బొంబాయిలో నా క్రికెట్

వంగూరి జీవిత కాలమ్- 59

మాటకి ఆ మాటే చెప్పుకోవాలి అంటే ఆ నాటి బొంబాయి..అనగా ఈ నాటి ముంబై లో నా క్రికెట్ జీవితం ఆడడం కన్నా చూడడమే ఎక్కువ అనే చెప్పుకోవాలి.

కాకినాడ నుంచి బొంబాయి ఐఐటీ లో, హాస్టల్ 1 లో అడుగుపెట్టగానే ఆత్మీయ మిత్రులైన బివైమూర్తీ అనబడే భాగవతుల యజ్ఞనారాయణ మూర్తి, పిఆర్ కె రావు అనబడే పులపాక రామకృష్ణ రావు కూడా క్రికెట్ ఆటగాళ్ళే అవడంతో ఆ హాస్టల్ ఉండే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరం కూడబలుక్కుని ఒక క్రికెట్ టీమ్ మొదలుపెట్టాం. మేము ముగ్గురమే కాక నాకు ఇంకా జ్ఞాపకం ఉన్న వాళ్ళలో ఒకానొక పంజాబీ వాడి పేరు మర్చిపోయాను కానీ బురాగొయెన్ బాగా గుర్తున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకానొక ప్రత్యేకమైన జాతికి చెందిన వాళ్ళే. ఈ జాతి వాళ్ళు ఫుట్ బాల్, హాకీ. టెన్నిస్, క్రికెట్, బిలియర్డ్..ఇలా అన్ని ఆటల్లోనూ మాంచి ప్రావీణ్యం ఉండడమే కాక చదువులోనూ తీసిపోరు. వీళ్ళిద్దరిలో ఈ బురాగొయెన్ అస్సాం వాడో ఏమిటో తెలియదు కానీ చైనా వాడిలా ఉంటాడు. చదువులో బాగా రాణించి కాలక్రమేణా గౌహాతీ లోనో పెట్టిన ఐఐటీ కి వ్యవస్థాపక డైరెక్టర్ గా పనిచేశాడు.

ఈ హాస్టల్ 1 టీమ్ లో ఉన్న రెండేళ్ళ పాటూ (1966-68) అప్పుడప్పుడు మిగతా అండర్ గ్రాడుయేట్స్ హాస్టల్ టీమ్ లతొ మేచ్ లు ఆడి ఓడిపోవడమే కాని ఎక్కువ గా గుర్తుంచుకోవలసిన విషయాలు లేవు. కానీ బొంబాయి వెళ్ళిన కొత్తలోనే అఅంత వరకూ పేపర్లలోనూ, స్పోర్ట్స్ ఇల్లస్త్రేటెడ్ మేగజీన్లలోనూ చూసిన కొంత మంది భారత దేశం వాళ్ళే కాదు వెస్ట్ ఇండీస్ గొప్ప క్రికెట్ ఆటగాళ్లని కూడా ప్రత్యక్షంగా చూసే మహత్తరమైన అవకాశం లభించింది.

బొంబాయి బ్రేబర్న్ స్టేడియమ్ లో టెస్ట్ సెలెక్షన్స్ కి ఇండియా లో ఆడే ప్రముఖులందరినీ రెండు టీమ్స్ కింద చేసి వాళ్ళ మధ్య రాబోయే వెస్ట్ ఇండీస్ మీద టీమ్ ఎంపిక కి సెలెక్షన్ బోర్డ్ వాళ్ళు పెట్టిన మేచ్ నేను మొట్టమొదట చూసిన మెగా మేచ్. అంత వరకూ కనీసం రంజీ ట్రోఫీ మేచ్ కూడా చూడని నాకు 22 మంది ఇండియా టెస్ట్ ఆటగాళ్ళనీ, కొత్తగా ఎంపిక అవబోయే వాళ్ళనీ ఒకే సారి చూడడడం ఒక మహత్తరమైన అనుభూతి. ఆ స్టేడీమ్ ని ఇప్పుడు వన్ ఖాడే స్టేడియం అంటున్నారు. ఆ మేచ్ లో నేను చూసిన ఇండియా యువ ఆటగాళ్ళు నవాబ్ ఆఫ్ పటౌడి, ఫరూక్ ఇంజనీర్ (వికెట్ కీపర్), చందూ బోర్డె, బి.ఎస్ చంద్రశెఖర్, జై సింహ మొదలైన వారు అయితే సీనియర్ ఆటగాళ్ళు పోలీ ఉమ్రీగర్, పంకజ్ రాయ్, విజయ్ మంజ్రేకర్ మొదలైన వారు.

ఈ సెలెక్షన్ మేచ్ లో మా కాకినాడ వాడు అయిన కె. వెంకట రమణ మూర్తి, బొంబాయి వాడే అయిన అజిత్ వాడెకర్ కూడా ఉన్నారు కానీ,  మా కెవిఆర్  మూర్తి ఎంపిక కాలేదు. వడేకర్ ఎంపిక అయ్యాడు. ఈ మొత్తం ఆడగాళ్ళు అందరిలోనూ స్టేడియమ్ లో ఎక్కడో కూచుని ఫీల్డ్ లో చూడగానే బైనాక్యులర్స్ అక్కర లేకుండానే ఠకీమని గుర్తుపట్టగలిగిన మేజిక్ ఉన్నవాళ్ళు పటౌడీ, ఉమ్రీగర్. ఈ మేచ్ లో నాకు బాగా గుర్తున్న ఒక విశేషం పటౌడీ బేటింగ్. అప్పుడప్పుడే ఫాస్ట్ బౌలర్ గా పైకి వస్తున్న మొహమ్మద్ ఆలీ యే ఏదో పేరు మర్చిపోయాను కానీ అతడి ఒక ఒవర్ లో పటౌడీ రెండు సిక్స్, మూడు ఫోర్లు సునాయాసం గా కొట్టగానే మేము   వెర్రెక్కి పోయాం. ఆ బౌలర్ పుట్టగతులు లేకుండా హిమాలయాలకి వెళ్ళి పోయి, ఇండియా క్రికెట్ లో మళ్ళీ అతని పేరు వినపడ లేదు. ఇంతకీ ఈ టెస్ట్ సెలెక్షన్స్ ఎందుకూ అంటే అప్పుడు ఇండియా టూర్ కి వచ్చిన వెస్ట్ ఇండీస్ తో ఆడడానికి. ఆ టీమ్ అంతా బొంబాయి లో దిగ గానే టెస్ట్ మేచ్ కి ముందు ఏదో ఒక సెరిమోనియల్ మేచ్…..అంటే ప్రెసిడెంట్స్ ఎలెవెన్ లాంటి పేరు తో అదే స్టేడియం లో వెస్ట్ ఇండీస్ టీమ్ తో మరొక మేచ్ ఏర్పాటు చేశారు. ఇది కూడా ఒక రకంగా మన టీమ్ సెలెక్షన్ కోసమే. అప్పుడు మొదటి సారిగా ఆ వెస్ట్ ఇండీస్ టీమ్ ని  ఫీల్డ్ లో చూశాను. చూడగానే ఎక్కడో ప్రేక్షకులలో కూచున్న మేమే భయం వేసి దడ దడ లాడిపోయాం.

ఎందుకంటే అలా ఏడేసి అడుగుల పొడుగు ఉన్న నల్ల జాతి భారీ మనుషులని ఏనాడూ చూడ లేదు కదా. ఇక నాకు ఇప్పటికీ కళ్ళకి కట్టినట్టు కనపడేది ఆ నాడు మన ఓపెనింగ్ బేట్స్ మన్ పంకజ రాయ్. వెస్లీ హాల్ అనే ఆ ఏడు అడుగుల వెస్ట్ ఇండీస్ ఫాస్ట్ బౌలర్ ఏకంగా బౌండరీ లైన్ నించి పరిగెట్టుకుంటూ వచ్చి గంటకి 75 మైళ్ళ వేగంతో బంతి విసురుతూ ఉంటే….ఎంతో సీనియర్ అయిన పంకజ రాయ్ కాళ్ళు ఎంత గడ గడా వణికాయో నాకు ఇంకా గుర్తే. ఇదే పంకజ రాయ్, వినూ మంకడ్ తో కలిసి ఓపెనింగ్ పార్ట్ నర్ షిప్ లో న్యూజీలండ్ మీద మద్రాసు టెస్ట్ లో 418 పరుగులతో 52 ఏళ్ళు రికార్డు లలో నిలిచినవాడు. ఆ రోజుల్లో ఇండియాలో రమాకాంత్ దేశాయ్ లాంటి మీడియమ్ పేస్ బౌలర్లు గంటకి ముఫై-నలభై మైళ్ళ వేగంతో బంతి వేసే వారు. గంటకి 60 దాటి వేస్తేనే ఫాస్ట్ బౌలర్ క్రింద లెక్క. అలాంటి వారు అప్పుడు ఇండియాలో లేరు. అంచేత అంత వేగవంతమైన ఫాస్ట్ బౌలింగ్ కి అలవాటు లేక ఇండియా బేట్స్ మన్ దడుసుకునే వారు. పైగా మధ్యలో వాళ్ళు వేసే బౌన్సర్లు ప్రాణాంతకం. ఇక్కడ నాకు బాగా జ్ఞాపకం ఉన్న నారీ కాంట్రాక్టర్ ఉదంతం చెప్పి తీరాలి.

అప్పటికి నాలుగేళ్ళ క్రితం….అంటే నేను ఇంజనీరింగ్ లో చేరిన తర్వాత నారీ కంట్రాక్టర్ అనే పార్శీ ఆటగాడు ఇండియాకి క్రికెట్ కేప్టెన్ గా ఎంపిక అయి వెస్ట్ ఇండీస్ టూర్ కి ఇండియా టీమ్ వెళ్ళారు. అక్కడ ఒక మేచ్ లో ఓపెనింగ్ బేట్స మన్ నారీ కాంట్రాక్టర్. చార్లీ గ్రిఫిత్ అనే ఫాస్ట్ బౌలర్ వేసిన బౌన్సర్ తప్పించుకోడానికి కి తల తిప్పగానే అంత వేగవంతమైన ఆ గట్టి బంతి తగిలి అతని తల చిట్లిపోయి, రక్తస్రావం తో స్పహ తప్పిపోయాడు. అంతే కాక శరీరం లో రక్తం గడ్డ కట్టుకుపోయి నడుము కి క్రింద భాగానికి పక్షవాతం వచ్చింది. వెస్ట్ ఇండీస్ కేప్టెన్ ఫ్రాంక్ వొరెల్, మన ఆటగాళ్ళు పోలీ ఉమ్రీగర్, బాపు నడ్కర్ణి, చందూ బోర్డె రక్త దానం చేసి అతని ప్రాణాలు కాపాడారు. ఆశ్చర్యం ఏమిటంటే అదే నారీ కంట్రాక్ట్రర్ అంతకు మూడేళ్ళ ముందు ఇంగ్లడ్ లో ఆడుతునప్పుడు బ్రయన్ స్టాదమ్ బౌలింగ్ కి రెండు నడుం ఎముకలు విరిగినా మొండిగా ఆడి 81 పరుగులు చెశాడు.

ఆ తర్వాత కాన్పూర్ లో  ఆస్ట్రేలియా టెస్ట్ లో అతను బేటింగ్ చేస్తూ ఒక  లెగ్ స్క్వేర్  డ్రైవ్ కొట్టగానే అతి దగ్గర లోనే షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న నీల్ హార్వే ఆ బంతి తనకి తగలకుండా తప్పించుకోడానికి  ‘బాబోయ్’  ని వెనక్కి తిరిగాడు. ఎంపైర్ కి ఆ బంతి ఎక్కడికి పోయిందో కనపడ లేదు. తీరా చూస్తే అది అలా వెనాకి తిరిగి వంగుని ఉన్న నీక్ హార్వే తొడల మధ్య ఇరుక్కు పోయింది. అతను దాన్ని “కామ్” గా బయటకి తీసి “హౌజీట్?” అనగానే నారీ కాంట్రాక్ట్రర్, ఎంపైర్ ల తో సహా చూస్తున్న వేల మందీ జనం నిర్ఘాంత పోయారు. ఈ సంఘటన నాకు కూడా భలే బాగా ఇప్పటికీ జ్ఞాపకమే. అప్పుడు నేను ఏడో ఫారమో, ఎనిమిదో ఫారం లోనో ఉన్నాను. అంతా రేడియో కామెంటరీ లో వినడం. ఎగిరి గెంతులు వెయ్యడం.

ఇక నేను చూసిన ఒకే ఒక టెస్ట్ మేచ్ ఇండియా vs వెస్ట్ ఇండీస్. బొంబాయి లో 1966 డిశంబర్ లోనే. అది అజిత్ వడేకర్ అరంగేట్రం. పటౌడీ కేప్టెన్సీ లో జైసింహ, దిలీప్ సర్దేశాయ్ ఓపెనింగ్, అబ్బాస్ ఆలీ బైగ్, చందూ బోర్డె, అజిత్ వడేకర్, సలీం దురానీ, బాపు నడ్కర్ణి, వెంకట రాఘవన్, బి.ఎస్. చంద్ర శేఖర్ బుధి కుందెరన్ (వికెట్ కీపర్). ఇక వెస్ట్ ఇండీస్ వేపు గారీ సోబర్స్ కేప్టెన్సీ లో క్లైవ్ లాయడ్ కి ఇది అరంగేట్రం మేచ్. మిగతా ఆటగాళ్ళలో రోహన్ కన్హాయ్, లాన్స్ గిబ్స్, వెస్లీ హాల్, కాన్రాడ్ హంట్ మొదలైన వారు. ఈ ఐదు రోజుల పండగ లోనూ బోర్డే, హంట్ సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో చంద్రశేఖర్ 7 వికెట్లు తీయడం కూడా చెప్పుకోదగ్గ విశేషమే!. వెస్ట్ ఇండీస్ నెగ్గిన ఈ మేచ్ లో విపరీతమైన ఆకర్షణ పటౌడీ మన వేపు అయితే  గేరీ సోబర్స్ అటు వేపు. వీరి ఆట చూడడానికి ఎంతో సుకుమారంగా, సునాయాసంగా, సొగసుగా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇద్దరూ ఆడిన రెండేసి ఇన్నింగ్స్ లోనూ అర్ధ సెంచరీలు చేసినా…ఇలా వచ్చి అలా వెళ్ళి పోయినట్టు మేము ఇంకా వాళ్ళ మేజిక్ లో తన్మయత్వం లో ఉండగానే 50 పరుగులు ఎప్పుడు కొట్టారో తెలియనే తెలియకుండా హుందాగా ఉంది. ఇక సోబర్స్ ఒక పెద్ద సంచనలమే సృష్టించాడు. వాళ్ళ టీమ్ బొంబాయి లో ఉన్న పది రోజుల్లోనూ ఏదో ఒక పార్టీ లో బాలీవుడ్ లో నటి గా అపుడప్పుడే పేరు తెచ్చుకుంటున్న అంజు మహేంద్ర అనే అమ్మాయిని ప్రేమించి, పెళ్ళి చేసుకుంటున్నట్టు పేపర్ల నిండా వార్తలే. 1958 లో పాకిస్తాన్ మీద ఆడుతూ తన మొదటి టెస్ట్ లోనే 365 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సాధించిన సోబర్స్ అప్పటికే క్రికెట్ ప్రపంచం లో పెద్ద సెలెబ్రెటీ. ఈ అంజు మహేంద్రు ఉదంతం అంతా అంతా హడావుడే కానీ ఆఖరికి వాళ్ళకి నిజంగా పెళ్ళి అవనే లేదు పాపం.

ఇలా బొంబాయి లో 1966 లో మొదలయిన నా క్రికెట్ ప్రయాణం లో 1974 నాటికి క్రమంగా తగ్గుతూ వచ్చింది. నేను లెక్చరర్ గా ఉండడం, రిసెర్చ్ పనులతో సమయం వెచ్చించ లేకపోవడమే కాక క్రికెట్ ఆడే వయసు దాటిపోవడం మొదలైనవి దానికి ప్రధాన కారణాలు. 1973-74 ప్రాంతాలలో సుబ్బారావు అనే ఆయన సతీసమేతంగా కెనడా నుంచి వచ్చి  సివిల్ ఇంజనీరింగ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి, మా స్టాఫ్ హాస్టల్ లో మకాం పెట్టారు. ఆయన కెనడా నుంచి తెచ్చుకున్న ఆస్థి లో ఒక బ్లాక్ & వైట్ టెలివిజన్ కూడా ఉంది. ఆ రోజుల్లోనే క్రికెట్ మేచ్ లు టీవీలో ప్రసారం చెయ్యడం మొదలుపెట్టారు. ఆ ఏడు ఇండియా టీమ్ ఇంగ్లండ్ టూర్ లో అక్కడ ఇంగ్లండ్ లో పగలు ఆడుతున్న మేచ్ లో ఇండియాలో రాత్రి అలా సుబ్బారావు గారి ధర్మమా అని మొదటి సారి టీవీలో క్రికెట్ మేచ్ లు చూసి తరించాను. ఆ రోజుల్లో కేవలం బొంబాయి, అమృత్ సర్ లలో మాత్రమే టీవీ ప్రసారాలు ఉండేవి అంటే నమ్ముతారా? ఆ తరవాత అది ఏడు నగరాలకి విస్తరించారు. అప్పటికి నేను అమెరికా వచ్చేశాను.  అంతటితో నా జీవితం లో క్రికెట్ మాత్రమే కాదు….అన్ని ఆటలూ కట్టే, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్, పేకాటల తో సహా!. కానీ అమెరికాలో బ్రహ్మచారి పర్వం లో ఉన్న నాలుగేళ్ళూ టెన్నిస్ మటుకు ఆడేవాడిని. ఆ తర్వాత అప్పుడప్పుడు హ్యూస్టన్ మిత్రులతో సరదాగా పేకాట ఆడిన సందర్భాలూ ఉన్నాయి.

ఇక నా అమెరికా జీవిత కాలమ్ లోకి ప్రవేశించే సమయం వచ్చేసింది… మరొక సంచిక నుంచీ..

*

వంగూరి చిట్టెన్ రాజు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • వంగూరి చిట్టెన్ రాజుగోరండి,

    టెస్ట్ క్రికెట్ గోల్డెన్ ఎరా కాలం నాటి ఇండియా, వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజాలు నవాబ్ ఆఫ్ పటౌడి, అజిత్ వడేకర్, గ్యారి సోబర్స్, క్లైవ్ లాయడ్, వివిన్ రిచర్డ్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పి…. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ లెవిల్లో అప్పుడే “ ఇక నా అమెరికా జీవిత కాలమ్ లోకి ప్రవేశించే సమయం వచ్చేసింది “అనమాకండి సామే.

    గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్, బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, పాకిస్తాన్ ఇమ్రాన్ భయ్యా లంటూ ఇంకొంచం ఊసులు మాతో పంచుకోండి.

    పోనీ టెన్నిస్ ? …. అంటే వేలుపిళ్లై కధల ఫేం సి. రామచంద్ర రావు గారి గురించిన కబుర్లో. ఆ ఊటీ టీ ఎస్టేట్ మానేజ్ మెంట్ పనుల్లో కూరుకుపోకుండా పూర్తికాలం టెన్నిస్ మీదే దృష్టి పెడితే వింబిల్డన్ కి వెళ్లుండేవారే కదా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు