బైండ్ల సెంద్రయ్య బోనాల పండుగ

సిలక్కొయ్యకు జమిడికె నిశ్శబ్ద సముద్రం వోలే వేలాడుతుంది.

గల్వ ముందు పెద్ద గుమ్మి. అందులో రెండు పుట్ల వొడ్లు.

బర్రెలు కడుపు నిండా తాగడానికి కుడుతి గోలెం.

ఆ పక్కనే వాడుకోవడానికి పెద్ద నీళ్ల గోలెం.

సోమలింగం అప్పుడే బాయికాన్నించి వొచ్చిండు. కాళ్లకు అంటిన బురదను కడుక్కుండు.

మొహమ్మీద  చల్లటి నీళ్ళు సల్లుకున్నడు.

దండెం మీది తువ్వాల తీసుకొని తుడుచుకున్నడు.

తన మనసంతా పరేషాన్గా వున్నది. అప్పటికే పగటీలి రెండు గావొత్తంది. దర్దెపల్లిలో బోనాల పండుగ. ఐదు కిలోమీటర్లు నడిసి పోవాలె. బైండ్లోళ్లు లేకపోతే బోనాలు బయల్దేరవు. అసలే దామోదర్ రెడ్డి ఎంపిపి అయ్యిండు. తన వూర్లో పండుగ జోర్దార్గా జెయ్యాలని మాంచి వూపు మీదున్నడు. తొందరగా పోవాలే. బాయికాడ జొన్న సేన్లలో జీతగానితో గలిసి గుంటుక కొట్టి వచ్చేసరికి ఇగో ఈ జాము అయ్యింది.

తెల్లని దోతి గబగబా గట్టిండు. అంతకన్న తెల్లని అంగీ తొడిగిండు. గోడకున్న జమిడికె తీసి సంక కేసుకున్నడు. కిర్రు చెప్పులు యేసుకొని బజార్లకొచ్చిండు.

తన మనసంతా పండుగ మీద లేదు. సెంద్రన్న యాడుండో! ఆయన లేకపోతే పండుగ చేసుడు కష్టమని తనకు తెలుసు. సెంద్రయ్య ఇంటికి చేరుకున్నడు. కానీ ఇంట్లో లేడు. “వో సోవన్నా. వున్నవా” అని గట్టిగా కేకేసిండు. పొగాకు సుట్టుకుంటూ సోమన్న బయటికొచ్చిండు. తెల్లటి బట్టల్లో రెడీగా వున్నడు.

“పండుగ యాళ్ల అయితంది. నువ్వు ఉలుకు లేకుంట సల్లగున్నవేందే”? అన్నడు సోమలింగం.

ఆ మాటకు సోవన్నకు కోపం వొచ్చింది.

” యిప్పటి దాకా నువ్వే బాయికాడ వుంటివి. నన్ను అంటవేందిరో?”

“వొరకో. జొన్నసేను గుంట్కకొట్టకవోతే ఆగం గాదే. సరేగానీ సెంద్రన్న యాడుండు?”

“కోవటోళ్ల రాజ్యం అరుగుల మీద గూసునెగదా. కనవల్లేదురా?”

“నేను ఇట్ల నాయకుని బాయి మీదికేలొచ్చిన. సరే పా. ఇప్పటికే జామైంది పాపా” ఏగిర పెట్టిండు.

సోమన్న కూడా వొక జమిడికె జబ్బకేసుకున్నడు. ఇద్దరు బయల్దేరి కోమటోళ్ల రాజ్యం అరుగుల కాడికి వోయిండ్లు.

అక్కడ సెంద్రయ్య బీడీ తాగుతా కూసున్నడు.

సోమలింగం, సోమన్న ఇద్దరు ఎదురుగా వున్నరు. కానీ సెంద్రయ్య పట్టనట్టు కూసున్నడు అట్లనే.

సోమలింగంను అసహనం ముసిరింది.

“వోన్నా. దర్దెపల్లి పండుగ మరిసినవా. మనం బోకపోతే బోనాలు బయిలెల్తయానే” అన్నడు.

ఆ మాటకు సెంద్రయ్య కు కోపం వొచ్చింది.

“మూడిల్ల పొత్తు దర్దెపెల్లి. నువ్వు మేము రాంగనే సాలా? నడిపోళ్లు రావొద్దా?” అన్నడు.

పెద్దోళ్లు, నడిపోళ్లు, సిన్నోళ్లు అని మల్లంపల్లి బైండ్లోళ్లు ఆ సుట్టు పక్కల వూళ్లందరికీ తెలుసు. నర్సయ్య, ముత్తయ్య, పెర్మయ్య ముగ్గురు అన్నదమ్ములు.

ఆ ముగ్గురి సంతానమే వీళ్లు.

“నడిపోళ్ల ఎంకటన్న అప్పుడే పోయిండు. కొండపూరు ఆయనొంతేనాయె. ఆడ పండుగ బుచ్చం అడుక్కొని వొత్తా అన్నడు. మనమే జాము సేత్తన్నం. లేలే పోదాం” అని ఏగురవెట్టిండు సోమలింగం.

సెంద్రయ్య అయిష్టంగానే లేసిండు.

అంత అయిష్టం కలుగడానికి దామోదర్ రెడ్డే కారణం.

రెండు రోజుల కితం సెంద్రయ్య, సోమన్న, సోమలింగం, ఎంకటయ్యలను దామోదర్ రెడ్డి పిలిపిచ్చిండు. బోనాల పండుగ గాబట్టి పిలుత్తండని తెలుసు వాళ్లకు. అయితే, గతంలో బోనాల పండుగ ఎప్పుడు చేయాలన్నా వూళ్లే అన్ని కులాల పెద్ద మనుషులు కూసోని బైండ్లోళ్లను పిలిపించేటోళ్లు. వాళ్లంతా యే దినం పండుగ సేద్దాం? ఎట్లా సేద్దాం అని మాట్లాడుకొనేటోళ్లు. పండుగ జేసినందుకు బైండ్లోళ్లకు ఎంత కట్నం ఇయ్యాలనేది కూడా మాట్లాడేటోళ్లు. వాళ్లొక మాటంటే, బైండ్లోళ్లు వొక మాటనేటోళ్లు. ఆఖరికి ఏదోవొక మాట కుదిరేది. పండుగ జోరుగా జరిగేది.

ఈసారి దామోదర్ రెడ్డి ఆ ఆచారాన్ని వొదిలేశాడు.  తన యిష్టం వొచ్చినట్టు సేత్తండు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన గాలి జోరు మీదుంది. ఆ గాలిలో దామోదర్ రెడ్డి ఎంపిపి అయ్యిండు. యిగ అప్పణ్ణించి ఆయన కళ్లకు అందరు లెక్కలేని వాళ్ల మాదిరి కనిపిత్తండ్లు. రెండు రోజుల కితం పిలిస్తే ఆ ముగ్గురు బైండ్లోళ్లు పోయిండ్లు. వూరి కుల పెద్దలు యెవరూ లేరక్కడ. రెడ్డి యింటి ముందట ఆయన పార్టీకి చెందిన కార్యకర్తలు చాలామంది వున్నరు. వాళ్లంతా మండలంలోని వేర్వేరు వూళ్లోల్లు.

“బేస్తవారం పండుగ. జబర్దస్త్ గా  చెయ్యాలే. ఏమంటరు?” అన్నడు రెడ్డి. ఆయన వైపే అంతా చాలా గౌరవం, వినయంతో చూస్తున్నరు.

అందరి వైపు చూసిండు సెంద్రయ్య. తన పక్కనే తన తమ్ముడు సోమయ్య, నడిపి ఎంకటయ్య, సిన్నోళ్ల సోమలింగం కూసున్నరు. భుజమ్మీది కండువను తలకు సుట్టుకొన్నడు సెంద్రయ్య.

“పటేలా, ఏవనుకోకు గానీ.. బేస్తవారం పండుగని నువ్వే తీర్మానం జేసినవా? వూళ్లోని కుల పెద్దలంతా అనుకున్నరా?” అని పెద్ద బాంబు పేల్చిండు.

ఆ ప్రశ్న రెడ్డికి పెద్ద రాయిలా తగిలింది. అది తన అధికారాన్ని ఎగతాళి చేసినట్టుగా వుంది.

తనకోసం వొచ్చిన ఇతర గ్రామాల కార్యకర్తలు కిసుక్కున నవ్వడం తనకు యినవడ్డది.

అవమానం భరించలేక వూగిపోయాడు రెడ్డి.

“అరే బైండ్లోడ. తిక్కలేత్తందా యేందిరా? నేను ఎంపిపిని. మండలానికే అధ్యక్షుణ్ణి. నేను యేది సెప్తే అదే. వాళ్లనడిగేది యేంది బొచ్చు” అని రెడ్డి వూగిపోయాడు.

సెంద్రయ్య యేదో పెంట తయారు సేత్తండని లోపల్లోపల బెదిరి పోతండు సోమలింగం. సోమన్న తలొంచుకొని నేలమీద పుల్లతో ఏవో గీతలు కెలుకుతండు. సెంద్రయ్య సంగతి తనకు బా తెలుసు. పంచాయతి పెరిగితే ఎట్లా సముదాయించాలే అని ఆలోసిత్తండు.

ఎంకటయ్య లేసి ఏదో మాట్లాడుదామని నోరు యిప్పే లోపే సెంద్రయ్య లేసి నిలబడ్డడు. రెడ్డి కళ్లలోకి సూటిగా సూసిండు. ఆ సూపుకు రెడ్డి అద్దిరి పోయిండు.

“అదే మాట వూరి కుల పెద్దలకు సెప్పు‌. నువ్వు జిల్లా నాయకునివైనా సరే, వూరి మడిసివే పటేలా. ఆచారం ఆచారమే. మేము పద్దతి తప్పి పండుగ సెయ్యం. యింకా గూసొని కత సూత్తరేందిరా. లేండ్లి పోదాం” అన్నడు సెంద్రయ్య.

అదనా బైండ్లోడు తన మాట యినట్లేదనే అవమానం రెడ్డికి కర్రుతో వాత పెట్టినట్టయింది. కోపంతో రెచ్చిపోయిండు. సెంద్రయ్య ను అనరాని మాటలన్నడు.

“అడుక్క తినే బైండోనికి యాన్నుంచి వొచ్చిందిరా యీ దైర్నం. వొక్క తొక్కుడు తొక్కిన్నంటే తిన్నది కక్కాలే లంజా కొడుకా” అని మీదికి వురికొచ్చిండు.

సోమన్న విసురుగా లేసి అడ్డంగా నిలబడ్డడు. “యే పటేలా ఆగు. యాడికి వురుకొత్తన్నవు? యీ వూరికి నువ్వు కొత్తనా? మేము కొత్తనా? నీకింద జీతగాళ్లమనుకుంటన్నవా? లంజకొడుకా అంటన్నవ్? నలుగురు కుల పెద్దల పిలువు. వాళ్లే తప్పు మాట్లాడినోళ్లకు బుద్ధి జెప్తరు. మల్లంపల్లి బైండ్లోళ్లు అంటే ఏవనకుంటన్నవ్. నీకెంత భూవిజాగుందో అంతకంటే ఎక్కువే వుంది మాకు. గతికి లేనోళ్లంగాము. కులవుత్తి పోగొట్టుకోవొద్దని బైండ్లిరికం సేత్తన్నం‌. నీకు తెల్వకపోతే, మీ నాయిన్ని అడుగు. లేకపోతే మీ అన్నను అడిగి తెలుసుకో” గట్టి గట్టిగా ఎదురు బోయిండు సోమన్న.

ఆ గొంతులోని శక్తికి రెడ్డి వెనకడుగేసిండు.

అక్కడున్న వాళ్లు కూడా రెడ్డిని సముదాయించిండ్లు.

నడిపి ఎంకటయ్య ముందుకొచ్చి, “పటేలా, మాట జారినా కాలుజారినా మంచిదిగాదు. వూరి కుల పెద్దలతో మాట్లాడ్డానికి పిలిపియ్యి. మమ్ముల కూడా పిలు. మా కట్నం కూడా మాట్లాడుకుంటం‌. అప్పుడే పండుగ ఎప్పుడు సెయ్యాలో అనుకుందాం” అన్నడు.

ముగ్గురూ రెడ్డి యింటి గేటు దాటి వొచ్చిండ్లు. సెంద్రయ్య మనసు కోపంతో ఉడికి పోతుంది. నన్ను లంజకొడుకంటడా!?  రెడ్డిని నానా బూతులు తిట్టుకున్నడు మనసులో.  అట్లా ఎన్నో సార్లు తిట్టుకున్నాడు. అలా తిట్టుకున్నా మనసు సల్లారుతలేదు. ఎట్టా కసి తీరుతదా అని ఆలోచిస్తండు.

రెడ్డికి మరో దారి లేకపోయింది. వూరి పెద్దలను పిలిచిండు. అప్పటికే సెంద్రయ్య వూరి కుల పెద్దలకు జరిగింది సెప్పిండు. సాకలి, మంగలి, మాదిగ మూడు కులాలు లేకుండా ఏ పండుగా జరగదు‌. గొల్లోళ్లు, గౌండ్లోళ్లు, కమ్మరి కుమ్మరి, ముత్రాసి సబ్బండ కులాలు అంతా కలిసి వొక మాట అనాలి. అదే వూరి ఆచారం. నడుమ దామోదర్ రెడ్డి వొక్కడే అన్ని నిర్ణయిస్తే యింక వూరెందుకు మీరెందుకు? అని సెంద్రయ్య పెద్ద మనుషులతో అన్నడు.

వాళ్లంతా రెడ్డిదే తప్పు అన్నరు. ఆయన ఎంపిపి అయితే యేంది? ఎమ్మెల్యే అయితే యేంది? బైండ్లోళ్లను తిడుతడా? పనోణ్ణి తిడితే యెట్టా? యియ్యాల వాళ్లను తిట్టినోడు రేపు మమ్ముల తిట్టడా అని మాదిగోళ్ల పెద్ద మనిషి జలగం సోమయ్య ఆవేశపడ్డడు. “సెంద్రన్నా, పా. మేమొత్తం. ఆణి సంగతేందో అడుగుదాం పా” అన్నడు.

తొందర పడొద్దని బెల్లి లసుమయ్య సముదాయించిండు.

దామోదర్ రెడ్డి వూరి బొడ్రాయి కాడ అన్ని కులాల పెద్దలను పిలిపించి కూసుండ బెట్టిండు. సెంద్రయ్య, సోమలింగం, సోమన్న, ఎంకటయ్య కూడా కూసున్నరు. బేస్తారం పండుగ సేద్దాం అని రెడ్డి అన్నడు. నీ యిష్టం వచ్చినట్టు చేసుకోవడానికిది మండలాఫీసు గాదు. వూరు. మమ్ముల గాదని నువ్వొక్కనివే ఏ రోజు పండుగ చెయ్యాల్నో  సెప్తవా? అని తెనుగోళ్ల సారయ్య గయ్యిమని లేసిండు.

నువ్వు ఎంపిపివి అయితే మాకేంది? వూరన్నంక నీ పార్టీ తో పాటు అన్ని పార్టీలుంటయ్. పార్టీ పండుగా ఇది? సంప్రదాయం పాటించాలే అన్నడు గౌండ్ల రామయ్య. అంతా వొక్కసారే గయ్యిన లేచిండ్లు. మాదిగ పెద్ద జలగం సోమయ్య. బైండోళ్లను తిట్టినందుకు రెడ్డి క్షమాపణ చెప్పాలని పట్టువట్టిండు. సాకలి రాజయ్య, మంగళి శంకరయ్య కూడా దామోదర్ రెడ్డిదే తప్పు అన్నరు.

అన్నీ భరించిన రెడ్డి మాత్రం సెంద్రయ్య కు క్షమాపణ సెప్పేది లేదన్నడు. పండుగ ఎప్పుడు ఎట్లా సెయ్యాలో మీరే సెప్పాలని, మీరేది సెప్తే అదే నా నిర్ణయమని వినయంగా బతిమాలిండు. రెడ్డి బాగా తగ్గాడని అర్థం కావడంతో కుల పెద్దలు సెంద్రయ్యను సర్దుకొమ్మన్నారు. తెలిసో తెల్వకో రెడ్డి నోరు జారిండు. మనుసులో పెట్టుకోకు అని మందలిచ్చిండ్లు. ఐదువేల రూపాయలు, వొక పెద్ద మేక పోతు కట్నం కింద ఇవ్వడానికి వూరి పెద్దలు వొప్పుకున్నారు. ఎంతైనా ఎంపిపి పరువు తీయొద్దని బేస్తారమే పండుగ సేద్దామని అంతా కట్టుబాటు చేసుకున్నరు.

అలా బోనాల పండుగ సేయడానికి బయలుదేరిండ్లు.

సెంద్రయ్య ముందుగా జలగం సోమయ్యను కలిసిండు. “అన్నా, నాకు దామోదర్ రెడ్డి పటేల్ మీద అనుమానం వుంది. పండుగలో ఏదో కిరికిరి వెట్టి నన్ను కొట్టాలని సూత్తండు. నాకు భయం అయితంది” అన్నడు. జలగం సోమయ్య ఆ మాటలకు నవ్విండు. సెంద్రయ్య సంగతి తనకు బాగా తెలుసు. జలగం సోమయ్య బాయి, సెల్క బైండ్లోళ్ల భూములు పక్క  పక్కన్నే వుంటయి. వొకరోజు కర్రె కోడే కనవడ్డ అందరినీ పొడువ మీదికొత్తంది. అదిరియ్యబోయిన సెంద్రయ్య మీదికి కొమ్ములతో పొడవడానికొచ్చింది. ఆ కొమ్ములను పట్టుకొని కోడెను నిలువరించిండు. జలగం సోమయ్య సూత్తనే వున్నడు. కొమ్ములను గట్టిగా పట్టి దాని మెడ పూర్తిగా తిప్పి లేపి పడేసిండు. అప్పటి దాకా నాకు ఎదురు లేదన్నట్టు ప్రవర్తించిన కర్రె కోడె సల్లవడ్డది. లేచి తలొంచుకొని వెళ్లిపోయింది. అప్పుడే సెంద్రయ్య ఎంత బలవంతుడో తనకు తెలిసింది.

“తమ్మీ సెంద్రయ్య, మేమంతా లేమా? నీకేమైనా అయితే వొక్క కేక యెయ్యి. మేం సుసుకుంటం  ఆని సంగతి” అన్నడు. మాదిగ యువకులకు జరిగిన సంగతి చెప్పి, సెంద్రయ్య కు అండగా వుండాలని సూచించిండు.

వానలు వరుసగా కురవడంతో చెరువు నిండు కుండలా వున్నది. కట్ట కిందనే వొక పక్క వూరు. ఆ కట్టకు ఎదురుగా ఎత్తైన బండ మీద ఎల్లమ్మ గుడి. అక్కడే బోనాల పండుగ జరుగుతుంది.

బజార్లన్నీ తడిగా బురదగా వున్నాయి.

సేను సెలకల్లో బాగా  తిరిగి తిరిగి అలసిన పశువులు కొట్టంలోకి చేరినట్టే, సూర్యుడు కూడా అలిసి సొలిసిపోయి మబ్బుల్లోకి పోతున్నడు.

బాగా పూసిన యాప సెట్టులా వున్నారు ఆడవాళ్లు. కొత్త చీరెలు కట్టుకొని, నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని ముత్తయిదువలు బోనాలు ఎత్తుకొని ఇంట్లోంచి బయటికొచ్చారు.

బొడ్రాయి కాడ డప్పు సప్పుళ్లు జోరుగా మోగుతున్నాయి.

ఆ వెనకే సోమలింగం, ఎంకటయ్య జోరుగా జమిడికె వాయిస్తున్నారు.

బోనాలు ఎత్తుకున్న ఆడోళ్లు కొంతమంది జమిడికె మోత వినగానే పూనకం వొచ్చినట్టు వూగిపోతున్నరు. సెంద్రయ్య వాళ్లకు యాప మండలు అందివ్వగానే శివసత్తులై పోయిండ్రు. ఏవేవో కేకలు పెడుతున్నరు.

పళ్లు పటపటా కొరుకుతూ వొళ్లంతా విరుస్తూ నోటికొచ్చినవి మాట్లాడుతూ శిగమూగుతున్నరు.

వాళ్లకు పసుపు బొట్టు పెడుతూ సెంద్రయ్య, సోమయ్యా వాళ్లకు పూనిన దేవతను యెళ్లగొడుతున్నరు.

అన్ని బజార్ల నుండి బొడ్రాయి కాడికి బోనాలు చేరుకున్నయి.

దామోదర్ రెడ్డి తన మనుషులతో బోనాల ఏర్పాట్లు చూసుకుంటున్నడు. అతని భార్య ధనమ్మ.  బోనం ఎత్తుకొని అందరి కన్న ముందు నడుస్తంది. ఆమె చాలా బలిష్టంగా వుంది. పట్టు చీరెలో చాలా యింపుగా వున్నది. ఆమె యెంటున్న తన కులం ఆడవాళ్లు చాలా ఖరీదైన బట్టల్లో హూందాగా కనిపిస్తున్నారు.

ఇతర సూదరి ఆడోళ్లంతా వాళ్ల స్తోమతకు దగ్గట్టు అలంకరించుకున్నరు.

జమిడికె వాయిద్యాలు జోరుగా సాగుతున్నయి. డప్పుల దరువులకు ఆడ మగా ఆడుతున్నారు. సెంద్రయ్య ఆ వాయిద్యాలకు లయాత్మకంగా అడుగులేస్తుండు.

మధ్య మధ్య సెంద్రయ్య ఏవేవో వింత శబ్దాలు చేస్తండు.

రావె రావె యెల్లమ్మ

నిను రాజులు కొలిసేరు యెల్లమ్మ

అని కాసేపు ఎలుగెత్తి పాడిండు. 

తాలేలెల్లియలో 

శివతాలేలెల్లియలో 

అని  కాసేపు దేవుడు తన మీదికి వచ్చినట్టు గంతులేసిండు.

బోనాల మీది దీపంతలు చీకట్లో ఎర్రగా వెలుగుతున్నయి. ఆ వెలుగులో సెంద్రయ్య మహా అందగాడిలా మెరిసి పోతున్నడు. ఎర్రటి శిల్పంలా వుంటడు తను.

సెంద్రయ్య ఆటాపాట దామోదర్ రెడ్డి భార్యకు బాగా కలవరం కలిగించాయి. వొక్కసారిగా ఆమెకు దేవుడు బూనిండు. గట్టిగా కేకలు వెడుతూ వూగిపోయింది. ఆమె నెత్తిమీది బోనాన్ని ఎవరో తీసి, నెత్తికెత్తుకున్నరు.

జమిడికె ధ్వనికి, డప్పు దరువుకు వొళ్లు మరిచి వూగిపోతుంది. చీర కొంగు జారిపోయిన సంగతి కూడా ఆమెకు తెల్వట్లేదు.

దూరం నుండి ఆ దృశ్యం సూసిన దామోదర్ రెడ్డి అందరినీ పక్కకు నెట్టుకుంటూ ఆమె దగ్గరికి వొచ్చిండు. అతన్ని గమనించిన ఆమె, పళ్లు పటపటా కొరుతూ చేతలు రెండూ కలిపి పైకియెత్త వొళ్లంతా యిరుసుకుంది.

ఏవేవో కేకలు పెడుతంది. సెంద్రయ్య ఆమె చేతులకు యాప మండలు అందించిండు. వాటిని పట్టుకొని వూగుతూ ఎదురుగా నిలబడి చూస్తున్న మొగన్ని మయ్య మయ్య బాదింది. రెడ్డికి కోపం వొచ్చింది. కానీ ఆమె మీద దేవుడున్నడు. ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా చూస్తూ వుండి పోయిండు.

సెంద్రయ్య ఆమె మొహం మీద పసుపు బొట్టు పెట్టిండు. శాంతి.. శాంతించు తల్లీ.. ఎల్లమ్మా అన్నడు. ఆమె యింకా ఉద్రుతంగా వూగుతుంది. వూరి జనమంతా ఆమెనే గమనిస్తున్నరు. సెంద్రయ్య తమ్ముడు సోమన్న వైపు చూసిండు. ఆయన నిమ్మకాయ కోసి ఆమె మీది నుండి తిప్పేసి ఏదో మంత్రం సదివిండు.

ఆ వెంటనే సెంద్రయ్య యింకో మంత్రం జపిస్తూ, పసుపు గుప్పిట్లోకి తీసుకొని ఆమె ఎద మీద చల్లిండు. అరచేతితో ఆమె చాతిలో పసుపు రాసి శాంతించు లేదా నా చేతిలో నీకు తగిన శాస్తి జరుగుద్ది అని గద్దించిండు.

ఆయన చేతి స్పర్శతో ఆమె మీది దేవత శాంతించింది. సొమ్మసిల్లి పడిపోయింది. డప్పులు మోగుతూనే వున్నయి. జమిడికె రగులుతూనే వుంది. సముద్రం జమిడికెగా మారి అనేక జతులుగా ధ్వనిస్తుంది.

సెంద్రయ్య ఆమెను తన చేతిలోకి తీసుకున్నడు.  నిమ్మకాయను కోసి మంత్రించి, ఆమె నెత్తి మీద అదిమి పెట్టిండు. సెంద్రయ్యను కరుచుకొని మీదికి వొరిగింది. అతని గట్టి శరీరాన్ని అదుముకొని వొత్తిగిల్లింది. ఆమె మీద పూనిన దేవత బొత్తిగా శాంతించింది. ఆ తర్వాత వొక పక్కు జరిగి యెళ్లిపోయి, తన బోనం ఎత్తుకుంది.

పటేలు అంతా చూస్తనే వున్నడు. కానీ యేమీ చెయ్యలేని స్థితి తనది.

నవ్వుతున్న కళ్లతో రెడ్డిని సూసిండు సెంద్రయ్య. ఆ చూపులకు రెడ్డి భగ్గున మండిపోయిండు.

అప్పటికే బోనాలు గుడికి చేరుకున్నయి. అందరూ బోనాలు దించి ఎల్లమ్మ కు దండం పెట్టిండ్లు.

సోమలింగం కత చెప్పుడు మొదలువెట్టిండు. సెంద్రయ్య జమిడికె వేస్తూ వొంత పాడుతున్నడు. సోమన్న, ఎంకటయ్య ఇద్దరు పసుపు, కుంకుమ, బియ్యం తో పట్నం యేస్తండ్లు

డప్పులు కొట్టడం ఆపి మాదిగలు వొక పక్కన నిలబడి చూస్తున్నరు.

అరగంట జోరుగా నడిచింది కత.

ఆఖరి ఘట్టం రానే వొచ్చింది. ఎల్లమ్మకు మేకను బలివ్వాలే.

జోజో మేకమ్మ జో మేకమ్మా

నిద్ర బో మేకమ్మ నిద్రబోవమ్మా అని పాడి  సెంద్రయ్య మేకను మత్తుగొలిపిండు. ఆ తర్వాత దాన్ని మత్తు నుండి లేపి జడితివ్వమన్నడు. అది వొళ్లు విరిచి, బలంగా జడితిచ్చింది.

మేకను కొయ్యడానికి రెడ్డి కత్తి తీసుకొని వొచ్చిండు. కానీ సెంద్రయ్య రెడ్డికి ఆ అవకాశం ఇవ్వలేదు. మేకను ఎత్తుకొని గావు వట్టిండు. మేక మెడ కొరికి సంపిండు. దాని రక్తం ఎల్లమ్మకు ఆరమిచ్చిండు.

దామోదర్ రెడ్డికి అది కూడా అవమానం అనిపించింది. ఆడోళ్లు అంతా లేచి నిలబడి రేణుకా ఎల్లమ్మా కాపాడుతల్లీ అని మొక్కుతున్నరు. అంతా అల్లరిగా వుంది. ఏం జరుగుతుందో ఎవ్వలికీ కనవడుత లేదు.

సందు దొరికితే ఎట్టాగైనా వాణ్ణి ఎత్తి కుదెయ్యాలని వుంది సెంద్రయ్యకు.

దామోదర్ రెడ్డి ఆగ్రహంతో సెంద్రయ్యను ఎవరూ సూడకుండా దెబ్బ కొట్టాలని మీదికొచ్చిండు. అలాంటి అవకాశం కోసమే సూత్తున్న సెంద్రయ్య వొడుపుగా ఆ దెబ్బను తప్పించుకున్నడు. వొడుపుగా అతణ్ణి లేపి బలంగా నేలకు ఎత్తికొట్టిండు. కిందపడ్డోన్ని కాలితోటి బలంగా డొక్కలో తన్నిండు.

ఈ కొట్లాటను గమనించిన కాపోళ్లు సెంద్రయ్య వైపు ఉరుకొత్తండ్లు.

తన కళ్లను తానే నమ్మలేక పోతున్నడు సోమలింగం. సెంద్రయ్య కాళ్ల కింద పటేలు తండ్లాడుతున్నడు. పెద్ద కొట్లాట అయితదని తనకు తెలిసిపోయింది. భయంతో వొణికిపోయిండు.

అక్కణ్ణించి జమిడికె తో సహా ఉడాయించిండు సోమలింగం.

” వో జలగం సోమన్నా, నన్ను కాపోళ్లు కొడుతున్నరే” అని గట్టిగా అరిచిండు సెంద్రయ్య.

ఆ అరుపు విన్న మాదిగ యువకులు ఉరుకొచ్చిండ్లు. రెండు వర్గాలు ఎవరు ఎవరిని కొడుతండ్లో తెల్వట్లేదు.

తమ్ముడు సోమయ్యను ఎళ్లిపొమ్మని పక్కకు నూకేసిండు సెంద్రయ్య.

ఎంకటయ్య ఎప్పుడో జారుకున్నడు.

జలగం సోమయ్య సెంద్రయ్యకు రక్షణగా వొచ్చిండు.

వొచ్చినోన్ని వొచ్చినట్టే యిసిరేత్తండు సెంద్రయ్య. కర్రె కోడెను పడేసినట్టు దొరికినోన్ని దొరికినట్టే విసిరేత్తండు. ఆ విసురుడుకు సగం మంది పక్కనే ఉన్న వరి పొలాల్లో పడ్డురు.

బైండ్లోన్ని కొడుతరానయా అని సూదరోళ్లు కూడా కాపోళ్ల మీదికి ఎగవడ్డరు.

దామోదర్ రెడ్డి బట్టలు చినిగిపొయినై. సెంద్రయ్య కొట్టే దెబ్బలు తట్టుకోలేక నీకు దండం పెడుతా. నన్ను వొదిలెయి అని కాళ్లు పట్టుకున్నడు.

“తమ్మీ సెంద్రయ్య, వాడు సత్తడు. వొదిలెయ్యి” అని జలగం సోమయ్య వారించిండు.

” బాంచొత్. బత్కుపో బాడ్కావ్” అని నెట్టేసిండు.

అప్పటికే చాలామంది తలలు పగిలినయి. దెబ్బలు తాకి సొమ్మ సిల్లిండ్లు. మాదిగ యువకులకు కూడా దెబ్బలు తాకినయి. కానీ వాళ్లదే పై చేయి అయ్యింది.

బోనాల పండుగ గావువట్టిన మేక రక్తాంలా రొచ్చురొచ్చుగా ముగిసింది.

సోమలింగం అనుకున్నట్టే చేసిండు సెంద్రయ్య.

దామోదర్ రెడ్డి వొళ్లు నొప్పులు తగ్గేసరికి వూరంతా సెంద్రయ్య ఘన కార్యం అందరి నోళ్లల్ల పండుగకు వొండుకున్న యాట కూరలా కారం కారంగా అరిగి పోయింది.

” సెంద్రెయ్య లొల్లి బార్దెంగా. ఆడు నీతి కోసం నిలవడ్డడు. మండలాధ్యక్షుడు అయితే ఏందయా? ఆని యిష్టమా? వూళ్లున్న పెద్ద మనుషుల ఇజ్జతి గాపాడిండు. అన్ని వాళ్ల నాయిన బుద్దులే” అని బెల్లి లసుమయ్య వడ్ల యిరాటంతో అన్నడు. అవునని అతనూ తలూపిండు.

ఆ సంఘటన జరిగిన మాసానికి సోమలింగం మండలాఫీసులో పనిబడి బోయిండు. అంతా హడావుడిగా వుందక్కడ. దామోదర్ రెడ్డి తీరిక లేకుండా వున్నడు. ఎందుకో తల తిప్పి కిటికీ వైపు ముక్కు పెట్టి కళ్లు మూసుకొని గట్టిగా గాలి పీల్చిండు. గుండెల నిండా గాలి నింపిండు. లోపల యాన్నో సన్నగా నొప్పి కలుక్కుమంది. మొహం బాధతో మాడిపోయింది. కళ్లు తెరిసి సూసిండు. ఎదర సోమలింగం. క్షణ కాలం బెదురు గొడ్డులా అయిపోయిండు. కానీ తను సెంద్రెయ్య కాదనీ, సోమలింగమని గుర్తువట్టిండు.

లోపలికి రమ్మని సైగ సేసిండు.

ఏమాటకామాట సెప్పుకోవాలె. సోమలింగం గుండె దడదడలాడ్తంది.

తప్పదు. లోపలికి వోయిండు.

ఏంది సంగతని అడిగిండు. ఏదో స్కీము గురించి తెలుసుకుందామని వొచ్చిన పటేలా అన్నడు.

సెంద్రయ్య యాడుండు. వాణ్ఞి అస్సలే వొదుల అన్నడు. అట్లా అంటున్నప్పుడు ఆయన గొంతులో భయం బయిటవడ్డది.

లోపల్లోపలే నవ్వుకున్నడు. కానీ భయం నటిస్తూ “పటేలా, మా సెంద్రన్న గాయిదోడు. అస్సలు మంచోడు గాదు. రెండేళ్ల కిందట గంట్లకుంటల దోస్తు పెళ్లాన్ని యెవ్వడో యాందో అన్నడని, రాత్తిరికి రాత్తరే వాణ్ణి వొట్టలు వొడివెట్టి సంపిండు. దినాం యెవన్నో వొకణ్ణి గెలుకనిది వూకుండడు. నువ్వు పొయి పొయి లంజెకొడుకా అని తిట్టినవు. అయ్యాల్నే అనుకున్న యేదో సేత్తడని. సేసిండు. నువ్వేమో యింకా యేదో సేత్త అనుకుంటన్నవు. ఈ ముచ్చెట మా యన్నకు దెలిసిందో, యేదో రాత్రి మీ యింట్ల దునుకుతడు. ఆ తర్వాత యేం సేత్తడో నాకయితే తెల్వదు. మా సెడ్డోడు పటేలా. పయిలెం” అని బయిటికొచ్చిండు.

దామోదర్ రెడ్డి ఆ మాటలిని అదురుకున్నడు. రక్తపోటు పెరిగినట్టుంది. కుర్చీల కూసున్నోడు దబీమని కిందవడ్డడు.

పచ్చవాతం వొచ్చినట్టుంది. మాట పడిపోయింది. కదలట్లేదు. అటెండరొచ్చి సూడక పోతే సచ్చి వూర్కునేటోడే.

ఏం జరిగిందో సోమలింగానికి తప్ప ఇంకో నరమానవునికి దెల్వదు. అదీ కత.

*

జిలుకర శ్రీనివాస్

జిలుకర శ్రీనివాస్

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఏం జరిగిందో సోమలింగానికి తప్ప ఇంకో నరమానవునికి దెల్వదు. అదీ కత.

  *ఊరు ఉనికిని ఉతికి ఆరేసినట్టుంది…ఈ కత

 • గ్రేట్.
  ఇలాంటి చాలా కథలు రావడానికి ఈ కథ పునాది అవుతుంది.
  కళ్లు చెమర్చే కథనం. ఆవేశం రగిలోంచే దుఃఖం.

  • చాలా బాగుంది సార్. అటువంటి ఆత్మ గౌరవం ఉన్న మనుషులే ఇవాళ మనువాదానికి విరుగుడు. మీరు రెగ్యులర్ గా కథలు రాయాలి.

 • జిలుకర శ్రీనివాస్ గారు అద్బుత కధచెప్పారు. ఎందుకంటే ఆయన రాసిన పద్ధతి అందరినీ కూర్చోబెట్టి రెడ్డి పొగరుమోత్తనం సెంద్రయ్య ఆ పొగరు అణచడం కధలా చెప్పారు.

 • It’s a well known Telangana political and cultural revolutionary DBS FOUNDER DR.J Srinivas Anna his writings and naval focus always on struggling for backwards classes and downtrodden people.. this literature was amazing and containd for especially who are people of illiterate Telangana Agricultural productivity formers language slang, I was very proud of my brother Srinivas his effort on his dedication for every movement
  I really appreciate to my brother the making and forwarded of DBS cultural movement all over Telangana
  Thanking you Anna

 • మంచి కథ అందించిన జిలుకర శ్రీనివాస్ మహారాజు గారికి జమిడిక జాతులతో అభినందనలు.

  జీవితంలో నుంచి తెచ్చిన కథ. తలబిరుసు తనాన్ని మాదిగలే కాదు మాదిగల ఉపకులాలు కూడా తల దించేలా చేస్తాయని నిరూపించిన నిజ జీవితం.

  జమిడికె ధ్వనికి, డప్పు దరువుకు వొళ్లు మరిచి వూగిపోతుంది. చీర కొంగు జారిపోయిన సంగతి కూడా ఆమెకు తెల్వట్లేదు.
  సేను సెలకల్లో బాగా తిరిగి తిరిగి అలసిన పశువులు కొట్టంలోకి చేరినట్టే, సూర్యుడు కూడా అలిసి సొలిసిపోయి మబ్బుల్లోకి పోతున్నడు.

  బాగా పూసిన యాప సెట్టులా వున్నారు ఆడవాళ్లు. కొత్త చీరెలు కట్టుకొని, నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని ముత్తయిదువలు బోనాలు ఎత్తుకొని ఇంట్లోంచి బయటికొచ్చారు.

  జమిడిక కు డబ్బుకు దరువుకు ఉన్న శక్తి ఎలాంటిదో పై ప్రత్యేక చూపెడుతుంది అది వాస్తవం. ఇలాంటి సంఘటనలు బోనాల పండుగ మస్తు జరుగుతాయి.

  దీపాల ఎర్రటి శిల్పం లాగా ఉన్నాడు.
  ప్రతీకలతో టి సౌందర్యాత్మక వాతావరణ కథనం ఆకట్టుకునేలా కథను రంజింప చేశాడు.

  మంచి కథ అందజేసిన saaranga సంపాదక వర్గానికి జిలకర శ్రీనివాస్ గారికి బోనమెత్తిన సంబరం తో అభినందనలు

 • ఇదేం కథ, ఆడుగడుగునా రాజీ పడిన కథ

  1. ముందు తెలంగాణ లో వునికి లేని తెలుగు దేశం పార్టీ, ఎన్ టీ ఆర్ ని కథలో ప్రస్తావించి తె రా స, కాంగ్రెస్,ల ను ప్రస్తావిస్తే ఏం జరుగుతుందో అని బయపడినట్టుంది

  2.దళిత రచయితలు సహజం గా చేసే పెద్ద కుల ఆడదానికి తక్కువ కులం మగవాడికీ రంకుకట్ట డానికి పూనుకొని వెనక్కి తగ్గినట్టున్నది భయం కారణం ఏమో అనిపిస్తోంది

  3.వూరిలో ఇలాంటి కులాల మధ్య మనస్పర్థలకంటే వ్యక్తులమధ్య కలహం గా జరుగుతాయి

  4. అలా హటాత్తుగా పండగపూట గొడవలు జరగడం, కొట్టుకొని తలలు పగలడం చిన్నవిషయమేమీ కాదు,
  వాస్తవానికి దూరంగా వుంది

  ఎక్కడ దామోదర రెడ్డి పగ తీర్చుకుంటడో అని ఆయన్ని పక్షవాతం వచ్చినట్టు చూపించడం మరో రాజీ

  నాయనా రచయితా, బాబూ, వూళ్ళలో చెట్టు కొమ్మల్ని కాదు ముందు వేర్లు కత్తరిస్తారు, నిశ్శబ్ధం గా, నీకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా కూలిపోతావు అలాంటి రాజకీయాలు జరుగుతాయి

  ఇలాంటి చిల్లర కథలు సారంగ లో రావడం సీరియస్ పాటకులకు మనస్తాపం కలిగిస్తోంది

  దళితులు పెద్దకులాల్ని కొట్టడం లాంటి కథలైతే చాలు, మేము ప్రచురిస్తామంటే, ఇక మీ ఇష్టం, మీకొక నమస్కారం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు