నీకోసం రాసిన కవిత

నా చితి కాలిపోయాకా

చిత్తు కాగితాల్లో పాత పుస్తకాల్లో

నీ కోసం రాసిన కవితకై వెతకొద్దు

 

ఊపిరి పదాలతో అల్లిన జీవమాల అది

శ్వాసతో బాటే తెగిపోయుంటది

గాలిలో లీలలా కలిసిపోయుంటది

 

2.

 

నువ్వూ – నేనూ

 

ఎల్లల్లేని మైదానంలా నువ్వూ

అచ్ఛాదన లేని అరికాళ్లతో నేనూ

 

పుడమిని కమ్మిన వాయువరణంలా నువ్వూ

చేతులుచాచిన దాహపు కౌగిలై నేనూ

 

అకారణంగా అనంత ఏకాంతంలో

నీకు నువ్వుగా నువ్వూ

 

నిను తాకుతూ ముద్దాడుతూ

నీ తోడు కోరే తీరనిమోహం నేనూ

 

3.

 

మెలుకువకూ నిద్రకూ మధ్య

 

మెలుకువ

నిద్రలోకి జారే

పాకుడురాళ్ల సందుల్లో

 

మెలుకువ పసిగట్టలేని

నిద్ర స్వప్నించలేని

అరుదైన దివి పుష్పాలుంటాయి

 

తీరిగ్గా చూసే వీలుండదు గానీ

చూపుకు కాస్త తేనుంటే

ఒకటో రెండో అతుక్కొని

 

నిద్రలోయలోకి జారిపడతాయి

స్వప్న తరువులపై తళుకులీనుతాయి

 

మెలుకువ ధ్యానంలో

కవనవన కువకువలై వచ్చి వాలతాయి

*

ప్రమోద్ వడ్లకొండ

తెలంగాణలోని హనుమకొండ మా స్వస్థలం. ప్రస్తుతం బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో హెలికాప్టర్ డిజైన్ డిపార్టుమెంటులో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నాను. కవిత్వం అంటే కొంచెం పిచ్చి. బాగా చదువుతాను. అప్పుడప్పుడు రాస్తాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.