దుబాయ్ రిటర్న్

నాన్న అంటే అతనికి, రెండేళ్లకోసారి సూట్‌కేసులతో వచ్చి నెల రోజులు ఉండిపోయే ఒక చుట్టం మాత్రమే.

1

హైదరాబాద్ ఎయిర్పోర్ట్ .

ఉదయం ఎనిమిదిన్నరకు దుబాయ్ నుంచి వచ్చిన ఇండిగో ఫ్లయిట్లో, ముప్పై ఏళ్ల తన గల్ఫ్ జిందగీకి సలామ్ చెప్పి, రెండు అట్ట పెట్టెల లగేజీ, పది లక్షల ఫైనల్ సెటిల్మెంట్ తో పాటు లెక్కలేనన్ని కష్టాలు, కన్నీళ్లు, అనుభవాల బరువును మోస్తూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగాడు మల్లన్న.

ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ పూర్తయ్యాక, బయట వెయిటింగ్ ఏరియాలో ఆశగా తన కొడుకు కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పటికే ముప్పై నిముషాలు దాటింది.

ఖాళీ కడుపు గుడగుడ మంటోంది. రాత్రి ఫ్లైట్ లో ఇచ్చిన రెండు ముద్దల చికెన్ బిర్యానీ ఎప్పుడో అరిగిపోయింది. అప్పటినుంచి ఆకలితోనే ఉన్నాడు. తాను కూర్చొని ఉన్న ఏరియాలో కమ్మటి మసాలా దోసల వాసనతో దోశ కార్నర్ కనిపించింది. లేచి లగేజీ ట్రాలీ తోసుకుంట అటువైపు వెళ్ళాడు.

దోస 499 …ఆ రేట్లకు కళ్ళు బైర్లు కమ్మాయి. అంత ఖర్చు చేసి ఎయిర్పోర్ట్ లో కొని తినే ధైర్యం చేయలేకపోయాడు. అప్పుడే అతని ఫోన్ మోగింది.

“ డాడీ ! గ్రౌండ్ ఫ్లోర్ కి రా… సెక్యూరిటీ వాళ్ళు పైకి పంపుత లేదు. మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం”

అసలే ఆకలితో  నీరసంగా ఉన్న మల్లన్న, ఎలాగోలా లగేజీ ట్రాలీ తోసుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ చేరుకున్నాడు. వేప చెట్టు కింద కారు పార్క్ చేసి, బిట్టు తన ఇద్దరు దోస్తులతో కలిసి నిలబడి ఉన్నాడు.

మల్లన్న కార్ దగ్గరికి వెళ్లి “విల్లేందిరా?” అంటూ అడిగాడు.

“సోబత్ ఉంటారని తోలుకొచ్చినా” అన్నాడు బిట్టు. పది నిమిషాలలో కారు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కింది. కారు వంద స్పీడుతో దూసుకెళ్తుంటే, డీజే పాటలు మోగుతున్న్నాయి. మల్లన్న వెనక సీట్లో సర్దుకుని, కిటికీకి తల ఆనించి, బిట్టు, అతని దోస్తుల మాటలు వింటూ నిద్రలోకి జారుకున్నాడు. పదిహేను నిమిషాల తరువాత ఆకలి అతన్ని నిద్రలేపింది.

“ఒరేయ్ బిట్టు! మస్తు ఆకలవుతాంది. రాత్రి నుంచి ఏమి తినలేదు. కాస్త హోటల్ దగ్గర ఆపు” అని మల్లన్న బిట్టుని అడిగాడు.

“ఎయిర్పోర్ట్లో తినాల్సింది కదా ! డాడీ! సర్లే… ORR దిగగానే ఆపుతా” అన్నాడు బిట్టు.

ముప్పై నిముషాలు గడిచాయి. కారు ORR దిగింది. రోడ్డు పక్కన చిన్న చిన్న టిఫిన్ బండ్లు, హోటల్స్ కనిపిస్తున్నా కారు ఆగట్లేదు.

ఒక హోటల్ ముందు, మండుటెండలో ఒక యాభై ఏళ్ల మనిషి బ్లూ యూనిఫామ్,తలకు ఎదో  రాజకీయ పార్టీ టోపీ, చేతిలో కర్ర పట్టుకుని కార్లను ఆగమని సైగలు చేస్తూ  అడుగుతున్నాడు. చెమటలో తడిసిపోయి ఉన్నాడు.

“ఒరేయ్! ఈ హోటల్ దగ్గర ఆపురా!” అని మల్లన్న అడిగాడు.

“హే! ఇక్కడేం తింటాం డాడీ! కాస్త ముందుకు పొతే మంచి హోటల్ ఉంది అక్కడ తిందాం” అంటూ బిట్టు కారు ఆ మనిషిని దాటి పోనిచ్చాడు.

మరో పది నిమిషాల ప్రయాణం తర్వాత, కారు ఒక మూడంతస్తుల ‘డీలక్స్ హోటల్’ పార్కింగ్ లో ఆగింది. అక్కడ పార్క్ చేసిన పెద్ద పెద్ద కార్లను చూస్తేనే అది డబ్బున్నోళ్ళు తినే హైవే హోటలని మల్లన్నకు అర్థమైంది. బిట్టు దోస్తులు ఉన్నారని ఏమి అనలేక, మల్లన్న నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళాడు. మెనూ లో రేట్లు చూసిన మల్లన్నకు వెయ్యి వోల్ట్ల షాక్ తగిలినట్లు అయ్యింది. దుబాయ్‌లో రెండు దిర్హామ్ (నలభై రూపాయలు)తో నాష్టా ముగించే తనకు,  ఇక్కడ వందలు పెట్టి తినాలంటే మనసు ఒప్పుకోలేదు. చేసేదిలేక, అతి తక్కువ ధర ఉన్న ఒక ప్లేటు ఇడ్లీ ఆర్డర్ చెప్పాడు. పదిహేను నిమిషాల్లోనే టీ, టిఫిన్ ముగించారు. వెయిటర్ తెచ్చిన రెండువేల రూపాయల బిల్లు  చూసి మల్లన్న మనస్సు చివుక్కుమన్నది.

మరో మూడు గంటల ప్రయాణం తర్వాత కారు ఇల్లు చేరింది.

ఇంటి గేటు దగ్గర మల్లన్న భార్య లక్ష్మి ముదురు ఎరుపు రంగు బెనారస్ చీర కట్టుకుని నవ్వుతూ నిలబడింది. ఆ చీర జరీ అంచులు మండుటెండలో మెరిసిపోతున్నాయి.

హాల్లో అడుగు పెట్టగానే అంతా కొత్తగా, వింతగా అనిపించింది. ఇల్లంతా ఇంటీరియర్ మారిపోయి, కొత్త రంగుల వాసన వస్తోంది. గోడకు వేలాడుతున్న ఒక పెద్ద ఎల్ఈడీ టీవీ, ఇంతకుముందు తాను సెలవులకు వచ్చినప్పుడు లేనిది, ఒక నల్లటి రాక్షసుడిలా ఆ గోడనంతా ఆక్రమించేసింది.

“మీరు వస్తున్నారని ఇల్లంతా కొత్తగా ఇంటీరియర్ చేయించాను. ఈ 75 ఇంచుల టీవీ, ఈ లెదర్ సోఫా సెట్ అన్నీ కొత్తవే” అంటూ లక్ష్మి కూల్‌డ్రింక్ గ్లాస్ చేతికి ఇచ్చింది.

రోజులు గడిచిపోయాయి. మల్లన్న దుబాయ్ నుంచి వచ్చేసి అప్పుడే ఆరు నెలలు దాటింది.

ఈ ఆరు నెలల్లో ఊరి జనాలు అతడిని ‘దుబాయ్ మల్లన్న’ నుండి ‘దుబాయ్ రిటర్న్ మల్లన్న’ అని పిలవడం మొదలుపెట్టారు. ఊర్లో సెంటర్ దగ్గరికి పోతే చాలు.. “ఏం మల్లన్న, గట్టిగానే కూడబెట్టి వచ్చినావంట కదా.. కొడుకు ఇంజనీరింగ్ కూడా అయిపోయింది, ఇంకేం హాయిగా కాలి మీద కాలేసుకుని రెస్ట్ తీస్కో” అనేవాళ్లు.

మల్లన్నకు మాత్రం లోలోపల బెంగ మొదలైంది. బిట్టు ఇరవై ఏళ్ల జీవితంలో, తండ్రిగా తాను అతనితో గడిపిన సమయం చాలా తక్కువ. వాడు తల్లి దగ్గరే పెరిగాడు. నాన్న అంటే అతనికి, రెండేళ్లకోసారి సూట్‌కేసులతో వచ్చి నెల రోజులు ఉండిపోయే ఒక చుట్టం మాత్రమే. ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్నా, ఆ తండ్రీకొడుకుల మధ్య దూరం మాత్రం అలానే ఉంది .

కొడుకుతో సమయం గడుపుతున్నానని ఒక వైపు సంతోషంగా ఉన్నా, లక్షలు పెట్టి ఇంజనీరింగ్ చదివిన వాడు రూపాయి సంపాదన లేకుండా తిరుగుతుంటే అతని భవిష్యత్తు గురించి  భయం పట్టుకుంది.

“ఒరేయ్ బిట్టు.. ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదరా?” అని అడిగితే.. వాడు ఫోన్ లోంచి తల పైకెత్తకుండా, “జాబ్ ఏంది డాడీ చిల్లరగా.. చేస్తే పెద్ద బిజినెస్ చేయాలి, చూడు నువ్వే” అనేవాడు.

బిట్టు చెడు అలవాట్లు కూడా  ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సిగరెట్లు, మందు , స్నేహితులతో కలిసి చెప్పాపెట్టకుండా కారులో రెండు మూడు రోజులు మాయమవడం, అర్ధరాత్రి ఒంటిగంటకు ఇంటికి రావడం.

బిట్టు చెడు అలవాట్ల గురించి ప్రశ్నిస్తూ మల్లన్న ఒకరోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు గద్దించగా, లక్ష్మి వంటగదిలోంచి కసురుకుంది.

‘ఓహ్ అయ్యో ! ఏందీ తినేటప్పుడు గొడవ ! ఈ ఇరవై ఏళ్ళు ఎప్పుడూ అడగింది లేదు.. ఇప్పుడేంటి కొత్తగా?’ అంటూ తిరిగి తననే అన్నది. తనను ఆ ఇంట్లో ఇంకా మూడు నెలల అతిథిగా మాత్రమే చూస్తున్నారు అని అర్థం అయ్యింది.

కొద్దిరోజులుగా మల్లన్నకు ఒకే కల రోజూ వస్తోంది.

ఒక మనిషి మండుటెండలో భారీ సంచి భుజాన వేసుకుని నడుస్తూ వస్తున్నాడు. చెమటతో ఒళ్లంతా తడిసిపోయింది. దారిలో ఒక పచ్చని, పెద్ద వేప చెట్టు కనిపిస్తే ఊరటగా దాని నీడన కూర్చున్నాడు. కూర్చున్న మరుక్షణమే.. ఆ పచ్చని చెట్టు పెళపెళమంటూ శబ్దం చేస్తూ నేలకూలిపోయింది. క్షణాల్లో ఆకులు ఎండిపోయి, కేవలం ఒక మొద్దులా మిగిలింది.

ఈ కల రోజు వస్తోంది. కంగారుపడి భార్యకు చెప్తే.. “పొద్దస్తమానం ఇంట్లో ఖాళీగా నిద్ర పోతా ఉంటె , రాత్రి పిచ్చి కలలు రాక ఏమి వస్తాయి ” అని విసుక్కుంది.

3.

ఒకరోజు మధ్యాహ్నం బిట్టు ఇంటి ముందు తెల్లని ఫార్చునర్ కార్ ఆగింది. దానిలో నుంచి బిట్టుతో పాటు ,ఒక భారీ మనిషిని దిగాడు. తెల్లటి ఖద్దరు బట్టలు,మేడలో లావుపాటి గోల్డ్ చైన్ ,చేతికి బంగారు బ్రాస్‌లెట్. వేళ్ళ నిండా ఉంగరాలు  చూడటానికి రాజకీయ నాయకుడిలా ఉన్నాడు.

“డాడీ! ఈయన మనోహర్ అన్న.. మన లోకల్ ఎమ్మెల్యే గారి మనిషి ”  అంటూ గర్వంగా పరిచయం చేశాడు.

ఆ మనోహర్ ఇంట్లో ఉన్నంత సేపు లక్ష్మి, బిట్టు ఇద్దరూ చాలా పరిచయం ఉన్న మనుషుల్లా అతనితో ముచ్చటించారు. కొత్త పింగాణీ కప్పుల్లో టీ తాగుతూ, రియల్ ఎస్టేట్, కొత్త వెంచర్లు, పొలిటికల్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్ల గురించి మనోహర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. సోఫా మూలగా నిశ్శబ్దంగా కూర్చుని వింటున్న మల్లన్నకు ఆ మాటలు, ఆ కొత్త కప్పులో టీ లాగా రుచించలేదు.

మనోహర్ వెళ్ళిపోయాక ఇంట్లో చర్చ మొదలైంది. మనోహర్ కొత్తగా మొదలెట్టబోయే ప్రాజెక్టు లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని అంటున్నాడు బిట్టు.

“డాడీ! మనోహర్ అన్న చెప్పింది విన్నావుగా.. ఏమంటావ్?” బిట్టు అడిగాడు.

“ఏందిరా ఆ ఇన్వెస్ట్‌మెంట్ గొడవ? ఆయన అసలు ఏం ప్రాజెక్టో చెప్పలేదు కదా” మల్లన్న అనుమానంగా అన్నాడు.

“అయ్యో.. మీకు ఏమీ తెలియదు” లక్ష్మి మధ్యలో దూరింది.

“మనోహర్ అన్న చాలా పెద్దాయన. ఆయన పెట్టే ప్రాజెక్ట్‌లో మనం ఒక పది లక్షలు పెడితే, నెల నెలా ఇంటికి లక్ష రూపాయల వడ్డీ వస్తుంది..”  లక్ష్మి కళ్ళల్లో ఆ వడ్డీ డబ్బుల ఆశ కనుపడుతోంది. మాటల్లో కూడా వినబడుతోంది.

“అయినా మన దగ్గర ఇప్పుడు అంత డబ్బెక్కడిది” అంటూ మల్లన్న అడిగాడు.

“అదేంది డాడీ ! నీ ఫైనల్ సెటిల్మెంట్ డబ్బులు పది లక్షలు ఉన్నాయిగా అకౌంట్ లో”

మల్లన్న ఒళ్ళంతా జెర్రీ పాకినట్లు అయ్యింది.

“ముక్కు మొహం తెలియని ల్యాండ్ బిజినెస్‌లో అంత డబ్బు పెట్టడం రిస్క్ రా..” మల్లన్న వారించాడు.

“ముక్కు మొహం ఏంది డాడీ? ఆయన మాకు బాగా తెలుసు. మన ఎమ్మెల్యే మనిషి ” బిట్టు గొంతు పెరిగింది.

“నాకు ఇష్టం లేదురా ! ఆ డబ్బు నేను ఇవ్వలేను. అది నా ముప్పై ఏళ్ల కష్టం. నాకోసం నేను దాచుకుంది. ముప్పై ఏళ్లుగా మీకు ఇవ్వాల్సింది ఇస్తూనే వచ్చాను. ఇది మాత్రం ఇవ్వలేను”

ఆ రాత్రి ఇంట్లో యుద్ధం జరిగింది . డబ్బులు ఇవ్వాల్సిందే అని పట్టు పట్టాడు బిట్టు. లక్ష్మి కూడా బిట్టు వైపే మాట్లాడింది.

సంపాదించింది కొడుకుకి పెట్టకపోతే , మరెవరికి పెడతావ్ అంటూ బ్లాక్ మెయిల్ చేసింది. తిట్టింది. కోప్పడింది. బిట్టు ఒక మెట్టు పైకెక్కి బూతులు కూడా వాడాడు.

ఆ రాత్రి తరువాత అమ్మ-కొడుకులు ఇద్దరూ ఒక్కటయ్యి,  మల్లన్నను ఒక శత్రువులా చూస్తూ, సూటిపోటి మాటలతో ఇంట్లో ఊపిరి ఆడకుండా చేశారు.  బంధువులకు, తెలిసినవాళ్లకు మల్లన్న డబ్బులు ఇవ్వను అంటున్నాడన్న విషయాన్ని చెప్పి అతనిని బద్నాం చేసారు.

ఊర్లో పెద్ద మనుషులతో పంచాయితీ కూడా పెట్టేంత దూరం వెళ్లారు . మల్లన్న బయటకు వెళితే అందరు అదే మాట అడుగుతూ, హేళనగా మాట్లాడుతున్నారు. తమ ఇంటి విషయం బజారు పాలయిందని మల్లన్నకు బాధగా ఉంది.

చివరకు వాళ్ల పంతమే నెగ్గింది.నెల రోజుల మానసిక హింస తరువాత, మల్లన్నకు ఇష్టం లేకపోయినా, తన ముప్పై ఏళ్ల ప్రవాస బతుకు మెతుకులు పది లక్షల రూపాయలను బిట్టు చేతిలో పెట్టాడు. ఆ రోజు మల్లన్నకు నిద్ర పట్టలేదు. గుండెల్లో ఏదో హౌలు హౌలుగా అనిపించింది.

మొదటి ఆరు నెలలు చెప్పినట్టే వడ్డీ డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులతో బిట్టు ఒక పెద్ద సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. తెల్ల చొక్కా వేసుకుని ఊర్లో తిరగడం మొదలుపెట్టాడు. ఊర్లో కుర్రాళ్ళు  “బిట్టు గాడికి ఎమ్మెల్యే మనుషులతో లింకులు ఉన్నాయి” అని అతని వెనక తిరగడం మొదలుపెట్టారు. బిట్టు ఊర్లో చిన్నపాటి లీడర్ లా మారిపోయాడు, చిన్న చితక పంచాయితీలు చేయడం మొదలుపెట్టాడు. మనోహర్ అప్పుడప్పుడు తన ఫార్చునర్ కారులో వచ్చి బిట్టుని కలిసి వెళ్తుండేవాడు.

“లక్ష్మి.. వీడేంది! ఇలా తిరుగుతున్నాడు? చదువుకున్న చదువు వదిలేసి ఈ లీడర్గిరి ఏంది?” మల్లన్న భార్యతో వాపోయేవాడు.

“నా కొడుకు లీడర్ అవుతుంటే నీకు కుళ్లుగా ఉందా? నీలాగా  వాణ్ణి కూడా దేశం వదిలి ఎడారి పని చేయమంటావా ?” అంటూ లక్ష్మి కసురుకుంది.

మల్లన్నకు ఆ ఇంట్లో వస్తున్న కొత్త డబ్బు, కొత్త రోడ్డు వేసేటప్పుడు వచ్చే తారు డాంబరు వాసనలా విరక్తి కలిగించింది. ఊర్లోకి వెళ్తే తోటి దోస్తులు

“మల్లన్న నీకేంది తీయి నీకొడుకు లీడరయ్యే .. దావత్ ఇవ్వు” అని పీడిస్తుంటే, మల్లన్న ఇంట్లోంచి బయటకు వెళ్లడం మానేశాడు. లక్ష్మి కూడా కిట్టీ పార్టీలు, షాపింగులతో బిజీ అయిపోయింది.

ఒకరోజు ఉదయం బిట్టు ఫోన్‌లో మనోహర్ తో మాట్లాడుతున్నాడు.

“అరె ! పర్లేదు మనోహర్  అన్నా ! పర్లేదు…టెన్షన్ ఏమి లేదు!”

“ఏమయిందిరా?” వంటగది లోంచి లక్ష్మి అడిగింది.

“ఎం లేదమ్మా ! ఈ నెల వడ్డీ కాస్త లేట్ అవుతుంది అంట … మనోహర్ అన్న వేరే ప్రాజెక్ట్ అడ్వాన్స్ ఇవ్వాలి అంట “ అంటూ బిట్టు చెప్పాడు.

మల్లన్న మనస్సు మళ్ళీ కీడు శంకించింది. ఏదైనా అంటే అనవసరంగా తిట్లు తినాలని నోరు మెదపకుండా ఉన్నాడు.

ఆలా వరుసగా మూడు నెలల పాటు వడ్డీ డబ్బులు రాలేదు.ఎప్పుడు ఫోన్ చేసిన ఎదో ఒక కారణం చెప్పి తప్పిస్తున్నాడు మనోహర్.  చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి,  ఇంట్లో ఇబ్బంది మొదలయ్యింది.

అప్పటిదాకా ఇంట్లో హోరున కురిసిన వడ్డీ కాసుల వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది. వర్షం ఆగిపోయాక వచ్చే నిశ్శబ్దం ఆ ఇల్లంతా ఆవహించింది. బిట్టు మనోహర్ ని కలవడం కోసం , కరీంనగర్, హైదరాబాద్ అంటూ తిరుగుతున్నాడు.

ఇంట్లో లక్ష్మి ప్రవర్తన కూడా  మారిపోయింది.

“ఇంట్లో ఖాళీగా కూర్చుని తినడం అలవాటైపోయింది. ఏదైనా పని చూసుకోవచ్చుగా? పొద్దస్తమానం నా కళ్ల ముందే కూర్చుంటే ఎలా?” అంటూ సూటిపోటి మాటలు మొదలుపెట్టింది.

ఒక రోజు ఉదయం మల్లన్నటీవీలో వార్తలుచూస్తున్నాడు. ఒక్కసారిగా ఫ్లాష్ న్యూస్ లో మనోహర్ ఫోటో కనిపించగానే మల్లన్న గుండె ఒక్కసారిగా ఆగి మళ్లీ కొట్టుకుంది. చేతిలో ఉన్న ఫోన్ జారీ నేల మీద పడింది.

ఎమ్మెల్యే అనుచరుడు మనోహర్, అధిక వడ్డీల పేరుతో ప్రజల నుండి కోట్లాది రూపాయల ఫండ్స్ వసూలు చేసి, దేశంలో చాలా చోట్ల మోసాలకు పాల్పడి ఐపీ పెట్టాడని, అతనిపై కేసు నమోదు అయ్యిందని టీవీ న్యూస్, పేపర్లలో వస్తోంది. ఈ మోసం వెనుక పెద్ద సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు కూడా ఉన్నారనే ప్రచారాలు ఊపందుకున్నాయి.

ఆ వార్త తెలియగానే, అధిక వడ్డీల ఆశకు డబ్బులు పెట్టిన ఊరి జనాలు మల్లన్న ఇంటిని ముట్టడించారు.

“బిట్టు ముఖం చూసే పెట్టాం!”

బిట్టు పెట్టమంటేనే పెట్టాం! మా పైసలు మాకు ఇయ్యాలి! లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం !” అంటూ ఊర్లో జనాలు ఇంటి దగ్గర గొడవ చెయ్యడం మొదలు పెట్టారు.

బిట్టు ఇల్లు కదలడం మానేసాడు. లక్ష్మి నెత్తీ నోరూ బాదుకుంటూ ఏడవడం మొదలుపెట్టంది. మల్లన్నకు ఏమి చెయ్యాలో అర్ధం కావట్లేదు. వచ్చినవాళ్లకు జవాబు చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు . కొంతమంది జనం కోపంతో బూతులు తిడుతూ , కొట్టడానికి కూడా వస్తున్నారు.

వారం రోజుల్లో ఈ మోసపు కేసు రాష్ట్రంలో సంచలనమైంది. పోలీసులు దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించిన మనోహర్‌ను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు చేశారు. అతని అనుచరుల వేట కూడా కొనసాగింది. ఊరి జనాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, ఈ మోసంలో భాగస్వామిగా బిట్టును కూడా పోలీసులు అరెస్టు చేశారు.

యాభై ఏళ్ల మల్లన్న.. తన ముప్పై ఏళ్ల గల్ఫ్ జిందగీలో ఎన్ని కష్టాలు వచ్చినా ఏనాడూ కంట నీరు పెట్టలేదు. కానీ ఆ రోజు, హాల్లో ఆ పెద్ద టీవీ ముందు కూర్చుని వర్షంలా ఏడ్చాడు. తాను ముప్పైఏళ్లుగా పడిన కష్టం, కన్న కలలు తన కళ్లముందే చెదిరిపోతుంటే తట్టుకోలేక చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.

నెల రోజులు తిండి, నిద్ర లేకుండా పోలీసుల, లాయర్ల, కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి, తాను రక్తాన్ని ధారపోసి సంపాదించిన డబ్బుతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుతో బిట్టును బెయిల్ మీద బయటకి తీసుకువచ్చాడు. ఊళ్లో ఇవ్వాల్సిన వాళ్లందరికీ డబ్బులు ఇవ్వలేకపోయినా, ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన దాంట్లోంచి కొంత వాళ్లకు ఇచ్చి, కాళ్ల మీద పడి ఇక ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనని, క్షమించమని  వేడుకున్నాడు.

5.

రెండు నెలల తరువాత, గతిలేని స్థితిలో మల్లన్న మళ్ళీ ముంబైలో ఉండే తన పాత లేబర్ వీసా ఏజెంట్‌కు ఫోన్ కలిపాడు.

“నమస్తే మల్లన్న భాయ్! ఏంది కథ.. మస్తు ఎంజాయ్ చేస్తున్నావా దేశంలో?” అని ఏజెంట్ నవ్వుతూ అడిగాడు.

మల్లన్న మౌనంగా ఉండిపోయాడు.

“ఏదైనా లేబర్ వీసా ఉందా భాయ్? మళ్ళీ గల్ఫ్ కి పోవాలి” అని జీవం లేని గొంతుతో అడిగాడు.

“అరే! అదేంది మల్లన్న? నువ్వు వచ్చి ఏడాది కూడా కాలేదు కదా.. ఏమైంది?” అని ఆశ్చర్యపోయాడు ఏజెంట్.

మల్లన్న మాట్లాడలేదు. అతని నిశ్శబ్దమే ఏజెంట్‌కు సమాధానం అయింది.

మరో నెల రోజులకు.. ‘దుబాయ్ రిటర్న్ మల్లన్న’ మళ్లీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దుబాయ్ వెళ్లే ఫ్లయిట్ ఎక్కాడు.

ఈసారి అతనికి తిరిగివస్తానని నమ్మకం లేదు. ఫ్లయిట్ రన్‌వే మీద నుంచి టేక్ ఆఫ్ అయింది.విమానం గాల్లోకి లేవగానే మల్లన్న సీట్లో తల వాల్చాడు. కాసేపటికి నిద్ర పట్టింది.

మళ్ళీ ఎదో కల వస్తోంది.

ఒక  పచ్చని చెట్టు పెళపెళమంటూ శబ్దం చేస్తూ నేలకూలిపోయింది. క్షణాల్లో ఆకులు ఎండిపోయి, కేవలం ఒక మొద్దులా మిగిలింది. ఆ ఎండిన చెట్టుకు ఒక్కసారిగా నిప్పు అంటుకుంది. గాలికి ఆ మంటలు ఎగసిపడుతుంటే.ఆ చెట్టు మంటల్లో కదిలి బూడిదైపోతోంది.

        *

సంజయ్ ఖాన్

నా పేరు సంజయ్ ఖాన్. ప్రస్తుతం రియాద్, సౌదీ అరేబియా లో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా, మధిర మండలం, ఖాజీపురం గ్రామం.

చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , కథలు , కవిత్వం ఇష్టంగా చదువుతున్నాను, ఇవి నా జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఎప్పుడు కథలు చవడమే గాని రాయాలని అనుకోలేదు . అనుకున్న నేను రాయలేను ,లేదా రాసేంత సాహిత్య జ్ఞానం నాకు లేదులే అని తప్పించే వాడిని. కానీ గల్ఫ్ దేశాల్లో నేను చూసిన , మాట్లాడి తెలుసుకున్న మన తెలుగు వాళ్ళ వ్యధలు, కథలు నన్ను కదిలించి ఈ కథలు రాయడానికి నన్ను ప్రేరేపించాయి. పుస్తక పఠనంతో పాటు ట్రావెలింగ్, రన్నింగ్ నా హాబీస్.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Hi Sanjay garu,
    What a heart melting story !!! Idhe mee chivari katha ee sheershika lo ani vinatam badha ga vundhi. Dont stop writing please. “Dubai Mallanna ” tho start aina mee story sheershika “Dubai Return Mallanna ” tho end avvatam meeru select chese padhajalala goppathanam cheputhondhi. Im going to miss to read your stories. Please don’t stop writing and comeup with another title stories. We want to read ur stories in future too.
    All the very best !!

  • Dear Sanjay,
    As usual heart wrenching story… తన కష్ట ఫలితం తాను అనుభవిస్తాం అని కోరుకున్నా కూడా.. తమ వాళ్ళ నిర్ణయాలు ఎలా ఆశలను అడియాశలు చేస్తాయో బాగా చూపించారు..ప్రతి నెల మీ కథ కోసం ఎదురుచూసేవాళ్ళం. .. ఇది చివరి నెల అంటే బాధ గా ఉంది… ఇ ముగింపు వేరే ఇంకా మంచి కథ కి ఆరంభం అని కోరుకుంటున్న..
    చాలా ధన్యవాదాలు. 🙂

  • సంజయ్ గారూ, గుండెను మెలిపెట్టే స్టోరీ చెప్పారు. అదికూడా చాలా సాధారణమైన పదాలతో, దుబాయ్ మల్లన్నల కన్నీళ్లను ఒడిసి పట్టారు. మనోహర్ అన్నల ఆర్థిక నేరాలు, బలైపోయే బిట్టుల బతుకులు… అలవోకగా ఏమాత్రం హడావుడి లేకుండా అక్షరాలుగా పేర్చారు. హేట్సాఫ్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు