తెలంగాణ ఉద్యమ కుంపటి పులుగు శ్రీనివాస్ ‘సంకర విత్తులు’

తెలంగాణలోని చిన్నాభిన్నమైన గ్రామీణ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు ఎలా ఇక్కడి ప్రజల జీవితాలను ప్రభావితం చేశాయో తెలుసుకోవడానికి ఈ కథ ఒక ఉదాహరణ.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంగా కవిత్వం, పాట వచ్చినంతగా కథ రాలేదన్నది వాస్తవం. వచ్చినవి పిడికెడు కథలే అయినా చాలా బలమైన కథలు వచ్చాయి. తెలంగాణ నల్లరేగడి భూముల్లో ‘సంకర విత్తులు’ నాటుకు పోయి ఆంధ్ర విషపు పంటలు విస్తరించి తెలంగాణ ప్రజల ఉసురు ఎలా తీశాయో, తెలంగాణ సంస్కృతి మీద ఆంధ్ర ఆదిపత్యం ఎలా మొదలైందో, పెద్దలు చేసిన పెళ్లి ఏలా పెటాకులైందో, ‘చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనయట్లు’ తెలంగాణ చీమల పుట్టను వలసాంధ్ర పాము ఎలా ఆక్రమించుకుందో ఆరటి పండు ఒలిచినట్లు తేట తెల్లంగా చెప్పిన కథ పులుగు శ్రీనివాస్ రాసిన ‘సంకర విత్తులు’ కథ. ఈ కథను పి. యశోదారెడ్డి రాసిన ‘మా పంతులు’ కథతో పోల్చవచ్చు. తెలుగు సాహిత్యానికి పరిచయం అక్కరలేని పేరు పులుగు శ్రీనివాస్. జీవించింది అతి తక్కువ కాలమే అయినా ‘ఆరు కార్మిక కథలు’, ‘బోనస్’, ‘సంకర విత్తులు’ పేర కథా సంపుటాలను వెలువరించాడు. ‘అన్నలు’, ‘అడవితల్లి’ అనే నవలల్ని రాశాడు. ‘సుప్రభాతం’ పత్రికలో ‘టీ పాయింట్’ పేర కాలమ్ నిర్వహించాడు. ‘ఔ.. పిలగా’, ‘చాయ్ బండి’ పేర ఇతర పత్రికల్లో కూడా కాలమ్స్ నిర్వహించాడు. వీరి ‘రాజయ్య రాకపాయే’ కథ కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చిత్రించిందే. ‘సంకరవిత్తులు’ కథ తొలిసారి 2000 సంవత్సరం డిసెంబర్ లో ఇండియా టుడే మేగజైన్ లో ప్రచురింపబడింది.

తెలంగాణ వారికి తెలుగు రాదనే నెపంతో ఆంధ్రా నుంచి దిగుమతి అయిన సుబ్బారావు అనే హెడ్ మాస్టర్ వరంగల్ జిల్లా యేలేరు గ్రామ పాఠశాలలో నియామకం పొందుతాడు.  రావడంతోనే పిల్లల భాష, ఉచ్చారణ బాగాలేదని సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు. కాదు మా తాత ఇలాగే అనాలని చెప్పాడని మా భాషే సరైందని  చెప్పిన విద్యార్థులతో పలక రానివారు అలా మాట్లాడుతారు. మనం చదువుకున్నవాళ్లం కాబట్టి  ఇలాగే మాట్లాడాలంటూ  ఆంధ్ర భాషను ఆ పిల్లలపై రుద్దుతాడు. ఇలా పలకకపోతే తోలుతీస్తానంటాడు. ఇక చేసేది లేక పిల్లలు బడిలో ఒక భాష, ఇంటిదగ్గర ఇంకో భాష రెండు భాషలను నేర్చుకుంటారు. పిల్లలకు పాఠాలు బోధిస్తూనే పాఠశాల చుట్టూ ఉన్న భూములపై కన్నేస్తాడు ఉపాధ్యాయుడు. మెల్లగా గుంటూరు జిల్లా రామయ్య పాలెంలోని తన భూమిని అమ్మి యేలేరులో ఎకరానికి వెయ్యి రూపాయలకే కొంతభూమి కొంటాడు. ఊర్లో సపోర్ట్ కోసం తన కూతురు సంగీతను మల్లారెడ్డి కొడుకు, తన దగ్గర చదువుకున్న రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చి వియ్యం అందుకుంటాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి భూమిలో వ్యవసాయం మొదలు పెడతాడు. ఆహార పంటలు కాకుండా వ్యాపార పంటలు వేసి లాభాలు గడిస్తాడు. తన చుట్టూ ఉన్న రైతులకు కూడా వ్యాపార పంటలే వేయమని సలహా ఇస్తాడు. ఇతర వ్యాపారాల్లోకి కూడా దిగి కోట్లు గడిస్తాడు. 1969 తొలి దశ ఉద్యమ సమయంలో ‘గోంగూర గో బ్యాక్’, ‘ఇడ్లీ సాంబార్ బ్యాక్’ అంటూ ఉద్యమకారులు నినదిస్తుంటే మల్లారెడ్డి ఇంట్లోనే ఆశ్రయం పొంది ప్రాణాలు కాపాడుకుంటాడు. క్రమంగా యేలేరులో సుబ్బారావు బలగం పెరిగిపోయింది. పోచంపాడు ప్రాజెక్ట్ వెంట భూములన్నీ ఆంధ్ర వాల్ల పాలే అయ్యాయి. వ్యాపార పంటలు వేసిన రైతులు విత్తనాలు దొరక్క గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యల పాలయ్యారు. ఇదంతా తొలితరం కథ.

మలి తరం వచ్చేసరికి రాజేశ్వర్ రెడ్డి భార్య సంగీత ఊర్లో భూమి అమ్ముదాం అంటుంది. వద్దంటాడు రాజేశ్వర్ రెడ్డి. భూమి అమ్మనిస్తావా? విడాకుల పత్రం మీద సంతకం పెడతావా? తేల్చుకోమంటుంది సంగీత. డబ్బు కోసం ఎంతకైనా దిగజారే భార్య వైఖరిని తూలనాడుతాడు రాజేశ్వర్ రెడ్డి. ఇద్దరి మధ్య వాగ్వివివాదం పెరిగి నీ విష సంస్కృతిని సంకర సంస్కృతిని నా మీద రుద్దకంటాడు రాజేశ్వర్ రెడ్డి. ఏంటి నీ సంస్కృతి “అసలు నీకు నీ తల్లిదండ్రులకు ముడ్డి మీద గుడ్డలు ఎలా కట్టుకోవాలో తెలుసా? మేం నేర్పాం. మొద్దురాచిప్పలు. నీకు బట్టలు కట్టుకోవడం, స్నానం చేయడం, దువ్వు కోవడం, పళ్ళు తోముకోవడం నేను దగ్గరుండి నేర్పించాను. లేకపోతే నీకు బ్రష్ తో పళ్ళు తోమడం, సబ్బుతో స్నానం చేయడం, ప్యాంటుకు బెల్టు పెట్టుకోవడం వచ్చేది  కాదు. నీకే కాదు నీ తెలంగాణ మూర్ఖులెవరికీ మేము రాకపోతే తెలిసేది కాదు. వెనుకబాటుతనాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మమ్మల్ని అవమానిస్తావా? మా సంస్కృతి సంకర  సంస్కృతి అంటావా? మాది బ్రిటిష్ వాళ్ల స్వేచ్చా సంస్కృతి, మోడరన్ సంస్కృతి. మరి మీది నిజాం నవాబు నిరంకుశ సంస్కృతి. పరదా సంస్కృతి.” అంటూ కోపంగా ఊగిపోతుంది సంగీత.

తెలంగాణ నేల మీదే జీవిస్తూ ఇక్కడి ప్రజలతో మమేకం కాకుండా ఈ నేలనే అవమానిస్తావా? మా వేష భాషలు సంస్కృతినే వెక్కిరిస్తావా? ఇది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం కాదా? ఇప్పుడు ఏం తక్కువైంది? మీరు అనుభవిస్తున్న భూమి, భవంతి, నగలు మావి కావా? అని ప్రశ్నిస్తాడు రాజేశ్వర్ రెడ్డి. బాధపడుతున్న రాజేశ్వర్ రెడ్డిని ఓదారుస్తూ “బిడ్డా! నూరేళ్లు ఉన్నా సావు తప్పదు వెయ్యేండ్లు ఉన్నా వేరు తప్పదు. వలస వచ్చిన వాళ్ళు వట్టి పోయినంక వదిలేస్తారు.. వాళ్ళకి లేని సిగ్గు సంప్రదాయం మనకెందుకు చెప్పు? విడాకుల మీద సంతకం పెట్టు. మన ఊరికి  పోదాం. సావో బతుకో అక్కన్నే.. అన్నల నడుమనే తేల్చుకుందాం పా…” అంటుంది రాజేశ్వర్ రెడ్డి తల్లి.

నిజమేనమ్మా బానిస బతుకు కంటే మరణమే మేలు. పద అంటూనే విడాకుల పత్రం మీద సంతకం పెడతాడు రాజేశ్వర్ రెడ్డి. ఈ కథలో రాజేశ్వర్ రెడ్డి సంగీతల వివాహాన్ని ఆంధ్ర.  తెలంగాణల మధ్య జరిగిన వివాహంగా సంకేతించి మంచి శిల్పంతో కథ చెప్పాడు రచయిత. మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకోక ముందే 2000 డిసెంబర్ లోనే రచయిత చాలా ముందుచూపుతో ఈ కథ రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సామాన్య కథకుల్లా డొల్ల పూరితమైన సమైక్య ముగింపునివ్వకుండా ‘ఇడుపుకాయిదం’ మీద సంతకం పెట్టే ఒక భవిష్యత్ సూచన ప్రాయమైన ముగింపునివ్వడం అబ్బురపరుస్తుంది.  మలిదశ ఉద్యమానికి భూమిక ఏర్పరచిన కథల్లో ఈ కధ కూడా ఒకటి. అందుకే ఈ కథ మీద చాలా చర్చ జరిగింది. వివాదాస్పదం కూడా అయ్యింది.  ఈ కథ చంద్రలత రాసిన ‘రేగడివిత్తులు’ (1997) నవలకు కౌంటర్ గా రాసిన కథగా కూడా తోస్తుంది.

దశాబ్దాలుగా తెలంగాణ జీవితాలు ఎట్లా అన్యాక్రాంతం అయ్యాయి? ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదేనన్నట్లు వలస వచ్చారని కడుపులో పెట్టుకొని చూసుకున్నందుకు తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఆంధ్రా ప్రజల నైజం ఎలాంటిదో ఈ కథ కూలంకషంగా చర్చించింది. సుబ్బారావు, సంగీత పాత్రలు ఆంధ్రా పీడనకు నిదర్శనంగా నిలుస్తాయి. రాజేశ్వర్ రెడ్డి అతని తల్లి పాత్రలేమో దగా పడిన తెలంగాణకు నిదర్శనంగా కనిపిస్తాయి. తెలంగాణ ప్రజల మనస్తత్వానికి, ఆంధ్రా ప్రజల మనస్తత్వానికి గల తేడాను చూపడంలో రచయిత నూటికి నూరు పాళ్ళు కృతకృత్యులయ్యాడు. తెలంగాణ ప్రజలను అవమానించిన సంగీతకు సమాధానమిస్తూ రాజేశ్వర్ రెడ్డి ఒక చోట “హు.. అమాయకత్వానికీ, సహనానికీ ప్రతీకలు నా వాళ్ళు.. రక్తపుటేరులను మౌనంగా చూసిన వాళ్ళు నా వాళ్ళు.. నీళ్ళు లేక భూములు బీడులుగా మారినా… ఆకలిని, అన్యాయాలను, అవమానాలను, నవ్వుతూ, నిశ్శబ్దంగా భరిస్తున్నవాళ్లు నా వాళ్ళు.. వాళ్ళతో మమేకం కాకుండా, వారి వేష భాషలను, సంస్కృతీ సంప్రదాయాలను మీ వాళ్ళు వెక్కిరిస్తున్నారు. కానీ ఇదే తెలంగాణ వారు బొంబాయి, పూనా, సోలాపూర్ బతకడానికి వెళ్ళి వాళ్ళతో మమేకం అయిపోయారు. వారి వేష భాషలు నేర్చుకొని, వారి ప్రేమాభిమానాలు చూరగొన్నారు. అలాంటి వాళ్ళనూ, నా గడ్డనూ నీవు వెక్కిరిస్తావా? దాని మీద జీవిస్తూ దాన్నే విమర్శిస్తావా?” అంటాడు ఆక్రోశంగా.

తెలంగాణ జీవితపు వైభవాన్ని, ఔన్నత్యాన్ని చిత్రించిన ఈ కథ ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజలు వలస వచ్చిన ఆంధ్రా ప్రజల కాలుకు ముల్లు అంటకుండా చూసుకున్న తీరును కూడా చెప్తుంది. అదే సమయంలో  ఆంధ్రా ప్రజల కుటిల నీతిని కూడా బయటపెట్టింది. తెలంగాణలోని చిన్నాభిన్నమైన గ్రామీణ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు ఎలా ఇక్కడి ప్రజల జీవితాలను ప్రభావితం చేశాయో తెలుసుకోవడానికి ఈ కథ ఒక ఉదాహరణ.  ఈ కథ చదవడం ద్వారా కోస్తా, తెలంగాణ ప్రాంతాల మధ్య గల సాంస్కృతిక వైరుధ్యాలను అర్థం చేసుకోవచ్చు. ‘రేగడివిత్తులు’ నవలలో చంద్రలత తెలంగాణ వారికి కోస్తా వారు వ్యవసాయాన్ని, సంస్కృతిని నేర్పారని కోస్తా వారి సాంస్కృతిక ఆధిపత్యాన్ని స్థిరీకరించే ప్రయత్నం చేశారు. దీన్ని తిప్పికొట్టడానికి రాసిన కథే ఇది. కోస్తావారు తాము ఆర్థికంగా ఎదగడానికి అవసరమైతే కుటుంబ సంబంధాలను కూడా ఎలా బలి పెడుటారో చాలా బలంగా చిత్రించారు రచయిత. దశాబ్దాలుగా ఆంధ్రా వారి దోపిడీని, ఆధిపత్యాన్ని భరించీ, భరించీ ఒక నిరసన నుండి, ఒక అణచివేత నుండి ఒక బలమైన గొంతుతో రాసిన కథ ఇది. అంతే కాదు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ మూలాలను దేవులాడిన కథ కూడా.

*

సంకర విత్తులు కథ సంకర విత్తులు చదవండి

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి విశ్లేషణ శ్రీధర్ !
    పులుగు శ్రీనివాస్ మరి కొంత కాలం జీవించి వుంటే ప్రత్యేక లంగాణ ఉద్యమ కథా దీపం అంత చిన్నగా వుందన్న బెంగ కొంతమేరకైనా తీరేది.
    బలమైన కథకు బలమైన వ్యాఖ్య అందించినందుకు అభినందనలు.

  • మంచి విశ్లేషణ తో “సంకర విత్తులు “కథను చదివింప చేశారు .ధన్యవాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు