పరువుహత్య

ఆ ముగ్గురు కవుల్లో ఒకడు మాతృహంతకుడు. ఇంకొకడు ప్రేయసిని హత్యచేసినవాడు. మరొకడు భార్యను చంపినవాడు. ఆ ముగ్గురు స్త్రీలే ఇప్పుడు మర్రిచెట్టుకి ఆత్మలై వేళ్ళాడుతున్నారు.

ముగ్గురు మహాకవులూ ఒకచోట సమావేశమయ్యారు. ప్రశాంతమైన ఆరుబైట చెట్లమీద పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి.

నిజానికి ముగ్గురు శ్రోతలు వొక మర్రిచెట్టు ఊడల్ని పట్టుకొని తలకిందులుగా వేళ్ళాడుతున్నారు. వారు ముగ్గురూ స్త్రీలే. కానీ ఆకవులకు వారు కంటబడే అవకాశం లేదు. ఎందుకంటే వారు ముగ్గురూ ఏనాడో మరణించారు. ఆ స్త్రీల ఆత్మలు మాత్రం ఆ కవుల చుట్టూ తిరుగుతూనే వున్నాయి కానీ వారు గుర్తించలేరు. కారణం వారు ప్రగతిశీల కవులు, ఫక్తు హేతువాదులు. వారు దెయ్యాల్నీ ఆత్మల్నీ నమ్మరు. మరణానంతర జీవితాన్ని అసలే నమ్మరు. అందువల్ల వారికి ఆ స్త్రీలు ఎప్పుడూ తారసపడలేదు. రోజూ వారిని పట్టి పీడిస్తున్న దుస్వప్నాలకి కారణం మాత్రం ఆ స్త్రీల ఆత్మలే అనేది పచ్చినిజం. ఆ సత్యాన్ని వారు గుర్తించ నిరాకరించారు. అలా గుర్తిస్తే వారి హేతువాదం కూడా మరణించి దెయ్యమై పట్టి పీడించే ప్రమాదం ఉంది. కనుక తమ పీడకలల్ని వారు తోటి మిత్రకవులతో కూడా పంచుకొనేవారు కాదు. పైగా ఆ పీడకలల్ని పదేపదే గుర్తుకు తెచ్చుకోవడం తీవ్ర పశ్చాత్తాపానికి గురిచేస్తుందన్న భయం కూడా తమ దుస్వప్నాలను స్మరించుకోవడానికి అడ్డంకిగా మిగిలింది.

కలలో ప్రత్యక్షమయ్యే స్త్రీలు రోజూ ఒక అద్దాన్ని వారిముందు పెట్టేవారు. దానిలో తాము తమ ఆత్మీయ స్త్రీలను హింసించిన తీరు స్పష్టంగా కనబడేది. గాఢసుషుప్తిలో మునిగిపోతే, తమ అంతరాత్మని బయటపెట్టే పీడకలలనుంచి తప్పించుకోవచ్చునని వారు ఆశించి నిద్రమాత్రలు మింగేవారు. కానీ పిశాచాలు మరింత చెలరేగిపోయి పీడకలల్ని ఉద్ధృతం చేసేవి. ఎందుకంటే పిశాచాలకి కార్యకారణ సంబంధం అంటే చిరాకు.

ఈ వేదన నుంచి తప్పించుకోవడం కోసమే వారు కవిత్వాన్ని శరణు వేడారు. ఎవరికి వారు కవితలు లిఖించారు.

ఆ ముగ్గురు కవుల్లో ఒకడు మాతృహంతకుడు. ఇంకొకడు ప్రేయసిని హత్యచేసినవాడు. మరొకడు భార్యను చంపినవాడు. ఆ ముగ్గురు స్త్రీలే ఇప్పుడు మర్రిచెట్టుకి ఆత్మలై వేళ్ళాడుతున్నారు.

తల్లిని తీవ్రంగా హింసించి, తల్లిచావుకి కారణమైన ఒకటవ కవి మాతృప్రేమను ఒలకబోస్తూ కవిత్వం చదవడం మొదలెట్టాడు. ప్రేయసిని చంపినవాడూ, భార్యాహంతకుడూ ఆ కవితను ఆసక్తిగా విన్నారు. ఆ కవితలో వాక్యానికీ వాక్యానికీ మధ్య ధ్వనిస్తున్న పశ్చాత్తాపాన్ని వారు గుర్తించారు.

ఇంతలో మాతృహంతకుడి గొంతు బొంగురుపోయింది. మాట బైటికి రావడం కష్టంగా ఉంది. అతని తల్లి ఆత్మ అతని గొంతు పట్టుకొంది. జీవితకాలంలో ఎంత హింసించినా భరించిన మహాతల్లి పిశాచమయ్యాక క్రూరంగా మారింది. తనముందే స్త్రీలపైన ప్రేమనీ గౌరవాన్నీ స్త్రీవిముక్తినీ బోధించే కవితలు చదివి అందరి మెప్పూ పొందుతూనే, అవార్డులు తీసుకుంటూనే, తనకొడుకు తనని జీవితమంతా హింసించాడు, కొట్టాడు, తిట్టాడు. తాను పల్లెత్తుమాటనలేదు. కానీ మరణానంతరం అతని అంతరాత్మ సలపడం మొదలెట్టింది. నిద్ర లేకుండా చేసింది. ఇప్పుడు అతని కవిత బయటకు రాకుండా అడ్డుపడుతున్నది ఆ తల్లే.

తన తల్లే తన కవిత్వ ప్రసవాన్ని ఆటంక పరుస్తూ అబార్షన్ చేస్తోందన్న సంగతి కొడుకుకు తెలుసు. కానీ మిగిలిన ఇద్దరితో ఆ సంగతి చెప్పలేకపోయాడు. అలా చెప్పడం హేతువాద విరుద్ధం మాత్రమే కాదు, అతడు తల్లిని హింసిస్తున్న సంగతి బహిరంగ రహస్యమే కానీ అప్పటికీ అది రహస్యమే.

మనుస్మృతిలో పురాణాలలో ఎంత స్త్రీ హింస దాగివుందో మాట్లాడేవారు కూడా మాతృహంతకుడి గురించి బహిరంగంగా మాట్లాడలేరు. ఎందుకంటే పురాణపురుషులను తిడితే వారు ఎదురొచ్చి నిలదీయరు. కానీ ఇతన్ని ఏమైనా అంటే తమ రహస్యాలు బట్టబయలు చేయగలడు. ఒకరి ప్రతిష్టను మరొకరు నష్టపరచుకోవడం సాహిత్య మర్యాద కాదు.

అతడు తల్లిని కొట్టి చంపాడు. తామేమో భార్యనూ ప్రేయసినీ హింసించారు. కళలో కవిత్వంలో లాగే హింసలో కూడా అనేక శైలులు. ఎవరిశైలి వారిది. ఎవరి మార్గం వారిది. ఒకరి మార్గాన్ని మరొకరు విమర్శించుకోవడం సరికాదు. ఇటువంటి సాహిత్య సూక్ష్మాలు తెలిసిన ప్రజాస్వామ్యవాదులు ఆముగ్గురు కవులు.

కానీ, పిశాచాలకు మర్యాదలు తెలియవు, హద్దులుండవు. అతడు తన కవిత్వాన్ని పైకి చదవగలిగితే కొంతవరకూ ఊరట లభించవచ్చును. అప్పటికీ పూర్తి విముక్తి అసాధ్యం. ఎందుకంటే అతనా కవిత్వంలో వాస్తవాన్ని కొద్దికొద్దిగానూ, ఆదర్శాన్ని ఎక్కువగానూ దట్టించాడు. పూర్తి వాస్తవాన్ని పాఠకులు యిష్టపడరు. పైగా నగ్నమైన వాస్తవం తనని నడిరోడ్డుమీద నిలుపుతుందని అతనికి తెలుసు. అందుకే కవులు పూర్తినిజాలు ఎప్పుడూ చెప్పరు. చెప్పినట్లుగా కనబడతారు. నిజాయితీని పోలినదాన్ని కవి సృష్టిస్తాడు.

ఐతే అతడు చదవడం పూర్తయితే తాము గూడా కవితాగానం చేసి, వమనానంతర ఉపశాంతిని పొందవచ్చునని మిగిలిన యిద్దరి ఆశ.

కానీ, మొదటి కవి తల్లిపై రాసిన కవిత మాతృపిశాచ పీడవల్ల రాయి విసురుకి చెట్టు మీది పక్షుల్లా చెదిరిపోతోంది. ఒక అక్షరానికీ మరో అక్షరానికీ మధ్య దూరం మరీ పెరిగిపోవడం వల్ల అర్ధం అధ్వాన్నపుటడవిలోకి పారిపోతోంది. కవితకి ముగింపే లేకుండా పోయింది. అక్షరాలు ఆత్మహత్య చేసుకోవడం మొదలు పెట్టాయి. పక్షులు నేల రాలుతున్నాయి. చెట్ల ఆకులన్నీ రాలిపోయాయి. చెట్లు కూలడం మొదలైంది.

కవులు ముగ్గురూ దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. దిక్కులేని చావు చస్తున్న కవితకీ చుట్టూ వాతావరణానికీ ఏమిటి సంబంధం? ఎందుకీ విలయం? ఒక చెట్టుకీ కవితకీ ఏమిటి బంధం? ఒక కవితకీ చుట్టూ ఉన్న పరిసరాలకీ ఏమిటి సంబంధం? ఒక కవిత యొక్క వైఫల్యం వొక కవిత యొక్క భ్రూణహత్య ప్రళయ సదృశ వాతావరణానికి ఎందుకు కారణమౌతోంది?

మొదటి కవి రాసిన ఎలిజీ దిక్కుమాలిన చావు చావడంతో, మిగిలిన యిద్దరి కవితలూ అగ్నిప్రవేశం చేశాయి. దట్టమైన మృత్యు మేఘం కమ్ముకొచ్చి ఒకరి ముఖాలు మరొకరికి కనబడకుండా పోయాయి. ఆ మబ్బులోంచి నెత్తురోడుతున్న కత్తితో ఒక యువకుడు బయటికి వచ్చాడు.

“మహాకవుల్లారా! ముక్కలు ముక్కలైన కవిత చెల్లాచెదురై నా చెవుల పడింది. నాకు కవిత్వమన్నా కత్తి అన్నా చాలా యిష్టం. నేనొక ప్రేమజంటను కిరాయికి పరువుహత్య చేశాను. నాకు పరువు కల వాళ్ళంటే యిష్టం. కవుల కంటే పరువు ఎవరికి ఎక్కువ ఉంటుంది?   నేను మీ అభిమానిని.

మీరు వ్యక్తిగతంగా స్త్రీని హత్య చేస్తారు. మొత్తం స్త్రీజాతి విముక్తి కోసం పాటుపడతారు. మీరు వ్యక్తివాదులు కారు. మీరు గొప్ప సామాజికస్పృహ కలవారు. సమాజం మొత్తం విముక్తి చెందినప్పుడే స్త్రీవిముక్తి సాధ్యమని మీకు తెలుసు. అందువల్ల మీరు ఒక స్త్రీని హింసించవచ్చు, కొట్టవచ్చుగాక. మొత్తం స్త్రీజాతిని ప్రేమిస్తారు. మానవజాతి విముక్తినే కలగంటారు. అందువల్ల మీలోపాలు నలుసు లాంటివి. వాటికి మీరు బాధపడవద్దు. పశ్చాత్తాపపడవద్దు. మీ ప్రతిష్ట ఆచంద్రతారార్కం నిలుస్తుంది. పరువు నిలుపుకోవాలంటే ప్రతిష్టని పెంచుకోవాలంటే పరువుహత్యలు తప్పవు. నేను ప్రొఫెషనల్ కిల్లర్ గానూ, మీరు కవులుగానూ నెరవేరుస్తున్నది ఆ చారిత్రక కర్తవ్యమే.”

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

Avatar

రాణి శివశంకర్ శర్మ

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • అభ్యుదయ వాదులకు అరాచకాలు, ఫండమెంటలిజంలోనుండి బయట పడక పోవడం ఉంటాయి. వారు మాతృ హత్యలకు, సతీ, ప్రేయసి హత్యల కు గలరు. నిజమే, మనమెందుకు వారిని అభ్యుదయ వాదులు గా చూడాలి? వారు కూడా ఫండమెంటలిస్టుల లో ఒక భాగామే గదా! దొంగ స్వాములు ఎంతో వీళ్లు అంతే!

  • తిరుపాలు గారూ
   సాములోర్లు వున్నారని,వారికి ఏదోవొక అతీత శక్తి ఉంది అనే విషయంలో మనకి ఏకీభావం ఉంది. కానీ అసలు/నకిలీ లని వేరు పరచడం ఎలా? మన హృదయాన్ని ఆక్రమించుకున్నోడే స్వామి.హృదయాన్నో మరొకటో దోచుకొనేవాడే స్వామి. దొంగనోట్లు కూడా బాగానే చలామణి అవుతాయి కదా? మనం కూడా వాడేస్తుంటాం తెలిసో తెలియకో.

 • కత్తికన్నా కవిత్వం చేసే పరువు హత్య. తస్సాదియ్య, ఏం దయ్యాల్రా నాయనా ? కవులూ జాగ్రత్త
  మరి.

  శర్మ గారూ, మీ శైలి సులభమూ కాదు, కష్టమూ కాదు. Its something. బాగుంది సార్.

 • “Bheebhathsa rasa pradhanam
  Pisachagana samavaakaram”
  gaa mahakavi padyapadalaki kadhananusandhanam chesaru. Vudyamalani vusigolpalsina mahaprasthanam bhayapeduthondeviti!

  • కత్తికన్నా కవిత్వం చేసే పరువు హత్య. బాగా గ్రహించారు కథాసారాన్ని శ్రీరామ్.
   ఎంతైనా ఎందరో మంచి కవులని రస్తాపైకి తెస్తున్నా సహృదయులు,కవి మీరు.
   తెలివిగా కత్తిని గురించే మాట్లాడుతూ , కవిత్వపు బీభత్సాన్ని కవిత్వంతో చేసే పరువు హత్యని తెలుగు మేధావులు విస్మరిస్తున్నారు.హేతువాదం మితిమీరి ఫక్తు వాచ్యతలోకి దిగజారిన తెలుగు మేధావులు కంటికి కన బడని బీభత్సాన్ని నమ్మరు.అందుకే పిశాచాలని గురించి మౌనం వహిస్తారు.బీభత్స రసాన్ని పానం చేసే దమ్ములు వాళ్లకి లేవు.పుస్తకపురుగులు వాళ్ళు.రామాయణాలూ,మనుస్మృతులు గురించి మాట్లాడతారు.తమ మిత్రులూ తమ బతుకుల గురించి రాయరు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు