కొత్త ఏడాది కొత్త అడుగులు!

1

“సారంగ” పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఇట్లా వొక్కో సంవత్సరమూ వచ్చి వెళ్లిపోవడం మనకు అలవాటే. కానీ, 2020 అట్లా వూరికే వచ్చి వెళ్లిపోతున్న ఇంకో సంవత్సరం కాదు. మానవచరిత్రలో ఇదొక విషాద పుటగా మిగిలిపోతుంది. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నప్పుడు ఎంతో కొంత సంతోషం మూటగట్టుకొని, హ్యాపీ న్యూ ఇయర్ అన్న మూడక్షరాల కేక వేసేవాళ్లం. కానీ, ఈసారి మన కేకలో అంత సంతోషం వుంటుందా అన్నది సంశయమే.

ప్రతి సంవత్సరం కన్నా 2020 మన మధ్యలోంచి ఎక్కువ మంది స్నేహితులని తనతో పాటు తీసుకువెళ్లిపోయింది. అట్లా వెళ్ళిపోయిన వాళ్ళలో కుటుంబ సభ్యులతో పాటు మనకెంతో ఆత్మీయమైన కవులూ రచయితలూ వుద్యమ జీవులూ వున్నారు. ఇంకా కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్లూ వున్నారు.

ఈ మరణాల్ని ఎట్లా జీర్ణం చేసుకోవాలో ఇంకా మనకు తెలియని సందర్భంలో 2021 వస్తోంది. ఇప్పటికే అనేక దూరాల మధ్య బతుకుతున్న మనకు 2020 నేర్పిన పాఠాల్లో అతిపెద్దది—భౌతిక దూరం పాటించడం! మానసిక దూరం అలవాటు అయినంతగా భౌతిక దూరం అలవాటు లేదన్నది నిజం. మనమంతా సమూహాల్లో బతికే వాళ్ళం. సమూహం అవతలి బతుకు మనకి కనాకష్టంగా వుంటుంది. వూహించలేనిది కూడా!

అట్లాంటి స్థితిలో సాహిత్యం ఏం చేస్తుంది?

సాహిత్యానికి ఊహ – imagination- ప్రాణం. అట్లా అని అది నేలవిడిచి సాము కాదు. నేలలో పాతుకొని వుండే వూహ. ఆ మాటకొస్తే, ఆ రెండీటికీ మన సాహిత్య ప్రపంచంలో అంతగా దూరం లేదు. వాటిని కలగలిపే ప్రయత్నమే సాహిత్యం అని మొదటి నుంచీ నమ్ముతూ వస్తున్న వాళ్ళం. కానీ, దూరం అనేది సామాజిక నియమం అయినప్పుడు దాన్ని ఎట్లా స్వీకరించాలి? అది సాహిత్యంలో కూడా ప్రతిబింబిస్తుందా?

అనుకున్నట్టుగానే- ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో బోలెడు కవిత్వమూ కథలూ వచ్చాయి. వాటన్నీటినీ వొక చోట కూడబెట్టి, చదువుతున్నప్పుడు మానసిక ప్రపంచంలో ఎట్లాంటి సంచలనాలు కలుగుతున్నాయ్? వాటిల్లోంచి మనం నేర్చుకోదగిన బతుకు పాఠం ఏదైనా వుందా?! ఆ ప్రశ్నకు సమాధానం ఎవరికి వాళ్ళే వెతుక్కోవాల్సిన సందర్భం ఇది.

2

కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ కొత్త వాగ్దానాలు చేసుకోవడం మనకి పరిపాటి. గతంలో కంటే ఈ ఏడాది సారంగ చదువరుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇది 2019 కంటే రెండింతలు పెరిగింది. అట్లాగే, సారంగకి రచనలు పంపించే వారి సంఖ్య కూడా అనేక రెట్లు పెరిగింది. సగటున ప్రతి రోజూ సారంగ కి పదిహేను కవితలు, అయిదు కథలూ వస్తున్నాయి. సాధారణంగా చాలా పత్రికలు ముఖ్యంగా సాహిత్య పత్రికలు తగినన్ని వ్యాసాలు రావడం లేదని బాధపడడం ఆనవాయితీ. కానీ, సారంగకి ఈ ఏడాది వ్యాసాల తాకిడి కూడా బాగానే పెరిగింది. అంటే, వొక మోతాదు అచ్చు పత్రిక నిర్వహణకి కావలసిన సిబ్బందీ సరంజామా సమకూర్చుకోవాల్సిన స్థితిలో సారంగ వుంది.

ఈ పత్రిక ప్రస్తుత ఎడిటర్లు ముగ్గురూ క్షణం తెరిపి ఇవ్వని వేరే ఫుల్ టైమ్ వుద్యోగాలు చేస్తున్న వాళ్ళు. అట్లాగే, ఇంకా కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోతున్న వాళ్ళు. అయినప్పటికీ, సారంగ ఏనాడూ ఆలస్యం కాలేదు. ప్రతి నెలా వొకటో తేదీన, పదిహేనో తేదీన మీ నెట్టింట్లో సారంగ సిద్ధంగా వుంటోంది. అందువల్ల పనిభారాన్నితగ్గించుకోడానికే కాకుండా, ప్రామాణికమైన రచనలు అందించడానికి వీలుగా ప్రతి రచనకీ పీర్ రెవ్యూ (అంటే ప్రతి రచననీ ముగ్గురు బయటి వారితో చదివించే పని)కి పంపిస్తున్నాం. ఈ క్రమంలో రచనల ప్రచురణ ఇంతకుముందు మాదిరిగా వెంటవెంటనే చేయలేకపోతున్నాం. మేం చదవడంతో పాటు, ఆ ముగ్గురూ చదివి, తమ తమ అభిప్రాయాల్ని పంచుకోవడంలో ఆలస్యం తప్పడం లేదు. ఈ లోపు తమ రచన రాలేదన్న అసహనం కొందరికీ, తమని పొగిడే వ్యాసాలో ఇంకొకటో లేవన్న అసంతృప్తి కొందరికీ—తప్పడం లేదు. సహనం వహించవలసిందిగా కోరడం తప్ప మేం చేయగలిగిందేమీ లేదు!

3

ఈ కొత్త సంవత్సరం సారంగలో క్రమంగా అనేక మార్పులు రావడం మీరు నెమ్మది మీద గ్రహిస్తారు. ఈ నెలలోనే కొన్ని కొత్త శీర్షికలు మీకు పరిచయం చేస్తున్నాం. కొన్ని పాత శీర్షికలకు సెలవు చెప్తున్నాం కూడా! కొత్త శీర్షికలు ఎట్లా వున్నాయో మీ అభిప్రాయాలు తప్పక రాయండి.

*

అఫ్సర్

7 comments

Leave a Reply to మూర్తి chalumuri Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సద్విమర్శ లను స్వీకరించే దృక్పథం లేని వారు రచయితలు కానేరరు. పొగిడే వ్యాసాల కన్నా లోటుపాట్లను సరిదిద్ద గల విమర్శ అవసరం ఎంతైనా ఉంది

  • సారంగ కు సారంగ దిగ్విజయంగా నడుపుతున్న మీ ముగ్గురికీ హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • సారంగ టీమ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సారంగ కొత్త సంవత్సరంలో కొత్త శీర్షికలతో మరింత ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను.

  • సారంగ చదవడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. మొత్తం సంచిక చడవలేక పోతున్నప్పటికి కొన్ని కవితలు , కథలైనా చదవకుండా ఉండలేని పరిస్థితి. ఇప్పుడు కొత్త శీర్షికలతో వస్తుందన్న వార్త మరింత ఆసక్తి పెంచుతుంది. సారంగ టీం కు , అఫ్సర్ భాయ్ కి అభినందనలు.

  • ప్రామాణికమైన రచనలు అందిస్తూ, ప్రగతిశీల భావజాలాలను ప్రోత్సహిస్తున్న సారంగ టీమ్ కి నూతన సంవత్సర హార్ధిక శుభాకాంక్షలు. సారంగ అంతర్జాల పత్రిక వేదిక మీద ఎందరెందరో ప్రతిభావంతుల సృజనశీల రచనలు చదివే భాగ్యం లభించింది. భవితలోనూ ఇదిలా కొనసాగాలని ఆశిస్తున్నాము.

    సారంగ రచయితలు / రచయిత్రుల కొందరి పేర్లు తలపోస్తే… తలపోయనివారు అంతకన్నా ఇంకా ఎందరో మిగిలినపోతారు. అయినా దుశ్సాహసం చేస్తున్నా… జి.ఎస్. రామ్మోహన్, సజయక్క, ఎన్. వేణుగోపాల్, భాస్కరం కల్లూరి, ఎ.కె. ప్రభాకర్, శ్రీధర్ వెల్దండి, కృష్ణుడు, కె. శ్రీనివాస్, మమత, కె ఇంకా అనేకమంది ప్రతిభావంతులైన రచయితలు, రచయిత్రుల ( అట్టాడ అప్పల్నాయుడు, అనంతు, ఆరి సీతారామయ్య, ఓల్గా, ఎండపల్లి భారతి, కృష్ణ జ్యోతి, గుర్రం సీతారాములు, గొరుసు, చంద్రశేఖర్ ఇండ్ల, చింతకింది శ్రీనినాసరావు, జలంధర, తల్లావజ్ఘల పతంజలి శాస్త్రి, నరేష్ నున్నా, నామాడి శ్రీధర్, బెజవాడ పి. సత్యవతి, పూడూరి రాజి రెడ్డి, ఖమ్మం బాచ్ ప్రసేన్, బమ్మిడి జగదీశ్వరరావు, ముకుంద రామారావు, డా. మైథిలీ అబ్బరాజు, రమణజీవి, రాణి శివశంకర్ శర్మ, వంగూరి చిట్టెన్ రాజు, వంశీధర్ రెడ్డి., కాకినాడ అక్కయ్య వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, విమలక్క, వివిన మూర్తి, వెంకట్ శిద్ధారెడ్డి, వేంపల్లె షరీఫ్, వేమన వసంత లక్ష్మి గారు, షాజహానా, సొలోమోన్ విజయ్ )

  • ఇండ్ల చంద్రశేఖర్ గారి రంగుల చీకటి కథల పుస్తకంలో “నగ్నా రణ్యం” కథ ద్వారా సారంగ గురించి తెలుసుకొని చదువుతున్నాను.. ఒక మంచి వేదికకు పరిచయం అయిన సంతోషం కలిగింది. ధన్యవాదములు ైైైైైై ైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైై

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు