహంలో నోట్స్ లోని ఖాళీ పేజీలు చింపి చేసిన
కాగితం పడవలు
అలా వయ్యారంగా కదిలిపోతుంటే
కళ్ళల్లో కురిసే
ఆనందాల వాన
వర్షం వర్షం వర్షం
ప్రహర్షం ప్రమోదం
ఆ బాల్యం
ఆ స్నేహితులు అపురూపం
ఎప్పటికీ మరపురాని పొగడ పూల జ్ఞాపకాలు జీవితంలో
ఎంత ఎత్తుకు ఎదిగినా
తిరిగి రాని క్షణాలు
*








Add comment