కొత్తప్రయోగంతో తెరకెక్కిన ప్రతాపరుద్రమ  

40 మంది కళాకారులను సమీకరించుకుని ఒక యజ్ఞంలా ఈ నాటకప్రదర్శన జరిగింది.

నాటకం కొత్తపుంతలు తొక్కుతుంది.ఇటీవల ట్రయాలజి (Triology) అనే సరికొత్త ప్రయోగంతో ప్రతాపరుద్రమ అనే నాటకం రవీంద్రభారతిలో ప్రదర్శింపబడి పలువురి ప్రశంసలందుకుంది. ఒక సమగ్ర కళకు సంబంధించిన మూడు విడి భాగాల ప్రదర్శన ట్రయాలజి గా చెప్పబడుతుంది. సాహిత్యంలోను, సినిమాలోను, వీడియో గేమ్స్ లోను కనిపించే ఈ విధానం నాటకంలో ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు.

ట్రయాలజీలో ఫిక్షన్ లో ఒకే రకమైన పాత్రలు సెట్టింగులతో The deptford Triology నవలలు Robertson Davies మరియు The Apu Triology పేరుతో సత్యజిత్ రే సినిమాలను రూపొందించారు. సైన్స్ ఫిక్షన్లు, ఫాంటసీలకు ట్రయాలజిని బాగా ఉపయోగించేవారు.

గ్రీకులకాలంలో డయోనిషియా ఉత్సవాలలో ట్రయాలజీ నాటకాలు ఆడేవారు. The Oresteia అనే ట్రయాలజీ పురాతన గ్రీకు నాటకాలలో 458 BC లో ఏథెన్స్ నగరంలో ప్రదర్శించిన దాఖలాలున్నాయి.

పురాతన భారతదేశంలో మహాభారతం ట్రయాలజీగా నిలిచి మూడుభాగాలుగా ఉందని సమాచారం.

ట్రయాలజీగా నవలలు మనకు The Hitchhiker’s guide to the Galaxy-Douglas Adams రచయిత Star War films మూడు భాగాలుగా వచ్చింది.1977 నుంచి 1983 వరకు Original Triology గాను 1999 నుంచి 2005 వరకు Sequel Triology గాను వచ్చాయి.

సినిమాలు కూడా బాహుబలి-1, బాహుబలి- 2 రెండు భాగాలుగా వచ్చాయే కాని ఒక సమగ్రమైన వృత్తాంతంతో 3 భాగాలుగా తీసిన సినిమాలు అంతగాలేవు.

నాటకరంగంలో తొలిసారిగా ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది డా. కోట్ల హనుమంతరావు తెలుగు విశ్వవిద్యాలయం నాటకవిభాగ అధిపతిగా పనిచేస్తూ పలు నాటకాలను విజయవంతంగా ప్రదర్శింపజేస్తూ ఎన్.ఎస్. నారాయణ బాబు రచించిన ప్రతాపరుద్రమ నాటకాన్ని ట్రయాలజిగా ప్రదర్శించాలని సంకల్పించారు. ప్రతాపరుద్రమ నాటకం కాకతీయుల చరిత్రను తెరకెక్కించే బృహత్తర విషయం. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ దక్షిణాదిత్య ఆర్టిస్టు అకాడమీ సంయుక్త సమర్పణలో 40 మంది కళాకారులను సమీకరించుకుని ఒక యజ్ఞంలా ఈ నాటకప్రదర్శన ప్రతిపాదన మొదలైంది. నాటకం కథాంశం ..

క్రీస్తుశకం 1000 సంవత్సరాల కాలంలో రాష్ట్రకూటుల విధేయులుగా ప్రజలను పాలిస్తున్న దుర్జయ వంశస్థులు ‘ కాకతి’ ని ఆరాధ్యదేవతగా కొలిచి కాకతీయులుగా ప్రసిద్ధికెక్కారు. దుర్జయ వంశంలో నాల్గవ గుండయ కొరవి సీమను స్వతంత్రంగా పాలించే అవకాశాన్ని పొందాడు.కాని ముదిగొండ చాళుక్యులు గుండయను యుద్ధాన హతమార్చి కొరివి నాక్రమించారు. గుండయ కొడుకైన బేతయ పసివాడు. గుండయ సోదరి కామసానమ్మ ఆత్మస్థైర్యంతో  పశ్చిమ చాళుక్యప్రభువును సంప్రదించి న్యాయం కోరింది. ఫలితంగా వేల్పుకొండకు బేతయ రాజయ్యాడు. పశ్చిమ చాళుక్యుల సామంతుడిగా ప్రతిభావంతంగా రాజ్యమేలాడు. ఆపై అతని వారసులుగా ప్రోలయ, రుద్రదేవుడు, అన్మకొండ రాజధానిగా రాజ్యమేలారు. అలా 150 సంవత్సరాలు గడిచింది. రుద్రదేవుడు అసామాన్యుడై స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పాడు. తెలుగు ప్రజలందర్నీ ఒకే రాజ్యంలో ఉంచేలా యత్నించి కృష్ణా , గోదావరి పరీవాహక ప్రాంతాలను తన రాజ్యాన కలుపుకునే ప్రయత్నంలో వున్నాడు. దురదృష్టం దేవగిరి యాదవరాజ్యపాలకుల రూపాన వచ్చింది.

రుద్రదేవుడు అన్మకొండకు దూరంగా వున్నప్పుడు దేవగిరి వారు వచ్చి సబ్బి మండలంలో (ప్రస్తుత కరీంనగర్ -మెదక్) చొరబడ్డారు. రుద్రదేవుడు తిరిగి వచ్చి యుద్దాన ఉండగా కుతంత్రాన అతడ్ని చంపారు. ఐనా కాకతీయ రాజ్యాన్ని శత్రువు వశం చేయలేదు. పోరాడారు. నెగ్గారు. ఆ పై కాకతీయ రాజ్యానికి రుద్రదేవుని తమ్ముడు మహదేవుడు రాజయ్యాడు. మహదేవుని కొడుకు గణపతి దేవుడు. ఈ పిల్లవాణ్ణి రుద్రదేవుడు తన వారసునిగా దత్తత తీసుకున్నాడు. ఐతే పిల్లవాడు రాజ్యపాలనకు తగిన ప్రాయం లేకుండటం వల్ల మహదేవుడు రాజ్య పాలకుడయ్యాడు.

ఆ పై మూడేండ్లకు మహదేవుడు దేవగిరి పై దండెత్తాడు. ఆ యుద్ధంలో మరణించాడు. దేవగిరి పాలకుడు జైత్రపాలుడు వయసున్న గణపతిదేవున్ని బంధించి దేవగిరి చెరలో వుంచాడు. 11 నెలల పాటు ప్రతిష్టంభన సాగింది. చివరికి రేచర్ల రుద్రసేనాని దౌత్యం ఫలించి , దేవగిరి రాకుమారి సోమలదేవిని గణపతి వివాహమాడే ఆంక్షకు అనుగుణంగా గణపతిదేవుడు విడుదలై కాకతీయ రాజ్యప్రభువైనాడు. గణపతి అద్భుతమైన పాలనలో కాకతీయ రాజ్యం తెలుగు సామ్రాజ్యమైంది . తెలుగు ప్రజలందర్నీ ఒకే రాజ్యంలో వుంచగలిగాడు. అతని పెద్దభార్య సోమల వయసున చిన్నది కావడం వల్ల విస్తరణలో వుండగా దివిసీమలో తను ఓడించిన అయ్యపుచినచోడుని కూతుర్లు అయిన నారంబ , పేరాంబలను వివాహమాడాడు. అతి ప్రతిభావంతుడైన జాయన( బావమరిది) ను సైన్యాధికారిగా నియమించాడు. మొదట పేరాంబకు ఒక ఆడపిల్ల పుట్టింది .గణపాంబ అని పేరు పెట్టారు. ఆపై నారాంబకు కూడా ఆడపిల్ల పుట్టింది. అయితే పుట్టింది మగపిల్లాడు అని ప్రకటించాడు గణపతి. రుద్రదేవుడని పేరు పెట్టాడు. చనిపోయిన ఆ పెదరుద్రదేవుడే గణపతి కొడుకుగా చినరుద్రదేవుడిగా పుట్టాడని ప్రజలు విశ్వసించారు.ఆ చినరుద్రుడు పెరిగి పెద్జవాడయ్యాడు. యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. తండ్రితో పాటు పాలనావిధుల్లో వుండేవాడు. యుక్త వయసుకు వచ్చాడు.అతని అక్క గణపాంబకు కోట రాజ్యపాలకుడు బేతరాజుతో వివాహమైంది. దేవగిరి బిడ్డ ,గణపతి మొదటి భార్య అయిన సోమలదేవికి ఇద్దరు మగబిడ్డలు జన్మించారు.

గోదావరి ప్రాంతాన కళింగాంగుని చొరబాటు అణచేందుకు రుద్రదేవుడు గణపతితో పాటు యుద్ధానికెళ్ళాడు. ఆ యుద్ధంలో కాకతీయులకు నిడదవోలు చాళుక్యులకు సాయపడ్డారు.చాళుక్య యువరాజు వీరభద్రుని మెచ్చిన గణపతి అతనితో రుద్రదేవుని వివాహం చేయనెంచి .. అంతకాలం రుద్రదేవునిగా వున్నది నిజానికి రుద్రమ అనీ, చిన్నతనం నుంచి పురుషవేషధారణ లో పెంచాననీ, ప్రస్తుతం ఆమె వివాహం చాళుక్య వీరభద్రునితో జరగనుందని ప్రకటిస్తాడు. కాకతీయ సామ్రాజ్యం మురిసిపోయింది. ఘనంగా పెండ్లి జరిగింది. గణపతి సారధ్యంలో సామ్రాజ్యం అన్నిరంగాల్లోనూ కొత్త వెలుగులు  చూసింది. స్వర్ణయుగ సాధనలో పయనించసాగింది. కాలం గడుస్తూ ఉంది. రుద్రమ్మకు ముమ్మడమ్మ ,రుద్రమ, రుయ్యమ అనే ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. యుక్తవయసుకు రాగానే వారికి పెళ్ళిళ్ళు జరిగాయి.

గణపతి 80వ యేట తన పాలన షష్ట్యబ్ది మహోత్సవంలో రుద్రమను తన వారసురాలిగా ప్రకటించాడు. సామ్రాజ్యాన ప్రజలు సంతోషించారు. కాని దేవగిరి పాలకులు మాత్రం మండి పడ్డారు. దానికి కారణం సోమలదేవి మగబిడ్డలను వారసులుగ ప్రకటించకపోవడం. ఐతే గణపతిని ప్రశ్నించలేక అవకాశం దొరికినప్పుడు శిక్షించాలన్న ప్రతీకారేచ్ఛతో వుండిపోయాడు. పాండ్యులతో జరిగిన యుద్ధంలో దేవగిరి కుట్రను పసిగట్టిన గణపతిదేవుడు పాలనలో సర్వాధికారాలను రుద్రమకు అప్పగించి చరిత్ర సృష్టించాడు.రుద్రమ పెద్దకూతురు ముమ్మడమ్మకు మగబిడ్డ జన్మించాడు. అతడే ప్రతాపరుద్రుడు.

పాండ్యుల యుద్ధంలో కుట్ర ఫలించని దేవగిరి వారు , రుద్రమని అడ్డగించి కోటను ఆక్రమించే ప్రయత్నం చేసారు. కానీ విఫలమయ్యారు. దాంతో జైత్రపాలుని కొడుకైన మహదేవుడు పెద్ద సైన్యంతో ఓరుగల్లును ముట్టడించాడు. రుద్రమ నేతృత్వంలో 15 రోజులపాటు భీకర యుద్ధం జరిగింది. దేవగిరి సేనను , మహదేవుని తరిమికొట్టింది రుద్రమ.

ఇదీ ట్రయాలజిలోని మొదటిభాగం కథ. మిగతా కథ మరి రెండు భాగాలుగా  ప్రదర్శింపబడుతుంది.

కాకతీయుల వృత్తాంతాన్ని నాటకీకరణ చేయడం కేవలం ఒక్క ప్రదర్శనతో సాధ్యం కాదన్నది తేటతెల్లమయ్యే విషయం . అందువల్లే డా . కోట్ల హనుమంతరావు గారు దానిని మూడు భాగాలుగా చూపించాలనుకున్నారు. మొదటి భాగంగా ఎంచుకున్నఈ కథాంశం రచన, సంగీతం ఎన్.ఎస్. నారాయణబాబు చేయగా నృత్యదర్శకత్వం డా. అనితారావు వహించారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను చేపట్టిన దర్శకుడు డా. కోట్లహనుమంతరావు తన దర్శకత్వ ప్రతిభను మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఘట్టంలోను నిలబెట్టుకున్నారు.

నాటకంలో ప్రధాన ఆకర్షణ సూత్రధారులు అంత సుదీర్ఘ కథనాన్నితమ హావభావాలతో నృత్యాలతో వివరించడం బిర్రు కిరణ్ కుమార్ , నీలం నరేష్ ,శ్రీకాంత , కరుణాకర్ , ప్రశాంత్ ,ఖలీమ్ , అదితినాగ్ , అభానాక్సోడే , పూజ , చందనా రెడ్డి, విజయలక్ష్మి, హారిక, మనీషా ఎవరికి వారు ఉత్సాహంగా నాటకం ఆద్యంతం రక్తికట్టించారు. ఒకటే రకమైన దుస్తులతో ఒకే రకమైన కదలికలతో 12 మంది ఒక్కరుగా డా. హెచ్.అనితారావు నృత్య శిక్షణతో నాటకానికి వన్నె తెచ్చారు. సాగింది పాలన పాట వంటి ఎన్నో పాటలమీద వారి నాట్యం అందరినీ ఆకట్టుకుంది.

కామసానమ్మగా నటించిన డా.బి. హెచ్. పద్మప్రియ సహజనటనతో అందరి మన్ననలు పొందారు.బాలపాత్రలు అయినా బేబి వైష్ణవి , బేబి సన్నిధి అచ్చెరువొందే నటనను కనబరచారు.గంగయగా గోవర్ధన్ రెడ్డి , చాళుక్య రాజుగా డా.ఆంథోని రాజు, మహదేవుడుగా పుండరీ, రేచర్ల రుద్రుడుగా మోహన్ సేనాపతి , గణపతిదేవుడు(1)గా, హర్షవర్ధన్ , జైత్రపాలుడు , మహదేవుడుగా మనోహర్ హేమాద్రి మంత్రిగా ముక్తేవి ప్రకాశరావు తమ తమ పాత్రలను పోషించారు. నాటకంలో ప్రధానంగా కనిపించే  గణపతిదేవుని పాత్రలో వెంకట్ గోవాడ అన్నిరసాలను అవలీలగా పలికించగలిగే తన సహజ సజీవ నటనను ప్రదర్శించి జాయపసేనానిగా సంజీవ్ పటేల్, గణపాంబగా తన్మయిలతో పాటు రుద్రమ (2) గౌరి, రుద్రమ (3) కె. రోహిణి ప్రసాద్ లు ఎన్నో సన్నివేశాలు రక్తికట్టించారు. ప్రధానపాత్రధారి రుద్రమ తన హావభావాలతో యుద్ధ విద్యలతో అందరినీ ఆకట్టుకుంది. కళింగాంగుడుగా సుజిత కుమార్ రెడ్డి హరిహరదేవుడుగా సుసైరాజ్ , మురారి దేవుడుగా ప్రిన్స్ రాజ్ శివదేవయ్యగా కుమారస్వామి , వార్తాహరుడుగా రమేష్ ..ఏ ఒక్కపాత్ర చిన్న పెద్దా కాకుండా అన్ని పాత్రలవైపు ఎక్కడా తడుముకోకుండా చాలా అనుభవజ్ఞులైన మేటి నటులను తలపింపజేసారు.

నాటకంలో నటులెంత ముఖ్యమో ఆ నాటకానికి సాంకేతిక సహకారం అందించిన వారికృషి అంతే ముఖ్యం మేకప్ అందించిన సురభి జితేంద్ర ప్రతి పాత్రని అద్భుతంగా మలిచారు. సైటింగ్ తో పి.కొండల్ రెడ్డి నాటకాన్ని అత్యద్భుతంగా ఆకట్టుకునే లైట్లను ,ఏర్పాటు చేసారు. సెట్ నిర్వహణ చేసిన ఉమాశంకర్ సన్నివేశానికి సన్నివేశానికి మధ్య ఏ మాత్రం సమయం తీసుకోకుండా వెంట వెంట నాటకం కొనసాగేలా ప్రతిభను కనబరచారు.వేదిక మీద ఒక ఎత్తైన స్థలం ఏర్పాటు చేయడం , ప్రధానమైన సన్నివేశాలను , యుద్ధాలను ఆ ఎత్తైన వేదిక మీద చేయడం నాటకంలో చూపించాలనుకున్న సన్నివేశాలు రక్తి కట్టేందుకు దోహదం చేసేసెట్ ఏర్పాటు చేయబడింది. మధ్య మధ్య పాటలకు సంగీతం సమకూర్చడంలో కీబోర్డ్ ను జోసఫ్ , రిథమ్ ప్యాడ్ ను అపోలో, కాంగోను బ్రూస్ లీ లు వాద్యసహకారం అందించగా టెక్నికల్ సపోర్టు ను రోహిత్ అందజేసారు.

సెప్టెంబరు 28, 29-2018 రోజులలో రవీంద్రభారతిలో ప్రదర్శించిన ఈ నాటకంలో ప్రత్యేకతలేమిటంటే..

 1.  ఒక చరిత్రకు సంబంధించిన     ఇతివృత్తం.
 2. తెలంగాణ జీవనంలో సమ్మిళితమైన కథాంశం.
 3. విస్తృతమైన కథాంశాన్ని మూడు భాగాలుగా (Triology) గా చూపించాలని నిర్ణయించుకోవడం.
 4. 40 మంది కళాకారులు ఇందులో భాగస్వాములు కావడం.
 5. సన్నివేశానికి సన్నివేశానికి మధ్య ఏమాత్రపు సమయం తీసుకోకుండా తర్వాత సన్నివేశం విజయవంతంగా నిర్వహించడం.
 6. నటనలో అనుభవజ్ఞులు తమ నటనాచాతుర్యంతో అద్భుతంగా నటించారు.
 7. సూత్రధారులుగా ఉన్న బృందం ఆద్యంతం కథని విడమరిచి చెబుతూ ఆడుతూ పాడుతూ తమ అభినయంతో రంజింపజేసారు.
 8. నాటకంలో సృజించిన అంశాలు చాలా ఉన్నాయి.ఉదాహరణకు రాజ్య అభివృద్ధి కోసం చేపట్టే పనులు,సాహిత్యం, తెలుగు భాష పట్ల శ్రద్ధ వంటివి…స్త్రీలకు రాజ్యపాలన కట్టబెట్టడం , స్త్రీలను గౌరవించడం, ప్రజలకు నీటివసతి కల్పించడం, చెరువులు తవ్వించడం ఆ కాలంలోని సామాజిక జీవన విధానాన్నిఅందరికీ అవగతమయ్యేలా సన్నివేశాలను రూపొందించడం.
 9. చక్కని గీతాలు సందేశాత్మకంగా మధ్య మధ్య అలరిస్తూ నృత్యదర్శకురాలు డా. అనితారావు కృషి వ్యక్తమౌతుంది.
 10. మేకప్ , కొరియోగ్రఫి, సెట్టింగ్…లైటింగ్ వంటివి వేటికవే ఒక సినిమా చూసిన అనుభూతిని కలిగించాయి.
 11. బుక్ మై షో ద్వారా టికెట్  కొని నాటకం చూడాలనే అలవాటును తెలుగు నాటకరంగంలో కలుగజేసే ప్రయత్నం చేయడం.
 12. ప్రతి దృశ్యం లోనూ దర్శకత్వ ప్రతిభ కనబడడం.

ఇవి ప్రధానంగా ప్రతాపరుద్రమ మొదటిభాగం నాటకవిశేషాలు.

నాటకరంగం కోసం విశేషంగా కృషి చేస్తున్న డా.కోట్ల హనుమంతరావును వారి బృందం అభినందనీయులు. నాటకం ప్రదర్శనకు నిండుమనసుతో ప్రోత్సహించి ఈ నాటకంమనందరిది అని మమేకమై ప్రతి ఒక్కరిని పేరు పేరునా అభినందించి వారిని ముందుకు నడిపించిన తెలంగాణా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారు, నాటకానికి ఆశీస్సులందించిన   డా. కె.వి. రమణాచారిగారు ,చివరి వరకూ చూసి అందరిని అభినందించిన తెలంగాణ సంగీత నాటక చైర్మన్  శ్రీ శివకుమార్ గారు..నాటకరంగంలో కొత్త ఉరవడి అని ప్రశంసించిన ప్రొఫెసర్ డి.ఎల్.ఎన్. మూర్తి గారు, నాటకం మొదటినుంచి పాల్గొన్న వారందినీ మెచ్చుకున్న డా.జుర్రు చెన్నయ్య గారు తదితరుల ప్రశంసలతో మలచబడిన మొదటి భాగం

ఒక మంచి నాటకం చూసామన్నసంతృప్తిని మిగిల్చింది . ప్రతాపరుద్రమ రెండవ భాగం కోసం వేచి చూడాల్సిందే..

*

Avatar

డా.సమ్మెట విజయ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • Very nice and innovative attempt. Useful technical Aspects can attract the audience to word’s modern drama.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు