విశ్వనాథ సత్యనారాయణ గురువు గారైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అంటే శ్రీశ్రీకి అపారమైన గౌరవం ఉండేది. ఒకరోజు శ్రీశ్రీ తటపటాయిస్తూ ఆయనను ‘కవిత్వం మీద మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడిగారు. చెళ్లపిళ్ల మందహాసం చేసి ‘నేను కవినేనా?’ అని అడిగారు. ‘మీరు కాకపోతే ఆంధ్రదేశంలో మరెవ్వరండీ కవి.’ అని శ్రీశ్రీ ధైర్యంగా అడిగారు. శాస్త్రి గారు గట్టిగా నవ్వారు.
‘కవిత్వం అంటే ఏది కాదో చెప్పడం కష్టం కాదు కాని ఏది కవిత్వమో చెప్పడం కష్టం’ అన్నారు. అంతటితో ఆగకుండా ‘మన కవిత్వానికి లక్షణం కంఠవశం కాగల రచన. మననం చేసుకోవడానికి అనువైన పద సంచయనం చేయాలి. కర్ణపేయంగా ఉండాలి. రసనాగ్ర నర్తకిలా.అంతవరకూ నేను సాధించాను’ అని చెప్పారు.
తర్వాత తనలో తాను నవ్వుకుంటూ పడక కుర్చీ మీద వెనక్కి తలపెట్టారు. ఆ తర్వాత కొద్దిగా ముందుకు వంగి ‘అయితే అంతమాత్రాన అది కవిత్వం అయిపోదు. పోనీ నువ్వు చెప్పు కవిత్వం అటే ఏమిటో. అంత సులభవటయ్యా, అసలు నిర్ణయించేవారే లేరే ఈ దేశంలో! నీకు నేను, నాకు నువ్వూ తప్ప! అంచేతనే కాబోలు మనం అనువాదాలు, అనుసరణలతో ప్రారంభించాం. పోయి రండి’ అన్నారు.
శ్రీశ్రీ ‘కవితా, ఓ కవితా’ గేయాన్ని ఇదే చెళ్లపిళ్ల శాస్త్రి శిష్యుడైన విశ్వనాథ సత్యనారాయణకు వినిపించినప్పుడు హత్తుకుని ఆశీర్వదించారు. ‘కవిత్వమంటే ఒక తపస్సు అని, జీవుని వేదన’ అన్న విశ్వనాథ వాక్కుల్లో రహస్యాన్ని ఎవరు విప్పగలరు? రామరాజభూషణుడి శబ్దశిల్పాన్ని ప్రేమించిన శ్రీశ్రీ ఆయన రచించిన వసుచరిత్రను అయిదు రూపాయలు పెట్టి కొనలేక ఒక పుస్తకాల దుకాణానికి వెళ్లి రోజూ అక్కడే ఉండి శ్రీశ్రీ చదివారంటే ఆయనకు ప్రాచీనసాహిత్యంపై ఎంత మక్కువో అర్థమవుతుంది. అలాంటి శ్రీశ్రీ కవిత్వాన్ని ‘తూచే రాళ్లు నా దగ్గర లేవు. తూచవద్దు, అనుభవించి పలవరించాల్సిందే’ అన్నాడు చలం.
కవిత్వం, విమర్శ గురించి ఎన్నో దశాబ్దాలుగా చర్చ జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ ఒక్కరూ ఒకే రకంగా నిర్వచించలేదు. కవిత్వం ఎక్కడుంటుంది? బైరాగుల తత్వాల్లో ఉంటుందా? ప్రాచీన కవుల కావ్యాల్లో ప్రబంధాల్లో ఉంటుందా? పద్యాల శబ్ద విన్యాసంలో దాగి ఉన్నదా? పసిపాపను బుజ్జగిస్తూ తల్లి పాడే పాటలో ఉన్నదా? దేవీ దేవతలపై కవులు రాసిన శ్లోకాల్లో ఉన్నదా? లేక శ్రమ జీవులు, రైతులు శ్రమను మరిచిపోయేందుకు ఎత్తుకునే పదాల్లో ఉంటుందా, ఎవరు చెప్పగలరు? ‘ఎండ తాగిన పిట్ట, ఏటి త్రోవలు పట్టి ఎగిరిపోయింది.’అన్న జానపద గేయాన్ని రాసిన పల్లె కవీ, ‘కన్నీటి కెరటాల వెన్నెలేలా, నిట్టూర్పు గాడ్పులో నెత్తావి యేలా’ అని అని రాసిన కృష్ణశాస్త్రీ, ‘జీవితం అందరిచేతా విషం తాగించదు ఒక్క సోక్రటీస్ తోనే తప్ప’ అని రాసిన హనుమయ్య ఏక కాలంలో తనకు నచ్చారని ఇస్మాయిల్ అనే కవి రాశారు.
‘చాలమంది విమర్శకులు కవిత్వంపై వ్యాఖ్యానిస్తుంటారు. కాని కవికన్నా విమర్శకుడికి జాగరూకత ఎక్కువ ఉండాలి’ అంటారు చెళ్లపిళ్ల. కవికి కవిత్వం సహజం కనుక లోకులేమన్నా ఏదో గిలకడం వానికి తప్పనిసరి. విమర్శ పనిలేని పాటగా కల్పించుకునే పని కనుక సహజమైన ఆవేశంలోకి చేరదు. అందుకే కవిని క్షమించినట్లుగా విమర్శకుడిని క్షమించకూడదనేది చెళ్లపిళ్ల అభిప్రాయం.మరి అసలు సిసలైన విమర్శకుడిని ఎవరు గుర్తించాలి?
చెళ్లపిళ్ల, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ తదితరులు కవిత్వాన్ని అంతర్లీనం చేసుకున్నారు, నిర్వచించే ప్రయత్నంలో తాము సముద్రంలో అన్వేషిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ‘తాము కవిత్వం రాస్తున్నామని చెప్పుకునేవారందరూ కవులు కాకపోవచ్చు. అందని పళ్లకోసం చేతులు చాచి విఫలమయినవారి మాదిరే ప్రతి ఒక్కరికీ తాను కవిగా పేరు పొందవలెనన్న ఆశ ఉంటుంద’ని కాళిదాసు సైతం తన రఘువంశంలో చెప్పారు (మందః కవియశఃప్రార్థీ గమిష్యా మ్యపహాస్యతాం). అంటే కవులుగా అనిపించుకోవాలనే దుగ్ధ ఆనాటి నుంచే ఉన్నదన్న విషయం స్పష్టమవుతోంది.
కవిత్వానికి వేయి లక్షణాలున్నాయని విశ్వనాథ అన్నారు. ‘ఒక మహాశిల్పి యగుటకు వేయి లక్షణములుండు, నే రెండు లక్షణములో యమరియుండిన వాడు తనంత శిల్పి సృష్టిలో లేడని గర్వించుచుండు.’ అన్నాడు విశ్వనాథ. కవిత గొప్పదయ్యేందుకు కారణం 90 శాతం కవి ప్రతిభే అన్న విశ్వనాథ ‘రసము వేయి రెట్లు గొప్పది’ అన్నారు. ఆ రసము సాధారణమైనది కాదు. అదొక సైన్సు.
కవిత్వం అనేదాని గురించి చెప్పడం సైన్స్ అనో,శాస్త్రమనో ఆధునికులకంటే ముందే ప్రాచీనులే భావించారు. పోయిటిక్స్ రచించిన అరిస్టాటిల్ మాత్రమే కాదు, భట్టి (కావ్యాదర్శం), భామహుడు(కావ్యాలంకారం), దండి(కావ్యాదర్శం), భట్టతౌతుడు(కావ్యకౌతుకం), జగన్నాథరాయలు(రసగంగాధరం), ఆనందవర్ధనుడు(ద్వన్యాలోకం), ఉద్భటుడు(కావ్యాలంకార కావ్య సంగ్రహం) లాంటి వారెందరో ఉన్నారు. ఒక్కొక్కరూ కవిత్వానికి ఒక్కొక్క నిర్వచనాన్నిచ్చారు. అందరూ శబ్దానికీ, ఆర్థానికీ ప్రాధాన్యం ఇచ్చారు. రమణీయమైన అర్థం ఉండాలన్నారు. ధ్వని కావ్యానికి ప్రాణమని చెప్పారు.
వీరందరిలో 8,9 శతాబ్దాల్లో కశ్మీర్ లో జీవించిన వామనుడి ప్రత్యేకత వేరు. తన కావ్యాలంకార సూత్ర వృత్తిలో కవిత్వం గురించి రకరకాల నిర్వచనాలిచ్చి ప్రతి నిర్వచనానికీ వ్యాఖ్యానం చేసిన తొలి ఘనత ఆయనకు దక్కింది. ‘సౌందర్యమే అలంకారం’ అని ప్రారంభించిన వామనుడు కవితా రహస్యాన్వేషణ ఒక శాస్త్రం( సైన్స్ ) గా అభివర్ణించారు. కవులు నిత్య అసంతృప్తి వాదులని చెప్పారు. పద ప్రయోగమే కవిత్వానికి అసలైన ఆత్మ (డిక్షన్ ఈజ్ వెరీ సోల్ ఆఫ్ ది పోయెట్రీ) అని ప్రకటించారు. దాన్ని మరింత పొడిగించి శైలి కూడా కవిత్వం ఆత్మనే అన్నారు. భావన లోనే కవిత్వ బీజాలున్నాయి అన్నారు.
అగ్నిపురాణాన్ని వ్యాసుడు రాశారంటారు. ఎప్పుడు రాశారో ఎవరూ చెప్పలేరు. ‘మనిషిగా పుట్టడం దుర్లభం, కవిగా పుట్టడం ఇంకా దుర్లభం, గొప్ప కవి కావడం ఇంకా దుర్లభం’అని అగ్ని పురాణంలో రాశారు. కవిత్వానికి స్వంత ఆలోచనలు, విచక్షణా శక్తి అవసరమని చెప్పారు. ‘ఆవేదన లేని అనుభూతి ఉండదు, భావోద్వేగం లేని భావన ఉండదు’ అని రాసిన వ్యాసుడు ఏ కాలపు వాడు?కవిత్వంలో ఆధునికమా, ప్రాచీనమా అన్నవిభజనకు ఆస్కారం లేదు. పాత కవులు రాసిందే కవిత్వమన్న భావన పాత కవులకే లేదు. ‘పురాణమిత్వేవ నాసాధు సర్వం, నచాపి కావ్యం నమిత్య వద్యమ్’ అన్నాడు కాళిదాసు మాళవికాగ్నిమిత్రం లో. ప్రాచీన, ఆధునిక అన్న తేడాల్లేకుండా ఉత్తమ కవిత్వాన్ని పరిగణించాలన్నారు..
కవిత్వం ఒక మానవ మేధస్సు ప్రాచీన సౌందర్యాత్మక చర్యల్లో ఒకటి (Poetry is one of the earliest aesthetic activities of human mind) అన్నదాన్ని ఎవరూ కాదనలేరు. లిపికంటే ముందు కవిత్వం పుట్టిందనడంలో సందేహం లేదు. కాని భారతీయ సాహిత్యం, కళలు ఎప్పుడు జన్మించాయో, వాటితో పాటు కవితా సౌందర్య శాస్త్రం లేదా కవితా తత్వ శాస్త్రం ఎప్పుడు జనించిందో ఎవరూ చెప్పలేరు.
అరిస్టాటిల్, ప్లాటో నుంచి కవితా సౌందర్య శాస్త్రాన్ని పాశ్చాత్యులు అధ్యయనం చేసినట్లే భారతీయులు కూడా అధ్యయనం చేశారని ముదిగొండ వీరభద్రయ్య అనే పండితుడు రాశారు. హైదరాబాద్ యూనివర్సిటీలో ఆయన తెలుగు శాఖ అధ్యాపకుడుగా ఉన్నప్పుడు భారతీయ, పాశ్చాత్య సౌందర్య శాస్త్ర మౌలికాంశాలపై తులనాత్మక అధ్యయనం చేసి విద్యార్థులకు పాఠ్యాంశంగా మార్చాలన్న ఆలోచనను ఆచరణ రూపం దాల్చేలా చేశారు. జర్మన్ తత్వవేత్త బౌమ్ గార్టెన్ తొలి సారి పెట్టిన ఈస్తటిక్స్ అనే పదానికి ఆయన కళాతత్వశాస్త్రం అనే పేరు పెట్టి అద్భుతమైన పుస్తకం రాశారు దీన్ని విద్వద్రచనగా జీవీ సుబ్రహ్మణ్యం ప్రశంసించారు.
ప్లాటో, అరిస్టాటిల్ కళాతత్వశాస్త్రాన్ని నిర్మించినప్పటికీ భారతీయ కళా మీమాంస అంతకు ముందునుంచే ఉన్నదని ముదిగొండ వీరభద్రయ్య విశ్లేషించారు. రసో వై స: అని తైత్తిరీయోపనిషత్తులో ఉన్న వాక్యాన్ని ఆయన ఉటంకించారు. భారతీయ మేధావులు కళా మీమాంసను, సౌందర్య వివేచనను లోతుగా అధ్యయనం చేశారని ఆయన సోదాహరణగా వివరించారు. పాశ్చాత్యుల ఈస్తటిక్స్ లో సౌందర్యం, అద్భుతం, ప్రతిభ తదితర తాత్వికాంశాల గురించి సౌందర్య మీమాంస ఎలా జరిగిందో, అదే మీమాంస చాలా స్పష్ట రూపంలో భారత దేశంలో కావ్య శాస్త్ర క్షేత్రంలో కూడా జరిగిందని ఆయన తెలిపారు.
మొత్తం కళాతత్త్వ శాస్త్రం అంతా సౌందర్యం, కళా హేతువు, కళాభివ్యక్తి అన్న మూడు మౌలిక తత్వాల పునాదిపైనే నిలబడి ఉంది. కళకు సంబంధించిన మిగతా అన్ని ప్రక్రియలు లేదా సిద్ధాంతాలు ఈ మూడింటి నుంచే ఉద్భవిస్తాయని ఆయన చెప్పారు. భారతీయ కళా తాత్వికులనే కాకుండా బౌమ్ గార్టెన్, క్రోచీ, హెగెల్, కాంట్. కాలరిడ్జి, లాంగర్, జార్జి శాంటాయనా, ఎమర్సన్ లను ఆయన అధ్యయనం చేసి వారి సిద్దాంతాలను ఉటంకించారు. ప్రాచీనులనే కాక టాగోర్, సంజీవదేవ్, అరవిందుడు వంటి వారు చెప్పిన అంశాలనూ ఉదహరించారు. భావకవితావేశం, అలంకారాలు, భావ చిత్రాలు, ప్రతిభ, ప్రతీకల గురించి ముదిగొండ వీరభద్రయ్య వివరించిన తీరు కళాతత్వ విద్యార్థుల ఆలోచనకు పదును పెడుతుంది.
అన్నిటికన్నా ముఖ్యమైనది కవిత్వంలో పెల్లుబుకే భావావేశం. కవిత్వం ఒక అద్భుతం. ఒక తపస్సు. ఒక మార్మిక శక్తి. ఏ వాక్యం ఎప్పుడు పుడుతుందో, ఏ పదాల కలయిక ఒక రససిద్దిగా మారుతుందో రాసిన తర్వాత కానీ అర్థం కాదు. తిక్కన మొట్టమొదటి సారి భవ్యకవితావేశం అన్న పదం వాడారు. కవిత్వాన్ని కళ అని నిర్వచించారు. తెలుగు బాసను తాను వినిర్మిస్తున్నట్లు చెప్పుకున్నారు.
ఈ భవ్యకవితావేశం, వినిర్మాణంలోనే పదాలు ప్రవాహంలా దొర్లుతాయి. శక్తివంతమైన భావోద్వేగాల సహజ ప్రవాహమే కవిత్వం అని, ఆ భావోద్వేగాలను ప్రశాంతంగా తిరిగి గుర్తు చేసుకున్నప్పుడే ది జన్మిస్తుందని వర్డ్స్ వర్త్ ఊరికే అనలేదు. కవిత్వం రాసేటప్పుడు కవి ఏ ఏ పాత్రల్లో ఉండి తన భావాలను వ్యక్తపరుస్తాడనే విషయాన్నిచెప్పేందుకు ఇలియట్ మూడు స్వరాల సిద్ధాంతాన్ని రూపొందించారు. ఒకటి బాహ్య ప్రపంచాన్ని గానీ, పాఠకులను గానీ అస్సలు పట్టించుకోకుండా కేవలం తన మనసుతో తాను మాట్లాడుకునే గొంతుక అయితే, సమాజం ఉన్నదనే స్పృహతో మాట్లాడే గొంతుక మరొకటి. తనను తాను పక్కన పెట్టి ఊహాజనిత పాత్రలతో మాట్లాడించే గొంతుక మూడవది.
“కవి తటస్థంగా, ఆలోచనామాత్రకంగా కూర్చోడు. సర్వేంద్రియాలతో సహా మానవ మహాంబుధిలోకి దూకుతాడు. బయటికొస్తాడు, లోతుల్లోకి పోతాడు, తరంగాల మీద తేలుతాడు. అనుభూతిని కళగా నేర్చుకొనేదశలో ఒకడు మొదలు బహిర్జగత్తు చేత బాధితుడౌతాడు. కానీ బాధను మూర్ఖుడివలె గాక సచేతనంగా అనుభవిస్తాడు. అప్పుడు బాధ అంతర్ముఖత్వాన్ని బోధిస్తుంది. అప్పుడు సమస్త ప్రపంచాన్నీ తనలో చూచుకొంటాడు. అంతే జగత్తు కవి ఆత్మలో పడి కరిగిపోతుంది లేదా కవి జగత్తులో పడి కరిగిపోతాడు. ఇలా సంభవించే బాహ్యాభ్యంతర ప్రయాణ కళాభ్యాసంలో వాడు సుఖ దుఖ విచక్షణ కోల్పోతాడు. ఈ ప్రక్రియే ఆత్మకళ అవబడింది. అణుభేదనం చేత అపారశక్తి విముక్తమై పట్లు ఈ ప్రక్రియ చేత ఆత్మ నిక్షిప్త చైతన్య మహాసాగరం గట్టు తెంచికొని ఘోషిస్తుంది. ఈ చైతన్య సాగర జాగరణమే ఆత్మ కళాభ్యాస ప్రయోజనం” అని గుంటూరు శేషేంద్ర శర్మ రాశారు. రసధుని,మణిఖని, బ్రహ్మనుభవం, విశ్వరూప సాక్షాత్కారం అని శ్రీశ్రీ పేర్కొనడం వెనుక రహస్యం ఇదే. అచేతన, అజ్ఞాతమనస్సు, జాగ్రదావస్థ పలికే రహస్యాలు ఒక కవి అంతరాత్మకే తెలుసు. ‘ఊహలేదు, కల్పన లేదు, వట్టి జాగ్రత్ స్వప్నానుభూతి నా కవిత్వం’ అని విశ్వనాథ ఒక సందర్భంలో అన్నారు.
‘సౌందర్యమనేది ఎప్పుడూ స్వచ్చమైనదా, కాదు, అది చారిత్రక మిశ్రమం. ఒక కళను లేదా సాహిత్యాన్ని విశ్లేషించేటప్పుడు, దాని వెనుక ఉన్న సామాజిక సంస్కృతిని, చరిత్రను కూడా కలిపి చూడాలి కదా’ అని హిందీ సాహిత్యంలో ప్రముఖ విమర్శకుడు నామ్ వర్ సింగ్ (సంస్కృతి అవుర్ సౌందర్య)లో విశ్లేషించారు.”చిప్పలో ముత్యం ఎలా తయారవుతుందో, సమాజం నుండి కళ కూడా అలాగే ఉద్భవిస్తుంది” అన్నారు బ్రిటిష్ సిద్దాంత కర్త క్రిస్టఫర్ కాడ్వెల్. సౌందర్య శాస్త్రం కేవలం కళ కాదు, సమాజం అని ఆయన అన్నారు.
కళ సౌందర్యాన్ని కేవలం రూపం ద్వారా కాదు, సామాజిక ఆర్థిక పునాదుల ద్వారా అర్థం చేసుకోవాలి.. అని చెప్పారు. నామ్ వర్ సింగ్ కూ, కాడ్వెల్ కూ మధ్య ఆలోచనల సామీప్యత ఉన్నది. కాని ఇదంతా వేరే చర్చ.అవసరమైన చర్చే. అయితే మానవ కథా వికాసంలో కవితా సౌందర్యం అనేది ఒక అవిచ్ఛిన్న ధార. ఈ సౌందర్య శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, కవి ఏకాలపు వాడైనా ఆ కవి అనుభవంలో మునిగితేలడం కళా విద్యార్థులు, కవులు, కవితా ప్రేమికులు చేయవలిసిన పని.
*








చాలా లోతైన వ్యాసం
సలలిత సుధారస ధారగా చెప్పడం
కృష్ణుడుకే సాధ్యం
సోదరునికి సాదర వందన సహస్రములు
-మాశర్మ
భారతీయ కవిత్వ తత్వ విచారము చారిత్రక కళాత్మక సౌందర్యాత్మక దృక్పదాల్లో లోతుగా వివరించారు. కృష్ణుడు గారికి ధన్యవాదాలు.
చాలా లోతైన వ్యాసం!
సలలితంగా రాయడం
అందరికీ సాధ్యం కాదు.
కృష్ణుడు వంటివారు
కొంతమంది మాత్రమే రాయగలరు.
‘కవిత్వం – విమర్శ’
పెద్ద subject!
Poetry -Aesthetics
రెండూ
మన సారస్వతానికి
కొత్తవి కాదు.
లాక్షణిక గ్రంథాలు
ఎన్నో సాక్ష్యంగా ఉన్నాయి
కవిలో విమర్శకుడు –
విమర్శకుడులో
కవి దాగిఉన్నవారు
చాలా తక్కువమంది ఉంటారు.
Intelligent and intellectual లాగా…
ఇలాంటి లోతైన,
బరువైన,లలితమైన వ్యాసాలు ఎన్నెన్నో రావాలి!
మన మెదడుకు
అవే ఔషధాలు,
మన హృదయాలకు
అవే గవాక్షాలు!
కవిత్వ ప్రయోజనం పట్ల ఎరుక కలిగి ఉండడమే సారాంశం!
కవి కృష్ణుడు,
విమర్శకుడు కృష్ణారావుగారికి
కృతజ్ఞతలు,అభినందనలు
సంప్రదాయం నుంచి
అత్యాధునికం వరకూ
అన్నింటినీ స్పృశించిన,
స్పృశించే
నిత్య సత్య సాహిత్యజీవి
మిత్రులు
అప్పరసు కృష్ణారావు.
ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధిగా
ప్రతి బుధవారం నాడు
వార్తావ్యాఖ్యల సంగమంగా
సాగే ఆ అక్షరపరంపరలు
జ్ఞానభాండాగారాలు
-మాశర్మ
❤️🙏🌹
కాదేది కవితకనర్హం అన్నట్లు, ఉన్నది ఉన్నట్లుగా కాకుండా, అన్ని వస్తుసంపదలకు భావనా సంచయనం కల్పించటం కవి చేసే పని. అందరికీ చందమామ కన్పిస్తాడు మామూలుగా. కాని కవికి భావరసోన్వేషణలో అందమైన ఆడపిల్ల ముఖంలో కనిపిస్తాడు. చూపు అందరికీ ఒకటే అయినా, కవి చూసే విధానం వేరు. అలంకృతమైన భావనలు లేని కవిత్వం ఒక ఎండమావి. నిష్కేదబ్రహ్మపదావలంబనరతిన్ క్రీడించు యోగీంద్రునిగా కరిని పట్టిన మకరాన్ని చూడటం కవికి మాత్రమే సాధ్యం. అది బమ్మెరవారి భావన. ఝరీపటల మృదంగ నిస్వన స్ఫుటనటనానుకూలతా భావనలు పెద్దనగారి రసత్కృతులు. ఇలా పూర్వకవులపూర్వ భావనలు, అర్వాచీన కవులాధునిక భావనలతో కలగలపి రచించిన వ్యాసం కావ్య సదృశి.
ఈ క్షణానికి దాహం తీరింది. నమస్సులు
గురువులు కృష్ణరావు గారు కవిత్వం గురించి మంచి ఉదాహరణులతో బాగా చెప్పారు