జూలో జీబ్రా మరణం

జంతు ప్రదర్శన శాలలో జీబ్రా మరణించాక
ఆ జీబ్రాకు తోడుగా ఉన్న
మరో జీబ్రా తప్ప ఇంకెవ్వరూ లేరు
ఆ జీబ్రాని కూడా మరిన్ని జీబ్రాల ప్రజననం కోసమే ఉంచారు
భయంకరమైన ఒంటరితనం అనుభవిస్తూ
ఆ జీబ్రా ఖైదు చేసిన ప్రదేశంలో ఓ మూలకు ఒదిగిపోయింది
దాని కన్నులు తన గతంలోకి జారుకున్నాయి
మేత మేసేందుకు గుంపుతో పాటు పోయి
దినమంతా స్వేచ్ఛగా తిరిగిన రోజులు
తిరుగాడిన పచ్చని విశాల మైదానాలు
దాహం తీర్చుకునేందుకు నీరు తాగిన నది, చిన్న కొలనులు
ఆత్మీయ విశ్రాంతి కోసం పరచుకున్న అడవి ఉండేవి
ఇప్పుడు తన వంతులో అవేమీ లేవు
అసలు జీబ్రాలన్నిటి వంతులోనే ఏమీ లేవు
అవన్నీ ఉండివుంటే
ఈరోజు జరిగిన ఘటనే జరిగివుండేది కాదు
కాల చక్రంలో అక్కడ ఓ జీబ్రా మరణించినా
ఈరోజు జరిగినట్టు జరిగివుండేది కాదు
ఈరోజున సామూహిక శోక సభ జరిగేది
పూర్తి గ్రామమంతా ఒకచోట గుమికూడేది
తనని సన్మానిస్తూ ఒక గీతం ఆలపించేవారు
ఒకరు దానికున్న మొండితనంతో గుర్తు చేసుకునేవారు
ఇంకొకరు దానితో సరిసమానంగా
నాట్యం చేసే జోడీ ఇంకెరవరూ లేరని జ్ఞాపకం చేసుకునేవారు
మరొకరు తన పూర్వీకులను గుర్తు చేసుకునేవారు
ఇక్కడ చోద్యం చూస్తున్న జనం తనని ఎలా గుర్తిస్తారు
శోక గీతంలో భాగస్తులు ఎలా అవుతారు
ఈ గుంపంతా ఉబలాట పడేది తన చిత్రం తీసుకోవడం కోసమే
నా దుఃఖం అంతా జీబ్రా మరణం గురించి మాత్రమే
భయమంతా జంతు ప్రదర్శనశాల గురించి
ఎందుకంటే జంతుప్రదర్శనశాల రోజురోజుకీ విస్తరిస్తోంది
పంజరాల సంఖ్య కూడా వృద్ధి చెందుతోంది
అక్కడ అడవిలో
ఆదీవాసీల జన సంఖ్య లెక్కలు తయారు చేస్తున్నారు
పురావస్తు ప్రదర్శనశాలలో వారి చర్మాలు, ఎముకలు,
వాద్య యంత్రాలు, లిపి, పాడుకునే గీతాలు భద్రపరుస్తున్నారు
జంతుప్రదర్శనశాలలో జీబ్రా మరణం
కేవలం జీబ్రా మరణం మాత్రమే కాదు
మా సంభావిత భావి మరణ సంకేతం.
–హిందీ మూలం : అనుజ్ లుగున్, ఆదివాసీ కవి
జార్ఖండ్ రాష్ట్రంలో, సిమ్డెగా జిల్లాలో, జల్డెగా పహాన్ టోలీ గ్రామంలో 10.01.1986లో ముండా అనే ఆదివాసీ కుటుంబంలో జన్మించారు. రాంచీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడు అయ్యాక బెనారస్ హిందూ యూనివర్సిటీలో డాక్టరేట్ చేసి ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బీహార్లో
భారతీయ భాషల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు.
ఆదివాసీల అస్తిత్వం, పునరావాసం, ఆదివాసీలపై జరుగుతున్న హింస, అత్యాచారాలపై, అడవుల ఆక్రమణపై శక్తిమంతమైన కవిత్వం రాసారు. 2019లో ఆయన హిందీలో “బాగ్ ఔర్ సుగుణ ముండా కీ బేటీ” శీర్షికతో రాసిన సుదీర్ఘ కవితకు కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రీయ స్థాయిలో కూడా భరత్ భూషణ్ అవార్డుతో పాటు ఎన్నో  ఇతర అవార్డులు అందుకున్నారు. ఇప్పటి వరకు మూడు కవితా సంపుటులు వెలువరించారు.

ఆర్ . ఎస్ . వెంకటేశ్వరన్ .

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.