వూరికే వచ్చివెళ్లిపోయే జ్వరం కాదు ఇది!

వానకు తడియని కవి,వేమన పద్యం వినని కవి ఉంటే ఉండవచ్చునేమో కానీ జ్వరం రాని కవి ఉండడేమో?తమకొచ్చిన జ్వరాన్ని సైతం కవిత్వ వస్తువుగా చేసుకున్నకవులున్నారు. జ్వరాన్నిపోలిక గానో,ప్రతీక గానో చేసిన కవులు అన్ని భాషల్లోను ఉండవచ్చు.

 భాసుడు తన ‘ప్రతిమా’ నాటకంలో అవిమారకుడి వియోగ దుఃఖాన్నిప్రతిబింబించడానికీ జ్వరాన్ని పోలిక చేస్తూ “అత్యుష్ణాజ్వరితేవ భాస్కరకరైరా పీతసారా మహీ” అని అంటాడు.అంటే సూర్య కిరణాల తీవ్రతతో భూమి జ్వరంతో విలవిలాడినట్లుంది అని భావం.

“చండ చండం,తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే,భయం వేస్తేప్రలాపిస్తే” అని అంటూ దారి తప్పిన బాటసారికొచ్చిన జ్వరాన్ని మహా కవి శ్రీశ్రీ తన కవితలో ఒక మెటఫర్ గా ప్రస్తావించాడు. రాధేయ అనే ప్రముఖ కవి “ కవిత్వం నాకు కన్ను మూతబడని జ్వరం” అని అంటుంటాడు.

సిల్వియా పాత్ అనే కవయిత్రి తనకొచ్చిన జ్వరాన్నికవిత్వం చేసింది.”ఫీవర్ 103°” (Fever 103°)” అనే కవితను ఒక విశ్వజనీనమైన దృశ్య కావ్యంగా మలిచింది. John Donne అనే పాశ్చాత్య కవి తన ప్రేయసికొచ్చిన జ్వరం గురించి “ A Fever “ అనే కవిత రాసి అందులో జ్వరం గురించి మాత్రమే చెప్పకుండా ప్రేమికుల మధ్య ఉండే మృత్యువు సైతం విడదీయ లేని ప్రణయపు శక్తిని విన్నూతనంగా వ్యక్తీకరించాడు.ఇట్లా జ్వరాన్ని ఒక శారీరక రుగ్మతగా కాకుండా ప్రేమకు, దుఃఖానికీ, సామాజిక చైతన్యానికీ ప్రతీకగా పలువురు ప్రముఖ కవులు తమ కవితల్లో అభివ్యక్తం చేశారు.

ఇటీవలే ఒక తెలుగు కవి ఒక విచిత్ర జ్వరం  ప్రపంచ ప్రజలందరికీ ఎట్లా సోకిందో అద్భుతంగా కవిత్వం చేశాడు.అది ఎంత చండ చండంగా, తీవ్ర తీవ్రంగా సామాజిక, కౌటుంబిక,మానవ సంబంధాలను ఎట్లా ఛిద్రం చేసిందో అక్షరాల్లో నులి తిరిగే వేదనాత్మకంగా కవిత్వం చేశాడు.

అది తన విశ్వ రూపాన్నిఎట్లా చూపిస్తున్నదో ‘ ఫైనాపిల్ జామ్’ పూసినంత సరళంగా కవితాత్మకంగా చిత్రించారు.అట్లా రాసిన కవి ఎవరో కాదు ‘ ఎవరిదీ చూపు?’ అని ప్రశ్నిస్తున్న సుప్రసిద్ధ కవి విజయ్ కోగంటి గారు.

‘ఇలా రువ్వుదామా రంగులు’ అంటూ కవిత్వానికీ సులభ గ్రాహ్యత,భావగాఢత అనే రంగులద్దిన కవి విజయ్ కోగంటి గారు. ఆంగ్లంలో ఎన్నో పత్రాలు సమర్పించి, ఎన్నో అధ్యాపక శిక్షణా శిబిరాల్లో  రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించిన సమర్థుడైన ఆంగ్ల అధ్యాపకుడు అప్పుడు.ఇప్పుడు కానవరపు కోటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్.

 “సాధారణంగా ఇంగ్లీష్ ప్రొఫెసర్లు తెలుగు కవిత్వం రాసినప్పుడు ఆంగ్ల భావజాల ప్రభావం,పాండిత్య ప్రదర్శన ఎక్కువై పాఠకులకు అందకుండా పోయే ప్రమాదం ఉంది.కానీ విజయ్ కోగంటి గారికీ ఆంగ్లంలో ఎంతో గాఢమైన ప్రవేశం ఉన్నప్పటికీ పరభాషా వ్యామోహానికీ గురికాకుండా అచ్చమైన తెలుగు జాతీయాల్ని,పలుకుబళ్ళను పట్టుకొని స్వచ్ఛమైన తెలుగు రాస్తున్నాడని” ప్రముఖ కవి విమర్శకులు రచయత  పాపినేని శివశంకర్ గారు విజయ్ గారికి కితాబునిచ్చారు.

“ద స్పారో అండ్ ద కానన్” అనే ఆంగ్ల కవితా సంపుటి తీసుకొచ్చిన విజయ్ గారి గొంతెప్పుడు కల్లోలంపై కదలాడే శాంతి స్వరమే.విజయ్ గారిని గూర్చి ‘అతడు భావాలకు రంగులద్ది ఓ మెత్తటి ఈకను తయారు చేయగలడు” అన్నారు ప్రముఖ కవి చరిత్రకారుడు  కొప్పర్తి గారు.

ఆయన ఇంకో మాట కూడా ఇలా అన్నారు.’అతను ఉదకమండలంలో అగ్ని పర్వవతం.అతని కవిత్వం నీళ్ళలోనూ,నిప్పులోనూ సామాన్యంగా ఉండే ఆమ్లజని.కొప్పర్తి గారన్నఈ మాటలు నిజమే అనిపిస్తుంది విజయ్ గారి కవిత్వం చదివితే.

 అన్ని చోట్ల వ్యాపించిన ఈ బొమ్మల తెరల జ్వరం ఈనాటి ప్రపంచాన్ని ఎంత తీవ్రంగా బాధిస్తున్నదంటే… మాటలు మరచి పోయేంత.నాలుక పిడచగట్టి పెదవులు పగిలేటట్లుగా మాత్రమే కాదు మేధ మెదడు లోనే ఆవిరయిపోయేంతటి జ్వరమట.

ఈ జ్వరమేదో ఇప్పటికే అర్థమయి ఉంటుంది. ఒకప్పుడు టి.వి ల జ్వరం. కొంత కాలం క్రితం అంతర్జాల జ్వరం. ఇప్పుడు సెల్ ఫోన్ ల జ్వరం.ఈ సెల్ ఫోన్ పుట్టుక వల్ల మనుషుల మధ్య ప్రత్యక్ష సంభాషణ తగ్గిపోయి, మానవ సంబంధాల కుదింపు మొదలయ్యింది. మనిషికి ఒంటరి తనం ఆరంభమయ్యింది.మనిషిని తనకు బానిసను చేసుకుంది ఈ సెల్ ఫోన్.

సెల్ ఫోన్ పై ” చేతిలో సెల్ ఫోన్/కళ్ళల్లో డిస్ప్లే/గుండెల్లో ఒంటరితనం “ లాంటి హైకూలే కాకు ఎన్నో వచన కవితలు శతకాలు కూడా వచ్చాయి.ఇట్లా సెల్ ఫోన్ లాంటి అంతర్జాల ఆధారిత సాంకేతిక పరికరాల మీద వాచ్యంగా కాకుండా ధ్వన్యాత్మకంగా విజయ్ కోగంటి చాలా ఒడుపుతో వాటి ప్రభావాన్ని సమాజానికీ సొకిన జ్వరంగా కవిత్వం చేశాడు.

ఇట్లా  ఒక ఎత్తుగడతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్న సెల్ ఫోన్ లాంటి అంతర్జాల ఆధారిత సాంకేతిక పరికరాల దుష్ప్రభావాన్ని విజయ్ రాసిన కవిత సూచిస్తుంది.ఒక నిస్తేజపు తనాన్ని ఈ సమాజానికీ ఈ పనిముట్టు అలవాటు చేసిందో ఈ కవిత చెబుతుంది.పని చేసే సామర్థ్యాన్ని కోల్పోతున్న జనాల అసహనాన్నీఈ విచిత్ర పైత్య జ్వరం మరింత ప్రకోపింప చేస్తుందని  సరళాత్మక వ్యంగ్యంతో విజయ్ కొత్త దనం మేళవించి ఈ జ్వరం  కవిత రాశారు.

సమాజంలో వయసుతో పని లేకుండా సమస్త జనాలు సర్వేంద్రియాల్ని ఈ రంగుల తెర తనపై ఎట్లా కేంద్రీకరించుకుందో విజయ్ గాఢతతో కవిత్వం చేశాడు. విజయ్ తన ఈ కవితలో ఇమిడ్చిలోతైన భావాన్ని ఆలోచిస్తే ఆకలి దప్పుల్ని కూడా మరపింప చేసే ఈ పరికరాన్ని అవసరమైనంత మాత్రమే సమాజం వాడుకోగలిగితే దాని ప్రయోజనం నెరవేరుతుందని అర్థమవుతుంది.

పాటలు వింటూ కొందరు, భక్తి, రక్తి,ముక్తుల రీల్స్ చూస్తూ మరి కొందరు,ఛాటింగ్ లతో ఇంకొందరు కళ్ళల్లో  రంగుల తెరల్నినింపుకుంటూ తన్మయమయ్యే జనాల్ని మౌన యోగంలోకి తీసుకెళ్ళగలిగిన ఈ అంతర్జాల ఆధారిత పరికర జ్వరం తగ్గించడానికీ అవసమయ్యే డోలో ఔషధం ఎవరు కనిపెట్టాలో మరి.సామాజిక జ్వరాన్ని కవిత్వంగా మలిచిన విజయ్ కి అభినందనలు.

 

జ్వరం !

 

దృష్టి కుదరదు

ఏ పని చేయబుద్ధి కాదు.

ధర్మా మీటర్లు పట్టనంత జ్వరం

నాలుక పిడచగట్టి పెదవులు పగిలి

అన్ని  జ్వరంచోట్ల అదే జ్వరం.

మళ్ళీ వస్తుందా ఈ కాలం అంటూ

జ్వరం ఒకటే జ్వరం

వేళ్ళు వేగంగా తెరల మీద కదులుతూ

రంగులు రంగులుగా

బొమ్మల తెరల జ్వరం.

ఎవరికి వారే నవ్వుకుంటూ

విచిత్ర పైత్య జ్వరం.

పాటల జ్వరం

భక్తి రక్తి ముక్తుల జ్వరం.

పసిపాపలు సైతం

చూడందే బువ్వని ముట్టని జ్వరం.

ఏమీ తోచకుండా చేసి

తలలో పాములు దూరినట్లు

అసహనంగా చేసే జ్వరం

తీవ్ర జ్వరం.

బాల్యానికీ

యవ్వనానికీ

మధ్య తరానికీ

ముసలీ ముతక తరాలకీ

మాటలు సైతం మరచి

మౌన యోగంలోకి పోయేంతటి

జ్వరం మహా జ్వరం.

కళ్ళల్లో తెరలు నింపుకు

తన్మయమయ్యే జ్వరం

కడుపులో ఆకలి

మరచిపోయేంతటి జ్వరం.

మేధ మెదడులోనే

ఆవిరై పోయే జ్వరం

గుడిలో బడిలో

రాదారుల్లో పని చోటుల్లో

చేసే వాడికీ చేయించే వాడికీ

జ్వరం జ్వరం జ్వరం

ఒకటే జ్వరం.

*

రాజారామ్ తూముచర్ల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.