శుక్రవారం ఉదయం.
‘ఆనంద నిలయం’ అపార్ట్‌మెంట్ ఇంకా పూర్తిగా మేలుకోలేదు. బాల్కనీల్లో పాలప్యాకెట్లు వేలాడుతున్నాయి. ఎక్కడో ప్రెషర్ కుక్కర్ విజిల్ వినిపించింది. ఎదురుగా మూసీ ఒడ్డున మంచు ఇంకా పూర్తిగా చెదరలేదు.
నేను సోఫాలో కూర్చుని పెద్ద మగ్గులో శ్రీమతి చేసిన బ్రూ కాఫీ తాగుతున్నాను.
డోర్‌బెల్ మోగింది.
తలుపు తీసేలోపే ఎవరో తెలిసిపోయింది.
ఎదురింటి ఆవిడ.
“సౌమ్యగారు ఉన్నారా?” అంది.
“ఉన్నారు… రండి.”
లోపల నుంచి మా ఆవిడ వచ్చింది. నన్ను చూసి చిన్నగా నవ్వింది.
“ఇవాళ శుక్రవారం కదా…”
ఆ ఒక్క మాట చాలనుకుంటా.
మిగతా సంభాషణ నాకు కంఠస్థమే.
కొద్దిసేపటికి వినిపించింది.
“ఒక వంద రూపాయలు ఇస్తారా సౌమ్యగారు… సాయంత్రానికి ఇచ్చేస్తాను.”
ఇది కొత్త విషయం కాదు.
ప్రతి శుక్రవారం ఏదో ఒకటి అప్పుగా అడగడం ఆమెకు అలవాటు.
అవసరం ఉన్నందుకా?
కాదు.
శుక్రవారం పొరుగింటి నుంచి ఏదైనా తీసుకుంటే వారి ఇంటి సిరి తమ ఇంటికి వస్తుందని ఆమె నమ్మకం.
ఇంటావిడ ఎప్పుడూ నిరాకరించదు.
డబ్బు ఇచ్చి లోపలికి వచ్చేసింది.
ముఖంలో చిరాకు.
“అవసరం ఉన్నప్పుడు అడిగితే ఒక మాట. ప్రతి శుక్రవారం ఇదే తంతు.”
నేను నవ్వాను.
“వంద రూపాయలు ఇచ్చినంత మాత్రాన మన అదృష్టం వెళ్లిపోదులే.”
“డబ్బు పోతే సంపాదించొచ్చు. కానీ మనల్ని అమాయకులనుకుని వాడుకోవడం నాకు నచ్చదు.”
నేను వాదించలేదు.
విజయవాడలో చదువుకునే రోజుల్లో గోరా నాస్తిక కేంద్రంలో గడిపిన సాయంత్రాలు నా ఆలోచనల మీద ఇప్పటికీ ముద్ర వేసి ఉన్నాయి. మంగళవారం, శుక్రవారం, మంచి రోజు, చెడు రోజు… అలాంటి విభజనలు నా ప్రపంచంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు.
“వాళ్ల నమ్మకాలు వాళ్లవి. మనం ఎందుకు పట్టించుకోవాలి?” అన్నాను.
ఖాళీ కప్పు తీసుకుని వంటగదిలోకి వెళ్లిపోయింది.
ఆ ఉదయం ఆమె ఎందుకు మౌనంగా మారిందో నాకు అప్పుడు అర్థం కాలేదు.
—
అయితే అదే రోజు సాయంత్రం మరో మనిషి మా తలుపు తట్టాడు.
అతను వంద రూపాయలు అడగలేదు.
వెయ్యి రూపాయలు అడిగాడు.
“అతను డబ్బు కోసం రాలేదు.” ఇంటావిడ గొణుగుతోంది.
ఆ విషయం నాకు అర్థం కావడానికి ఇంకా చాలా రోజులు పట్టింది.
ఇంట్లో మాటల వేడి పెరిగితే నేను బయటకు వచ్చేయడం అలవాటు.
ఆ రోజు కూడా చెప్పులు తొడుక్కుని లిఫ్ట్‌లో కిందికి దిగిపోయాను. లిఫ్టులోకి రాబోయిన రవీంద్రారెడ్డి కూతురు నన్ను చూసి వెనక్కు తగ్గింది. టెన్త్ క్లాస్ చదువుతోంది. ‘మీరు క్రిస్టియన్లు కదా’ అన్నట్లు ఆమె చూపు.
సెల్లార్‌లో వాచ్‌మన్ చిన్నప్ప కనిపించాడు. నన్ను చూడగానే ఎప్పటిలాగే రెండు చేతులూ జోడించి నమస్కరించాడు.
చిన్నప్పలో నాకు నచ్చే విషయం ఒక్కటే. ఎప్పుడూ అతని ముఖంలో ఫిర్యాదు ఉండదు.
ఆ రోజు మాత్రం అతని పక్కన ఒక అపరిచితుడు నిలబడి ఉన్నాడు.
నలభై ఏళ్లు దాటకపోవచ్చు. ఎండకు కమిలిపోయిన చర్మం. సిమెంట్ దుమ్ముతో తెల్లబడిన చొక్కా. కాళ్లకు అరిగిపోయిన చెప్పులు. కానీ కళ్లలో మాత్రం ఒక సంకోచం.
“సార్…” అంటూ చిన్నప్ప నన్ను ఆపాడు.
“ఏమైంది?”
“ఇతని పేరు వెంకటేసు. ఎదురుగా కడుతున్న బిల్డింగ్‌లో కూలి చేస్తాడు.”
వెంకటేసు రెండు చేతులూ జోడించాడు.
నేనూ తల ఊపాను.
చిన్నప్ప మాట మొదలుపెట్టలేక తటపటాయిస్తున్నాడు.
“చెప్పు చిన్నప్ప.”
“మేస్ట్రీ ఇంకా కూలి డబ్బులు ఇవ్వలేదట సార్… ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందట… ఒక వెయ్యి రూపాయలు అప్పుగా ఇస్తారా అంటున్నాడు.”
వెంకటేసు తల ఇంకా కిందికే వంచుకున్నాడు.
మళ్ళీ అదే సీను.
నన్ను నేరుగా చూసి ఒక్క మాట కూడా అడగలేదు. ముందుగా మా ఇంటావిడను అడిగొచ్చారుగా.
అది నాకెందుకో నచ్చలేదు.
“నీ బంధువా?” అని చిన్నప్పను అడిగాను.
“కాదు సార్.”
“అయితే మీ ఊరివాడా?”
“కాదు.”
“మరి?”
చిన్నప్ప నసిగాడు.
“మొన్నటి నుంచి మాతో పాటు ఆదివారం ప్రార్థనకు వస్తున్నాడు సార్.”
ఆ సమాధానం నన్ను తృప్తిపరచలేదు.
ప్రార్థనకు వస్తేనే వెయ్యి రూపాయలు అప్పు ఇవ్వాలా?
“నాకు పరిచయం లేని వాళ్లకు డబ్బులు ఇవ్వడం అలవాటు లేదు చిన్నప్ప.”
అంతే అన్నాను.
వెంకటేసు నెమ్మదిగా చేతులు దించాడు.
“పర్లేదు సార్.”
అది అతను ఆ రోజు మాట్లాడిన మొదటి మాట.
అదే చివరి మాట కూడా.
ఇద్దరూ తిరిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు.
వెంకటేసు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు.
⸻
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి సౌమ్య టీ సిద్ధంగా పెట్టింది.
ఆమె ముఖం చూస్తే ఏదో విషయం కోసం ఎదురు చూస్తోందని అర్థమైంది.
“చిన్నప్ప చెప్పాడు.”
టీ కప్పు అందిస్తూ అంది.
నేను ఏమీ మాట్లాడలేదు.
“ఆ వెంకటేసుకు వెయ్యి రూపాయలు అవసరమట.”
ఇంతకుముందే చెప్పావుగా
“చిన్నప్ప అడిగాడులే ?”
ఏమిటి వీడి బోడి రికమెండేషన్ అనిపించింది. నేను క్రిస్టియన్నని కాలనీ మొత్తం చాటింపు వేసింది వీడేనని నాఅనుమానం. చిన్నప్ప కూడా అదే కేటగిరి అని చూచాయగా తెలుసు. ఆ అలుసు చూసుకుని ఎక్కడలేని రికమెండేషన్లు చేస్తుంటాడు.
“అవసరం లేదు. అతని ముఖం చూస్తే చాలదు?”
నేను మౌనంగా టీ తాగుతున్నాను.
“ఒక చిన్నబ్బాయి ఉన్నాడట. స్కూల్ ఫీజు కట్టాలట.”
“అయితే ఫీజు నేను నేరుగా స్కూల్‌లో కడతాను.”
సౌమ్య అదోలా నవ్వింది.
“పేదవాళ్ల అవసరాలు మనం అనుకున్నట్టుగా ఉండవు.”
నేను కొంచెం చిరాకుగా అన్నాను.
“డబ్బు అప్పు ఇవ్వడం నాకు ఇష్టం లేదు.”
“నేను హామీగా ఉంటాను.”
ఆ మాట నన్ను గుచ్చింది.
“నా డబ్బుకు నువ్వు హామీగా ఉంటావా?”
సౌమ్య ఒక్కసారిగా మౌనమైంది.
కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా అంది.
“హామీ డబ్బుకి కాదు…
మనిషికి.”
నేను సమాధానం చెప్పలేదు.
టీ కప్పు టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్లిపోయాను.
ఆ రాత్రి నాకు బాగా నిద్ర పట్టింది.
వెంకటేసుకు పట్టిందో లేదో…
నేను ఆలోచించలేదు.
—–
రెండు వారాల తర్వాత హైదరాబాద్ రంగులు మార్చుకుంది.
వర్షాకాలం చివరి రోజులు. రోడ్ల పక్కన వెదురు బొంగులు, రంగురంగుల వస్త్రాలు, సీరియల్ లైట్లు కనిపించడం మొదలైంది. కూడళ్లన్నీ మట్టితో చేసిన గణపతులతో నిండిపోయాయి.
పగలంతా సిమెంట్ మోసే చేతులే, సాయంత్రానికి పూలమాలలు అల్లుతున్నాయి.
షంషాబాద్ నుంచి ఇంటికి వస్తుండగా ప్రతి గల్లీ ఒక చిన్న పండుగలా కనిపించింది.
మా అపార్ట్‌మెంట్ గేటు దగ్గర చిన్నప్ప కనిపించాడు.
“ఏమిటి విశేషాలు?” అన్నాను.
“ఎదురుగా బిల్డింగ్ కడుతున్న కూలీలు కూడా గణపతి పెట్టారు సార్.”
“డబ్బులు లేవన్న వాళ్లు విగ్రహం ఎలా పెట్టారు?”
చిన్నప్ప నవ్వాడు.
“లింగారెడ్డి గారు విగ్రహం ఉచితంగా ఇచ్చారట. ‘మీరు కూడా పండుగ చేసుకోండి’ అని.”
నేను ఎదురుగా చూశాను.
అసంపూర్తిగా నిలిచిన భవనం ముందు తాటాకులతో చిన్న పందిరి వేశారు. పచ్చని మామిడి ఆకులతో తోరణం కట్టారు. మధ్యలో మూడు అడుగుల మట్టి గణపతి.
విగ్రహం గొప్పది కాదు.
కానీ దాన్ని చూసే కళ్లల్లో ఆనందం మాత్రం గొప్పది.
చిన్న పిల్లలు పరిగెడుతున్నారు.
ఆడవాళ్లు ముగ్గులు వేస్తున్నారు.
మగవాళ్లు పందిరికి రంగు బల్బులు కడుతున్నారు.
ఆ గుంపులో వెంకటేసు కనిపించాడు.
అతను నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు.
ఆ నవ్వులో ఎలాంటి అభ్యర్థన లేదు.
ఎలాంటి బాధా లేదు.
నేను మాత్రం తెలియకుండానే చూపు తిప్పుకున్నాను.
⸻
ఆ రోజు రాత్రి భోజనం చేస్తూ సౌమ్య అంది.
“ఆ కూలీలు ఎంత మనసుపెట్టి పండుగ చేసుకుంటున్నారో చూశారా?”
“చూశాను.”
“వెంకటేసు కూడా ఉన్నాడు.”
నేను మౌనంగా అన్నం కలుపుతున్నాను.
“అతను మళ్లీ డబ్బు అడగలేదు.”
“అడగకపోవడమే మంచిది.”
“ఎందుకో తెలుసా?”
నేను తల ఎత్తలేదు.
“కొంతమంది ఒకసారి ‘వద్దు’ అన్న మనిషి దగ్గరకు రెండోసారి వెళ్లరు.”
ఆ మాట వినగానే నా చేతిలోని ఫోర్క్ క్షణం ఆగిపోయింది.
మళ్లీ ఆ విషయం మాట్లాడలేదు.
⸻
రోజులు గడుస్తున్నాయి.
ఉదయం పనికి వెళ్లే ముందు కూలీలు గణపతికి హారతి ఇచ్చేవారు.
సాయంత్రం పని ముగిసాక మళ్లీ పందిరి దగ్గర చేరేవారు.
ఎవరో భజనలు పాడేవారు.
ఎవరో పిల్లలకు ప్రసాదం పంచేవారు.మూడు అడుగుల మట్టి విగ్రహం చుట్టూ వాళ్లు నిర్మించుకున్నది పండుగ కాదు…
ఒక చిన్న ప్రపంచం.
ఒక రోజు బాల్కనీలో నిలబడి వాళ్లను చూస్తుంటే
“పేదవాళ్లకి పండుగలు ఎక్కువ అవసరం.”
“ఎందుకు?”
“బాధను కొద్ది రోజులు మర్చిపోవడానికి.”
ఆ సమాధానం నా దగ్గర లేదు.
ఆ సాయంత్రం మొదటిసారి వెంకటేసును కొంచెం ఎక్కువసేపు చూశాను.
విగ్రహం ముందు నిలబడి కళ్లుమూసుకున్నాడు.
ప్రార్థన ఎక్కువసేపు చేయలేదు.
కానీ లేచాక అతని ముఖంలో కనిపించిన ప్రశాంతత…
నేను ఎప్పుడూ గమనించని ఒక సంపదలా అనిపించింది.
—–
నిమజ్జనానికి రెండు రోజుల ముందు నుంచే అత్తాపూర్ సందడిగా మారిపోయింది.
ప్రతి వీధిలో డప్పులు.
ప్రతి కూడలిలో మైకులు.
గణపతి బొప్పా మోరియా నినాదాలతో నగరం ఒక్కసారిగా పండుగ దుస్తులు వేసుకుంది.
మా అపార్ట్‌మెంట్ పైకప్పు నుంచి చూస్తే దూరంగా హైవే మీద ట్రాక్టర్లు, లారీలు, చిన్న టెంపోలు వరుసగా కనిపిస్తున్నాయి.
ఆ ఉదయం చిన్నప్ప మోటారు వేయడానికి టెర్రస్ మీదికి వచ్చాడు.
“వెంకటేసు వాళ్ల విగ్రహం కూడా ఇవాళే వెళ్తుందా?” అడిగాను.
“అవును సార్,” అన్నాడు.
“లింగారెడ్డి గారి ట్రాక్టర్‌లోనే తీసుకెళ్తారట. రెండు విగ్రహాలూ ఒకేసారి నిమజ్జనం చేస్తామని మాటిచ్చారట.”
నేను తల ఊపాను.
కింద పందిరి దగ్గర కూలీలంతా కొత్త బట్టలు వేసుకుని తిరుగుతున్నారు.
పిల్లలు గులాల్ చల్లుకుంటున్నారు.
విగ్రహానికి వెంకటేసు పూలదండ వేస్తున్నాడు.
అతని ముఖంలో చిన్నపిల్లాడి ఆనందం.
⸻
మధ్యాహ్నం దాటేసరికి బ్యాండ్ మేళం వినిపించింది.
“వచ్చేశారు!” అని పిల్లలు అరుస్తూ రోడ్డు వైపు పరిగెత్తారు.
లింగారెడ్డి గల్లీలో ప్రతిష్ఠించిన భారీ గణపతి ట్రాక్టర్ మీద బయలుదేరింది.
డప్పులు.
డీజే పాటలు.
తీన్‌మార్.
జనం నృత్యాలు.
గల్లీ మొత్తం ఊగిపోతోంది.
నేను బాల్కనీలో నుంచి చూస్తున్నాను.
వెంకటేసు, చిన్నప్ప, మిగతా కూలీలు తమ చిన్న గణపతిని ఎత్తుకుని ట్రాక్టర్ వచ్చే దారి వైపు నిలబడ్డారు.
వాళ్ల కళ్లల్లో ఎదురు చూపు.
ట్రాక్టర్ దగ్గరపడుతోంది.
ఇంకా దగ్గరపడుతోంది.
వెంకటేసు చేతిని పైకెత్తి సంకేతం చేశాడు.
చిన్నప్ప ముందుకు వెళ్లాడు.
అంతలో…
ట్రాక్టర్ మా వీధిలోకి తిరగాల్సిన మలుపు దగ్గర ఒక్కసారి వేగం తగ్గించింది.
అందరూ ఊపిరి బిగపట్టారు.
తర్వాత…
ఒక్క క్షణం కూడా ఆగకుండా పక్క వీధిలోకి తిరిగిపోయింది.
⸻
మొదట ఎవరికీ ఏమీ అర్థం కాలేదు.
“అరే… ఇటు… ఇటు…”
ఎవరో అరుస్తున్నారు.
ముగ్గురు యువకులు రొప్పుకుంటూ ట్రాక్టర్ వెనక పరిగెత్తారు.
వెంకటేసు కూడా పరుగెత్తాడు.
చిన్నప్ప కూడా.
ట్రాఫిక్ మధ్యలో వాళ్ల అరుపులు వినిపిస్తున్నాయి.
“అన్నా… ఒక్క నిమిషం…”
“మా విగ్రహం…”
ట్రాక్టర్ ఆగలేదు.
రోడ్డు మీద కార్ల హారన్లు.
డప్పుల శబ్దం.
నినాదాలు.
ఆ అరుపులన్నింటినీ మింగేశాయి.
నేను పై నుంచి బైనాక్యులర్ తీసుకుని చూశాను.
మూసీ వంతెన దాటే ముందు లింగారెడ్డి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు.
చూసినట్టే కనిపించాడు.
కానీ ట్రాక్టర్ ఆగలేదు.
చూస్తుండగానే ఊరేగింపు వంతెన దాటి అవతలికి వెళ్లిపోయింది.
⸻
కొద్దిసేపటి తర్వాత వెంకటేసు, చిన్నప్ప తిరిగి నడుచుకుంటూ వచ్చారు.
పరిగెత్తిన వాళ్లంతా వచ్చారు. చెమటలు కక్కుతున్నారు. కొందరికి కళ్లనీళ్లు ..
కానీ వాళ్లతో పాటు రావాల్సిన ట్రాక్టర్ రాలేదు.
పందిరి ముందు మట్టి గణపతి అలాగే నిలబడి ఉన్నాడు.
పూలు వాడిపోవడం మొదలైంది.
పిల్లలు మౌనంగా తల్లుల వెనక నిలబడ్డారు.
ఎవరూ లింగారెడ్డిని తిట్టలేదు.
ఎవరూ గొడవపడలేదు.
“ఇప్పుడు ఏం చేద్దాం?” అని మాత్రమే ఒకరినొకరు చూసుకున్నారు.
వెంకటేసు నేలమీద కూర్చున్నాడు.
రెండు చేతులతో ముఖం రుద్దుకున్నాడు.
ఆయన ఏడవలేదు.
కానీ ఆ మౌనం…
ఏడుపు కంటే బరువుగా ఉంది.
⸻
సాయంత్రం నాలుగు గంటలయ్యేసరికి వాళ్లు లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టారు.
“చిన్న టెంపో దొరికితే సరిపోతుంది.”
“డ్రైవర్ ఎంత అడుగుతాడో?”
“మనందరం చందా వేస్తే కుదురుతుందేమో.”
వాళ్లు తమ సమస్యకు తామే పరిష్కారం వెతుకుతున్నారు.
ఎవరి మీదా కోపం లేదు.
ఎవరి మీదా నింద లేదు.
బాధ మాత్రమే ఉంది.
అది కూడా నిశ్శబ్దంగా.
—–
వారం తర్వాత అంటా సద్దుమణిగింది. మట్టివిగ్రహం ఏమయ్యిందో నేనూ పట్టించుకోలేదు. ఇంటెదురుగా కడుతున్న బిల్డింగ్ దగ్గర ఒకళిద్దరు కొత్త మొహాలు. పంచెలు కట్టుకుని నిలబడిఉన్నారు. చిన్నప్ప కనబడ్డాడు. ఎవరూ ఆ పల్లెటూరి బైతులు అని మూతి వంకరపెట్టి అడిగాను. వెంకటేశు వాళ్ళ నాన్న, బాబాయి అన్నాడు. వెంకటేశు వాళ్ళబ్బాయి స్కూలు ఫీజు తెచ్చారట ఊర్లో అప్పుజేసి అన్నాడు. నేను మౌనంగా ఉండిపోయాను. చదువుకుంటే మేమూ మీలాగా దర్జాగా బతికేవాళ్ళంకాదా అన్నట్లున్నాయి చిన్నప్ప చూపులు. ఏదో తెలియని భావన నన్నావహించింది.
తలగుడ్డ చుట్టుకుని నీరు కావి పంచెలతో నిలబడ్డ వాళ్ళని చూస్తుంటే పిల్లల్ని చదివించుకోడం కోసం తపన పడ్డ మాపూర్వీకుల్లా అనిపించారు.
*
చిత్రం: సృజన్ రాజ్








Add comment