చాలా నేర్పిన అమ్ముమ్మ!

నిజమే మరి…వాడుకోవడమే కాని గౌరవించడం రాని సంఘం లో, వాడుకోబడేవారి బాధ, దుఃఖం అర్థం కావు చాలా మందికి.

మా అమ్మ వేమూరి మధుర మీనాక్షి కి, మా నాన్న గాలి బాలసుందర రావు గారికి పది సంవత్సరాల తేడా. పద్నాలుగేళ్ళ మధుర మీనాక్షి ఓవర్ సీర్ వేమూరి  రంగనాయకులు గారి అమ్మాయి. రంగనాయకులు తాతయ్య గారికి రెండు వివాహాలు జరిగాయి. మొదటి భార్య పేరు మధుర మీనాక్షి- ఆవిడకు ఒక కూతురు, నలుగురు కొడుకులు. మొదటి భార్య చనిపోయిన తర్వాత ఆ సంస్థానాన్ని మానేజ్ చెయ్యటానికి – అప్పటికే నలభైయవ పడిలో ఉన్న తాతయ్య – పెంపుడు తల్లి సెలక్ట్ చేస్తే పదకొండేళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు. ..ఆవిడ పేరు సరస్వతి.

అప్పుడే ఈడేరి కాపురానికి వచ్చిన ఆ పద్నాలుగేళ్ళ పిల్లకు తన కన్న వయసులో పెద్దవాళ్ళైన కొడుకులు, తన ఈడు కూతురు , తండ్రి వయసు భర్త…బాల్య వైధవ్యం తో సినిసిజం, శాడిజం తో శాసించే నైజమున్న అత్తగారు ( భర్త పెంపుడు తల్లి ), ఇంటినిండా పనివాళ్ళు.

ఆమె కాపురానికి వచ్చేప్పటికి పసిబిడ్డ గా ఉన్న సవతి బిడ్డ కు తల్లిని మరపించడానికి -ఈమె తల్లి అని నమ్మించడానికి , ఈవిడకు సరస్వతి అన్న పేరు మార్చి మీనాక్షి అని పిలవడం ప్రారంభించారు భర్త, అత్తగారు.

అలా మా అమ్ముమ్మ మీనాక్షి…ఆవిడకు పుట్టిన మొదటి ఆడపిల్లకు పెద్ద భార్య పేరు పెట్టారు తాతయ్య – అందుకని మా అమ్మా మీనాక్షి..మధుర మీనాక్షి …నేను మా పెద్ద అమ్మాయికి మా అమ్మ పేరు పెట్టుకున్నాను కాబట్టి తనూ మధుర మీనాక్షి.

మా అమ్ముమ్మ జీవితంలో దుర్భరత్వం ఎవరూ చెప్పలేదు …కానీ – గమనిస్తే, నాకే కాదు …ఎవరికైనా అర్థమైపోతుంది. కదిలితే తప్పు …మెదిలితే భయం. తనకన్న పెద్దవాళ్ళైన సవతిపిల్లలను ఈవిడ ” పెంచాలి ” – అంటే ఏమిటో అర్థం కాని వయస్సు, అత్త గారి దాష్టీకం..పల్లెత్తి పల్లెత్తి మాట అనే ధైర్యం కానీ నాకు ఇది ఇష్టం అని చెప్పే అధికారం కానీ లేదు. వంద కాసుల బంగారం అలంకరణ తో బరువైన మట్టెలతో గోచిపోసి కట్టుకోవలసిన ఏడుగజాల చీర తో సతమతమయ్యే ఆ టీనేజ్ అమ్మాయికి దాదాపు ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికే ముగ్గురు పిల్లలు. మొదటి అమ్మాయి మధుర మీనాక్షి, రెండవ అమ్మాయి కామేశ్వరి, మూడవ బిడ్డ – అబ్బాయి, హనుమంతరావు.

ఓవర్సీర్ గారి భార్య అన్న హోదా ! భర్త సంపాదనపరుడవటం వలన  ఎక్కడెక్కడి బంధువులూ అక్కడే భోజనాలు…వారందరికీ ఈ అమ్మాయి మాటపడకుండా మర్యాదలు చెయ్యాలి. పుట్టింటి అండ తక్కువ అవడం వల్ల దుఃఖం, బాధ, అవమర్యాద పంచుకునే దిక్కులేని మా అమ్ముమ్మ దగ్గర నేను, మా పిన్ని పిల్లలు ఎన్నో నేర్చుకున్నాము. ప్రేమగా, తృప్తిగా భోజనం పెట్టడం, అతిథులను ఆదరించడం, శుభ్రంగా సున్నితంగా ఉండడం, వస్తువుల జాగ్రత్త- బాధ్యత …ఇందులో ఏవో కొన్ని నేర్చుకున్నామేమో. కానీ ఇన్ని ఉన్న మా అమ్ముమ్మ మా లెఖ్ఖ ప్రకారం ఏనాడూ సుఖపడలేదు.

భర్త పోగానే – ఏ కారణాల వల్లైనా ఆస్తి హక్కులు పోయిన ఆమె – పెళ్ళైన పిల్ల, పెళ్ళి కావలసిన పిల్ల, పసివాడైన కొడుకుతో 30 ఏళ్ళకే ఒంటరిగా నిలిచిపోయింది. అప్పటి జీవనవిధానాన్ని గురించి ఆలోచిస్తే ఈ ఒంటరి మనిషి ఎన్ని దుఃఖాలు, బాధలు, అవమర్యాదలు మౌనం గా తట్టుకుంటూ , ప్రేమించి ఆదరించడం మర్చిపోకుండా ఎలా బ్రతికిందా అన్నది ఒక స్టడీ సబ్జెక్టు.  ప్రతి విషయానికీ విసుక్కునే ఈనాటి పిల్లలకు అమ్ముమ్మ జీవితం పాఠ్యగ్రంథాలలో పెట్ట్లనిపిస్తుంది.

” ఏం చేస్తుంది పాపం ?! ఆ కాలం లో ఏ దారీ లేదు, అనుభవించింది. అదే ఈ కాలంలో అయితేనా ?! ” అంటారేమో ఈ కాలపు పిల్లలు.

ఆవిడ కష్టాలు, దుఃఖాలు, దిక్కులేనితనం అనుభవించినమాట నిజమే . కాని ఆ ప్రాసెస్ లో నలిగిన ఆవిడ చిరునవ్వు, మమకారం, సేవ, ఆత్మాభిమానం పోగొట్టుకోకుండా ఎలా ఉండగలిగిందో ఆ ప్రాసెసింగ్ ఏమిటో నేర్చుకోవాలి కదా మరి ?! దాని గురించి ఎవరూ ఎందుకు ఆలోచించరా అనిపిస్తుంది.

జలంధర గారి పెళ్ళి ఫోటో

పెద్ద అల్లుడైన మా నాన్న గారు డాక్టరు, కళాకారుడు. సంఘసేవ, పతిత జనోద్ధరణ, వితంతువివాహాల ప్రోత్సాహం, రచన…ఒకటేమిటి, ఇన్ని’’ కళలు ‘’న్న వ్యక్తితో తన కూతురు సుఖపడడం కష్టమని త్వరలోనే గ్రహించుకున్నది మా అమ్ముమ్మ.

ఆ కాలంలో ముఖమల్ జాకెట్ లకు, ముఖమల్ చెప్పులకు మంచిముత్యాలు కుట్టించుకునేదట మా అమ్మ. వందకాసుల బంగారం బాలతొడుగు ఉండేది. ఇంట్లో కంసాలిని పెట్టి మేలిమి బంగారంలో టంకం ఎంత కలపాలో స్వయంగా నిర్ణయించే తాతయ్య – భార్యను, పిల్లలను ప్రేమించడం అంటే అదే అనుకున్నారు. ఇంట్లో గాడిపొయ్యిలు పెట్టి కంచు  కరిగించి – అమ్మకు, ఆమ్మకు హరణానికి కంచు గిన్నెలు, ఆపకారలు …ఇవి పోతపోయించేవారు తాతయ్య.

 ఆ గిన్నెలు , చెంబులు – ఆ 1920-30 లలో తయారైనవి – ఆ తరం దాటి ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. స్టీల్ సామాను మీద మోజు ఎక్కువైన కాలం చూసిన మా అత్తగారు – ” సగం సిలెండర్ అయిపొతుంది వాటితో వండితే ” అని నా చేత స్టీలు గిన్నెలు సెట్లు సెట్లుగా కొనిపించారు. అటక ఎక్కిన ఆ గిన్నెలు , మర చెంబులు, ఆపకారలు – ఆయుర్వేదం డాక్టర్ అయిన మా చిన్న అమ్మాయి బాలమాధవి ఇన్నాళ్టికి తీసి వాడుతోంది… ” వాటిలో ఉంచితే ఆ రుచే వేరు…ఆ గిన్నెలలో నిలవ ఉంచి తాగితే ఆ నీటి సువాసనే వేరు ” అని.

 ఇన్ని తరాలు చూసిన ఆ గిన్నెలకే భావప్రకటన చెయ్యడం వస్తే – ఎన్ని విభ్రమాలు, ఎన్ని విందులు, ఎన్ని బాధ్యతలు ఆడవారు వహించేవారో చెప్తాయి కదా అనిపిస్తుంది.

మా అమ్ముమ్మకు కష్టాలు, బాధ్యతలు అంత త్వరగా తీరలేదు.

వైధవ్యం, ఆర్థిక బాధలు – వీటి మధ్య చిన్న కూతురు పెళ్ళీడుకు వచ్చింది. బంగారుబొమ్మ లాగా ఉండే మా పిన్నికి పెళ్ళి చూపులు జరిగాయి. వాళ్ళది పెద అవుటపల్లి. ఈ హేమసుందరి కామేశ్వరీ సీతను ఒక శ్యామసుందరుడైన మా బాబాయి దామరాజు సీతారాముడికి ఇవ్వడానికి తాంబూలాలు పుచ్చుకున్నారు. నెమలి రంగు చీర కట్టుకుని  తళ తళ మెరిసిపోయే ఈ బంగారుతల్లి ప్రేమలో ఠపీమని పడిపోయిన బాబాయి – కట్నాలు కానుకలు అని మరీ ఇబ్బంది పెట్టకుండా, నిరంకుశులైన తన తండ్రిని ( కరణం గారు ) మాట్లాడనీయకుండా , పెళ్ళిచేసుకున్నారు.

” నేను ఏనాడూ మా నాన్న గారి మీద ఆధారపడలేదు. నెలకు నాలుగు రూపాయలు పంపితే రామకృష్ణమఠం లో ఉండి చదువుకోవడం వరకే…ఆ తర్వాత నా బ్రతుకు నేనే బ్రతికాను. నేనెవరిమాటా వినఖ్ఖర్లేదు – ఎందుకంటే నేను ఎవరి సొమ్ముకూ ఆశపడి దాసోహం అనలేదు కాబట్టి. అందుకే మొగవాడికి స్వాభిమానం ఉండాలి…ఆధారపడి అడుక్కు తినే తన బ్రతుకు వల్లే పెళ్ళాన్ని బానిస చేస్తాడు. నాకిష్టమొచ్చిన అమ్మాయిని , పోరాడి చేసుకోగలిగాను ” అని చెప్పే మా సీతారాం బాబాయి – జీవితమంతా ముక్కుసూటిగా, నిజాయితీగా , ఏ మాత్రం మార్పు లేకుండా – మాట కఠినమైనా మనసు వెన్న లాగా …బ్రతికారు. ఆనాటినుంచి చివరిక్షణాల వరకూ మా పిన్ని మీద ఆయన ప్రేమలో, ఇష్టం లో ఏమాత్రం మార్పు రాలేదు.

అందుకే అత్తగారైన మా అమ్ముమ్మను, బావమరిదిని ఇంట్లో పెట్టుకుని ఆదరించారు. తొమ్మిది కాన్పులు, అనారోగ్యాలతో మా పిన్ని చాలా బాధపడేది. కాని – సేవ, శుభ్రం, ఎదుటివారి అవసరం గ్రహించగల నేర్పు ఉన్న మా అమ్ముమ్మ ఆవిడకు కొండంత అండ ఇచ్చేది.

కప్పీ బట్టలు తయారు చేసేది ( అప్పటికి డైపర్లు రాలేదు ). పిల్లలకు వాడిన బట్టలు తను తప్ప ఎవర్నీ ఉతకనిచ్చేది కాదు. తెల్లటి బట్టలు, ఎఱ్ఱటి ఎండలోక్లిప్పు లు పెట్టించుకుని, ప్రాణం ఉన్నదా వాటికి అనిపించేటంత జీవం తో అందం గా ఉండేవి. ఆ తరవాత వాటి మీద చందనమో, జవ్వాది పౌడరో లేక మామూలు పౌడరో చల్లి బొత్తులు పెట్టేది. అవి అల్మర లో అంత నిండుగా కనిపిస్తే కడుపు నిండినట్లు అనిపించేది. ఎప్పుడు చూసినా , తెల్లటి పొత్తిగుడ్డల్లో సుతారం గా, మురిపెంగా పట్టుకుని పిల్లల్ని చూపిస్తుండేది అమ్ముమ్మ.

” పిల్లలు అన్నం మెతుకులమ్మా ! చిమిడిపోతారు …” అనేది. పసిబిడ్డల వస్తువులన్నీ అంత శుభ్రం గానూ ఉంచేది. ప్రతి వస్తువూ షోకేస్ నుంచి అప్పుడే వచ్చినట్లు ఉండేది. గుచ్చుకునే నగలు పెట్టనిచ్చేది కాదు. పిల్లలు బోర్ల పడేదాకా ముందు గుండీ ల చొక్కాలు కుట్టేది, కుట్టించేది.  

పసిబిడ్డల తండ్రులందరికీ అమ్ముమ్మ కనిపిస్తే నిశ్చింత. పాల బాటిళ్ళు ఉడకపెట్టడం దగ్గరనుంచీ ఆవిడ దగ్గర హైజీన్ పాఠాలు నేర్చుకోవాలనిపించేది. మాకు పురుళ్ళు పోసిన లేడీ డాక్టర్ లకు అమ్ముమ్మను చూస్తే చాలా ఇష్టం, ముచ్చట. ” మా హాస్పిటల్ లో ఉండిపోకూడదా మీరు, ఉద్యోగం ఇస్తాను ” అనేవారు డాక్టర్ మధుర నాయకం.

బాలింతలుగా ఉండే బాధ్యతలు ఉండవు అమ్ముమ్మ ఉంటే. పసిబిడ్డల తర్వాతే నిద్రాహారాలు ఆవిడకు. వాళ్ళే దేవుళ్ళు అనేది. పూజలు, పునస్కారాలు ఎక్కువ చేసేది కాదు. సేవ ఆవిడ లో ప్రత్యేకత.

 అటువంటి అమ్ముమ్మ చాలా కష్టాలు,  అవమర్యాదలు పడింది…అసూయలు భరించింది…దాచుకున్న దుఃఖం చాలా ఉండేది. కానీ..ఏనాడూ..why me అనుకునేది కాదు.

అమ్ముమ్మ చిల్లర చాలా ఫేమస్. పొడుగాటి మాత్రల డబ్బాల్లో నాలుగణాలు, ఎనిమిది అణాలు, రూపాయి నాణాలు విడి విడి గా పొట్లాలు గా మడిచి  దాచేది. ఎప్పుడు చూసినా చిల్లర ఇచ్చే బ్యాంకు ఆవిడ.

ఆ కాలం లో శనివారాలు ఫలహారాల అలవాట్లు ఉండేవి. మిక్సీలు, గ్రైండర్ లు లేని కాలం లో మా అమ్ముమ్మ శనివారాలు ఇడ్లీలు, కారప్పొడి, చట్నీ చేసేది. అంత మృదువైన ఇడ్లీలు, పచ్చడి దొరకడం చాలా రుదు. చుట్టాలకు స్నేహితులకు శనివారమప్పుడే బాబాయి, పిన్నిని చూడాలని ఎందుకనిపించేదో ఆ చిన్నతనమప్పుడు అర్థం కాలేదు. కానీ సీతారామయ్య గారింట్లో ఇడ్లీ సంతర్పణ…మనిషికి నాలుగైదు ఇడ్లీలు కొసరి కొసరి తినిపించే   ఇంట్లో …” అంత మినప్పప్పు, ఇడ్లీ బియ్యం ఎవరు రుబ్బేవారు ? ఎవరు ఇడ్లీలు వేసేవారు ? ” అని ఎప్పుడూ ఆలోచించలేదు.
ఎన్ని కిలోల మినప్పప్పు, ఎన్ని బస్తాల బియ్యం రుబ్బిందో అమ్ముమ్మ ?! అంత మెత్తగా ఎలా చేసేదో?!

” మా ఇంట్లోలాగా గోడక్కొడితే గోడ విరిగే ఇడ్లీలు చేస్తే మిమ్మల్ని ఇలా బాధ పెట్టం కదా పిన్ని గారూ ! ” అని పెళ్ళాల మీద జోక్స్ వేస్తూ పొగిడి ఇడ్లీలు తినేసే జనాలను చూసి నిట్టూర్చేది. ” ఆవిడ చేసి పెట్టకుండానే నీకు రోజులు గడుస్తున్నాయా ? ఇలా మాట్లాడితేనే ఒళ్ళు మండుతుంది ఆ పిల్లకు ” అని చీవాట్లు పెట్టేది.

” రుచులు తెలిసే జనానికి ఎదటివాళ్ళ శ్రమ తెలియదే ” అనేది. ” ఇంట్లోవాళ్ళకు – మనుషులు అర్ధాంతరం గా వచ్చి అన్నీ అమర్చిపెట్టి  అంతర్థానమైపోవాలి…పలకరిద్దామనుకోరు ” అని బాధ పడేది.
నిజమే మరి…వాడుకోవడమే కాని గౌరవించడం రాని సంఘం లో, వాడుకోబడేవారి బాధ, దుఃఖం అర్థం కావు చాలా మందికి.

అల్లుడు గాలి బాలసుందర రావుతో…

స్వాభిమానం గల అమ్ముమ్మ ఒక్కపూటే భోజనం చేసేది..రెండు మూడు సార్లు కాఫీ తాగేది అంతే. చిన్న వయసునుంచీ అంత కఠోర నిర్ణయం ఎందుకు తీసుకుందో అప్పుడు తెలియదు కానీ , ఆ తరవాత ” మాట పడని మూర్ఖులు మూడుపూటలా కంచాలు బద్దలు కొట్టుకుంటారు ” అని ఎవరో ఆవిడను అన్నారని విన్నాను. మాటపడని ఆవిడ పౌరుషం, అభిమానం …మా అమ్మకు హరణం గా వచ్చింది.

” సర్దుకుపోవడం రాని ఆడది…మహా పౌరుషం, అభిమానం ” అని మా బామ్మగారు వియ్యపరాల్ని నిందాస్తుతులు చేసేది.  కానీ , ” భలే మనిషి…మీనాక్షమ్మ అంటే బంగారం ” అని శత్రువర్గం చేతా అనిపించుకున్నది అమ్ముమ్మ.

” నవ్వుతూ చేస్తాము – ఏడుస్తూ అనుభవిస్తాము. వేప విత్తనాలు వేసి మామిడికాయలు రమ్మంటే ఎలా వస్తాయి ?! మన పూర్వ జన్మ లో శత్రువులు పిల్లలుగా పుట్టి కచ్చ తీర్చుకుంటారమ్మా ! శిరస్సు నుంచి శ్రీపాదాల దాకా సేవ చేయించుకుంటారు. చిన్నప్పుడు చిట్టి పాదాలతో, పెద్దైన తరవాత గట్టి మాటలతో – గుండెల మీద తంతారు…భరించవలసిందే !
ఎట్లాంటి మగవాడికి పిల్లల్ని కంటున్నాము అని ఆలోచించే స్వాతంత్ర్యం ఆడదానికి ఇవ్వరుగా. అదే రక్తం…ఆ తరవాత తరం కూడా అవే లక్షణాలు మరి…ఒక తానులో ఉన్నట్లుండి పట్టుగుడ్డ ఎట్లా వస్తుంది ? ”

ఇవన్నీ అమ్ముమ్మ దగ్గర నేర్చుకున్న జీవితసత్యాలు. ” నీ దగ్గర హాయిగా ఉంటుందే జిజ్జీ ” అని ప్రేమగా అనే అమ్ముమ్మను ” నా దగ్గర ఉండిపో అమ్ముమ్మా ” అనే పరిస్థితి కాదు నాకు  అప్పుట్లో . ఆ విషయం జీవితాతంతమూ బాధ పెడుతూనే ఉంటుంది.

కాన్సర్ వచ్చి మామయ్య ఇంట్లో ఉన్న అమ్ముమ్మను ఆఖరిసారి చూడటానికి వెళితే, ఒళ్ళంతా తడిమి ముద్దు పెట్టుకుని వందరూపాయలు ఇచ్చి – ” నా తల్లి….చీర కొనుక్కో ” అని దీవించిన,  ప్రేమమయి అయిన ఆ పిచ్చితల్లి నాకు చాలా నేర్పించిన గురువుల్లో ఒకరు.

*

జలంధర

జలంధర

కేవలం ఒక వాక్యంలో వొదగని అనుభవ విస్తృతితో రాస్తారు జలంధర. తెలుగు మాటలకు "పున్నాగ పూల" తావిని అద్దిన వారు. జీవితాన్ని జీవితంతోనే వ్యాఖ్యానించాలన్న సహజ సౌందర్య జిజ్ఞాసి.

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • గొప్ప మనిషి ఆవిడ.నాకూ మా అమ్మమ్మ గుర్తొచ్చింది.వాళ్ళ అమ్మ గురించీ ఇలానే బోలెడు విషయాలు చెప్పేది.అప్పటి తరం మమతలూ… వ్యక్తిత్వాలూ గొప్పవి. మనసుకు హత్తుకునేట్టుగా రాశారు. ధన్యవాదాలు.

 • చిన్నప్పుడు చిట్టి పాదాలతో, పెద్దైన తరవాత గట్టి మాటలతో – గుండెల మీద తంతారు…భరించవలసిందే !
  తప్పదుగా మరి!
  మళ్ళీ మరో సారి, పిల్లలు, మధురనాయగం, డాక్టరు గారు ఆ ఇల్లు, ఆ ప్రాంగణం అలా కళ్లముందు కదలాడినవి!

  • మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది .ఆమెదగ్గర నేను చాలా నేర్చుకున్నాను .మాట పడని మనిషి.కృతజ్ఞతలు జలంధర గారు.ఆమె ఆత్మాభిమానం అర్ధం కాక కచ్చ మనిషి అనేవాళ్ళు .గుండె పట్టేసిందండి

 • Jalandhara Ammaku namaskaram. ఆవిడ చిరునవ్వు, మమకారం, సేవ, ఆత్మాభిమానం పోగొట్టుకోకుండా ఎలా ఉండగలిగిందో ఆ ప్రాసెసింగ్ ఏమిటో నేర్చుకోవాలి. Anta difficult irritating situations lo still she dint loose these qualities is a lesson for me Amma????. Thank you for sharing Amma. Family vishayalalo kuda inta nijalu rasina mee dhairyam and deeper understanding n compassion ki hatsoff and dhanyavadalu. Amma vallani ammammalani granted ga nenu kuda chusanu ani oka guilt kaligina kuda vari patla gratitude n vallani artham chesukune alochananu malo kaliginchinanduku thank you . After marriage gratitude towards intlo vallu ante ento artham ayyindi????

 • జలంధరమ్మా!

  వ్యక్తిగా, సాహితీమూర్తిగా, సృజనాత్మక-తార్కిక-తాత్వికతలతో నిండి నిండుకుండలా తొణకని వారిలా మీరింతలా ఎలా ఎదిగారు అనే నా ఆశ్చర్యానికి . . . ఆ తరం పెద్దల తావి అబ్బిన బంగారానివి కదా అని అనుకున్నా నిన్నాళ్ళూ. గురువుగా మిమ్మల్ని తీర్చిదిద్ది, దీవించిన మీ అమ్మమ్మ కూడా ఆ తరం వాళ్ళల్లో ఒకరు అని తెలుసుకుని మురిసిపోతున్నాను.

  పైనున్న కుఠోలో, మబ్బుల చాటునున్న సందమావలా, మెళ్ళో పూలదండతో ఉన్నవారు … మీ శ్రీవారు … ఆంధ్రుల అభిమాన సినీనటుడు చంద్రమోహన్ గారు అని రాయలేదెందుకూ ?! కొ.కు. నాయన (కొడవటిగంటి కుటుంబరావు), భానుమతి అమ్మలతో మీరున్న ఫోటోలు కూడా చూడాలని ఉంది.

  ~ ఓ నేలక్లాసు పాఠకుడు

 • ఆనాటి అమ్మమ్మల, నాన్నమ్మల కథలు ఈనాటి అమ్మాయిలకి పెళ్ళికి ముందు పాఠాలుగా ఓ కోర్స్ పెడితే బాగుండును ఎవరైనా! మీ అమ్మమ్మగారికి వేవేల జేజేలు!

 • యవ్వనంలో విధవరాలు అయిన అమ్మమ్మ నల్లటి పొడుగాటి జుట్టు తెల్ల బడాలని వయసు పెరిగినట్లు కనబడాలని బట్టల సోపుతో తల రోజూ రుద్దుకుని తల స్నానం చేసేది.ఆ వ్యధ వెనకాల బాధ చాలా రోజులు మాకు అర్ధమయ్యేది కాదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు