నా స్వరాన్ని గుర్తు చేసుకో అదీ గుర్తుంటేనే….

కొన్ని గీతాలు గుండె మూలల్లో కనుమరుగైపోయిన దృశ్య మాలికలను కళ్ళ ముందర తెచ్చి నిలిపితే, ఇంకొన్ని పాటలు మాసిపోయిన జ్ఞాపకాలను తెరలు తెరలుగా తట్టి లేపుతాయి. మనసు కోరుకునే అలాంటి మధుర గీతాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే “ఛాయా గీత్”!    

ఛాయా గీత్- మండుటెండలో ఛత్రఛాయలా సేదదీర్చే గీతాలు, అమవస నిశిలో వెండి నీడలా వెన్నంటే ఆపాత మధురాలు. రాత్రి పదైతే చాలు మమతా సింగ్ స్వరంలో పలకరించిన “ఛాయా గీత్” రేడియో ప్రేమికులకు సుపరిచితమే! కానీ “ఛాయా గీత్” అంటే రేడియో కార్యక్రమమేనా? కాదు, అదొక symbolic expression, అంతే!

“ఛాయా గీత్” అంటే మనసును హత్తుకునే పాటలను మనస్ఫూర్తిగా మననం చేసుకోవడం, ఆ పాటల మాటున దాగున్న కవిత్వాన్ని కళ్ళ ముందు నిలుపుకోవడం. కొన్ని పాటల్లోని స్వరాలు హృదయాన్ని మీటితే, మరికొన్ని పాటల్లోని పదాలు మస్తిష్కాన్ని నేరుగా తాకుతాయి.

కొన్ని గీతాలు గుండె మూలల్లో కనుమరుగైపోయిన దృశ్య మాలికలను కళ్ళ ముందర తెచ్చి నిలిపితే, ఇంకొన్ని పాటలు మాసిపోయిన జ్ఞాపకాలను తెరలు తెరలుగా తట్టి లేపుతాయి. మనసు కోరుకునే అలాంటి మధుర గీతాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే “ఛాయా గీత్”!

* * *

గుల్జార్ పాట, తడి ఆరని తడిసిన జ్ఞాపకం, వాడిన పూల తాలూకు వాడని పరిమళం! గడిచిపోయిన క్షణాల గతించని సౌరభం. గుల్జార్ కవిత్వం, ఒక melancholy, ఒక nostalgia. ఆయన ప్రతి పదంలోనూ తాత్వికత, తాదాత్మ్యత! అందుకే గుల్జార్ పాట “ఛాయా గీత్”లో నా మొదటి ఎంపిక!

* * *

“నామ్ గుమ్ జాయేగా”

చిత్రం: కినారా

స్వర రచన: ఆర్డీ బర్మన్

గీత రచన: గుల్జార్

గాత్రం: లతా మంగేష్కర్, భూపిందర్ సింగ్

 

Yeh ladi hai lamhon ki, jhaalar bana li hai iski

Kabhi pehan leta hoon, kabhi utaar deta hoon

కొన్ని క్షణాల ధార ఇది, మాలగా మలిచి

ఒక్కోసారి ధరిస్తాను, ఒక్కోసారి తీసేస్తాను

 

Bas yahi pesh kar raha hoon

Naam pata nahin, rakha bhi nahin

ఆ మాలనే మీ ముందుకు తెస్తున్నాను

పేరు తెలియదు- అసలు పేరు పెట్టనేలేదు

Jaanta hoon

Waqt ki gard mein doob jayega, gum ho jayega

Jo yaad rahega sirf itna…

నాకు తెలుసు

ఏ వస్తువైనా, కాలపు ధూళిలో కలిసిపోతుంది, ఆనవాలు పోగొట్టుకుంటుంది

ఏదైనా గుర్తుంటే అది కేవలం…

కొన్ని స్మృతులు వరసగా గుండెను ముంచెత్తుతుంటాయి. వాటిని మాలగా మలిచి కొన్నిసార్లు ధరిస్తాను, కొన్నిసార్లు తీసేస్తాను అని గుల్జార్ ఈ పాట మొదట్లో చెబుతారు. ఈ మాటలను పాటకు “సాకి”గా భావించవచ్చు. ఉక్కిరిబిక్కిరి చేసే గురుతులను కొన్ని సందర్భాల్లో జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు, కొన్నిసార్లు పక్కనబెట్టేస్తుండొచ్చు. ఆ జ్ఞాపకాల ధారకు ఇదీ అని పేరు లేదు. భౌతిక రూపం కాలగర్భంలో కలిసిపోతుంది, ఆనవాలన్నదే మిగలదు. కానీ గుర్తుండిపోయేది మాత్రం ఒకటుంది. అదే…

Naam gum jayega

Chehra yeh badal jayega

Meri awaaz hi pehchaan hai

Gar yaad rahe

పేరు మాసిపోతుంది

ముఖం మారిపోతుంది

నా స్వరం మాత్రమే గుర్తుండిపోతుంది,

గుర్తుండే పక్షంలో!

మనిషి పేరు మరుగునపడిపోతుంది, రూపు మారిపోతుంది. గుర్తుండేది ఏదైనా ఉందీ అంటే అది అతని స్వరం మాత్రమే! ఇక్కడ స్వరం అంటే గొంతుక మాత్రమే కాదు మనిషి ఆలోచన, అస్తిత్వం! ఒక మనిషిని మనిషిగా నిలబెట్టేవి అతను గొంతెత్తిన, గొంతు విప్పిన సందర్భాలే కదా! ఆ సందర్భాలు తన కోసం కావచ్చు, తన తోటివారి కోసమూ కావచ్చు; అందుకు మాధ్యమం ప్రేమ కావచ్చు, కళ కావచ్చు. అంటే ఒక మనిషి భౌతిక రూపం మన మధ్య లేకపోయినా అతను సృష్టించి వెళ్ళిపోయిన కళలు, ఆలోచనలు ఎప్పటికీ బతికే ఉంటాయి (నిజంగా అవి గుర్తుపెట్టుకునేంత గొప్పవే అయితే).

Waqt ke sitam kam haseen nahin

Aaj hain yahan kal kahi nahin

Waqt se pare agar mil gaye kahin

Meri awaaz hi pehchaan hain

Gar yaad rahe

కాలపు క్రౌర్యం మహా అందమైనది

ఇవాళ ఇక్కడుంటాము రేపు ఎక్కడా ఉండకపోవచ్చు

కాలానికి అతీతంగా ఇంకెక్కడైనా కలిస్తే

అపుడు నా స్వరం మాత్రమే గుర్తుండిపోతుంది

గుర్తుండే పక్షంలో!

కాలం మహా క్రూరమైనది. కానీ దాని చేతలు క్రూరంగానే కాదు ఆకర్షణీయంగానూ ఉంటాయి. ఈరోజు ఇలా ఈ లోకంలో కలిసి ఉంటాము. రేపు అసలీ లోకంలోనే ఉండకపోవచ్చు. అంతా విధి మహిమే! ప్రేమ నిజమైనదే అయితే, జ్ఞాపకాలు నిజమైనవే అయితే, మన మధ్య ఆత్మిక బంధమే ఉంటే కాలానికి అతీతంగా ఇంకెక్కడైనా కలవొచ్చేమో! అప్పుడు నా స్వరాన్ని బట్టే నువ్వు నన్ను గుర్తుపట్టవచ్చేమో అని కవి ఆశపడతారు.

1977లో విడుదలైన “కినారా”, గుల్జార్ దర్శకత్వం వహించిన మాస్టర్ పీసెస్ లో ఒకటి. ఆర్తి (హేమ మాలిని) ఒక క్లాసికల్ డాన్సర్. ఆవిడ ప్రాణంగా ప్రేమించిన చందన్ (ధర్మేంద్ర) యాక్సిడెంట్ లో చనిపోతాడు. ఆయన్ను తలుచుకుంటూ ఈ పాట పాడుతుంది. చందన్ తో తనది ఆత్మిక బంధమని ఆవిడ నమ్మకం. కాలాన్ని దాటుకుని, మరేదైనా లోకంలో తాము ఎప్పటికైనా కలుస్తామని ఊహిస్తుంది. అలా కలిసినప్పుడు తన అస్తిత్వమే తన గుర్తింపు అవుతుందని నమ్ముతుంది.

Jo guzar gayi kal ki baat thi

Umr toh nahi, ek raat thi

Raat ka sira agar phir mile kahin

Meri awaaz hi pehchaan hai

Gar yaad rahe

గడిచిపోయిందేదో నిన్నటి సంగతి

బ్రతుకంతా కాదు, ఒక రాత్రి మాత్రమే

రాత్రి కొస మళ్ళీ ఎక్కడైనా దొరికితే

నా స్వరం మాత్రమే గుర్తుండిపోతుంది

గుర్తుండే పక్షంలో

జీవితంలో ఎన్నోఘటనలు, సంఘటనలు జరిగిపోతుంటాయి. అవి తిరిగిరావు. సుదీర్ఘమైన జీవనయానంలో ఆ ఊసులు ఒక రాత్రి పాటివి మాత్రమే. మరలిరాని ఆ సంగతులను తలచుకుంటూ జీవితాన్ని వృథా చేయడం సరి కాదు. కానీ ఎప్పుడైనా ఆ రాత్రి కొస, ఆ రాత్రి తాలూకు అనుభూతి మళ్ళీ ఎదురైతే అప్పుడు నా అస్తిత్వమే నాకు గుర్తింపుగా నిలుస్తుంది, అదీ గుర్తుండే వీలుంటేనే. ఇలా ప్రేమ, ఎడబాటు ఒలికే కవిత్వంలో తాత్వికతను కూడా గుప్పించగలగడం గుల్జార్ కే సాధ్యమేమో!

Din dhale jahan raat paas ho

Zindagi ki lau unchi kar chalo

Yaad aye gar kabhi ji udaas ho

Meri awaaz hi pehchaan hain

Gar yaad rahe

పొద్దు పొడిచే చోట, రాత్రి సమీపించే చోట

బతుకులో వెలుగును పెంచుకుంటూ పద

ఎప్పుడైనా నేను గుర్తొచ్చి మనసు దిగులుపడితే

నా స్వరాన్ని గుర్తు చేసుకో

అదీ గుర్తుంటేనే

పొద్దు పొడవడమంటే వెలుతురు ముగిసి చీకటి మొదలవ్వడం, జీవితం చరమాంకానికి చేరుకోవడం. ఆ దశలో వెలుగును, ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకుంటూ ముందుకు సాగాలని కవి సూచిస్తున్నారు. అలాంటి సమయంలో ఇష్టమైనవాళ్ళు గుర్తొచ్చి మనసు దిగాలు పడితే వాళ్ళ గొంతుకను, ఉనికిని గుర్తు చేసుకుని సాంత్వన పొందాలన్నది ఆయన ఉద్దేశం.

పైకి ఈ పాట, చనిపోయిన ప్రేమికుణ్ణి తలుచుకుని ఓ ప్రియురాలు బాధపడుతున్నట్లుగా కనపడినా లోతుకు వెళ్ళే కొద్దీ ఒక్కో పొరా తొలగిపోతూ జీవన సారం ఆవిష్కృతమవుతుంది. జీవితం ఒడిదుడుకులమయం. ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు. ఇవాళ మనతో ఉన్నవాళ్ళు రేపు ఉండరు. అలాంటివాళ్ళ ఆలోచన, అస్తిత్వాలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. గతంలోనే ఉండిపోతే భవిష్యత్తు శూన్యం. బతుకులో వెలుతురు, ఉత్తేజం తగ్గినప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్ళాలే తప్ప అక్కడే కూలిబడిపోకూడదు.

గుల్జార్ కవిత్వానికి విషయాన్ని సూటిగా చెప్పే అలవాటు లేదు. ఈ పాట కూడా ఆ శైలిలోనే సాగుతుంది. విషాదభరితమైన విరహ గీతంలా మొదలై చివరికొచ్చేసరికి తత్వాన్ని బోధపరుస్తుంది. చావు పుట్టుకలు, కలయికలు, విరహాలు జీవితంలో భాగమేనని, మనిషి రంగు, రూపు శాశ్వతం కాదని, అతని ఉనికిని నిలబెట్టడంలో భావనలు, భావజాలమే ముఖ్యమని చాటి చెబుతుంది.

*

శాంతి ఈశాన్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు. ఇవాళ మనతో ఉన్నవాళ్ళు రేపు ఉండరు. అలాంటివాళ్ళ ఆలోచన, అస్తిత్వాలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. గతంలోనే ఉండిపోతే భవిష్యత్తు శూన్యం. బతుకులో వెలుతురు, ఉత్తేజం తగ్గినప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్ళాలే తప్ప అక్కడే కూలిబడిపోకూడదు..”

    జీవిత సత్యాన్ని అద్భుతంగా చెప్పారు.

    ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.