నా వాళ్ల ఎముకలు ఉన్న చోటే నా ఇల్లు!

నులివెచ్చని ఎండ నా ఎదురుగా ఉన్న గుట్టకు వింత రంగులు పులుముతోంది. గుట్ట మీద సుపరిచితమైన దృశ్యం. కమానుతో కూడిన ద్వారబంధం. అందులోంచి లీలగా కనిపిస్తున్న ఒక స్మారక స్థూపం. పుస్తకాల్లో, సినిమాల్లో, ఆన్లైన్లో చూసిన దృశ్యం. ఇప్పుడు కళ్లముందు కనపడేసరికి వెన్నులో గగుర్పాటు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన సౌత్ డకోటా లోని  ‘వూండెడ్ నీ’ మెమోరియల్ అది. సరిగ్గా చెప్పాలంటే, లకోట (సూ) ఉప తెగల్లో ఒకటైన ఒగ్లాల లకోట తెగకు చెందిన పైన్ రిడ్జ్ రిజర్వేషన్ లో మారణకాండ జరిగిన చోటు.

గుట్ట ఎక్కేముందు ఒకసారి చుట్టూ చూశాను. కొంచెం దూరంగా ఒక చిన్న అరుగు చుట్టు నిలబడివున్న నలుగురు వ్యక్తులు నన్నే చూస్తున్నారు. వాళ్ళ చేతుల్లో రంగురంగుల పూసల నెక్లేసులు, ఇంకా ఏవో వస్తువులు అంత దూరం నుంచే కనిపిస్తున్నాయి.  హెలో అన్నట్లు చెయ్యి ఊపాను. వాళ్లూ చెయ్యి ఊపి వాళ్ల మాటల్లో పడ్డారు.

అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా ఆ చిన్ని గుట్ట ఎక్కడం మొదలు పెట్టాను. ఒక్కొక్క అడుగే ముందుకు పడుతూ ఉంటే స్మారక స్థూపం మెల్లగా దృష్టిపథంలోకి వస్తోంది. వేగంగా కొట్టుకుంటున్న నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. స్మారక స్థూపం చుట్టూ ద్వారబంధం తప్ప మిగతా అంతా ఇనుప ఊచలతో చేసిన కంచె. కంచెకు ఎప్పుడెప్పడి నుంచో  కట్టిన రంగు రంగుల రిబ్బన్లు, గుడ్డపేలికలు గాలికి ఎగురుతున్నాయి. ద్వారబంధంలోంచి లోపలికి వెళ్లబోయేంతలో గుట్టకు మరోవైపునుంచి కెవ్వు మని కేక వినిపించింది. అటువైపు పరిగెత్తాను. గుట్టకు దిగువన డొంకలో రెండు ట్రైలర్ ఇళ్లూ, వాటి మధ్య ఒక చెట్టూ. ఆ ఇళ్లవైపు వెళ్లాలా వద్దా అని అనుకుంటూ ఉండగానే ఆ చెట్టు దగ్గర్నుంచి పిల్లల కేరింతలు వినిపించాయి. కళ్లు చికిలించుకుని చూస్తే ఇద్దరు పిల్లలు – ఒకరు చెట్టు మీద, ఇంకొకరు చెట్టు కింద. ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ నవ్వుతూ ఉన్నారు. కాసేపు వాళ్లనే చూస్తూ గడ్డిలో కాసేపు కూర్చున్నాను. నెమ్మదించిన మనసుతో లేచి స్మారక స్థూపం దగ్గరికి వెళ్లాను.

ఎప్పుడో 1900ల్లో కట్టిన స్మారకం. దానిమీద చెక్కిన అక్షరాలు అల్లుకుపోయినట్లున్నా తేలికగానే  చదివగలిగాను:

“బిగ్ ఫుట్ సూ ఇండియన్ల గొప్ప నాయకుడు. “నా చివరిరోజు వరకూ శాంతి కోసమే నిలబడతాను” అని ఆయన ఎప్పుడూ అంటుండేవారు. ఆయన తెల్లవాడి కోసమూ, ఎర్రవాడి కోసమూ ఎన్నో మంచి పనులూ, సాహసకృత్యాలు చేశారు. ఏ తప్పూ తెలియని అమాయకులైన పిల్లలూ ఆడవాళ్ళూ ఎంతోమంది ఇక్కడ చనిపోయారు.”

ఆ స్మారకం మీద మరోవైపు అక్కడ చనిపోయిన కొంతమంది పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు చదవగలిగినంత చదివి, కాసేపు అక్కడే గడిపి గుట్ట దిగాను.

అరుగు దగ్గర మాట్లాడుకుంటున్న  వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ చేతుల్లో రంగు పూసలతోనూ, జంతువుల ఎముకలతోనూ చేసిన నెక్లేసులూ, డ్రీం క్యాచర్లూ, బ్రేస్లేట్లూ. “కొంటాను గానీ, నాకు ఒక కథ చెప్పండి” అని అన్నాను.” నావైపు వింతగా చూసి ముగ్గురు పక్కకు వెళ్లిపోయారు. ఒకతను మాత్రం తన సరంజామాను భుజానికి వేలాడుతున్న సంచీలో సర్దుకుని, అందులోనుంచే ఒక డబ్బా బయటకు తీసాడు. మంచి పొగాకు వాసన గుప్పుమన్నది.

సిగరెట్  చుట్టుకుంటూ, ‘ఏం కథ కావాలి మీకు?” అని అడిగాడు. ఆయన ముఖంలో నిరాసక్తత, గొంతులో అవహేళన కలగలసిన జీర. ఎందరెందరో వచ్చిపోయే చోటు ఎటువంటి మనుషూలనూ, మనస్తత్వాలనూ చూసి ఉంటాడో.

ఆ మధ్య ఒక స్నేహితురాలితో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. మామధ్య నేటివ్ అమెరికన్ల ప్రసక్తి వచ్చింది. కొన్ని రోజులక్రితమే జరిగిన సాహిత్య  సమావేశంలో మాట్లాడిన నేటివ్ అమెరికన్ కవుల గురించి చెప్పాను. “వాళ్లు ఎలా ఉంటారు? మన లాగనే డ్రెస్ చేసుకుంటారా లేక జంతుచర్మాలనే కట్టుకుంటారా? ఇంకా జంతువులను వేటాడుతుంటారా?” ఆమె అడిగిన ప్రశ్నకు ఎట్లా సమాధానం చెప్పాలో కాసేపు అర్థం కాలేదు. ఈ దేశాన్ని స్వంత దేశం చేసుకున్నవాళ్లం, ఈ గడ్డమీద పిల్లల్ని కన్నవాళ్లం. ఈ గడ్డ పూర్వీకుల గురించీ, మూలవాసుల గురించీ ఏమీ తెలీదు. ఆమె నన్ను అడిగిన ప్రశ్నే ఇక్కడికి పర్యాటకులుగా వచ్చేవాళ్ల ముఖాలో కనిపిస్తుందేమో ఆయనకు.

“నా ప్రశ్న మీకు వింతగా ఉండొచ్చు. నేను న్యూ జెర్సీ నుంచి వస్తున్నాను. కానీ పర్యాటకురాలిగా కాదు. మీ గురించి చెప్పండి. ఈ స్మారకం గురించి చెప్పండి. మధ్యలో సందేహాలేవైనా వస్తే అడుగుతాను. అంతకంటే ముందు మీరు చెప్పబోయేదానికి అడ్డురాకుండా ఇందాక లోపల పెట్టేశారే తెల్ల పూసలతో చేసిన నెక్లేస్ అది ఇవ్వండి. ”

ఆ నెక్లేస్ ను తీసి ప్లాస్టిక్ కవర్లో భద్రంగా పెట్టి ఇచ్చి “ఇరవై డాలర్లు. బేరం లేదు. కథకు డబ్బు ఇవ్వక్కర్లేదు.” చిర్వవ్వుతో అన్నాడు. నెక్లేస్ నా బ్యాగులో పెట్టుకుని డబ్బు ఇచ్చి, “నా పేరు మమత. మీ పేరు?” అడిగాను.

“నా పేరు విల్సన్. మాది ఒగ్లాల లకోట తెగ. న్యూ జెర్సీ నుంచి వస్తున్నారా? ఇదేనా చివరి స్టాప్? బ్యాడ్ ల్యాండ్స్ వెళ్లారా?”

“నార్త్ డకోటాలో పైప్ లైన్ కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ జరుగుతుంది కదా. ఆ ప్రొటెస్ట్ లో కొన్ని గంటలు పాల్గొని, రాత్రికి న్యూ జెర్సీకి తిరుగు ప్రయాణం. బ్యాడ్ ల్యాండ్స్ గుండానే డ్రైవ్ చేశాను కానీ ఆగలేదు. ఇక్కడ ఎక్కువసేపు ఉండాలని అనుకున్నాను.”

“ప్రొటెస్ట్ లో పాల్గొనడానికి అంత దూరం నుంచి వస్తున్నారంటే మీరు సీరియస్ మనిషే అని అర్థమవుతోంది.” సిగరెట్ ఓ రెండు దమ్ములు పీల్చుకుని పక్కన చెత్తబుట్టకు నులిమి బుట్టలో పడేశాడు. చెయ్యితో నలుదిక్కులా చూపించి అన్నాడు, “ఓ రెండు వందల ఏళ్ల క్రితం ఈ భూమి ఇలా లేదు. ఈ భూమి మీద పుట్టిన మనుషులూ ఇలా లేరు. ఈ భూమి మీద స్వేచ్చగా తిరిగిన వాళ్లం. ఇచ్చిపుచ్చుకోవడాలే గానీ అమ్మకాలు ఉండేవి కాదు. 1800ల్లో మొదలైన గోల్డ్ రష్ మా పొలిమేరల్లోకి రావడానికి మరో ఇరవై ఏళ్లు పట్టింది. ఆ ఇరవై ఏళ్లల్లో కూడా తూర్పు నుంచి పడమరకు చొచ్చుకొచ్చిన తెల్లవాడి దురాశ మాకు రోగాలను అంటగట్టడమే కాకుండా మేం వేటాడే జంతువుల సంఖ్య కూడా తగ్గించేసింది. మాకూ అమెరికన్ సైన్యానికీ యుద్ధాలు అప్పుడే మొదలయ్యాయి. ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకుంటూ, నయానో భయానో మా వాళ్లను వేర్వేరు ప్రాంతాలకు పరిమితం చేసేశారు. దేశమంతట వేల ఎకరాల్లో తిరుగాడిన తెగలన్నీ ఒక్కోక్కటిగా అమెరికా ప్రభుత్వం కేటాయించిన భూభాగాలకు పరిమితమై పోయాయి. మా లకోట తెగలో ఏడు ఉపతెగలు ఉన్నాయి. ఒక్కో ఉపతెగకు దూరం దూరంగా ఉన్న ప్రాంతాలను కేటాయించారు.“

“డివైడ్ ఆండ్ రూల్ సూత్రం అన్నమాట.”  విరక్తిగా నవ్వి అన్నాను.

“అవును! తెగలతో విడివిడి ఒప్పందాలూ, ఒప్పందాల మీద ఒప్పందాలూ కుదుర్చుకుంటూ ఒక్కొక్క ఒప్పందాన్ని తుంగలో తొక్కేస్తూ, తెగలకు కేటాయించిన భూములను మెల్లగా ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు.”

“ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు తెగల కదలికలు కొంత ప్రాంతానికే పరిమితమైతే వేట ఎలా సాధ్యమవుతుంది? లకోట తెగలకు వేటే  ప్రధాన జీవనోపాధి కదా?”

“వ్యవసాయం చేసుకోవడానికి గింజలూ, పనిముట్లూ ఇస్తామన్నారు. పంట చేతికి వచ్చేవరకు ఆహారధాన్యాలు సమకూరుస్తామన్నారు. అవేవీ సరిగ్గా జరగలేదు.  ఆహారం ఎవరికీ సరిపోని దుర్భర పరిస్థితి ఉండేది. అడపాదడపా యుద్ధాలు జరిగేవి. 1868 అమెరికన్ ప్రభుత్వానికీ, నేటివ్ అమెరికన్ తెగలకూ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. దాని ప్రకారం నేటివ్ అమెరికన్లకు కేటాయించిన భూభాగాన్ని తెల్లవాళ్లెవరూ ఆక్రమించుకోకూడదు, నివాసాలు ఏర్పరచుకోకూడదు. మా అనుమతి లేకుండా ఈ ప్రాంతంగుండా ప్రయాణించకూడదు. కానీ అది మూలన పడడానికి ఎంతో కాలం పట్టలేదు. తెల్లవాడు మాకు లెక్కపెట్టలేనన్ని ప్రతిజ్ఞలు చేశాడు. ‘మా భూమిని ఆక్రమించుకుంటానన్న ‘ ఒక్క ప్రతిజ్ఞ తప్ప మరిదేన్నీ నిలుపుకోలేదు అని మా తెగ నాయకుడు రెడ్ క్లౌడ్ అన్నాడు. మా నాయకులు కొంతమంది యుద్ధాల్లో చనిపోయారు. కొంతమంది మోసపూరితంగా హత్య చేయబడ్డారు.  నేటివ్ అమెరికన్ తెగలన్నింటినీ రూపుమాపేంతవరకు తెల్లవాడు ఊరుకోడని నిరాశలో కూరుకుపోయారు జనం.” ఈ ప్రాంతాల్లో సరైన జీవనోపాధి లేక, ఇక్కడినుంచి బయటపడే దారిలేక ఎన్ని కష్టాలు ఎదుర్కున్నాడో, ఆయనైతే నిర్లిప్తంగా చెప్పుకుపోతున్నాడు కానీ నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

“స్వేచ్చగా తిరగాడిన భూమి పోయీ, జీవనోపాధీ పోయీ, అవమానాలతో పేదరికంలో అలమటిస్తున్న జనం మధ్యకు ‘భూత నృత్యం’ (Ghost Dance) అనే మతాన్ని తీసుకొచ్చాడు వొవోక అనే మెడిసిన్ మ్యాన్. మెడిసిన్ మ్యాన్ అంటే మా మత గురువు. మూలికలతో, ప్రార్థనలతో  మానసిక, శారీరిక జబ్బులకు చికిత్స చేస్తారు. పాట పాడుతూ నృత్యం చేస్తూ ఉంటే కొన్నాళ్లకు మునపటి కాలం మళ్లీ వస్తుందనీ, తెల్లవాడితో జరిగిన యుద్ధాల్లో చనిపోయిన వీరులూ, తెల్లవాడు జరిపిన జనసంహారంలో చనిపోయిన పిల్లలూ, ముసలివాళ్లూ, ఆడవాళ్లూ బతికి వస్తారనీ ఆ మతం నమ్ముతుంది. వొవోక  చెప్పిన మాటలు దేశం నలుమూలల్లా వ్యాపించాయి. తెగలకు తెగలు భూత నృత్యం చెయ్యడం ప్రారంభించారు. అదంతా అమెరికన్ ప్రభుత్వాన్ని హడలెత్తించింది. అప్పటికి చెదురుమదురుగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. తెల్లవాడు భయపడుతూనే, మా నాయకులను ఒక్కొక్కరిని హతమారుస్తూ ఉన్నాడు.”

“క్రేజీ హార్స్, సిటింగ్ బుల్ నాయకత్వంలోని తెగలు ఇతర తెగలతో కలిసి లిటిల్ బిగ్ హార్న్ యుద్ధంలో కస్టర్ ను ఓడించారు కదా?”

“అవును. అమెరికా సైన్యానికి గర్వకారణమైన 7వ అశ్విక సైన్యానికి నాయకుడు జనరల్ ఆర్మ్ స్ట్రాంగ్ కస్టర్.  తాషుంక వీట్కో అంటే క్రేజీ హార్స్ మా ఓగ్లాల లకోట వీరుడూ, నాయకుడు. మనుషులూ, జంతువులూ తిరగాడే చోట్లను ఎవరూ అమ్మలేరు అని నమ్మినవాడు. ‘నీ భూమి ఎక్కడ’ అని ఎవరో అడిగితే

‘తొకేయ మిత ఒయాతే

లుహ యంత కిన్

హేన వాతి ఏలో’

అని చెప్పాడట. అంటే, నా వాళ్ల ఎముకలు ఎక్కడున్నాయే అదే నా భూమి, అదే నా ఇల్లు  అని అర్థం. తతంక ఇయోతక, అంటే సిటింగ్ బుల్ హుంక్పప లకోట తెగ నాయకుడు. తాషుంక వీట్కో కంటే బాగా పెద్దవాడు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నాడు.ఈ  ఇద్దరి నాయకత్వంలో, చెయాన్ తెగ ఇంకా కొన్ని తెగలతో కలిసి పకడ్బందీ వ్యూహం పన్ని కస్టర్ ను ఓడించారు. ఆ యుద్ధంలో కస్టర్ చనిపోయాడు. ఆ యుద్ధాన్ని కస్టర్ లాస్ట్ స్టాండ్ అని అంటారు గానీ అది మా వాళ్ల లాస్ట్ స్టాండ్. ఆ యుద్ధం తరువాత తాషుంక వీట్కో నూ  తతంక ఇయోతక నూ మోసపూరితంగా హత్య చేశారు. తాషుంక వీట్కోను ఆయన తల్లిదండ్రులు ఈ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారు. ఇక భూత నృత్యం చెయ్యడం తప్ప మరోదారి కనిపించలేదు మా వాళ్లకు.” గొంతు బొంగురుపోవడంతో  సంచీలోంచి నీళ్ల బాటిల్ తీసి నీళ్లు తాగి, ఒక చాక్లెట్ తీసి నాకు ఇవ్వబోయాడు. ఇబ్బందిగా చూసి వద్దన్నాను. “మంచిది. ఎవర్నీ నమ్మొద్దు. పేదరికం ఎన్నో చెడ్డపనులు చేయించగలదు. కానీ ఇది ఉత్తి చాక్లెటే” చాక్లెట్ లోపల పెట్టేస్తూ అన్నాడు.

“నృత్యం చెయ్యడం వల్ల ఏమొస్తుంది?” ఇది ప్రార్థనా, లేక ఆయుధాలు చేపట్టమని ఇచ్చే  పిలుపా అని నా సందేహం.

“పాట, నృత్యం అనేవి  దాదాపు తెగలన్నింటిలోనూ అతి ముఖ్యమైన సంప్రదాయం. ఉనికిని పోగొట్టుకుంటూ నిరాశలో పడిపోతున్న జనానికి ఆసరాగా ఈ భూత నృత్యాన్ని కనుక్కొన్నాడేమో వొవోక. ఏదైతేనేం తెల్లవాడికి భయమేసి ఎక్కడ నృత్యం జరుగుతుందో అక్కడికి సైన్యాన్ని పిలిపించుకున్నాడు. నిజానికి ఈ నృత్యం శాంతిని కోరుతుంది. హింసను ప్రేరేపించదు. పాట, నృత్యం అనేవే ఆ మతాన్ని చేపట్టిన వారి అయుధాలు. ‘మన ప్రాణాలు కాపాడమని మనం ప్రార్థిస్తుంటే మనం వాళ్ల ప్రాణల్ని అడుగుతున్నామని అనుకున్నాడు తెల్లవాడు’ అని మా నాయకుడు రెడ్ క్లౌడ్ ఆ ఉద్రిక్త వాతావరణం గురించి అన్నారు.”

“ఇంతకీ సిటింగ్ బుల్ నూ, క్రేజీ హార్స్ నూ చంపేసినప్పుడు లకోట ప్రజలు తిరగబడలేదా?” అంతటి గొప్ప నాయకులను హత్య చేస్తే తిరుగుబాటేవీ జరగకపోవడం నాకు నమ్మశక్యంగా అనిపించలేదు.

“దశాబ్దాలపాటు తెల్లవాడిని ఎదిరించిన జనం వాళ్లు. తుపాకులను విల్లులతో, మర ఫిరంగులను తుపాకులతో ఎదుర్కొన్నారు. పోరాడగలిగిన వీరుల రక్తంతో ఈ నేల తడిసిపోయింది. తెగలకు తెగలు రూపుమాసిపోవడం తప్ప వేరే దారిలేదు. ప్రజల్లో యుద్ధాలు చేసే సత్తువ లేకపోయింది గానీ, మీకు వచ్చిన ప్రశ్నే అమెరికన్ సైన్యానికీ వచ్చినట్లుంది. ఆ ప్రశ్నకు జవాబే మీరు ఇందాక చూసి వచ్చిన స్మారక స్థూపం.” ఆయన గొంతులో కోపం – ఏ దేశం నుంచో వచ్చి ఆయన కష్టపడి చేసిన నెక్లేసులు కొనగలుగుతూ పిచ్చి ప్రశ్నలు వేసి విసిగిస్తున్న నామీదా, తననూ తన వాళ్లనూ ఈ దుస్థితికి తీసుకువచ్చిన తెల్లవాడి మీదా?

కొంచెం దూరంగా నిలబడి ఉన్న ముగ్గురిలో ఒకరు లకోట భాషలో ఏదో అన్నాడు. “ఏం పర్వాలేదు”  అని జవాబిచ్చి, నా వైపు తిరిగాడు విల్సన్ . “తిరుగుబాటు జరుగుతుందని భయపడ్డారనే అనుకుందాం. ఈ ప్రాంతంలో భూత నృత్యం పెద్ద ఎత్తున జరగబోతున్నదని తెలిసి 500 మంది అమెరికన్ సైన్యం ఈ చుట్టుపక్కల తుపాకులతో మర ఫిరంగులతో మోహరించారు. మినికాంజౌ లకోట తెగ నాయకుడు స్పాటెడ్ ఎల్క్. ఆయనను బిగ్ ఫుట్ అని కూడా అంటారు. ఆయన కూడా ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నాడు. తన తెగ ప్రజలకు ఎంతో ఇష్టుడు. సిటింగ్ బుల్ తో మాట్లాడడానికి వచ్చిన ఆయనకు, సిటింగ్ బుల్ ను హత్య చేశారని తరువాత వంతు తనదే అనీ, తన తెగ ప్రజల్ని తీసుకుని వెళ్లిపొమ్మని హెచ్చరిక వచ్చింది. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన తన తెగ ప్రజలతో కలిసి రెడ్ క్లౌడ్ నాయకత్వంలో ఉన్న మా పైన్ రిడ్జ్ రిజర్వేషన్ కు బయల్దేరాడు. దార్లో వాళ్లను అడ్డగించిన ఏడవ అశ్విక దళం వాళ్లను ‘వూండెడ్ నీ’ ఏరు దగ్గర విడిదీ చెయ్యమని ఆదేశించారు.  మరుసటి రోజే విడిదీ అంతా వెతుకుతూ తుపాకులనూ, ఆయుధాలనూ అప్పగించాలని ఆదేశించారు. తుపాకులను కుప్ప బోస్తున్న సమయంలో ఒక చెవిటి యువకుడు తన తుపాకీని ఎంతో డబ్బుపోసి కొన్నాననీ, దాన్ని వెనక్కి ఇవ్వననీ  మొండికెత్తాడు. భాష రాక దానికి తోడు చెవిటి వాడవడం వల్ల తెల్లవాడి ఆదేశాలను అర్థం చేసుకోలేకపోయాడు.  తెల్ల సైనికులు అతని దగ్గర్నుంచి తుపాకీని పడలాక్కుంటూ ఉండగా ఆ తుపాకీ పేలి అయోమయం నెలకొన్నది. వెనువెంటనే తెల్ల సైనికులు కాల్పులు మొదలెట్టారు. పోగుపోసిన తుపాకీకుప్ప నుంచి తుపాకులను తీసుకోగలిగిన కొంతమంది యువకులు తెల్ల సైన్యాన్ని ఎదిరించారు. కానీ కొన్ని నిమిషాల్లోనే ఆ యువకులను హతమార్చింది తెల్ల సైన్యం. అక్కడి నుంచి పారిపోతున్న వాళ్లనూ, గుట్టల్లో, కనుమల్లో దాక్కున్న వాళ్లనూ చాలామందిని వేటాడి మరీ చంపేశారు.  తన గుడారంలో తీవ్రమైన జ్వరంతో పడుకుని ఉన్న బిగ్ ఫుట్ ను హతమార్చారు. కస్టర్ నూ, ఏడవ అశ్విక దళాన్నీ యుద్ధంలో ఓడించినందుకు ప్రతీకరం తీర్చుకుంటున్నట్లు ప్రవర్తించారు. అంతా ముగిసేసరికి దాదాపు 300మంది తెగ జనం, 25 మంది తెల్ల సైనికులూ చనిపోయారు. అదే చివరి ఇండియన్ యుద్ధం అని అంటారు గానీ, అది యుద్ధం కాదు మారణకాండ.”

ఆయన మాటలు ఆపి చేతులతో ముఖం తుడుచుకున్నాడు. నాకు కూడా కళ్లల్లో నీళ్లు తిరిగిపోయాయి.  “ఐ యాం సారీ.” అని మాత్రం అనగలిగాను.

విల్సన్ వెంటనే అన్నాడు, “ఇప్పుడు ఇక్కడ చాలా పేదరికం ఉంది. కానీ పోరాటం మాకు కొత్త కాదు. తెల్లవాడు కొత్తకొత్త పద్దతుల్లో మమ్మల్ని అణచాలని చూశారు. మేం అంతే కొత్త పద్దతుల్లో బతకడం నేర్చుకుంటున్నాం.  1973లో  అమెరికన్ ఇండియన్ మూవ్మెంట్ అనే నేటివ్ అమెరికన్ తెగల సమూహం 71 రోజులపాటు ఈ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని నేటివ్ అమెరికన్ల డిమాండ్లను అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది. కొన్ని డిమాండ్లను సాధించింది కూడా.  దేశ రాజధానిలోనూ , దేశంలో ఎన్నో చోట్లా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు వాళ్లు. అమెరికన్ ప్రభుత్వం అణిచేసిన మా భాషనూ, సంస్కృతీ సంప్రదాయాలనూ, ఆత్మ గౌరవాన్నీ మాకు గుర్తు చేసింది ఆ ఉద్యమం. ఇప్పుడు చూడు, ఈ దేశంలో పర్యావరణానికి సంబంధించిన ప్రతిఘటనలన్నింటికీ నేటివ్ అమెరికన్లే నాయకత్వం వహిస్తున్నారు. గ్యాస్ పైప్ లైన్లకు వ్యతిరేకంగా ప్రతిఘటనలు దేశమంతటా జరుగుతున్నాయి కానీ ఇప్పుడు నార్త్ డకోటా లో జరుగుతున్న ప్రతిఘటనకు ప్రపంచ తెగలెన్నో  మద్దతు ఇస్తున్నాయి. ఏమో,  ఈ ఉద్యమమే మా జీవితాల్ని కూడా మార్చేసే ఉద్యమమేమో. ఇందులో కొన్ని గంటలైన పాల్గొనబోతున్నందుకు మీకు ధన్యవాదాలు.”

నాకోసం అంత టైం ఇచ్చినందుకు విల్సన్ కు ధన్యవాదాలు తెలుపుకున్నాను. నార్త్ డకోట , స్టాండింగ్ రాక్ రిజర్వేషన్ లో జరుగుతున్న డకోట ఆక్సెస్ ఫైప్ లైన్  ప్రొటెస్ట్ క్యాంప్ వైపు కారు పోనిచ్చాను.

(Note1: డెసెంబరు 29, 2020 నాటికి ‘వూండేడ్ నీ’  మారణకాండ జరిగి 130 సంవత్సరాలు అవుతోంది.

Note 2: పై  సంభాషణ 2016 అక్టోబర్ లో జరిగింది. నార్త్ డకోటలో  ముడి చమురు పైప్ లైన్ కు వ్యతిరేకంగా పోరాటం ఇప్పటికీ నడుస్తోంది. ఆ ఉద్యమం గురించి ఇంకొంచెం తెలుసుకోవాలంటే ఈ లింక్ చూడండి: http://saarangabooks.com/retired/2016/12/01/ఈ-భూమి-అమ్మకానికి-లేదు/. పైప్ లైన్ ప్రారంభానికి అవసరమైన  అన్ని ప్రణాళికలూ పూర్తవకుండనే పని మొదలెట్టిన కంపెనీకి సుప్రీం కోర్టు  2020, జూన్ 6 న స్టే ఆర్డర్ ఇచ్చింది. అన్ని పనులు నిలిపివేయమనీ, పైప్ లైన్లనుంచి ముడిచమురును తీసెయ్యాలని ఆర్డర్ జారీ చేసింది. ఈ పోరాటానికి ఇప్పటికీ నేటివ్ అమెరికన్లే న్యాయకత్వం వహిస్తున్నారు.)

*

Avatar

మమత, కె

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హెచ్చార్కె ‘రస్తా’, శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’ చదివి ఎదిగిన మమత కొడిదెల ” రంగులు మాయని సీతాకోక చిలుక ” కవిత్వ సంపుటికి 2014 లో ఇస్మాయిల్ అవార్డు గ్రహీత. తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్మాయిల్ గారి సంస్మరణార్థం ఇచ్చే అవార్డు గ్రహీత.

    నెరూడ, బోర్హెస్, లోర్క, మయకొవెస్కి, పాస్టర్న్యాక్, విస్వావ షింబోర్స్క, పీటర్ ల ఫార్జ్ (‘The Ballad of Ira Hayes’ fame) , మహమౌద్ దర్విష్, మాయా ఆంజెలౌ, ల్యాంగ్స్టన్ హ్యూస్, ఖలిల్ జిబ్రన్ ల రచనలు ఇష్టం.

    ” హోకా హే ” శీర్షికన అమెరికాలోని ఉవ, లకోటా తదితర ఆదివాసి తెగలు తమ అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటాలు గురించి రాసారు. Lakota Sioux leader Crazy Horse famously exhorted his troops “Hoka hey, today is a good day to die!”

    విక్టర్ హార గురించి ఎంతో ఆర్తిగా రాస్తారు, “ఇప్పుడు అమెరికాలో వుంటున్నంత మాత్రాన జార్జి రెడ్డిపై ప్రేమను వదులుకోలేను” అంటారు.

    ‘రస్తా’ అంతర్జాల పక్ష పత్రికకు సంపాదక బాధ్యత వహిస్తున్నారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు