చాసో ‘ఏలూరెళ్లాలి’ – ఒక సంక్లిష్ట కథ

ఈ కథ 1943లో రాసినప్పటికీ నేటికీ ప్రాసంగికంగానే ఉంది. నేడు స్త్రీలకు చట్టపరమైన ఆస్తి హక్కులు, విద్య, ఉపాధి అవకాశాలు పెరిగినా, ఆర్థికంగా, సామాజికంగా బలహీనంగా ఉన్న అనేక మంది వితంతువులు ఇప్పటికీ అసురక్షిత పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు.

నిజానికి గొప్ప సాహిత్యం అనేది కేవలం కాలక్షేపానికే పరిమితం కాకుండా, ఒక కాలపు సామాజిక వాస్తవాలనూ, మనిషి నిస్సహాయతనూ, నైతిక సంఘర్షణలనూ తనలో ఇముడ్చుకుంటుంది. అటువంటి సాహిత్యంలోనే ఒక కాలపు సమాజం సజీవంగా ప్రతిఫలిస్తుంది.

1943లో చాగంటి సోమయాజులు (చాసో) రాసిన ‘ఏలూరెళ్లాలి’ అలాంటి కథే. సంతానమూ, దాంపత్య అనుబంధమూ ప్రశ్నార్థకంగా మారిన ఒక స్త్రీ నైతికతకూ, అనైతికతకూ మధ్య ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొంటుందో, అసమాన వివాహం ఆమె జీవితాన్ని ఎంత సంక్లిష్టం చేయగలదో ఈ కథ ఆవిష్కరిస్తుంది.

ఈ కథలో పద్దెనిమిదేళ్ల కాలేజీ విద్యార్థి పురుషోత్తానికీ, ముప్పై ఆరేళ్ల గృహిణి మాణిక్యమ్మకూ మధ్య శారీరక సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మాణిక్యమ్మ భర్త అరవై ఏళ్ల ఆడిటర్‌. ఆమె ఆయనకు రెండో భార్య.

కొంతకాలం రహస్యంగా సాగిన వీరి సాన్నిహిత్యం, ఆడిటర్‌కు బదిలీ కావడంతో తెగిపోతుంది. తొమ్మిదేళ్ల తర్వాత రైల్లో ఇద్దరూ ఆకస్మికంగా కలుసుకుంటారు. అప్పటికే పురుషోత్తానికి పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉంటారు; మాణిక్యమ్మ భర్త మరణించడంతో ఆమె వితంతువై ఉంటుంది. అప్పుడే తమ మధ్య సాగిన సంబంధం వల్ల తనకు ఒక కొడుకు పుట్టాడని మాణిక్యమ్మ పురుషోత్తానికి చెబుతుంది.

మొదట్లో ఇదో వివాహేతర సంబంధం కథలా కనిపిస్తుంది. కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే, ఈ కథ కేంద్రంలో కేవలం శారీరక సాన్నిహిత్యమే లేదని అర్థమవుతుంది. సంతానం, వితంతుత్వం, ఆస్తిపై భద్రత, అసమాన వివాహం, స్త్రీ శారీరక–భావోద్వేగ అవసరాలు, ప్రేమ, జ్ఞాపకం, నైతికత లాంటి ఎన్నో అంశాలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి.

కాబట్టి కథని ఏ ఒక్క కోణంలోనో కుదించటం దాని సంక్లిష్టతను తగ్గించినట్టే అవుతుంది.

పురుషోత్తం తన గతాన్ని తలుచుకుంటూ, మాణిక్యమ్మతో గడిపిన కాలాన్ని ఓ మధుర జ్ఞాపకంగా గుర్తు చేసుకోవడంలో ప్రేమ, మోహం, శారీరక సాన్నిహిత్యంతో కూడిన అనుభూతులు కనిపిస్తాయి.

అయితే, అదే సంబంధం మాణిక్యమ్మ జీవితాన్ని మాతృత్వం వైపు మళ్లించింది. అతన్ని మళ్లీ కలిసిన తర్వాత ఆమె పదేపదే తనకు పుట్టిన కొడుకుని చూపిస్తూ “నీ కొడుకు” అని చెప్పడం వెనుక కృతజ్ఞతా భావం ప్రతిఫలించినట్టూ, ఆ బిడ్డ తన జీవితంలో ఎటువంటి మార్పులకు కారణమయ్యాడో చెప్పాలన్న ఆతృతా కనిపిస్తాయి.

కొడుకు ఉండటం వల్లే భర్త పోయినా తనకు ఆస్తిలో వాటా దక్కిందనీ, ఒకవేళ సంతానమే లేకపోయి ఉంటే “ముండలా మూలకి కూర్చోబెట్టేవారు మరుదులు” అనీ మాణిక్యమ్మ అంటుంది.

ఈ ఒక్క వాక్యంలోనే అప్పటి సామాజిక పరిస్థితుల్లో సంతానం ఒక స్త్రీకి ఎంతటి భద్రతను కల్పించేదో కనిపిస్తుంది. సంతానం లేని వితంతువు ఎదుర్కొనే అసురక్షిత స్థితినీ, సమాజంలో ఆమె ఎదుర్కొనే అవమానాన్నీ చాసో మాణిక్యమ్మ మాటల్లోనే బలంగా చూపించాడు.

అక్కడే కథలోని అసలు సంక్లిష్టత మొదలవుతుంది. ఒకే సంబంధం ఇద్దరి జీవితాల్లోనూ రెండు వేర్వేరు రూపాలను సంతరించుకుంది.

అయితే, మాణిక్యమ్మ పురుషోత్తంతో సంబంధం ఏర్పరచుకోవడానికి సంతానం పొందాలనే ఉద్దేశం మాత్రమే ఉందని చెప్పటం కథకు ఏమాత్రం న్యాయం చేయదు. ఆమె నిర్ణయాన్ని ఒక్క నైతిక ప్రమాణంతో తీర్పు ఇవ్వటమూ సరికాదు.

ఎందుకు ఆమె ఒక అరవై ఏళ్ల వ్యక్తికి రెండో భార్యగా మారాల్సి వచ్చిందో చాసో ప్రత్యేకించి చెప్పడు. అది ఆమె వ్యక్తిగత నిర్ణయమా, కుటుంబ పరిస్థితుల ఫలితమా, ఆర్థిక అవసరమా అన్నది ఒక్క కారణంతో తేల్చలేం. అప్పటి సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే, అలాంటి పెళ్లిళ్లలో అమ్మాయిల వ్యక్తిగత ఇష్టానికి పెద్దగా విలువ ఉండేది కాదనీ, కుటుంబీకుల ప్రోద్బలం కూడా ఉండవచ్చన్నదీ ఊహించవచ్చు.

ఈ నేపథ్యంలో ఆడిటర్ పాత్రను చాసో ప్రతినాయకుడిగానో, ఆదర్శ భర్తగానో చిత్రించలేదు. వృద్ధాప్యంలో తనకంటే చాలా తక్కువ వయసున్న స్త్రీని రెండో భార్యగా చేసుకున్న వ్యక్తిగానే చిత్రించాడు.

ఆ అసమాన వివాహం మాణిక్యమ్మ జీవితంలోని సంఘర్షణలకు ముఖ్యమైన నేపథ్యంగా మారింది. దాంతో ఆమె జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే వ్యక్తిగత నిర్ణయాలతోపాటు, అటువంటి పెళ్లిళ్లను అతి మామూలైన వాటిగానే అంగీకరించిన అప్పటి సామాజిక నిర్మాణాన్నీ అర్థం చేసుకోవాలి.

మనిషికి ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగ అనుబంధం, శారీరక అవసరాలు ఇవన్నీ సహజమైన మానవ లక్షణాలు. వాటిని కోరుకోవడం తప్పు కాదు.

కానీ ఆ కోరికలు తీరకపోయినప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయమూ నైతికంగా సమర్థనీయమే అని చెప్పలేం. అదే సమయంలో, ఆ నిర్ణయం వెనుకున్న పరిస్థితులనీ పూర్తిగా విస్మరించడమూ సరైంది కాదు.

మాణిక్యమ్మ పరిస్థితిలో ఆమె శారీరక, భావోద్వేగ అవసరాలతోపాటు, సంతానం పట్ల ఉన్న ఆకాంక్షను కూడా పూర్తిగా విస్మరించలేం. భర్తతో ఉన్న వయోభేదం, దాంపత్య జీవితంలోని పరిమితులు, సంతానం లేకపోతే వితంతువుగా తన భవిష్యత్తు ఎలా ఉంటుందనే భయమూ— ఈ అన్నింటి మధ్య ఆమె జీవిస్తుంది.

ఈ నేపథ్యంలో ఆమె కోరుకున్న ఆ సంబంధాన్ని కేవలం లైంగిక కోణంలో మాత్రమే చూడడం ఎంత అసంపూర్ణమో, దాన్ని పూర్తిగా సమర్థించడమూ అంతే అసమంజసం.

పురుషోత్తం మాటల్లో మాణిక్యమ్మ పట్ల మోహం, ప్రేమ, విరహం స్పష్టంగా కనిపిస్తాయి. తనకు పెళ్లై, ఇద్దరు పిల్లలకు తండ్రైనా, ఆ జ్ఞాపకం అతనిలో పూర్తిగా చెరిగిపోలేదన్నదీ, ఆ సంబంధాన్ని కేవలం శారీరక అనుభవంగానే కాక గాఢమైన ప్రేమానుభూతిగానూ గుర్తుచేసుకున్నాడనీ తెలుస్తుంది.

యవ్వనంలో పొందిన ప్రేమ, ఆకర్షణ, శారీరక సాన్నిహిత్యం, కోల్పోయిన భావోద్వేగ ప్రపంచం— ఇవన్నీ అతని జ్ఞాపకాల్లో నిలిచిపోతూనే, కాలం ఎంత గడిచినా ఆ అనుభవం అతని మనసులో అందంగానే మిగిలిపోయింది.

అదే మాణిక్యమ్మకు ఆ సంబంధం ఆమె జీవితాన్ని మార్చిన వాస్తవంగా నిలిచింది. ఆ సంబంధం వల్ల పుట్టిన బిడ్డ ఆమె జీవన భద్రతకూ, భవిష్యత్తుకూ ఆధారంగా నిలిచాడు.

ఈ వ్యత్యాసం ఒకే సంఘటనను ఇద్దరు వ్యక్తులు తమ సామాజిక స్థితి, లింగానుభవం, జీవిత పరిస్థితుల రీత్యా ఎట్లా అర్థం చేసుకుంటారో చూపిస్తుంది.

ఇక్కడే కథలోని సున్నితమైన మానవ సంఘర్షణ కనిపిస్తుంది. అయితే, పురుషోత్తం ప్రేమను అసత్యమని గానీ, మాణిక్యమ్మ అవసరాలను కేవలం స్వార్థమని గానీ కొట్టి పారేయలేం.

ఇద్దరూ ఒకే సంబంధాన్ని తమ తమ జీవిత పరిస్థితుల వెలుగులో అర్థం చేసుకోవడం వల్ల ఏర్పడిన అనుభవాల వ్యత్యాసమే కథను మరింత సంక్లిష్టమైన మానవ కథగా మారుస్తుంది.

రైలు దిగేముందు మాణిక్యమ్మ “కుదిరినప్పుడు ఏలూరుకు రండి” అంటుంది. పురుషోత్తం “ఈ ఆదివారం వస్తాను” అని సమాధానమిస్తాడు. వెంటనే పిల్లవాడు “మీరు ఆదివారం వస్తారా?” అని ఎంతో ఉత్సాహంతో అడుగుతాడు.

చివరలో “ఏలూరెళ్లాలి” అన్న మాటతో కథ ముగుస్తుంది. ఇదే ఈ కథకు అత్యంత శక్తివంతమైన ముగింపు. పురుషోత్తం నిజంగా వెళతాడా? వెళితే మాణిక్యమ్మ కోసమా? తనకు తెలియకుండా పుట్టిన కొడుకు కోసమా? లేక గతాన్ని మరోసారి ఎదుర్కోవడానికా?

ఈ ప్రశ్నలకు కథ సమాధానం ఇవ్వదు; ఆ అనిశ్చితినే ముగింపుగా వదిలేస్తుంది. అందుకే “ఏలూరెళ్లాలి” అనే మాట గతాన్ని ఎదుర్కోవాలా వద్దా అనే అంతర్మథనానికి ప్రతీకగానూ నిలుస్తుంది. అంటే, గతం ఎవ్వరినీ పూర్తిగా విడిచిపెట్టదన్న భావనను ఈ ముగింపు మిగుల్చుతుంది.

ఇప్పటి పరిస్థితులతో అప్పటి స్థితిగతులను పోలిస్తే ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ఇప్పుడు స్త్రీలకు చట్టపరమైన హక్కులతో పాటు విద్య, ఉపాధి అవకాశాలు పెరగడంతో, ఆర్థిక స్వావలంబన కూడా పెరిగింది.

అయినప్పటికీ ఆర్థికంగా ఇతరులపై ఆధారపడిన, కుటుంబ మద్దతు లేని అనేక మంది స్త్రీలు ఇప్పటికీ అసురక్షిత పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ కథ ఒక్క చారిత్రక నేపథ్యానికే పరిమితం కాకుండా, సమకాలీన పఠనానికీ అవకాశం కల్పిస్తుంది.

వ్యక్తిగత కోరిక, కుటుంబ బాధ్యత, నైతికత, సామాజిక అవసరం— వీటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి అన్న ప్రశ్న ఉదయించినప్పుడు, దానికి ఒకే సమాధానం చెప్పటం సరైంది కాదు. ఎందుకంటే చట్టం, నైతికత, వ్యక్తిగత కోరిక, సామాజిక అవసరం ఎప్పుడూ ఒకే దిశలో పోవు.

ఈ కథ ప్రత్యేకత కూడా ఇదే. చాసో తన పాత్రలను తన అభిప్రాయాలకు ప్రతినిధులుగా మార్చడు. వారి జీవితాల్లోని నిర్ణయాలనూ, వాటి పరిణామాలనూ పాఠకుడి ముందుంచుతాడు. వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లాంటి విలువల కొలమానంతో చూడాలి అన్నది పాఠకుడికే వదిలేస్తాడు.

అందుకే చాసో కథలు చదివిన వెంటనే ముగిసిపోవు; కొత్త చర్చలకూ, విభిన్నమైన వ్యాఖ్యానాలకూ దారితీస్తాయి.

*

బాలాజీ పోతుల

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా గొప్ప కథ. నేను 30ఏళ్ల కింద చదివాను.ఎక్కడ సూటిగా చెప్పకుండా, అంతర్లినంగా చెప్తారు…ఆలోచింపచేస్తుంది.చాలా సున్నితంగా చెప్తారు కథనం. మంచి విశ్లేషణ…

  • బాలాజీ చాలా బాగా రాసావ్. ఈ కధ మీద ఇంత చక్కటి విశ్లేషణ ఇప్పటి దాకా ఎవరూ చెయ్యలేదు, నాకు తెలిసి. అయితే కుర్రాడితో ఇంగ్లీష్ మాట్లాడే పార్శ్వం కూడా స్పృజింజి ఉండాల్సింది. అదీ చిన్న విషయం కాదు. ఏ నైతికత, కట్టుబాట్ల కన్నా గౌరవమైన బతుకు ముఖ్యం. ఈ సారి ఏలూరు శారీరిక సంబంధం కోసం కాకుండా పిల్లాడికి ఓ తండ్రి స్థానం కోసం రమ్మనట్టుంది అనిపించింది నాకు. Thank you for the good article. Keep it up.

    • Thank you, Mohan gaaru. చాసో కథల్ని ఎంత విశ్లేషించినా ఎంతో కొంత స్పృశించని కోణమో, పార్శ్వమో తప్పకా ఉంటాయి. అయితే, నేను అర్థం చేసుకోవడంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. మీరన్నట్టు, ఇంకా కొన్ని పార్శ్వాలని స్పృశించాల్సింది. అది ఇంకో కథ విశ్లేషణలో తప్పకా పూరించుకుంటాను.

  • బాలాజీ చాలా బాగా రాసావ్. ఈ కధ మీద ఇంత చక్కటి విశ్లేషణ ఇప్పటి దాకా ఎవరూ చెయ్యలేదు, నాకు తెలిసి. అయితే కుర్రాడితో ఇంగ్లీష్ మాట్లాడే పార్శ్వం కూడా స్పృజింజి ఉండాల్సింది. అదీ చిన్న విషయం కాదు. ఏ నైతికత, కట్టుబాట్ల కన్నా గౌరవమైన బతుకు ముఖ్యం. ఈ సారి ఏలూరు శారీరిక సంబంధం కోసం కాకుండా పిల్లాడికి ఓ తండ్రి స్థానం కోసం రమ్మనట్టుంది అనిపించింది నాకు. Thank you for the good article. Keep it up.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.