నువ్వు కనపడినప్పుడు
నీళ్లు నిండిన కళ్ళతో
గద్గదమయిన స్వరంతో
వణుకుతున్న చేతులతో
నేను నమస్కరించాలని చూస్తావు
గడ్డిపరకతోనయినా గమ్యం చేరాలనే నా నిస్సహాయతను
ఆ పూట గడిచినా చాలన్న నాటి కలవరాన్ని
కళ్ల ముందు నిలిపే నీ ఉనికి
గుండెల్లో గునపాల్ని దింపుతుంది
బడబాగ్ని రేపుతుంది
మరచిపోయిన జ్ఞాపకం అకస్మాత్తుగా ఎదురయి.
మానిపోయిన గాయం మరోసారి పుండవుతుంది
పాతిపెట్టిన పాత రోజు లేచి వచ్చి
సమాధి చేసిన చేదు నిజానికి ప్రాణం పోస్తుంది
ఆ చీకటి క్షణాలను మరచి పోనివ్వని నీతో
మాటేదో మాట్లాడి అర్థం లేకుండా నవ్వేస్తూ
మౌనంగా చూసి గుర్తించనట్లు నటిస్తూ
గొంతు నులిమి చంపాలన్న ఉద్వేగాన్ని గుండెలో ఇముడ్చుకొని
నిష్క్రియగా నడచి పోవడమే నేను చూపే పెద్ద కృతజ్ఞత
నాటి పెళ్లి ఫొటోలో ఇద్దరి మధ్య సిగ్గు తెర
ఊటీలో మనని ముంచేసిన మంచు పొర
మొదటి ఆషాఢంలో నువ్వు వ్రాసిన జాబు
నే చేసిన పాయసానికి నువ్విచ్చిన కితాబు
పెళ్లి దండనుంచి నువ్వు దాచుకున్న పువ్వు
మనవణ్ణి ఎత్తుకొని పరవశంగా నీ నవ్వుఅడుగున పడిన జ్ఞాపకాలు
నేటికీ చెలమలను సృజిస్తాయిచొక్కా మీద మరకలకు నువ్వు చూపే కోపం
కరగని దేవుడి ముందు కడగని చిన్న దీపం
కళ్ళ లోగిళ్ల నిండా పరుచుకున్న దైన్యం
ఆరడుగుల పడకలో వెయ్యి మైళ్ళ శూన్యం
జాతస్య ధృవం మృత్యు అన్న సత్యం తెలుసు
అయినా చేదు నిజాన్ని ఒప్పుకోదీ మనసునిన్న మొన్నటి అనుభవాలు
జలపాతాలను సృష్టిస్తాయినువ్వు లేని మరో రోజు మౌనంగా గడుస్తుంది
వియోగం ఎడబాటు కాదని మరోసారి తెలుస్తుంది








Add comment