తెల్లారితే….
నింగిలో సూర్యునికి పోటీగా
నేల మీద మూడు రంగుల జెండాలు ఉదయిస్తాయి
నినాదాల్లో మాత్రమే నిలుస్తూ
ఆచరణలో హత్యగావించబడుతున్న గణ రాజ్యాంగపు ర్యాలీలు
దేశం వీధివీధుల్లో…
సిలువేయబడ్డ యేసుక్రీస్తును ఈడ్చుకుపోయినట్టు
తలలేని శంభూకుడి మొండాన్ని పల్లకీపై ఊరేగించినట్టు
ప్రతి ఏడాది ఈ దినం సాగిపో…తుంటాయి
రాజ్యాంగమా…
నీవు గొంతులేనోళ్ల గొంతువవుతావనుకున్నా కానీ…
నీవు అధికారపు పంజరంలో చిలకవి
అధికారము గొంతే నీ గొంతుగా మారుతుందిపుడు
ఈడ సాగుతున్న తంతిదే నీవు పుట్టినప్పటి నుండి
నూకలు బుక్కాక కోళ్లు కొక్కొక్కో అని కూడా అనవు
ప్రజలను నూకలు బుక్కిన కోళ్ళోలిగా ఉంచుడెట్లాగో
ఏలికలు చేసిన ఆలోచనలు వల్లించడం
ఏలికల ఎలుకలకు ధాన్యం గుమ్ములను కట్టబెడుతుంటే
కళ్ళు మూసుకుని తలలు ఊపడం
అడిగిన వాళ్ళను అండాసెల్ లో బంధించడం
అయిన వారిని అర్ధరాత్రి విడిపించడం నీ పవిత్ర విధిప్పుడు
నీవు అప్పుడప్పుడైనా గొంతునిస్తున్నావని
నీ స్వరపేటిక తెంపుతున్నారు
గొంతులేకున్నా…
రాజ్యంలో రాజుల రంకును జూసి
నీవు రెక్కలిదిల్చి మమ్ముల అలెర్ట్ చేస్తున్నావని
ఇప్పుడు ఈకలు పీకి నీ రెక్కలిరుస్తున్నారు
కానీ వారికింకా భయంగానే ఉంది
మొత్తంగా నీ ఊపిరి తీయడమెట్లానో తెలియక
వారికి ఊపిరాడటం లేదు
నీ కుత్తికను ముట్టుకోవాలనే ఆలోచన జేసినా
వారి కుర్చీలు కూలుతాయని తెలుసు మరీ…
రాజ్యాంగమా…
నీవు బలమైన ఏనుగువే
అయినంత మాత్రాన ఏ లాభం
మావటి చేతిలో ములుగర్ర నిన్ను ఆడిస్తున్నపుడు
తెల్లారితే…
జెండా నుండి రాలిన పూలు వాడినట్టే
జెండా కర్రకేసిన రంగులు యెలిసినట్టే
ఈ దేశ ప్రజల బతుకులు.
*








బావుంది