1.
రాత్రి పన్నెండు దాటింది.రియాద్ నగరపు వీధుల్లోని బహుళ అంతస్తుల భవనాలు నిద్రలోకి జారుకున్నాయి. భవనాలకు బొప్పి కట్టినట్లు బయటకు కనిపిస్తున్న విండో ఏసీలు తమ పని చేస్తూ “గర్ గర్” అంటూ శబ్దం చేస్తున్నాయి.
మలజ్ ఏరియాలోని ఒక వీధి చివర ఉన్న ముదురు ఆకుపచ్చ డస్ట్‌బిన్, పగలంతా ఆ నగరం విసర్జించిన చెత్తతో నిండిపోయి పుల్లటి వాసనను వెదజల్లుతోంది.
ఇంతలో బీప్ బీప్ బీప్ అంటూ శబ్దం చేసుకుంటూ ఒక మునిసిపాలిటీ ట్రక్కు వచ్చి దాని ముందు ఆగింది. డోర్ తీసుకుని ఒక వ్యక్తి కిందకు దిగాడు. ఆకుపచ్చ రంగు యూనిఫామ్. తలకు మాసిన గుడ్డ. వీధి దీపాల వెలుగులో అతని బట్టల మీదున్న రేడియం స్టిక్కర్స్ మిణుకుమిణుకుమంటున్నాయి. అతను డస్ట్‌బిన్ వైపు నడిచాడు. మురుగు వాసన ముఖానికి కొడుతున్నా, అతనిలో ఎలాంటి చలనం లేదు. యాంత్రికంగా తన పని మొదలుపెట్టాడు.
ఆ ట్రక్కుకున్న మెషీన్, ఆ భారీ బిన్‌ను పైకి లేపింది. చెత్తంతా లారీలో పడుతున్నప్పుడు అతనలాగే చూస్తూ నిల్చున్నాడు. రకరకమైన మనుషుల్లా రకరకమైన చెత్త . ఆ తర్వాత ట్రక్కుకు ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి పైపు లాగి నీళ్లతో ఆ డస్ట్ బిన్ శుభ్రం చేసి , ఫినాయిల్ పిచికారీ చేశాడు. ఇప్పుడు ఆ డస్ట్‌బిన్ శుభ్రంగా, తాజాగా మారిపోయింది. జాఫర్ ముఖంలో చిన్న నవ్వు కనిపించింది. పసిపాపకు శుభ్రంగా స్నానం చేయించి, పొడిగుడ్డతో తుడిచిన తర్వాత ఓ తల్లి ముఖంలో కనిపించే నవ్వు లాంటిది.
జాఫర్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలస కార్మికుడు. మూడేళ్లుగా అతని ప్రపంచం రాత్రి పన్నెండు నుంచి ఉదయం పన్నెండు గంటల వరకు ఈ డస్ట్‌బిన్ల చుట్టూనే తిరుగుతోంది. ట్రక్కెక్కడం, దిగడం, డస్ట్‌బిన్ శుభ్రం చేయడం, ఊరిబయట డంపింగ్ యార్డులో ఆ చెత్తను కుమ్మరించడం.
మొదట్లో ఆ వాసనకు కడుపులో దేవేసేది. పిచ్చెక్కేది. ఆ పని వదిలి ఇంటికి వెళ్లిపోవాలని అనిపించేది, కానీ ఇంటి దగ్గర అమ్మా, నాన్నల తలలపై వేలాడుతున్న అప్పుల వాళ్ళ కత్తులు గుర్తొచ్చి ఆగిపోయేవాడు. మూడు నెలలు గడిచేసరికి ఆ గలీజు వాసన అతన్ని ఇబ్బంది పెట్టడం మానేసింది. చెప్పాలంటే ఇప్పుడు ఆ చెత్త కుప్పే అతనికి అత్యంత ఆత్మీయురాలిగా అనిపిస్తోంది. ఆ కుళ్ళిన వాసనే అతనికి జీతాన్ని, జీవితాన్ని ఇస్తోంది.
పనంతా పూర్తయ్యేసరికి ఉదయం ఐదైంది. జేబులో ఫోన్ వైబ్రేట్ అయితే తీసి చూశాడు. సబీనా నుంచి వాట్సాప్ మెసేజ్. ఓపెన్ చేశాడు. “గుడ్ మార్నింగ్ ! మన పెళ్ళికి నేను తీసుకున్న చీర ఇదే! ” అని ఒక ఎర్రటి జరీ చీర కట్టుకున్న తన ఫోటోను పంపింది.
సబీనా అతని మేనత్త కూతురు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. మూడేళ్లుగా జాఫర్ కోసం ఇరుగుపొరుగు వాళ్ళతో మాటలు పడుతూ, ఇంట్లో వాళ్ళను ఎదిరించి మరీ ఎదురుచూస్తోంది. మరో రెండు వారాల్లో జాఫర్ సెలవుపై ఊరెళ్తున్నాడు. ఆ ఫోటో చూడగానే జాఫర్ పెదవులపై నవ్వు విరిసింది.

2.
జాఫర్ బంగ్లాదేశ్ వచ్చి రెండు వారాలైంది. వాళ్ల పెళ్లి కూడా జరిగిపోయింది.
కానీ, పెళ్లైన రాత్రి నుంచి సబీనా ప్రవర్తనలో ఏదో తెలియని బెరుకు. జాఫర్ ప్రేమగా దగ్గరకు తీసుకున్న ప్రతిసారీ, ఆమె ముఖ కండరాలు బిగుసుకుపోతున్నాయి. ఎందుకో నెమ్మదిగా దూరంగా జరుగుతోంది.
ఒకరోజు రాత్రి భరించలేక జాఫర్ అడిగాడు. ఆమె చేయి పట్టుకుని, “ఏమైంది సబీనా? నేను వచ్చినప్పటి నుంచి అదోలా ఉంటున్నావు?” అన్నాడు.
గదిలో నిశ్శబ్దం. పక్క గదిలో వాళ్ళ నాన్న గురక తీస్తున్నాడు. వంటగదిలోంచి వాళ్ళ అమ్మ గిన్నెలు సర్దుతున్న శబ్దం.
“ఏదైనా అనారోగ్యమా?” మళ్ళీ అడిగాడు.
సబీనా కళ్ళనుండి నీళ్లు చెంపల మీదుగా మెడ మీదకు జారుతున్నాయి.
“మీ దగ్గర… ఏదో వాసన వస్తోంది…” గొంతు వణుకుతుండగా అంది సబీనా.
“వాసనా?”
“అవును… మీ శరీరం నుంచి, మీ శ్వాస నుంచి, మీ చెమటలోంచి. ఆ వాసనకు నాకు వికారం వస్తోంది. రెండు వారాలుగా నాకు నిద్ర లేదు.”
జాఫర్‌కు ఏం చెప్పాలో అర్థం కాలేదు. గదిలో ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. అతను మౌనంగా వింటున్నాడు.
“తప్పుగా అనుకోకండి… మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం!” అంటూ ఆమె గోడ వైపుకు తిరిగి పడుకుంది.
3.
క్లినిక్‌లో డాక్టర్ గది. ఒక టేబుల్, మూడు కుర్చీలు. పక్కనే ఉన్న కిటికీలోంచి బయట చెట్టు కొమ్మ మీద వాలిన ఒక చిన్న పిచ్చుక కనిపిస్తోంది. అది తల అటూ ఇటూ తిప్పుతూ ఏదో వెతుకుతోంది.
డాక్టర్ ఇద్దరి మాటలూ విన్నాడు. ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద ఏదో రాస్తూ, కళ్లజోడు సవరించుకుని అడిగాడు.
“ఇది బ్రోమిడ్రోసిస్ (Bromhidrosis) లా ఉంది. నిరంతరం కుళ్ళు వాసనలు, బ్యాక్టీరియా ఉండే చోట పని చేస్తే, ఆ గాలి శ్వాస ద్వారా రక్తంలో కలిసిపోతుంది. ఆ తర్వాత అది చెమట, శ్వాస ద్వారా బయటకు వస్తూనే ఉంటుంది. ఇంతకీ మీరేం పని చేస్తుంటారు?”
జాఫర్ జవాబు చెప్పలేదు.
కాసేపటికి సబీనా బదులిచ్చింది, “సౌదీలో ఆఫీస్ బాయ్ డాక్టర్.”
డాక్టర్ రాయడం ఆపి అనుమానంగా చూశాడు. “ఆఫీస్ బాయ్ పనికీ, ఈ కండిషన్‌కీ సంబంధం లేదే.”
గదిలో మళ్లీ నిశ్శబ్దం. కిటికీ బయట ఉన్న పిచ్చుక ఎగిరిపోయింది. జాఫర్ ఆ ఖాళీ కొమ్మనే చూస్తున్నాడు. తర్వాత పక్కనే ఉన్న సబీనా ముఖంలోకి చూశాడు. ఆమె కళ్ళలో డాక్టర్‌పై అమాయకమైన నమ్మకం. తన భర్త జబ్బు తగ్గిపోతుందన్న ఆశ.
జాఫర్ గొంతు సవరించుకుని నెమ్మదిగా అన్నాడు.
“బలదీయ పని డాక్టర్.”
“అంటే?”
“మున్సిపాలిటీ రోడ్లు ఊడ్చడం. డస్ట్‌బిన్లు శుభ్రం చేయడం. రాత్రి పన్నెండుకు మొదలుపెడితే, ఉదయం పన్నెండు వరకూ… అదే పని.”
జాఫర్ చెబుతున్నది అర్ధం కానట్లుసబీనా అతని వైపు ఆందోళనగా చూసింది.
జాఫర్ తన పని గురించి డాక్టర్ కు మొత్తం వివరించాడు.
సబీనాకు తన శరీరం తన అదుపులో లేనట్లు అనిపించింది. రెక్కలు విరిగిన పక్షిలా, కుర్చీలో కూలబడిపోయింది.
మూడేళ్లుగా ఆమె కంటున్న కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. జాఫర్ సౌదీ నుంచి వస్తాడు, తనని పెళ్లి చేసుకుని సౌదీకి తీసుకుపోతాడు. సౌదీలో కొత్త జీవితం… అక్కడి అందమైన జీవితం… అమ్మానాన్నలను మక్కా ఉమ్రా కోసం తీసుకువెళ్లొచ్చు అంటూ ఆమె గుండెల్లో దాచుకున్న ఊహలన్నీ ఇప్పుడు చెత్త కుప్పల మధ్య కుళ్లిపోతున్న వాసనలో కలిసిపోయినట్లు అనిపించాయి.
జాఫర్ తనను మోసం చేశాడు. ఈ నిజం ఆమెకు ఊపిరి ఆడనివ్వడం లేదు. ఆఫీస్ బాయ్ ఉద్యోగమని చెప్పి, మూడేళ్లుగా ఆ గలీజు చెత్తకుప్పలు శుభ్రం చేసే పని చేస్తున్నాడు.
ఆ రాత్రి పడకగదిలో గాలి బరువుగా ఉంది. మంచానికి చెరో చివర ఇద్దరూ పడుకుని ఉన్నారు. ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం తప్ప గదిలో మరేమీ వినిపించడం లేదు. వాళ్లిద్దరూ ఆకాశం వైపు చూస్తున్నట్లుగా, తిరుగుతున్న ఆ మూడు రెక్కల వైపే చూస్తున్నారు.
అర్ధరాత్రి కుక్కలు అరుస్తున్న శబ్దం లీలగా వినిపిస్తోంది.
“ఎందుకు అబద్ధం చెప్పారు?” సబీనా అడిగింది. ఆమె గొంతులో తెలియని ఆందోళన, నిలదీయాలన్న కసి కన్నా నిస్సహాయత ఎక్కువగా ఉంది.
కాసేపటికి జాఫర్ జవాబిచ్చాడు. “ఎన్నో సార్లు చెప్పాలనుకున్నాను సబీనా.”
“మరి ఎందుకు చెప్పలేదు?”
“చెబితే నువ్వు అసహ్యించుకుంటావని… నన్ను వదిలేస్తావని భయమేసింది.” అతని గొంతులో తన తప్పును అంగీకరిస్తున్నట్లు పశ్చాతాపం.
ఆ చీకట్లోనే తను ఏజెంట్ చేతిలో ఎలా మోసపోయాడో, తినడానికి లేక పడిన బాధలు, చివరికి ఇంటి అప్పుల కోసం ఇష్టం లేకపోయినా ఆ మురుగులో ఎలా దిగాల్సి వచ్చిందో నింపాదిగా చెప్పుకుంటూ పోయాడు జాఫర్.
సబీనా కన్నీళ్లతో వింటోంది. ఆమెకు అతని మాటలు నమ్మాలనిపించడం లేదు.
“అలాంటప్పుడు ఇంటికి తిరిగి రావాల్సింది కదా? ఇష్టం లేకుండా అక్కడ ఉండటం దేనికి?”.
జాఫర్ నవ్వాడు. “ఐదు లక్షల అప్పు సబీనా! కొడుకు ఏదో పంపిస్తాడని వాళ్ళ ఆశ. నాకోసం నువ్వు… ఏ ముఖం పెట్టుకుని ఊరికి తిరిగి రాగలను?”
“నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను మోసం చేసావ్” అంటూ సబీనా మెల్లగా ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు ఆ రాత్రి నిశ్శబ్దాన్ని భంగపరుస్తోంది.
“నేనేం కావాలని చెయ్యలేదు! సబీనా… అయినా మన కోసమే కదా నేను అంత దూరం వెళ్ళింది.”
“మన కోసమా?” ఆమె గొంతులో ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. గోడ వైపు తిరిగి పడుకున్న ఆమె, అతని వైపు తిరిగింది. “ఎవరు వెళ్లమన్నారు నిన్ను? నేనేం నిన్ను వెళ్లమనలేదు కదా? నాకోసం అయితే నువ్వు వెళ్లలేదు… నువ్వు నన్ను మోసం చేసావు…”
జాఫర్‌కు ఆమెను దగ్గరకు తీసుకుని, ఆమె కన్నీళ్లు తుడిచి ఓదార్చాలని ఉంది. కానీ తన శరీరపు వాసన ఆమెకు మరింత వికారం తెప్పిస్తుందేమోనన్న భయం అతని చేతులను కట్టేసింది. ఆ భయమే అతనిలో ఒక అపరాధ భావాన్ని నింపింది. ఏమీ చేయలేక, మౌనంగా లేచి స్నానాల గది వైపు నడిచాడు.
చీకట్లోనే బకెట్ నీళ్లు తన మీదుగా కుమ్మరించుకున్నాడు. సబ్బు, డెటాల్, షాంపూ… చేతికి ఏది దొరికే అది తీసుకుని ఒంటి మీద రుద్దుకుంటున్నాడు. చర్మం మండిపోయేలా పదే పదే తోముకుంటున్నాడు. నీళ్ల చప్పుడికి తోడు అతని మూగ ఏడుపు ఆ స్నానాల గది గోడల మధ్య ముద్దకట్టుకుపోయింది.
5.
చూస్తుండగానే మూడు నెలల సెలవు పూర్తయింది. ఈ వ్యవధిలో వాళ్లిద్దరూ చాలా మాట్లాడుకున్నారు.
ఆ పాడు పని మానేయమని సబీనా బతిమాలుతూనే ఉంది. డాక్టర్ చెప్పినట్లుగా పని మానేస్తే ఏడాదిలో జాఫర్ శరీరంలోంచి వచ్చే వాసన పోతుందని ఆమె ఆశ. జాఫర్ కూడా ఢాకా నుంచి చిట్టగాంగ్ దాకా ఉద్యోగం కోసం తిరిగాడు. ఎక్కడా సరైన పని దొరకలేదు. దొరికిన చోట వచ్చే జీతం వాళ్ళ నెలవారీ వడ్డీలకు కూడా సరిపోదు.
చివరికి ఏ దారీ లేక, అదే రియాద్, అదే పనికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు జాఫర్.
ప్రయాణానికి ముందు రోజు రాత్రి, తీసుకెళ్లాల్సిన ముప్పై కేజీల లగేజి పెట్టె సర్దుతూ .
“సబీనా…” అన్నాడు జాఫర్ నెమ్మదిగా. “నాకు తెలుసు నేను వెళ్లడం నీకు ఇష్టం లేదని . కానీ నేనో నిస్సహాయుడిని. నా చేతులు ఎవరో నరికేసినట్లుగా ఉంది.”
సబీనా ఏమీ మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తోంది.
“మరో మూడేళ్లు కష్టపడి అప్పులన్నీ తీర్చేసి వచ్చేస్తాను. ఈసారి ఇక్కడే, నీతోనే ఉండిపోతాను. సబీనా… ఆ చెత్త లేనిదే నేను లేను, మనం ఉంటున్న ఈ ఇల్లు లేదు, మనం తింటున్న ఈ తిండి లేదు. నాకు ఇష్టమున్నా లేకపోయినా వెళ్లక తప్పదు.”
ఆమె కనురెప్పలు బరువుగా కదులుతున్నాయి.
“వచ్చే మూడేళ్లలో నా శరీరంలో ఈ వాసన మరింత ఎక్కువవుతుందేమో తప్ప, తగ్గదు. నాకోసం నువ్వు ఎదురుచూస్తావన్న ఆశతో వెళ్తున్నాను. మిగిలినది నీ ఇష్టం.” జిరబోయిన గొంతుతో జాఫర్ తను చెప్పాల్సింది చెప్పాడు.
సబీనా జవాబు చెప్పలేదు. గదిలో నిశ్శబ్ధం. దూరంగా కుక్క మొరుగుతున్న శబ్దం.
6.
ఢాకా విమానాశ్రయం. తెల్లవారుజాము మంచు ఇంకా విడిపోలేదు.
సబీనా లోపలి గేటు వరకు వచ్చింది. ఇద్దరూ నడుస్తున్నారు. చుట్టూ ట్రాలీ చక్రాల శబ్దం, బెంగాలీ అనౌన్స్‌మెంట్ల హోరు, అపరిచితుల హడావిడి. ఇద్దరి మధ్యా మౌనం.
ఎంట్రీ గేటు దగ్గర ఆగారు. జాఫర్ ఆమె వైపు తిరిగాడు. ఆమె ముఖంలోకి చూడలేదు. ఆమె చేతులను తన గుండెల దగ్గరకు తీసుకుని వదిలి ,ట్రాలీ తోసుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి నడిచాడు.
సబీనా అక్కడే నిలబడి, అతడు మాయమయ్యే వరకూ చూస్తూ ఉండిపోయింది. రెండు కన్నీటి చుక్కలు ఆమె బుగ్గల మీదుగా తాను వేసుకుని ఉన్న నల్లని సిల్క్ బురఖా మీదకు జారిపోయాయి.
ఢాకా – రియాద్ ఫ్లైట్ టేకాఫ్ అయింది.
క్యాబిన్ అంతా నిశ్శబ్దం. లైట్లు ఆర్పేశారు. ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. బతుకుదెరువు కోసం వెళ్తున్న వందలాది వలస జీవుల శ్వాసలు బాధగా వినిపిస్తున్నాయి. మళ్లీ మూడేళ్ల తర్వాతే ఇల్లు. తిరిగి వస్తారో రారో!
జాఫర్ విండో సీట్‌లో కూర్చుని బయటకు చూస్తున్నాడు. ఆకాశం చిమ్మచీకటిగా ఉంది. విమానం రెక్క చివర ఉన్న చిన్న ఎర్రని లైట్ మాత్రం చీకట్లో మిణుకుమిణుకుమంటోంది.
“ఎవరు వెళ్లమన్నారు నిన్ను? నేనేం వెళ్లమనలేదు కదా?” సబీనా అన్న మాటలు ఆ చీకట్లో అతని చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. జాఫర్ ఆ ఎర్రటి లైటునే చూస్తూ ఉండిపోయాడు.
*








Add comment