పరాయి

చుట్టూ ఏం జరుగుతుందో అర్థంకాలేదు. కళ్ళ ముందు ఉన్న చీకటి ఇంకా చిక్కగా మారిపోయినట్లు అనిపించింది. అంతా చీకటి.

పూరికి ఆరోజు తాగేందుకు సీంది దొరకలేదు. ఒక్క సీషా దొరికిన రూపాయి ఎక్కువే ఇచ్చి తీసుకుందామనుకుంది. కాని వాసన చూసేందుకు కూడా ఓ బొట్టు దొరకలేదు. సీంది లేకుంటే పూరికి నిద్ర అంత త్వరగా పట్టదు. భర్త పోయినప్పటి నుండి ప్రతీ రోజు సీంది కావాల్సిందే.

పూరి తను నడిచేప్పుడు ఉపయోగించే కట్టెను మంచం కాలికి అనించి పెట్టి, మంచం కిందికి, భారమైన తన కాయాన్ని ఎండ్రికాయలాగా ఈడ్చింది. ఆమె ఎప్పుడూ అలానే మంచం కిందికి దూరి నిద్రపోతుంది. ఆమెకు నిద్ర అక్కడ తప్పితే ఇంకెక్కడా పట్టదు. ఎంత ఆలస్యమైనా నిద్ర మాత్రం అక్కడే పడుతుంది.

భర్త పోయాక పూరి, ఇది అలవాటు చేసుకుంది. కొడుకు నాగు, కోడలు లచ్చి, ఇరుగు పొరుగు వారు, పూరిని మంచం మీద పడుకో, మంచం కింద వద్దని ఎన్నోసార్లు చెప్పి చూసారు. పూరి మాత్రం ఎవరి మాట వినలేదు. పూరి మొండితనానికి విసిగిపోయి, ఆమెతో మాట్లాడడం తగ్గించేసారు ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు. పూరి ఉందన్న సంగతిని అందరూ విస్మరించారు. తన భర్త చావుతో తను కూడా లేకుండా పోయింది.

పూరి తన టూక్రిని దుప్పటిలా కప్పేసుకుంది. నోటితో ఊపిరి తీసుకుంటూ ఉంది. తీరం చేరని ఆలోచనలు, ఆందోళనలు, పూరికి ఎప్పుడు తోడు నీడగా ఉండేవి. మంచం కింద, చీకట్లో, అలసటతో కదులుతున్న ఆమె శరీరం నిత్యం పోరాడుతూనే ఉండేది. లోపల గదిలో కొడుకు కోడలు నిద్రపోతున్నారు. వాళ్ళ గుర్రుతో గది నిండిపోయింది. కళ్ళ ముందు నిండుగా ఉన్న చీకటిలోకి చూస్తుంది. రెండు కళ్ళు తెరిచే ఉన్నాయి. కాసేపటికే కళ్ళు తెరిచి సోయి దాటి ఏటో వెళ్ళిపోయింది.

ఎవరో తలుపు మీద బాదుతున్నారు. అదే పనిగా కొడుతున్నారు. ఇల్లంతా అదే శబ్దం. కొడుకో, కోడలో, ఎవరో ఒకరు తీస్తారులే అనుకుంది పూరి. కోడల్ని పిలిచింది. కోడలు కాదుగా, కొడుకు కూడా పలకలేదు. ఇంకా ఎవరో తలుపు మీద బాదుతూనే ఉన్నారు.

“ఈ పూట ఎవరై ఉంటారో” ఆలోచిస్తూ, లేచి, ఎండ్రికాయలా తనను తాను మంచం కింది నుండి బయిటికి వచ్చి, కట్టే కోసం చూసింది. చీకట్లో ఆ కట్టే ఎక్కడుందో దొరకదే! కట్టెను దొరకపట్టి, దాని సహాయంతో నడిచి వెళ్లి తలుపు దగ్గర నిల్చుని,

“ఎవరూ?” అడిగింది పూరి.

“బాయి నేను వాచును?” అటు నుండి గొంతు.

“యే వాచు?” అనుమానంగా అడిగింది.

“నీ చిన్న తమ్ముడ్ని బాయి” గొంతు బదులిచ్చింది.

పూరి తలుపు తీసేందుకు గొల్లం మీద చెయ్యిపెట్టిందో లేదో, “అయినా వాచు ఈ వెళప్పుడు ఎందుకోస్తడు?” అనుకుంది.

తలుపు సందు నుండి అతను వాచుయేనా కాదా, ఇంకా ఎవరై ఉంటారో చూసేందుకు ప్రయత్నించింది. చీకటి వల్ల ఏమి కనిపించలేదు పూరికి. తియ్యాలా? వద్దా? అన్న ఆలోచన రింగులా తిరిగింది.

తలుపు బాదుతూ “బాయి…. బాయి….” అని పిలుస్తున్నాడు వాచు.

“ఈ వెళప్పుడు వచ్చినవు. నిజం చెప్పు ఎవరు నువ్వు ?”

“బాయి నేను వాచునే, నిన్ను కలిసి, కళ్ళ నిండా చూసుకుని వెళ్ళిపోదామని అచ్చిన”

“నిజం చెప్పు ఎవరూ నువ్వు?”

“బాయి నేను వాచును, ఒక్కసారి తలుపు తియ్యి” అన్నాడు.

పూరికి ఏం చేయాలో తోచలేదు. కొడుకుని నిద్రలేపుదామనుకుంది. నిద్ర నుండి లేపితే అమ్మనా బూతులు తిడతాడు. తిట్టినా సరే కాని, కోడలు ఏమనుకుంటుంది తన గురించి. ఇలా ఏవో ఆలోచనలు పసుపుపచ్చని చిట్టి సీతాకొకచిలుకల్లా ముసురుకుంటున్నాయి.

మళ్ళి తలుపు మీద పిడి గుద్దుతో కొట్టినట్లు ఒక దెబ్బ. పూరికి పేగులో కలుక్కుమంది. అటు నుండి తలుపు తియ్యమని ఏడుస్తున్న గొంతులో వణుకు, పూరిని నీలువునా దహిస్తున్నా, ఏమి తోచక తనను తాను సంబాలించుకుంటుంది.

రెండు నెలల క్రితం తండాలో ఓ వారం వ్యవదిలో ఇద్దరు చనిపోయారు. వాళ్ళు తరచూ రాత్రుళ్ళు తండా అంతా తిరుగితున్నారని… ఎందరో వాళ్ళని చూశామని కూడా అన్నారు. అప్పుడప్పుడు తలుపులు బాదుతూ సతాయిస్తున్నారని పుకార్లు. వారి ఇద్దరిలో తన తమ్ముడి రూపంలో వచ్చిన వారు ఎవరై ఉండొచ్చో అనుకుంది. వాళ్ళిద్దరి పేర్లతో ఇంటి బయట ఉన్న మనిషిని పిలుద్దామనుకుంది. గుర్తు పట్టి మాట్లాడిందని పూరి ఇంట్లోనే అతను తిష్ట వేస్తె ఏంటి తన పరిస్థితి అనుకుంది. చనిపోయిన వారు అలా అంటిపెట్టుకుని ఉంటారు మరి.

తమ్ముడితో గట్టిగా మాట్లాడలేక, వచ్చిన వారు ఎవరైతే ఏంటని ధర్యం చేసి “వాచ్యా మన ఇంటి ముందు గుడిసె ఉంది సూడు, దాంట్లో ఈ రాత్రి పడుకో, పొద్దున్న కలుద్దాం” అన్నది పూరి.

“లేదు బాయి నిన్ను చూడాలని ఉంది” దుఃఖం నిండిన గొంతుతో అన్నాడు వాచు.

పూరి మనసు బరువెక్కింది. గొంతులో మాటలు బరువెక్కాయి.

“వాచు ఈ వేళప్పుడు ఎందుకు చూడాలనుకుంటున్నాడు?” అనుకుంటూ, పూరి మాట్లాడకుండా ఉండిపోయింది.

“బాయి…..” తప్పించి వేరే పదం వినిపించట్లేదు. నిజంగా తను తన తమ్ముడా? ఇంకెవరైనానా? ఆలోచిస్తూ నిల్చుంది. కాసేపటికి చప్పుల్లన్నీ సద్దుమనిగాయి.

చుట్టూ ఏం జరుగుతుందో అర్థంకాలేదు. కళ్ళ ముందు ఉన్న చీకటి ఇంకా చిక్కగా మారిపోయినట్లు అనిపించింది. అంతా చీకటి. తల నొప్పి ఒకటి వచ్చి పడింది. కళ్ళ నుండి నీళ్ళు బొటబొట కారుతున్నాయి. పూరి వాచును చూసి ఐదేళ్లయింది.

“వాచుకు ఏమైంది. ఎట్లున్నాడో. ఒక్కడే ఎట్లా బతుకుతున్నడో” ఆలోచిస్తూ టూక్రి అంచును నోట్లో కుక్కి గట్టిగా ఊపిరి పీల్చి,

“ఆకలేసి వచ్చాడో ఏంటో? తలుపైనా తియ్యాల్సింది. గొంతైతే తమ్ముడిదే, వాడితో భయపడేదేముంది” అనుకుంది.

పిల్లోడిగా ఉన్నప్పటి వాచు ముఖం, పూరి కళ్ళల్లో అదే పనిగా కదల సాగింది. బొప్పాయి పండు లాంటి మొఖం. ఆకుపచ్చని పిల్లి కళ్ళు. మీగడ లాంటి చర్మం. బంగారు రంగు కేషాలు. కొంగలాంటి మెడ. తండాలో ఆడపిల్లలు వాచును చూసి కుళ్ళుకునే వారు.

వాళ్లు మొత్తం ఆరుగురు పిల్లలు. వాళ్లలో పూరి పెద్దది. సురా రెండో వాడు. వాచు ఎనిమిదో వాడు. వాచు కంటే ముందు ఇద్దరు అమ్మాయిలు ఉండేవాళ్ళు. వాళ్లు రెండేళ్లకు మించి బతకలేదు. అమ్మాయిల తర్వాత వాళ్ళ అమ్మ మూడు గర్భ స్రావాలను చవిచూసింది. అదంతా తన జటాని కుళ్ళుతో పెట్టిన శాపం వల్లే జరిగింది. అందుకే వాచు బతికి బట్ట కట్టడాన్ని వాళ్లు అద్భుతంగా భావిస్తారు. అంతకుముందు గర్భస్రావాలు, వాచు పుట్టుక వల్ల వచ్చిన కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల, వాళ్ళ అమ్మ చాలా నీరసించిపోయింది. ఇంటి పనులు ఏవి చేయలేకపోయింది. ఇంట్లో పెద్దదవ్వడం వల్ల పూరి మీదే పనులన్నీ పడ్డాయి.

నాన్న చాలా సాదాసీదామనిషి. తన అన్నయ్య, అతని భార్య తనని ఎంత దారుణంగా చూసిన, తను చివరిదాకా కూడా వాళ్ళకి సేవ చేస్తూ, తన ప్రతిక్షణం తన అన్నయ్య కుటుంబం కోసమే వెచ్చించాడు. తన భార్య పిల్లల్ని ఎప్పుడు పట్టించుకున్నది లేదు. చుట్టుపక్కల వాళ్ళు 18 ఏళ్లు వచ్చిన తన కూతురు పూరిని ఇంకా పెళ్లి చేయకుండా అలాగే ఉంచినందుకు ఏవేవో మాటలు అనేవారు. అవన్నీ కూడా పూరి వాళ్ళ నాన్నతో కాకుండా వాళ్ళ తమ్ముడు సురాతో చెప్పడం మొదలెట్టారు.

అతనికే తెలియకుండా సురా తన ఇంట్లో తనే ఇంటి పెద్ద అయిపోయాడు. 17 ఏళ్లకే అతను తండాలో కేళ్డాగా పేరూపొందాడు. రాత్రనగా పగలనకా పనిచేసేవాడు. ఎంతటి బరువునైనా మోసేవాడు. ఎద్దులాగా ఎకరాలకు ఎకరాలు భూముల్ని దున్నేవాడు. రెండేళ్లు చిన్నవాడైన వాచు అక్క చాటు తమ్ముడిగా పెరిగాడు. అందరూ అతన్ని భేనేర్ చేళా అనేవారు.

మోటాడి, మోట్ బాప్ ల హడావిడి, గోలకి, అమ్మ వైపు చుట్టాల సహాయంతో సురా పూరికి పెళ్ళికొడుకును వెతికి పెట్టగలిగాడు. నిన్నటి జ్ఞాపకం కంటే కూడా, ఆ రోజే పూరికి ఇంకా స్పష్టంగా గుర్తుంది.

పెళ్ళికొడుకు వస్తాడని వారం రోజులు వేచి చూశారు. అతని కోసం లాప్సి, అన్నం, రొట్టెలు కూడా పూరి చేసింది. తల్లి ఆరోగ్యం బాలేకపోవడంతో కూతురికి ఏమాత్రం సహాయం అందించలేకపోయింది. చేయాల్సిన పనుల కంటే ఎక్కువ పని, పెళ్ళికొడుకు వస్తున్నాడు అన్న హడావిడి, తన తర్వాత తన తమ్ముడు వాచును ఎవరు చూసుకుంటారు? తన తల్లిని ఎవరు చూసుకుంటారు? ఇవన్నీ పూరిని ఆందోళనకు గురి చేసేవి.

వరుడి సంఘటన జరిగింతర్వాత గానీ ఆమెకు అర్థం కాని ఇంకో విషయం ఉంది. ఆమె ప్రతిదాన్నీ, ప్రతి ఒక్కరిని, తన తండ్రిని, తన తల్లిని, సురాను అందరిని ద్వేషించింది. పూరి ఇలా చేయడం అన్యాయంగానే తోచొచ్చు, పూరి తన చిన్న తమ్ముడు వాచును అందరికంటే ఎక్కువగా ద్వేషించింది. ఆమె సురాతో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడలేదు, అతనితో మాట్లాడటమంటే, మరింత బాధ్యతగల, కఠినంగా మారిన తన తండ్రితో మాట్లాడినట్లుగా ఉండేది. ఆమె తల్లి, తన ఆరోగ్యం బాగాలేకున్నా, పూరిపై అతిగా ఆధారపడినా, ఆమె చేసే ప్రతి పనినీ నిశితంగా పరిశీలించేది. ఆమె వంటను, శుభ్రతను విమర్శించేది. ఆచారం ప్రకారం కాకుండా, పూరి స్వయంగా తన పెళ్లి ఘుంగ్టోను కుట్టుకుంటుంటే కూడా, పూరి సూది పట్టుకున్న విధానాన్ని ఆమె తల్లి విమర్శించేది. కానీ, ఆమె ఎప్పుడూ వాచుకు ఒక కంట కనిపెట్టుకుని ఉండేది. ఆమెనే అతన్ని పెంచింది, నడుం పై ఎత్తుకుని తినిపించింది. ఇంట్లో అందరిపై తనకెందుకు కోపం వచ్చిందో ఆమె చెప్పగలదు, కానీ ఆ రోజు తన చిన్న తమ్ముడు వాచుపై ఎందుకంత కోపంగా ఉందో మాత్రం తన జీవితం మొత్తం మీద చెప్పలేకపోయింది.

ఆ రోజు పూరి వాళ్ళ మోటాడి, మోట్ బాప్ కావాలనే పూరి వాళ్ళ నాన్నను ఎక్కడికో, హాట్ కి ఇంకేదో పని మీద పంపించేశారు. తమతో నాన్న లేనందుకు, నాన్న మీద కోపంగా ఉన్న సురా, వాళ్ళ నాన్నను పూరియే బైటికి పంపిందనుకుని ఇంట్లో ఉండొద్దని పూరి చెప్పినట్లు ఉహించుకుని, పూరి మీద కోపం చూపిస్తున్నాడు.

పూరి బర్రెల కొట్టాన్ని శుభ్రం చేసింది. ఇంట్లో కింద పడిన పెండనంతా ఊడ్చి, ఆవు పేడతో వాకిలంతా అలికింది. వాచు ఒక దూడ తన తల్లిని అనుసరించినట్లుగా పూరి వెనుకే తిరుగుతున్నాడు. అతను పూరి చేస్తున్న పనుల్లో సహాయం చేయాలనుకున్నాడు, కానీ ఉదయాన్నే ముందుగా లేవగానే తిండి కావాలి, తినకపోతే ఉచ్చ పొసేందుకు తన ధోతిని కూడా లేపలేడు.

“బాపడాసో భాయిన దస్సేక్ దళ్యాతో ఘాళ్” అంటు పూరిని వాళ్ళమ్మ సతాయిస్తుంది. బియ్యంలోంచి రాళ్లు, రప్పలు ఏరమంటూ తల్లి చేతిలో పూరి చాట పెట్టి, పొయ్యి వెలిగించింది. తల్లికి ఇచ్చిన బియ్యాన్ని కడిగి పోయి మీద పెట్టింది. వాచు పొయ్యి చుట్టూ ఆతృతగా తిరుగుతున్నాడు. సురా రెండు కోళ్లను కోసి పూరికి ఇచ్చి కూర వండమని చెప్పి వెళ్ళిపోయాడు. పూరి తనకి రొట్టెలు చేయడం రాదన్నందుకు పూరి వాళ్ళ అమ్మ మొఖం చిన్నబుచ్చుకుంది.

ఉడుకుతున్న అన్నం, కూరల మధ్య పూరి ఆగమౌతూ, ఆందోళన పడుతుంది. సురా, తనతో ఐదుగురు మొగోళ్ళు, ఓ యువకుడితో తిరిగివచ్చాడు. కుండలో కోడి కూర అడగంటిపోయింది. అన్నంలో గంజి అవిరైపోయి కాలిపోయెందుకు సిద్ధంగా ఉంది. చక్క గరిటేతో, తన బాలాన్నంతా ఉపయోగించి అన్నం కలిపింది పూరి. ఎంత బలమో కాని, కుండా కింద చిన్న నెర్ర బారింది. పూరికి భయమేసింది. తను చూస్తున్నది నమ్మలేకపోయింది. పెళ్లి చూపుల కోసం వచ్చిన వాళ్ళు ఇంట్లో కూర్చుని ఉన్నారు. పెద్దలు పూరిని గమనిస్తూ ఉన్నారు. పూరి ఇంకా స్నానం చెయ్యనే లేదు. జడ అల్లుకోలేదు. ఆమె బట్టలేమో మసిగుడ్డలా ఉంది. కుండకు నెర్రబారిన విషయం పూరి వాళ్ళ అమ్మకి తెలిస్తే, ఆరోగ్యం బాలేకున్నా గాని, కళ్ళలో కారం పెట్టి, పిచ్చి కొట్టుడు కొడుతుంది. చుట్టూ చూసింది. వాచు అన్నం కోసం ఎదురు చూస్తు కూర్చుని ఉన్నాడు. పాపం కుండ చిన్నగా పగిలిన విషయం, దానికి గాను పూరి భయపడుతున్న విషయం, ఏది కూడా వాచు గమనించలేదు. కూరను పొయ్యి దించి, అన్నం కలిపే గరిట వాచుకు ఇచ్చి, తను తయ్యారవుతానని చెప్పి వెళ్ళిపోయింది. వాచు అన్నం గరిట పెట్టి సరిగ్గా కల్పనైన కలపలేదు. వెంటనే కుండా మూడు ముక్కలుగా, పువ్వువిచ్చుకున్నట్టు పగిలిపోయింది.

“యా….” అంటూ భయంతో అరిచి ఏడవడం మొదలుపెట్టాడు వాచు.

పూరి వాచు దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళింది. ఒక అడుగు దూరంలో ఆగిపోయింది. వాచు కాలి మీద అంతా అన్నం చిల్లింది. పూరి బొమ్మలాగా చూస్తూ అక్కడే ఉండిపోయింది. కదలనైనా కదలలేదు. యాడి పూరి మీద అరిచింది. వాచుని ఎత్తుకొని, అదంతా శుభ్రం చేయమని చెప్పింది.

పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు అది చూసి, ఇది చెడు శకునమని లేచి వెళ్ళిపోబోయారు. సురా వాళ్లని ఆగమని ఎంతగానో బతిమిలాడాడు. అయిన వాళ్ళు వినిపించుకోలేదు. వెళ్ళిపోతున్న వాళ్ళ వెనకాలే సురా చేతులు జోడించి వేడుకుంటూ, వాళ్ళ వెంటే కొంత దూరం వెళ్ళాడు.

యాడి వాచు దగ్గరికి వచ్చి వాచు నిలబడేందుకు సహాయం చేస్తూ, తను ఊపిరి అందుకోవడానికి ప్రయత్నిస్తుండడం, ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందో, ఎలా జరిగిందో, పూరికి అర్థం కాలేదు. వాచును యాడి స్నానం చేసే బండవైపు తీసుకెళ్లడం చూసింది. సురా తన వైపే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అయినా పూరి కదలలేదు.

సురా రావడం రావడమే వాచుని లాగి పట్టుకొని చంపలు చల్లుమని అటు ఇటు కొట్టడం మొదలుపెట్టాడ. యాడి అరుస్తూ వాచుని కాపాడ్డానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తా ఉంది. కానీ సురా బలం ముందు యాడి ఏమి చేయలేకపోయింది.

అయినా పూరి కదలలేదు. ఆ కుండ పగలడమనేది తన వల్ల జరిగిందని వాచు తప్పు కాదని ఒక మాట కూడా పూరి చెప్పలేదు.

మరుసటి రోజుకి వాచుకు జ్వరం వచ్చేసింది కాళ్లంతా వేడి అన్నం వల్ల కాలిపోయాయి. ఒళ్లంతా కాలిపోవడం చూసి వాచు బతకడనుకున్నారు అందరూ. అయినా గాని పూరి ఒక మాటైనా మాట్లాడలేదు.

కోడి కూత కంటే ముందే మెలుకుంది పూరి. తనెప్పుడు మంచం కిందకి దూరిందో తనక్కూడా గుర్తుకు లేదు. శరీరమంతా గడ్డకట్టుకుపోయినట్లు అనిపించింది. నెమ్మదిగా పక్కకి జరిగి, కట్టే సహాయంతో, మంచం కాళ్ళ సహాయంతో లేచి నిల్చుంది. వెళ్లి, కిటికీ నుండి బయిటికి చూసింది. ఇంకెప్పుడు తెల్లరుతుందో ఏమో అనుకుంది. లోటా నీళ్ళు తాగి, ఇంట్లోంచి బయిటికి నడిచింది. దూరంగా నెమళ్ళ అరుపులు, అదేదో కోళ్లు తాము చెయ్యాల్సిన పనులు మర్చిపోయాయన్నట్లు నెమళ్ళు తెగ అరుస్తున్నాయి.

బర్రెల కొట్టం దాటి పోతుంటే, రాత్రి విషయం గుర్తొచ్చింది. వెంటనే కొట్టంలోకి నడిచింది. వాచు ఏమైనా ఉన్నాడా అని చూసింది. లేదు లేదు, అది ముమ్మాటికీ ఓ పిడకల అనుకుని వరి చేను వైపు అడుగులు వేసింది.

పూరి చేను చేరేలోపు సూర్యుడు అప్పటికే మేలుకుని ఒళ్ళువిరుస్తున్నాడు. పూరి కోడలు వరి చేను చుట్టూ తన పాత చీరలతో కంచె కట్టింది. పూరి చేను దగ్గరౌతున్నా కొద్ది, రంగురంగుల చీరల నుండి సూర్య రష్మీ కాంతిలీనుతూ, వరి చేనుకు జీవం పోస్తూ ఉంటే, ఎర్రగా, పసుపు పచ్చగా అవి అగుపిస్తున్నాయి. వరి పుల్లలు ఉదయపు గాలికి తెగ ఉగిపోతున్నాయి. ఒక వైపు కంచెగా కట్టిన చీర కింద పడిపోయి ఉంది. రెండు అడవి పందులు వరి చేనులో తిరుగాడుతుండడం చూసింది.

పూరి దూరం నుండే కేకేసింది. ఆమె కేకకి, ఆ రెండు పందులు అరుస్తున్నది ఎక్కడి నుంచి వస్తుందో చూసి బొమ్మలా కొన్ని క్షణాలు ఉండి, పూరి తన కట్టే సహాయంతో తడి ఒడ్డు మీద కష్టంగా నడుస్తుంది. ఆమె రాక దగ్గరవ్వడం చూసి పందులు సుడిగాలి వేగంతో పరిగెత్తుకు వెళ్ళిపోయాయి.

పూరి అరిచే హడావిడిలో ముందు ఏమి చూసుకోలేదు. జారీ పడిపోయింది. తన పేటియా మొత్తం బురదతో నిండిపోయింది. కళ్ళు భైర్లు కమ్మాయి. సోయిలోకి వచ్చేటప్పటికి తన ముందు ఓ పదేళ్ల పిల్లాడు నిల్చుని ఉన్నాడు.

“యే డోక్రి, లే” అంటు ఆ పిల్లాడు తన చేతిని ముందుకు చాచాడు.

పూరి కళ్ళు పెద్దగా చేసి ఆ పిల్లాడి వంక చూసింది అక్కడ కాకుండా ఇంకో చోట అయితే మర్యాదగా మాట్లాడనందుకు ఆ పిల్లాడి పిర్రలు పగలగొట్టేది. కానీ ఏంటో ఆ పిల్లాడి నవ్వులో ఏదో ఉంది అనిపించింది. సూర్యకాంతిలో అతనికి కేశాలు అచ్చం బంగారంగా మెరుస్తున్నాయి.

అతని చేతిని పట్టుకు లేచి నిల్చుంది. “ఎవరి కొడుకువి నువ్వు?” అడిగింది పూరి.

పిల్లాడు నవ్వి “ఎందుకు నీ అంతట నువ్వు సరిగ్గా నడవలేవని చెప్పడానికా!”

పూరి పిల్లాడి తల మీద మొట్టికాయలు వేసి నీ పోరడిగిన, గాలి మొక్కపొడివి నువ్వు” అన్నది.

పిల్లాడు గుసగుసలాడేడు. అతని పెదాల మీద నవ్వు కదలకుండా అలానే ఉండింది.

“డోక్రి జాగ్రత్తగా నడువు. నీకు ముందు ముందు మస్తు పనుంది. ముందే డీలా పడిపోకు, ఓపిక పట్టు అంటూ పూరిని రిగ్గు వైపు తీసుకెళ్లాడు.

పూరి ఘాగ్రా మీద మట్టిని కడిగేందుకు సహాయపడ్డాడు. ఆమె కడిగేసుకున్నాక, ఆమె చేతికి కట్టేను అందించాడు.

ఇంకా ఇది సాలు పో ఇంటికి పోయి ఈ స్కూల్ కి పో స్కూలు తప్పించుకోనికి తోటలో పంటి తిరుగుతున్నవులే అన్నది పూరి. అదేదో అతని ఎవరో తెలిసిపోయినట్లు ఆమె ముఖం ఒకేసారి వెలిగిపోయింది.

“ఇప్పటికైతే నేను ఏడికి పోయేది లేదు డోక్రి” అంటూ “చూడు ఆడ వేప చెట్టు ఉంది. నీకేమైనా వేప పుల్లలు కావాలా పళ్ళు తోముకోనికి?”

పిల్లాడిని చూస్తూ అవునన్నట్లు నోరుమూసింది. ఇంతకీ ఎవరి కొడుకు ఈడు. ఈడికి ఏం కావాలి” ఆలోచిస్తూ ఆశ్చర్యపోయింది.

“నీవు కనుక పడితివనుకో నీ కాళ్లు ఇరుగుతయి. మీ అవ్వా అయ్యలు నా వెంట పడతారు” అన్నది పూరి.

“నువ్వు ఏం ఫికర్ చేయకు. నేను చెట్లు మంచిగా ఎక్కుతా” అంటూ ఆమెని వేప చెట్టు వైపు తీసుకెళ్లాడు. పూరి, ఆమెకి అతను చెట్టు ఎక్కడం ఇష్టం లేదన్నట్లు ముఖం పెట్టింది. ఆగం పోరగాన్ని భరిస్తా ఉంది. వాడిలోని స్వచ్ఛత ఆమెకు నచ్చింది. అతని చిరునవ్వు నచ్చింది. ఇప్పుడు ఆమె ఎవరిని బతిమిలాడాల్సిన అవసరం లేదు తనకి దాత్ని పుల్లలు కావాలని. పిల్లాడు కొమ్మ నుండి కొమ్మకి కదిలాడు. పూరి అతనికి జాగ్రత్తలు చెప్తుంటే, ఆమె చెప్పిందల్లా పిల్లాడు నకలు కొడుతున్నాడు. గలగల నవ్వుతున్నాడు. ఆ గలగలలు చాలా పాతవిగా తోచాయి. పిల్లాడు చెట్టు దిగాక, మూడు కట్టల పుల్లలు అతని చేతిలో ఉన్నాయి. ప్రతి కట్ట అదే పరిమాణంలో ఉంది. పూరి అది చూసి నవ్వింది. ఆమె నవ్వినపుడు పళ్ళ సందులన్నీ స్పష్టంగా కనిపించాయి. మూడు కట్టలను తన నడుము దగ్గర కట్టుకొని వాటిని వేలాడదీసింది.

“నీ నోరు పెద్దది. కానీ నీ మనసు మంచిదనిపిస్తుంది. నాకోసం చాలానే చేసావ్. ఇంకా ఇంటికి పో” అన్నది పూరి.

“సరే పోత గాని, చెరువు దాకా నీతో వస్తా. నీకు తానం చేయాలని లేదా?!” అన్నాడు. పూరి కట్టేను ఓ చేతిలోకి తీసుకొని, ఇంకో చెయ్యితో పూరి చేయని పట్టుకొని ముందుకు నడిచాడు. ఆమె అతడిని అనుసరించింది. చెరువు దగ్గరికి చేరుకున్నాక, పూరి పిల్లాడి నుదుటిమీద ముద్దు పెట్టి “నేను తండాల చాలా తక్కువగా తిరుగుతా. తండా వాళ్లు కూడా నన్ను కలవడం మానేశారు. నువ్వు ఎవరి కొడుకువో తెలవదు. నువ్వు నీ వాళ్ళ గురించి చెప్పవు. అయితే మాయిగాని ఉండని, నువ్వూ…. నిన్ను కన్నవాళ్ళు చల్లగుండ” అని ఆశీర్వాదించింది.

“బాయి, నువ్వు కూడా సల్లగుండు” అని పిల్లాడు నవ్వి, గెంతుతూ నడిచి వెళ్లిపోయాడు. ఆమె అతడు దూరంగా వెళ్తుంటే చూస్తూ ఉండిపోయింది. ఆమె నాలుక చాయ్ కోసం గింజుకోవడం మొదలెట్టింది. తొందరగా ఇంటికి పోకపోతే చాయ్ మళ్ళీ వేడి చేయాల్సి వచ్చిందని పూరిని ఆడిపోసుకుంటుంది తన కోడలు. పూరి చెరువు వైపు తిరిగి టూక్రి తీసి నేలపై పెట్టి, కాంచ్ళి తీసి టూక్రి మీద పెట్టి, చెరువులోకి దిగి, మోకాలు మునిగే దాకా దిగి నీళ్లలో కూర్చుంది. ఆమె ఘాఘరో బుగ్గలాగా ఉబ్బిపోయింది. ఆమె చుట్టూ గాలినంత కొట్టి తానమాడింది. చుట్టూ చూసింది. అప్పటికే పిల్లాడు తోటల్లోకి మాయమైపోయాడు. కాలికింది నేల నుండి మట్టిని తీసుకుని ఒంటినిండా పూసుకుని, చేతులు, చాతి, కడుపు అన్ని చోట్ల పూసుకుని తానం చేసింది.

పిల్లాడి గొంతు బాగా తెలిసిన గొంతులా అనిపించింది. ఎందుకు? అతన్ని ఆమె ఎక్కడ చూసింది. అంత తొందరగా ఎలా చెట్టు ఎక్కాడు? కోతిలా కొమ్మల నుండి కొమ్మకి ఎంత వేగంగా కదిలాడు. అబ్బో ఆ మాటలు ఆమెని డోక్రి అని వెటకారంగా పిలవడం. చివరిగా బాయి అనడం.

వాచు కోతిలా అలా చుట్టూ తిరిగేవాడు. చెట్టు ఎక్కేవాడు. అదేదో యాడి, కోతి పిల్లని ఎత్తుకొచ్చి ఒళ్ళో పెట్టుకుని, తర్వాత దాని గురించి మర్చిపోయినట్లు. చిన్న చిన్న చెట్లు ఎక్కి మెత్తని కొమ్మలు పట్టుకొని వేలాడే వాడు. బూర్భాయిని పూరి కోసం పట్టుకొచ్చేవాడు.

పూరి చెరువు నుండి బయటకు వచ్చి, బట్టల పక్కన కూర్చుంది. తడిసిన ఘాగరోని ఎండబెట్టడానికి కూర్చుంది. ఏదో తెలియని అలజడి ఆమె హృదయంలో అంకురించడం ఆరంభించింది. పీడకల, తోటలో పిల్లాడు, అన్నీ కూడా తన భర్త చివరి కోరికయినా ఓ బాకీ ని గుర్తు చేస్తున్నాయి. ఇదంతా తన భర్త వెండి బ్రాస్లెట్ గురించి. తన భర్త ఆమెకు గుర్తు చేస్తున్నాడు. చిన్నప్పుడు తను వాచుకు ఏం చేసిందో చెప్పాల్సిన సమయం అది. పూరి గుమ్మనంగా కూర్చో లేకపోతుంది. వీస్తున్న గాలి ఆమెను తగలగానే ఆ చలికి పళ్ళు పటపటమంటా ఉన్నాయి. కాంచ్లి తొడుక్కొని, టూక్రి తల చుట్టూ చుట్టుకుని ఇంటిదారి పట్టింది పూరి.

ఇల్లంతా ఖాళీగా ఉంది తన కోడలు గాని, కొడుకు గాని, చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. నడుం దగ్గర కట్టి ఉన్న దాత్ని కట్టలను తీసి పైన దూలం దగ్గర జాగ్రత్తగా దాచింది. ఆ తర్వాత అక్కడి నుండి బర్రెల కొట్టం లోకి నడిచింది. మూలలో ఉన్న వంట చెరుకుని అంతా పక్కకు జరిపి, తవ్వడం మొదలు పెట్టింది. తవ్వడానికి చాలా అనువుగానే ఉందా జాగా. చుట్టూ ఎవరైనా ఉన్నారో లేదో చూసి ఇంకా వేగంగా తవ్వింది. మట్టిని జరిపి డబ్బాను తీసింది. మళ్లీ ఆ మట్టినంత కప్పి పెట్టి ఎలా ఉందో అలా చేసి, వంట చెరుకును మందులానే పెట్టేసింది. డబ్బాను తీసుకొని కొట్టం నుంచి బయటకు వచ్చింది.

నీళ్ల తొట్టి దగ్గరికి వెళ్లి, డబ్బా మీద ఉన్న మట్టిని కడిగి చేతులు కడిగేసుకుంది. ఆ తర్వాత ఇంటి దగ్గరికి నడిచింది. ఇంటి ముందు కూర్చుని, కాళ్ల నడుమ డబ్బాని పెట్టి, దాని మూతను తెరవడానికి తన బలాన్నంతా ఉపయోగించింది. ఆమె బలానికి ఆ డబ్బా లోంచి వెండి బ్రాస్లెట్ ఆమె ఒళ్ళు వచ్చి పడింది. తన భర్త చనిపోయినప్పుడు నుంచి ఆ బ్రాస్లెట్ ని అలానే దాచి ఉంచిందామే.

కొడుకు నాగు ఏవో రాజకీయ పార్టీలతో ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకొని, చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. రాజకీయంలో ఎదగడానికి తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుల్లో అధిక శాతం దుబారాగా ఖర్చు చేశాడు. తన చెల్లెలి పెళ్లి అయిపోయాక, తల్లిదండ్రులు చెల్లి పేరు మీద రెండు ఎకరాల భూమి రాస్తానంటే ససేమిరా ఒప్పుకోలేదు నాగు. ప్రతి సెంటు భూమి కూడా అతనికే చెందుతుందని వాదించాడు. బయట నుండి ఎవరో పెద్ద మనుషుల్ని పట్టుకొచ్చాడు. తండా నుంచి కొంతమంది పెద్ద మనుషుల్ని తనకు వీలుగా మాట్లాడే వాళ్ళని పట్టుకొచ్చి, పంచాయతీ పెట్టాడు. ఈ పంచాయతీకి తన మామ వాచు కూడా వచ్చాడు.

ఈ పంచాయతీలో నాగు వాళ్ళ నాన్న, తనకున్న దాంట్లో ప్రతిదీ కూడా తన ఇద్దరు పిల్లలకి సరి సమానంగా పంచుతానంటే, నాగుకు కోపం నషాలానికి ఎక్కిపోయింది. నాగు తన తండ్రి గళ్ళా పట్టుకొని అతని పక్కకి నెట్టేశాడు. కొట్టడానికి కూడా వెనకాడే వాడు కాదు. పూరి, వాచు, నాగును ఆపడానికి పరిగెత్తుకు వెళ్లారు. నేలపై పడి ఉన్న తన భర్తను చూసి తట్టుకోలేక పూరి, తన కొడుకుని తిట్టింది. అదేదో దయ్యం పట్టినట్టు నాగు వాళ్ళ అమ్మ జుట్టు పట్టుకుని ఆమె కడుపులో తన్నాడు. అనరాని… వినరాని… ఎన్నో మాటలు అన్నాడు. ఇంక వాచు తన కోపాన్ని అనుచుకోలేకపోయాడు. నాగు చంప మీద అటూ ఇటూ కొట్టాడు. ఎంతగా కొట్టాడంటే, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏందో గూబ గుయ్యి మనట్లు కొట్టాడు. నాగు ఎలాగైతే తన తండ్రిని కింద పడేసాడో, వాచు కూడా అతన్ని అలాగే నేల మీద పడేసి, తన్నడం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న జనాలు కనుక ఆ గొడవని ఆపకపోయి ఉంటే, నాగు వాచు చేతిలో కచ్చితంగా చచ్చేవాడు.

ఈ పంచాయతీ తర్వాత తన చెల్లెలికి రెండు ఎకరాల భూమి ఇవ్వడానికి నాగు అయిష్టంగానే ఒప్పుకున్నాడు. కానీ, తన ఇంట్లోకి తన చెల్లెలు గాని, తన మామ గాని ఎప్పుడూ రాకూడదని శరత్ పెట్టాడు. ఒకవేళ తన తల్లి వాళ్ళని కలవడానికి వెళ్తే తన కొడుకు శేవం చూడాల్సి వస్తుందని తల్లిని సతాయించేవాడు.

పూరి భర్తకి ఇంకా తను ఎక్కువకాలం బతకనని అర్థమయ్యాక, తన వెండి బ్రాస్లెట్ వాచూకి ఇవ్వమని పూరికి చెప్పాడు. పూరిని పెళ్లి చేసుకున్న తర్వాత, తనకొచ్చిన కష్టాల్లో, అది చిన్నదైనా… పెద్దదైన… ప్రతి దాంట్లో కూడా తన బామ్మర్ది తనకు తోడుగా ఉన్నాడు. తోట పని నుండి ప్రతి పనిలో వాచు ఉన్నాడు. తన బావకి ఎప్పుడు తను చెయ్యను, తన వల్ల కాదని అనలేదు.

అప్పటినుండి పూరి ఆ బ్రాస్లెట్ ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. దాన్ని తన కొడుకు నుండి దూరంగా కాపాడుకుంటూ, కనిపించకుండా ఉంచుకుంది. ఏదో ఒక రోజు ఆ బ్రాస్లెట్ ని తన తమ్ముడికి అందించాలని.

పూరి కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి. తన భర్త తన తమ్ముడు ఇద్దరు గుర్తుకొస్తా ఉన్నారు. ఒకరేమో తనని అన్యాయంగా వదిలి వెళ్ళిపోతే, ఇంకొకరిని తను చూసే హక్కే లేకుండా పోయింది. కాంపౌండ్ గేట్ చప్పుడు వినిపించగానే వెంటనే ఆ బ్రాస్లెట్ ని తన ఘాగ్రా మడతలో దాచి పెట్టింది. ఎవరై ఉంటారో అని చూసింది.

ఆమె హిరా. హిరా, పూరి ఇద్దరు ఓకే తండా నుండి వచ్చిన వాళ్ళు. ఇద్దరికీ పాతికేళ్ల వయసు తేడా. పూరిని చూసే, హీరాను ఆ తండాలో పెళ్లి చేశారు. హీరా పరిగెత్తుకుంటూ వచ్చి పూరిని పట్టేసుకొని ఏడవడం మొదలుపెట్టింది. పూరికి ఏమైందో ఏమీ అర్థం కాలేదు. ఢావ్లో పాడినా ఆమె బాధ ఏంటో పూరికి అర్థం అవుతుంది. ఏమీ లేకుండా ఏడుస్తుంది హిరా. ఆమెతో పాటే ఏడ్చింది పూరి. పక్కింటి వాళ్ళు వెనక్కింటి వాళ్ళు, నలుగురైదుగురు ఆడవాళ్లు జామైపోయారు. ఇద్దరినీ సంజ్జాయించి నీళ్లు తాగించి నిలుచున్నారు.

“ఎందుకు పోలేదు ఫూపి” అడిగింది హీరా.
“ఏడీకి?”
“సావుకి”
“ఎవరి సావు?”
“వాచు కాక సావుకి ?”

“వాచు” అన్న పేరు వింటూనే ఆకాశం విరిగిపడినట్లు గట్టిగా అరుస్తూ చాతి బాదుకుంటూ ఢావ్లో అందుకుంది పూరి. ఆ క్షణం ఏమీ అర్థం కాలేదు ఆమెకు. నిన్నటి కల గిర్రున తిరిగింది.

“నాగుఊఊ….” కొడుకుని పిలిచింది.
“మామా లేడు రా….. ఏడున్నవ్ బిడ్డా?” ఛాతి, తల బాదుకుంటూ కొడుకును పిలుస్తుంది.

పక్కనే నిల్చున్న వాళ్ళలోంచి ఒక ఆవిడ “వాళ్ళు ఎప్పుడో పొద్దున్నే హడావిడిగా పొయ్యిర్రు. ఎటు పోతున్నరో ఏమో అని నేను అడగలేదు” అన్నది.

“అవు, సావు కోసమని పొద్దున్న ఒక ఆటో తండా నుండి పోయింది. నువ్వు నీ కొడుకు సోబత్ పోయినవని అనుకున్న” ఇంకొక ఆమె అన్నది.

“యాడియే” అంటూ లేచింది పూరి. “నేను పోత, నేను జల్దీ పోవాలే, వాచు నా కోసం దారి సూస్తుంటడు” అంటూ తత్తర తత్తరగా మాట్లాడుతుంది. చేతులు వణుకుతున్నాయి. ముక్కు నుంచి చీమిడి కారుతుంది. కళ్ల గురించి చెప్పక్కర్లేదు ఇంకా.

“తండాలో ఉన్నవి రెండే ఆటోలు. రెండు పోయినయి. ఒక్క ఆటో కూడా లేదు. ఇప్పుడేట్ల” అన్నది ఒక్కావిడా.

ఆ మాటకి పూరికి ఏం చేయాలో తోచలేదు, స్తంభించిపోయింది. వెంటనే హీరా “గాం దాక ఎవరైనా బండి మీద దింపుతే బాగుండు” పూరి చెవులకు ఏ మాటలు వినిపించట్లేదు. వాళ్ళు మాట్లాడుకుని, కాసేపటికి హీరా మర్దిని ఒప్పించి, బండితో పాటు అతన్ని తీసుకోచ్చారు. పూరి బండి ఎక్కబోతూ తూలి పడబోయింది. హీరాకి భయం వేసి, బండిమీద తను కూడా పూరితో వెళ్ళింది. హీరా మరిది, వాళ్ళిద్దరినీ గాం జంక్షన్ దగ్గర దిగబెట్టి వెళ్ళిపోయాడు.

సిదా తండాకు పోయే ఏ ఆటోలు కూడా దొరకలేదు హీరాకి. ఏం చేయడానికి కూడా లేదు. తండా చేరాలంటే కనీసం మూడు ఊర్లైన తిరగాలి. ఇంకా అట్లా వెళ్తే వాళ్ళు వెళ్లే టప్పటికి మధ్యాహ్నం అయిపోతది. తండా చేరేటప్పటికి చీకటి అయిపోతది.

పూరి తన మొఖం మీదకి టూక్రి కప్పేసుకుంది. ఆగకుండా తన దుఃఖాన్ని బయట వినిపించనీయకుండా ఏడుస్తుంది. తామెక్కిన మొదటి ఆటో ఊర్లో ఆగగానే, తండా వచ్చేసిందేమో అనుకొని, పూరీ దిగి పరిగెత్తి ఇంటి వైపు పరిగెత్తబోయింది. హీరా వెంటనే ఆపింది. రెండో సారి ఆటో ఆగినప్పుడు మళ్లీ అలాగే జరిగింది. చివరాఖరికి తండా చేరేటప్పటికి పూరి దుఃఖంతో వణికి పోతూ ఉంది. అది చూసిన హీరాకి భయం వేసింది. పూరి తనని తాను వదిలించుకుని పరిగెత్తడానికి చూస్తున్నా, హీరా మాత్రం పూరి చేతుల్ని వదలకుండా ఆమెతో పాటే నడిచింది.

ఇంటి బయట, స్లాబ్ మీద తన పాలోళ్లు, కుటుంబీకులు కూర్చొని ఉన్నారు. వాళ్లందరూ పూరీని చుట్టుముట్టారు. ఇంటి ముందు చూసింది. తన తమ్ముడు ఎక్కడా కనిపించలేదు.

“ కాసేపైనా మీరు ఆగలేకపోయారా? నేను తమ్ముడుకి ఒక విషయం చెప్పాలనుకున్న. ఇప్పుడు నేను అతనికి ఎట్లా చెప్పేది” అంటూ వెలుగుతున్న దీపం వైపు పరిగెత్తబోయి కూలబడింది. దీపాన్ని చేరుకొని తన దుఃఖాన్నంతా ఢావ్లోలోకి ఒంపింది.

భేనేరి
డోరియా మా
వదో జకో చేల

మాట్లా మ ఫోడిజు
మార్ హివడాన
తోడ్గోరే భీయా

దాడేరి
దేయెర్ జు
హసేవాళో భియా
కు ఖోదిని
కతో కాయి కూర
మారి హివడారి వేళా

తారే హాతేప
భాందుచు
భనోయిర కడియా

చాందే సరికో
సూరత్ వాళో
ఊట్ జోరే భీయా

(ప్రియమైన తమ్ముడా! నా చాటున పెరిగావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? శపించ బడ్డ కుండను నేను పగలగొట్టినట్లు, నువ్వు నా హృదయాన్ని విరిచేసావు. ఉదయపు కాంతిలా నవ్వేవాడివి తమ్ముడా! నిన్ను నేను ఎలా కొలిపోయానని ఎవరైనా అడిగితె నా దుఃఖన్ని వారికి ఎలా చెప్పను? నీ చేతిని ముస్తాబు చేసేందుకు మీ బావ కడియాను దాచి ఉంచాను. చంద్రబింబం వంటి ముద్దులోలికే ముఖం నీది, ఒక్క సారి నాకోసం తిరిగి వచ్చేయవా తమ్ముడా!)

హీరాతోపాటు ఇంకొందరు బాయ్మన్క్యాలు పూరిని లేపడానికి ప్రయత్నిస్తుంటే, అక్కడికి పూరి కోడలు లచ్చి వచ్చి,

“యాడి, జర నీ ఏడుపు ఆపుతవా! చిన్నపిల్లలాగా కిందపడి ఏడుస్తున్నావ్. చూస్తున్నోల్లు నీ కొడుకు గురించి ఏమనుకుంటరు!” అన్నది లచ్చి.

పూరి తన కోడలు లచ్చి వైపు కోపంగా చూసింది. ఒక ఆమె ఎవరో వచ్చి పూరిని పట్టుకొని ఢావ్లో చేయబోయింది. దూరంగా తన కొడుకు వేరే వాళ్ళతో కూర్చుని నవ్వుతున్నాడు. పూరి కిందికి వంగి తన కట్టెను చేతిలోకి తీసుకుంది. తనను పట్టుకున్న ఆడవాళ్ల గుంపు నుండి తనంతాను విడిపించుకుని కొడుకు వైపు నడిచింది.

“నాగు….” అని పూరి అరిచి, తన బలాన్ని అంతా కూడ తీసుకొని, కట్టెతో అతని మెడ మీద ఒక్కటి ఇచ్చింది. అతడు దెబ్బకి ముందు పడ్డాడు. ఏం జరగబోతుందో ఏందో అని జనాలంతా చూస్తూ ఉంటే, నాగు లేచి నిల్చుని, అంత మందిలో నన్నే కొడతావా అంటూ తిరిగి ఒకటి ఇచ్చాడు. అంతే పూరి అక్కడే కుప్పకూలింది.

***

చిత్రం: సృజన్  రాజ్ 

రమేష్ కార్తిక్ నాయక్

రమేశ్ కార్తీక్ నాయక్(నునావత్ కార్తీక్) గోర్ బంజారాలకి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సాహిత్య సృజన చేస్తున్న కవి, కథకుడు. అతని ఆంగ్ల రచనలు జాతీయ అంతర్జాతీయ ఆంగ్ల పత్రికల్లో ప్రచురితమయ్యాయి. రావిశాస్త్రి కథా పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్నారు. ఆయన కవితలు, కథలు, హిందీ, బెంగాలీ, అస్సామీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఫ్రెంచ్ లాంటి భాషల్లో అనువాదమయ్యాయి. ఇప్పటిదాకా రమేశ్ ఏడు పుస్తకాలు ప్రచురించాడు. అతని కవితలు CBSC తో పాటు M.A, B.A వాళ్లకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఈ మద్యే “టాండో” అనే తన రెండో కవిత్వ సంపుటి ప్రచురితమైంది. ఢావ్లో ఆంగ్ల అనువాదం “A Song of Sorrows” గా Penguin Random House నుండి రాబోతుంది. ఇమెయిల్: Rameshkarthik225@gmail.com

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హృదయాన్ని పిండేసే కథ! రమేష్ కార్తిక్ నాయక్ గారూ, గోర్ బంజారా జీవితంలోని ఆచారాలు, అనుబంధాలు, అపరాధభావనలు, కుటుంబ సంఘర్షణలను అత్యంత సహజంగా, హృద్యంగా అక్షరీకరించారు. పూరి పాత్ర ద్వారా ఒక మహిళ జీవితంలో పేరుకుపోయిన ఒంటరితనాన్ని, పశ్చాత్తాపాన్ని, తీరని ఆత్మీయతను అద్భుతంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా తన తమ్ముడు వాచుతో ముడిపడిన బాల్య జ్ఞాపకాలు, అతనికి చెప్పలేకపోయిన మాటలు, చివరకు అతని మరణవార్తతో పెల్లుబికిన దుఃఖం పాఠకుడి హృదయాన్ని కలచివేస్తాయి.
    గొర్ బంజారా సంస్కృతిలోని ‘ఢావ్లో’ ద్వారా పూరి వేదనను వ్యక్తీకరించిన తీరు కథకు ప్రత్యేకమైన సాంస్కృతిక లోతును అందించింది. మనుషుల మధ్య దూరం కేవలం భౌతికమైనది కాదు.. చెప్పుకోలేని మాటలు, మోయలేని అపరాధభావాలు, కాలం తిరిగి ఇవ్వలేని అనుబంధాలు కూడా మనుషులను పరాయివాళ్లుగా మారుస్తాయి అనే జీవిత సత్యాన్ని ఈ కథ బలంగా గుర్తుచేస్తుంది.
    పూరి పాత్రలోని అంతర్మథనం, వాచుతో ముడిపడిన వెండి కడియం, చివర్లో ఆమె ఆవేదనకు కుటుంబంలో ఎదురైన నిరాదరణ.. ఇవన్నీ కథను మరింత విషాదభరితంగా నిలబెడతాయి. గొర్ బంజారా జీవన సంస్కృతిని, మానవ సంబంధాల సంక్లిష్టతను సమర్థంగా చిత్రించిన రచయిత రమేష్ కార్తిక్ నాయక్ గారికి హృదయపూర్వక అభినందనలు.
    – భూక్యా గోపినాయక్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.