బాల యేసుని ఎత్తుకున్న మేరీమాత విగ్రహం ఎదుట మోకాళ్ళ ప్రార్థన చేస్తోంది దేవమాత.
“మా కోసం రక్తం చిందించి, సిలువను మోసిన ప్రభువా ఈ పాపిని క్షమించు. నీ రక్తంతో నా పాపాలను కడిగివేయి తండ్రీ…” అంటూ వణుకుతున్న చేతులతో కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రార్థిస్తున్న దేవమాత వంకే చూస్తున్నాడు రాజు. “ఇలా ఏడ్చేస్తుందేంటి!” అని మనసులో కంగారు పడిపోతున్నాడు. తను ప్రార్థన ముగించాక ఇద్దరూ చర్చి బయటికి వచ్చి విశాలమైన పచ్చటి మైదానంలో ఓ బల్ల మీద కూర్చున్నారు.
“లోపలేమిటి ఆ ఏడుపు? ఇన్నాళ్లూ నన్ను వేలంకన్ని మేరీమాత గుడికి తీసుకెళ్లు అని గోలగోల చేసింది ఇక్కడికొచ్చి ఇలా గుక్కపట్టి ఏడవడానికా?” అని నోటికి అడ్డంగా చేతిని పెట్టుకుని నవ్వుతున్నాడు రాజు.
“చాల్లే.. మూడేళ్ళుగా బతిమాలితే, ఇప్పటికి తీసుకుని వచ్చి మళ్లీ ఎటకారం కూడానా..పాపాత్ముడా!” అని రాజు నెత్తిమీద మొట్టికాయ వేసింది దేవమాత.
“వెటకారం కాదు. నీ ఏడుపు చూసి భయమేసిందే బాబూ!” అని తల కొట్టుకున్నాడు రాజు.
“ఎందుకు బయ్యం? అలా కన్నీళ్ల ప్రార్థన చేస్తే దేవుడు మన పాపాలని కడిగేస్తాడు తెలుసా!” గుండెల మీద చెయ్యేసుకుని చెప్పింది తను.
“హే ఆపు. అదేదో ఏడ్చే పిల్లలకి చాక్లెట్ ఇస్తాడన్నంత సులువుగా చెప్పేస్తున్నావేంటి?” అని నవ్వాడు రాజు.
“ఛీ! కళ్ళు పోతాయి” అని తను లెంపలేసుకుని రాజుకి కూడా లెంపలేసింది దేవమాత.
“ఎక్కడికీ పోవుగానీ, 21 ఏళ్ల అమాయకురాలివి నువ్వు. నిన్ను పాపి అంటే ఆ దేవుడే పెద్ద పాపి” అన్నాడు రాజు.
“ఇదిగో అప్పల్రాజూ! నీకు నమ్మకం లేకపోతే నోర్మూసుకో! అంతేగానీ దేవుడి మీద ఏలాకోలాలు ఆడమాకు” అంటూ సీరియస్ అయ్యింది దేవమాత.
“ఒసేయ్! నన్నలా పూర్తి పేరుతో పిలవొద్దని ఎన్నిసార్లు చెప్పాను?” అంటూ మొహం అటు తిప్పేసుకున్నాడు అప్పల్రాజు.
“కోపమొచ్చిందా….రాజూ…” అంటూ ముద్దుగా పిలుస్తూ అతని మొహం తన వైపు తిప్పబోయింది దేవమాత.
తన చేతిని విదిలించి తనే మొహం తిప్పి, వేళ్ళు లెక్కపెడుతూ “నీకిష్టమని మీ ఊరి దగ్గరి గౌరిపట్నం చర్చికి, అలానే విజయవాడ గుణదల మేరీమాత చర్చికి తీసుకుని వెళ్ళా. నీకోసమే కదా ఇప్పుడు ఈ నాగపట్నం కూడా తీసుకునొచ్చా” అన్నాడు రాజు.
“హ్మ్! ఈ గుడికి రావాలని ఎప్పట్నుంచో అనుకుంటే ఇప్పటికయ్యింది. నువ్వేమో ఇక్కడ దేవుడి మీద జోకులు వేస్తున్నావు. కోపం రాదా మరి? ఇదేం మాములు గుడి కాదు. చర్చీలు మన హైదరాబాద్లో లేకనా ఈ తమిళనాడు దాకా వచ్చింది? ఈ చర్చి వెనుక బోలెడు మహత్యాలున్నాయి. చెప్పనా?” రాజు బుగ్గని తడుతూ అడిగింది దేవమాత.
క్షణం క్రితమున్న కోపం మర్చిపోయి “హా..చెప్పు” అన్నాడు రాజు ఆసక్తిగా.
“వందల ఏళ్ల క్రితం ఇక్కడొక చిన్నపిల్లోడు పాలు పోయడానికి ఒక కుండ మోసుకుని ఎండలో వెళ్తూ మధ్యలో ఒక చెట్టు నీడన ఆగాడంట. అప్పుడు ఎవరో ఒకామె చంటి పిల్లోణ్ని ఎత్తుకుని వచ్చి ‘నా బాబుకి ఆకలేసి ఏడుస్తున్నాడు. కొంచెం పాలు ఇవ్వవా’ అని అడిగిందట. ఆ పిల్లోడు జాలిపడి తన కుండలోని సగం పాలు ఇచ్చేసి, మిగతా సగం పాలు పట్టుకుని అదే ఎండలో వెళ్లాడట. తమ ఇంటికి సగం పాలే తెచ్చేసరికి కోపం తెచ్చుకున్న ఆ ఇంటి యజమాని ఈ పిల్లోడిని కొట్టబోతే ఆ కుండ పాలతో నిండిపోయిందంట. ఇంకా కుండ పైనుంచి కూడా పొంగుతూ చల్లని తాజా పాలు కాలువలా పారుతూ పోయాయట. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఆ పిల్లోడ్ని పాలడిగింది మేరీమాత అని. అదిగో ఆ ప్రదేశంలోనే ఈ అద్భుతం జరిగింది. అందుకే అక్కడ ఆ చిన్న గుడి కట్టారు. దాన్ని పేరే మాతా కుళం” అంటూ ఉత్సాహంగా చెప్పుకుంటూ పోయింది దేవమాత.
“కథ బాగుంది” అంటూ నవ్వాడు రాజు.
రాజు మాటలో విరుపు అర్థమైన దేవమాత “కతో, నిజమో? బిడ్డకి పాలిచ్చి ఆకలి తీర్చలేని ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో కదా! ఆ బిడ్డ ఆకలి తీరిన ఈ ప్రదేశానికి కచ్చితంగా శక్తులుంటాయి. మనం ఏదైనా కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది” అంటూ కుడిచేతితో నుదురు, ఛాతీ, ఎడమ భుజం, కుడిభుజం తాకి “ఆమెన్” అనుకుంది దేవమాత.
“అవునా! ఇంతకీ నువ్వేం కోరుకున్నావ్?”
“ఆ..నీతో పెళ్లి అయిపోతే మళ్ళీ నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి గుండు కొట్టిస్తానని”.
“హే..జోకులాపి నిజం చెప్పు!”
“చాలా కోరుకున్నా. ఎండలో కష్టపడే ఈ మార్కెటింగ్ ఉజ్జోగం కాకుండా, నీ బీటెక్కి తగ్గ జాబ్ నీకు వెంటనే వచ్చేయాలని, నేను త్వరగా జీఎన్ఎం కూడా అవ్వగొట్టుకుని, ఇలా చిన్న హాస్పిటల్లో కాకుండా ఏ కేర్లోనో, ఏ మలక్పేట యశోదాలోనో హెడ్ నర్సుగా చేయాలని, మనం పెళ్లి చేసుకుని, ఓ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుని, తర్వాత మనకి ఒక పాపో, బాబో పుట్టి, ఆ బిడ్డని నా చేతులతో నేనే స్వయంగా పెంచి పెద్ద చేస్తూ…” అంటూ తన చేతులను చూసుకుంటూ ఉన్నట్టుండి ఆగిపోయి, ఆ చేతులతోనే కళ్ళు మూసేసుకుంది దేవమాత.
“మేరీమాత తథాస్తు అనుంటుందిలే” అని చేతులు తన మొహం మీద నుంచి తీసి కళ్ళలోకి చూశాడు రాజు.
దేవమాత అదోలా ఉండడం చూసి “ఏమైందే? నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయిలే! బెంగెట్టుకోకు” అంటూ దగ్గరికి తీసుకున్నాడు రాజు. కాస్త నవ్వుతూ నవ్వుతూ చప్పున రాజు బుగ్గ మీద ముద్దు పెట్టేసింది దేవమాత.
“ఒసేయ్..ఇది చర్చే!” అన్నాడు రాజు అటూఇటూ చూస్తూ.
“అయితే ఏం? చర్చిలో మొగుడికి ముద్దు పెట్టుకోకూడదా?” అని నవ్వేస్తూ మళ్లీ అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది.
“మొదట్లో నీ నోటి నుంచి మాట తెప్పించడానికే ఏడాది పట్టింది నాకు. అంత భయంభయంగా ఉండేదానివి. ఇప్పుడేమో ఇక్కడ అందరి ముందు ముద్దు పెట్టేస్తున్నావు..అమ్మోవ్!” అన్నాడు రాజు.
“నాకు అంత ధైర్యం ఇచ్చింది నువ్వే మరి!” అంటూ రాజు మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది దేవమాత.
“ఓ పని చేద్దాం. ఇక్కడే ఇల్లు తీసుకుని రేపే కాపురం పెట్టేద్దాం. ఏమంటావ్?” అంటూ కన్నుకొట్టాడు రాజు.
“అబ్బా ఛా! చాలానే ఉంది నీకు ఆశ. సర్లే గానీ, పదపదా షాపింగ్‌కు వెళ్దాం. మా అత్తయ్య పిల్లలకి బట్టలు కొనాలి” అంటూ అక్కడి నుంచి లేచింది దేవమాత.
***
“నేను బేరం ఆడుతున్నానుగా! నీకు అంత తొందరేమిటి? 1500కి ఇచ్చేసేవాడు ఆ చీర” అంటూ రుసరుసలాడింది దేవమాత. బట్టల షాపులతో నిండిపోయి బాగా రద్దీగా ఉన్న వీధిలోనుంచి నడుచుకుంటూ వస్తున్నారు రాజు, దేవమాత.
“ఆ నెమలి కంఠం రంగు చీర నాకు బాగా నచ్చేసింది. నీకు భలే ఉంటుంది. పోతే పోయినాయి పద్దెమినిదొందలు” అన్నాడు రాజు
“డబ్బులంటే లెక్కలేదు నీకు. ఒక్కొక్క రూపాయి..” అంటూ ఏదో అంటుండగానే “అబ్బా! సావదొబ్బకు. ఉపవాసం వల్ల నీకు ఆకలేస్తే బయట ఏదైనా తిను. అంతేగానీ, నా తల తినకు” అని నవ్వాడు రాజు.
“నిన్నూ..” అంటూ దేవమాత రాజు జుట్టు పట్టుకుని లాగుతుండగా “ఒసేయ్! వదులే..సరదాగా అన్నాను” అంటూ జుట్టు వదిలించుకున్నాడు.
దేవమాత మళ్ళీ శివంగిలా మీదకి వస్తుంటే “ఆగాగు. నీ ఫోన్ రింగవుతోంది. చూసుకో” అని అరిచాడు రాజు.
హ్యాండ్‌బ్యాగ్ నుంచి ఫోన్ బయటికి తీసి, కాల్ లిఫ్ట్ చేసి “హలో” అంది. అవతల మాటలు వింటూ వింటూనే చేతిలోని కవర్ వదిలేసింది దేవమాత. ఇంకో చేతిలో ఉన్న ఫోన్ కూడా జారవిడుస్తూ అలానే కళ్ళు తిరిగి పడిపోయింది.
రద్దీగా ఉన్న వీధి గనుక జనాలు వెంటనే మూగారు. దేవమాతని పైకి లేపి ఒక షాప్ పక్కన కూర్చోపెట్టడంలో ఒకరిద్దరు రాజుకి సహాయం చేశారు. ఎవరో రాజుకి షోడా తెచ్చి ఇచ్చారు. ఆ షోడాతో దేవమాత మొహాన్ని తడిపి, కొంచెం షోడాని తన గొంతులోకి ఒంపాడు. కాసేపటికి లేచి కూర్చుంది దేవమాత.
“ఏమైందే?” అని ఆందోళనగా అడిగాడు రాజు.
“రాజూ! మనం వెంటనే విజయవాడకి వెళ్లిపోవాలి. మా అత్తయ్యకి యాక్సిడెంట్ అయ్యిందట. వెంటనే వచ్చెయ్ అని మావయ్య ఫోన్ చేశాడు” అని ఏడవడం మొదలుపెట్టింది దేవమాత.
“అయ్యో అవునా! పద మనం వెంటనే విల్లుపురం వెళ్లిపోదాం. అక్కడి నుంచి డైరెక్ట్ విజయవాడకి వెళ్లే ట్రైన్ ఉంది. అది దొరక్కపోయినా ఎలాగోలా వెళ్లిపోదాం. నువ్ కంగారుపడకు” అంటూ ఆటో మాట్లాడి దేవమాతని ఎక్కించి, తనూ ఎక్కి కూర్చున్నాడు రాజు.
***
విల్లుపురంలో టీసీని బతిమాలుకుని ఎలాగోలా విజయవాడకి ట్రైన్లో ఒక బెర్త్ సంపాదించాడు రాజు. ట్రైన్ బయల్దేరినప్పటి నుంచి కళ్ళు మూసుకుని మనసులో యేసు ప్రభువుని ప్రార్థిస్తూనే ఉంది దేవమాత. తను కాస్త కుదుటపడిందని అనిపించాక “ఎలా జరిగిందట?” అని ఆందోళనగా అడిగాడు రాజు.
“మా అత్తయ్య వాళ్ళ చర్చి నుంచి ఊరికి షేర్ ఆటోలో వెళ్తుంటే లారీ అడ్డొచ్చి ఆటో పొలాల్లో తిరగబడిపోయిందట. ఆటోలో ఉన్న అందరికీ దెబ్బలు తగిలాయట. దేవుడి దయ వల్ల ఎవరికీ ఏ ప్రమాదం లేదని, అత్తయ్య, జోషూ ఇద్దరికీ చిన్న చిన్న దెబ్బలే తగిలాయని, ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నారని చెప్పాడు మావయ్య”.
“హమ్మయ్యా..” అని ఊపిరి పీల్చుకున్నాడు రాజు.
“రాజూ! నాకెందుకో మావయ్య నాకు అబద్ధం చెప్పాడేమో అనిపిస్తోంది. మాములుగా ఇలాంటి టైంలో భయపడతారని ఏమన్నా అయినా కూడా ఏం కాలేదని అబద్ధమే చెప్తారు కదా! ఒకసారి ఫోన్ ఇవ్వు” అని మళ్ళీ వాళ్ళ మావయ్యకి కాల్ చేసింది.
గొంతులోకి దృఢత్వం తెచ్చుకుని “మావయ్యా! నేను ధైర్యంగానే ఉన్నాను. అత్తయ్య ఎలా ఉందో నిజం చెప్పు” అని గట్టిగానే అడిగింది దేవమాత.
“ఏం కాలేదమ్మా! కావాలంటే మీ అత్తయ్యకి ఫోన్ ఇస్తాను, మాట్లాడు” అంటూ ఫోన్ పట్టుకుని వెళ్లి వాళ్ళ అత్తయ్యకి ఇచ్చాడు.
ఆవిడ ఫోన్లో “మాతా! నాకేం కాలేదే! చిన్న చిన్న దెబ్బలే తగిలాయి. నువ్వు కంగారుపడొద్దు. నేను బానే ఉన్నాను” అని చెప్పింది.
అత్తయ్య గొంతు వినపడేసరికి, తనకి ఏం కాలేదని అర్థమయ్యి మనసులో యేసు ప్రభువుకి ‘ప్రేజ్ ద లార్డ్’ చెప్పుకుని, “జోషూ ఎలా ఉన్నాడు?” అని అడిగింది.
“వాడు వేరే వార్డులో ఉన్నాడు. వాడికి కూడా చిన్న దెబ్బలే..మాతా…నిన్ను చూడాలని ఉందే..తొందరగా రావే..” అంటుండగానే, వాళ్ళ మావయ్య ఆమె దగ్గర్నుంచి ఫోన్ తీసుకుని “నువ్వు వచ్చేయ్ మాతా” అని ఫోన్ పెట్టేశాడు. కాసేపు మౌనంగా మనసులో దేవునికి మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుని తేలికపడింది దేవమాత.
రైలు చెంగల్పట్టులో ఆగినప్పుడు రాజు కిందకి దిగి ఒక కాఫీ, చిప్ ప్యాకెట్స్, జామకాయలు, వాటర్ బాటిల్ తీసుకొచ్చి దేవమాతకి ఇచ్చాడు.
తను కాఫీ తాగుతుండగా “మీ మావయ్య వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు?” అని అడిగాడు.
“విజయవాడలో బాడవపేటలో ఉంటారు. ఇంటి పక్కనే ఉన్న చర్చీలో మా మావయ్య పాస్టర్. మా నాన్న నా చిన్నప్పుడే మా ఊళ్ళో కల్తీసారా తాగి చనిపోయాడని చెప్పాను కదా! ఒక్కానొక్క అన్నయ్యకి ఒకే కూతురినని మా అత్తయ్య నన్ను బాగా చూసుకునేది” అని చెప్పింది. మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి వాళ్ళ మావయ్యకి కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు.
“అన్నిసార్లు చేయకు. హాస్పిటల్లో ఉన్నారు కదా, వాళ్ళ పనులు వాళ్ళను చేసుకోనివ్వు” అని రాజు అనడంతో “హ్మ్..” అని ఫోన్ పక్కన పెట్టేసింది.
“మీ అత్తయ్యకి ఎంతమంది పిల్లలు?” అని అడిగాడు.
“ఇద్దరు అమ్మాయిలు షారోను, సీయోను. ఒక బాబు జోసెఫ్. ఇంట్లో చిన్నోడు. వాడ్ని అందరూ ముద్దుగా ‘జోషూ…’ అంటారు. చిన్నపిల్లోడు రాజూ వాడు, ఇంజెక్షన్ అంటేనే భయం వాడికి. దెబ్బలు ఎంత నొప్పి పెడుతున్నాయో” అంటూ ఒక్కసారిగా బోరున ఏడ్చింది.
రాజు తనని కౌగిలించుకుని “ఏడవకే..ఏం కాలేదుగా! ఆ యేసు ప్రభువే రక్షించాడు మీ కుటుంబాన్ని” అంటూ తనని అలా పట్టుకునే ఉన్నాడు.
***
కాసేపు రాజు ఒడిలో అలానే ఉండిపోయిన దేవమాత, అతణ్ని చూస్తూ “రాజూ! నేనంటే నీకెందుకంత ప్రేమ?” అని అడిగింది.
“నిజం చెప్పనా? నాక్కూడా తెలీదు. నాకు తెలిసినప్పుడు నీకు చెప్తాలే” అని నవ్వాడు.
“నిజంగా నేనెంతో అదృష్టవంతురాలిని..” అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది.
“కాదు. నీలాంటి స్వచ్ఛమైన అమ్మాయి దొరికిన నేనే అదృష్టవంతుడ్ని” అన్నాడతను.
అది విని ఏదో గుర్తుకొచ్చినట్లుగా “రాజూ! నీ దగ్గర నేనొక విషయం దాచిపెట్టాను. ఎన్నోసార్లు చెప్పాలనుకుని కూడా భయపడి ఆగిపోయాను” అంది.
“ఏంటదీ? ఏదైనా పర్లేదు. చెప్పు” అన్నాడు రాజు తనని ఇంకా హత్తుకుంటూ.
“చెప్తే నువ్వెలా తీసుకుంటావో అర్థం కావడం లేదు రాజూ! నువ్ దూరం అయిపోతే నేను తట్టుకోలేను” అంటూ తటపటాయించింది దేవమాత.
ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని “నువ్వు నాతో ఏదైనా సరే చెప్పుకోగలిగేంత ప్రేమని ఇవ్వలేదా నేను? పర్లేదు. నా మీద నమ్మకం ఉంచి చెప్పు” అంటూ భరోసాగా ఆమె చేతిని అలానే గట్టిగా పట్టుకున్నాడు.
దేవమాత ఒక్క క్షణం ఊపిరి తీసుకొని “నా గురించి నీకు పూర్తిగా చెప్పాలి రాజూ! నేను పుట్టి, పెరిగింది ఏలూరు దగ్గర్లో దూబచర్ల అనే ఊళ్లో. నాన్న చనిపోయాక అమ్మ ఊర్లో తార్రోడ్డు వేయడానికి వచ్చిన జేసీబీ నడిపే హిందీ అతనితో వెళ్ళిపోయింది. ఇంట్లో నాన్నమ్మ, నేను ఉండేవాళ్ళం. నాన్నమ్మ రోజూ పనికి వెళ్లి నన్ను చూసుకునేది. మా అత్తయ్య వాళ్లేమో నల్లజర్లలో ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు వచ్చి మా మంచిచెడ్డ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్నది జరిగి ఏడేళ్ల పైనే అయ్యింది. అప్పుడు నేను గవర్మెంట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. అదేంటంటే….” అని చెప్తూ చెప్తూ ఏడేళ్లు వెనక్కి వెళ్లిపోయింది దేవమాత.
***
“మామ్మా…మామ్మా…కుంటాట ఆడుతూ ఆడుతూ దేవమాత పడిపోయింది” అని గావుకేకలు పెట్టింది పక్కింటి పిల్ల.
“యాంటే నువ్వనేదీ…” అంటూ ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి “అయ్యో..అయ్యో..మాతా..” అంటూ కింద పడున్న దేవమాతని మెల్లగా పైకి లేపి, ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి నీళ్లు పట్టించింది.
కొంతసేపటికి తెలివొచ్చిన దేవమాత “నాన్నమ్మా! కడుపులో నొప్పెత్తుందే” అని ఏడ్చింది.
దేవమాత మణికట్టు పట్టుకుని చూసిన ముసల్ది “ముట్టెప్పుడొచ్చిందే..?” అని అడిగింది.
“చాల్రోళ్ళు అయ్యింది” అని నీరసంగా చెప్పింది.
లాగిపట్టి చెంపమీద కొట్టింది ముసల్ది. దేవమాత నీళ్లు తాగుదామని పైకెత్తిన చెంబు ఎగిరి అంత దూరాన పడింది.
ముసల్ది కోపంగా లేచి “లంజికానా! ఎవడితో కడుపు తెచ్చుకున్నావే ముండా..” అంటూ తలుపు చాటు చీపిరి తిరగేసి దేవమాతని బాదేస్తోంది.
“ఏమంటున్నావే? నాకు తెలీట్లేదు..నీకు దణ్ణం పెడతాను కొట్టకే..” అని మంచం మీంచి పడిపోయి మెలికలు తిరిగిపోతోంది మాత.
“తప్పుడు ముండా! ఎవడా గొల్లిగాడు? చెప్తావా లేదా..” అంటూ చీపిరితో ఇంకా ఎడాపెడా బాదేస్తోంది ముసల్ది.
దెబ్బలకి కిందపడి దొర్లుతూ దణ్ణాలు పెట్టేస్తోంది దేవమాత.
“నేను మీ అత్తయ్యని తీసుకొచ్చేదాకా ఇంట్లోనించి కదిలావా…చీరేత్తాను” అంటూ చీపిరి పడేసి బయట గొళ్ళెం పెట్టేసి పరుగుపరుగున వెళ్ళిపోయింది ముసల్ది. కాసేపటికి ముసల్ది, దేవమాత వాళ్ళ అత్తయ్య, మావయ్య ఇంట్లోకి వచ్చి లోపలి గడియ పెట్టేశారు.
“నిజం చెప్పవే, నిన్నేమీ అనను నేను. ఎవరాడు? ఈ ఊరోడేనా” అని మాతని దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అడిగింది వాళ్ళ అత్తయ్య.
“నువ్ ఏం అంటున్నావో నాకేమీ అర్థం కావట్లేదత్తయ్యా..ఒట్టు” అని ఏడుపుని ఆపుకుంటూ అంది మాత.
“నువ్వు బైటికెళ్ళు” అని మొగుడ్ని బయటికి పంపించేసి “అది కాదే పిచ్చితల్లీ! నీ మీద పడుకుని ఇక్కడ ఇలా ఇలా చేసింది ఎవరు?” అని దేవమాత కింద తన చేత్తో ముందుకి వెనక్కి చేసి చూపిస్తూ అడిగింది వాళ్ళ అత్తయ్య.
“ఒహ్..అలాగా..అది..అది..అలా చేసింది మన జీడిమిల్లు పెదకాపుగారు” అని చెప్పింది దేవమాత.
***
రైల్లో ఒక్కసారిగా కుదుపు.
వింటున్నది కలా, నిజమా అనేంత అయోమయంలో పడిపోయిన రాజు “దేవమాతా! అసలేం మాట్లాడుతున్నావే నువ్వు?” అంటూ చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని ఆశ్చర్యంగా అడిగాడు.
“అవును రాజూ! నేనేమీ నువ్వనుకున్నట్లు స్వచ్ఛమైనదాన్ని కాదు. ముందు మొత్తం చెప్తా విను. ఆ రోజు ఆ పెదకాపుగారు నా మీద పడుకుని అలా చేసారు. అప్పుడు నా ఎనిమిదో క్లాసు పరీక్షలు అయిపోయాయి. వేసవి సెలవులిచ్చారు. మా మాలపల్లిలో సగం ఆడాళ్ళు పెదకాపుగారి జీడిమామిడి ఫ్యాక్టరీలోకి గింజలు కొట్టడానికి వెళ్తారు. సెలవులొస్తే స్కూల్ పిల్లలం కూడా అదే పనికి వెళ్తాం. పెద్దోళ్ళకి రోజుకి 200, పిల్లలకి 100 ఇస్తారు. ఆ వంద కోసం మా నాన్నమ్మ నన్ను పనికి రమ్మనేది. గింజల్ని కొడుతుంటే జీడిరసం చేతులకి అంటుకుపోయి చర్మం నల్లగా అయిపోయేదని ఆ పని నాకు నచ్చేది కాదు. కానీ ఎంతో కొంత డబ్బులొస్తాయి కదాని మా నాన్నమ్మ నన్ను తీసుకెళ్ళేది. అలా పనికి వెళ్ళినప్పుడే ఆ పెదకాపు…ఆ పెదకాపు..అలా..చేసాడు..” అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది దేవమాత.
“అసలు నీకు..” అంటూ రాజు ఏదో అడగబోతే “రాజూ ప్లీజ్! నేను చెప్పేది మొత్తం విను. విన్నాక నువ్ ఏమన్నా పడ్డానికి సిద్ధమే..” అంటూ మళ్ళీ కొనసాగించింది.
****
మాలపల్లికి పెద్ద దిక్కయిన సిద్ధయ్య తాతకి జరిగిందంతా చెప్పింది దేవమాత వాళ్ళ అత్తయ్య.
“ఊరంతా కంపు కంపు చేయకుండా గమ్మునుండండీ! ముందు మనోళ్లు ఎల్లి పెదకాపుగారితో మాట్టాడదాం” అని ఓ పదిమంది మాలపల్లి మనుషుల్ని తీసుకుని పెదకాపుగారి జీడి ఫ్యాక్టరీలో రహస్య పంచాయితీ పెట్టాడు సిద్ధయ్య తాత. కాపోళ్ళు కూడా ఓ 50 మంది మూగారు ఆ పంచాయతీలో.
“దొంగ గొల్లిగా! సిన్నపిల్లని కూడా చూడకుండా మీదడ్డావా..సచ్చినోడా! నీ నోట్లో మన్నుపడా..” ముగ్గురు మాలపల్లి ఆడోళ్లు ఆపుతున్నా ఆగకుండా నోటికొచ్చినట్లు తిడుతోంది దేవమాత వాళ్ళ నాన్నమ్మ.
“ఎవడైనా దాన్ని నోర్ముయ్యండ్రా” అని అరిచి “పాపా! అసలేం జరిగిందో అందరి ముందు చెప్పమ్మా” అని దేవమాతని అడిగాడు సిద్ధయ్య తాత.
దేవమాత చెప్పడం మొదలుపెట్టింది. “ఏసవి సెలవుల్లో జీడిగింజలు కొట్టడానికి ప్యాట్రీకి ఎల్లానండీ! మజ్జానం అన్నం తిన్న తర్వాత దొడ్డికొచ్చి ప్యాట్రీ ఎనక జీడిమామిడి తోటలోకి వెళ్తే, అక్కడ ఈ పెదకాపుగారు ప్యాసు పోసుకుంటూ కనపడ్డారండీ! నన్ను చూసి దగ్గరికి వచ్చి ‘ఓసారి గౌను విప్పవే’ అన్నారండీ. నేను ‘ఎందుకండీ..వద్దండీ’ అన్నానండీ. ‘ఒకసారి విప్పి మళ్ళీ ఏసేసుకో. నీకు 200 ఇస్తా’ అన్నారండీ. నేను ‘అలాగేనండీ’ అని గౌన్ తీసాను. కాసేపు చూసి ‘ఇక ఏసేసుకో’ అన్నారాయన. ఏసేసుకున్నా.
‘ఏమన్నా అయ్యిందా?’ అన్నారాయన.
‘లేదండీ’ అన్నాన్నేను.
‘నేను చెప్పానా, ఏం అవ్వదని? నువ్వే బెదిరిపోయావు. రేపు కూడా అన్నం తినేసాక ఇక్కడికే రా. ఎవ్వరికీ చెప్పకు. ఇదిగో ఈ డబ్బులు కూడా ఎవరికీ ఇవ్వకు. మీ యేసు పెబువు పండగ వత్తుంది కదా! అప్పటిదాకా దాచుకుని, ఆ పండక్కి బట్టలు కొనుక్కో. రేపు నీకు డొబ్బులతోపాటు పెద్ద పెద్ద చాకోలెట్లు కూడా ఇస్తాన్లే’ అని చెప్పి పంపించారండీ.
తర్వాతి రోజు ప్యాట్రీకి వచ్చాక నాకు చాకలెట్లు గుర్తుకొచ్చి మళ్ళీ అక్కడికే వెళ్ళానండీ. మళ్లీ అలానే చేయమంటే అలానే చేసానండీ! కాపుగారు రెండొందలునీ, పెద్ద చాకోలెట్ ఇచ్చి ‘రేపు కూడా రా’ అని చెప్పి పంపేశారు.
మళ్లీ రోజు ఎల్లానండీ. ‘ఏమే! ఈసారి నువ్వు గౌను ఏసుకునే ముందు నేను నిన్ను ముట్టుకుంటానంట, సరేనా? అప్పుడు నీకు రొండు చాక్లెట్లు పెద్ద పెద్దవి’ అన్నారండి ఆయన.
‘నాకు భయమేత్తుందండీ’ అన్నాను.
ఆయన దగ్గరికొచ్చి నా గౌన్ ఇప్పేసి, నా ఒళ్ళంతా చేతులేసారండీ! తర్వాత గౌన్ తొడిగేసి ‘ఏమైనా అయ్యిందా?’ అని అడిగారండి.
నేను ‘అబ్బే లేదండీ’ అన్నాను.
‘మరే, ఊరికే బెదిరిపోతావే. ఏం ఉండదు’ అని డొబ్బులు, చాకోలెట్ ఇచ్చారండీ.
తర్వాతి రోజు మటుకు నా మీద పడుకుని పైకి కిందకి చేసారండీ. అలా చేసి ఎప్పుడూ అడిగినట్లే ‘ఏమైనా అయ్యిందా?’ అని అడిగారండీ.
‘నొప్పొస్తుందండీ’ అని ఏడ్చానండీ నేను.
‘జీడిగింజలు కొట్టేటప్పుడు జిగురు అంటుకుంటుంది కదా, ఇదీ అలాంటిదే. డొబ్బులు కోసం గింజలు కొడతావు కదా నువ్వు. అలానే ఇదినీ. ఏడవకూడదు. ఈ రోజు ఒక్క రోజే..రేపటి నుంచి నొప్పి రాదు. నువ్ ఎవరికైనా చెపితే మాత్రం రాత్రుళ్ళు బాగా ఎక్కువ నొప్పి వచ్చేత్తాది. అందుకే చెప్పకు. ఇదిగో ఈ 300 తీసుకో’ అని ఇంకో వంద ఎక్కువ ఇచ్చారండీ.
అలా అలా సెలవులు అయ్యేదాకా రోజూ చేసేవారండీ. ముందు వచ్చిన నొప్పి తర్వాత వచ్చేది కాదండీ. ఆయన ఇచ్చిన డబ్బులు మా ఇంటి సూరులో దాచానండీ. కావాలంటే తెచ్చి ఇచ్చేత్తానండీ” అని మొత్తం జరిగిందంతా పంచాయతీలో చెప్పేసింది దేవమాత.
దేవమాత మాటలు వినగానే పంచాయితీలో ఉన్నట్టుండి పెద్ద అలజడి రేగింది.
“కూతంత లేదు, ఎవడితోనో ఏయించుకుని, డొబ్బులు కోసం ముసల్దిదానితో కలిసి పెదకాపుగారి మీదే నిందలు ఏస్తుంది” అని ఎవరో కాపుల మనిషి ఎగిరెగిరి పడుతున్నాడు.
“తేరగా వచ్చిందా మా మాలపల్లి పిల్ల మీకు?” అంటూ మాలపల్లి ఆడోళ్లు రోషంతో ఊగిపోతున్నారు.
వీళ్ళు వాళ్ళని తిడుతున్నారు. వాళ్ళు వీళ్ళని బెదిరిస్తున్నారు.
“ఆ పిల్ల అంత ఇవరంగా చెప్పాక కూడా బుకాయించడం దర్మం కాదు బాబూ! మీ కులపోడని మీరంతా ఆయన్ని వెనకేసుకొత్తూ పాపం తెలియని పసిపిల్ల ఉసురుపోసుకోవద్దు బాబూ..” అంటున్నాడు సిద్ధయ్య తాత.
“అదేం పసిపిల్లా? వయసు తక్కువే అయినా ఒళ్ళు కాలేజీ పిల్లలాగా బలిసిపోయి ఉంది. ఎమ్మిదో క్లాసులాగా ఉందా అసలు!” అన్నాడు వాళ్లలో ఎవడో వెనక నుంచి.
“ఒకసారి అయితే బలవంతం. రొండు నెలలు! రొండు నెలలంటే దానికి ఇట్టం ఉంటేనేగా ఎల్తాది” అన్నాడు మరొకడు.
“బాగా సుఖానికి మరిగిందిలే అది” అన్నాడు ఇంకో కాపాయన.
“దీనికి బాగా దూలెక్కువ”.
“బాగా అలవాటు పడింది”.
“ఊరికే ఎల్లిందా? డబ్బులు తీసుకుందిగా…”
ఇలా ఎవడి నోటికొచ్చింది వాడు వాగుతున్నాడు.
“ఆపండయ్యా! దీని కడుపు విలువ మూడొందలా? నాశనం అయిపోతారు” అని వాళ్ళ మాటలకి గోలగోలగా ఏడ్చేస్తున్నారు మాలపల్లి ఆడోళ్ళు. మగోళ్ళు మాత్రం ఏమీ అనకుండా చేతులు కట్టుకునే నిలబడ్డారు.
“మన పిల్లని అట్టుకుని ఈళ్ళు నానాకూతలు కూత్తుంటే అలా కొయ్యలా నిలబడ్డారు. రోసం లేదేంట్రా మీకు?” అని మాలపల్లి ఆడోళ్ళు మగోళ్ల చొక్కాలు పట్టుకుని గుంజేసరికి ధైర్యం చేసి “మేం పోలీసు కేసు పెడతామయ్యా” అని ఓ మాట అన్నారు.
“అవును! లోపల ఏయిత్తేగానీ మీరెంత ఎంత తప్పు సేసారో మీకు అర్తంగాదు” అన్నాడు సిద్ధయ్య తాత.
“ఏంట్రా బెదిరిస్తున్నారా? పెట్టుకోండి..పెట్టుకోండి. మమ్మల్ని కాదని ఈ ఊరిలో ఎలా బతుకుతారో మేమూ చూస్తాం” అని లేచి వెళ్లిపోబోయారు అవతలివాళ్ళు.
“అదేంటాయ్యా అట్టా అంటారు? తప్పు చేసి కూడా ఈ దుర్మార్గం ఏంటయ్యా? సరే, తేల్చుకుందాం కోర్టులోనే” అంటూ సిద్ధయ్య తాత కూడా లేవబోయాడు.
ఈలోపు పెదకాపు లేచి “చూడు సిద్ధయ్యా! సమస్య పెద్దది కాకుండా రాజీ చేసుకునేటట్టయితే రేపు ఈ టయ్యానికి మళ్ళీ రండి. కూర్చుని మాట్లాడుకుందాం. కాదు కూడదంటారా? ఏం చేత్తారో చేసుకోండి. నేను చేసేది నేనూ చేత్తాను. రండిరా” అంటూ తన బలగాన్ని తీసుకుని వెళ్లిపోయాడు పెదకాపు.
ఏం చేయాలా అంటూ ఆ రోజు రాత్రి మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు మాలపల్లిలో మగాళ్ళు. సిద్ధయ్య తాత దేవమాత వాళ్ళ మావయ్యని పిలిచి “చూడు పాస్టరూ! నువ్వు బైటూరోడివి. ఈ ఊరి సంగతి నీకు తెలీదు. ఇక్కడ ఈళ్ళతో మనం కోర్టులు, పోలీసు కేసులంటూ పోరాడలేం. ఇంకా రచ్చ చేత్తే ఈ పిల్ల బతుకు నాశినం అయ్యిపోద్ది. అవసరమా?” అన్నాడు.
“పోనీ ఏం చేద్దామంటారో మీరే చెప్పేయండి” అన్నాడు పాస్టర్.
“సాయంత్రం పెదకాపు ఆళ్ళ మనిషిని రాజీకి ఇంటికి పంపించాడు. కడుపు తీయించడానికి హాస్పిటల్ ఖర్చులు వాళ్ళే పెట్టుకుని, పిల్ల చదువుకి కొంత ముట్టజెపుతాం అంటున్నారు. గోల చేయకుండా ఆ పని చేయడం నయం” అన్నాడు తాత.
ఈ మాట విన్న దేవమాత వాళ్ళ అత్తయ్య “ఏమంటున్నావయ్యా? నీకు సిగ్గులేదా? మనోళ్ళని ఆళ్ళు తక్కువ సేయడం కాదు, మనల్ని మనమే తక్కువ సేసుకోవడం కాదా అలా సేత్తే! ఈళ్ళకి డొబ్బులు ఇత్తే సాలు ఎన్ని దొబ్బులు అయినా తింటారనే కదా ఆళ్ల ఉద్దేసం? నేను సచ్చినా దీనికి ఒప్పుకోను” అని తెగేసి చెప్పింది.
“నీకేమమ్మా! ఇయాల ఇక్కడున్నావ్, రేపు మీ ఊరికి దొబ్బేత్తావ్. ఆళ్ళు ఈ గొడవ మనసులో పెట్టుకుని ఇంకో సోట మనల్ని తొక్కుతారు. ఈరిగాడు గొడవలో మన పొలానికి వెళ్లే దారి ఆపేత్తే, సుట్టూ తిరిగి మరీ ఊరియా బత్తాలని మోసుకుని ఎల్లాల్సి వచ్చింది మర్శిపోయావా?” అన్నాడు సిద్ధయ్య తాత.
“పొలం గట్టు తగాదా, ఆడదాని బతుకు తగాదా..రెండూ ఒకటేనటయ్యా! ఇయాల దీనికి జరిగింది. ఇప్పుడు రాజీ పడిపోతే మన మాలపల్లిలో మరో పసిగొడ్డు మీద ఇరగబడి దెంగులాడతారు ఆ నా కొడుకులు. ఇంకోసారి ఆళ్ళకి మన ఆడోళ్ళ జోలికి రావాలంటే ఉచ్చడిపోవాలి” అంటూ రోషంగా జుట్టు ముడేసింది ఆవిడ.
“నువ్వు ఆగవమ్మా! రోషాలతో బతికే బతుకులు కావు మనయి. ఆళ్ళకి ఎదురెళ్తే సంపినా సంపి దెంగుతారు ఆళ్ళు. ఇదిగో పాస్టరూ! దేవమాత బతుకు అల్లరిపాలు కాకుండా రాజీ పడిపోవడమే నయం. మా అందరి మాట అదే! నీ పెళ్ళాన్ని నువ్వే ఒప్పిచ్చుకో” అంటూ లేచి వెళ్ళిపోయాడు సిద్ధయ్య తాత.
ఎవరెంత చెప్పినా ఆవిడ మాత్రం తగ్గట్లేదు. చేసేదేమీ లేక ఆవిణ్ని ఇంట్లో పెట్టి, గొళ్ళెం వేసి మర్నాడు మళ్ళీ అదే ఫ్యాక్టరీకి పంచాయితీకి రాజీకి వెళ్లారు మాలపల్లి మనుషులు.
ఫ్యాక్టరీ బయట గొల్లోళ్ళ సుబ్బడి పశువుల పాకలో సూడి గేదె అమ్మకానికి బేరం జరుగుతుంటే, ఫ్యాక్టరీ లోపల దేవమాత కడుపు తీయించడానికి ఎంత డబ్బులిచ్చి సెటిల్ చేయాలో అనేదానికి బేరం జరుగుతోంది.
రెండు గంటల పాటు జరిగిన బేరసారాల తర్వాత ఒక మొత్తానికి ఇరువర్గాలు ఒప్పుకున్నాయి. ఈలోపు పట్నం నుంచి డాక్టరమ్మని కడుపు తీయించడానికి పిలిపించాడు పెదకాపు.
ఆవిడొచ్చి దేవమాత ఇంటికెళ్లి పరీక్షలు చేసి, అక్కడి నుంచి పెదకాపుగారి కారులోనే ఫ్యాక్టరీకి వచ్చి “ఆ పిల్లకిప్పుడు ఏడో నెల. ఈ టైంలో అబార్షన్ చేయడం కుదరదు. చేస్తే తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలకీ ప్రమాదం. నేను అంత రిస్క్ తీసుకోను” అనేసి ఫీజు తీసుకుని వెళ్ళిపోయింది.
పంచాయితీలో మళ్ళీ గొడవ మొదలైంది.
“ఈ కులం తక్కువనాకొడుకులు మన దగ్గర డొబ్బులు దెంగడానికి ఆటలాడుతున్నారు. ఆ ముండకి ఎప్పుడో కడుపోస్తే ఇప్పటిదాకా దాచి, మన పీకల మీదకి తెచ్చి, ఇప్పుడు ఎగేసుకుంటూ బేరానికొచ్చారు. ఈళ్ళకి పైసా కూడా ఇవ్వొద్దు. ఏం పీకుతారో చూద్దాం” అంటూ పంచెలు ఎగేశారు కాపులు.
ఓ నలుగురు వస్తాదులు “మీరిక్కడి నుంచి దెంగేయండి ముందు” అంటూ కర్రలు తీసుకుని మాలలందర్నీ బయటికి తోసేశారు. అందరూ ఎవరి ఇళ్లకి వాళ్ళు వెళ్లిపోయారు.
దేవమాత నాన్నమ్మ ఫ్యాక్టరీ బయటే కూలబడి “అయ్యా! మీకు దణ్ణం పెడతాను. సత్యపెమానకంగా దీనికి కడుపని నాకే తెలీదయ్యా! దీని ఊసే లేకుండా నా పాటికి నేను కూలీపనికి పోయిన పాపిస్టిదాన్ని. దాన్ని ముట్టు గురించి కూడా గ్యానం చేయని లంజిని. మీరే చూడండయ్యా, ఇప్పుడు కూడా దాని పొట్ట పైకి కనపడ్డం లేదు. దానికి అన్నాయం చేత్తే అందరూ మట్టికొట్టుకుపోతారు” అంటూ కింద కాళ్లు చాపుకుని మట్టి ఎగదోస్తూ బూతులు తిడుతూ కాసేపు, బతిమాలుకుంటూ కాసేపు చీకటి పడేదాకా అక్కడే ఉండిపోయింది.
***
ఈ పరిస్థితుల్లో రాజీ కష్టమని తెలిసి ‘ఏదైతే అదయ్యింది..కేసే పెట్టేద్దాం’ అని పోలీస్‌స్టేషన్‌కి వెళ్లారు మాలపల్లి పెద్దలు. “అయ్యా! కేసు కట్టి మీరే మా బిడ్డకి న్యాయం జరిగేలా చూడాలి” అంటూ ఎస్సైకి మొరపెట్టుకున్నారు.
“మీరు చెప్పేది మీరు చెప్పాలి. కేసు కట్టాలో, వద్దో నేను డిసైడ్ చేస్తా. మీరు చెప్పగానే టక్కున చేసెయ్యడానికి లేదు. మాక్కొన్ని రూల్స్ ఉంటాయి. రేపు ఊర్లోకి వచ్చి విచారణ చేసి, మీరు చెప్పింది నిజమని అనిపిస్తే అప్పుడు కడతా కేసు. బయల్దేరండి..బయల్దేరండి..” అని చెవిలో వేలు పెట్టి తిప్పుకుంటూ మాలపల్లి మనుషుల్ని కసిరి పంపించేశాడు ఎస్సై. మౌనంగా స్టేషన్ నుంచి వెళ్లిపోయారు వాళ్ళు.
***
“తల్లీద్దెంగా! అంతకు తెగించారా ఆ లేబర్ నాయాళ్ళు? ఇక ఆళ్ళని ఉపేక్షించేదే లేదు. రాత్రికి రాత్రి మాలపల్లి మొత్తం తగలబెట్టి దెంగుతాను” అంటూ ఎస్సై ముందే ఊగిపోతున్నాడు పెదకాపు.
“పెదకాపుగారూ! విషయం నా దాకా వచ్చాక కేసు కట్టకుండా సరాసరి మీ ఇంటికే ఎందుకొచ్చాను చెప్పండి? విషయం మీకు అర్థం కావడంలే. ఇంతకుముందులా కాదు, చట్టాలన్నీ ఇప్పుడు వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి” అంటూ హెచ్చరించాడు ఎస్సై.
“అది కాదయ్యా, నా మీదే కేసు పెట్టేంత బలుపా ఆ ముండాకొడుకులకి?” అంటూ హుంకరించాడు పెదకాపు.
“మీరు చేసింది చిన్న పనా? ఓ మైనర్‌కి కడుపు చేశారు. పైగా ఎస్సీది. విషయం చేయి దాటిపోతుంది. ఆవేశం పనిజెయ్యదు ఇప్పుడు. ఇంకా నయం పేపరోళ్లదాకా పోలేదు. గుద్ద దేకించేత్తారు వాళ్ళకి తెలిస్తే, ఏమనుకుంటున్నారో! ఈ విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేయకుండా, ఇలా ఆవేశపడితే, దీన్నుంచి బయటపడటానికి మీ సగం ఆస్తులు అమ్ముకోవాలి. ఆలోచించుకోండి” అన్నాడు ఎస్సై.
“హ్మ్! మరి ఏం చేద్దామంటావో నువ్వే చెప్పు” అన్నాడు పెదకాపు నిదానించి.
“నేనున్నాగా, నేను డీల్ చేస్తా. ఆ మాలపల్లోళ్ళని ఎలా దారికి తేవాలో నాకు తెలుసు. ఈ మ్యాటర్ నేను చూస్కుంటా, మీరు కొంచెం నన్ను చూసుకోండి చాలు” అన్నాడు ఎస్సై.
“భలేటోడివేనయ్యా నువ్వు. నువ్ నా మనిషివి. నువ్వెళ్ళి వాళ్ళ సంగతి చూడు” అన్నాడు పెదకాపు.
కాఫీ కప్పు కింద పెట్టేసి ఎస్సై బయల్దేరేలోపే పెదకాపుగారి పాలేరు పరిగెత్తుకుంటూ వచ్చి “అయ్యా! ఆ దేవమాత పురుడోసేసుకుంది” అంటూ ఆయాసంతో చెప్పాడు.
“దీనమ్మ! మొన్నే కదరా ఆ డాక్టర్ ఏడో నెల అని చెప్పింది. అప్పుడే కనేసిందా?” అంటూ చిరాగ్గా మొహం పెట్టాడు పెదకాపు.
“అంటే నెల తక్కువ బిడ్డని కనేసిందన్నమాట. ఇప్పుడు మ్యాటర్ ఇంకా కాంప్లికేటెడ్ అయిపోయింది. లేట్ చేయకుండా వెంటనే నా పని మొదలుపెట్టకపోతే కష్టం” అనుకుంటూ తల పట్టుకున్నాడు ఎస్సై.
***
అంతా వింటున్న రాజుకి రైలు తిరగబడిపోయినట్లు అనిపిస్తోంది. భూమిలోకి రైలుతో సహా కూరుకుపోతున్నట్లు అనిపించింది. దేవమాత జీవితంలో ఇలాంటివి జరిగి ఉంటాయని కనీసం ఊహించలేదతను.
“అంటే…అంటే..పద్నాలుగేళ్లకే నువ్వు ఓ బిడ్డకి తల్లివయ్యావా? మరి ఆ బిడ్డ…?” అంటూ అయోమయంగా అడిగాడు.
దేవమాత చెప్పుకుపోతోంది.
***
రాక రాక ఇద్దరు కానిస్టేబుళ్లని ఏసుకుని ఎస్సై మాలపల్లికి రావడంతో కంగారు పడిపోయి, వీధిలోనే ప్లాస్టిక్ కుర్చీ వేసి ఎస్సైని కూర్చోబెట్టి బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు మాలపల్లోళ్లు.
“మీకు మాటిచ్చినట్లుగానే నేను విచారణ జరిపాను. మీరు చెప్పింది నిజమే! ఆ పెదకాపు తప్పుడు పని చేసాడు. కేసెట్టి లోపలికి తోస్తాను. సరేనా?” అన్నాడు ఎస్సై. ఎస్సై మాటలకి ఆనందపడిపోయారు ఆళ్లంతా.
“ఆ పని సేత్తే మీకు రుణపడిపోయి ఉంటాం సారూ” అంటూ దండాలు పేట్టేశాడు సిద్ధయ్య తాత.
“అయితే మీకీ విషయం చెప్పడం బాధగా ఉందయ్యా! ఆడ్ని అరెస్ట్ అయితే చేస్తాను గానీ, ఈ కేసు మటుకు కోర్టులో నిలబడదు” అని ముఖం దిగాలుగా పెట్టాడు ఎస్సై.
“ఎందుకు సారూ? ఏమైంది?” అడిగారు వాళ్ళు మూకుమ్మడిగా.
“ఆళ్ళిద్దరూ ఆ తుప్పల్లో ఉండగా ప్రత్యక్షంగా చూసినోళ్లు కనీసం ఒక్కరైనా ఉన్నారా?” అని అడిగాడు ఎస్సై.
“ఎవ్వరూ సూల్లేదయ్యా” అని చెప్పారు వాళ్ళు.
“అయిపోయింది. ఇక బలమైన సాక్ష్యం ఎక్కడుంది గనుక? ఆ పెదకాపు లక్షలు పోసి పెట్టుకునే ప్లీడరు ఇలానే వాదించి కేసు కోర్టుల్లో కొట్టించేత్తాడు” అంటూ నిట్టూర్చాడు ఎస్సై.
“మరెలా సారూ?” అంటూ జనాలు దిగాలుగా చూస్తుంటే, “నేను అరెస్ట్ చేసి లోపలెయ్యగలను గానీ, బయటికి రాకుండా చేయలేనయ్యా! అది నా చేతుల్లో లేదు. బయటికొచ్చి ఆళ్ళు మీ మీద ఎదురుదాడి చేసినా అదీ నా చేతుల్లో లేదు” అని అరచేతులు పైకెత్తి చూపించాడు ఎస్సై.
నిరుత్సాహ పడిపోయి “మీరే ఏదొక దారి చూపెట్టండయ్యా” అని అడిగారు వాళ్ళు.
“ఒక్కటే దారి. మళ్లీ ఆ పెదకాపుతో రాజీకొచ్చి, వెళ్లి ఆయన్ని బతిమాలుకోవడమే. మీరు సరే అంటే మీ తరపున ఆయన్ని రాజీకి నేను ఒప్పిస్తా” అన్నాడు ఎస్సై.
“మా ప్రాణాలు పోయినా రాజీకి ఒప్పుకోమయ్యా” అన్నాడు సిద్ధయ్య తాత.
“పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. ఆయన్ని లోపలేస్తే మీకేం వస్తాది బూడిద? ఇంతకుముందు ఒప్పుకున్నారుగా! దానికి రెట్టింపు డబ్బులు ఇప్పిస్తా, పుట్టిన బిడ్డకి బ్యాంకులో డబ్బులు వేయిస్తా. దేవమాత చదువుకుంటానికి కూడా డబ్బులిప్పిస్తా. ఇంకేం కావాలి? కాదూ కూడదంటే తల్లీపిల్లల భవిష్యత్తు నాశనం చేసినవాళ్ళవుతారు. ఆలోచించుకోండి” అన్నాడు ఎస్సై.
“అప్పుడేదో కడుపు తీయించేద్దామని రాజీకి ఒప్పుకున్నాం. బిడ్డ పుట్టేసాక ఇక మేము రాజీకి ఒప్పుకోము” అని మాలపల్లోళ్ళు అందరూ అంటుండగా “నేనొప్పుకుంటాను” అంటూ పైకి లేచింది దేవమాత వాళ్ళ అత్తయ్య. అందరూ బిత్తరపోయారు.
‘సచ్చినా రాజీపడొద్దు’ అంటూ గోలగోల చేసినావిడ ఉన్నట్టుండి ఇలా రాజీకి ఒప్పుకుందేమిటా అని అందరూ ఆశ్చర్యపోయారు.
“అసలేం మాట్లాడుతున్నావే?” అంటూ సిద్ధయ్య అరుస్తుండగా “నువ్వాగు తాతా! ఇది నా మేనకోడలి జీవితం. మీకనవసరం. నేను రాజీకి ఒప్పుకుంటున్నా ఎస్సైగారూ” అందావిడ.
“శభాష్! అదే మాట మీద ఉండు. నేను వెళ్లి పెదకాపుగారి కాళ్లావేళ్ళా పడయినా సరే రాజీకి ఒప్పిస్తా. మరి మీకోసం ఇంత కష్టపడినందుకు దేవమాతకి వచ్చే డబ్బుల్లో ఖర్చుల కోసం నేను కొంచెం తీసుకుంటాను. అంతే!” అంటూ కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయాడు ఎస్సై.
ఎస్సై వెళ్ళిపోయాక “నీకేమైనా పిచ్చి పట్టిందా?” అని పెళ్ళాన్ని పట్టుకుని అడిగాడు పాస్టరు.
“అలా అడుగు” అంటూ అక్కడున్న అందరూ కోప్పడిపోతున్నారు.
“నేను ఆలోచించే ఈ పని చేత్తున్నాను. మీకేం అనిపిత్తంది? ఈ ఎస్సైగాడు మనకు న్యాయం చేత్తాడనా? ఆ కాపోడి దగ్గర డబ్బులు దెంగి, బ్రోకర్ పని చేయడానికి వచ్చాడీ లంజాకొడుకు. అరెస్టు గాదు, కనీసం కేసు కూడా కట్టడు” అంటూ నానా తిట్లు తిట్టింది ఆవిడ.
“ఇప్పుడేం చేద్దాం మరి?” అన్నారు అక్కడున్నోళ్లు.
“ఏం చేత్తాం. మన బతుకులింతే! ఎప్పటికీ మారవు” అందావిడ.
“మరి దేవమాత ఎలాగా..?” అంటుండంగా, “ మేం అసలీ ఊళ్లోనే వుండం. ఈ ఊరికీ మాకూ సెల్లు. మా ఆయన విజయవాడలో చర్చి పెడదాం అని ఎప్పట్నుంచో అంటున్నాడు. నేనే ఒప్పుకోలేదు ఇన్నాళ్లు. ఇప్పుడు దేవమాతకి పుట్టిన బిడ్డని తీసుకుని విజయవాడ వెళ్ళిపోయి నేను నా సొంత కొడుకులా పెంచుకుంటా. పెపంచానికి వీడు నా కొడుకనే చెప్పుకుంటా. నాకెలాగూ ఇద్దరూ ఆడపిల్లలే కదా! దేవమాతని తాడేపల్లిగూడెంలో హాస్టల్లో వేసి సదివించుకుంటాను” అని తన నిర్ణయాన్ని గట్టిగా చెప్పి అక్కడితో ఈ గొడవలన్నింటికీ ముగింపు పలికేసింది దేవమాత వాళ్ళ అత్తయ్య.
***
“అంటే..జోషూ..?”
“అవును. జోషు నా కొడుకే రాజూ!” అంటూ అతని వైపు చూసి “ఒట్టేసి చెప్తున్నా రాజూ, నిన్ను మోసం చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఎప్పుడు చెబ్దామనుకున్నా నీ ప్రేమ నాకెక్కడ దూరం అయిపోతుందో అని భయపడి చెప్పలేదు. కానీ ఈ విషయం నీకు చెప్పిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా తప్ప ఇదంతా దాచిపెట్టి మాత్రం కాదు. నన్ను నమ్ము రాజూ!” అంటూ అతని చొక్కా పట్టుకుని బతిమాలింది దేవమాత.
రాజు ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు.
రాజు మౌనానికి బెంబేలెత్తిపోయిన దేవమాత “రాజూ..రాజూ! నువ్వు కూడా నన్ను తప్పుగా అనుకుంటున్నావా? నీ మీదొట్టు, నిజంగా అప్పుడు నాకేమీ తెలియదు. ఊర్లో వాళ్ళు అనుకున్నట్లు నేనేమీ అలవాటు పడలేదు. నాకసలు అప్పటికేమీ తెలియదు. నాకు కడుపని నాకే తెలియక స్కిప్పింగ్ కూడా ఆడుకునేదాన్ని. అయ్యో! నువ్వు కూడా నన్ను నమ్మకపోతే ఈ లోకంలో ఇంకెవరు నన్ను నమ్ముతారు? నేను తప్పు చేశా. నేను పాపాత్మురాలిని. నువ్వు చాలా మంచోడివి రాజూ! నీకు నాలాంటిది వద్దు. నన్ను వదిలేసేయ్. ట్రైన్ దిగేసి వెనక్కి వెళ్లిపో” అంటూ పిచ్చిపిచ్చిగా అరుస్తూ ఏడ్చేసింది.
అనుకోకుండా ఇవన్నీ తెలిసేసరికి అయోమయంలో ఉన్న రాజు తేరుకుని దేవమాత బాధ చూడలేక “ఒసేయ్ పిచ్చిదానా! నువ్వు పాపివా? నీ ప్రమేయం లేకుండా తల్లివి అయినందుకు నువ్వు పాపివయితే, నీ మేరీమాత కూడా పాపే అవుతుంది కదా! చెప్పు, మీ మేరీమాత కూడా పాపేనా?” అని దేవమాత భుజం పట్టుకుని కుదిపేస్తూ అడిగాడు.
“నిజంగానే నువ్వు నన్ను వదిలెయ్యవా? ఒట్టుగా…” అని ఏడుపు ఆపుకుంటూ అడిగింది దేవమాత.
“చూడు. ఇప్పుడే నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావంటే ఇక అప్పుడెంత అమాయకంగా ఉండుంటావో నేనూహించుకోగలను. నువ్ చేయని తప్పుకి నీకు దూరం అవుతానా చెప్పు? సరే, ఒకవేళ అప్పుడు తప్పే చేసావు అనుకుందాం కాసేపు. అయితే ఏంటి? అప్పటి నువ్వు ఇప్పటి నువ్వు ఒక్కటేనా? నేను ప్రేమించింది దేవమాతని. పూర్తి దేవమాతని. అందం, అమాయకత్వం మాత్రమే ఉండే సగం దేవమాతని కాదు. అందరిలాగే తప్పులు చేసే, బలహీనతలు ఉండే మిగతా సగం దేవమాతని కూడా ప్రేమించాను. నువ్వు నాదానివి. నువ్ ఏదైనా తప్పు చేస్తే నిన్ను కొట్టుకుంటా, తిట్టుకుంటా. అంతే తప్ప చచ్చేదాకా నిన్ను వదలను” అంటూ దేవమాతని కౌగిలించుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు రాజు.
రాజు ప్రేమకి దేవమాత గుండెలోని భారం కరిగిపోయింది. రాజు తనని ఎంత బాగా అర్థం చేసుకున్నాడో అనుకుంటూ అతణ్ని ఇంకా గట్టిగా హత్తుకుంది దేవమాత. అతని గుండెలపై తల వాల్చి పడుకుండిపోయింది కాసేపు.
రాజు ఆమె తన నిమురుతూ “విజయవాడ నుంచి మనం బయలేరేముందు మీ వాళ్ళకి నన్ను పరిచయం చేసేయ్. మనం పెళ్లి చేసేసుకుందాం. సరేనా?” అన్నాడు. మౌనంగా తలూపింది దేవమాత.
నచ్చినవాడికి అన్నీ చెప్పేసుకుని తన భారం దించేసుకున్న దేవమాత మనసులాగే శాంతంగా, నిదానంగా పట్టాల మీద కదులుతోంది రైలు.
***
విజయవాడ స్టేషన్లో రైలు ఆగింది. రైలు దిగి దేవమాత వాళ్ల మావయ్యకి ఫోన్ చేస్తే హాస్పిటల్లో డిశ్చార్జి చేశారని, నేరుగా ఇంటికి వచ్చెయ్యమని చెప్పాడు. బస్టాండ్ నుంచి బాడవపేటకి ఆటో మాట్లాడుకుని వెళ్తుంటే చిన్నగా వర్షం మొదలైంది.
ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టుండి “రాజూ! నీకోటి తెలుసా? మా జోషుని పుట్టినప్పుడు చూడటమే, ఆ తర్వాత ఇప్పటిదాకా నేను కళ్లారా చూడలేదు. ఇన్నాళ్ళకి చూడబోతున్నాను” అంది దేవమాత.
“అవునా..అదేంటీ?” ఆశ్చర్యపోతూ అడిగాడు రాజు.
“వాడు పుట్టగానే మా అత్తయ్య వాణ్ని తీసుకుని విజయవాడ వచ్చేసిందని చెప్పా కదా! నేనేమో గూడెంలోనే నర్సింగ్ కోర్స్ చేసి, అదయ్యాక హైదరాబాద్ ఆ హాస్పిటల్లో నర్సుగా జాయినయ్యాను. వాణ్ని మా అత్తే అమ్మలా పెంచింది”.
“అయితే? వాణ్ని ఇప్పటిదాకా నువ్వు చూడకపోవడం దేనికి?”
“ఆడ్ని సొంత కొడుకులా చూసుకుంటుంది. తను సొంత తల్లి కాదని జోషూకి తెలిసిపోతుందేమోనని నేనూ, జోషూ కలవడానికి ఒప్పుకునేది కాదు. వాణ్ని గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటుంది. నా వల్ల ఆడు తనకి ఎక్కడ దూరమవుతాడోనని భయం”.
“హ్మ్! పెంచిన ప్రేమ అంతే..! అయినా ఒక్కసారి కూడా నిన్ను చూడనివ్వకపోవడం దారుణం కాదా!”
“హ్మ్! ‘నువ్ పెళ్లి చేసుకోవాల్సినదానివి. జోషూకి నువ్వే తల్లివని తెలిస్తే మీ ఇద్దరి జీవితాలకీ నష్టమే’ అనేది మా అత్తయ్య. జరిగిందాన్ని ఒక పీడకలలా మర్చిపోమని చెప్పేది. ఎప్పుడైనా ఆవిడే వచ్చి నన్ను చూసి మాట్లాడి వెళ్ళేదే తప్ప, నన్ను ఎప్పుడూ తన ఇంటికి రానివ్వలేదు. దానికి ఇంకొక కారణం కూడా ఉంది” అంది దేవమాత.
“ఏమిటది?”
“జోషుగాడు అచ్చు నాలానే ఉంటాడు. చెవులు, ముక్కు మొత్తం నాలానే ఉంటాడు. ఆ పోలికల వల్ల వాడు నా కొడుకే అని అందరికీ తెలిసిపోతుందేమోనని మా అత్తయ్య భయం. అలా తెలిస్తే చర్చికి వచ్చిపోయే జనాలు నాకు, మా మావయ్యకి ఏదో ఉందని అనుమానపడతారని ఆమె భయపడిపోయేది” అని చెప్తూ ఫోన్లో జోషు ఫోటోలు రాజుకి చూపించింది.
“నిజమేనే! అచ్చు ప్రింటు తీసినట్లు నీలానే ఉన్నాడు”.
“హ్మ్! ఎప్పుడూ నన్నూ, జోషూని కలవనివ్వని అత్తయ్య ఇన్నాళ్ళకు రమ్మని పిలిచింది” అంటూ సంబరపడుతోంది దేవమాత.
“మొత్తానికి ఇన్నాళ్ళకి నీ కొడుకుని చూడబోతున్నవన్నమాట” అన్నాడు రాజు.
“హా! నేను తాకగానే, వాణ్ని ఎత్తుకోగానే నేనే అమ్మనని వాడు గుర్తుపట్టేస్తే బాగుండు. లేదా నేనేదో బూచినని అనుకుని ఏడ్చేస్తాడేమో నా బుజ్జికొండ. హాస్టల్లో ఉన్నప్పుడు ఆడి ఫొటో చూస్తూ జోల పాడ్డం నేర్చుకున్నా. ఇప్పుడు పెరుగన్నం తినిపించి, ఒళ్ళో పడుకోబెట్టుకుని జోల పాడతాను నా బంగారుకొండకి” అంటూ జోషూ ఫొటోకి ముద్దులు పెట్టింది దేవమాత.
“సర్లే! ఫొటోకి దేనికి? ఇంకాసేపట్లో డైరెక్ట్‌గానే పెడుదువుగానీలే బోలెడు ముద్దులు” అంటూ నవ్వుతూ ఫోన్ లాక్కోబోయాడు రాజు.
***
బాడవపేటలో ఆటో ఆగింది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఆటోవాడికి డబ్బులు ఇచ్చేశాక, చర్చి వెనుక గోడ పక్కనుంచి వాళ్ళ మావయ్య ఇంటివైపు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇద్దరూ. కొంచెం ముందుకి వెళ్ళగానే చర్చి ముందు టెంట్ ఉంది. చుట్టూ బోలెడు మంది మూగి ఉన్నారు. టెంట్లో పట్టక చాలామంది గొడుగులు వేసుకుని వానలోనే నిలబడిపోయి ఉన్నారు. వాళ్ళని తప్పించుకుని వీళ్లిద్దరూ కాస్త ముందుకి వెళ్లి చూస్తే…
తెల్లని బట్టల్లో చుట్టిన చిన్నపిల్లాడి దేహం శవపేటికలో కనిపించింది.
…
…
…
అది జోషు..!
దేవమాత అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఎవరో తనని లేపి సాయం పట్టి, పేటిక చుట్టూ చేరి ఏడుస్తున్న కొందరు ఆడోళ్ళ మధ్యనుంచి తీసుకెళ్లి వాళ్ళ అత్తయ్య పక్కన కూర్చోబెట్టారు. వాళ్ళ అత్తయ్య “కొడకా..కొడకా..” అంటూ ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. ఆవిణ్ని ఓదార్చడానికి చర్చి సంఘంలోని ఆడవాళ్లందరూ అపసోపాలు పడుతున్నారు. ఎవరో ఆమెకి నీళ్లు తాగిస్తున్నారు. మరింకెవరో ఆవిడ ముఖాన్ని తుండుగుడ్డతో తుడుస్తున్నారు. “దేవుడా! ఆడి బదులు యాక్సిడెంట్లో నన్ను తీసుకునిపోవచ్చు కదా!” అని గుండెల్ని బాదుకుంటోంది ఆవిడ.
కొందరు దేవమాతని ఎవరీమె అన్నట్లుగా చూస్తున్నారు.
దేవమాత ఏడవడం లేదు. బాబు వంక అలా చూస్తూనే ఉంది. వెనక నుంచి ఎవరో “స్పాట్లోనే పోయాడంట” అనడం దేవమాత చెవిన పడింది. తలెత్తి చుట్టూ పిచ్చిచూపులు చూస్తోంది.
దూరంగా జనాల మధ్యలో చేతులు నలుపుకుంటూ నిలబడ్డ రాజుకి దేవమాతని చూస్తే భయమేస్తోంది. కొడుకు శవాన్ని చూసి కనీసం గుండెలనిండా ఏడవలేని తన పరిస్థితిని తలుచుకుని, ఏమీ చేయలేక నిస్సహాయంగా అక్కడే నిల్చుండిపోయాడు రాజు.
దేవమాత పిల్లాడివైపే కన్నార్పకుండా అలానే చూస్తూ ఉంది. ఆ కాఫిన్లో పూల మధ్య జోషు నిద్రపోతున్నట్లే ఉన్నాడు. వాణ్ని అలా చూస్తుంటే దేవమాతకి కడుపులో పేగులు కదిలిపోతున్నాయి. గుండె ఆగి ఆగి కొట్టుకుంటోంది. గొంతు తడారిపోయి పదే పదే పెదాలను నాలుకతో తడుపుకుంటూ వెర్రిచూపులు చూస్తోంది. నోట మాట రావడం లేదు. కంట్లో నుంచి ఒక్క చుక్క కూడా కన్నీరు రావడం లేదు. రాజు చూపు దేవమాత మీదే ఉంది. ‘ఈ పిచ్చిది ఏమైపోతుందో’ అన్నట్లు తననే చూస్తున్నాడు.
బాబుకి చర్చిలోని తెల్లటి బట్టలు తొడిగి చేతిలో క్రాస్ పెట్టారు. ఒక పక్క చర్చి ఫాదర్లు కలిసి ప్రార్థన చేస్తున్నారు. అంతా అయ్యాక ఆ కాఫిన్‌ని ఆటో ఎక్కిస్తుండగా అందరి రోదనలు మిన్నంటిపోయాయి. అందరూ ఒకేసారి లేచి నిలబడ్డారు. అక్కడంతా అలజడి రేగింది.
అరక్షణంలో రాజుకి దేవమాత కనిపించకుండా పోయింది. ఆ జనాల్లో తనెక్కడుందో తెలియలేదు. కంగారుగా అటూఇటూ తిరుగుతూ తనని వెతుకుతున్నాడు. దూరంగా దేవమాత ఆటో ఎక్కుతూ కనిపించింది. జనాన్ని తప్పించుకుని అతను పరిగెత్తుకుంటూ వెళ్లేలోపు ఆటో వెళ్ళిపోయింది. తను ఎక్కడికి వెళ్తుందో ఊహించిన రాజు వెనకే మరో ఆటో కోసం వెతుకుతున్నాడు.
***
జోరున కురుస్తున్న వానలో గుణదల మేరీమాత గుడి ముందు ఆటో దిగింది దేవమాత. వేగంగా అన్నేసి మెట్లెక్కేస్తూ ఆ కొండ అంచున్న శిలువ వేయబడ్డ యేసుక్రీస్తు విగ్రహం దగ్గరికి చేరుకుంది.
అక్కడ మోకాళ్ళ మీద సాగిలబడి వర్షంలో తడిసి ముద్దైపోతూ, ఆ శిలువని అలానే కాసేపు చూసి చూసి ఉన్నట్లుండి గొంతు చినిగిపోయేలా “నా కొడుకూ…జోషూ…జోషూ నా బిడ్డ…నేను కన్న నా బిడ్డ…నా కొడుకు” అంటూ గుండెలవిసేలా రోదిస్తోంది దేవమాత.
“జోషూ! అరేయ్ జోషూ! నా బంగారూ! ఒక్కసారైనా నిన్ను నా ఈ చేతులతో ఎత్తుకున్నానా? ఒక్కసారైనా తృప్తిగా కడుపారా నీకు పాలివ్వని ఈ రొమ్ములెందుకురా? ఒక్కసారైనా నీ బుగ్గ మీద ముద్దు పెట్టానా? ఒక్కసారి కూడా జోలపాడలేదు, కథలు చెప్పలేదు, బుజ్జగించలేదు, నిద్రపుచ్చలేదు, అన్నం తినిపించలేదు. ఇంక నా బతుకెందుకురా? నీ నవ్వునైనా కళ్లారా చూసుకోలేకపోయాను కదరా! నిన్ను కన్న అమ్మని నేనొకదాన్ని ఉన్నానని కూడా తెలీకుండా ఎల్లిపోతావా? నన్ను చూడను కూడా చూడకుండా ఎల్లిపోతావా? నేను కోరకుండానే వచ్చి కోరకుండానే ఎల్లిపోతావా? నేనేం పాపం చేసాననిరా నాకీ బాధ? అవును! నేను పాపినే! నా పాపానికి తగ్గ శిక్ష వేసాడు ఆ దేవుడు. కాదు..కాదు..ఆ శిక్షేదో నాకే వేయకుండా నిన్ను తీసుకుని పోయి అన్యాయం చేసాడు దేవుడు. జోషూ! ఒక్కసారి వచ్చి ‘అమ్మా..’ అని పిలవరా! జోషూ..జోషూ..నా బంగారు తండ్రీ..జోషూ!” అంటూ కిందపడి దొర్లేస్తూ, జుట్టు పీకేసుకుంటూ గుండెలు బాదుకుంటోంది దేవమాత.
దేవమాత రోదన చూస్తూ సిలువ మీదున్న యేసు తలవంచుకున్నాడు.
దేవమాత గుండెలోని వేదనకు ఆ కొండలోని బండలు పగిలి ముక్కలైపోతున్నాయి.
దేవమాత కన్నీటికి జతగా ఆకాశం వర్షాన్ని మరింత జోరుగా కురిపించింది.
ఆ వానచినుకుల కన్నా దేవమాత కన్నీళ్లే గుణదల కొండను నిండుగా తడిపేస్తున్నాయి.
***








Very nicely written, with an ending that hits hard
కథ చాలా బాగుంది అజయ్. దేవమాత, రాజుల స్వచ్ఛమైన లవ్ స్టోరీ. తన గతాన్ని రాజుకి చెప్పి దేవమాత క్యారెక్టర్ హీరోయిక్ గా అనిపించింది. పల్లెల్లో ఇలాంటి దారుణాలు ఇంకా జరుగుతున్నాయి. తెలిసీ తెలియని వయసు ఆడపిల్లల్ని బడా బాబులు ఎలా ట్రాప్ చేస్తారో రియలిస్టిక్ గా చెప్పారు. యాక్సిడెంట్ లో కొడుకు జోషూ చనిపోయింది చదివాక చాలా బాధ అనిపించింది. ముగింపు హార్ట్ టచింగ్ గా ఉంది. తల్లినని చెప్పుకోలేని దైన్యం. మంచి కథ రాసిన అజయ్ కి అభినందనలు.
అద్భుతంగా రాశారు అజయ్… మాటలు రావట్లేదు.. raw and rustic… excellent narration…
అభినందనలు అజయ్ గారు…💐💐💐👏👏👏
బాగా రాశరన్నా… 💐💐💐
Good one Ajay Bro
కథ ముగిశాక కూడా దేవదూత శోకం నా గుండెల్లో కురుస్తూనే ఉంది అజయ్ గారూ.
Subject మీద study బాగా చేసినట్లు కనపడుతుంది.. వారు పాటించే కట్టుబాట్లు చాలా వివరంగా రాశాడు.. 👌
అద్భుతంగా రాశారు అండీ.. కళ్ళు చెమర్చాయి..
Brilliant story bro.. 👏